Sunday, July 3, 2016

నీ కుల్కుఁ జెండ్లేవి పైకమ్ముఁ దప్పించు


నీ కుల్కుఁ జెండ్లేవి పైకమ్ముఁ దప్పించు


సాహితీమిత్రులారా!

మన సాహిత్యంలో పుష్పలావికలతోటి మాటలు
బహుచమత్కారంగా ఉంటాయి.
అలాంటిది ఒక సన్నివేశం........

నెత్తమ్మిఁ జూచెద నీ వింత వదిలించు
నీవింత వదలక నే విధంబు?
నీ కుల్కుఁ జెండ్లేవి పైకమ్ముఁ దప్పించు
పైకమ్ము దప్పునే చేకొనంగ?
నెంత నీ కైదండ నిచ్చెదవఁటె మేలు
కైదండ యిత్తురే కర మెడలక?
భావింప రుచి యేమొ బంధుజీవం బేది?
యీ బంధు జీవనం బెందుఁగలుగు?
(ననుచు వీథుల సరసనర్మానుకూల
వచన రచనల మెలఁగుచు వఱలు విటుల
కనుగుణంబుగఁ బలుకుచు ననుదినంబు
వెలయుదురు వీటఁ బుష్పలావికలు ప్రీతి)
                                                         (బిల్హణీయము -1-39)

విటుల -  పుష్పలావికల(పూలు అమ్మేస్త్రీలు) సంభాషణ

విటుడు-  నెత్తమ్మిఁ జూచెద నీ వింత వదిలించు
              (అమ్మీ!  ఏది నీదగ్గర చాలా అందమైన తామరపువ్వు,
               బాగా వికసించిన తమ్మిపువ్వు ఉందట గదా! చూస్తాను,
               కుదిరితే కొంటాను. నువ్వు కాసింత (ఈవు+ ఇంత)వదిలించు.
               దానిమీద కప్పిన తడిపావడా తొలగించు. నీ తమ్మిపువ్వు గురించి
               అందరూ చెప్పుకుంటున్నారు. ఒక్కసారి చూపించేసి ఈ వింత కాసింతా
               వదిలించు (ఈ+వింతన్ - వదలించు)(నెత్తమ్మి అనేది నాభికి సంకేతం))
పుష్పలావిక - నీవింత వదలక నే విధంబు?
                     (అబ్బీ! నువ్వు ఏదో ఇంత సొమ్ము వదలకుండానే?
                     (నీవు + ఇంత - వదలకన్) నీ కోరిక ఏ విధంగా తీరుతుంది?
                     నా నెత్తమ్మి కొనడానికే కాదు చూడటానికీ కూడ ఒక వెల ఉంది
                     (నీవు - ఇంత -వదలకన్, పోకముడి కాసింత వదిలించకుండా
                      నాభీ సందర్శన ఏ విధంగా కుదురుతుంది))
విటుడు-  నీ కుల్కుఁ జెండ్లేవి పైకమ్ముఁ దప్పించు
              (అమ్మీ! ఏవీ నీ పూలచెండ్లు కులుకులొలికే పూలచెండ్లు. ఎక్కడ దాచావో?
              ఎవరికీ కనిపించకుండా వాటిపైని నువ్వు కప్పిన ముసుగును (పై - కమ్ము)
               తొలగిద్దూ(చెండ్లు స్తనాలకు సంకేతం))
పుష్ప-  పైకమ్ము దప్పునే చేకొనంగ?
            (అలాగే. వీటిని నువ్వు కొనాలన్నా చేకొనాలన్నా (చేతులతో పట్టుకోవడం)
             పైకమ్ము(ధనం) చెల్లించక తప్పుతుందా ?(తప్పునే))
విటుడు - నెంత నీ కైదండ నిచ్చెదవఁటె మేలు
               (ఎంత నీ కైదండ(చేతిలో ఉన్న దండ- బారెడు దండ, కౌగిలి) అమ్ముతావా?
                 అసలు (ఇచ్చెదవఁటె))
పుష్ప.- కైదండ యిత్తురే కర మెడలక?
            (నువ్వు చెయ్యి చాపకుండానే? (కరము - ఎడలక) కైదండ ఇస్తారా?
              ఎలా నాయనా! (తగినంత పన్ను - రొక్కం (కరము) చెల్లించకుండానే
               కైదండ ఇస్తారా)
విటుడు- భావింప రుచి యేమొ బంధుజీవం బేది?
              (అమ్మీ! ఆలోచించగా ఆలోచించగా నాకు ఇష్టమేనేమో? (రుచి+ఏమొ)
               ఈ మంకెనపువ్వు (బంధుజీవంబు)(నీకు బంధువుగా జీవించడం ఒక రుచి ఏమో?
               భావిచడానికే రుచిగా ఉంది సుమీ!)
పుష్ప.- యీ బంధు జీవనం బెందుఁగలుగు?
             (అవును. ఇదిగో ఇది మంకెన పువ్వే. నా దగ్గరరున్న ఈ మంకెనపువ్వు
              (బంధుజీవనంబు) ఏదీ మరింకెక్కడ దొరుకుతుంది చెప్పు ఏది - ఎందున్ - కలుగు
              (నాతో ప్రియ బంధువుగా జీవనం, ఆ రుచి ఇంకెక్కడా దొరకదు నీకు)
               (మంకెన కూడా అవయానికి సంకేతమే)


3 comments:

కంది శంకరయ్య said...

చక్కని విశ్లేషణతో మంచి పద్యాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు. ఈ పోస్టును నా ఫేసుబుక్కులో షేర్ చేశాను.

sarma said...

చిన్నప్పుడు చదువుకున్నపద్యం! బాగా గుర్తుచేశారు :)

రాజేశ్వరి నేదునూరి said...

namaskaaramulu
chaalaa baagumdi