Monday, May 28, 2018

పద్యప్రతిలోమము


పద్యప్రతిలోమము




సాహితీమిత్రులారా!


ఒక పద్యాన్ని మామూలుగా చదివితే
దాన్ని అనులోమ పద్యం అంటాం.
అదే పద్యాన్ని చివరనుండి మొదటికి
చదివిన ప్రతిలోమమవుతుంది
అంటే మరొక పద్యం అవుతుంది.
గతంలో ఒప పద్యాన్ని త్రిప్పి చదివినా
అదే పద్యం వచ్చేది చూచాము
దానికి భిన్నమైంది ఇది.
లక్ష్మిసహస్రకావ్యంలోని ఈ
పద్యం చూడండి.
ఇది విద్యున్మాలికా వృత్తంలో
కూర్చబడింది.
అనులోమ పద్యం -
సామాధామాసారాభీమా
కామారామాకామాభూమా
రామాధామారారాభామా
భామాకామాభామాభూమా

భావం -
సామవేదానికి పూర్ణ నివాసులగు పండితులకు నివాసమైనదానా
శ్రేష్ఠురాలా భయముగొలుపనిదానా కేవలము ఇహలోకమునందలి
కోరికలుగల వారియందు అనురాగం లేనిదానా భూదేవిరూపం
నొందిన లక్ష్మీ స్త్రీల యొక్క తేజస్సునకు స్థానమైనదానా
సత్యభామ అనే పేరుగలదానా రమ్ము రమ్ము స్త్రీలయొక్క
కోర్కెలయందు ఉండుదానా కాంతి సంపదయొక్క ఆధిక్యమునకు
స్థానమైనదానా రమ్ము రమ్ము


ప్రతిలోమ పద్యం - 
పై పద్యాన్ని క్రిందినుండి పైకి వ్రాసిన వచ్చు పద్యం

మాభూమాభామాకామాభా
మాభారారామాధామారా
మాభూమాకామారామాకా
మాభీరాసామాధామాసా

భావం -
భూమియొక్కయు, పార్వతిఅను స్త్రీ యొక్కయు, కోర్కెలయొక్క
విశేష ప్రకాశముగలదానా, (భూదేవి, పార్వతి లక్ష్మివలన సకల
సంపదలు పొందుతారని తెలుపుట), మాకు కష్టములైన
పనులందు ధైర్యము నిచ్చుదానా, రమ్ము మాతేజస్వరూపమైన
దానా రమ్ము, మాసంపదకు స్థానమైనదానా, మన్మథునియందు
పూరణమైన సంతోషంకలదానా విష్ణుపత్నీ, భయముగలవారికి
సుహృద్బలమైనదానా లక్ష్మీ ప్రదముకాని చోట తేజస్సు
ఉండనిదానా  రమ్ము రమ్ము

ఈ విధంగా భావం మారిపోతున్నది.

No comments: