Saturday, December 1, 2018

( ర ) సాలూరు రాజే “స్వర ” రావు


( ర ) సాలూరు రాజే “స్వర ” రావు 




సాహితీమిత్రులారా!

తెలుగు సినీ రంగంలో ఎవరైనా “చైల్డ్‌ప్రొడిజీ”లు ఉన్నారంటే వాళ్ళలో అందరికన్నా ముందుండే వ్యక్తి సాలూరు రాజేశ్వర రావు. తెలుగు సినీ ప్రపంచంలో, నౌషాద్‌వంటి హిందీ సంగీత దర్శకులచే గుర్తించబడి, గౌరవింపబడ్డ ఒకే ఒక సంగీత దర్శకుడు మన ” సాలూరు రాజేశ్వర రావు”.

సాలూరు పుట్టింది 1922 లో ( విజయనగరం జిల్లా ). తండ్రి, సాలూరు సన్యాసి రాజు. ఆయన ఆ రోజుల్లో ఎన్నో మంచి పాటలు రాసిన లిరిసిస్ట్‌ ( ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, బాల సరస్వతి, 1948), ( తుమ్మెదా, ఒకసారి మోమెత్తి చూడమని …. బాల సరస్వతి, 1941) . రాజేశ్వర రావుకి సంగీత పరిచయం తండ్రి ద్వారా కలిగింది. సన్యాసి రాజు గారు ఆ రోజుల్లో మూకీ సినిమాలకు తెరముందు సంగీతం ఇచ్చేవారు. అటువంటి వాతావరణంలో పెరిగాడు రాజేశ్వర రావు. ఆయన తన 6 7 ఏళ్ళ వయస్సులోనే రికార్డింగ్‌ “భగవద్గీత” మీద ఇవ్వటం ఒక గొప్ప విశేషం. తండ్రి వల్ల వచ్చిన సంగీత పరిచయాల వల్లనే కాక, స్వయం ప్రతిభ వల్ల మొదటి సినిమాకి అతనికి పిలుపు వచ్చింది 1935 లో. సినిమా పేరు ” శ్రీ కృష్ణ లీలలు “. ఆ సినిమాలో కృష్ణుడుగా నటించి పాడిన పాటలు, పద్యాలలో, ముఖ్యంగా, కృష్ణకంస సంవాదంలో, 13 సంవత్సరాల సాలూరు చూపించిన అధికారం, వైవిధ్యం, వాటిలో ఉన్న గమకాలు గమనిస్తే, అప్పటికే తిరుగులేని గాయకుడుగా, సంగీత కారుడుగా ఎలా నిలబడ గలిగాడో అర్ధమవుతుంది.

” మీరు, సాలూరు రాజేశ్వర రావు గారూ కలిసి పాడిన యుగళ గీతాలు అంతగా సక్సెస్‌ అవడానికి కారణమేమిటి ?” అన్న ప్రశ్నకు సమాధానంగా, అలనాటి ప్రఖ్యాత గాయని రావు బాల సరస్వతీ దేవి ఇచ్చిన సమాధానం ఇది. “రాజేశ్వర రావు పాడే శ్రుతి గాయనికి అనుకూలంగా ఉంటుంది. మేమిద్దరం పాడేటప్పుడు ఒకే శ్రుతి వినిపిస్తుంది. రాజేశ్వర రావు కూడా నాలాగే పరిణతి ఆశించాడు. ఏదో ఒక శ్రుతికీ, ట్యూన్‌కీ రాజీ పడలేదు. అతని గొప్పదనం మరో ఆర్టిష్టుకి రాదు”.

” చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి ..”, ” హాయిగ పాడుదునా చెలీ ..”, ” ఓహో యాత్రికుడా ..” వంటి ప్రైవేటు రికార్డుల్లో అతని సంగీతంతో కలసిన గొంతును ఇప్పటికీ ఆ తరం వారు మర్చిపోలేరు. ఆ పాటల్లో ఒక రకమైన ప్రశాంతత, మనస్సుని మైమరపింపజేసే గుణాలు కనపడతాయి. రావు బాలసర్వతి, సాలూరు రాజేశ్వర రావుల జంట పాడిన పాటలు 1940 దశాబ్దంలో తెలుగునాట ఒక సెన్సేషన్‌. దాదాపు గ్రామ్‌ఫోన్‌సెట్టు ఉన్న ప్రతి ఇంట్లోనూ వీరి రికార్డులు ఉండేవి. ” తుమ్మెదా ఒకమారు మోమెత్తి చూపమని ..”, ” రావే రావే కోకిలా …” వంటి పాటలు ఆ రోజుల్లో యువతని ఒక ఊపు ఊపేసాయి.

సినిమా బాణీలలో కూడా రాజేశ్వర రావుది ఒక ప్రత్యేకమైన ఒరవడి. అంతో ఇంతో సంగీతం తెలిసిన మిత్రులు ఒక పాట విని ” ఇది రాజేశ్వర రావు కట్టిన పాట ” అని చెప్పగలిగే వారు. ( సాహిత్యంలో పరిచయం ఉన్న వారు, కధ కాని కవితని కాని చదివి ఆ రచయిత ఎవరో చెప్పగలినట్లు !) ఈ వైవిధ్యానికి కారణం పాటల్లో క్వాలిటి తీసుకురావాలన్న తపన. ” అయ్యయ్యో చేతులొ డబ్బులు పోయెనే …” (కులగోత్రాలు) వంటి పాటల్లో హాస్యరసం ఎంత పోషించాడో, సంగీతం క్వాలిటి కూడా అంత ఎక్కువలో ఉంచాడు. ” ఆరాధన ” సినిమా కోసం ఘంటసాల చేత పాడించిన ” నా హృదయంలో నిదురించే చెలీ .. ” పాట అదే బాణీతో మొదట వచ్చింది బెంగాలీలో ! ఈ పాట బాణీ కాపీ కొట్టినా, బెంగాలీ బాణీలో లేని జీవం మన తెలుగు బాణీలో కనపడుతుంది. కాపీ కొట్టినా స్వయం ప్రతిభ చూపటం అంటే ఇదేనేమో ! 1970 లో వచ్చిన ” చిట్టి చెల్లెలు ” సినిమా కోసం స్వరపరచిన ” ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది ..” బాణి ఒక పాశ్చాత్య బాణీకి కాపీ ! కాని, ఈ పాటలోని వైవిధ్యాన్ని గమనిస్తే, దీన్ని పూర్తిగా ఒక తెలుగు పాటగా మార్చిన రాజేశ్వర రావు ని అభినందించ కుండా ఉండలేము.

పాడ గలిగే వాళ్ళనుంచి పాట ” పిండటం “, ఆ సంగీత దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ( నటుడి నుంచి నటన రాబట్టటం మంచి దర్శకుడికి తెలిసినట్టు !) 1953 లో సినీ రంగంలోకి వచ్చిన గాయని సుశీల చేత ( రాజేశ్వర రావు సుశీలని ” అమ్మాయి గారు ” అని పిలిచుకునేవాడుట) చాలా మంచి పాటలు పాడించాడు రాజేశ్వర రావు. ” భక్త ప్రహ్లాద ” సినిమాలోని భాగవతం పద్యాలు ( చేతులారంగ…, కమలాక్షు…) అంత గొప్పగా పాడించడం ఇంకెవరి తరం? ” చెంచులక్ష్మి ” సినిమా కోసం పాడిన ” పాల కడలిపై శేషతల్పమున పవళించేవా దేవా ..” పాట మన ఇళ్ళలో గృహిణులు పూజా సమయంలో పాడుకొనే భక్తి పాటగా మారి పోయింది. ఇలా ఎన్ని పాటలని గుర్తు పెట్టుకోగలం !

ఈ సందర్భంలో నా సొంతగోల ఒకటి మీకు చెప్పాలి. ” కులగోత్రాలు ” సినిమా కోసం స్వర కల్పన చేసిన పాట ” చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా ఇంకా సిగ్గు నీకేలా ..” అప్పటికే చాలా పాప్యులర్‌అయ్యింది. మా ఇంట్లో అందరం ఆ పాట హమ్‌చేసేవాళ్ళం. మా అమ్మగారు ఒకరోజు పూజ చేసుకొనేవేళ, కుర్రకారు మేం అంతా ” టింగ్‌.. టింగ్‌.. టింగ్‌.. టింగ్‌ ..” అంటూ ఆ పాటముందు వచ్చే స్వరాలను హమ్‌చేస్తున్నాము. పూజ చేసుకొంటున్న మా అమ్మగారు వెంటనే, మా స్వరాలను అందుకొని “చెలికాడు నిన్నే .. ” అని పాడటం ప్రారంభించి వెంటనే ” ఓరి వెధవల్లారా ! ” అంటూ నవ్వుకున్నారు. నా తెలిసినంతవరకు సినిమా పాట జన సామాన్యంలోకి ఎంత వెళ్ళిందో ఈ అనుభవం చెబుతుంది.

తెలుగు సినిమాల్లో జావళి పాటలలో రాజేశ్వర రావు తీసుకువచ్చిన సంగీతం మరెవ్వరూ తీసుకు వచ్చినట్టు కనపడదు ( దేవదాసు సినిమాలో ” ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా !” వంటి పాటలు కట్టిన సి. ఆర్‌ సుబ్బురామన్‌ని మినహాయిస్తే ). “మల్లీశ్వరి ” చిత్రం ద్వారా మరో చరిత్రను సృష్టించిన బి. ఎన్‌ రెడ్డి, ఘంటసాల, భానుమతి, దేవులపల్లి లాంటి మహామహులకు సమానంగా ప్రతిభ చూపించిన రాజేశ్వర రావును తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ” పిలచిన బిగువటరా ..” పాట కాపి రాగంలో కట్టిన ఒక జావళి. ఇదే కాపి రాగంలో స్వరం ఇచ్చిన ” అందాల బొమ్మతో ఆటాడవా ..” (అమరశిల్పి జక్కన్న) జావళికి మల్లీశ్వరి జావళికి తేడాలు గమనించండి. భైరవి రాగంలో స్వర కల్పన చేెసిన “నిను చేర మనసాయెరా …” (బొబ్బిలి యుద్ధం 1964) మరొక మంచి పాట .

సినిమాల్లో వీణ, సితార్‌వంటి వాయిద్యాలని పాటల ద్వారా పరాకాష్ఠకు తీసుకువెళ్ళింది సాలూరే ! ” పాడ వేల రాధికా ..” (ఇద్దరు మిత్రులు, మోహనం), ” ఏమని పాడెదనో ఈ వేళా ..” ( భార్యా భర్తలు, సింధు భైరవి), ” నీవులేక వీణ పలుకలేనన్నది …” ( డాక్టర్‌చక్రవర్తి, పహాడి ), ” పాడెద నీ నామమే గోపాలా ” ( అమాయకురాలు, హంసధ్వని తరవాత నట భైరవి ) వంటి పాటల్లో చరణానికి, చరణానికి మధ్య స్వరకల్పనలో వీణను పూర్తిగా ఎక్స్‌ప్లోయిట్‌చేసాడు. ” ఏమని పాడెదనో ..” పాటలో సుశీల పాటకన్న ముందు వినిపించే వీణను పలికించింది మరెవ్వరో కాదు ! అప్పటికే గొప్పపేరు తెచ్చుకొన్న ఈమని శంకర శాస్త్రి గారి శిష్యుడు ” చిట్టి బాబు “.

జైజవంతి రాగంలో స్వరకల్పన చేసిన ” మనసున మనసై ..” ( డాక్టర్‌ చక్రవర్తి) పాటలో వినిపించిన సితార్‌సంగీతానికి దీటైన సంగీతాన్ని సృష్టి చెయ్యడం మరో సంగీత దర్శకుడికి అసాధ్యం. అదే రాగంలో “భక్త జయదేవ” సినిమాలో జయదేవుడి గీతం మరొకటి స్వర కల్పన చేసాడు రాజేశ్వర రావు ( ” వదసి యది కించిదపి “). ” మాస్టారూ, మీరు పట్‌దీప్‌రాగంలో ఏమీ కంపోజ్‌ చెయ్యలేదేమిటీ ?” అన్న మా మిత్రుడి ప్రశ్నకి సమాధానంగా, ” అయ్యా, ఎందుకు చెయ్యలేదండీ ? నీ అడుగులోన అడుగు వేసి ..చేసాగా !” అన్నాట్ట (పూలరంగడు). పట్‌దీప్‌రాగంలో ఎక్కువ సినిమా పాటలు కనిపించవు. ఉన్నా, ఒకటి, రెండు ( ” ఎవరో రావాలీ … ప్రేమ నగర్‌” ) పాటలు విషాదభరితాలే. పూల రంగడు సినిమాలో పాట హుషారుగా ఉండటం గమనించండి!

సాధారణంగా, ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి యొక్క క్రియేటివిటి చిన్న వయస్సులో కొంతకాలం ఉండి వయస్సు పెరుగుతూ వస్తున్నప్పుడు తగ్గటం సహజం. కాని, రాజేశ్వర రావుకి వయస్సు వచ్చినా అది ఏ మాత్రం తగ్గలేదు అనటానికి ఒక ఉదాహరణ, 1977 లో స్వర కల్పన చేసిన ” ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు …” ( ” ఈ నాటి బంధం ఏ నాటిదో “) ” బిలహరి ” రాగంలో కట్టి సుశీల చే పాడించిన పాట.

” భక్త జయదేవ ” సినిమాలో (1961) ” ప్రళయ పయోధిజలే ..” పాటను ఘంటసాలతో అద్భుతంగా పాడించిన ఘనత రాజేశ్వర రావు కి వచ్చినా, దానికి కారణం దశావతారాలను వర్ణించే ఈ పాటను పది రాగాల్లో స్వరబద్ధంచేయటం కాదు. అలాంటి ప్రయోగాలు ఆ నాటి సంగీత దర్శకులు అందరూ చేసేవారు ( “సీతారామ కల్యాణం” సినిమాలో గాలిపెంచల చేసిన ప్రయోగం ఇలాంటి కోవకి చెందిందే !) . ఒక్కొక్క అవతారానికి అతను ఎన్నుకొన్న రాగంలో కనపడుతుంది సాలూరు గొప్పతనం. బుద్ధుడికి (” భాగేశ్వరి “), రాముడికి ( ” కేదారగౌళ ” రాముడికి ఇష్టమైన రాగం)ఇలాగ ప్రతి అవతారానికి తగ్గట్టు రాగ నిర్ణయం చేయడం గొప్ప విషయం. నరశింహావతారానికి ” సింహేంద్ర మధ్యమం ” వాడటం రాజేశ్వర రావుసంగీత సాహిత్య పరిజ్ఞానాలకి మచ్చుతునక. ” రంగుల రాట్నం ” లో సుశీలచేత పాడించిన ఇంకో దశావతారం పాట ” చేపరూపమున ..”. ఇది రాగమాలిక కాదు. ” మాయాబజార్‌” చిత్రం టైటిల్స్‌లో సంగీతం ” ఘంటసాల ” అని ఉన్నా, నిస్సందేహంగా అందులో చాలా మంచిపాటలను స్వర కల్పన చేసింది రాజేశ్వర రావే ! ఆ పాటలు మళ్ళీ వినండి. ” లాహిరి లాహిరి ..” (మోహనం), ” నీ కోసమె నే జీవించునది …” ( ” భాగేశ్వరి “), ” చూపులు కలసిన శుభవేళా …” ( ” బృందావని సారంగ “), వంటి పాటల్లో సాలూరు “ముద్ర” స్పష్టంగానే వినపడుతుంది. ఒక నాటి ప్రముఖ గాయకుడు ఎ. ఎమ్‌ రాజా సినీ రంగంలో ఉన్నా, అతన్ని మరింత వెలుగులోకి తెచ్చింది రాజేశ్వర రావే ! ” మిస్సమ్మ ” చిత్ర నిర్మాణ సమయంలో విజయా సంస్ధకి, ఘంటసాలకి వచ్చిన వివాదం వల్ల సంగీత దర్శకత్వం ఘంటసాల చెయ్యలేదు ! ( ” అప్పుచేసి పప్పు కూడు “, ” మిస్సమ్మ “, ” మాయాబజార్‌ ” లో కొంత భాగం తప్పిస్తే, మిగిలిన చాలా విజయా వారి చిత్రాలకి బ్రతికినంత కాలం ఘంటసాలే దర్శకత్వం వహించాడు.) ” సంగీత దర్శకత్వం నేను చెయ్యక పోతే పాడను ” అన్న ఘంటసాలను పక్కకు నెట్టి, రాజాకి అవకాశం ఇచ్చింది రాజేశ్వర రావే ! అలాగే ” విప్రనారాయణ ” సినిమా కోసం రాజాతో ” రాజా ” లాంటి పాటలు పాడించిన ఘనత కూడా రాజేశ్వర రావుదే ! పెండ్యాల నాగేశ్వర రావుని ” సాలూరు రాజేశ్వర రావు గారి పై మీ అభిప్రాయం ఏమిటి ? ” అని ఎవరో ప్రశ్నిస్తే, ” ఆయనెక్కడండి బాబూ ! ఆయనలాంటి సంగీత దర్శకుడు మళ్ళీ పుట్టబోడు ! ” అన్నాట్ట. అది నిజంగా ఒక సర్టిఫికెట్టు. తెలుగువారు ఎప్పటికీ గుర్తు పెట్టుకో తగిన ” సాలూరు రాజేశ్వర రావు ” వంటి సంగీత దర్శకుడు మరొకడు మళ్ళీ ఉండబోడేమో ! తెలుగు పాట ఉన్నంత కాలం ” రాజేశ్వర రావు ” మనందరిలో సజీవుడే !

చల్లగాలిలో యమునాతటిపై
శ్యామ సుందరుని మురళిని మ్రోయించిన మోవి
మనసున మల్లెల మాలలూగించిన తావి
నిన్నలేని అందమేదో నిదురలేపిన రవి

వెన్నెలలోని వికాసమై నిలచిన సంగీత జీవి
పగలే వెన్నెలగా జగమే ఊయలగా
పవిత్ర యాత్ర సాగించిన మధుర నాద యాత్రికుడు
మన రసాలూరు స్వర రాజేశ్వరుడు

జీవన జీవం గానం ఉన్నంత కాలం
ఆయన మన పాటకు పల్లవి.
----------------------------------------------------------
రచన: విష్ణుభొట్ల లక్ష్మన్న, 
ఈమాట సౌజన్యంతో

No comments: