"అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్"
సాహితీమిత్రులారా!
"అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్"- అనే సమస్యను
కొంచెం మార్చి అక్రమ సంబంధంకాకుండా సక్రమ సంబంధం వచ్చేవిధంగా చెప్పమని
అవధానంలో ఒక పృచ్ఛకుడు మిన్నెకంటి గురునాథశర్మగారిని అడిగాడట.
దానికి వారి పద్యం చూడండి.
ఎల్ల సురల్ వినంగ హరి యిట్లనె భూ సుత సీత బొందితిన్
నీళ్ళను మున్గనట్టి ధరణీ సతిఁగౌగిట గ్రుచ్చి యెత్తితిన్
తల్లికి తల్లియౌ సతి నెదన్ ధరియించితిగాన భూమికిన్
అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్
అని పూరించాడు.
(దేవతలందరూ వినగా విష్ణువు ఇలా అన్నాడు -
భూపుత్రిక సీతను పెండ్లాడాను(రామావతారంలో)
భూమిని పెళ్ళాడాను (వరాహావతారంలో)
లక్ష్మిని పెళ్ళాడాను (సముద్ర మథనానంతరం) -
ఇక్కడ విష్ణుపాదంలో గంగ పుట్టింది.
విష్ణువు భార్య భూదేవి.కనుక గంగ భూమికి కూతురువరుస.
గంగ సముద్రుని భార్య. నదులన్నీ సముద్రుని భార్య కదా!
సముద్రంలో పుట్టింది లక్ష్మి కావున లక్ష్మి గంగ కూతురి వరుస.
భూమికి మనుమరాలి వరుస.
కూతురును తల్లీ అని పిలువడం ఉంది.
కనుక ఈ వరుసల ప్రకారం భూమికి, భూమిసుతకు, గంగాసుతలక్ష్మికి -
మూడు తరాల వారికి విష్ణవు భర్త కనుక
భూమికి అల్లుడు, మగడు, మనుమడు వరుసలు సరిపోయాయి.
ఇవన్నీ ధర్మబద్ధమైన బంధాలే.)
No comments:
Post a Comment