Thursday, September 15, 2016

యదూనా మధవా రఘూణామ్


యదూనా మధవా రఘూణామ్


సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం రామపరంగాను కృష్ణంపరంగాను శ్లేషతో చమత్కరించినది.
దీన్ని కోలాచలం పెద్దిభట్టు (మల్లినాథసూరి) చెప్పినది.

య: పూతనామా రణలబ్దవర్ణ:
కాకోదరో యేన వినీతదర్ప:
యస్సత్యభామాసహిత స్స పాయా
న్నాథో యదూనా మధవా రఘూణామ్ 

ఇందులోని పదాల విరుపు -

పూతనా, మారణ, లబ్దవర్ణ:
పూతనామా, రణలబ్ద వర్ణ: - అని రెండు రకాలుగా

కాకోదర:,   కాక + అదర: - అని రెండు రకాలుగా

సత్యభామా, సహిత:
సత్య, భా, మా, సహిత: - అని రెండు రకాలుగా
విడదీసుకోవడంతో రెండురకాల అర్థాలు వస్తాయి.

 ఇక కృష్ణపరమైన అర్థం చూద్దాం-

: - ఎవడు, పూతనా మారణలబ్దవర్ణ: - పూతనను చంపటంచేత
పొందబడిన పేరు కలవాడో, యేన - ఎవని చేత, కాకోదర: - పాము(కాళీయుడు),
వినీత దర్ప: - గర్వము తొలగించబడినదో, య: - ఎవడు,
సత్యభామాసహిత: - సత్యభామతో కూడి ఉంటాడో, స: - ఆ,
యదూనాం నాథ: - యదువంశ ప్రభువైన కృష్ణుడు
పాయాత్ - కాపాడును గాక!

రామ పరమైన అర్థం - 

: - ఎవడు, పూతనామా - పవిత్రమైన నామం
కలవాడో, రణలబ్దవర్ణ- యుద్ధంలో ప్రఖ్యాతి పొందినవాడో,
అదర: - భయంలేని, కాక: - కాకాసురుడు, వినీత దర్ప:
- తొలగించబడిన గర్వం కలవాడు, యేన - ఎవనిచేత(చేయబడ్డాడో),
 య: - ఎవడు , సత్య -సత్యవ్రతముతో, భా - కాంతితో,
మాసహిత: - లక్ష్మితో కూడినవాడో, స: - ఆ, రఘూణాంనాథ: -
రఘువంశ ప్రభువు, పాయాత్ - కాపాడుగాక!

No comments: