Friday, December 7, 2018

స్వప్నవాసవదత్తం -2


స్వప్నవాసవదత్తం -2
సాహితీమిత్రులారా!

మొదటి అంకం
సూత్రధారుడు ప్రవేశిస్తాడు.

సూత్రధారుడు
ఉదయనవేందు సవర్ణౌ వాసవదత్తా బలౌ బలస్య త్వాం
పద్మావతీర్ణ పూర్ణౌ వసంతకమ్రౌ భుజౌ పాతాం

(ఉదయించుచున్న చంద్రునిలా కాంతిగల, మద్యముచే నీరసపడ్డ, లక్ష్మీదేవి అవతారం వల్ల పూర్తయిన, మన్మధుడిలా మనోఙ్ఞమైన , బలరాముని రెండు చేతులూ నిన్ను రక్షించుగాక!)

పెద్దలందరికీ మనవి. (ఆశ్చర్యంతో) అరే! నేను ప్రేమగా చెపుతున్న మాటలు కఠోరంగా వినిపిస్తున్నాయా ఏమిటి అందరూ ఇలా వెళ్ళిపోతున్నారు?
(తెర వెనక నుంచి “తప్పుకోండి! పెద్దలందరూ తప్పుకోండి” అంటూ భటుల కేకలు) ఆఁ! తెలిసింది. మగధరాజు దర్శకుడికి ప్రియమైన చెల్లెలు పద్మావతితో వచ్చిన సేవకులు తపోవనంలో ఉన్న జనాన్ని బయటకు పంపించేస్తున్నారు. (వెళ్ళిపోతాడు).

భటులు   (ప్రవేశించి) తప్పుకోండి! పెద్దలందరూ తప్పుకోండి, తప్పుకోండి! అమ్మా! తప్పుకోండి.

యౌగంధరాయణుడు   ఈ తపోవనాన్ని నమ్ముకుని, ఇక్కడ దొరికే పళ్ళతోనే సంతృప్తిపడి, నారబట్టలు కట్టుకుంటూ నివసిస్తున్న ఈ మర్యాదస్తులైన తాపసుల్ని భయపెడుతూ వీళ్ళెవళ్ళూ? నడమంత్రపుసిరితో, వినయంలేకుండా ఇదేదో సొంత ఊరైనట్టు ప్రవర్తిస్తున్నారే!

వాసవదత్త   వీడెవడు ? అందర్నీ ఇలా పొమ్మంటున్నాడు?

యౌగంధరాయణుడు   ధర్మాన్ని తననుంచి తనే పొమ్మంటున్నాడు.

వాసవదత్త   నాకీమాట అనడం ఇష్టంలేదు గాని.. ఆఖరికి నన్నుకూడా పొమ్మంటున్నాడే.

యౌగంధరాయణుడు   ఇలాంటి పరిస్థితిలో, దేవుడని తెలియకపోతే ఆయన్నైనా అవమానిస్తారు.

వాసవదత్త   ఈ అవమానం కష్టపెట్టినంతగా, ఇన్నాళ్ళూ పడ్డ కష్టాలు కష్టపెట్టలేదు.

యౌగంధరాయణుడు   అందరిచేతా పూజింపబడ్డ నువ్వు, ఈచిన్నవిషయానికి ఇంత బాధపడనక్కర్లేదమ్మా! ఇంతకుముందు నీభటులు గూడా ఇలాంటిపనులు చేసినవాళ్ళే. నీభర్త గెలివగానే నీవైభవం నీకు తిరిగివస్తుంది. సుఖదుఃఖాలనేవి  కాలచక్రంలో ఆకుల్లా క్రిందకీ మీదకీ తిరుగుతూంటాయి.

(కంచుకి ప్రవేశిస్తాడు)

కంచుకి   సంభషకా! ఇలా అందర్నీ పొమ్మనడం తగనిపని. దీనివల్ల మనరాజుకి చెడ్డపేరు రాకూడదు. ఆశ్రమవాసుల్తో అలా కఠినంగా మాట్లాడకూడదు. సున్నితమైన మనసున్న వీళ్ళు పట్నవాసాల్లో అవమానాల పాలవకుండా ఉండడానికే కదా ఈ అరణ్యాల్లో నివసిస్తున్నారు!

భటులు అలాగేనయ్యా! (భటులు వెళ్ళిపోతారు).

యౌగంధరాయణుడు ఆహాఁ! కాస్త ఙ్ఞానమున్నవాడు దొరికాడు. (వాసవదత్తతో) అమ్మాయీ! ఇతన్ని అడిగిచూద్దాం. (కంచుకితో) ఎందుకిలా అందర్నీ పొమ్మంటున్నారు?

కంచుకి ఓ! తపస్వీ!

యౌగంధరాయణుడు (తనలో) తపస్వీ అన్న పిలుపు ఎంత గొప్పది! అయినా ఇతనితో పరిచయం లేకపోవడం వల్ల, ఆపిలుపు నామనసుకి హత్తుకోవడం లేదు.

కంచుకి మామహారాజు దర్శకుని చెల్లెలు పద్మావతీదేవి ఈ ఆశ్రమంలోఉన్న రాజమాతని సేవించి, మగధ రాజధానయిన రాజగృహానికి వెడతారు. ఆమె ఈ ఆశ్రమంలో కొంతసేపు ఉంటుంది. అందుకు ఇదంతా. మీరు మీతపస్సుకి కావలసిన నీళ్ళూ, సమిధలూ, పువ్వులూ, దర్భలూ అడవిలోంచి స్వేచ్ఛగా తీసుకోండి. రాజకుమార్తెకి ధర్మమన్నా, తాపసులన్నా చాలా ఇష్టం. ధర్మాన్ని రక్షించడమన్నది వాళ్ళవంశంలో ఒకవ్రతం.

యౌగంధరాయణుడు అందుకా! (తనలో) పుష్పకభద్రుడి జ్యోతిష్యులు చెప్పిన మగధరాజకుమార్తె ఈ పద్మావతా? రాజుకి పట్టమహిషి అవుతుందన్నారుగదా! ఈ ఆలోచన రాగానే, పద్మావతంటే ఇష్టం కలుగుతోంది. ఇష్టం ఐనా, అయిష్టం ఐనా మనస్సు ఎలా అనుకుంటే అలా వచ్చేదేగా!

వాసవదత్త (తనలో) రాజకుమార్తె గురించి విన్నతర్వాత ఆమె నాచెల్లెలు అన్న భావం కలుగుతోంది.

(పద్మావతి తన చేటి, పరివారంతో ప్రవేశిస్తుంది).

చేటి అమ్మా! ఇలా రండి.

తాపసి పద్మావతీదేవికి స్వాగతం.

వాసవదత్త ఈ పద్మావతీదేవి చాలా ఆకర్షణీయంగా ఉంది.

పద్మావతి నమస్కారం.

తాపసి చిరంజీవ! లోపలికి రామ్మా! ఈ తపోవనాలు అందరికీ సొంతయిళ్ళే.

పద్మావతి (నవ్వుతూ) ఆ విషయంలో నాకేమీ సంశయంలేదు.

వాసవదత్త ఈమె అందమైనదే కాదు. తియ్యగా కూడ మాట్లాడుతుంది…

తాపసి ఈ అందమైన రాజుగారిచెల్లెలు ఇంకా ఏరాజునీ వరించలేదా?

చేటి ఉజ్జయినీరాజు ప్రద్యోతనుడు తనకొడుకుకోసం దూతల్ని పంపుతున్నాడు.

వాసవదత్త అదే అయితే నాకు మరీ ఆత్మీయురాలవుతుంది.

తాపసి రెండు రాజవంశాలూ గొప్పవి. అది నీకు తగినసంబంధం.

పద్మావతి మునులందరూ వేచి చూస్తున్నారు గామోసు. వాళ్ళకేం కావాలో చూడాలి. అందర్నీ రమ్మనండి.

కంచుకి (పద్మావతితో) మీయిష్టం. (మునుల్తో) ఓ! ఆశ్రమవాసులారా! అంతా వినండి. మగధరాజకుమారి పద్మావతీదేవి మీమీద ప్రేమతో, ధర్మరక్షణకోసం మీకేం కావలిస్తే అది ఇవ్వగలరు. ఎవరికి పాత్రలు కావాలి? ఎవరికి బట్టలు కావాలి? ఎవరు చదువు పూర్తిచేసుకుని గురువుకి దక్షిణ ఇవ్వాలనుకుంటున్నారు? ఏమివ్వాలనుకుంటున్నారు? ఏం కావాలో అడగండి.

యౌగంధరాయణుడు (తనలో) ఒక ఉపాయం తోచింది (పైకి) అయ్యా! నాకొకటి కావాలి.

పద్మావతి ఇక్కడకి వచ్చినపని సఫలమైంది. ఏంకావాలో అడుగు.

తాపసి ఇక్కడున్నవాళ్ళందరూ సంతృప్తిగలవాళ్ళే. ఇతనెవడో కొత్తగా వచ్చినట్లున్నాడు.

కంచుకి అయ్యా! ఏంకావాలి తమకు?

యౌగంధరాయణుడు ఈమె నాచెల్లెలు. ఈమెభర్త పొరుగుదేశం వెళ్ళాడు. కొంతకాలం మీ రక్షణలో ఉంచుకోండి. నాకు డబ్బుతో పనిలేదు. భోగాలక్కర్లేదు. ఈ కాషాయబట్టల్ని ఆశ్రయించి బ్రతుకుతున్నా. ధర్మంగా, ధైర్యంగా బ్రతికే నాచెల్లెలి శీలాన్ని రక్షించడానికి సమర్ధురాలు ఒక్క రాజకుమార్తె మాత్రమే.

వాసవదత్త (మనసులో) అయితే ఇక్కడ యౌగంధరాయణుడు నన్ను ఉంచుదామనుకుంటున్నాడన్న మాట. సరే. ఆలోచించకుండా ఏపనీ చెయ్యడుగదా!

కంచుకి అమ్మా! ఇతనడిగేది కష్టమైన పని. ఎలా ఒప్పుకోగలం? మన డబ్బునీ, ప్రాణాన్నీ సులభంగా ఇవ్వవచ్చు. కాని, ఇతరులు మనదగ్గర ఉంచిన సొత్తుని కాపాడ్డం చాలా కష్టం.

పద్మావతి ఎవరికేం కావాలి అని ముందు అడిగి, తీరా అడిగిన తర్వాత ఆలోచిస్తూ కూర్చోవడం ఉత్తమం కాదు. ఇతనేమి అడిగాడో అది చేద్దాం.

తాపసి చిరంజీవ!

యౌగంధరాయణుడు (వాసవదత్తతో) అమ్మాయీ! పద్మావతీదేవి దగ్గరకి వెళ్ళమ్మా.

వాసవదత్త (తనలో) నాకు వేరే గతిలేదు. అదృష్టమూలేదు. వెడతా.

పద్మావతి ఇప్పటినుంచీ ఈమె నాకు ఆత్మీయురాలు.

తాపసి ఈమె రూపం చూస్తూంటే ఏదో రాజకుమార్తెలా ఉంది.

చేటి మీరు బాగా చెప్పారు. ఈమె బాగా సుఖాలననుభవించినదానిలా కనబడుతోంది నాక్కూడా.

యౌగంధరాయణుడు అమ్మయ్యా! సగంపని అయినట్లే. మంత్రుల్తోకలసి ఏవిధంగా అనుకున్నామో అలాగే అయింది. రాజుకి మళ్ళీ రాజ్యం వచ్చాక ఈ వాసవదత్తని అప్పజెప్పేటప్పుడు ఆమె శీలానికి పద్మావతి సాక్ష్యంగా ఉంటుంది. జ్యోతిష్యుల మాటప్రకారం పద్మావతి కూడా వత్సరాజుకి రాణి అవుతుంది.

(ఒక బ్రహ్మచారి ప్రవేశిస్తాడు).

బ్రహ్మచారి ( పైకి చూస్తూ) మధ్యాహ్నం అయింది, అలసటగా ఉంది. ఎక్కడైనా ఆగాలి. (నడచి) ఏదైనా తపోవనం దగ్గర ఆగితేసరి. ఇదిగో! ఇది మనుషులుండేచోటు. కాబట్టే, లేళ్ళు గాబరా లేకుండా తిరుగుతున్నాయి. పువ్వులు, పళ్ళతో ఉన్న ఈ చెట్లకి సంరక్షణ బాగా జరుగుతున్నట్లుంది. కపిల గోవులు దండిగా ఉన్నాయి. దిక్కులు, చెట్లు, పొగ .. ఇన్నీ ఉన్నాయంటే తపోవనమే అయివుంటుంది.

(ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు).

కంచుకి స్వేచ్ఛగా లోపలికి రావచ్చు. ఈ తపోవనంలోకి అందరూ రావచ్చు.

వాసవదత్త హుఁ!

పద్మావతి (తనలో) ఈమెకు పరపురుషుణ్ణి చూడ్డం  ఇష్టంలేదనుకుంటా. ఈమెను నేను జాగ్రత్తగా చూసుకోవాలి.

కంచుకి ముందుగా అతిథి సత్కారాలు తీసుకోండి.

బ్రహ్మచారి (నీళ్ళు తాగి) హమ్మయ్య! కొంత అలసట తీరింది.

యౌగంధరాయణుడు ఎక్కడనుంచి వస్తున్నారు? ఎక్కడికి ప్రయాణం? మీ బసెక్కడ?

బ్రహ్మచారి మగధరాజధాని రాజగృహం నుంచి వస్తున్నా. వేదవిద్యకు పేరుమోసిన వత్సదేశంలోని లావాణకంలో ఉండేవాణ్ణి.

వాసవదత్త (తనలో) లావాణకమా! ఆ పేరు వింటేనే మళ్ళీ దుఃఖం వస్తోంది.

యౌగంధరాయణుడు చదువు పూర్తయిందా?

బ్రహ్మచారి ఇంకా కాలేదు.

యౌగంధరాయణుడు పూర్తికాకుండా ఇక్కడకివస్తే ఏమి ఉపయోగం?

బ్రహ్మచారి లావాణకంలో చాలా దారుణమైన ప్రమాదం జరిగిందికదా!

యౌగంధరాయణుడు ఎలా?

బ్రహ్మచారి అక్కడ ఉదయనుడని ఒక రాజున్నాడు.

యౌగంధరాయణుడు అవును, విన్నాను. అతనికేమయింది?

బ్రహ్మచారి అతనికి అవంతీ రాజకుమార్తె వాసవదత్తంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయనుడు వేటకి వెళ్ళినప్పుడు ఆ గ్రామం కాలిపోయింది. ఆ మంటల్లో వాసవదత్త కూడా కాలిపోయింది.

వాసవదత్త (తనలో) ఇది అబద్ధం. నేను బ్రతికే ఉన్నాను. అంతా నా దురదృష్టం.

యౌగంధరాయణుడు తర్వాత..?

బ్రహ్మచారి    ఆ తర్వాత వాసవదత్తని రక్షించడానికని ఆ మంటల్లో దూకిన అతనిమంత్రి యౌగంధరాయణుడు కూడా కాలిపోయాడు.

యౌగంధరాయణుడు పడిన మాట నిజం; ఆ తర్వాత?

బ్రహ్మచారి   వేట నుంచి తిరిగివచ్చిన ఉదయనుడికి ఆవిషయం తెలిసి, ఆ వియోగంతో దుఃఖం ఆపుకోలేక, ఆ మంటల్లోనే  తనూ దూకుదామనుకున్నాడు. కాని అతని మంత్రులు కష్టపడి అతన్ని ఆపారు.

వాసవదత్త (తనలో)    స్వామికి నాపైన ఉన్న ప్రేమ, దయ నాకు బాగా తెలుసు.

యౌగంధరాయణుడు   ఆ తర్వాత?

బ్రహ్మచారి    ఆ తర్వాత, కాలగా మిగిలిన వాసవదత్త ఆభరణాల్ని కౌగలించుకుని ఏడ్చి మూర్ఛపోయాడు.

వాసవదత్త (తనలో)    అయ్యో! స్వామి యీస్థితిలో ఉండగా, ఈ యౌగంధరాయణుడు ఏవో పన్నాగాలంటూ ప్రయత్నాలు చేస్తున్నాడు ..

చేటి    అయ్యో! ఇదేమిటి? ఈమె ఏడుస్తోంది?

యౌగంధరాయణుడు    జాలితో బేలగా ఏడుస్తున్నట్లుంది మా చెల్లెలు! ఆ తర్వాత ఏమయింది?

బ్రహ్మచారి   మెల్లగా రాజు స్పృహలోకి వచ్చాడు.

పద్మావతి   ఓహో! ప్రాణాలతో ఉన్నాడన్నమాట. మూర్ఛపోయాడనగానే నాకూ మతిపోయినట్లయింది.

బ్రహ్మచారి   నేలమీద దొర్లిదొర్లి ఒళ్ళంతా బూడిద కొట్టుకుపోతూ, ఒక్కసారిగా లేచి “అవంతీ రాజకుమారీ! వాసవదత్తా! నా ప్రియ శిష్యురాలా!” అంటూ ఏదో విపరీతంగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. అతడనుభవించినంతగా బాధ ఎవ్వరూ అనుభవించి ఉండలేదేమో అనిపించింది. అంత ప్రేమున్న భర్త ఉన్న తర్వాత ఆవిడ కాలిపోయినా కాలిపోనట్లేగదా!

యౌగంధరాయణుడు   ఆ రాజుని మామూలు స్థితికి తేవడానికి ఏ మంత్రీ ప్రయత్నించలేదా?

బ్రహ్మచారి   రుమణ్వంతుడనే మంత్రి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. అతను రాజు తినకపోతే తనూ తినడు, అతనితో దుఃఖాన్ని పంచుకుంటాడు. రాజును పగలనక, రాత్రనక సేవిస్తున్నాడు. రాజు తన ప్రాణాల్ని వదిలితే, ఇతనికి గూడా ప్రాణాలు పోయేలా ఉన్నాయి.

వాసవదత్త   ఆహా! స్వామి మంచిచోటే ఉన్నారు.

యౌగంధరాయణుడు (తనలో) రుమణ్వంతుడు చాలా కష్టమైన పని చేస్తున్నాడు. రాజు ఎవరిమీద ఆధార పడితే వాళ్ళు ఎక్కువ భారాన్ని మొయ్యవలసి ఉంటుంది. (పైకి) ఇప్పుడారాజు మామూలు మనిషి అయ్యాడా?

బ్రహ్మచారి   ఇప్పుడు ఆ విషయం గురించి నాకేమీ తెలియదు.”ఇక్కడామెతో కూర్చుని నవ్వాను, ఇక్కడ మాట్లాడాను, ఇక్కడ కలిసి కూర్చున్నాను, ఇక్కడ కోప్పడ్డాను, ఇక్కడ పడుకున్నాను” అంటూ ఏడుస్తున్న ఆరాజుని మంత్రులెలాగో కష్టపడి ఆవూరినించి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళులేని ఆవూరు చంద్రుడు, నక్షత్రాలూలేని ఆకాశంలా అనిపించి ఉండలేక నేనూ వచ్చేసాను.

తాపసి   ఆరాజెంత గుణవంతుడో కదా!

చేటి   చనిపోయిన భార్య మీద అంత ప్రేమున్న ఆరాజును మరొక ఆడది పెళ్ళిచేసుకోగలదా?

పద్మావతి   (తనలో) నామనసులో మాటే అంటోందే ఈమె కూడా!

బ్రహ్మచారి   అమ్మా! ఇక వెళ్ళివస్తాను.

యౌగంధరాయణుడు   పద్మావతీదేవి అనుమతిస్తే నేను కూడా వెళ్ళివస్తాను.

కంచుకి   వెళ్ళడానికి మీఅనుమతి కోరుతున్నాడట.

పద్మావతి   ఆయన వెళ్ళిపోతే వాళ్ళచెల్లెలు బాధపడుతుంది.

యౌగంధరాయణుడు   మంచివారి చేతిలో పడింది. అలాంటి బాధలేవీ కలగవామెకు. వస్తాను.

కంచుకి   మళ్ళీ కలుద్దాం.

యౌగంధరాయణుడు   అలాగే. (వెళ్ళిపోతాడు).

కంచుకి   అమ్మా! ఇక మనం అంతఃపురానికి వెళ్ళే సమయమయింది.

పద్మావతి (తాపసితో) అమ్మా! నమస్కారం.

తాపసి   కోరిన భర్త లభించుగాక!

వాసవదత్త   అమ్మా! నమస్కారం.

తాపసి   త్వరలో నీ భర్తను కలుస్తావమ్మ!

కంచుకి   రండి.. ఇటు ..ఇటువైపు … ఇప్పుడు, పక్షులు వాటి గూళ్ళకి చేరుతున్నాయి. మునులు స్నానాలకై నీటిలోకి దిగుతున్నారు. వెలిగించిన నిప్పు మండుతోంది. పొగలు తపోవనమంతా చుట్టుముడుతున్నాయి. సూర్య కిరణాలు చిన్నవై పోతున్నాయి. సూర్యుడు తన రధాన్ని అస్తాచలానికి తోలుతున్నాడు.

(అందరూ వెళ్ళిపోతారు).
---------------------------------------------------------
రచన: భాస్కర్ కొంపెల్ల, 
ఈమాట సౌజన్యంతో

No comments: