అనులోమ ప్రతిలోమ పద్యం
సాహితీమిత్రులారా!
ఒక పద్యం మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు చదివితే ఒక అర్థం వస్తుంది.
ఆ పద్యాన్నే చివర నుండి మొదటికి చదివిన మరో పద్యం వచ్చి మరోఅర్థం వస్తుంది.
దీన్నే అనులోమ ప్రతిలోమ పద్యం అంటారు.
నసమాశనవాగారం నమేమత్వామజేయతం
తరసారమ్యనవ్యాభమరామాదయమా విభో
(అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం - 34)
(ఆశలు కోరికలు లేని నిష్కాముల యొక్క యజ్ఞాలు
నిలయంగా కలవాడవు, జయింప వీలుకానివాడవు,
నిత్యనూతన తేజస్సుకలవాడవు, శీఘ్రంగా ఫలాలను
ఇచ్చేదయగలవాడవు. అయిన
లక్ష్మీ వల్లభా! రంగనాధా! నమస్కారం)
ఇదే శ్లోకాన్ని చివరినుండి మొదటికి రాయగా
భోవిమాయదమారామ భర్యా నమ్య రసారత
తం యజేమత్వామమేన రంగావాన శమాసన
(మాయా రహితులైన ఇంద్రియ మనోనిగ్రహాల
చేత క్రీడించు పుణ్యాత్ముల చేత నమస్కరింప
దగిన శ్రీరంగపుణ్యభూమి యందు
ఆసక్తి కలవాడా! ఆనందంగా ఉండేవాడా!
శ్రీరంగనిలయుడవాన నిన్ను
సన్నిధిలో సేవిస్తాను.)
విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరములోని
గతిచిత్ర పద్యాన్ని ఇక్కడ చూద్దాం.
అనులోమ పద్యం -
(మొదట నుండి చివరకు చదివేది)
సారాకారా సమరస
సారసగ సరాస యనఘ జయయవ్యసనా
మారాకారా కలియమ
భారవ జసరా సమహిమ భాధవ భసరా
సారాకారా -
సార - ఉత్తమమైన, అకారా - అ అను వర్ణము(పేరు)గలవాడా,
సమ-రస - లక్ష్మితో కూడిన ప్రేమరసము కలవాడా,
సారసగ - శంఖమును పొందినవాడా,
సరాస - రాసక్రీడతో కూడినవాడా,
అనఘ - నిర్మలమైనవాడా,
అవ్యసనా, మారాకారా,
కలియమ - యుద్ధములలో యముని వంటివాడా,
భా-రవ-జ-సరా - శాంతితోను ధ్వనితోను జయముతోను
కూడిన బాణములుగలవాడా,
సమహిమ - భా-ధవ - భూదేవియొక్క వల్లభా,
భ-సరా - నక్షత్రములయందును గతిగలవాడా !
అనగా వాటియందును ఉండువాడా!
విలోమపద్యం -
(పై పద్యన్ని క్రింది నుండి చదువగా వచ్చే పద్యం)-
రాసభవధ భామహిమస
రాసజవరభామ యలికరాకారామా
నా సవ్యయ యజ ఘన యస
రాసగ సరసా సరమ సరాకారాసా
(రాసభ - గార్ధభాసురుని యొక్క, వధ - సంహారమునందలి
భా - దీప్తికిని, మహీమ - గొప్పదనమునకు,
స - స్యందన పథమువంటివాడా
అనగా స్యందనము దాని పథమునందు ఎట్లునడచునో
అట్లే గర్ధభాసురవధ జనిత తేజోమహిమలు వీరియందు నడచినవి అని,
రాస - జ వరరామ - రాసక్రీడయందు త్వరతో కూడిన ఉత్తమస్త్రీలుగలవాడా,
అలిక-రాకారామా - ముఖమునందునిండుపున్నమ
భార్యగా గలవాడైన చంద్రుడవే అయినవాడా,
నా సవ్యయ - అధికమైన శుభావహవిధులతో కూడినవాడవు కానివాడా)
1 comment:
wow..
Post a Comment