Sunday, July 31, 2016

అన్నిటను మీకు మాకును నైక్యమమర! (అనుకరణ పద్యం)


అన్నిటను మీకు మాకును నైక్యమమర!


సాహితీమిత్రులారా!


కాశీ కృష్ణాచార్యుల 
అవధానయాత్ర - లోని
ఈ పద్యం చూడండి.

నూతనాలంకారభూతి మీకు మహీంద్ర
       నూతనాలంకారభూతి మాకు
కువలయానందంపుఁ గొల్పు మీకు మహేంద్ర
       కువలయానందంపుఁ గొల్పు మాకు
విపులార్థకోశాభివృద్ధి మీకు మహేంద్ర
       విపులార్థకోశాభివృద్ధి మాకు
అఖిలరాజకరగ్రహాశ మీకు మహేంద్ర
       అఖిలరాజరకగ్రహాశ మాకు
భూ సురేంద్రులు మీ రేమొ భూసురేంద్రు
లము సుమీ గాన నన్నింట సమతమీకు
మాకుఁ గల దౌటఁ గనుము సమత్వబుద్ధి
పండితాళిసరోజ! గద్వాలరాజ!

పై పద్యానికి అనుకరణ పద్యం
హృదయాభిరామము(1-79)లోనిది.
కథానాయకుడైన రామయతో
నాయిక సుందరి పలికిన పలుకులు
ఈ పద్యం.


పదములందను రక్తి పరిఢవిల్లును మీకు
       పదములందనురక్తి పరఁగు మాకు
అర్థ మందాసక్తి యతిశయిల్లును మీకు
      నక్థమందాసక్తి యడరు మాకు
సకలకళాశాస్త్ర వికసనంబును మీకు
       సకలకళాశాస్త్ర సరణి మాకు
సరసుల కామోదసరణి గూర్చుట మాకు
      సరసుల కామోద సరణి మాకు
సభల రంజింపఁజేయు నాసక్తి మీకు
సభల రంజింపఁజేయు నాసక్తి మాకు
అన్నిటను మీకు మాకును నైక్యమమరఁ
గడకు శయ్యావిభాగ మేర్పడఁగనగునె
      

విభవ స్తోమా బహుప్రాభవా!


విభవ స్తోమా బహుప్రాభవా!


సాహితీమిత్రులారా!

- వర్గాక్షరాలు అంటే ప,ఫ,బ,భ,మ - మరియు
అంతస్థానాలలో- , అచ్చుల్లో - ఉ,ఊ - మరియు
కంఠోష్ట్యాలు - ఒ,ఓ,ఔ - లు వీటిని ఓష్ఠ్యాలు అంటాము.
వీటితో కూర్చబడే పద్యాన్ని లేదే శ్లోకాన్ని (స + ఓష్ఠ్యం) సోష్ఠ్యం అంటాము.
ఇవి కేవలం పెదిమలతో మాత్రమే పలుకబడతాయి.
కాణాదం పెద్దన సోమయాజి గారి ఆధ్యాత్మరామాయణ
అరణ్యకాండలోని 431వ పద్యం ఇది చూడండి.

భూమాప్రేమ సుభావ గోపయువ సుభ్రూ విభ్రమా విద్భవ
వ్యామోహారు విభావ భావ భవ భావ ప్రాప్త భానూద్భవా
భూమీ పార్శ్వ భవద్రుమ ప్రభ శుభాంభో భృద్విభావైభవా
సోమక్ష్మాప వరోపభావ్య విభవ స్తోమా బహుప్రాభవా!

ఈ పద్యంలో పైన మనం చెప్పుకున్న వాటినుండే
కూర్చబడినదిగా గమనించగలము.
దీనిలో , - అనే హల్లులు ఓష్ఠ్యాలు కాదు
కాని వాటికి చేరిన అచ్చులు ఓష్ఠ్యాలుగా గమనించాలి.

Saturday, July 30, 2016

పాలనేతిగవాంప్రియమ్


పాలనేతిగవాంప్రియమ్


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి చమత్కారం గమనించండి.

అంబలిద్వేషిణం వందే చింతకాయశుభప్రదమ్ 
                               (ఊరుపిండీ కృతాసురం)   - పాఠాంతరం
కూరగాయకృతత్రాసం పాలనేతిగవాంప్రియమ్

ఈ శ్లోకంలో 
అంబలి- చింతకాయ - కూరగాయ - పాలనేతిఊరుపిండీ -అనే పదాలు
చూడగానే మన తెలుగు పదాలనిపిస్తాయి.
కాని కాదు
అందుకే దీన్ని ఆంధ్రభాషాభాసం అనే భాషాచిత్రంగా చెబుతారు.
మరి దీని అర్థం చూద్దాం-

బలిద్వేషిణం - బలిని ద్వేషించిన, అం - విష్ణువును,
వందే - నమస్కరిస్తాను,
చింతకాయ - తనను ధ్యానించువారికి, శుభప్రదమ్ - శుభములు ఇచ్చువాడు,
(ఊరు - తొడలపై, పిండీకృత - నాశనం చేయబడిన, అసురం - మధుకైటభ -
హిరణ్యకశ్యప మొదలైన రాక్షసులు కలవాడు)
కు - ఉరగాయ - చెడ్డ సర్పమునకు (కాళీయునికి),
కృతత్రాస - భయము కలిగించిన, గవాం పాలనే - గోరక్షణలో,
అతిప్రియం - ఎక్కువ మక్కువ ఉన్నవాడు.

మరి ఇవి తెలుగుపదాలు కాదని తెలిసిందికదా!

కో విదో నిధి రాఖ్యాత:


కో విదో నిధి రాఖ్యాత:


సాహితీమిత్రులారా!

ఈ క్రింది శ్లోకంలోని ప్రశ్నలకు ప్రశ్నానుగుణమైన ఉత్తరాన్నివ్వండి.

కో విదో నిధి రాఖ్యాత: కో పకృష్టో భవేత్ పుమాన్
ఇతి ప్రశ్నే2నురూపం యత్ ఉత్తరం తదుదీర్యతామ్

ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నవి.
1. క: విద: నిధి: ఆఖ్యాత:? 
   ఎవడు జ్ఞానమునకు నిధిగా చెప్పబడును?
    - కోవిద: (పండితుడు)

2. క: పుమాన్ అపకృష్ట: భవేత్? 
    ఎవడు నీచ పురుషుడగును?
    - కోపకృష్ణ (కోపా విష్ణుడు)

దీనిలో ప్రశ్నకంటే సమాధానమే
మనకు అగుపడుచున్నది.

1వ పాదము మొదటిలోనే కోవిద:
2వ పాదముమొదటిలోనే కోపకృష్ట అని కనబడుతున్నవి.

Friday, July 29, 2016

నాగరిక: కిం మిలిత:


నాగరిక: కిం మిలిత:


సాహితీమిత్రులారా!

సమానమైన విశేషణము ద్వారా వినేవారికి వేరొకటిగా అనిపింపజేసి
తర్వాత యదార్థ విషయాన్ని చెప్పడాన్ని అపహ్నుతి అంటారు.
అలాంటివి సంవాద చిత్రంలో చూడండి.

సీత్కారం శిక్షయతి వ్రణయ త్యధరం తనోతి రోమాంచమ్
నాగరిక: కిం మిలిత: - నహి నహి సఖి హైమన: పవన:

ఒక నాయిక తన సఖితో చెబుతున్నది. నాయికా- సఖి సంభాషణ-

నాయిక - సీత్కారం శిక్షయతి
              సీత్కారం కలిగించును
              అధరం ప్రణయతి
              క్రింది పెదవిని గాయపరచును.
(భ్రమపడిన)
సఖి - కిం నాగరిక: మిలిత:?
          ఎవడైన విలాస పురుషుడు లభించెనా?
నాయిక - నహి! నహి! హైమన: పవన:
               కాదు! కాదు! చలిగాలి సుమా!

తనకు సీత్కారం, అధర వ్రణం నాయకునివలన కలిగినదని
తన మాటలవలన భ్రమపడిన సఖికి
యదార్థము చెప్పి భ్రమను నివారించింది.
సీత్కారము పెదవిగాయము నాయకునివలన కలిగినట్లు
చలిగాలివలన కూడ పెదవులు గాయంకావడం బాధ పడటం సహజమేకదా!

(సీత్కారము = చలి మొదలయిన వాటివలన బాధచే  కలిగే ధ్వని విశేషము.)

క: పరత్రైతి పూజ్యతామ్


క: పరత్రైతి పూజ్యతామ్


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం గమనించండి.
దీనిలోనే ప్రశ్న - ఉత్తరం రెండూ ఉన్నాయి
కావున దీన్ని ప్రశ్నోత్తర చిత్రం అంటారు.

క: కుర్యా ద్భువనం క స్సమున్మూలయే ద్ద్రుమాన్
కిం ప్రతీకే భవే న్మపఖ్యంమం క: పరత్రైతి పూజ్యతామ్

దీనిలో నాలుగు ప్రశ్నలు
వాటికి సమాధానాలు ఉన్నాయి.
గమనించండి.

1. సర్వం భువనం క: కుర్యాత్ ?
   సమస్త ప్రపంచాన్ని ఎవడు సృజించును?
   - క: (బ్రహ్మ)
2. క: ద్రుమాన్ సమున్మూలయేత్ ?
    ఎవడు వృక్షములను పెకలించును?  
    - క: (వాయువు)
3. కిం ప్రతీకే ముఖ్యం భవేత్ ?
   ఏది గాత్రమునందు ప్రధానమగును?
   - కిమ్ (శిరస్సు)
4. క: పరత్ర పూజ్యతామ్ ఏతి?
   ఎవడు పరలోకమున సత్కారము నందును?
   - క: (రాజు)
సమాధానాలైన
క: - క: - కిమ్ - క: - అనేవి
పాదముల మొదటిలోనే ఉన్నవి.

Thursday, July 28, 2016

వారణానామయమేవకాలో


వారణానామయమేవకాలో


సాహితీమిత్రులారా!

శ్ల్లోకంలోని నాలుగుపాదాలు ఒకేరకంగా
ఉంటే దాన్ని ఏకపాది అంటారు.
దీన్నే చతుర్వ్యవసితయమకము,
మహాయమకము అనికూడ అంటారు.

నాట్యశాస్త్రంలోని ఈ శ్లోకం చూడండి.

వారణానామయమేవకాలో, వారణానామయమేవకాల:
వారణానామయమేవకాలో, వారణానామయమేవకాల:

(ఇది వారణపుష్పములు వికసించుటకు తగిన కాలము.
ఇది ఏనుగులు విజృంభించుటకు తగిన కాలము.
ఇది శత్రువులకు అనుకూలమైన కాలము.
ఇది యుద్ధములకు అనుకూలమైన కాలము.)

లంకేశ సంపూజిత పాదపద్మ:


లంకేశ సంపూజిత పాదపద్మ:


సాహితీమిత్రులారా!


చ్యుతచిత్రంలో
మాత్రాచ్యుతకము,
బిందుచ్యుతకము,
అక్షరచ్యుతకము ఇలా అనేక రకాలు ఉన్నాయి.
వాటిలో ఇక్కడ అక్షరచ్యుతక శ్లోకం చూడండి.

చ్యుతము అంటే తొలగించటం.
అక్షరచ్యుతకం అంటే అక్షరాన్ని తొలగించటం.

గవీశపత్రో నగజార్తిహారీ
కుమారతాత: శశిఖండమౌళి:
లంకేశసంపూజితపాదపద్మ:
పాయా దపాయాత్ పరమేశ్వరో వ:

గవీశపత్ర: = నందీకేశ్వరుడు వాహనముగా గలవాడు,
నగజార్తిహారీ = పార్వతీదేవి సంతాపమును  తొలగించినవాడు,
కుమారతాత: = కుమారస్వామి తండ్రి,
శశిఖండమౌళి: = చంద్రమౌళి,
లంకేశ సంపూజిత పాదపద్మ:
= రావణాసురునిచే పూజింపబడిన
పాదపద్మలు
పరమేశ్వర: - శివుడు,
: - మిమ్ములను,
అపాయాత్ - ఆపత్తునుండి,
పాయాత్ - రక్షించుగాక.

ఈ శ్లోకంలోని విశేషణ విశేష్యపదాలలో మొదటి అక్షరాన్ని
చ్యుతం(తొలగిం)చేస్తే ఇందాక చూచిన శివపరమైన అర్థం తొలగి
విష్ణుపరమైన అర్థం వస్తుంది.

గవీశపత్ర: లో - తొలగిస్తే వీశపత్ర: =(వి - ఈశ:) గరుడవాహనుడు,
నగజార్తిహారీ లో తొలగిస్తే గజార్తిహారీ = గజేంద్రుని బాధను తొలగించినవాడు,
కుమారతాత: లో కు తొలగించిన మారతాత: = మన్మథుని తండ్రి,
శశిఖండమౌళి: లో - తొలగిస్తే శిఖండమౌళి: = నెమలి పురి శిరోభూషణముగా గలవాడు, లంకేశసంపూజితపాదపద్మ: (క: - ఈశ:)=బ్రహ్మరుద్రులచే
 పూజింపబడిన చరణ సరోజములు గలవాడు,
పరమేశ: - లో - తొలగించిన రమేశ: = రమాపతి అయిన విష్ణువు,
 వ:  అపాయాత్ పాయాత్ = మిమ్ములను అపాయమునుండి పాలించుగాత!
 అని అర్థం వస్తుంది.

Wednesday, July 27, 2016

అపభ్రంశ శ్లోకం


అపభ్రంశ శ్లోకం


సాహితీమిత్రులారా!

కవిత్వంలోని సాంప్రదాయాలు,
కవిసమయాలను గుర్తించి రచనలు చేయాలి
అలా చేయకపోతే ఏలా ఉంటుందో!
ఈ కవి చమత్కరిస్తూ చెప్పిన
శ్లోకం ఇది చూడండి.

అస్థివత్ బకవచ్చైవ
చల్లవత్ తెల్లకుక్కవత్
రాజతే భోజ తే కీర్తి
పునస్సన్యాసిదంతవత్

(ఓ భోజమహారాజా!  నీ కీర్తి ఎముకలలా, కొంగలా,
మజ్జిగలా, తెల్లకుక్కలా, మళ్ళీ మాట్లాడితే సన్యాసి
పండ్లలా రాజిల్లుతున్నది - అని భావం.)

దీనిలోని ఉపమానాలన్నీ  హీనోపమానాలే.
ఇటువంటివి వాడకూడదు.
స్త్రీ ముఖం గుండ్రంగా ఉంటే చంద్రబింబంతో పాల్చాలికాని
బండి చక్రంతో పోల్చకూడదుకదా!
అనటానికి ఉదాహరణగా ఈ శ్లోకం చెప్పుకోవచ్చు.

ఆ విషయాలను పక్కనపెడితే
ఇందులోని పదాలు చాలావరకు
మన తెలుగు పదాల్లా ఉన్నాయి.
కావున ఇది భాషాచిత్రంగా చెప్పవచ్చు.

రామపాదగతాభాసా


రామపాదగతాభాసా


సాహితీమిత్రులారా!

అనులోమ ప్రతిలోమపాదము అని
మునుపు తెలుసుకొని ఉన్నాము.
ఇక్కడ మరొకటి.
ఒక పాదం మొదటినుండి చివరకు
చదివితే అది అనులోమము.
దాన్నే చివరినుండి మొదటికి
చదివితే అది ప్రతిలోమమం.
ఏలా చదివినా మారకుండా
అలాగే ఉండటం చేత దీన్ని
అనులోమ ప్రతిలోమపాదం అంటారు.
వేదాంతదేశికులవారి
పాదుకాసహస్రంలోని
ఈ శ్లోకం చూడండి.

రామపాదగతాభాసా
సాభాతాగదపామరా
కాదుపానఞ్చకాసహ్యా
హ్యాసకాఞ్చనపాదుకా
                        (పాదుకాసహస్రము -919)


(శ్రీరాముని పాదాలను ఆశ్రయించిన బంగారు
పాదుక స్వీయకాంతితో మిక్కిలి ప్రకాశించేది.
దేవతలను వారి విరోధుల వల్ల కలిగే
మానసిక వ్యాధులనుంచి రక్షించేది.
పాదుకలను ఉపాసిస్తూ జ్ఞానానుష్ఠానాలు
లేని పామరజనులకు వ్యాధులు రాకుండా సుఖాన్ని కలిగించేది.
చతుర్ముఖ బ్రహ్మచేత, ఆరాధించబడే శ్రీరంగనాథుడు
సూర్యవంశస్థుడైన ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించడం వల్ల
పాదుకలు అయోధ్యకు చేరుకొన్నది.
అయోధ్యలో సూర్యునికన్నా
ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ ఉండింది.)

ఈ శ్లోకంలోని మొదటి పాదాన్ని
చివరనుండి మొదటికి చదివిన
2వ పాదము వస్తుంది.
అలాగే 3వ పాదం చివరనుండి చదివిన
4వ పాదం వస్తుంది.
కావున ఇది అనులోమ ప్రతిలోమపాదశ్లోకం 
అనబడుచున్నది.

Tuesday, July 26, 2016

రాక రాక వచ్చు రామచంద్రుని జూడ


రాక రాక వచ్చు రామచంద్రుని జూడ


సాహితీమిత్రులారా!


ద్విపాది అనగా పద్యంలోని నాలుగు పాదాలలో 1,2 పాదాలు ఒకటిగా,
3,4 పాదాలు ఒకటిగా ఉండడంగాని,
1,3 పాదాలు ఒకటిగా(ఒకేలా) ఉండి, 2,4 పాదాలు ఒకటిగా ఉండవచ్చు.
 అలాంటి వాడిని ద్విపాది అంటారు.
కాణాదం పెద్దన సోమయాజి 18వ శతాబ్దంలో గద్వాల,
సురపురం సంస్థానాల్లో కవిగా ఉండినవాడు.
ఈయన ఆధ్యాత్మరామాయణంలోని
ఈ ద్విపాది పద్యం చూడండి.

రాక రాక వచ్చు రామచంద్రుని జూడ
సంతసించి రచటి జనము లెల్ల
రాక రాక వచ్చు రామచంద్రుని జూడ
సంతసించి రచటి జనము లెల్ల

వనవాసం తరువాత రామచంద్రుడు
అయోధ్యకు వచ్చిన సందర్భములో
ఈ పద్యం ఉంది.
రాక - పున్నమి,
రాక రాక వచ్చు -  పున్నమ పున్నముకూ వచ్చే,
రామ - అందమైన,
చంద్రుని చూడ - చందమామను చూడగా,
సంతసించునట్లు జనులెల్ల,
రాక రాకవచ్చు - చాలాకాలం రాకుండావుండి వచ్చిన,
రామచంద్రుని చూడ - శ్రీరామచంద్రుణ్ణి చూడగానే,
సంతోషించారు అక్కడి జనమంతా - అని భావం.

జితానఙ్గ తవాఙ్గనా:


జితానఙ్గ తవాఙ్గనా:


సాహితీమిత్రులారా!


వృత్త్యనుప్రాసలోని సంకరానుప్రాసలలో
మాత్సీ, మాగధీ అనేవాటిని గురించి తెలుసుకొని ఉన్నాము.
ఇపుడు మూడవదైన తామ్రలిప్తికా గురించి తెలుసుకుందాము.

వర్గాక్షరములు తమ అనునాసికములతో
సంయుక్తములై అనుప్రాసఘటకములైన
దానిని తామ్రలిప్తికా వృత్త్యనుప్రాసము అంటాము.

శిఞ్జాన మఞ్జు మఞ్జీరా శ్చారు కాఞ్చయ:
కఙ్కణాఙ్కభుజా భాన్తి జితానఙ్గ తవాఙ్గనా:

                                            (సరస్వతీకంఠాభరణము -2- 187)

(ఓ జితమన్మథా!
నీ ప్రియురాండ్రు చక్కని సవ్వడులుగల మంజీరాలను కలిగి,
మనోహరములయిన బంగారు మొలనూళ్ళను కలిగి,
కంకణములుగల బాహువులను కలిగి ప్రకాశించుచున్నారు.)

 ఏ వర్గాక్షరాలకు ఆ వర్గ అనునాసికములతో కలిసి
అనుప్రాసఘటకములైన దానిని తామ్రలిప్తికా  అంటాము.

ఈ శ్లోకంలో మొదటి భాగము - వర్గము,
రెండవ భాగము - వర్గము ఆక్రమించాయి
అలాగే వాటి అనునాసికములతో కూడి ఉన్నవి.
మొదటి పాదములో
- వర్గములోని - ఆ వర్గనునాసికము తో కలిసి మూడు మార్లు,
- తో కలిసి - రెండుమార్లు ప్రయుక్తమైనాయి.
అలాగే రెండవ భాగంలో - తో కలిసి రావడం జరిగింది.

తెలుగులో అనఙ్గ - ను అనంగ అని, అఙ్గన -నను అంగన అని
శిఙ్జాన-నను శింజాన అని, కఙ్కణ -నను కంకణ అని రాయడం పరిపాటి అయినది.

కావున
పూర్ణబిందు పూర్వకములయిన వర్గాక్షరములు అనుప్రాసఘటకములైన
దానిని తామ్రలిప్తికా వృత్త్యనుప్రాసముగా చెప్పవచ్చును.

Monday, July 25, 2016

హృదయమపి తే చండి కఠినమ్!


హృదయమపి తే చండి కఠినమ్!


సాహితీమిత్రులారా!

బాణభట్టు, మయూరభట్టు ఇద్దరు బంధువులని ప్రతీతి.
బాణునికి మయూరకవి బావమరిది.
ఒకరోజు మయూరుడు తన ఇంటికి ఆలస్యంగా వెళ్ళడంతో
ఆయన భార్య కోపించి తలుపు తీయకుండా బయటే నిలబెట్టిందట.
రాత్రంతా బయట పడిగాడ్పులు కాచిన మయూరుడు
తెల్లవారు జామున తలుపు తీయమని భార్యను
బ్రతిమాలుతూ........
ఈ శ్లోకం చెప్పడం మొదలు పెట్టాడు.

గతప్రాయా రాత్రి: కృశమపి శశి శీర్ణత ఇవ
ప్రదీపో2యం నిద్రావశముపగత: ఘూర్ణత ఇవ
ప్రణామాంతో మానస్తదపి న జహాసి కృధమహో...

(రాత్రి దాదాపు గడిచి పోయింది,
చంద్రుడు కూడా తేజస్సు కోల్పోయాడు.
దీపం కూడా నిద్రపోతున్న మనిషిలాగా తూగుతూంది.
ఎంత వేడుకున్నా నీ కోపం వీడకున్నావు..............)


అప్పుడే ఆ దారిన పోతున్న
బాణభట్టు ఈ క్రింది విధంగా పూరించాడు.

కుచ - ప్రత్యాసత్యా హృదయమపి తే చండి కఠినమ్
(ఓ చండికా! నీ (కఠిన) ఉరోజాలకు అతి సమీపంలో ఉండటం


వల్లనే నేమో నీ హృదయం కూడా ఇంత కఠినంగా ఉంది.)

సీమంతినీషు కా శాంతా?


సీమంతినీషు కా శాంతా?


సాహితీమిత్రులారా!

ప్రహేళికలలో ఇది ఒకరకమైనది. చూడండి.

సీమంతినీషు కా శాంతా? 
రాజా కో2భూత్ గుణోత్తమ:?
విద్వద్భి: కా సదావంద్యా ?
అత్రైవోకం న బుధ్యతే

దీనిలో మూడు పాదాలలో మూడు ప్రశ్నలు ఉన్నాయి.
వీటి జవాబులు ఇందులోనే ఉన్నాయి.
కానీ అంతసులువుగా తెలుసుకోలేరు.
తెలిస్తే ఇంతేనా అనిపిస్తుంది.
చూద్దాం.
ఇందులోని ప్రతిపాదం నందలి
మొదటి చివరి అక్షరాలను
కలిపిన సమాధానమౌతుంది.

1. సీమంతినీషు కా శాంతా?  
    స్త్రీలలో శాంతమూర్తి ఎవరు?
   మొదటి అక్షరం - సీ, చివరి అక్షరం - తా
   రెండు కలిపితే - సీతా(జానకి)

2. రాజా కో2భూత్ గుణోత్తమ:?
    సద్గుణములచే ఉత్తముడైన రాజెవరు?
   మొదటి అక్షరం - రా , చివరి అక్షరం - మ:
   రెంటిని కలిపిన - రామ: (శ్రీరాముడు)

3. విద్వద్భి: కా సదావంద్యా ?
    విద్వాంసులచే ఏది ఎల్లపుడు గౌరవింపదగినది?
    మొదటి అక్షరం - వి, చివరి అక్షరం - ద్యా
    రెంటిని కలిపిన - విద్యా (చదువు)

ప్రశ్నలోనే సమాధానం ఉన్నందున
ఇది ప్రశ్నోత్తరచిత్రం కూడా అవుతుంది.

Sunday, July 24, 2016

మాంగల్యం తంతునానేన.......


మాంగల్యం తంతునానేన.......


సాహితీమిత్రులారా!

నడిమింటి మంగళేశ్వరశాస్త్రిగారు
వారి ఊరిలో
ఒక వివాహముహూర్తము జరుగు
నపుడు తాంబూలమునకై వెళ్ళెను.
మంగళసూత్రధారణ సమయంలో
పురోహితుడు

"మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరాదాం శతమ్"

 అని చదివాడు.
దానికి మంగళేశ్వరశాస్త్రిగారు పక్కకు తిరిగి
అక్కడ ఉన్నవారితో
మీ కీశ్లోకం అర్థం తెలిసినదా? అని అడిగాడట.
అదేదో కొంటె సమాధానం ఉంటుందని
అక్కడి వారంతా తెలియదు మీరు చెప్పండని అడిగారట.
దానికి ఆయన అర్థం-

మాంగల్యం తంతు - న = ఇది మాంగల్య తంతుకాదు. 
(నేను ముసలి ముండ కొడుకును. చాలా పెళ్ళిళ్లు నాకు జరిగాయి 
ఇంకెక్కడి మాంగల్యం - అని భావం.) 
మమ - జీవనహేతు. న (న) =   దీనిచే నాబ్రతుకు దెరువు చెడింది. 
(రెండెకరాలో, మూడెకరాలో తెగనమ్మి కన్యాశల్కం క్రింద ఇచ్చి ఉన్న 
ఉపాధి పోయింది - అని భావం) 
కంఠే - బద్నామి = నీ కుత్తుకకు తాడు కట్టుచున్నాను. 
(నా వల్ల నీకు సౌఖ్యంలేదు సరికదా 
ఇదొక నిర్భంధం కూడా నీకు కల్గుతుంది- అని భావం.) 
సుభగే = ఓ సుభగురాలా!, 
త్వం = నీవు (సుభగురాలువు గనుక), 
శరదాం శతమ్ = నూరేండ్లు, 
జీవ = జీవించు.
- అని అర్థం చెప్పాడట.

ఆద్యంతమాది మధ్యమ వర్ణములలోన.......


ఆద్యంతమాది మధ్యమ వర్ణములలోన.......


సాహితీమిత్రులారా!

పొడుపు పద్యాలలో మరో విధం చూడండి.
సమాధానాలు ఊహించగలరేమో?
ఆలోచించండి.


ఆద్యంతి మాదిమధ్యమ వర్ణములలోన
      జోడును, సుదయును గూడవలయు
ఆద్యంతి మాదిమధ్యమ వర్ణములలోన
      నదియు, ఖడ్గంబును బొదలవలయు,
ఆద్యంతి మాదిమధ్యమ వర్ణములలోన
      రూపంబు, ధూపంబు దోపవలయు,
ఆద్యంతి మాదిమధ్యమ వర్ణములలోన
      ఎల్ల, విషంబు రంజిల్ల వలయు
అన్నిటికిగూడ మూడేసి యక్షరములు
మరియు, నా యుత్తరములే క్రమంబుగాను
కుంభమును, నిసుకయును, వకుళము, సాము
గావలె సుమండి! ధీరాగ్ర గణ్యులార!

షరతులు -
1. సమాధానాలన్నీ మూడక్షరాలలోనే ఉండాలి.
2. మొదటి, చివరి అక్షరాలను కలిపిన ఒక అర్థం,
    మొదటి, మధ్య అక్షరాలను కలిపిన ఒక అర్థం,
    మూడక్షరాలకు ఇంకో అర్థం రావాలి.
3. సమాధానాలు వరుసగా కుంభము, ఇసుక, వకుళము, సాము -
    అనే అర్థాలను ఇవ్వాలి.

చూశారు కదా!
ఆలోచించండి.

1. మొదటి పాదానికి సమాధానం - కడవ
   (మొదటి, చివరి అక్షరాలను కలపగా - కవ (- జంట, జోడు)
    మొదటి, మధ్య అక్షరాలను కలపగా - కడ (- చివర, సుద)
    మొత్తం సమాధానాము - కడవ (కుండ, కుంభం))
2. రెండవ పాదం సమాధానం - వాలుక 
   ( వాక - నది, 
     వాలు - కత్తి, 
     వాలుక - ఇసుక)
3. మూడవ పాదం సమాధానం - పొగడ
   (పొడ - రూపు, గుర్తు, 
    పొగ - ధూమము, ఆవిరి, 
    పొగడ - వకుళ వృక్షం)
4. నాలుగవ పాదం సమాధానం - గరిడి
   (గడి - ఎల్ల, మేర. 
     గరి - పాము(గరము(విషము)కలది)
     గరిడి - సాము)

Saturday, July 23, 2016

మీ మాటలు మంత్రంబులు (పేరడీ)


మీ మాటలు మంత్రంబులు (పేరడీ)


సాహితీమిత్రులారా!

మనుచరిత్రలో ప్రవరుడు సిద్ధునితో అన్న పద్యం

మీ మాటలు మంత్రంబులు
మీ మెట్టినయెడ ప్రయాగ, మీపాదపవి
త్రామతోయము లలఘు
ద్యోమార్గఝురాంబుపౌనరుక్త్యము లుర్విన్
               (మనుచరిత్ర 1-62)

దీనికి పేరడీగా దుర్మార్గ చరిత్రమును
విష్ణుభొట్ల సుబ్రహ్మణ్యేశ్వర కవి
క్రింది పద్యం వ్రాశారు


మీ మాటలు శూలంబులు
మీ మెట్టినయెడ శ్మశానమేదిని మీ అం
ఘ్ర్యామల తోయములు కిటి
స్తోమేడిత కర్దమములు శుంఠాధ్యక్షా!

(కిటి - పంది, స్తోమము - సమూహము,
ఈడిత - పొగడబడిన, కర్దమము - అడుసు, బురద)

ఏమి ప్రయోజనము?


ఏమి ప్రయోజనము?


సాహితీమిత్రులారా!

రాధ కృష్ణుని వెదకుచున్నది
బృందావనంలో
సఖితోటి.
వారి ఇరువురి సంభాషణ
ఈ శ్లోకం చూడండి.

కుందకుంజ మముం పశ్య సరసీరుహలోచనే
అమునా కుందకుంజేన సఖి! కిం ప్రయోజనమ్?

సఖి -  కుందకుంజ మముం పశ్య సరసీరుహలోచనే
           ఓ సరసీరుహలోచనా! రాధా! ఈ మొల్ల పొదను చూడు!

రాధ -   అమునా కుందకుంజేన సఖి! కిం ప్రయోజనమ్?
            చెలీ! మొల్ల పొదను చూచినందువల్ల లాభమేమి?

ఈ శ్లోకంలో అమునా అనే పదం చమత్కారంగా ప్రయోగించారు.
అమునా అంటే ము - కారము లేని
కుందకుంజములతో అనగా
ముకుందుడు(కృష్ణుడు) లేని
పొదరింటితో లాభమేమి అని తాత్పర్యం.

Friday, July 22, 2016

పంచ భర్త్రీ న పాంచాలీ!


పంచ భర్త్రీ న పాంచాలీ!


సాహితీమిత్రులారా!

ఈ ప్రహేలిక గమనించి
సమాధానం ఊహించండి.

కృష్ణ ముఖీ న మార్జారీ ద్విజిహ్వాన చ సర్పిణీ
పంచ భర్త్రీ న పాంచాలీ యో జానాతి న పండిత:

మోము నల్లగా ఉంటుంది కాని పిల్లి కాదు
రెండు నాలుకలుంటాయి కాని పాము కాదు
పంచ భర్త్రియే కాని ద్రౌపది కాదు
దీన్ని ఎరిగినవాడే పండితుడు

సమాధానం - కలము(లేఖిని)

ఎవరిలోకం వారిదే!


ఎవరిలోకం వారిదే!


సాహితీమిత్రులారా!

ఒకడు తన గాడిదను కంబళిని పోగొట్టుకొని అడవిలో వెతుకుతున్నాడు.
ఆ వనంలో ఒక వనచరుడు తన నగ్నమైన ప్రియురాని అంగము చూస్తూ
ఆనందం ప్రటిస్తున్నాడు.
ప్రియురాలు - వనచరుడు- గాడిద పోయినవాడు -
వీరి మధ్య సంభాణ ఈ శ్లోకం చూడండి.

కింకిం పశ్యసి? - తే యోనౌ త్రైలోక్యమిహ తిష్ఠతి!
పశ్యపశ్య విశాలాక్ష! గర్దభం మమ కంబళమ్


ప్రియురాలు - కింకిం పశ్యసి?
                     ఏమిటి పరిశీలనగా చూచుచున్నావు?
ప్రియుడు -     తే యోనౌ త్రైలోక్యమిహ తిష్ఠతి!
                    నీ యోనిలో ముల్లోకములూ కనిపిస్తున్నాయి.
గాడిదపోయినవాడు - పశ్య పశ్య విశాలాక్ష! గర్దభం మమ కంబళమ్
                                ఓ విశాలనేత్రుడా! చూడుచూడు......
                                నా గాడిద, కంబళి ఉన్నాయేమో చూడు.

Thursday, July 21, 2016

వీపున దూసెనటంచు చూచితిన్


వీపున దూసెనటంచు చూచితిన్


సాహితీమిత్రులారా!

కూచిమంచి తిమ్మకవి రసికజనమనోరంజనము చదివి
ఒక వేశ్య ఆయనను అమితంగా అభిమానించినది.
ఆయన ఒకానొక రోజు ఆ వీధి వెంట వెళుతూండగా గమనించిన ఆమె
ఆయనను అమాంతముగా కౌగిలించుకొన్నది.
ఆయనా పరమ నైష్టికుడాయె వెంటనే ముఖాన్ని వెనక్కు త్రిప్పుకున్నాడట.
అంతలో ఆమె ఈ విధంగా అడిగిందట.

చతురులలోన నీవు కడు జావటంచును నెంచి కౌగిలిం
చితి నిటు మారుమోమిడగ చెల్లునె యో రసికాగ్రగణ్య

దానికి తిమ్మకవిగారు 
ఈ విధంగా ప్రత్యుత్తరమిచ్చారట.
                                                                                   
ద్భుతమగునట్టి బంగరపు బొంగరపుంగవబోలు నీ కుచ
ద్వితయము ఱొమ్మునాటి అల వీపున దూసెనటంచు చూచితిన్

కిమస్తి యమునాంతరే?


కిమస్తి యమునాంతరే?


సాహితీమిత్రులారా!

పొడుపు పద్యాలు చాలా విధాలు చూశాము.
ఇపుడు పొడుపులో భాషాచిత్రం చూద్దాం.
ఈ శ్లోకం చూడండి.

కిమస్తి యమునాంతరే? కిం వదంతి విటం వేశ్యా?
ఆంధ్రగీర్వాణ భాషాభ్యాం ఏకమేవ ఉత్తరం వద!

యమునా నదిలోపల ఏమున్నది?
విటునితో వేశ్యలు ఏమందురు?
ఆంధ్ర- సంస్కృత భాషలకు సరిపడే విధంగా ఒకే సమాధానం చెప్పండి.

సమాధానం - నీలంజలం

1. కిమస్తి యమునాంతరే?
   యమునా నదిలోపల ఏమున్నది?        -  నీలం జలం
2. కిం వదంతి విటం వేశ్యా?
    విటునితో వేశ్యలు ఏమందురు?            -   నీ లంజలం

ఎంత చమత్కారంగా ఉందో కదా సమాధానం.

Wednesday, July 20, 2016

పల్లవము బూని సకియ మేనెల్ల జేసె


పల్లవము బూని సకియ మేనెల్ల జేసె


సాహితీమిత్రులారా!

ఈ పద్యం గమనించండి.
దీనిలోని చమత్కారమేమో?

పల్లవము బూని సకియ మేనెల్ల జేసి
పద్మగర్భుడు లా - దీసి వా - గుడిచ్చి
మూ - విసర్జించి యప్పుడ ప్పూవుబోడి
డేంద మొనరించె సందేహమందనేల?

ఒక ప్రియుడు తన ప్రేయసి హృదయం ఎలాంటిదో?
ఈ పద్యంలో వాపోతున్నాడు.
ప్రేమ ఎంత మధురం?  
ప్రియురాలు అంత కఠినం -
అనే పాటను మీరు వినే ఉంటారు.
అలాంటిదే ఇదీనూ.............
ఇక భావంలోకి వస్తే...........
ఆ బ్రహ్మదేవుడు ఆమె శరీరాన్ని లేతచిగురుటాకులతో చేశాడు
కాకపోతే అంత మృదువుగా ఉంటుందా! అంత సౌకుమార్యంగా ఎలావస్తుంది?
అంతటితో ఊరుకోక పల్లవము లోని -  తీసేశాడు అపుడు "పవము" అయింది.
తరువాత - కు గుడిచ్చి  ము - తీసేశాడు
అపుడు ఆమె హృదయం "పవి" అయింది(పవి = వజ్రాయుధం)
అందుకే ఆమె మనసు అంత కఠినమైంది. ఇక సందేహం ఎందుకు?
- అనుకున్నాడట.
ఇది భావం.

ఇలాంటిదే గతంలో ఒక పద్యం తెలుసుకొని ఉన్నాము.
అది మరొకసారి అనుకుందాం.

కిసలయంబున నీ మేను పొసగ జేసి
సరగ కీ -  దీసి యా - యూడ్చి సా - గుడిచ్చి
చేసె కాబోలు దాత నీ చిత్త మరయ
కాక కల్గునే? నీ కిట్టి కఠిన బుద్ధి

రారాజు రతిరాజు రాజరాజును గూడి.....


రారాజు రతిరాజు రాజరాజును గూడి.....


సాహితీమిత్రులారా!

పొడుపు పద్యాలను బహువిధములైనవి చూచి ఉన్నాము
ఇదో విధము పరికించండి.
పరిశీలించండి.
సమాధానాలు చెప్పగలరేమో?
ఆలోచించండి

ఏనుగు సింగంబు, నెలనాగయును గూడి 
          యొకమాటలోపల నుండవలయు
దశరథాగ్రసుతుండు,శశియును పట్టణం
           బొకమాట లోపల నుండవలయు
దర్పకాంతకుడు నేత్రంబును మాలయు
           నొకమాటలోపల నుండవలయు
వేల్పును త్రోవయు వెలయు ప్రసూనంబు 
           నొకమాటలోపలనుండవలయు
కనకంబు కార్పాన మొనర మహీజంబు
           నొకమాట లోపల నుండవలయు
రారాజు రతిరాజు రాజరాజును గూడి
           నొకమాట లోపల నుండవలయు
పక్షియు వృక్షంబు పాషాణమును గూడి
            నొకమాట లోపల నుండవలయు
ఫణిరాజు ఫణివైరి ఫణిభూషణుడు గూడి
           నొకమాట లోపల నుండవలయు
దీని యర్థంబు జెప్పగా ధీనిధులకు
నెలలు పన్నెండు గడువిత్తు నేర్పుగాను
చెప్పినాతడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేత కృష్ణరాయ క్షితీంద్ర

దీన్ని చూశారు కదా ఆలోచించండి ఆయన ఏకంగా
12 నెలలు అంటే 1 సంవత్సరం గడువిస్తున్నాడు
దీన్ని సాధించలేరని కవిగారి ప్రగాఢ నమ్మకమేమో!

దీనిలోని షరతులు -
ఒకటే షరతు ఇచ్చిన పాదంలోని పదాలతో 
ఒకమాటలో సమాధానం ఉండాలి.
సమాధానం చెప్పినవారిని భావజ్ఞశేఖరునిగా గుర్తించటం.

1. నాగకేసరాలు  (ఇది ఒక చెట్టుపేరు.)
  (నాగ అంటే ఏనుగు,
   కేసరి - సింహం,
   ఆలు - పడుచుది(ఎలనాగ)
   ఈ మూడు పదాలకలయిక నాగకేసరాలు)
2. రామచంద్రపురము (ఇది ఒక ఊరిపేరు)
   (రామ - దశరథుని పెద్దకొడుకు,
    చంద్ర - శశి - చందమామ
    పురము - పట్టణము .
    ఈమూడు పదాలకలయిక - రామచంద్రపురము)
3. రుద్రాక్షమాల (భక్తులు మెడలో ధరించు దండ)
   (రుద్ర - దర్పాంతకుడు (శివుడు)
    అక్ష - కన్ను
    మాల - దండ
    ఈమూడు పదాలతో ఏర్పడినది రుద్రాక్షమాల)
4. దేవదారి పుష్పము (ఒక పువ్వు)
   (దేవ - వేల్పు, దేవత
   దారి - త్రోవ
   పుష్పము - ప్రసూనము
   ఈ మూడు పదాల కలయిక - దేవదారి పుష్పము)
5. పైడిపత్తిచెట్టు (ఒక రకమైన చెట్టు)
   (పైడి - కనకము (బంగారము)
   పత్తి - కార్పనము(దూది)
   చెట్టు - మహీజము (వృక్షము)
   ఈ మూడు పదాలకలయిక - పైడిపత్తిచెట్టు)
6. రాజమదన కుబేరము (ఒక ఔషధము పేరు)
   (రాజ - రారాజు - దుర్యోధనుడు
   మదన - మన్మథుడు - రతిరాజు
   కుబేరము - కుబేరుడు - రాజరాజు
   ఈ మూడు పదాల కలయిక - రాజమదన కుబేరము)
7. పిట్టపేపరాయి 
   (పిట్ట - పక్షి
    పేప - పేము చెట్టు
    రాయి - పాషాణము (శిల)
    ఈ మూడు పదముల కలయిక - పిట్టపేపరాయి)
8. నాగగరుడేశ్వరము (ఒక పుణ్యక్షేత్రము)
   (నాగ - పాము (ఫణిరాజు)
    గరుడ(పక్షి) - ఫణివైరి
    ఈశ్వరము - శివుడు (పణిభూషణుడు)
    ఈ మూడు పదముల కలయిక - నాగగరుడేశ్వరము)

          

Tuesday, July 19, 2016

అనంతరత్న ప్రభవస్యయస్య:


అనంతరత్న ప్రభవస్యయస్య:


సాహితీమిత్రులారా!

ఒకమారు మంగళేశ్వరశాస్త్రులుగారు
విజయనగర సంస్థానములో దుబాసిగా ఉన్న అనంతరావు దగ్గరు
ఏదో పనిమీద వెళ్ళారు.
ఆయన వెంట కుమారసంభవము చదువుతున్న శిష్యుడు వెళ్ళాడు.
అనంతరావుగారికి పండితులతో పొగిడించుకోవెను అనెడి
కోరిక కలవాడని శాస్త్రులవారికి తెలియును.
అక్కడివారు శాస్త్రులను  ప్రాచీన శ్లోకములకు  సందర్భానుసారముగా
నానార్థములను చెప్పు సామర్థ్యము కలవారని
వారిచే ఏదైనా శ్లోకం వింత అర్థంతో చెప్పించమని
అనంతరావుగారిచే అడిగించిరి.
శిష్యుడు కుమారసంభవములోని శ్లోకం చదువగా
దానికి శాస్త్రులుగారు ఈ వ్యాఖ్యానం చేశారు.

అనంతరత్న ప్రభవస్యయస్య:
హిమన్న సౌభాగ్యవిలోపిజాతమ్
ఏకోహి దోషో గుణసన్నిపాతే
నిమజ్జతీందో: కిరణేష్వివాంక:
                                   (కుమారసంభవమ్ 1-03)

అర్థం-
హే అనంతరత్న= రత్నమువంటి ఓ అనంతరాయా!
హి = ఎందులన, జాతమ్ = (నీయొక్క)పుట్టుక,
మన్న సౌభాగ్యవిలోపి = నా (మంగళేశ్వరశాస్త్రుల) ఇబ్బందిని
తీర్చునది అయినదో, అందువలన, అయస్య = శుభకర్మమునకు,
ప్రభవసి = తగుచున్నావు, (కాని) ఏక: = ఒక్కటి,
అహిదోష: = సర్పదోషము (కలదు)
అనగా సర్పమునకు రెండు నాల్కలుండును, అట్లే నీవు
రెండు భాషలాడుదువు(దుబాసి, ద్విభాషి),
ఇది, గుణసన్నిపాతే = గుణములసమూహమున,
నిమజ్జతి = మునుగుచున్నది.
ఇందో:కిరణేషు = చంద్రకిరణములందు,
అంక ఇవ = కళంకమువలె-
అని వివరణ ఇచ్చెను.

(దీని అసలు అర్థము-
లెక్కలేని శ్రేష్ఠవస్తువులకు పుట్టినిల్లయిన ఆ హిమవంతునికి
మంచువలన సొంపేమి తరుగదు. ఎట్లాగంటే లోకములో
అనేక గుణముల  మొత్తములో
ఒక్కదోషము లెక్కకురాదు కదా!
చంద్రుని వెలుగులలో మచ్చలెక్కకు రానట్లు.)

పాపరాజుకు సంగమప్రాప్తిరస్తు!


పాపరాజుకు సంగమప్రాప్తిరస్తు!


సాహితీమిత్రులారా!

ఇది కంకంటి పాపరాజు(ఉత్తర రామాయణకర్త) పద్యంగా ప్రసిద్ధం.
పాపరాజుకు వేశ్య కు మధ్య జరిగిన సంభాషణ
ఈ పద్యం చూడండి.

పాపరాజు - ఒంటిమిట్టను కాపురంబున్నయట్టి
                 సిద్ధసానికి సంకల్ప సిద్ధిరస్తు
      వేశ్య - చెలగి నామీద పద్యంబు చెప్పినట్టి
                పాపరాజుకు సంగమప్రాప్తిరస్తు

Monday, July 18, 2016

రవిరథ హయచయ ఖురబిల కులమివ


రవిరథ హయచయ ఖురబిల కులమివ


సాహితీమిత్రులారా!

శ్రీహర్షనైషధంలోని ఈ శ్లోకం చూడండి.
ఇందులో అన్నీ లఘువులే అందువల్ల దీన్ని
సర్వలఘుచిత్రం అంటారు.
నలదమయంతులు వివాహానంతరపు శ్లోకం ఇది.


శుచిరుచిముడు గణమగణనమముమతి
కలయసి కృశతను నగగనతటమను
ప్రతినిశ శశితల విగలదమృతభృత
రవిరథ హయచయ ఖురబిల కులమివ
                                     (శ్రీహర్ష నైషధము - 22-146)


ఓ కృశాంగీ!  ఆకసపు ప్రదేశమున తెల్లనికాంతి కలిగినదై ఎక్కువగా
ఉండుటవలన లెక్కింప సాధ్యము కానిదై కేవలము వ్రేలితో చూపదగి
ప్రత్యక్షగమ్యమై ఉండు నక్షత్రగణమును ప్రతిరాత్రీ చంద్రుని
దిగువభాగమునుండి స్రవించు తెల్లని అమృతముచే నిండిన
సూర్యాశ్వముల గిట్టల రంధ్రముల యొక్క సమూహముగా భావింపుము.
ప్రతిరాత్రీ చంద్రుని నుండి స్రవించే తెల్లని అమృతముతో నిండిన సూర్యుని
గుఱ్ఱము గిట్టల రంధ్రములు నక్షత్రములవలె శోభించుచున్నవి- అని భావం.

బ్రహ్మాయం వాచ: పరమం వ్యోమ


బ్రహ్మాయం వాచ: పరమం వ్యోమ


సాహితీమిత్రులారా!

వేదాలలో విజ్ఞాన బీజాలు - అనే గ్రంథంలో ప్రస్తావించిన
కొన్ని యజుర్వేద మంత్రాలలోని ప్రశ్రోత్తరచిత్రాలను చూద్దాం.
(నిన్నటి తరువాయి)

పృచ్ఛామి త్వా పరమంత: పృథివ్యా: పృచ్ఛామి యత్ర
భుమనస్య నాభి: పృచ్ఛామి త్వా వృష్ణో అశ్వస్య రేత:
పృచ్ఛామి వాచ: పరమం త్యోమ ఇయం వేది: పరో
అంత: పృథివ్యా అయం యజిఞో భువనస్య నాభి: అయం
ప్యోమో వృష్ణో అశ్యస్య రేతో బ్రహ్మయం వాచ: పరమం వ్యోమ
                                                                (యజు. - 23- 61,62)

ఈ రెండు మంత్రాలలో మొదటిదానిలో ప్రశ్నలు
రెండవదానిలో జవాబులు ఉన్నాయి.
వాటి ఇక్కడ వరుసగా చూద్దాం.

1. హే బ్రహ్మన్ నేను పృథివికి కేంద్రమును అడుగుచున్నాను?
   - ఈ వేది(కేంద్ర బిందువు) భూమికి మధ్య భాగము 
      అనగా భూమి గుండ్రముగా ఉన్నది.
2. భువనములకు నాభిని అడుగుచున్నాను?
   - యజ్ఞమే ఈ భువనమునకు నాభి
3. అగ్నియొక్క అన్నిటికంటె గొప్పశక్తిని అడుగుచున్నాను?
   - అగ్నియొక్క అన్నిటికంటె గొప్పశక్తి విద్యుత్తు
4. వాణి శబ్దములయొక్క జన్మస్థానమును అడుగుచున్నాను?
   - వేదవాణికి జన్మస్థానము పరమేశ్వరుడు,
      శబ్దమునకు జన్మస్థానము ఆకాశము

Sunday, July 17, 2016

కిగ్ం స్విద్ధమస్య భేషజం కిం వావపనం మహత్



కిగ్ం స్విద్ధమస్య భేషజం కిం వావపనం మహత్


సాహితీమిత్రులారా!

వేదాలలో విజ్ఞాన బీజాలు - అనే గ్రంథంలో ప్రస్తావించిన
కొన్ని యజుర్వేద మంత్రాలలోని ప్రశ్రోత్తరచిత్రాలను చూద్దాం.

క స్వి దేకాకీ చరతి క ఉ స్వి జ్జాయతే పున:
కిగ్ం స్విద్ధిమస్య భేషజం కిం వావపనం మహత్ 
                                                             (యజు. 23-9)
ఇందులో ప్రశ్నలు మాత్రమే ఉన్నవి.  ప్రశ్నలు-
1. క స్వి దేకాకీ చరతి?
    ఒంటరిగా తిరిగునదేది? (ఏ గ్రహం చుట్టూ తిరుగనటువంటిది)
2.   క ఉ స్వి జ్జాయతే పున:?
      నలువైపులా తిరుగునదేది?
3. కిగ్ం స్విద్ధిమస్య భేషజం? (చలికి మందేది)
4. కిం వావపనం మహత్ ?
    విత్తనము మొలకెత్తుటకు అన్నిటి కంటె పెద్ద క్షేత్రమేది?


ఈ ప్రశ్నలకు ఈ మంత్రంలో  సమాధానాలు ఉన్నయి.

సూర్య ఏకాకీ చరతి చంద్రమా జాయతే పున:
అగ్నిర్ హిమస్య భేషజం భూమిరావపనం మహత్
                                                              (యజు. 23-10)
జవాబులు -
1. సూర్య ఏకాకీ చరతి  (సూర్యుడు దేనిచుట్టూ తిరుగడు)
2. చంద్రమా జాయతే పున: (చంద్రుడు నలువైపులా తిరుగుతుంటాడు)
3. అగ్నిర్ హిమస్య భేషజం (చలికి మందు వేడి(అగ్ని))
4. భూమిరావపనం మహత్
    విత్తనములు మొలకెత్తుటకు అన్నిటి కంటె పెద్దక్షేత్రం భూమి

చెలులం జర్చింపగా పాడియే?


చెలులం జర్చింపగా పాడియే?


సాహితీమిత్రులారా!


చమత్కారమంజరిలో
నాయకుని దగ్గర ఉన్న యువతులను వర్ణించు
సందర్భములోనిది ఈ పద్యం.
దీనిలోని ప్రత్యేకతను గమనించండి.

బిగువుం జన్నులు గాంచి మాను నల జంబీరంబు బీరంబు! క్రొం
జిగి మోముం గని సిగ్గునన్ వదలు రాజీవంబు జీవంబు! విం
తగు భ్రూరేఖలు గాంచి భీతినిడు కోదండంబు దండంబు!
జ్జగతీనాథుని మ్రోలనున్న చెలులం జర్చింపగా పాడియే?
                                                                    (చమత్కారమంజరి - 2-43)

దీనిలో జంబీరము - బీరము
           రాజీవము - జీవము
           కోదండము - దండము
పదాలను గమనించిన మొదటి పదాలలోని మొదటి అక్షరం లోపించి
రెండవపదం వస్తూన్నది. దీన్నే చ్యుతాక్షర చిత్రం అంటాము.

ఆ యువతుల బిగువు చన్నులను చూచి
జంబీరము(గజనిమ్మ) బీరములాడుట మానినదట.
క్రొత్తకాంతితో వెలిగే మోమును చూచి
రాజీవము(పద్మము) జీవములేనిదయిందట.
భ్రూరేఖలు చూచి కోదండము (ధనుస్సు) దండము(నమస్కారము) పెట్టినదట.
రాజు దగ్గరున్నవారిని గురించి చర్చించడం ధర్మమే? (ధర్మంకాదని) - అని భావం.

Saturday, July 16, 2016

అనుకరణ పద్యం


అనుకరణ పద్యం


సాహితీమిత్రులారా!

నన్నయ మహాభారతంలోని
అవతారికలోని 31వ పద్యం

ర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని యథ్యాత్మవిదులు వేదాంత మనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని కవివృషభులు మహాకావ్య మనియు
లాక్షిణికులు సర్వలక్ష్యసంగ్రహమని యైతిహాసికు లితిహాస మనియు
బరమపౌరాణికుల్ బహుపురాణసముస్సయం బని మహిఁగొనియాడుచుండ
వివిధ వేదతత్త్వవేది వేదవ్యాసుఁ
డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై
పరఁగుచుండఁ జేసె భారతంబు

దీని అనుకరిస్తూ పాల్కురికి సోమనాథుడు
చతుర్వేదసారం గొప్పదనాన్ని వర్ణిస్తూ
చేసిన పద్యం(పద్యం సంఖ్య -22)

వైదికులిది శుద్ధ వైదికంబని యెన్న శాస్త్రజ్ఞులిది ధర్మశాస్త్రమనగ
తార్కికులిది మహాతర్కంబనంగ పౌరాణికులిదియె పురాణమనగ
ఆగమ విదులు దివ్యాగమంబిదియన తంత్రజ్ఞులిది వీరతంత్రమనగ
భక్తవారంబిది భక్తిమార్గంబన ముక్త్యర్థులిది మహాముక్తిద మన
కవులు భువిని నిదియె కావ్యంబనంగను
సజ్జనులకు మిగుల సంతసముగ 
నిర్వికల్పరతి చతుర్వేదసారమన్
పద్యముల్ రచింతు బసవలింగ

తాత తనుజాత యొసంగుత సర్వ సంపదల్


తాత తనుజాత యొసంగుత సర్వ సంపదల్


సాహితీమిత్రులారా!

ఆశీర్వాదాలు కొన్ని వింతగా డొంకతిరుగుడుగా ఉంటాయి.
అలాంటి వాటిలో గూఢత ఉండి వెంటనే అర్థంకాని క్లిష్టత ఉంటుంది.
ఇలాంటివి  అర్థం కావాలంటే కొంతసమయం,
పురాణ పరిజ్ఞానం మొదలైనవి అవసరం.
అలాంటి పద్యం ఒకటి ఇప్పుడు చూద్దాం.

ఇలరుహ వైరి వైరిని ధరించిన యాతనిసామి పుత్రుతో
బలమరిచన్న రేని పురి భస్మ మొనర్చిన యుగ్ర వైరికిన్
బళిబళి తమ్ముడౌ నతని బావ కుమారుని వైరి శేఖరో
జ్వలుని సుపుత్రు తాత తనుజాత యొసంగుత సర్వ సంపదల్

ఇలరుహ -  భూమికి పుట్టినివి చెట్లు,
చెట్లవైరి - అగ్ని, అగ్ని వైరి - జలం
జలం ధరించి యాతని - మేఘుని,
మేఘుని సామి - ఇంద్రుడు,
ఇంద్రుని పుత్రుతో -  వాలితో,
బలుమరిచన్నరేడు - రావణాసురుడు,
రావణుని పురము - లంక,
లంకను భస్మమొనర్చిన యుగ్రవైరికిన్ - బూడిద చేసిన  ఆంజనేయుని,
తమ్ముడౌ నతని - భీముని,
భీముని బావ - కృష్ణడు,
కృష్ణని కుమారుడు - మన్మథుడు
మన్మథుని వైరి - శివుడు,
శివుని శేఖరోజ్వలుని - సిగలో ప్రకాశించే చంద్రుని,
చంద్ర సుతుని - కుమార్తె అయిన వాడు - బుధుడు,
బుధుని తాత - సముద్రుడు
సముద్రుని తనూజ - లక్ష్మిదేవి
-  లక్ష్మిదేవి సమస్త సంపదలను మీకు ఇచ్చుగాక!
- అని అర్థము.

Friday, July 15, 2016

ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ (పేరడీ)


ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ (పేరడీ)


సాహితీమిత్రులారా!

అల్లసాని పెద్దన - మనుచరిత్రలో
ప్రవరాఖ్యుడు వరూధినితో పలికిన పద్యం-

ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ! యొంటిఁ జరించె దోట లే
కివ్వనభూమి భూసురుఁడ నేఁ బ్రవరాఖ్యుడఁ ద్రోవ తప్పితిన్
గ్రొవ్వున నిన్నగాగ్రమునకున్ జనుదెంచి పురంబుఁజేర నిం
కెవ్విధిఁ గాతుఁ దెల్పఁగదవే! తెరు వెద్ది శుభంబు నీ కగున్ !
                                                               (మనుచరిత్ర 2-39)

దీనికి ఓ అజ్ఞాతకవి పేరడీ-

ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ! వొంటి చెరించెడు రోడ్డుపైన నే
నత్తిలి కాపురస్థుడను నామలకుండను త్రోవదప్పితిన్
నెచ్చెలి నన్ను జూచి కరుణించి తదీయ గృహంబు జేర్చి నీ
వెచ్చని కౌగిలిన్ వలపు హెచ్చగ పచ్చడి చేయునన్నికన్
                                             (మునిమాణిక్యం - మన హాస్యంలోనుండి)

పలనాటి సీమలో నీళ్ళు దొరకని సమయంలో
శ్రీనాథుడు చెప్పిన చాటువు-

సిరి గలవానికి జెల్లును
దరుణుల బదియారువేల దగ బెండ్లాడన్
దిరిపెమున కిద్దరాండ్రా!
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్

దీనికి ఓ అజ్ఞాతకవి పేరడీ -

సిరి గలవానికి జెల్లును
విరివిగ ధనమిచ్చి వివిధ విద్యలు బడయన్
తరమా సామాన్యునకది 
పరమేశా! దీని దిద్ద పరుగున రావే!

సుదీర్ఘో ఘోరఘర్ఘర:


సుదీర్ఘో ఘోరఘర్ఘర:


సాహితీమిత్రులారా!

వృత్త్యనుప్రాసలో సంకరములను తెసుకొనుచున్నాము.
అందులో మాత్సీ గురించి తెలుసుకున్నాము.
ఇపుడు మాగధీ వృత్త్యనుప్రాసమును గురించి
తెలుసుకుందాము.

మూడు వర్గముల అనుప్రాస ఘటకములయిన అది మాగధీ.
కాని ఇక్కడ మరో అంశం గుర్తులో ఉంచుకోవాలి
ఏమనగా ఒక వర్గము ప్రధానమై ఆద్యంతముండును.
నడుమ మరొకదానితో చేరి మరల దాన్ని వదలి మరొకదానితో కలిసి
అంతము వరకు కొనసాగును.
ఇలా మాగధీ విచ్ఛిత్తి కలిగి ఉండును.
మూడు వర్గములతోను కలిసినప్పటికి ప్రధానమైనది
ఒకటి రెండింటితో కలిసి సాగును.
ఉదాహరణ చూడండి.

అఘౌఘం నో నృసింహస్య ఘనాఘనఘనధ్యని:
హన్యాద్ఘురుఘురాఘోర: సుదీర్ఘో ఘోరఘర్ఘర:
                                      (సరస్వతీకంఠాభరణము -2- 186)

(నరసింహునియొక్క ఘురుఘురాఘోరమును, సుదీర్ఘమును,
ఘోరఘర్ఘరమును అయిన మేఘ గంభీరధ్వని
మా పాపముల సమూహమును నాశము చేయుగాక)

దీనిలో - వర్గము ప్రధానమైనది ఇది మొదటినుండి చివరివరకు సాగినది.
అయితే రెండవ పాదములో ఘనాఘనఘనధ్వని:- అనే చోట
- వర్గములోని -తో చేరినది. మూడు,నాలుగు పాదములలో
త-వర్గన్ని వదలి అంతస్థములతో జంట కూర్చుకొన్నది.
ఇక్కడ - ఎక్కువగా కనిపించుచున్నది.
కావున ఇది మాగధీవృత్త్యనుప్రాసాలంకామగుచున్నది.

Thursday, July 14, 2016

తంతే పోయి బారులో పడ్డట్టు


తంతే పోయి బారులో పడ్డట్టు


సాహితీమిత్రులారా!

పేరడీలు అనేక రకాలుగా అంటే పద్యాలకు
గేయాలకేగాక సామెతలకు చేశారు
అలాంటివి
ఇప్పుడు కొన్ని చూద్దాం.
శ్రీరమణగారు నూనుడులు పేరుతో చేసి ఉన్నారు.
నుడికారాలు - సామెతలు
1. నవ్వే కవిని, ఏడ్చే కార్టూనిస్టును నమ్మకూడదు
   (నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదు)
2. తిరిగి సబ్ ఎడిటర్, తిరగక రిపోర్టర్ చెడతారు.
   (తిరిగి ఆడది, తిరగక మగవాడు చెడతారు.)
3. దొంగలను కొట్టి పోలీసులకు వేసినట్లు
   (కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు)
4. తంతేపోయి బారులో పడ్డట్టు
   (తంతే పోయి గారెలబుట్టలో పడ్డట్టు)
5. బారు పెట్టినవాడు బీరుపోయడా
   (నారు పోసినవాడు నీరు పోయడా)

సుతు వాహన వైరి వైరి సున్నం బిదిగో!


సుతు వాహన వైరి వైరి సున్నం బిదిగో!


సాహితీమిత్రులారా!



పర్వత శ్రేష్ఠపుత్రికా పతి విరోధి
అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి,
ప్రేమ వారింట పెరిగిన పెద్దబిడ్డ
సున్నమిప్పుడు తేగదే సుందరాంగి!
అని సున్నం అడిగాడు కదా!
దానికి ఆమె మాత్రం తక్కువ తిన్నదా!
ఆమె ఈ పద్యం చెప్పి సున్నం ఇచ్చిదట.
చూడండి ఆ పద్యం..........

శత పత్రంబుల మిత్రుని 
సుతు జంపిన వాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతు వాహన వైరివైరి సున్నం బిదిగో!

శతపత్రంబుల మిత్రుడు - తామరలకు ఆప్తుడు - సూర్యుడు,
సూర్యుని సుతుడు- కర్ణుడు,
కర్ణుని జంపినవాడు - అర్జునుడు,
అర్జునుని బావ - కృష్ణుడు,
కృష్ణుని సూనుడు - మన్మథుడు,
మ్నమథుని మామన్ - చందమామ,
చందమామను సతతము దాల్చువాడు - శివుడు,
శివుని సుతుడు - వినాయకుడు,
వినాయకుని వాహనము - ఎలుక,
ఎలుక వైరి - పిల్లి,
పిల్లి వైరి - కుక్క,
ఓ కుక్కా సున్నం ఇదుగో అని అన్నది ఆమె.
దరిద్రపు పెద్దమ్మా సున్నమేదీ? -  అంటే
కుక్కా ఇదుగో! సున్నం - అంది ఆమె

సరిపోయిందా! మాటకుమాట.
ఎంత చమత్కారం.

Wednesday, July 13, 2016

సున్న మిప్పుడు తేగదే సుందరాంగి


సున్న మిప్పుడు తేగదే సుందరాంగి


సాహితీమిత్రులారా!

ఇది గూఢచిత్రంలోను, సంభాషణ చిత్రంలోను
రెండింటికి సరిపోవు పద్యం.
ఒకానొకాయన ఒక ఆవిడను సున్నం అడిగిన
తీరు ఈ పద్యంలో చూడవచ్చు.
గమనించండి.

పర్వత శ్రేష్ఠపుత్రికా పతి విరోధి
అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి,
ప్రేమ వారింట పెరిగిన పెద్దబిడ్డ
సున్నమిప్పుడు తేగదే సుందరాంగి!


పర్వత శ్రేష్ఠపుత్రికా - శ్రేష్ఠహిమవంతుని(మేలైన) కూతురు - పార్వతి,
పార్వతి పతి - శివుడు,
అతని విరోధి - మన్మథుడు,
మన్మథుని అన్న - బ్రహ్మ,
బ్రహ్మ పెండ్లాము - సరస్వతి,
ఆమె అత్త - లక్ష్మిదేవి,
ఆమె కన్నతండ్రి - సముద్రుడు,
ఆయన పెద్దబిడ్డ - జ్యేష్ఠాదేవి - పెద్దమ్మ

దీని భావం -
ఓ దరిద్రపు పెద్దమ్మా సున్న మిప్పుడే కొంచం తెచ్చి ఇవ్వమని.


దీనికి ఆమె సున్నం ఇచ్చిందా? -  ఇస్తే ఏమని ఇచ్చింది,
లేక ఏమి అనకుండా ఇచ్చిందా? -  అది మీరు ఆలోచించండి.
                                           
                                                                     తరువాత తెలుసుకుందాం.


Tuesday, July 12, 2016

కిం రే జల్పసి దుర్వచ: ఖలమతే భూయో2పి నేదం వద


కిం రే జల్పసి దుర్వచ: ఖలమతే భూయో2పి నేదం వద


సాహితీమిత్రులారా!

సీతా - రావణ సంవాద ఝరిలోని  మరోవిధమైన చిత్రం చూడండి.

స్మృత్వా మాం హృది జాయతే2తివినయ: క్రవ్యాదమాత్రే2పి తే
భర్తా భూమిసుతే సదానృతగుణస్తే2తో2పి సౌఖ్యం కుత:,
జాతే మయ్యసునాయకే తవ సుఖం స్యాదేవ కిం దూయసే
కిం రే జల్పసి దుర్వచ: ఖలమతే భూయో2పి నేదం వద

రావణుని మాటలు -
స్మృత్వా మాం హృది జాయతే2తివినయ: క్రవ్యాదమాత్రే2పి తే
భర్తా భూమిసుతే సదానృతగుణస్తే2తో2పి సౌఖ్యం కుత:,
జాతే మయ్యసునాయకే తవ సుఖం స్యాదేవ కిం దూయసే
హే! భూమిసుతే! = ఓ సీతా!,
అనృతగుణ: = అసత్య గుణాలు గల,సద్గుణరహితుడైన,
తే భర్తా = నీ భర్త, సదా = ఎల్లప్పుడూ, మామ్ = నన్ను,
హృది = మనస్సులో, స్మృత్వా = స్మరించి,
క్రవ్యాదమాత్రే అపి= సామాన్యుడైన రాక్షసుని విషయంలో కూడ,
అతివినయ = మిక్కిలి వినయం కలవాడుగా,
సంజాయతే = అవుతాడు, అత: అపి= అందువల్ల కూడ,
లేదా అలాంటి భర్తవల్ల కూడ, తే = నీకు, సౌఖ్యమ్= సౌఖ్యం,
కుత = ఎట్లు కలుగుతుంది మయి =నేను,
అసునాయకే = ప్రాణనాయకుడుగా, ప్రియుడుగా,
జాతే = అనగా, తవ = నీకు, సుఖమ్ = సుఖం,
స్యాదేవ= తప్పక కలుగుతుంది, కిమ్ = ఎందుకు,
దూయసే = బాధపడుచున్నావు

సీత సమాధానం -
కిం రే జల్పసి దుర్వచ: ఖలమతే భూయో2పి నేదం వద
రే ఖలమతే = ఓరీ దుర్బుద్ధీ, దుర్వచ: = దుష్టమైన మాట, కిం వదసి = ఎందుకు పలుకుచున్నావు. భూయ: అపి = మళ్ళీ, ఇదమ్= దీనిని, న వద = పలకకుము
నిగూఢార్థం -
ఓ దుర్బుద్ధీ, ఇలా ఎందుకు పేలుతున్నావు నే = నకార స్థానంలో, దమ్ = దరారమును, వద = పలుకుము.
నకారము తీసి దకారము చేర్చగా రావణుని మాటలు
స్మృత్వా మాం హృది జాయతే2తివియ: క్రవ్యాదమాత్రే2పి తే
భర్తా భూమిసుతే సదాదృతగుణస్తే2తో2పి సౌఖ్యం కుత:,
జాతే మయ్యసుదాయకే తవ సుఖం స్యాదేవ కిం దూయసే
అర్థం - ఓ భూమిసుతా! నన్ను స్మరించి
సదాదృతగుణ: = సత్పురుషులచే  ఆదరింపబడిన
గుణాలుగల నీ భర్త, ప్రతి రాక్షసుని విషయంలోనూ,
అతివిదయ: = చాల దయలేనివాడుగా అవుతాడు,
తే = నీకు, అత: అపి = దీని కంటె వేరైన,
కుత: = ఏ అన్యునినుండి, సౌఖ్యం ఎట్లు లభిస్తుంది,
మయి = నేను, అసుదాయకే = ప్రాణాలను ఇచ్చే (విడచే)
వాడను అగుచుండగా నీకు సుఖం తప్పక కలుగుతుంది.
ఎందుకు విచారిస్తావు?

ఈ శ్లోకం ప్రతిదత్తాక్షర చిత్రం లేదా చ్యుతదత్తాక్షర చిత్రం

Monday, July 11, 2016

నరుని కాయము తీరు పరికింప నెయ్యది?


నరుని కాయము తీరు పరికింప నెయ్యది?


సాహితీమిత్రులారా!

ఈ పొడుపు పద్యం
చూడండి
సమాధానం చెప్పగలరేమో?

భూతనాథుని సతి భూషణం బెయ్యది?
భువిలోన నెవ్వరు పూజనియులు?
ఏ నామస్మరణచే నేగె ఖట్వాంగుండు?
ఎగసి తృణావర్తు నెవడు కూల్చె?
జనకు కూతురు సీత జన్మించు టెక్కడ?
గిరిరాజ నందిని గిత్తయేది?
నరుని కాయము తీరు పరికింప నెయ్యది?
పుడమిలో నూతులు పూడునెట్లు?
అన్నిటికి జూడ మూడేసి అక్షరములు
నడిమి మాత్రలు చూచిన నయముగాను
అలరు ముమ్మూర్తు లెప్పుడు ననుదినంబు
మనల కరుణావిధేయులై మనుచు చుంద్రు.

దీనిలోని షరతులు -
1. ప్రతి సమాధానం మూడు అక్షరాల్లోనే ఉండాలి.
2. సమాధానాలన్నిటి మధ్య అక్షరాలు త్రిమూర్తుల పేర్లు వచ్చేవిగా ఉండాలి.
ఇక ఆలోచించండి.

1. శివుని భార్య యొక్క భూషణము ఏది?                               - తాంబ్రము (రాగిది)
2. భూమిలో పూజింపదగిన వారు ఎవరు?                               - బ్రాహ్మలు
3. ఏ వేరును జపిస్తూ ఖట్వాంగుడు వెళ్ళెను?                            - గోవిందా(అని స్మరిస్తూ)
4. తృణావర్తుడను రాక్షసునిపై దూకి చంపినది ఎవరు?               - కృష్ణుడు
5. జనకరాజు కూతురు సీతగా దేనిలో పుట్టెను?                          - కలం
6. హిమవత్పుత్రిక పార్వతి వాహనము ఏది?                              - సింహే0ద్ర
7. మానవుని శరీర విధమెట్టిది?                                                 - నశ్వరం (నశించునది)
8. భువిలో నూతులెట్లా పూడును?                                             - ఉర్లుట (విరిగిపడుట)

Sunday, July 10, 2016

రాజిత నగాగ్రమున విహారంబు సల్పు


రాజిత నగాగ్రమున విహారంబు సల్పు


సాహితీమిత్రులారా!

ద్విపది గురించి కొంతకాలం క్రిందట తెలుసుకొని ఉన్నాము.
ఇది మరొకటి గమనింపుడు.
ఇందులో 1,3 పాదములు సమానము,
అలాగే 2,4 పాదములు సమానము.

రాజిత నగాగ్రమున విహారంబు సల్పు
నీలకంఠాతిశయము రాణిలుటకంటే
రాజిత నగాగ్రమున విహారంబు సల్పు
నీలకంఠాతిశయము రాణిలుటకంటే
                                     (సారంగధరీయము - 2-138)

రాజిత - ప్రకాశించునట్టి,
నగాగ్రమునన్ - పర్వతశిఖరమునందున,
విహారముసల్పు - వేడుకగా తిరుగునట్టి,
నీలకంఠ - ఈశ్వరుని యొక్క,
అతిశయము - గొప్పదనము,
రాణిలుకంటె - ఒప్పారుటకన్న,
రాజిత - ప్రకాశించునట్టి,
నగాగ్రమునన్ - చెట్టు చివరయందున,
విహారంబు సల్పు - సంచారము చేయునట్టి,
నీలకంఠ - నెమళ్ళ యొక్క,
అతిశయము - గొప్పతనము,
రాణిలుట - ఒప్పారుట,
కంటె - చూచితివా.