Wednesday, May 16, 2018

ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!


ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!




సాహితీమిత్రులారా!

ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!
అనే పేరున ఒక వ్యాసం డా. ఏల్చూరి మురళీధరరావుగారు
ఈ మాట అంతర్జాల మాసపత్రికలో వ్రాసియున్నారు
అందుండి ఈ పద్యాన్ని ఇక్కడ వారి వివరణను
యథాతథంగా ఉంచుతున్నాను ఆస్వాదించండి-

వేయేండ్లుగా వెలసి విలసిల్లుతున్న ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం సులభమేమీ కాదు. వేలకొద్దీ వెలసిన కావ్యాలలో అప్రతీతపదప్రయోగం వల్ల, అన్వయక్లేశం మూలాన, భావప్రౌఢి కారణవశాన అర్థనిర్ణయం దుష్కరమైన పద్యాలెన్నో ఉన్నాయి. ఇప్పుడా అలవాటు లేదు కాని, ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో —

కమలాకరకమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గని రా సుదతుల్.

— వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేదట. మాడుగుల సంస్థానానికి వెళ్ళినపుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారిని ఈ పద్యానికి అర్థం చెప్పమని అడిగారట. తెనాలి రామకృష్ణకవి కందర్పకేతువిలాసములోని శబ్దచిత్రం ఇది.

ఆ సుదతుల్ – అందమైన పలువరుసతో అలరారుతున్న ఆ సుందరాంగులు; కమలా = లక్ష్మీదేవియొక్క, కరకమల = పద్మము వంటి చేయి, ఆకర = ఉనికిపట్టుగా కలిగిన, కమల = తామరపూవునకు, ఆకర = జన్మస్థానమై, కమల కమల కమలాకరమై – కమల = బెగ్గురు పక్షులకు, కమల = పరిశుద్ధజలములకు, కమల + అ = పద్మములయొక్క సమూహమునకు, ఆకరమై = నివేశనమైనది; కమలాకర – క = మన్మథునియొక్క, మ = సమ్మోహనకరమగు, లా = వశీకరణశక్తిని, కర = కూర్చునదై, కమలాకర – కమలా = పద్మినీజాతి స్త్రీలకు, క = శరీరములందు, ర = కామాగ్నిని ఉద్దీపింపజేయునదై, కమలాకరము + ఐన = సర్వసంపత్ప్రదమైన, కొలనున్ = సరోవరమును, కనిరి = నేత్రపర్వముగా వీక్షించిరి – అని అన్వయించుకోవాలి. సుబ్రహ్మణ్యకవిగారు ప్రవచించిన సంప్రదాయార్థం లభింపనందువల్ల నేను ఉన్నంతలో పద్యాన్ని మేనమామ పోలికగా అన్వయించాను.

అల్లంరాజు సుబ్రహ్మణ్యంగారి వివరణకంటే ఇందే బాగుందని
నా అభిప్రాయం ఎందుకంటే అది నేను ఒకసారి చూసి
ఉన్నాను. అందుకే ఇది ఇక్కడ ఉంచడం జరిగింది.

No comments: