Thursday, June 28, 2018

తెలుగు వ్యాసం


తెలుగు వ్యాసంసాహితీమిత్రులారా!
"తెలుగు వ్యాసం" తన స్వీయచరిత్రను చెబుతున్నట్లు వ్రాసిన రచన
ఇది తిరుమల రామచంద్రగారి రచన ఆస్వాదించండి -

నన్ను తెలుగులో వ్యాసం అంటారు, నా పొరుగున వున్న కన్నడం వారు నన్ను ప్రబంధ, నిబంధ అని అంటారు. ఇటు పక్క పొరుగువారయిన మహారాష్ట్రులు, హిందీవారు నిబంధ, లేఖ అని అంటుంటారు. ఇప్పుడు సంస్కృతం వారు కూడ లేఖ అని అంటున్నారు. ప్రబంధ, నిబంధ అంటే నాకు కంపరం పుడుతుంది; నన్ను ఎవరో ఏదో చట్రంలో బిగించినట్టు అనిపిస్తుంది. పాపం! వాళ్ళ అభిప్రాయమేమో పరిమితమైన దేశకాలాలలో నా స్వరూపం తెలుపడమే. కాని, నాకు మాత్రం ఒక బంధంలాగ అనిపిస్తుంది. ఇక లేఖ అనే మాట వ్రాతకు ఉపయోగపడేదంతా లేఖే కదా! నా ప్రత్యేకత ఏముంది? కనుక వ్యాసం అనేదే నాకు చాల నచ్చింది.

మీరు ఏ సంస్కృత నిఘంటువు నన్నా తిరగవేయండి.వ్యాస అనే పదానికి అర్థాలు ఇలా ఉంటాయి పరాశరపుత్రుడు, వేదాలను వింగడించిన వాడు అయిన వ్యాసభగవత్పాదుడు, విస్తృతి, ఒక విధమైన కొలత, వృత్తక్షేత్ర మధ్యరేఖ, పౌరాణికుడు, వింగడించడం, విడదీయడం, భాగించి కలపడం, వివరించడం. కాని వీటిలో నన్ను తెలిపే అర్థం ఉండదు. కారణమేమిటంటారా? కొంచెం ఓపికతో వినాలి మరి!

నన్ను నేను విశ్లేషించుకుంటూ పోతే వ్య + ఆస అనేది నా పుట్టిన ఇల్లు. తెలుగు వారు నా జన్మ పదాలకు గల అర్థాలను పరిశీలించారు, వ్యాసులవారు చేసిన వేదవిభజన వర్గీకరణాది కార్యాలనూ పరిశీలించారు. నా ప్రధానకార్యం పరిమిత సమయంలో, పరిమిత స్థలంలో ఒక విషయాన్ని వివరించి విశ్లేషించడం గనుక ‘వ్యాసం’ అని నామకరణం చేశారు. నాకు చాలా నచ్చింది యీ పేరు. పొంకంగా, బింకంగా ఉందికదూ!

నిజానికి నా పుట్టుక మానవుడు మాటాడనేర్చినప్పుటి నుంచే. ఆవేశోద్వేగాలను, ఆశ్చర్యానందాలను వ్యక్తీకరించడానికి మానవుడు తనకు తెలియకుండానే ఛందస్సును వినియోగించాడు గాని, కన్నదాన్ని విన్నదాన్ని ఆనుపూర్విగా వివరించడానికి, సామాన్యాభిప్రాయ కథనానికి వచనాన్నే ఆశ్రయించాడు. ఆ విధంగా నేను యజుర్వేదంలోనే ఆవిర్భవించాను.యజుర్వేదం తొలిమంత్రం నేనే.

ఈ వేదాలకు వ్యాఖ్యానరూపాలైన బ్రాహ్మణాలు, చింతనపరాయణాలయిన ఆరణ్యకాలు, ఉపనిషత్తులు నన్ను మన్నన చేశాయి. తైత్తిరీయం వంటి ఉపనిషత్తు లయితే నన్ను సంపుటాలు సంపుటాలుగా గుది గుచ్చాయని నా భావన. సంపుటాలంటే నా ఉద్దేశం సంకలనాలు. తైత్తిరీయం వివిధ విషయాలున్న వ్యాసాల సంకలనమనే నా నమ్మకం.

జ్ఞానం విస్తృతమవుతున్న కొద్దీ నా ప్రయోజనం కూడ ఎక్కువయింది. పండితులు వివిధ విషయాలను చర్చించి కొన్ని నిర్ణయాలను చేసేవారు. ఆ చర్చలను శాస్త్రార్థాలు, వాక్యార్థాలు అనే వారు. ఆ నిర్ణయాలను వ్రాసిన వాటిని క్రోపత్రాలు అని వ్యవహరించేవారు. క్రోడమంటే ఒడి, మధ్యప్రదేశం అని ఒక అర్థం. ఒక శాస్త్రవిషయంలో విడిపోయినట్టు గ్రంథకర్త గాని, ఇతరులుగాని భావించే అంశాన్ని ఆనుపూర్వితో వ్రాసి అక్కడ చేర్చేవారు. దీనికి క్రోడపత్రమని పేరు. ఈ క్రోడపత్రాలు మూలవిషయాల కంటె మిన్నగా వుంటూ, మూలవిషయాలను ఉద్దీప్తంచేస్తాయి. వీటిలోని విషయ నివేదన ప్రతిపాదన, వివరణ, ప్రతిపక్షమతఖండన, స్వమతస్థాపన,ఉపసంహారం ఈ పద్ధతిలో నా రూపం రాటు తేలింది.

నేను ఎన్నో శతాబ్దాలపాటు తత్వచర్చలను, శాస్త్రవిషయాలను అంటిపెట్టుకునే వున్నాను. కాలప్రవాహంలో ఇతర సంస్కృతుల సంబంధం కలగడంతో నాలోను మార్పు తప్పదు కదా! పాశ్చాత్యులతో సంబంధం కలగడంతో వారి essay అనే సాహిత్యప్రక్రియతో నాకు సంపర్కం కలిగింది. పాశ్చాత్యులకు కూడ ఇది కొత్తేనట. మొదట ఇది పరాసుల సొమ్ము. తర్వాత ఆంగ్లేయులదయిందట. Essay అంటే ప్రయత్నించు, పరీక్షించు, చేసి చూడు అని అర్థాలు. క్రోడపత్రాలలో ఉన్న నన్ను పోలిన ఈ రచన వారికి కొత్త గనుక ఆ పేరే దానికి పెట్టారు. అది మన దేశానికి వచ్చింది. అది వివిధ విషయాలను తెలుపుతూ నన్ను ఆకర్షించింది. నేను దానిలోని మంచిని గ్రహించాను. కేవలం తత్వశాస్త్రవిషయాలలోనే సంచరిస్తున్న నేను essay లాగ భౌతిక విషయారామంలో విహరించసాగాను.

నన్ను ఆ విధంగా కొత్త ఆరామాలకు తోడ్కొనిపోయిన మొదటి విద్వాంసుడు సామినేని ముద్దుకృష్ణమనాయనింవారు. ఈయన నాకు ప్రమేయం అని నామకరణం చేశారు. తెలుసుకోవలసిన విషయాల సంగ్రహం అని దీని అర్థం. ఆయన నన్ను లౌకికంగా చాలా చోట్లకు తిప్పారు.

కొంతకాలం గడిచింది. మహావిద్వాంసులు, భారతదేశంలో తొలితరం మహామహోపాధ్యాయులు, శబ్దార్థ సర్వస్వమనే సంస్కృతవిజ్ఞాన సర్వస్వ సంకలనానికి తొలిసారిగా ఉద్యమించిన వారు, పత్రికా సంపాదకులు అయిన పరవస్తు వెంకట రంగనాథాచార్యులయ్యవార్లంగారు నన్ను ఆదరించి సంగ్రహం అనే పేరు పెట్టి ముచ్చటగా పిలిచారు. అంతగా ముచ్చట పడుతున్నప్పుడు కాదనడం ఎందుకని ఊరుకున్నాను.

ఆ కాలంలోనే వీరేశలింగంగారనే గొప్ప సంఘ సంస్కర్త, వీరాగ్రేసరుడు అయిన విద్వాంసుడు ఉన్నాడు. ఆయన తన భావ ప్రచారం కోసం నన్ను ఎడాపెడా వాడాడు. సంఘం, సాహిత్యం, న్యాయస్థానం, బ్రాహ్మమందిరం ఒక్కటేమిటీ పలుచోట్ల నన్ను ఆయన తిప్పి కొత్త ప్రపంచాన్నే చూపాడు. ఆయన నన్ను ఉపన్యాసమనీ, వ్యాసమనీ పిలవడం ప్రారంభించారు. చివరకు నాకు “వ్యాస”మనే పేరే రూఢమైంది.

నేను అప్పటినుండి చాలా రంగాలకు పాకాను. ఒక మహాసామ్రాజ్యాన్నే శాసించడానికి ప్రయత్నించానన్నా అతిశయోక్తి కాదు. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభానికి నా సామ్రాజ్యం సువిశాలమయింది. పత్రికలు నన్ను బాగా ఆదరించాయి. ప్రజలకు ఏ సంగతి వివరించాలన్నా నా ఆవశ్యకత వారికి తెలియవచ్చింది. కాని, కథలకు, కవితలకు, నవలలకు ఇవన్నీ నాతోపాటు వ్యాప్తిలోనికి వచ్చినట్టివే ఉన్నంత జనాదరం నాకు ఉండేది కాదు. నిజానికి నా అవసరమే ఎక్కువ. ఏ సంగతి వివరించాలన్నా నేను తప్పనిసరి. కాని మోజు మాత్రం వాటిపైనే. వాటికే సన్మానాలు, సత్కారాలునూ.

ఇట్లు

తెలుగు వ్యాసం

(వక్కణం తిరుమల రామచంద్ర)

1997

(అప్పాజోస్యులవిష్ణుభొట్ల ఫౌండేషన్‌; USA వారి సౌజన్యంతో

వారి 1998 వార్షిక సంచిక నుంచి సంక్షిప్తం)
-----------------------------------------------------
ఈమాట సౌజన్యంతో

No comments: