Thursday, December 20, 2018

ఆంధ్రచ్ఛందో వైభవం

ఆంధ్రచ్ఛందో వైభవంసాహితీమిత్రులారా!

శ్రీ భాస్కర్‌ గారి “మన ఛాందసులు” అన్న వ్యాసం తెలుగులో ఛందఃప్రయోగాలని గూర్చి చాలా విలక్షణమైన విషయాలను పరిశీలించింది. ఎన్నో నూత్న ప్రతిపాదనలు కూడా ఈ వ్యాసంలో చెయ్యబడ్డాయి. వాటిలో ప్రధానమైనవి రెండు. ఒకటి, మన కవులు పెద్ద పెద్ద సంస్కృత వృత్తాలకే తమ కావ్యాలలో పెద్ద పీట వేసారని. రెండు, అలాటి పద్యాలను వ్రాయడం కోసమే సంస్కృత భాషని వారాశ్రయించారని.

మనకవులు నిజంగా పెద్ద పెద్ద వృత్తాలకే పెద్దపీట వేసారా? చెప్పే విషయమా, లేక ఎంచుకున్న ఛందస్సా, ఏది భాషను నిర్ణయిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాల నన్వేషించడం యీ వ్యాసం ముఖ్యోద్దేశం. అందులో భాగంగానే, వారు చేసిన యితర ప్రతిపాదనలను గూడా పరిశీలిస్తాను. అట్లాగే, తెలుగు సంస్కృత ఛందో భేదాలను కూడా, నాకు తెలిసినంత వరకు, విశ్లేషిస్తాను.

వారు చేసిన మొదటి ప్రతిపాదన, “కవిత్వంలో నాదాన్ని ప్రవేశపెట్టడానికి ఛందస్సు వచ్చింది”. అసలు ఛందస్సు పుట్టినప్పటికి కవిత్వం ఉన్నదా అన్నది మొదటి ప్రశ్న. మనకు వేదాలలో మొట్టమొదట ఛందస్సు కనిపిస్తుంది. వేదాలలో కవితామయమైన శ్లోకాలు కనిపిస్తాయి కాని, ఆ తర్వాత యెప్పుడో వాల్మీకి నోట వచ్చిన “మా నిషాద” శ్లోకాన్నే మొదటి కవితగా మనం పరిగణిస్తాం. అందువల్ల కవిత్వం ఛందస్సుని ఆశ్రయించిందని చెప్పవచ్చు కాని ఛందస్సు కవిత్వం కోసం వచ్చిందనడం సమంజసం కాదు. సరే ఆ విషయం అలా ఉంచితే, ఛందస్సు నాదాన్ని ప్రవేశ పెడుతుందన్నది రెండవ విషయం. ఇక్కడ భాస్కర్‌ గారు లయని నాదమని పొరబడ్డట్టుగా ఉంది. ఎందుకంటే, నాదం శ్రుతి సంబంధమైనది. ఒక విశిష్టమైన స్వరం నాదమౌతుంది. లయ గతి సూచకం. గమన విశేషాన్ని తెలిపేది. ఛందస్సుకి పునాది మాత్రలు. ఇవి ఉచ్చరించే కాలాన్ని సూచిస్తాయి, స్వరాన్ని కాదు. అందువల్ల ఛందస్సు పద్య గమనాన్నే (లయనే) సూచిస్తుంది కాని నాదాన్ని కాదు.

ఇదే సందర్భంలో వారు, “ఛందస్సు ఉంటేనే కవిత్వం ప్రజల నాల్కలపై ఆడుతుంది” అన్నారు. నిజమే! అయితే ప్రజల నాల్కలమీద ఆడడమే కవిత్వ విశిష్టతకు ప్రధానమా అన్నది వివాదాంశము.

ఇక శ్రీ భాస్కర్‌ గారు చేసిన రెండవ ప్రతిపాదన. “భాషా సౌలభ్యాన్ని బట్టి ఛందస్సుని ఎంచుకోవాలి”. ఇది మరొక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన! దీని గూర్చి వారు యే వివరణా ఇవ్వలేదు. తెలుగు భాషలో తక్కువ గురువులు ఉంటాయి కాబట్టి, తక్కువ గురువులున్న ఛందస్సునే ఉపయోగించాలి అన్నది దీని తాత్పర్యమా! ఇక యీ ప్రతిపాదన చేసి ఆగకుండా, మన పూర్వకవులు సంస్కృతం ఎక్కువ వాడడానికి అసలు కారణం యీ పెద్ద పెద్ద వృత్తాలే అని వారు ప్రతిపాదించారు! ఇది యెంతవరకూ నిజం? నన్నయ్యకు ముందే, మార్గ కవిత అవతరించక పూర్వమే, తెలుగు పద్యాలు శాసనాలలో కనిపిస్తాయి. ఆ శాసనాలలో దేశి ఛందములైన రగడలూ, కందాలూ ఉన్నాయి. సంస్కృత ఛందములైన చంపకోత్పలములూ కూడా ఉన్నాయి. అవన్నీ సంస్కృత భాషా భూయిష్టంగానే ఉన్నాయి! అలాటప్పుడు పెద్ద వృత్తాలే తెలుగు కవుల సంస్కృత భాషాప్రయోగానికి అసలు కారణమని ఎలా అనగలరు? ఎక్కువ గురువులున్న వృత్తాలను అలతి అలతి తెలుగు పదాలతోనూ, తక్కువ గురువులున్న కొన్ని దేశి వృత్తాలను ప్రౌఢమైన సంస్కృత పదాలతోనూ వ్రాసి మన కవులు సెహభాషనిపించుకున్న పద్యాలు కోకొల్లలు. ఒక్క తిక్కన్నని తీసుకుంటే చాలు ఉదాహరణకి. ఆమాటకొస్తే, శ్రీశ్రీ, తిలక్‌ నుండీ, నేటి శేషేంద్ర వరకు ఎంతమంది సంస్కృతం గుప్పించలేదు, తమ వచన కవిత్వంలో? అందువల్ల ఛందస్సు, ప్రయోగించిన భాషను నిర్దేశిస్తుందనడం సరికాదు.

ఇక, నన్నయ్య పెద్ద వృత్తాలకి పెద్ద పీట వేసాడని వీరి అభిప్రాయం. నన్నయ్య భారతంలోని ఛందస్సు వివరాలు పరిశీలిస్తే నన్నయ్య భారతంలో అన్నిటికన్న యెక్కువ భాగం (ఇంచుమించు నాల్గవ వంతు)కందాలు. తరువాత తేటగీతి, ఆటవెలది, సీసం. ఆ తర్వాత చంపకోత్పలములు, విక్రీడితములు. వారు పేర్కొన్న స్రగ్ధర, మత్తకోకిల మొదలైనవి ప్రత్యేక సందర్భాలలో ఒకటి రెండు చోట్ల మాత్రమే “విశేష” వృత్తాలుగా ప్రయోగించాడు. ఆ ప్రయోగించిన చోటల్లా యేదో ఒక విశేషం ఉందని విశ్వనాథ వారు వివరించారు కూడా. నన్నయ్యతో పోలిస్తే, తిక్కన భారతంలో యీ వృత్తాలు కొంచెం యెక్కువ సంఖ్యలో కనబడతాయి. అయితే తిక్కన భారతంలో కూడా కందం వంటి చిన్న వృత్తాలకే పెద్ద పీట.ఇక వారన్నది ప్రబంధ కవుల విషయంలో మాత్రమే కొంతవరకూ నిజం. అయితే వారెంచుకున్న వర్ణనా ధోరణికి అనుగుణంగానే ఆ వృత్తాలను వాడారు. ఆ వర్ణనా ధోరణిని తప్పు పడితే పట్టాలి కానీ, దానికోసం వారు పెద్ద వృత్తాలను ఉపయోగించుకున్న తీరు నేమాత్రం తప్పు బట్టలేం. వారు చేసే వర్ణనలకి అటువంటి వృత్తాలు అనువైనవి కాబట్టి వాటిలో వ్రాసారు. ప్రబంధయుగానికే చెందిన ధూర్జటి, శార్దూల మత్తేభాలలోనే వ్రాసిన “కాళహస్తీశ్వర శతకం” మాటేమిటి? ఆ పద్యాలు యెంతటి సహజ సౌందర్యంతో శోభిల్లుతాయో రసజ్ఞులందరికీ అనుభవమే కదా!

సరే, ఆ తరువాత, సంస్కృత పద్యాలలోని అందచందాలను సోదాహరణంగా, మనోజ్ఞంగా వివరించారు శ్రీ భాస్కర్‌ గారు. సంస్కృత కవిత్వ మహత్వాన్ని యెవ్వరూ తక్కువ చెయ్యలేరు, నిజమే! అయితే ఇక్కడ ఒక్క విషయం ఆలోచించాలి. అదేమిటంటే, సంస్కృత భాషాభిమానులైన మన కవులు, యీ పద్యాల ఛందస్సు విషయంలో సంస్కృతాన్ని ఎందుకు అనుకరించలేదు?

సంస్కృతంతో పోలిస్తే, యీ విషయంలో మనకు ప్రథానంగా రెండు భేదాలు కనిపిస్తాయి. ఒకటి యతి, ప్రాసలు. రెండు కావ్యాలలో ఉపయోగించిన ఛందస్సు. దీని గూర్చి అవగాహన చేసుకోవాలంటే, ఛందస్సును గూర్చి కొంత చారిత్రక నేపథ్యం అవసరం. ఛందస్సు (మార్గ ఛందస్సు) మొట్టమొదట కనిపించేది వేదాలలో. అవి శ్రుతులు. కేవలం వల్లెవేయడం ద్వారానే, కంఠస్థం చేసి నేర్చుకోవలసినవి(ఆ కాలంలో). అందువల్ల స్మరణ శుభగత్వం వాటికి తప్పనిసరి. ఛందస్సు అందుకు ఒక ప్రధానమైన పరికరం. శ్రుతులలో ఛందో నిబంధనే కాకుండా స్వర నిర్దేశం కూడా ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అక్షరం యెలా ఉచ్చరించాలో, యెంత స్వరంలో పలకాలో కూడా నిర్దేశించబడతాయన్న మాట! అందువల్ల ఆ శ్లోకాల కొక నిర్దిష్టమైన రూపం ఏర్పడుతుంది. దానివల్ల స్మరణ సుభగత్వం కలుగుతుంది. అందువల్ల, జాగ్రత్తగా పరిశీలిస్తే సంస్కృత ఛందములు స్మరణ సుభగములే కాని, లయ ప్రధానములు కావని బోధపడుతుంది. ఉదాహరణకు అనుష్టుప్‌ కన్నా కూడా మన ఆటవెలదికి విశిష్టమైన లయ ఉంది.

ఇక కావ్యాలలోని ఛందస్సు గూర్చి పరిశీలిస్తే, సంస్కృత రామాయణ, భారతాలలో ప్రధానమైన ఛందము అనుష్టుప్పే. మొత్తం కావ్యమంతా ఇంచుమించు అదే ఛందస్సులో నడుస్తుంది. ఆ కాలానికి కూడా స్మరణావశ్యకత వాటికి ఉంది. తరువాత, తరువాత లేఖనా పరికరాల అభివృద్ధితో యీ ఆవశ్యకత తగ్గుతూ వచ్చిందనుకోవచ్చు. లయకి ప్రాధాన్యము పెరిగింది. అందుకే తర్వాత కావ్యాలలో ఒక్కొక్క సర్గా ఒకొక్క ఛందస్సులో నడవడం గమనిస్తాం. అంతే కాకుండా పెద్ద వృత్తాలకి, లయ కోసం యతి ప్రవేశపెట్టడం జరిగిందనుకోవచ్చు. జాగ్రత్తగా చూస్తే సంస్కృత శ్లోకాలలో ఛందో లక్షణంకన్నా కూడా, యతి మూలంగానే లయ యేర్పడడం గమనించ వచ్చు.

ఇక మన ఆదికవి నన్నయ్య కాలానికి వస్తే, అటు తక్కువ లయ కలిగిన సంస్కృత ఛందము, ఇటు లయప్రధానమైన దేశి ఛందస్సు. వ్రాసే విషయం మహాభారత ఇతిహాసం; కావ్యశైలిలో, కథాకథనప్రాథాన్యముగా వ్రాయాలి. స్మరణ సుభగత్వం ప్రథానం కాదు. అయితే లయకే పూర్తి ప్రాధాన్యమిద్దామంటే ఒక చిక్కుంది. లయ ప్రధానమైన ఛందస్సులో, అంటే ఒక ప్రత్యేకమైన లయ కలిగిన ఛందస్సులో భావ వైవిధ్యం గల పద్యాలు రాయడం అయ్యే పని కాదు. ఎందుకంటే, లయ ప్రధానమైన పద్యాలని, లయ లేకుండా వ్రాస్తే అవి ఎబ్బెట్టుగా ఉంటాయి. కాబట్టి ఎంచుకునే ఛందస్సులో లయ అంతర్లీనంగా ఉండాలి. వ్రాసే పద్ధతికి అనుగుణమైన ఒక లయ స్ఫురించాలి. అలాటి ఛందస్సు కావాలంటే చంపకోత్పలాలూ, విక్రీడితాలూ, సీసమూ, తేటగీతి వీటికి మించినవి లేవు. ఈ వృత్తాలను ఎన్నుకోవడంలో రహస్యమిదే అయి ఉండాలి. అయితే లయని తెలుగు కవులు విస్మరించారని అనుకోకూడదు. కందంతో ఎన్ని అందమైన గతులని సాధించారని! అలాగే వారు సంస్కృతం నుండి గ్రహించిన ఇతర వృత్తాలు కూడా (మత్తకోకిల వంటివి), లయ ప్రధానమైనవే. అందువల్ల ఛందస్సు విషయంలో తెలుగు కవులు లయకి, అంతర్లయకి చక్కని సమన్వయం సాధించారని చెప్పవచ్చు.

ఇక యతి, ప్రాసల విషయానికి వస్తే, దేశి కవిత్వంలో అవి అంతకుముందు నుంచే ఉన్నాయి. నిజానికి దేశికవిత్వంలో ఉన్నదీ, ఇప్పుడు తెలుగు ఛందస్సులో భాగమైనదీ యతి కాదు, వడి. “యతి” అంటే విరామమని అర్థం. సంస్కృతంలో యతి విరామాన్నే నిర్దేశిస్తుంది. “వడి” పదానికి అర్థం చెప్పడానికి ఎవ్వరూ అంతగా ప్రయత్నించి నట్టులేదు. శ్రీ సంపత్కుమారగారు ఇది “వత్‌” శబ్దం నుండి వచ్చి ఉండాలని ఒక చోట పేర్కొన్నారు. “వత్‌” అంటే “వంటి ” “సదృశం” అని అర్థాలు. “కైవడి”వంటి పదాలలో యీ అర్థాన్ని గమనించవచ్చు. తెలుగులో ఇప్పుడున్న యతి వర్ణ సాదృశ్యాన్నే సూచిస్తుంది. అందువల్ల తెలుగు యతిని “వడి” అనటమే సమంజసం. యీ యతి, ప్రాసలను కూర్చడంలో కూడా మన కవులు అనేక మహత్యాలని సాధించారు; సంబోధన చివరి అక్షరం యతి స్థానంలో వేస్తే వచ్చే సొగసైతేనేమిటి, ప్రాసస్థానాన్ని వ్యంజకం చేస్తే పుట్టే ధ్వనైతేనేమిటి … యిలా. ఈ విశేషాలని గుర్తించక కేవల సూత్రాలకే పరిమితమైన మన లక్షణకారులది తప్పు కాని, కవులది కాదు. విరామ నిర్దేశకమైన యతి వల్లనే బహుశా సంస్కృతంలో పెద్ద పెద్ద సమాస ప్రయోగం లేదు. ఆ యతే కనుక మనవాళ్ళు పాటించి ఉంటే, “దుర్వారోద్యమ” వంటి రసవ్యంజకమైన వేన వేల పద్యాలు తెలుగు సాహిత్యంలో పొద్దుపొడిచేవా!

నా యీపై విశ్లేషణ పూర్తిగా సహేతుకమని నేననను. అయితే “మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్‌” అని తెలియని విషయాన్ని కొట్టిపారేయలేక, ఎంతోకొంత ఆలోచనచేస్తే సమాధానం దొరక వచ్చునన్న నమ్మకంతో చేసిన ప్రయత్నం మాత్రమే!

చివరిగా వారు పోతన, శ్రీనాధుల శార్దూలాలని పోలుస్తూ విమర్శ చేసారు. ఇదికూడా అంత సమంజసమని నాకనిపించలేదు. పోతన సంస్కృత ప్రయోగాలగురించీ, తెలుగు సంస్కృతాల సంయోగం గూర్చీ వారు చెప్పింది ముమ్మాటికీ నిజమే. కానీ యీ పద్యం విషయంలో శ్రీనాధుని తప్పుబట్టడం సరి అనిపించడంలేదు. ఎందుకంటే, వారు శార్దూలవృత్తపు యెంపిక విషయంలో యే సమర్థనైతే చేసారో, భాషావిషయకంగా కూడా అదే సమర్థనని చేయవచ్చు కదా! గంభీరమైన సన్నివేశంలోనుండి ప్రేమోద్భవం జరుగబోతోంది. అందువల్ల ఓజోగుణప్రధానమైన పద్యంలో, ప్రేమ చిగురెత్తుతోందని చెప్పడంలో అనుచితమేముంది? ఆ పద్యంలో నాకు కనబడిన మరో విశేషం “ప్రమోదక్షమా దాక్షిణ్యంబులు”. ఇక్కడ “దక్ష” పదం ఆవృత్తి చెంది, దక్ష యజ్ఞాన్ని జ్ఞప్తికి తెస్తోంది. దక్ష యజ్ఞం తరువాత శివపార్వతుల సంగమం అప్పుడే కదా జరుగబోతోంది! ఈ విషయం చెప్పకనే చెపుతున్నట్టులేదూ!

దుష్కర ప్రాస గూర్చి కూడా కేవలం పాండిత్య ప్రకర్షకోసమే అది వాడారని వారు ఆరోపించారు. అది చాలా వరకు నిజమే కావచ్చు, కాని అన్ని చోట్లా కాదు. అల్లసాని పెద్దన రాసిన రెండు పద్యాలను ఉదహరించి నా విశ్లేషణ ముగిస్తాను. ఈ పద్యాలు రెండూ ఇందీవరాక్షుడు గురువు వద్ద దొంగతనంగా విద్యనభ్యసించి, గురువును ధిక్కరించిన సందర్భము లోనివి. రెండూ వరుసగా వస్తాయి

తండ్రీ నాకు ననుగ్రహింపగదె వైద్యంబంచు ప్రార్థించినన్‌

గండ్రల్గా నటులాడి ధీకృతుల పోకాల్మంటివోహో మదిన్‌

దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రాకుండునే!

గుండ్రాడాచిన పెండ్లి యేమిటికి జిక్కున్‌ గష్ట ముష్టింపచా!

అనినన్‌ గన్నులు జేవురింప నధరంబల్లాడ వ్రేల్లత్‌ పునః

పునరుద్యత్‌ భృకుటీ భుజంగయుగళీ ఫూత్కార ఘోరానిలం

బన నూర్పుల్‌ నిగుడన్‌ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్‌

చినుకన్‌ గంతు దిదృక్ష రూక్షనయన క్ష్వేళా కరాళధ్వనిన్‌

మొదటి పద్యంలో బిందుపూర్వక డకార రకార ప్రాస, దుష్కర ప్రాస. ఎందుకు వేసాడు? పాండిత్య ప్రదర్శనకా? చివరిపాదంలోని జాతీయం కోసమా? శిష్యునిలోని పొగరు చూపించడానికా? రెండూ పెద్ద వృత్తాలే. మరి మొదటి వృత్తంలో తేలిక పదాలూ, రెండవ దానిలో ప్రౌఢ సమాసాలూ ఎందుకు వేసాడు? వృత్తసౌందర్యం తెలియకనా, సందర్భౌచితి తెలుసు కనుకనా?
----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: