Sunday, September 17, 2017

ఆంధ్ర మహా కృష్ణుడు


ఆంధ్ర మహా కృష్ణుడు



సాహితీమిత్రులారా!



జాతీయ పుస్తక సంస్థవారి ఆదానప్రదాన కార్యక్రమంలో అనేక యితర ప్రాంతీయ భాషల్లో కథలు తెలుగులోకి వచ్చాయి. హిందీ, బెంగాలీ భాషల్లోని కథలు కొన్ని ఇదివరకే తెలుగులోకి వచ్చినా, అన్ని ప్రాంతాల కథలూ విరివిగా ఇప్పుడిప్పుడే తెలుగులోకి వస్తున్నాయి.

ఏ భాషలోనుంచి వచ్చినా ప్రాంతీయ వాసనలు,
వాతావరణం కన్పిస్తూనే ఉంటుంది. వేర్వేరు భాషల 
నుంచి అనువదింపబడు కథల నడకలు ఎలా వుంటాయి. - 
అనేది యీ పేరడీ అంశం-

పదహారణాల తెలుగు రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి
గారి శైలిలో ఈ పేరడి--

"స్వామిశాస్త్రీ! యింకా తావళం దగ్గరే వున్నావుషోయ్?" తాంబూలం
నవుల్తూ చేసంచీతో వంటింటి గుమ్మంలో ఆగాడు అవధాని.

   "మా పాలేరు గుమ్మడిపండుని గుమ్మంలో దొర్లించి వేళ్ళాడే్మో
ననుకున్నాను. నువ్వటోయ్ అవధానీ లోపలికి రా!" అరసున్నాలాగా
వోరగా చూశాడు స్వామిశాస్త్రి.

   "నువ్వు లేవూ - ఊడగొట్టిన నాగటిదుంపలాగా. ఈ చమత్కారాలకేం గాని తొందరగా ఆవుపోసన పడుదూ"

  " కూర్చో అన్నయ్యా" అంటూ కామేశ్వరమ్మ గోడవార పీటతీసి వాల్చింది. తావళం బొట్టు పెట్టి - హరివేణం వుద్ధరిణ సర్దుబాటు చేశాడు. ధోవళీముడి వొదులుచేసి ఆసనశుద్ధిగా కూర్చున్నాడు స్వామిశాస్త్రి

   "ఇవ్వాళ మీ చెల్లెలు మెట్ట గోంగూర పుఠం వెట్టింది పప్పులో కలగలిపి
రవ్వంత వెన్న నాలిక్కి రాసుకుంటే మాంచి వనరుగా వుంటుంది. ఓ పట్టు పట్టరాదూ?"

   "ఆ అదొక్కటే తక్కువ. శాస్త్రులూ! కోర్టు వ్యవహారమంటే గోంగూర కాదు. ఆబ్దికాలన్నా ఆగుతాయేమోగాని కచ్చేరీలో వాయిదాలు ఆగవు"

   జడ్జిగారైతే మాత్రం చెయ్యి తిప్పకుండా యెట్లా జరుగుతుందిష? మీరు నిదానంగానే కూర్చోండి" అంటూ కామేశ్వరమ్మ వుసిరికాయంత వెన్న మారు వడ్డించి నాలుగు అన్నం మెతుకులు కప్పి మరీ వెళ్ళింది లౌక్యంగా

   "అయినా నిన్ని ఫాయిదా యోముందిలే భోజనం మీద నీకింత ప్రీతే లేకపోతే ఆనాడు చివుకులవారింటో వారమూ నిలిచేది. పది పన్నాల వేదమూ అబ్బేది!" నిట్టూర్పుగా అన్నాడు అవధాని

   "ఇప్పుడేం పోయింది లెద్దూ"

   "ముష్టి అగ్రహారం పోయింది అంతేగా"

   "కాలం వస్తే యేదీ ఆగదనుకో, తెల్లవాడికి రాజ్యంపోలా? అవధానీ! ఈ పోచుకోలు కబర్లకేంగాని గోంగూరలో నాలుగు అనపకాయ ముక్కలు పడేస్తే దాని రుచి దానిదే!గోగాకులో కాకరకాయ కూడా బాగానే పొసగుతుంది గుర్తుంచుకో!"

   "ఇవన్నీ నాకెందుకు .... ఆనక బోనెక్కి ఈ ముక్కలే జడ్జీగారికి చెప్పు"


(శ్రీరమణ పేరడీలు నుండి...)

No comments: