Friday, August 27, 2021

భోజమహారాజు - సమస్యా పూరణలు

 భోజమహారాజు - సమస్యా పూరణలు




సాహితీమిత్రులారా!



ధారానగరంలో భోజుడు అంతఃపురంలో నిద్రిస్తున్నాడు.
ఆ సమయంలో ఒక పండితచోరుడు రాజుగారి కోశాగారంలో
ప్రవేశించాడు. అక్కడ వజ్రవైఢూర్యాలను, మరకతగోమేధికాలను,
మాణిక్యాలను ఎన్నిటినో మూటగట్టుకొని పోబోతుండగా
ఇంతలో వానిమనసులో ఒక భావం తళుక్కున మెరిసింది.
అయ్యో పూర్వజన్మలో ఎన్నో తప్పుడు పనులు చేయబట్టి
కదా ఈ జన్మలో చాలమంది వికలాంగులై, కుష్ఠురోగులై,
గ్రుడ్డి, కుంటి, వారుగాను, దరిద్రులుగాను బాధపడుచున్నారు.
నేనుకూడ పూర్వజన్మలో చేసినపాపం వల్లే నేడు దరిద్రుడనైనాను.
ఇంకా ఈ జన్మలో తప్పులు చేసి పాపం మూటకట్టుకో వలసిందేనా
-అని అనుకొంటూ ఆలోచిస్తున్నాడట. ఇంతలో భోజుడు మేల్కొని
తన సుఖసంపదలను, అష్టైశ్వర్యాలను తలంపునకు తెచ్చుకొని
ఈ శ్లోకాన్ని చెప్పాడు-

చేతో మహా యువతయః సుహృదో2నుకూలాః
సద్భాంధవాః ప్రణయగర్భగిరి శ్చ భృత్యాః
గర్భన్తి దంతి నివహా స్తరలా స్తురంగాః

(మనస్సునెంతగానో ఆకర్షించే మత్తకాశినులున్నారు.
అనుకూలురగు మిత్రులు, మంచి బంధువులు,
చెప్పినంతనే పనులు చేస్తూ , చాటూక్తులు పలికే
సేవకులున్నారు. ఏనుగులు, గుఱ్ఱాలు, ఒకపక్క
గర్జిస్తున్నాయి. ఇలా అష్టైశ్వర్యాలతో అన్నిసుఖాలు
అనుభవిస్తున్నా ---)
అని చదివి మిగిలిన నాలుగవపాదం కోసం
చడబడుతున్న సమయంలో
ఆ పండిత చోరుడు ఈ విధంగా పూరించాడు-

సంమీలనే నయనయో ర్న హి కించి దస్తి
(అవి కట్టెదుట కనబడుతున్నా, కన్నులు మూయగానే
ఇవేవీ కంటికి కన్పడవు సుమా)
(అంటే భౌతికములైన సుఖాలు అన్నీ క్షణభంగురాలేకాని
శాశ్వతాలు కావని భావం.)

దీనికి రాజు సంతసించి అతని పూర్వాపరాలు విచారించి
ఆ చోరపండితునికి తగినంత బంగారమిచ్చి సన్మానించి
పంపించాడట.


No comments: