Friday, February 24, 2023

సీత అంటే ఎవరు?

 సీత అంటే ఎవరు?




సాహితీమిత్రులారా!


శ్రీ భాష్యం అప్పలాచార్యస్వామివారి శ్రీ సూక్తి.

"త". ఇది సీతాదేవియొక్క నామంలో ఒక అక్షరం. అటువంటి నామాక్షరమైనటువంటి, బీజాక్షరమైనటువంటి సంపుటితో మొత్తం 68 సర్గలలో, సుమారు  50 సర్గలను, స, త అనే ఈ రెండక్షరాలతోనే వాల్మీకి ప్రారంభిస్తాడు. మీరు గమనించండి. ఈ 50 సర్గల ప్రారంభం స అనే అక్షరంతో కానీ, త అనే అక్షరంతో కానీ అవుతుంది. వాల్మీకి మహర్షి దివ్యడైనటువంటి మహాపురుషుడు కనుక, అతని నోటి నుండి వెలువడినది కనుక, ఈ విధంగా అవతరించింది కానీ, ఇది సామాన్యమైన గ్రంథం కాదు. అందుచేత మనవారంతా సుందరకాండను పారాయణ చేస్తూ ఉంటారు .

మెదటి శ్లోకంలో  ఆయన౼  సాక్షాత్తు భగవానునినుండి మనమందరం కలిసి ఉండి, విడువడకుండా ఉండవలసిన వాళ్ళం మనం అందరం. జీవులందరం. ఎప్పుడూ కలసి ఉండే ఈ  జీవతత్వం భగవంతుని నుండి ఎందుకు దూరం అయినది?,

"తతో రావణనీతాయాః"౼ . " తతః" అంటే౼ తరువాత అని ఒక అర్థం.. కథ ప్రారంభం చేస్తూ "తరువాత" అనే కథను ప్రారంభం చేస్తారు.  ఆ విధంగానే అందంగా కథ  ప్రారంభించాడు. ఇది ఒక పద్ధతి. కథ చెప్పే పద్ధతిలో చెబుతాడు? కాదు. ఇది కావ్యం. కావ్యం కనుక ధ్వన్యర్ధంలో తతః అంటే౼ "పరమాత్మ నుండి" అని అర్థం. తత్ అంటే పరమాత్మ అని అర్థం. సంస్కృతంలో, ఉపనిషత్ భాషలో,  తత్ అంటే పరమాత్మ. తత్ అని పరమాత్మకు పేరని ఛాందోగ్యపనిషత్తులో " తదైక్షత, బహుస్యాం ప్రజాయేతి"  అని అంటుంది. "తత్ ఐక్షత"౼ అది సంకల్పించినది. అది అంటే ఏది? సృష్టికి ముందు సకల జగత్తును తనలో చేర్చుకుని, తనకంటే వేరుగా ఉండే రెండవ పదార్థం ఏది లేదు, తాను ఒక్కడే ఉన్నట్లుగా, ఉన్నదని మాత్రమే చెప్పడానికి తగిన స్థితిలో ఉండే సత్ అనే పదార్థమునకు  తత్ అని పేరు. తత్ అనే దేనిని అంటారు? దూరముగా ఉండే, కనపడని వస్తువును "తత్" అది అని అంటారు. ఎదురుగా, దగ్గరగా ఉండి కనపడేదానిని ఇది అని అంటారు. సంస్కృతంలో దగ్గరగా ఉండేదానిని "ఇదమ్" అంటారు. దూరంగా ఉండే దానిని తత్ అంటారు. ఈ విధంగా దూరంగా, దగ్గరగా ఉండేవి ఏవి? దగ్గరగా ఉండేది ఇదమ్,  ఈ కనపడుతున్న జగత్తు. తత్౼ అది. కనబడనిది. ఎవరికి, ఎక్కడ, ఎప్పుడు చూడడానికి వీలుకాక, నామరూపములు లేని, ఉన్నదని మాత్రమే చెప్పదగినట్లుగా ఉండది అని తెలుసుకొనేటట్లు ఉండే ఒక పదార్థము సత్. దాని పేరే తత్.

 ఈ తత్ అనే దానినుండి విడివడి వచ్చింది తత్వం.? ఏ తత్వం జీవతత్వం. ఎక్కడికి వచ్చింది? లంకలోకి. ఎవరు తీసుకుని వచ్చారు? "రావణనీతాయాః"౼ రావణుని చేత తీసుకొని రాబడినది. రావణుడు ఎవరు ? మన లోపల ఉండే మనస్సే రావణుడు. ఈ రావణుని యొక్క ప్రకోపంచేత, మనము  అజ్ఞానావృతమైనటువంటి అవిద్య కామ, కర్మ కర్మల చేత బంధింపబడినటువంటి, సంకుచితమైనటువంటి మనఃప్రవృత్తి చేత మనం ఈ సంసార బంధంలోకి వచ్చాము.

అందుచేత, "తతః రావణనీ‌తాయాః," ఎవరీమె  సీత. సీత అంటే ఏమి? భూమిలోనుంచి వెలువడినది. జన్మలేనిది." న జాయతే న మ్రియతే వా కదాచిత్" అని . కఠోపనిషత్తు చెబుతోంది. పుట్టలేదు, ఆత్మ. చనిపోదు ఆత్మ అగ్ని వేస్తే కాలదు ఆత్మ, గాలికి ఎండదు ఆత్మ.  ఇలా చెప్పింది ఇవన్నీ చూపిస్తాడు మనకి. లంకంతా కాలిపోతే, "న చ దగ్ధా". సీతమ్మ కాలిపోలేదు. దహింపబడలేదు. ఎంత ఆశ్చర్యం! ఊరంతా కాలిపోయింది. "చతురంగుల మాత్రోపి నావకాశః స విద్యతే. ". నాలుగు అంగుళాల మేర కూడా కాలని చోటు లేని, కాలని ఊరు లేని చోట, కాలకుండా సీతమ్మ ఉన్నది అంటే, ఎవరా తల్లి? దానికి కారణం ఆమె పాతివ్రత్య మహిమ. భారతీయులమైన మనమంతా బాహ్యముగా తెలుసుకోవలసినది, మన జాతికి నేర్పిన మూల సిద్ధాంతం తల్లి పాతివ్రత్యం. మన దేశాన్ని రక్షించినవారు పతివ్రతలు మన దేశాన్ని రక్షించినవారు మహర్షులు. మన దేశాన్ని రక్షించినటువంటివారు మహాపురుషులు. వారు లేకపోతే మనమీనాటికి, మన భారతదేశం ఈనాటికీ నిలిచి ఉండదు. అటువంటి భారతదేశంలో పతివ్రత అయిన తల్లి, తన పాతివ్రత్యం  మహిమ చేత, అగ్నిహోత్రుడు ఆంజనేయుని తోకకు అంటుకుంటే, "అగ్నిదేవా! మా ఆంజనేయుని తోకకు అంటుకోకు. చల్లబడు" అంటే, చందన పంకంవలె చల్లనిది అయిపోయింది, అగ్ని. ఇంత చందనం ముద్ద తోకకు పెట్టారా !అన్నట్లు అయినది. మంట మండుతుంది అగ్ని ఆరిపోయిందేమో! అని అనుకున్నాడు మన హనుమన్న. వెనుకకు తిరిగి చూశాడు. అరెరే! "జ్వలతి!. కరోతి న చ మే రుజమ్!". మండుతోంది నాకు బాధ కలిగించలేదు. ఏమి? ఓహో! సముద్రంలో కొండ లేచిందే. అగ్ని చల్లబడదా! మా రాముని అనుగ్రహం, మా సీతమ్మ తల్లి అనుగ్రహం." అని అన్నాడు, ఆయన. అటువంటి అగ్నిహోత్రాన్ని చల్లార్చగలిగిన శక్తి కలిగినటువంటి తల్లి మన సీతమ్మ . దేని చేత? తన పాతివ్రత్య మహిమ చేత.  అంతటి గొప్ప మహిమ కరిగినది కనుక, ఆమె  జన్మించలేదు. ఆమె పేరేమి? సీత. సీత అంటే భూమి. దున్నుతుంటే, మన్ను నాగటి చాలు వల్ల ఈ పక్కకు, ఆ పక్కకు వెళుతుంది. ఆ నాగటి చాలునుంచి పుట్టింది సీత  నాగటి చాలునుంచి పుట్టింది కనుక ఆమెకు ఆమె తండ్రి ఏమి పేరు పెట్టాడు? నాగటి చాలు . అనే పేరు పెట్టుకున్నాడు, జనకుడు. నాగటి చాలు అని మనం తెలుగులో అంటాం. కానీ, సంస్కృతంలో సీత అంటారు. సీత అంటే నాగటి చాలు అని అర్థం. సీత అని ఆమెకు పేరు పెట్టాడు, జనకుడు. అంటే అర్థమేమి? క్షేత్రంలో దాగి ఉండి, క్షేత్రమును జ్ఞానమనే నాగలిచేత దున్నితే, వెలుపలికి వచ్చి, దర్శనం ఇచ్చే తల్లి, సీత. అదే మన ఆత్మ. ఇది రావణ నీత. ఎక్కడ నుండి?  తతః ౼పరమాత్మ నుండి. తతో రావణనీతాయాః  సీతాయాః, ఆమె యొక్క, "పదం అన్వేష్టుమ్"౼ ఆమె ఉండే జాడను కనిపెట్టడానికి, వెతకడానికి బయలుదేరాడు. ఎవడు? శత్రుకర్శనః. ఎవడు వెళ్లాలి? ఎవడికంటేవాడికి కంటికి కనిపించదు శత్రుకర్శనుడే వెళ్ళాలి. ఎవడు శత్రుకర్శనుడు. మన హనుమ.

వైద్యంవారి సౌజన్యంతో

1 comment:

Anonymous said...

Dhanyosmi 🙏💐