Friday, December 21, 2018

చలనచిత్ర సంగీత సాహిత్య పోకడలు


చలనచిత్ర సంగీత సాహిత్య పోకడలు
సాహితీమిత్రులారా!

సంగీతం జీవనసుధాసారం. కళలలో సంగీతానిది నిరుపమాద్వితీయ స్థానం. ఆది శబ్దమైన ఓంకారం క్రమక్రమంగా విశ్రమించి, విశ్వరూపం దాల్చి నేడు అగణితవిధ సంగీతంగా రూపొందింది.

సంగీతం, గాత్ర సంగీతం (గానం) గానూ, వాద్య సంగీతం (వాదనం) గానూ రెండు ప్రత్యేకతలతో విలసిల్లుతోంది. వాద్యాలలో రాగవాద్యాలూ, తాళవాద్యాలూ రెండు రకాలు. మొదట ప్రతివాద్యం ప్రత్యేకంగా ప్రయోగింపబడి, పిదప రెండు, మూడు, నాల్గు వాద్యాలతోను, తదుపరి బహువాద్య సమ్మేళనం వలననూ ఆర్కెష్ట్రాగా పేర్కొనబడింది. వాద్య సంగీతం, గాత్ర సంగీతానికి సహాయకరంగా కూడా ప్రయోగింపబడసాగింది.

శబ్దం ఇలా విజృంభించగా వెలుతురు మరోలా విశ్వరూపం దాల్చింది. వెలుగునీడల కలయికలతో పలు రంగాలని కూడా జోడించి, మూకీగా ప్రారంభమైన చలన చిత్రయుగం ఈనాడూ టాకీగా బహుజనాదరణ పొందుతోంది. మాటలేని చిత్రాలు మాటాడి, ఆటాడి, ఈనాడు పాట పాడుతూ గొప్ప సాధనలు కావిస్తున్నాయి. ఈనాడు సినిమా, ఆహార వస్త్రాలకన్నా అధిక ప్రాముఖ్యం గడించుకున్న వైనం అత్యాశ్చర్యజనకం.


రికార్డింగు విధానాలూ, ప్లేబాక్ సింగింగ్ టెక్నిక్కులూ వైశిష్ట్యం సంపాదించుకున్న ఈ రోజుల్లో సంగీతం విభిన్న విశిష్ట పరిణామాలని సంతరించుకుంది. మొదట్లో నాటకాలలో పాడే గాయక గాయనీమణుల కంఠస్వరం థియేటర్లో కూర్చున్న ప్రతీ ప్రేక్షక శ్రోతకి వినిపించే విధాన ఖంగున మోగే ఘంటలా వుంటేనే పేరు గడించగలిగేది. కానీ, మైకులూ, లౌడ్ స్పీకర్లూ, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంటులూ పాపులర్ అయినకొద్దీ కంఠస్వరం చాలా మెత్తగా వున్నా విజ్ఞానదత్త విలక్షణ పరికరాల సహాయంతో బహుగుణీకృతమైన శబ్ద పరిమాణాన్ని సాధించగలుగుతోంది. చీమ చిటుక్కుమన్నా, ఏనుగు ఘీంకారంలాగ, సింహ గర్జనలాగ వినిపించగల వింత పరికరాలు నేటి చలనచిత్ర సంగీతాన్ని బృహత్పరిణామాలకి గురిచేశాయి. చిత్రాలలో పాటలలాగే, సన్నివేశాలకి తగిన నేపథ్య సంగీతం కూడా ప్రాధాన్యాన్ని గడించుకుని, ప్రత్యేకంగా గుర్తింపబడి ప్రశంసించబడే స్థాయికి ఎదిగింది. మొదట్లో తక్కువ వాద్యాలతో రంజింపగలిగిన సంగీతం ఇప్పట్లో వందల వాద్యాల సంరంభంతో ప్రబలమై అందర్నీ దిగ్భ్రాంతుల్ని కావిస్తోంది.

ఈనాటికే సప్తస్వర సంగీతంలో కోట్ల రచనలు రేడియో, టి.వి. కార్యక్రమంలోను, సినిమాలలోనూ ప్రచారం పొందాయి. పాతరాగాలలో కొత్త పోకడలెన్నో వచ్చాయి. వస్తున్నాయి. వస్తూనే వుంటాయి. కానీ, సంగీతానికి ముఖ్య ప్రాణం అయిన మాధుర్యం అనేకతః తగ్గిందనే అనాలి. పలుమార్లు మోనోటనీ అనిపించడం కూడా కద్దు.

అంగాలొకేలాటివైనా అంతులేని భిన్న వర్ణచ్చాయభేదాలు మానవ శరీరంలో వున్నట్లే, గాత్ర (Voice) వాద్య శరీరాలలో కూడా లెక్కకందని విభిన్న వైశిష్ట్యాలు సమకూరుతూనే వున్నాయి. కాని మానవ మానసిక శారీరక బలానికి ఎప్పుడో ఒకప్పుడూ, ఎక్కడో ఒకక్కడ హద్దు ఉండడంవల్ల, ఎన్నెన్నో రిపిటీషన్లు కూడా అనివార్యాలౌతున్నాయి ఆలోచితంగానూ, అనాలోచితంగానూ మూకీ చిత్ర యుగం ముగిసి, టాకీ చిత్రయుగం ప్రారంభమైన ప్రధమ దశలో చలన చిత్రాలలో శాస్త్రీయ సంగీత రచనలు పుష్కలంగా లభించేవి.

అప్పట్లో బాగా పాడగలవారే నాయికా నాయకులుగా పేరుపొంది నిలిచి వెలుగొందేవారు. కానీ, ప్లేబాకు పద్ధతి వచ్చిన పిమ్మట పాడలేని నటీనటులకి, నటన అధికంగా చేతకాకున్నా గాయనీ గాయకుల గాత్ర ఋణం లభించడం మొదలవడవల్ల చాలా మార్పులు కలిగాయి. చిత్ర సంగీతంలో అప్పటికీ మొదట్లో సైగల్, కె.సి.డే, పంకజ్ మల్లిక్ వంటి గాయకులు కొందరు నటిస్తూ పాడేవారు. హిందీ చిత్రాలలో సైగల్ మేజిక్ వాయిస్ ద్వారా ఇటీవల బహుళ ప్రచారం గడించుకున్న గజల్సు ఆనాడే చాలా పాప్యులర్ హిట్స్ అయినాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో కూడా గాయనీ గాయకులైన విద్వన్మణులు నటీనటులుగా అభ్యున్నతి పొందేవారు. నాగయ్య, భానుమతి, ఎస్. వరలక్ష్మి, రఘురామయ్య, ఎం.ఎల్. వసంతకుమారి, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్, ఎం.కె. త్యాగరాజ భాగవతార్, టి.ఆర్. మహాలింగం, పి.యు. చిన్నప్ప భాగవతార్, హొన్నప్ప భాగవతార్, జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం మొదలైన పలు విద్వాంసులు, సహజ గానపారీణులు, శాస్త్రీయ, లలిత శాస్త్రీయ పద్ధతులలో తమ సుమధుర గానంతో చిత్ర ప్రేక్షక శ్రోతల్ని రంజింపజేసేవారు. అప్పట్లో ముఖ్యంగా మొదటి రాత్రి సన్నివేశంలో కూడా తమిళ చిత్రాలలో కర్ణాటక సంగీత బాణీలనే ప్రవేశపెట్టేవారు.

జి. రామనాధ్, ఆర్. సుదర్శన్, జ్ణానమణి, ఈమని శంకరశాస్త్రి మున్నగు సంగీత దర్శకులు ఎక్కువగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం పైనే ఆధారపడి మట్లు కట్టేవారు. ఆ కాలంలో బాణీలు బహుళ ప్రచారంలో వుంటూ వుండేవి. హిందీలో నౌషాద్, తెలుగు, తమిళాలలో సి.ఆర్. సుబ్బరామన్, ఎం.ఎస్. విశ్వనాధన్, రామ్మూర్తి, రాజేశ్వరరావు, గాలిపెంచల, పెండ్యాల, సుసర్ల, ఆదినారాయణరావు, అశ్వత్థామ, చలపతిరావు, మొదలైనవారి రాక చలన చిత్ర సంగీత గీత పద్ధతిలో పలు మార్పులు తీసుకువచ్చింది. శంకర్ జైకిషన్, సి. రామచంద్ర, ఎస్.డి. బర్మన్, మదన్ మోహన్, రోషన్ హిందీలో తమ బాణీలలో నౌషాద్ బాణీకి మరికొన్ని విలక్షణ పద్ధతులు జోడించి, పంజాబీ, ఢోలక్, జాజ్, ట్విస్ట్ వగైరా విధానాలవలంబించి కొన్ని కొత్తదనాలు తీసుకొచ్చారు. ఓ.పి. నయ్యర్ కొన్ని ఏళ్లు తనదైన బాణీలో చిత్ర సంగీతాన్ని మలచేవారు. హేమంత్ కుమార్‌ది గాయనశైలి.

నౌషాద్ ముందు యుగంలో ఖేంచంద్ ప్రకాశ్, అనిల్ బిశ్వాస్, పండిట్ కృష్ణారావు, వసంతదేశాయ్ వంటివారు తమదైన ఒక బాణీని ప్రత్యేకించుకున్నారు. శాస్త్రీయ సంగీతానికే అధిక ప్రాధాన్యతనిస్తూ నౌషాద్ పంజాబీ డోల్‌కీ, అరబిక్ పర్షియన్ బాణీలకీ, అవసరమైనప్పుడల్లా పాశ్చాత్య సంగీతానికీ కొంచెం కొంచెంగా చోటిస్తూ భారతీయ చిత్ర సంగీతానికి మరో ప్రత్యేకత కలిగించారు. దానికి మరి కొన్ని మెరుగులు దిద్దినవారు సి. రామచంద్ర, శంకర్ జైకిషన్, ఎస్.డి. బర్మన్‌లు. రోషన్ భజన్ గీతాలకి పేరు గడిస్తే మదన్‌మోహన్ గజల్ శైలికి ప్రాముఖ్యత నిచ్చేవారు. సౌత్‌లో చంద్రలేఖతో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన డ్రమ్ డాన్స్ వగైరా బాణీలు ప్రవేశపెట్టి పాప్యులారిటీ గడించినవారు రాజేశ్వరరావు. క్రమేపీ పలువురు ప్రముఖ సంగీత దర్శకులు చిత్రరంగానికి సేవజేశారు.

మొదట స్లోటెంపోలో సాగిన సంగీతం ఫాస్టై మధ్యలో, ఈనాడు సూపర్ ఫాస్టై గంతులూ, చిందులూ వేస్తోంది. ఎంతటి ఫాస్టు స్పీడైనా చివరికి స్లో కాకతప్పదు. హెచ్చు తగ్గులు, తగ్గు హెచ్చులై పరిణామం పొంది తీరతాయి. ఓర్పుతో తిలకిస్తుంటే మార్పు తూర్పున ఉదయిస్తూనే వుంటుంది. దేశకాలపరిస్థితుల ప్రభావం సంస్కృతిపైనా తద్వారా కళలపైనా అనివార్యం.

తెలుగు చిత్రాల సంగీతంపైనా సాహిత్యంపైనా ఆది నుండి అనేక విధాల ప్రభావాల కారణంగా, ఎన్నెన్నో బృహత్ పరిణామాలు సంభవించాయి. కొత్తలో తెలుగు పాటల వరసలు ఎక్కువగా మరాఠీ బాణీలని అనుసరించేవి. అభంగులూ, లావణీలూ, భక్తిగీత పద్ధతులూ మరాఠీ సంగీతంలో ప్రాముఖ్యత వహించినవి. ఒక ప్రత్యేకమైన సంగతిని గాని, బిరకాని గాని, వినగానే అది మరాఠీ బాణీ అని సుళువుగా చెప్పేటంత వ్యక్తిత్వం గలవి ఆ మరాఠీ బాణీలు. కాలక్రమేణా తెలుగు బాణీలపై బెంగాలీ పద్ధతుల ప్రభావం కూడా పడింది. కె.సి. డే, పంకజ్ మల్లిక్, సైగల్, అనిల్ బిశ్వాస్ మున్నగువారి సంగీత రచనలలోనూ, గానంలోనూ, అలా అలా పంజాబీ, గుజరాతీ బాణీలూ, పర్షియన్ అరబిక్ పద్ధతులూ కూడా చోటు చేసుకున్నాయి. వెరైటీ కోసం మానవుడికి గల సహజ కాంక్షవలన మొత్తం మీద దక్షిణ భరత చలన చిత్ర సంగీతానిపై ఉత్తర భారత సంగీత పద్ధతుల ప్రభావం కొద్దో గొప్పో పడుతూనే వుండేది. సన్నివేశాలని అనుసరించి చలన చిత్రాలలో ఖవాలీ పాటలూ, గజల్ వరసలూ ప్రాబల్యం గడించున్నాయి. దేవులపల్లి, దాశరధి, నారాయణ రెడ్డి, ఆరుద్ర మున్నగు వారు తమ రచనలలో ఉరుదూ ఫణితులని అవసరాన్ని బట్టి ప్రయోగించేవారు. సీనియర్ సముద్రాల అంజలీ పిక్చర్స్‌వారి అనార్కలీ చిత్రానికై పాటలు రాస్తున్న సందర్భాన ఒక కాగితంపైన ప్యార్, బేజార్, కైజార్ లాంటి కాఫియా (ప్రాస) పదాలని ముందుగా ఎన్నుకుని, వాటిని తమ రచనలో చక్కగా పొందికగా సముచితంగా పొదిగేవారు.

బ్రిటీష్ సామ్రాజ్యపాలన సమయాన ఎన్నో ఆంగ్లపదాలు ఆయా ప్రాంతీయ భాషల పదాలలో యధాతథంగా చోటుచేసుకుని ఆయా భాషలకి చెందిన పదాలలాగే ఈనాటికి చెలామణి అవుతూ వుండడం రసజ్ఞులు గమనిస్తూనే వున్నారు. ఓ డియర్, వై ఫియర్ కం నియర్‌ లాంటి రైమ్స్ అన్ని భారతీయ భాషా చిత్రాల గీతికలోనూ వాడబడడం పరిపాటి అయిపోయింది. సంగీతంలో కూడా జాజ్, రాకన్‌రోల్, ట్విస్ట్ వంటి స్టైల్సు బలం పుంజుకుని ఆబాలగోపాలాన్ని ఊపి ఊపి వదిలాయి. ప్రస్తుతం వాటన్నిటినీ మించి వూపుతున్న స్టైలు ‘డిస్కో.’ ఇలా, ఏదో చిన్న చిన్న భిన్న పరిణామాలతో చలనచిత్ర సంగీతం సాహిత్యం తమ రూపరేఖా లావణ్యాలకి మెరుగులు దిద్దుకుంటున్నాయి. కాని ఈనాడు చిత్రగీతాలు, బాణీలలో వాద్య సంగీతానికి ప్రాధాన్య అధికమైన కారణాన ట్యూన్లు బిట్లు బిట్లుగా సమకూర్చబడడం వలన చిన్న చిన్న విడి విడి పదాలకి మాత్రమే చోటుండడం వలన భావాలని అధికంగా చిత్రించేందుకు వీలు చిక్కడం లేదు. మామూలుగా మాటాడుకునే మాటలే పాటలుగా ప్రయోగించడం తప్పనిసరి అవుతోంది. దానికి తోడు హాలు దద్దరిల్లే సౌండ్ సిస్టమ్స్ ప్రబలమయ్యేసరికి పాటలో వున్న నాలుగయిదు పదాలు కూడా శబ్ద ఘోషలో మునిగిపోతున్నాయి. అత్యధిక శబ్దాడంబరం వలన గుండెలు దడదడలాడి భయాక్రాంతులౌతున్న వైనం ఆశ్చర్యకరం. కాలచక్రభ్రమణంలో మళ్లీ మాధుర్య ప్రధాన సంగీతయుగం రావడం ఇప్పుడెంతయినా అవసరం.

21వ శతాబ్దంలో లభ్యమయే సంగీతపు ప్రభావం వలన మానవులు మత్తులై ఉన్మత్తులై ఎలాంటి చింతా జనక వేదనాత్మక పరిణామాలకి గుఱి అవుతారో అనే భయంకరమైన వూహకి రూప కల్పన చేసి చిత్రంగా మలచాడట కోలాహల సంగీత భీత చిత్తుడైన ఉత్తమ ఆంగ్ల చిత్ర దర్శకుడొకాయన. అదృష్టవశాత్తు నేనా చిత్రం చూడడం పడలేదు. చూసినవారు చెప్పడం వినే నా గుండె అల్లల్లాడిపోయింది. ఆ దర్శకుడు ఊహ ఊహగానే వుండిపోవాలని నా సదాశయం. అదే గనక నిజమైతే ప్రపంచమే గగ్గోలౌతుంది. శబ్ద సముద్రంలో అబ్ద నౌకలు నిమగ్నాలై క్షుబ్ధ హృదయాలు బ్రద్దలై ఎల్లెడలా అశాంతి పిశాచ తాండవ నృత్యం ప్రళయ వాతావరణాన్ని సృష్టించగలదు.

శాస్త్రీయ లలిత శాస్త్రీయ సంగీత పద్ధతులలో మలచబడిన ట్యూన్సు ఆనాడూ ఈనాడూ బహుళ జనాదరణ పొందగలిగిన నిదర్శనాలెన్నైనా వున్నాయి. మల్లీశ్వరిలోని గీతాలు ఈనాటికి వాటి ప్రజాదరణ కోల్పోలేదు. గొల్లభామ, రత్నమాల, లైలా మజ్ను, బాలరాజు, చిత్రాల సంగీతం ఏనాడైనా ప్రశంసార్హమే. ‘అంతా ప్రేమ మయం,’ ‘నేను నీ దాసుడ’ వంటి ఫక్తు కర్ణాటక సంగీతపు మట్లు పెద్ద హిట్లు ఐనాయి. పోతన, వేమన, త్యాగరాజు చిత్రాల సంగీతం కూడా సర్వకాల రంజకమై విలసిల్లుతుంది. ఇటీవల శంకరాభరణం చిత్ర సంగీతం కూడా అఖండ విజయం సాధించింది. ‘కానిస్టేబుల్ కూతురు’ లోని ‘పూవు వలె విరబూయవలె’ కానడ రాగంలో అద్భుతంగా మలచబడింది. వీరాభిమన్యు చిత్రంలోని ‘చూచీ వలచీ’ శహనరాగంలో అపూర్వంగా మలచబడింది. ఆ రోజుల్లో ‘అమ్మా శ్రీ తులసీ దయారాశివమ్మా!’ ‘బాలనురా మదనా’ ‘మది శారదాదేవి మందిరమే’ వంటి సంపూర్ణ కర్ణాటక రాగ ప్రయుక్త గీతాలు గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఉత్తరాది రాగాల పద్ధతిలో సాగిన ‘హాయిహాయిగా ఆమని సాగే’ సువర్ణ సుందరి చిత్రానికి సువర్ణ వర్షం కురిపించిన కారణాలలో ముఖ్య కారణం అని నిరాఘాటంగా వక్కాణించవచ్చు. ఇలా ఎన్నైనా దృష్టాంతాలున్నాయి క్లాసికల్ ట్యూన్స్‌కి ప్రజలు అందించిన ప్రశంసకి.

కాని వైవిధ్యం కోసం పాటుబడే మనిషి అభిరుచి మాటి మాటికీ మారుతూ వస్తూ వుండడం వల్ల ఈనాడు చలన చిత్ర సంగీతం అనూహ్యమైన మార్పుకి గుఱైంది. సాహిత్యంలాగే ఈనాడు చక్రవర్తి, సత్యం మున్నగు అధునాతన సంగీత దర్శకులు తమ తమ బాణీలలో జనాలని రంజింప జేస్తున్నారు, కాలానుగుణ్యమైన రీతిలో. ఈనాటి బాణీల పాప్యులారిటీకి టెక్నికల్ ఎక్సలెన్సు ఎంతైనా తోడ్పడుతోంది. స్పీడుగా సాగే గీతాల స్పీడులో ఫిల్ము ఫ్రేంలు కూడా జంప్ చేసి తాళబద్ధంగా నృత్యం చేస్తున్నాయి. కొన్ని తరహా జూమ్ ఫ్రేమ్ డాన్సుల వలన అప్పుడప్పుడు కంటికి స్ట్రెయిన్ కలిగినా మొత్తం మీద కెమేరా టెక్నిక్ ఎంతైనా అభివృద్ధి జెందడంవల్ల పాటల చిత్రీకరణలో ఎన్నైనా ఆకర్షణలు చూపబడుతున్నాయి. ఒకే సెట్టులోనో, లోకేషన్లోనో, మొదట్లో పాట అంతా పిక్చరైజ్ చేసేసేవారు. ఇప్పుడు ఒకే పాటలో బోలెడు లోకేషన్సు కెళ్లి ఫ్రేము ఫ్రేముకి రంగుల హంగులు జోడించి మనను గుమ్మయి పోయే విధానంగా చిత్రీకరించడం జరుగుతోంది. సినిమాస్కోప్, 70ఎం.ఎం, సినీరమా, 3-డి వంటి ఎన్నెన్నో థ్రిల్లింగ్ టెక్నిక్‌ల వల్ల చిత్రాలకీ, గీత చిత్రీకరణకి చాలా గ్రాండ్ ఎఫెక్టు లభించడం ముదావహమే ఐనా, అప్పుడప్పుడు అందరికీ కాకున్నా కొందరికైనా మదిలో నెమ్మది లోపిస్తోందనిపించడం కూడా కద్దు.

అంతకు మునుపు ఒకటో రెండో దృష్టాంతాలున్నా ‘రతన్’ చిత్రం చిత్ర సంగీతంలో నూతనాధ్యాయాన్ని సృష్టించింది. చిత్రంలోని అన్ని పాటలూ హిట్లు అయ్యే ఒక ఆరోగ్యకర విధానం ప్రారంభమైంది. అన్‌మోల్ ఘడీ, అందాజ్, మేలా, దీదర్, బాబుల్, దులారీ, అనోఖీ అదా మొదలైన చిత్రాల పాటలన్నీ గొప్ప ప్రజాదరణ పొందినవే. ఆ ప్రక్రియని అలా చాలాకాలం వరకు సాగించినవారు సి. రామచంద్ర, శంకర్ జైకిషన్, ఎస్.డి. బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, మదన్‌మోహన్, సలీల్ చౌదరీ, రోషన్, వసంత దేశాయ్ మొదలైనవారు. దానిలో కూడా తన ప్రత్యేకతని నిరూపించినవారు సజ్జాద్ హుస్సేన్ – హల్‌చల్, సొహ్రాబ్, రుస్తుం, సంగ్‌దిల్ వంటి చిత్రాలలోని పాటలు మంచి స్టాండర్డ్ హిట్స్ అని చెప్పొచ్చు. జోలపాట అనబడే లల్లబీ అంతకుముందు పాప్యులర్ అయిన అల్‌బేలా చిత్రంలోని, ధీరేసే ఆజారే అఖియన్‌మే నిందియా అజారే ఆజాధీరెసె ఆజా అనే లాలిపాట సృష్టించిన రికార్డు అపూర్వం. సినిమా పాట అని సంకోచించక ప్రఖ్యాత వీణా విద్వాన్ పద్మశ్రీ డా.ఈమని శంకరశాస్త్రిగారు తమ శాస్త్రీయ సంగీత కచేరిలో ఈ పాట తప్పకుండా శ్రోతలకి వినిపించి తమ సహజ వీణావాదన మాధుర్యానికి తగిన గీతంగా ఎన్నుకున్నారంటే ఆ పాట వైశిష్ట్యమెంతటిదో చెప్పనక్కరలేదు. ఆ లల్లబీ హిట్ అయిన పిదప అనేక చిత్రాలలో వరసగా లల్లబీ సాంగ్సు తప్పక ఉపయోగించడం వాటిల్లో ఎన్నో మంచి హిట్ సాంగ్స్ కావడం జరిగింది.

వెస్టరన్ మ్యూజిక్ కూడా మునుపటి సంగీత దర్శకులు పాప్యులరైజ్ చేసివున్నా ఆ బాణీకి ఒక కొత్త రూపుదిద్దిన ఘనత ఆర్.డి. బర్మన్‌కి దక్కింది. Sounds of R.D.Burman అని ఒక ఎల్. పీ. రికార్డు ఆయన ప్రవేశపెట్టిన సంగీత ధ్వనులకి మాత్రమే కేటాయించబడిందంటే అది కూడా ఒక వైయుక్తిక వైశిష్ట్యమే. ఈనాడు డిస్కో కింగ్‌గా వ్యవహరించబడే బప్పిలహరి సినీ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించారు. రిథమ్, స్పీడ్‌లకి ప్రాధ్యాన్యత అత్యధికమైంది. ప్రస్తుతం కొన్నైనా స్లో టైప్ పాటలకి చోటిచ్చేవి మలయాళ, కన్నడ చిత్రాలే. ఉత్తర భారత చలనచిత్ర సంగీత దర్శకుల వివిధ పద్ధతుల ప్రభావం దక్షిణ భారత చలన చిత్ర సంగీతంపై పడుతూ వుండడం పరిపాటి అయింది. కన్నడంలో జి.కె. వెంకటేశ్, విజయభాస్కర్, కీ.శే. ఎం. వెంకట్రాజు, రాజన్ నాగేంద్ర, ఎం. రంగారావు, లింగప్ప, ఉపేంద్రకుమార్ వంటి సంగీత దర్శకులు ఎక్కువగా శాస్త్రీయరాగాల ఆధారం పైనే మట్లు కట్టినా పాశ్చాత్య బాణీలకి కూడా తగిన చోటు ఇస్తూనే వున్నారు. మళయాళంలో జి. దేవరాజన్, కీ.శే. బాబురాజ్, ఎం.బి. శ్రీనివాసన్ వంటివారు కర్ణాటక హిందుస్తానీ బాణీలకే ఎక్కువగా ముఖ్యత్వం ఇచ్చే కళాకారులు. కాని ఇటీవల శ్యాం, జాయ్ వంటివారు పాశ్చాత్య పద్ధతులకి ఎక్కువ డిమాండు కల్పించారు.

సంగీతంలో లాగే సాహిత్యంలో కూడా అనేక పరిణామాలు మనం చూస్తున్నాం, మారుతున్న సమయానికి అనుగుణ్యంగా. తమిళచిత్రాలలో కణ్ణదాసన్‌ని అపరకాళిదాసుగా భావిస్తారు. ఆయన సినీగీతాలకి ఒక మహోన్నత స్థాయిని చేకూర్చిన అగ్రగణ్యులలో ముఖ్యులు. తమిళ పదాలు చాలా కఠువుగా , కఠినంగా వుంటాయని తరచు రిమార్క్ చేసే ఇతర భాషా రసజ్ణులని కూడా మెప్పించి తన పాటలని మరీ మరీ వినేలా చేయగలిగిన శక్తి కణ్ణదాసన్‌ది. అందరికీ అర్ధమయ్యే పదాలలో ఎవరికీ అర్ధంకాని మహాతత్త్వాలని కూడా విశదపరిచే బాణి ఆయనది. అందుచేత ఆయన అనుయాయులు ఈనాడు కోకొల్లలు.

మొదట్లో చలన చిత్రాలలోని సాహిత్యం గ్రాంధిక భాషకే అధికంగా అంకితమై వుండేది. అర్ధం కాని సాహిత్యాన్ని కూడా సినీగీతాభిమానులు పాప్యులర్ ట్యూనులో విని తరచు పాడుకునేవారు. గ్రాంధిక భాషా సాహిత్యం క్రమంగా సామాజిక సామాన్య దేశీయ భాషకి చోటివ్వడం మొదలుపెట్టింది. మరాఠీ, బెంగాలీ, పంజాబ్, ఉరుదూ సాహిత్యాల ప్రభావం కూడా అధికమై తెలుగులో అభంగులు, లావణీలు, భజన్లు, ఖవాలీలు, గజల్సు, భాంగ్‌డా వగైరా బాణీలలో సంగీత సాహిత్యాలు పోటీపడి మెరుగులు దిద్దుకున్నాయి. కేబరె డాన్సులు సంఖ్య పెరిగిన కొద్దీ ఆంగ్ల పాశ్చాత్య సాహిత్యాల ముద్ర భారతీయ చలన చిత్ర సాహిత్యం పైన పడసాగింది. కట్ కట్ బిట్ బిట్ పదాలలో మామూలుగా మాట్లాడుకునే ధోరణిలో ఇలాంటి గీతాలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. కానీ మెజారిటీ గీతాలలో భారతీయత లోపిస్తోందనిపించడం గుర్తింపబడదగినది. దేవులపల్లి, సీ. సముద్రాల, మల్లాది రామకృష్ణశాస్త్రి మున్నగు గీతరచయితల శైలి ఒకింత గ్రాంథిక భాషకే ముఖ్యత్వం ఇచ్చేది. వారు కూడా సామాన్య భాషలో చాలా గీతాలు రచించినా ఆత్రేయ, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరధి, సి. నారాయణరెడ్డి, అనిశెట్టి, కొసరాజు, సముద్రాల, వేటూరి, రాజశ్రీ మున్నగు గీత సంభాషణ రచయితల బాణి అధునాతనమై విభిన్న ప్రక్రియలతో కూడినదై పలు పరిణామాలు పొందింది. ఉరుదూ సాహిత్యంలో మేటి కవులైన మిర్జా గాలిబ్, ఇక్బాల్, జాకీ దర్ద్, మోమిన్, మీర్‌ తాకీ మీర్ వంటి మహానుభావుల భావాలు హిందీ చిత్రగీత రచయితల్ని చాలామందిని ప్రభావితుల్ని చేసినట్లే, ఆయా హిందీ చిత్రగీతాల భావాలు కూడ మన చిత్రాలలోని సాహిత్యం పైన తమ ప్రభావాన్ని కలగజేశాయి. అదే విధంగా తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల గీతాల భావాలు కూడా గ్రహింపబడడం కద్దు. ఒక భాషా సాహిత్య ప్రభావం మఱొక భాషా సాహిత్యంపై పడి అనేక నూతన ప్రక్రియలకి దోహదం చేస్తూ వుండడం సదా ప్రగతి సూచకం. ‘మంచి’ ఏ పద్ధతిలో వున్నా ఆ పద్ధతిని గ్రహించి, సంగ్రహించి సాహిత్య నిధుల్ని పెంపొందించుకోవడం వలన వివిధ భాషా భావ పరిధులు అవధులు లేకుండా అనంతమైన అభివృద్ధిని సాధించగలుగుతాం.

కాలానుసారం కథలూ, సన్నివేశాలూ వేషభాషలూ, కళలూ, మార్పు చెందుతూ వుండడం అనివార్యం. ఇదివరలో పవర్‌ఫుల్ డైలాగులకి ఎక్కువ డిమాండు యివ్వబడేది. ఇప్పుడు ఫైటింగుకి డిమాండు ఎక్కువైంది. ఆడుతూ పాడుతూ, తాళబద్ధంగా యుద్ధం చెయ్యడం కూడా ప్రవేశపెట్టబడింది. సినిమా ఒక మేక్‌ బిలీవ్ టెక్నిక్. లాజిక్కు హద్దుల్ని మీరగలిగే పాప్యులర్ మీడియం. ఎడ్యుకేషన్ కన్నా ఎంటర్‌టెయిన్‌మెంట్‌కే వాల్యూ అధికం అని పలువురి వాదం, నమ్మకం. ఒక పక్క ఎన్నో విమర్శలు సాగుతున్నా పట్టించుకోకుండా తన దారిని హాయిగా నిర్మొగమాటంగా నిరాఘాటంగా సాగే ధైర్యం గలది చిత్రపరిశ్రమ. ప్రజల ఆదరణ నిరసనలనిబట్టి, చిత్ర పరిశ్రమ, పోకడలు తమ రూపుని దిద్దుకుంటూ వుంటాయి. ప్రజల అభిరుచిని బట్టి చిత్రపరిశ్రమా, చిత్ర పరిశ్రమ అభిరుచిని బట్టి ప్రజలూ మారుతూ వుండే ఈ చక్రభ్రమణం కొనసాగిస్తూనే వుంటుంది తన విచిత్ర ప్రయాణం. ఏది ఏమైనా మన చిత్రాలలో భారతీయత సంపూర్ణంగా లోపించిపోయే పరిస్థితిని అరికట్టే తగు జాగ్రత్త వహించడం ఇటు చిత్ర పరిశ్రమ పైనా, అటు రసజ్ఞ ప్రజల పైనా గల తక్షణ బాధ్యత. ఈ బాధ్యతని నిర్వహించడం భారతీయ సంస్కృతికే శ్రేయస్కరం.
(విజయచిత్ర, 1986.)
-----------------------------------------------------------
రచన: పి. బి. శ్రీనివాస్, 
ఈమాట సౌజన్యంతో

No comments: