Monday, September 11, 2017

నారాయణ కల్పవృక్షమ్


నారాయణ కల్పవృక్షమ్




సాహితీమిత్రులారా!

(విశ్వనాథ సత్యనారాయణగారు జీవించి వుండి ఆరుద్ర గారి షష్టిపూర్తి ఉత్సవానికి సందేశం పంపివుంటే ఇట్లా వుండవచ్చు.)

    భాగవతుల శంకరశాస్త్రి. ఇది కొందరికి తెలియును, కొందరికి తెలియదు. ఆరుద్ర. ఇది మిక్కిలి బ్రసిద్ధము. ఆరుద్ర యనునది యొక నక్షత్రము. పుష్యమాసములో వచ్చెడి ఆరుద్ర నక్షత్రము శైవులకు బర్వదినము. పరమేశ్వరుడు కైలాసము నుండి దిగి వచ్చునని వారి నమ్మిక. ఆ రోజు ద్వారదర్శనము చేయుదురు. కొందరు కొన్ని పేర్లు ధరించుటచే అవి ఖ్యాతి బడయును. కొందరు వాసికెక్కిన బేర్లు ధరించి ఖ్యాతి గడింతురు. మా ప్రాంతములో విశ్వనాథ నాగభూషణమని యొకడున్నాడు. వాని తాత ముత్తాతలు మెట్టసేద్యములో దిట్టలు. వీనికి అదికూడ అబ్బినది కాదు. జులాయిగా తిరుగుచుండెడివాడు. అయినను ఇంటిపేరుచే గొంత ప్రాచుర్యము పొందినాడు. ఫలానా నాగభూషణము మీ దాయాదియా అని పలువురు నన్ను ప్రశ్నించుచుండెడివారు. అతడు మా శాఖవాడు కూడ కాదని నేను నిజము చెప్పెడివాడను. కొందరికి యిట్టి వరములు అయాచితముగా లభించును.

    ఆరుద్ర అభ్యుదయవాదినని చెప్పుకొనును. కాదనుటకు నావద్ద నిదర్శనములు లేవు. అయినచో అయివుండవచ్చును. కాకపోయినచో మాత్రము ప్రమాదమేమి? ఇతను గడ్డము పెంచును. ఆనాడు జులపాలు పెంచుటను భావకవులు ఆచారము జేసిరి. నేను ఏ వాదమునకూ జెందను. నావాదము నాది. నచ్చినవారికి యది వేదము, లేనివారికి లేదు. వారికి జుత్తు బెంచుట అవశ్యకమని తోచినది. కవియైనవాడు మేధను బెంచుకొనుట ముఖ్యమని నాకుదోచును. ఏది ముఖ్యమో ప్రాజ్ఞులు గ్రహింతురు గాక.

    త్వమేవహమ్... అని యొకటి వ్రాసినాడు. సినావాలి యని మరొకటి వ్రాసినాడు. ఇవి సంస్కృతకావ్యములు గావు. పచ్చి ఆధునిక వచన కవితల కూర్పు పచ్చియనిన జ్ఞాపకము వచ్చును. ఆరుద్ర పైలాపచ్చీసు యని కూడ ఒకటి రచించినాడు. ఈతడు రైలుబండిని మానవ జీవితమునకు ముడిపెట్టి ఒక కవిత అల్లినాడు. అందు జీవుని వేదన కొంత స్ఫురించును. భావకవితయునూ వున్నది. ఓ కూనలమ్మ యను మకుటములో బద్యములు గిలికినాడు. అవి మిక్కిలి చమత్కారముగా నుండును. అసలు చమత్కారమే యితని మతమని తోచును. ఒక చోట నేనితనికి గురుతుల్యుడనని బేర్కొన్నాడు. నా రచనలు గొన్నింటిని చదివి, యెట్లు వ్రాయకూడదో తెలిసికొంటినని చమత్కరించినాడు. ఏమైననేమి?  ఆ "ఎఱుక" యేదో నా వల్లనే కలిగినది కదా అజ్ఞానము తొలగించిన వాడు గురువు, సముద్రమున ఆణిముత్యములు ఉండును. నత్తగవ్వలు ఉండును. వారి వారి బ్రాప్తము ననుసరించియు, వారి వారి పూర్వజన్మ సుకృతమును బట్టియు అవి లభించును అతని "ఊహ" యట్లున్నది. అతని కదియే ప్రాప్తమని భావింతును.

    ఆరుద్ర పరిశోధకుడు, అని కొందరు చెప్పగా వినియుంటిని. నాలుగు దశాబ్దములుగా చెన్నపట్టణములో నివాసము యుంటూ తెనుగు సాహిత్యము, తెను జీవనము ఇత్యాది అంశములపై నితడు మిక్కిలిగా వ్యాసములు వెలువరించినాడు. జైనము గురించి ఇతనికి గొంత తెలియును.

    ప్రస్తుతాంశము షష్ట్యబ్దిపూర్తి అరువది సంవత్సరములు నిండుట యీ వేడుక అయినచో ఆరుద్రకు అరువది నిండినవా లేదు. భాగవతుల శంకరశాస్త్రికి అరువది నిండియుండవచ్చును. ఆరుద్ర పుట్టినది తరువాతగదా మరి ఆరుద్రకు అరువది యెక్కడివి కనుక యీ షష్ట్యబ్ది పూర్తి భాగవతుల శంకరశాైస్త్రికే గాని ఆరుద్రకు కాదు, ఔను. ఇది యొక చమత్కారము.

(ఆరుద్ర షష్టిపూర్తి సందర్భముగా ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసినది. తర్వాత ఉత్సవ నిర్వాహకులు అభినందన సంచిక వేస్తుంటే శ్రీరమణ పేరడీ వుండితీరాలి అని ఆరుద్ర గారే చెప్పారట. ఈ సావనీర్ కి శ్రీ బి.యన్.ఆర్.కృష్ణ, బెజవాడ గోపాలరెడ్డి గారలు సంపాదక్వం వహించారు.)

(శ్రీరమణ పేరడీల నుండి...)

No comments: