Sunday, December 30, 2018

సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు


సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు




సాహితీమిత్రులారా!

మన దేశపు శాస్త్రీయ సంగీత సంప్రదాయం చాలా పురాతనమైనది. ఎంత పాతదో సరిగ్గా చెప్పలేం కూడా. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ని బట్టి మారనిదే క్లాసికల్‌ కళ. పాతకాలపు సంగీతం ఎలా ఉంటుందో వినాలని మనలో కొందరికి ఉంటుంది కాని ఇరవయ్యో శతాబ్దం మొదలయిన తరవాత గాని గ్రామొఫోన్‌ రికార్‌డ్లు తయారు కాలేదు. అంతకు మునుపటి సంగీతం గురించి చదువుకోవలసిందే. శాస్త్రీయసంగీతాన్ని అభిమానించడం తెలుగు “ఫాషన్‌” కాదు. అందుచేత త్యాగరాజు తెలుగువాడేనని చెప్పుకోవడం మినహా మన తాతలు తాగిన నేతుల వాసన మనకు తెలియదు. 1906 ప్రాంతాల మద్రాసులో జరిగిన ఒక కచేరీ గురించి యాభై, అరవై ఏళ్ళ కిందట శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారొక వ్యాసం రాశారు. దానివల్ల మనకు అప్పటి సంప్రదాయం గురించి కొంత తెలుస్తుంది. కొందరికి పాతచింతకాయ పచ్చడి ఇష్టం. అయితే ఈ రోజుల్లో ఏడాది కిందటి సినిమా పాటలు విని పాతబడిపోయాయిలే అనుకునేవాళ్ళూ ఉన్నారు. సంగీతరావుగారి వంటి అనుభవజ్ఞులతో మాట్లాడినా, వారి జ్ఞాపకాల గురించి చదివినా తెలుగువారి సంగీతసాంప్రదాయం గురించి మనకు కొంత తెలుస్తుంది. కొందరు ప్రముఖ రచయితలు ఇటువంటి పాత తరం కళాకారుల గురించి వ్యాసాలు రాశారు కాని అందులో వివరాలకన్నా రచనాశైలీ, కవిత్వధోరణీ ప్రముఖంగా అనిపించింది. మనలో కొందరు సంగీతం పాడేవారూ, నేర్చుకుంటున్నవారూ, ఆసక్తితో వినేవారూ మరికొన్ని విశేషాలు తెలుసుకోగోరే అవకాశం ఉంది. ఆ భోగట్టా పోగుచెయ్యడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.

1920లో జన్మించిన సంగీతరావుగారి తండ్రి పట్రాయని సీతారామశాస్త్రిగారూ, తాతగారైన పట్రాయని నరసింహశాస్త్రిగారూ గాత్రసంగీత విద్వాంసులే. ఉత్తరాంధ్రలోని సాలూరు వాస్తవ్యులైన నరసింహశాస్త్రిగారి జననం 1872లో జరిగింది. ఆయనకు గురువు మధురాపంతుల పేరయ్యశాస్త్రిగారు. తంజావూరులో సాధన చేసిన పేరయ్యశాస్త్రిగారి కంఠం తేజోమయమైనదనీ, ఆయన రాగం, తానం, పల్లవి పాడితే ధీరోదాత్తనాయకుని వీరత్వాన్ని స్ఫురింపజేసేదనీ సంగీతరావుగారి చిన్నతనంలో పెద్దవాళ్ళు చెప్పుకునేవారు. పేరయ్యశాస్త్రిగారికి చాలా ఆత్మగౌరవం ఉండేదట. తన కచేరీలో ఎవరో ప్రభుత్వోద్యోగి ముందు కూర్చుని బాతాఖానీ వేస్తూంటే సహించలేక పాడడం ఆపేశారట. ఆ రోజుల్లోనూ కొందరు “పెద్దవాళ్ళ” బుద్ధులు ఇప్పటిలాగే ఉండేవని ఈ సంఘటన వల్ల తెలుస్తోంది. పేరయ్యశాస్త్రిగారి శిష్యులు పగటిపూట వారాలు చేసుకుని రాత్రిళ్ళు గురువుగారింటో భోజనం చేసేవారట. ఇవన్నీ పంతొమ్మిదో శతాబ్దం చివరిరోజుల సంగతులు.

తరవాతి కాలంలో సంగీత కచేరీలు గాయకుడూ, వయొలిన్‌, మృదంగం, ఘటం, వీలున్నప్పుడు కంజీరా వగైరాల మధ్య (సంగీతరావుగారు అన్నట్టుగా) బల పరాక్రమ ప్రదర్శనలుగా అవతారాలెత్తాయి. కల్చర్‌ తక్కువా ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ఎక్కువా అనుకోవచ్చు. ప్రతి కచేరీలోనూ పది, పదిహేను ఐటమ్‌లు పాడడం అనే పద్ధతి 1920 ప్రాంతంలో అరియక్కుడి రామానుజ అయ్యంగార్‌ మొదలుపెట్టాడని అంటారు. అప్పటికి జమీందార్లూ, రాజాలూ “కలాపోసన” చేసే యుగం సిటీల్లోనైనా ముగిసింది. మద్రాసులో మధ్యతరగతి తమిళ బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కువగా నివసించే మైలాపూరు, తిరువళ్ళిక్కేణి (ట్రిప్లికేన్‌) మొదలైన ప్రాంతాల్లో సంగీత సమాజాలు ఎక్కువగా ఉండేవి. తరుచుగా కచేరీలకు హాజరయేవారికి ఫలానా గాయకుడు పాడిన ఫలానా కీర్తన ఇష్టం. అతని కచేరీ జరిగినప్పుడల్లా అవే పాడమని చీటీలు పంపేవారట. గంటసేపు ఒకే రాగం “పీకడం” నచ్చనివారిని మెప్పించడానికి అరియక్కుడి అటువంటి “ఫర్మాయిష్‌”లకు అంగీకరించేవారట. ప్రతిసారీ ఆ పాటలే పాడతాడన్న నమ్మకంతో జనం వచ్చేవారట. ఈ విధంగా గాయకుడికి “మార్కెట్‌” పెరగడం గమనించిన ఇతరులు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. హిందూస్తానీ సంగీతం మాత్రం ఫ్యూడల్‌ రాజదర్బారుల లక్షణాలని కోల్పోకుండా మనోధర్మాన్ని అనుసరించే పద్ధతిలోనే ముందుకు సాగింది.

పాత కర్ణాటక సాంప్రదాయంలో రాగం, తానం, పల్లవి ప్రధానాంశాలుగా ఉండేవని సంగీతరావుగా రంటారు. ఆలాపన నాలుగంచెలుగా సాగేది. పోటీతత్వం ఉండేదికాదు. పక్క వాద్యాలుగా వీణ, వేణువు ఉపయోగించేవారు. (డా.బాలమురళీకృష్ణ చిన్ననాటి ఒక ఫొటోలో కుర్రవయసులో ఉన్న బాలమురళి పక్కన కంభంపాటి అక్కాజీరావుగారు వీణను నిలువుగా పట్టుకుని కూర్చుని ఉన్నారు). కచేరీలలో సంగీత త్రిమూర్తులుగా పేరుపొందిన త్యాగరాజు, దీక్షితర్‌, శ్యామశాస్త్రి రచించిన కీర్తనలను పాడడం ఆనవాయితీ అయింది. అంతకు ముందు రోజుల్లో పేరయ్య శాస్త్రిగారి శిష్యులు ఆ నాటికి ప్రచారంలో ఉన్న ప్రాథమిక సంగీత రచనలన్నిటినీ కంఠస్థం చేసుకుని, రాగాలాపన, స్వరకల్పనలలో ప్రావీణ్యం సంపాదించేవారనీ, వివిధ రీతులలో పల్లవి పాడడం నేర్చేవారనీ సంగీతరావుగా రంటారు. తరవాతి కాలంలో త్యాగరాజ కీర్తనలు ప్రచారంలోకి వచ్చాయి.

తన పితామహుడి గురువైన పేరయ్యశాస్త్రిగారితో బాటుగా సంగీతం నేర్చుకున్న ద్వివేదుల లక్ష్మణశాస్త్రి, కన్నడశాస్త్రి అనే సోదరుల ద్వయం త్యాగరాజ కీర్తనలు నేర్చుకోవడానికని సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రిగారి వద్ద కొన్నాళ్ళు శిష్యరికం చేశారని సంగీతరావుగా రన్నారు. ఇది కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జరిగిందట. దక్షిణామూర్తి శాస్త్రిగారు తంజావూరు వెళ్ళి, త్యాగరాజుకు స్వయానా శిష్యుడైన మానాంబుచావడి వెంకటసుబ్బయ్య వద్ద సంగీతం నేర్చుకున్నారు. దక్షిణామూర్తి శాస్త్రిగారికి అంధుడైన శరభశాస్త్రి అనే వేణు విద్వాంసుడు సహాధ్యాయి. వీరిద్దరూ కలిసి సాధన చెయ్యడానికని అప్పటికే వృద్ధుడైన వెంకటసుబ్బయ్యగారు త్యాగరాజ కీర్తనల గ్రంథాన్ని దక్షిణామూర్తి శాస్త్రిగారికి ఇచ్చారట. తరవాత అది ద్వివేదుల సోదరులకు అందింది. ఆ విధంగా దక్షిణామూర్తి శాస్త్రిగారి ద్వారా తొలిసారిగా తెలుగువారు త్యాగరాజ కీర్తనలు నేర్చుకోగలిగారు. పారుపల్లి రామకృష్ణయ్యగారికి సహాధ్యాయులైన ఈ ద్వివేదుల సోదరుల్లో లక్ష్మణశాస్త్రిగారు క్షీరసాగర శయనా, చక్కని రాజమార్గము, నగుమోము మొదలైన త్యాగరాజ కీర్తనలు మొదటగా కచేరీల్లో అద్భుతంగా పాడారట. కాని, ఆయన ఎక్కువ కాలం జీవించలేదనీ, ఆయన సోదరుడు కన్నడశాస్త్రిగారి కచేరీ మాత్రం చిన్నతనంలో తాను విన్నాననీ, కాంభోజి రాగంలో ఒక పద్యం చాలా చక్కగా పాడినట్టు గుర్తుందనీ సంగీతరావుగా రన్నారు.

ఆ రోజుల్లో ఏదైనాసరే గురుముఖతః నేర్చుకోవాలనే శ్రద్ధ సంగీత విద్యార్థులకు ఉండేది. తాతగారైన పట్రాయని నరసింహశాస్త్రిగారి గురించి సంగీతరావుగా రొక విషయం చెపుతారు. కీర్తనల కోసమని శాస్త్రిగారు మద్రాసు వెళ్ళారట. అక్కడి ఊరేగింపుల్లో సన్నాయి వాయిస్తున్నప్పుడు కీర్తన, డోలు “తని” ఆవర్తనం పూర్తయితే కాని ఊరేగింపు ముందుకు కదలదు. ఒక ఊరేగింపులో నంజుండయ్య అనే నాదస్వర విద్వాంసుడు భైరవి రాగంలో వాయించిన అద్భుతమైన పల్లవి వినగానే శాస్త్రిగారు ఊరేగింపు పూర్తయేదాకా ఆగి, ఆ విద్వాంసుడికి అక్కడే సాష్టాంగపడి అతని దగ్గర ఆ పల్లవి నేర్చుకున్నారట. తాను కప్పుకుని ఉన్న పండిత శాలువాను గురుదక్షిణగా ఇచ్చేశారట. తాతగారి వెంట చిన్నతనంలో హాజరయిన భజనలూ, సంగీత కార్యక్రమాల్లో తులసీ దళములచే అd ¶మాయామాళవగౌళ కీర్తన తరుచుగా వినబడేదనీ, అప్పటికే సరళీస్వరాలు నేర్చుకున్న తనకు అందులో స్వరకల్పన చెయ్యబుద్ధయేదనీ సంగీతరావుగారికి జ్ఞాపకం. ఆ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకు సంగీతం నేర్పేవారు కాదు. సంగీతరావుగారి బంధువర్గంలోనూ అంతే.

వాగ్గేయకారుడైన శ్యామశాస్త్రిని పోటీలో ఎదిరించిన కేశవదాసు అనే విద్వాంసుడు వాసావారి వంశస్థుడేననీ, బొబ్బిలి సంస్థానంలో ఉండేవాడనీ సంగీతరావుగారి అభిప్రాయం. వాసావారు ఎన్నో తరాలుగా సంగీతంలో పేరుపొందినవారు. బిలహరి, కల్యాణి, లలిత, నవరోజు మొదలైన రాగాల్లో వారి స్వరపల్లవులు ప్రసిద్ధమైనవట. నవరోజు రాగంలో పెద్ద కీర్తనలు తక్కువ గనక ఒక రేడియో ప్రసంగంలో ప్రొఫెసర్‌ బులుసు సాంబమూర్తిగారు నవరోజు రాగపరిచయం చెయ్యగా ద్వారం వెంకటస్వామినాయుడుగారు అందులో స్వరపల్లవి వాయించారట. వీటి రచయిత వాసా అప్పయ్య గారట. ఈయనకి సాంబయ్య, కృష్ణమూర్తి అని ఇద్దరు కొడుకులు వీణ విద్వాంసులు. సాంబయ్యగారికి సంతానం లేక తమ్ముడి కొడుకు వెంకటరావును దత్తత తీసుకున్నాడు. ఆదిభట్ల నారాయణదాసుగారు కొంతకాలం ఈ వాసా సాంబయ్యగారికి వీణలో శిష్యుడు. వాసా వెంకటరావుగారు తరవాతి కాలంలో విజయనగరం సంగీత కళాశాలలో వీణ టీచరుగా పనిచేశాడు. ఆయన కొడుకే ప్రసిద్ధ వీణ విద్వాంసుడైన వాసా కృష్ణమూర్తి. ఇదొక తెలుగు సంగీత కుటుంబం. బొబ్బిలి వీణలు గొల్లపల్లిలో తయారయేవట. సర్వసిద్ధి అప్పలస్వామి వీణలకు మంచి పేరుండేది. ధర సుమారు 30 రూపాయలు.

ఆ రోజుల్లో బొబ్బిలిలో అల్లంరాజుల బాలం గారని ఒక మంచి హార్మోనిస్టు ఉండేవారట. పదేళ్ళ వయసులో సంగీతరావుకు సంగీతం నేర్పిన గురువు ఆకొండి నారాయణశాస్త్రిగారు. ఈయన వీణను నిలువుగా పెట్టి వాయించేవాడట. ఈయన హార్మోనియం కూడా వాయిస్తూ బాలం గారితో పోటీపడుతూ ఉండేవాడట. హార్మోనియం మీద తిల్లానా నోటితో అక్షరాలు పలికినట్టుగా వాయించేవాడట. బొబ్బిలి గర్‌ల్స్‌ స్కూలులో సంగీతం మేస్టరుగా పనిచేసిన నారాయణశాస్త్రిగారు అదేదో సంగీతకళాశాల అన్న స్థాయిలో పది ఫిడేళ్ళూ, పది వీణలూ, హార్మోనియం, సరంజామాతో నిర్వహించేవాడట. బొబ్బిలి రాజా, రాణీ “పూజా మహల్‌”లో అర్చన చేసిన తరవాత శాస్త్రిగారి వీణ కచేరీ జరిగేదట. అప్పుడప్పుడూ ఇలాంటి సమావేశాల్లో కుర్రవాడైన సంగీతరావుచేత గాత్రం పాడించి శాస్త్రిగారు స్వయంగా వీణ పక్కవాద్యం వాయించేవాడట. ఆయన రచించిన ఒక నవరాగమాలికను చాలా ఏళ్ళ తరవాత మద్రాసు మ్యూజిక్‌ అకాడమీవారి పండిత సదస్సు డిమాన్‌ స్టేషన్‌లో సంగీతరావు పాడి వినిపించారు. కాలగర్భంలో కలిసిపోతున్న కొన్ని సంగీత రచనలూ, పద్ధతుల గురించి మనకు నామమాత్రంగానైనా తెలియాలంటే ఇటువంటి అవకాశాలు సంగీతరావు వంటి గారి వంటివారికి తరుచుగా కలిగించాలి. ఇటీవల సుజనరంజని వెబ్ పత్రికలో డా. వింజమూరిఅనసూయాదేవిగారు తన చిన్నతనంలో తూమరాడసంగమేశ్వరశాస్త్రిగారి వీణ కచేరీకీ, ఆదిభట్లనారాయణదాసుగారి హరికథాకూ హాజరయిన సంగతులు రాశారు. ఇటువంటి అనుభవాల గురించి ఈ తరంవారుపరోక్షంగానైనా తెలుసుకోవడం చాలా అవసరం.
---------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

No comments: