Monday, December 24, 2018

తెలుగు సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం మొదలవుతోందా?


తెలుగు సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం మొదలవుతోందా?




సాహితీమిత్రులారా!

32 సంవత్సరాల క్రితం శ్రీ శ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా వచ్చిన ఒక కరపత్రం తెలుగు సాహితీ లోకంలో సంచలనం సృష్టించింది. ‘రచయితలారా మీరెటువైపు?’ అని రచయితలనీ, మేధావులనీ నిలదీసి రచయితలు ఎటువైపుండాలో, ఏ విలువలకోసం నిలబడాలో తెలియచెప్పింది. దానితో తెలుగు సాహిత్యంలో ఒక కొత్త యుగం మొదలయ్యింది.

మళ్ళీ ఇన్నాళ్ళకు తెలంగాణ టైగర్స్‌ పేరుతో మరొక కరపత్రం తెలుగు సాహితీ లోకంలో సంచలనం సృష్టిస్తోంది. ‘రచయితలారా ఖబడ్దార్‌’ అని రచయితలనీ, మేధావులనీ బెదిరిస్తోంది. సభ్య ప్రపంచంలో వినబడవనుకున్న మాటలతో స్త్రీవాద రచయితలనూ, వారికి మద్దతునిస్తున్న వారినీ దూషించింది. స్త్రీ పురుష సంబంధాల విషయంలో మనం సాధించామనుకుంటున్న ప్రగతంతా ఒఠ్ఠి భ్రమ మాత్రమేననీ, పురుషాహంకారమే అంతర్లీనంగా మన సాంస్కృతిక లక్షణమనీ ఈ కరపత్రం నిరూపించింది. దీనితో తెలుగు సాహిత్యంలో మళ్ళీ మరొక యుగం మొదలవుతోంది.

ఈ రెండు కరపత్రాల మధ్య కాలంలో తెలుగు సాహిత్యం అనేక మలుపులు తిరిగింది. సాహిత్యం,కళలూ కేవలం వినోదంకోసమే కాదు, అవి సమాజ పురోగమనానికి జరిగే కృషిలో భాగమన్న అవగాహన ఈ కాలంలోనే బలంగా ముందుకొచ్చింది. సాహిత్య ప్రయోజనం సమాజ పురోగమనానికి తోడ్పడడమని అంగీకరిస్తే ఏ కాలంలోనైనా సాహిత్యం ఈ ప్రయోజనాన్ని ఎంతమేరకు నెరవేరుస్తోందని ప్రశ్నించుకోవాలి. ఇటీవల వస్తున్న తెలుగు సాహిత్యం ఆ కర్తవ్యాన్ని ఎంతవరకూ నెరవేరుస్తోందని పరిశీలించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

ఈ మూడు దశాబ్దాల కాలంలోనే తెలుగు సాహిత్యం ఆణిముత్యాలవంటి ఎన్నో రచనలను మనకందించింది. రావి శాస్త్రి, కాళీపట్నం, చెరబండ రాజు, గద్దర్‌ లతో మదలైన ఈ స్రవంతి కొండేపూడి నిర్మల, వోల్గా, సతీష్‌ చందర్‌, ఎండ్లూరి సుధాకర్‌ వంటి బలమైన కొత్త గొంతుకలతో కలిసి మనం గర్వించతగ్గ గొప్ప జీవధారని మన ముందుంచింది.

జీవితంలో నిశ్చలమనుకున్న విలువలూ పద్ధతులూ మన కళ్ళముందు సమూలంగా మారిపోయాయి. మౌలిక విషయాల్లోకి వెళ్ళి పునాదులని కదిల్చే విధంగా కొన్ని ప్రశ్నలు మనముందుకొచ్చాయి. శ్రీ శ్రీ చెప్పిన విధంగా అణగారిన ఆర్తులందరూచారిత్రక యదార్థ తత్వాన్ని ఒక గొంతుకతో చాటించడం మొదలుపెట్టారు.

స్త్రీవాద దళితవాద ఉద్యమాలు అంతకుముందు అభ్యుదయ విప్లవ సాహిత్యాలు భుజాన వేసుకున్న ఈ కర్తవ్యాన్ని మరింత దీక్షగా ముందుకు తీసుకుపోయాయి. బెల్చీ నుంచి చుండూరు దాకా, రూప్‌ కన్వర్‌ నుంచి దాదర్‌ ఎక్స్ప్రెస్‌ దాకా, ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా దానికి స్పందించి రాయ వలిసిన అవసరాన్ని సాహిత్యకారులు గుర్తించారు. దానితో సాహిత్యం నిత్య జీవితంలో మునుపెన్నడూ లేనంతగా భాగమయ్యింది. దినపత్రికల్లో సైతం సాహిత్యమొక అనివార్య అంశమయ్యింది.

ఈ మూడు దశాబ్దాల చరిత్రనొకసారి తలుచుకుంటే ఈ కాలంలోనే సాహిత్యం సమాజంలో నిర్వర్తించాల్సిన పాత్ర గురించి లోతైన పరిశీలన జరిగి నిండైన అవగాహన ఏర్పడింది. తెలుగు సాహిత్య విమర్శా, విశ్లేషణా కూడా ఈ కాలంలోనే బాగా పదునుదేరాయి. ఒక పెద్ద కెరటం అంతకు ముందు వచ్చిన చిన్న కెరటాలనన్నిటినీ తనలో కలుపుకు ముందుకుపోయినట్లే, అంతకుముందునుంచీ వస్తున్న సాహిత్య వారసత్వాన్నంతా తనలో ఇముడ్చుకున్న తెలుగు సాహిత్యం ఈ కాలంలో ఒక బలమైన సాంఘిక శక్తిగా పరిణమించింది.

అయితే రాను రాను తెలుగు వాళ్ళ సాహిత్యం వెర్రి తలలు వేస్తోందా అనిపిస్తోంది. అయిదు సంవత్సరాల క్రితం వరకూ వచ్చిన కొత్త ధోరణులన్నీ ఏదో ఒక కారణం వల్ల తగ్గు ముఖం పట్టినట్లనిపిస్తోంది. రచయితల పరిధి పెరగడానికి బదులు రోజు రోజుకీ కుంచించుకు పోతున్నట్లనిపిస్తోంది. రాజకీయాల్లో వచ్చినట్లే రచయితల్లోకూడా రకరకాల చీలికలు వచ్చి ఎవరికి వారు చిన్న చిన్న వలయాల్లో తిరుగాడుతున్నారు. రచయితలు తమ రచనల వల్ల కాక రక రకాల వివాదాల వల్ల గుర్తింపు పొందుతున్నారు.వివాదాలని పెంచి పోషించేందుకే కొన్ని పత్రికలు పని చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు రకరకాల ఉద్యమాలలో ముందు వరసలో నిలబడిన రచయితలిప్పుడు ఈ వివాదాల ద్వారా మాత్రమే తమ ఉనికిని నిలబెట్టుకోవడం విచారకరం.

ఉద్యమాలు వెనకబడినా వాటి ప్రభావం సాహిత్యం మీద నిలిచి ఉంటుందనుకున్న వారికి నిరాశే మిగిలింది. ఇప్పుడు వస్తున్న సాహిత్యం ఎక్కువగా సైద్ధాంతిక గందరగోళాన్నీ, ఒక రకమైన దారితప్పిన అరాచకత్వాన్నీ ప్రతిఫలిస్తోంది. కష్టజీవికిరువైపులా నిలబడవలసిన కవి ఇప్పుడు మనని మళ్ళీ పాత రాతి యుగపు అంధకారంలోకి తీసుకెడుతున్నాడు. వ్యక్తీకరణలో వైచిత్రికీ, వస్తువులో సంక్లిష్టతకీ, అస్పష్టతకీ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి కవి ప్రజలనుంచి దూరమవుతున్నాడు.

గత పది పదిహేనేళ్ళ కాలంలో మధ్య తరగతి జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. గ్లోబలైజేషన్‌ ప్రభావం ముఖ్యంగా నగరాల్లో పట్టణాల్లో నివసించే మధ్య తరగతి కుటుంబాలమీద ఎక్కువగా పడింది. ఇవన్నీ ఇటీవల వస్తున్న కథల్లోనూ, కవితల్లోనూ ప్రతిఫలిస్తున్నాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక వచ్చిన మార్పులని కొడవటిగంటి, కాళీపట్నం వంటి రచయితలు విశ్లేషించినంత నిశితంగా ఇప్పుడు వస్తున్న మార్పులని ఇప్పటి రచయితలు విశ్లేషించలేకపోతున్నారు. ఇప్పటి రచయితలు ప్రతిభలో కొ. కు., కా.రా. ల కేమాత్రం తీసిపోరు. మరెందువల్ల ఈ తేడా కనబడుతోందని ప్రశ్నించుకుంటే ఒకటే సమాధానం దొరుకుతుంది. అప్పుడు వాళ్ళ వెనక ఒక బలమైన ఉద్యమం, ఒక సంస్థ ఉండేవి. ఇప్పుడవి లేవు.

పైన చెప్పిన రెండవ కరపత్రం ప్రస్తుత సాహిత్య లోకాన్ని పట్టి పీడిస్తున్న దారుణ క్షయ వ్యాధికి నిదర్శనం. ఎవరో అనామకులు రాసిన కరపత్రమైతే దాన్నొక కలుపుమొక్కకింద కొట్టిపారెయ్యొచ్చు. కానీ దీన్ని రాసినట్లుగా చెప్పబడుతున్న రచయితలందరూ లబ్ధప్రతిష్ఠులే. కొద్దో గొప్పో ప్రగతివాద ముద్ర ఉన్న వారే. ఇందులో వాడినవి కేవలం అసభ్య పదజాలంతో కూడిన దుర్భాషలే ఐతే అది వాళ్ళలో మిగిలి ఉన్న భూస్వామ్య సంస్కృతి అవశేషాలని సరిపెట్టుకోవచ్చు. కానీ, అందులో వాళ్ళు చిత్రించిన లైంగిక హింస కానీ, మానవ సంబంధాల విషయంలో వాళ్ళు సూచనప్రాయంగా చెప్పిన సంగతులుగానీ చూస్తే ఇది కేవలం మేధావులలో పెరుగుతున్న పతనావస్థ మాత్రమే కాదు, అత్యంత విచారకరమైన సాంస్కృతిక తిరోగమనానికి ఇది నాందిఅనుకోవలసి వస్తుంది. దురదృష్టమేవిటంటే ఇటీవల ఆంధ్ర భూమి పత్రికలో వచ్చిన ‘సామ్యవాద వటవృక్షం కూలిన వేళ ’ అన్న వ్యాసాన్నిబట్టి చూస్తే ఈ కరపత్ర రచయితలకి మన ‘మేధావి’ వర్గంలో గట్టి మద్దతే ఉన్నట్లుంది.

తెలంగాణా ఉద్యమం ఇవాళ ఇటువంటి దుర్మార్గపు చర్యలకు సాకుగా పనికిరావడం విచారకరం. ఇదే ధోరణి ఇటీవల వస్తున్న సాహిత్యంలో కూడా ప్రతిఫలించడం గమనార్హం. ఈ మధ్య ఆంధ్ర ప్రభ వార పత్రికలో వచ్చిన‘రాజయ్య రాకపోయె’ కథ చూస్తే అందులో తెలంగాణా ఉద్యమ నేపథ్యాన్ని స్త్రీ వ్యతిరేకతని చాటడానికి సాకుగా వాడడం జరిగింది. ఈ కథా రచయిత కూడా కథకుడిగా కొంత పేరున్న వాడే. ఇతని కథలు ఉన్నతమైన సాహితీ విలువలని ప్రతిపాదించే ప్రజా సాహితి వంటి పత్రికల్లో సైతంఅచ్చయ్యాయి.

అలాగే ఇటీవల వార్త పత్రికలో ‘గయ్యాలి గంప’ పేరుతో ఒక కవిత వచ్చింది. దీన్ని రాసిన కవి పేరు ప్రచురించలేదుగానీ, ఇందులో కూడా స్త్రీలను అవమాన పరిచే విధంగా వర్ణన జరిగింది. ‘నా బాస తెల్వలేక తిమ్మిరయ్యె తైతక్క’ అన్న పంక్తినిబట్టి ఇదికూడా ‘రాజయ్య రాకపోయె’ ఒరవడిలోనే వచ్చిందనుకోవాలి. బహుశా 3040 సంవత్సరాలక్రితం ఇటువంటి కవిత వస్తే అంత ఆశ్చర్యపడవలసిన పనిలేదు. కానీ, స్త్రీవాద ఉద్యమం బలంగా స్థాపించిన విలువల నేపథ్యంలో స్త్రీలను ఎగతాళి చేసే ఇటువంటి కవిత ఆశ్చర్యాన్నే కాక బాధని కూడా కలిగిస్తోంది.

సరైన అవగాహన లేకపోవడం వల్లనో, పరిస్థితులను సరిగ్గా అధ్యయనం చేసే ఓపికలేకో, చాలా మంది రచయితలు ప్రపంచంలో వస్తున్న పరిణామాలను సాహిత్యంలో సరిగ్గా ప్రతిఫలించలేకపోతున్నారు. ఒకప్పుడు లోతైన పరిశీలనా, అవగాహనా చూపిస్తూ శక్తివంతమైన రచనలు చేసిన ఎందరో రచయితలు ఇప్పుడు నిరుత్సాహకరమైన కథలూ కవితలూ రాస్తున్నారు. దూరదర్శన్లో వచ్చే సర్కారీ సాహిత్యానికేమాత్రం తీసిపోని విధంగా కార్గిల్‌ యుద్ధం గురించీ, ప్రపంచీకరణగురించీ రాస్తున్నారు. ముఖ్యంగా మతోన్మాదం గురించీ, స్త్రీల సమస్యల గురించీ ఇటీవల వస్తున్న రచనలు కొన్ని మనని కనీసం 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెడుతున్నాయి.

గుజరాత్‌ లో సమాజం సిగ్గు పడాల్సిన విధంగామనుష్యులని ఊచకోత కోస్తే ఆ విషయం మన సాహిత్యంలో దాదాపు ప్రతిఫలించనే లేదు. శివా రెడ్డివలీ గుజరాతీ మీద రాసిన ‘అమర్య్తం’ కవితని మినహాయిస్తే నాకు కనబడినంత వరకూ తెలుగు సాహిత్యంలో గుజరాత్‌ అల్లర్ల ప్రస్తావనే రాలేదు. ఉద్యమాల ప్రభావం అంతగా లేని ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి వచ్చిన ‘కౌసర్‌ బానో కీ అజన్మీ బేటీ ’ వంటి కవిత తెలుగులో రాకపోవడం విచారకరం.

ఇతర సమస్యల మీద కూడా ఇటీవల వస్తున్న రచనలలో ఉండవలసిన పదునుగానీ నిజాయితీగానీ కనబడడంలేదు. కొద్దో గొప్పో నిబద్ధత ఉన్న రచయితలు సైతం విషయాన్ని ఛాయామాత్రంగా స్పృశిస్తూ చవకబారు తెలుగు సినిమాల్లోకనిపించే విధంగా అసహజమైన పరిష్కారాలను చూబిస్తున్నారు. లేకపోతే ఉద్యమాల వైఫల్యాలను అసమగ్రమైన అవగాహనతో చిత్రించి తమలో ఉన్న నిరాశని నడుస్తున్న చరిత్రకంటగడుతున్నారు.

ఈ తిరోగమనానికి తగ్గట్లుగా తెలుగు సాహిత్యానికి మునుపున్న విధంగా పత్రికల్లో ఆదరణ లభించడం లేదు. ఒకప్పుడు కనీసం నాలుగు మాస పత్రికలూ, ఏడో ఎనిమిదో వార పత్రికలూ, నాలుగు దినపత్రికలూ సాహిత్యానికి ప్రాముఖ్యాన్నిచ్చేవి. ఈ mainstreamపత్రికలే కాకుండా కేవలం సాహిత్యం కోసమే నడిచే పత్రికలూ, ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన కొన్ని రాజకీయ పత్రికలూ ఉండేవి. రచయితలకి తమ రచనలు ప్రచురించుకోవడానికి బోలెడన్ని అవకాశాలుండేవి. ఇప్పుడు భారతి, యువ వంటి పాత తరం పత్రికలే కాకజ్యోతి, ఆంధ్ర జ్యోతి, ఉదయం వంటి పత్రికలు కూడా మూత పడ్డాయి. ఇంకా నడుస్తున్న ఆంధ్ర ప్రభ వంటి పత్రికల్లో కూడా ఇదివరకు కనిపించే మంచి సాహిత్యం ఇప్పుడు కనిపించడం లేదు. ఈ ఖాళీని ఇటీవల వస్తున్న internet పత్రికలు కొంతవరకూ పూరిస్తున్నా వీటి పరిథి బహుకొద్దిమంది పాఠకులకే పరిమితమవుతోంది. ఈ మాధ్యమం తెలుగు పాఠకలోకానికింకా అందుబాటులో లేకపోవడంతో మంచి సాహిత్యాన్ని నిలుపుకోవడంలో ఈ పత్రికల పాత్ర ప్రస్తుతానికి తక్కువే.

ఇప్పుడొస్తున్న సాహిత్యంలో కొన్ని మంచి రచనలు లేకపోలేదు. వస్తువు విషయంలో గానీ, వ్యక్తీకరణలో గానీ, తెలుగు రచయితలు ఇదివరకటికన్నా గాఢతనూ, పరిపక్వతనూ సాధించారు. మూస పోసినట్లు కాకుండా భిన్న కోణాల్లోంచి జీవితాన్ని చూడడం చూపించడం ఇటీవలి రచనలలోనే ఎక్కువ కనబడుతోంది. Post Modernism , magic realismవంటి ధోరణుల ప్రభావం తెలుగు సాహిత్యం మీద కొంత మేరకు పడి మనకు కొంత మంచి సాహిత్యాన్నిచ్చింది. అలాగే వ్యక్తిగత అనుభవాలనూ, అనుభూతులనూ కథల్లోనూ కవిత్వంలోనూ బలంగా చిత్రించడం ఇటీవల బాగా ఎక్కువగా కనబడుతున్న పరిణామం. అనుభూతివాదులు ఎప్పట్నుంచో ఈ ధోరణిలో రాస్తున్నా, 90వ దశకం వచ్చే వరకూ దానికి తగినంత గుర్తింపులేదు. వైయక్తిక అనుభవాలను తమ సిద్ధాంతాలకు వాహకంగా దళిత స్త్రీవాద సాహిత్యకారులు వాడడం వల్ల వాళ్ళ సాహిత్యంలో ఒక గాఢత, ఒక చిక్కదనం కనబడ్డాయి. అందువల్లే ఇవాళ ఈ తరహా సాహిత్యానికి ఒక కొత్త ప్రాముఖ్యత ఉంది.

అయితే సామాజిక ఆచరణలో ఒక భాగంగా సాహిత్యాన్ని పరిశీలిస్తే ప్రస్తుత తెలుగు సాహిత్య రంగం ప్రస్తుత రాజకీయ రంగం లాగే అగమ్యగోచరంగా కనబడుతోంది. ఇప్పుడొస్తున్న తెలుగు సాహిత్యమంతా ఒక విధమైన cynical నిరాశతో నిండి ఉంది. ఎక్కడో ఒక చోట కొంత ఆచరణశీలమైన సాహిత్యం వచ్చినా, అది రకరకాల వత్తిడులకు గురయి మౌలికమైన చోదక శక్తిని కోల్పోతోంది.

ఇవాళ ఒక కథా సంకలనం కానీ కవితా సంకలనం కానీ వస్తే అందరూ ముందు చూసేది అందులో మంచి కథలు గానీ కవితలు గానీ వచ్చాయా అని కాదు. అందులో దళిత కథలెన్ని, తెలంగాణా కవితలెన్ని, వగైరా లెక్కలు కట్టడం ముఖ్యమైన విషయమైపోతోంది. ఎవరైనా ‘చుట్టూరా ఉన్న చీకటిని తిడుతూ కూచునే బదులు ఒక చిన్న దీపాన్ని వెలిగిద్దామని’ ప్రయత్నిస్తే వాళ్ళ నిజాయితీని శంకిస్తూ వాళ్ళ వెనక ఏవో నిగూఢమైన ఉద్దేశ్యాలున్నాయని అంటగడుతున్నారు. ఏటేటా కథా సంకలనాలని ఎంతో ఓర్పుతో తీసుకొస్తున్న నవీన్‌, శివశంకర్‌ వంటి వాళ్ళకు సైతం ఇటువంటి ఇబ్బందులు తప్పడంలేదు.

ఇదే క్షీణయుగం లక్షణమైతే మన సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం వస్తున్నట్లే. ఈ క్షీణయుగంలోంచి బయటికి తీసుకెళ్ళే renaissanceరావాలంటే మళ్ళీ ఎలాంటి ఉపద్రవం రావాలో. ఎన్ని కరపత్రాలు రావాలో.
----------------------------------------------------------
రచన: నందివాడ ఉదయ భాస్కర్, 
ఈమాట సౌజన్యంతో

No comments: