Thursday, September 21, 2017

మల్లంపల్లి చరిత్ర సమీక్ష


మల్లంపల్లి చరిత్ర సమీక్ష




సాహితీమిత్రులారా!




చరిత్ర పరిశోధనే ఆహారంగా, నిద్రగా స్వీకరించి, చరిత్రగతులు దిద్దిన 
మల్లంపల్లి సోమశేఖర శర్మగారి సమీక్ష చారిత్రకంగానే వుంటుంది. 
శిలల భాషలు తెలుసు ఆయనకు, చాకిబండలనుకున్న 
వాటిని శాసనాలుగా చదివిన దిట్ట.

   పిచ్చిప్రేమ అనెడి ఛాయాచిత్రమును క్షుణ్ణముగా పరిశీలించినచో మనకనేక చారిత్రక అంశములు బయల్పడుననుట నిస్సందేహము.
ఇందలి ప్రదేశములు ఇప్పటి ఆంధ్రరాష్ట్రము(అనగా పూర్వపు త్రిలింగము)లోని భాగసరిహద్దు గ్రామ ప్రాంతములు.
     చిత్రములో కథాగమనము ననుసరించి విఫల మనోరథయైన నాయిక నిర్జన ప్రదేశంలో గల బావిలో దుమికి ఆత్మహత్యకు తలపడుతుంది. ఇక్కడ మనము సూక్ష్మముగా పరిశీలించవలసియున్నది. ఆ బావిచుట్టూ ప్రాకారమువలె 
శిలానిర్మితమైన బొడ్డు గలదు. దాని నిర్మాణక్రమమును బట్టి చూడగా అది బౌద్ధశిల్పమును ప్రతిబింబించుచున్నది. క్రీస్తుశకం 11వ శతాబ్దికి చెందిన గంగరాజయ్య(గంగప్ప నామాంతరము)త్రవ్వించి యుండవచ్చునని కొందరు 
చారిత్రక పరిశోభకులు అభిప్రాయ పడుతున్నారు. అతని కుమారుడు దాహదాహ దూషణడు. తండ్రి త్రవ్వించిన జయాశయములలో పూడికలు తీయించినట్టు ఒక తామ్రశాశనము ద్వారా వెల్లడవుతున్నది. ప్రమోదూత నామ సంవత్సరము మాఘ శుద్ధ దశమి ఆదివారం నాటికి దాని నిర్మాణము పూర్తి అయినదనియు కొండవీటిలో లభించిన దానశాసనము స్పష్టపరచుచున్నది. గంగరాజయ్య ప్రపితామహుడైన బావికాచార్యులు వాస్తుశిల్పిగా ఆ కాలమున ప్రఖ్యాతి బడసినాడు. అతడు సింహాచలము, సత్రయాగ మొనరించినట్టు అగ్రహారముల దానమొనరించినట్లు సనదులు లభించినవి. అతడు క్రీస్తుశకం 1162 ప్రాంతములో జలనిధి కొలువున ఆస్థాన జ్యోతిష్కుడు. వెలనాటి బ్రాహ్మణుడు. ఇతనిది వసిష్టస గోత్రము. దీనికి సంబంధించిన పరిశోధన విపులముగ జరగవలసివున్నది.

(ఇది చిత్ర సమీక్షా అంటే అంటే మరి - చరిత్ర విను. చెప్పనిది అడగకు.)

(శ్రీరమణ పేరడీలు నుండి......)

No comments: