Friday, May 18, 2018

దీర్ఘసమాస చిత్రం


దీర్ఘసమాస చిత్రంసాహితీమిత్రులారా!సమాసములు చిన్నవిగా మనం గమనించి ఉంటాం.
సమాసం ఒక పద్యంలో ఒక పాదం కాకుండా మూడుపాదాలు
సాగిన ఈ పద్యం చూడండి. ఇది గణపవరపు వేంకటకవి
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము (1-126)లోనిది.
ఆ పద్యం -
అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి
ఆనందనిలయావాసుడై దివ్యదీధితులతో విరాజిల్లుతున్న
స్వర్ణసింహాసనాన్ని అధిరోహించి తనను చూడవచ్చిన
భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహించినప్పటి దృశ్యంలోనిది.


నెలఱాతీనియ సంతనంపు మగఱా నీరాళపుం గొప్పటా
కుల నిద్దంపుఁ బసిండి నున్జవికెనిగ్గుల్ దొట్టు కట్టాణి పూ
సల మేల్ బొబ్బమెకంబు చెక్కడపుఁ గీల్ జాగా జగా గద్ది యన్
జెలువెచ్చం గొలువుండె నెల్లరును జేజే యంచుఁ దన్గొల్వఁ గన్.

దీనిలో   మొదటి మూడు పాదాలూ ఒక్క సమాసం.

నెలఱాతీనియ సంతనంపు మగఱా నీరాళపుం గొప్పటా
కుల నిద్దంపుఁ బసిండి నున్జవికెనిగ్గుల్ దొట్టు కట్టాణి పూ
సల మేల్ బొబ్బమెకంబు చెక్కడపుఁ గీల్ జాగా జగా గద్ది యన్
జెలువెచ్చం గొలువుండె నెల్లరును జేజే యంచుఁ దన్గొల్వఁ గన్.

దీని అర్థం-
నెలఱా తీనియ= చంద్రకాంతశిలావేదికపైని, సంతనంపు = తాపబడిన, మగఱా = వజ్రములయొక్క, నీరాళపున్ = స్వచ్ఛమైన వన్నెమీరిన, గొప్ప + టాకుల – గొప్ప = పెద్దవియైన, టాకుల = వసారాలలోని, నిద్దంపు = స్నిగ్ధమగు, పసిండి = బంగరు రంగు, నున్ = మనోహరమైన, చవికె = మండపముయొక్క, నిగ్గుల్ = కాంతులను, తొట్టు = ప్రసరించు, కట్టాణి పూసల = మిక్కిలి గుండ్రని ప్రశస్త మౌక్తికవిశేషముల, మేల్ = విలువైన, బొబ్బమెకంబు చెక్కడపు = సింహపీఠికయొక్క, కీల్ = అందముగా కీలుకొలిపిన, జాగా = విశాలమైన, జగా = గొప్ప, గద్దియన్ = ఆసనముపై, చెలువు + ఎచ్చన్ = సౌందర్యము అతిశయింపగా, ఎల్లరును = సర్వజనులును, జే! జే! అంచున్ = జయజయధ్వానములు సల్పుచు, తన్ = తనను, కొల్వఁగన్ = ఆరాధించుచుండగా, కొలువు + ఉండెన్ = సభతీర్చియుండెను అని భావార్థం.

ఇందులో సమాసదీర్ఘిమను మించిన దుర్ఘటార్థమేదీ లేదు.

(ఈ పద్యం అర్థం డా. ఏల్చూరి మురళీధరరావుగారి సౌజన్యంతో)

No comments: