హంసవింశతిలోని గూఢచిత్రం
సాహితీమిత్రులారా!
హంసవింశతి కర్త అయ్యలరాజు నారాయణామాత్యకవి
తనగురించి
ఏవిధంగా చెప్పుకొన్నాడో చూడండి.
ఎవనికీరితి కుభృద్ధవ కుభృద్ధర బుధ
కరిసైంధవ సమిద్ధహరిణరుచిర
మెవనిమేధంబురుడ్భవ కభుగ్ధవ విధూ
ద్భవ మరుద్ధవగురుప్రతివిఘాతి
యెవనియీ వహిమరుగ్భవ సరిద్ధవ లస
ద్భువనభృత్త్రిపురభిద్భూరిమహిమ
యెవనిరూ పమృతభుగ్ధవసుతోడ్వీడ్రతీ
డుడ్వీడ్భృదాప్తపుత్రోల్లసనము
మంత్రిమాత్రుండె యతడు దుర్మంత్రిమంత్ర
తంత్రసంత్రాసకరణస్వత్రంతుఁడయల
రాజవంశసుధావార్ధిరాజ సూర
సూర్యనారాయణామాత్యవర్యుఁడలరు.
(హంసవింశతి పీఠిక-15)
1వపాదము-
ఎవనికీర్తి - కుభృత్ + భవ - హిమవంతునివలెను,
కు - భృత్శేషునివలెను, (మరియు)కైలాసమువలెను, హర - ఈశ్వరునివలెను,
బుధకరి -సైంధవ - ఐరావతము, ఉచ్చైశ్శ్రవములవలెను,
సమిద్ధహరిణ రుచిరము - ప్రకాశమైన ధావళ్యముతో ఒప్పినదో!
2వపాదము -
ఎవనిమేధ - అంబురుద్భవ - బ్రహ్మను,
కభుక్ + ధవ - వాతాశనపతి అయిన ఆదిశేషుని,
విధు + ఉద్భవ - బుధునిని, మరుద్ధవ గురు - దేవేంద్రునిగురువగు
బృహస్పతిని - ప్రతిఘటించునదో!
3వపాదము-
ఎవనిత్యాగము - అహిమరుగ్భవ - కర్ణుడు,
సరిత్ + ధవ - సముద్రుడు, అసద్భువన భృత్ - మేఘుడు,
త్రిపురభిత్ - ఈశ్వరుడు, వీరిత్యాగముకంటె గొప్పదియో!
4వపాదము -
ఎవనిరూపు - అమృతభుగ్ధవసుత - జయంతునివలెను,
ఉడ్వీట్ - చంద్రునివలెను, రతీట్ - మన్మథునివలెను,
ఉడ్వీద్భృదాప్తపుత్ర - నలకూబరునివలెను - ప్రకాశించునదియో!
కీర్తిలోనూ, మేధలోనూ, త్యాగములోనూ, రూపంలోనూ
అటువంటివాడైన మంత్రి మాత్రమేకాదు
చెడు ఆలోచనలకు స్వంతముగా మంత్రము తంత్రములచే రక్షించగల
అయలరాజవంశమునకు చంద్రుని వంటివాడై అలరారెడువాడు
ఈ నారాయణామాత్యకవి
- అని చెప్పుకున్నాడు.
ఎంతటి వాడో ఈ పద్యాన్ని బట్టి తెలుస్తున్నది.
No comments:
Post a Comment