Wednesday, May 8, 2019

వేమూరి శారదాంబ నాగ్నజితీ పరిణయము


వేమూరి శారదాంబ నాగ్నజితీ పరిణయము

సాహితీమిత్రులారా!

1881లో పుట్టి పంథొమ్మిదేళ్ల చిన్నవయసులోనే (1899లో) మరణించిన వేమూరి శారదాంబ పదహారేళ్ళ వయసులో చెప్పిన ప్రబంధం నాగ్నజితీ పరిణయం. శారదాంబ సంగీత సాహిత్య వేత్త, సాంఘికన్యాయాన్ని ఆకాంక్షించిన సంస్కర్త, న్యాయవాది అయిన దాసు శ్రీరాములుగారి కూతురు. ఆరుగురన్నల చెల్లెలు. స్త్రీవిద్యాభిమాని అయిన శ్రీరాములుగారు బిడ్డకు సంస్కృత తెలుగు సాహిత్యాలు చెప్పించటమే కాక, సంగీతంలోనూ శిక్షణ ఇప్పించారు. తొమ్మిదేళ్లకే సంగీత కచేరీలు ఇవ్వగలిగిన స్థాయికి చేరింది. పదునాలుగేళ్లకే పద్యరచన ప్రారంభించింది. మాధవ శతకం ఆమె మహిళాభ్యుదయ దృక్పథానికి సంబంధించిన రచన కాగా నాగ్నజితీ పరిణయం ఆమె ప్రాచీన సాహిత్య పాండిత్య గరిమకు నిలువుటద్దం.

శారదాంబ ఇంటి పేరు పెళ్లి వల్ల వేమూరి అయింది. వేమూరి రామచంద్రరావు ఆమె భర్త. 1888లో వాళ్ళ పెళ్లి అయింది. అప్పటికి శారదాంబ వయసు ఏడేళ్లు. మరొక ఐదారేళ్లకు కాపురానికి పోయిందనుకొన్నా ఆమె సంసార జీవితం ఐదారేళ్లను మించదు. కాపురానికి వెళ్లిన కాలం, కవితా వ్యవసాయం ప్రారంభించిన కాలం దాదాపు ఒకటే. తొలి చూలు ఆడపిల్ల దుర్గాంబ. మలి చూలు మగబిడ్డ పార్థసారథి. ఈ ప్రసవంలోనే ఆమె మరణించింది. నాగ్నజితీ పరిణయం కృతి భర్త పార్థసారథి. చెన్నైలోని పార్థసారథి కోవెల దేవుడు ఆయన. భర్తతో మద్రాసులో కాపురమున్న కాలంలో శారదాంబ ఈ కావ్యం రాసి ఉంటుందని భావిస్తున్నారు.

కూతురి అకాల మరణాన్ని ప్రస్తావిస్తూ దాసు శ్రీరాములుగారు శ్రీ దేవీ భాగవతములో రాసిన ఒక సీస పద్యాన్ని బట్టి నాగ్నజితీ పరిణయం ఆమె 16వ ఏట రాసినట్లు తెలుస్తున్నది. అంటే అది 1896 కావాలి. మాధవ శతకాన్ని ఆయన ప్రస్తావించలేదు. కనుక దాని రచనాకాలం తెలియదు. 14వ ఏట నుండి ‘ముద్దుముద్దుగా అల్లిబిల్లిగా పద్యమల్లటం’ నేర్చినదని తండ్రి చెప్పిన మాటను బట్టి ఆ అల్లిక శతక పద్య మాలిక అయినట్లు ఊహించవచ్చు. అది ఆమె మరణాంతరం 1901లో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి సంపాదకత్వంలో వచ్చిన కళావతి మాసపత్రికలో మూడు భాగాలుగా అచ్చయింది. నాగ్నజితీ పరిణయం అయినా ఆమె జీవించి ఉండగా అచ్చయిందో లేదో తెలియదు. ప్రచురణకాలం, తదితర వివరాలు ముద్రించిన పుటలు లేని ప్రతి మాత్రమే లభ్యమైంది. దాసు శ్రీరాములుగారి వంశవారసులు పూనుకొని మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితిని ఏర్పాటు చేసి ఆయన సాహిత్యంతో పాటు శారదాంబగారి ఈ రెండు రచనలు సేకరించి పునర్ముద్రించారు. స్త్రీల సాహిత్య చరిత్రలో వేమూరి శారదాంబ పేరు జారిపోకుండా ఆంధ్రకవయిత్రులులో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కూర్చిపెడితే, స్త్రీల సాహిత్య అధ్యయనానికి ఈ విధంగా అరుదైన వనరులు సమకూర్చి పెట్టినవారు డాక్టర్ దాసు అచ్యుతరావుగారు.

నాగ్నజితీ పరిణయము మూడాశ్వాసాల ప్రబంధం. పద్యాలు, వచనాలు కలిపి 231 ఉన్నాయి ఈ కావ్యంలో. మూడు ఆశ్వాసాల చివర పునరావృతమయ్యే ఒక పద్యంతో కలిపితే ఆ సంఖ్య 232 అవుతుంది. ఆ పద్యం ఇది.

భాసురమైన నీ వెడదవక్షమునందున శ్రీ వెలుంగగా
దాసుల కే కొఱంత సతతమ్మును సంతస మూరి శోభితా
వాసులుగారె విశ్వపరిపాలన సుందరరామ శారదా
భ్రాసమకీర్తిపూరిత దిగంతరవైభవచంద్ర మాధవా.

మాధవుడిని సంబోధించే స్తుతి రూపకమైన ఉత్పలమాల పద్యం ఇది. నీ వక్షస్థలంపై లక్ష్మి విలసిల్లుతుండగా భక్తులకు ఏ కొరతా లేదు. అంతటా సంతోషమే అని చెప్పటం, విశ్వాన్ని పాలించే సుందర రాముడని, వైభవ చంద్రుడని మాధవుడిని స్తుతించటం ఇందులో విషయాలు. అంతే అయితే ఇది సాధారణ పద్యం. ఇందులో శారదాంబ తన భర్త పేరును నాలుగు పంక్తులలో గర్భితం చేసి చెప్పటం విశేషం. ప్రతి పాదం చివరి రగణంలో మొదటి రెండక్షరాలు శారదాంబ భర్త వేమూరి రామచంద్రరావు పేరులోని (రావు అన్న తుది భాగాన్ని మినహాయించి) భాగాలను వరుసగా సూచిస్తాయి. గౌరవ చిహ్నమైన శ్రీ-తో ప్రారంభించి వె- అన్న అక్షరాన్ని కలుపుకున్న భాగాన్ని మొదటి పాదంలో, మూరి- అన్న భాగాన్ని రెండవ పాదంలో, రామ- అన్న భాగాన్ని మూడవ పాదంలో, చివరి పాదంలో చంద్ర- అన్న భాగాన్ని చూడవచ్చు. మాధవ శతకం కూడా ఈ పద్యంతోనే ముగియటం గమనించదగినది.

కావ్య పద్ధతి
19వ శతాబ్ది కవయిత్రి వేమూరి శారదాంబ నాగ్నజితీ పరిణయ రచన మధ్య యుగాలలో స్థిరపడిన కావ్యనిర్మాణ పద్దతిలో సాగింది. ప్రథమాశ్వాసంలో మొదటి 10 పద్యాలు కావ్యావతారిక వంటివి. ఇష్టదేవతా స్తుతి, కృతి భర్తను నిర్దేశించుకొనటం ఇందులో ప్రధానం. విష్ణువు, లక్ష్మి, శివుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి, వినాయకుడు సత్యవాక్కును, భద్రతను ఇచ్చి రక్షించాలని కోరుకొంటుంది. తన కృతిని కన్యగా సంభావించి ‘తిరువలిక్కేణి దివ్యమందిరములోన/ నింతి రుక్మిణితో సుఖియించుచున్న /నంద సుతుడైన సచ్చిదానంద మూర్తి’ని కృతి భర్తగా ఎంచుకున్నది. ఆ తరువాత ఉన్న పద్యం ప్రత్యేకంగా పరిశీలించదగినది. స్త్రీల కావ్యావతారికలలో మాత్రమే అటువంటి పద్యాలు కనబడతాయి.

ఎన్నఁగల పొత్తములనేమిఁ గన్నదాన
విన్నదాననుఁగాను నే నెన్నఁడైనఁ
గన్నవారెల్లఁ గరుణనిందున్నయట్టి
యన్ని తప్పుల క్షమియింతురని తలంతు

ఏనాడూ చెప్పుకోదగిన పుస్తకాలేమీ చూచినదాన్ని గాను, విన్నదానను గాను, ఈ కావ్యం చూచిన వాళ్ళెవరైనా దయతో ఇందులోని తప్పులన్నీ క్షమిస్తారని తలుస్తాను, అని శారదాంబ వినయంగా పాఠకోత్తములను, పండితులను కోరుకొన్నది ఈ పద్యంలో. ఏ మొల్ల కవితా శైలి అలవడిందని శారదాంబను మెచ్చుకొంటారో ఆ మొల్లనుండి మొదలు పెట్టి ఏ కవయిత్రి అయినా పాఠకోత్తములకు ఈ రకంగానే విన్నపాలు చేసుకొన్నది. మొల్ల తనకు తెలుగు సంస్కృత భాషలు, పద సంపద, వ్యాకరణ ఛందో అలంకార శాస్త్రాలు–ఏవీ తెలియవని, తన కవిత్వంలో తప్పులెంచవద్దని సాటి కవులను కోరింది. తరిగొండ వెంగమాంబ కూడా తాను గురువుల వద్ద చదువుకోలేదని, ఛందస్సు తెలియదని, కావ్య నాటక అలంకార శాస్త్రాల గురించి వినను కూడా లేదని, ఇతిహాసపురాణాలు చదవలేదని పేర్కొనటమే కాదు తనది బాలభాష అంటుంది. ‘నా తప్పొప్పులే రీతిగానైనా గెలిసేయక చిత్తగింపవలయు’నని కోరింది.

16వ శతాబ్ది నుండి మూడువందల ఏళ్ళు ముందుకు వచ్చినా, సాహిత్యరంగంలో మహిళా కవుల మాట వరుస మారలేదంటే సాహిత్య సామాజిక రంగాలు యథాపూర్వకంగా పురుషుల రంగాలుగా ఉండటం వల్లనే. నన్నయ నుండి ఏ పురుష కవి అయినా తమ ప్రతిభా పాండిత్యాల గురించి చెప్పుకొన్నవాళ్ళే గానీ ఇలా తమకేమీ తెలియదని చెప్పుకోలేదు. తప్పులే చేయము అన్న ధిషణాశక్తిపరులు కనుక క్షమించమని కోరే ప్రసక్తే లేదు. ఏ పాండిత్యం లేకుండా కావ్యాలు రాయటం స్త్రీలకు మాత్రం సాధ్యమా అంటే కాదు అనే సమాధానం. వేళ్ళ మీద లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే ఉన్న మహిళా కవులు అల్పసంఖ్యాక వర్గంగా పురుషులదైన కావ్య ప్రపంచంలోకి బెదురుబెదురుగా ప్రవేశిస్తున్నారనటానికి, వాళ్ళను ప్రసన్నం చేసుకొనటానికి వాళ్ళకంటే తామెందులోనూ అధికులం కామని నమ్మబలికి వారి దయను పొందటానికి తాపత్రయ పడుతున్నారనటానికి నిదర్శనం. ఇదంతా కవులుగా తమ అస్తితను చాటుకొనే అవకాశాలను కల్పించుకొనటంలో భాగమే. శారదాంబ ఆ వరుసలోని కవయిత్రే.

మన ఇతిహాస పురాణ కావ్య ప్రబంధ సాహిత్యరచన అంతా సూతుడు శౌనకాది మహామునులకు చెప్పిన క్రమాన్నో, శుకుడు పరీక్షిత్తునకు చెప్పిన క్రమాన్నో, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన క్రమాన్నో ప్రస్తావించి ఆ ప్రత్యేక క్రమంలో తాము రాస్తున్నట్లు ఆయా కవులు పేర్కొనటంగా ఉంటుంది. అదొక పద్ధతి. రాసే కవి సర్వానికి తానే కర్తనని అహంకరించకుండా పరంపరాగత మానవానుభవాలను ప్రజలకు అనుస్యూతంగా అందించే సాంస్కృతిక రాయబారిగా తనను తాను వ్యక్తీకరించుకొనటం ఈ పద్దతిలోని ఒక అందం. ఆ వరుసలోనే శారదాంబ తాను ఒనర్పం బూనిన నాగ్నజితీ పరిణయము కథా క్రమం ‘శుక మహర్షి పరీక్షిన్నరేంద్రున కెరింగించిన తెఱంగు’ అని చెప్పుకొన్నది.

నాగ్నజితి శ్రీకృష్ణుడి అష్టభార్యలలో ఒకతె. నగ్నజిత్తుడి కూతురు కనుక ఆమె నాగ్నజితి. శ్రీకృషుడితో ఆమె వివాహమైన తీరు ‘నాగ్నజితీ పరిణయము’ కావ్య కథా విషయం. వేమూరి శారదాంబ కంటే పూర్వం ఈ ఇతివృత్తంతో కావ్యాలు రాసిన వాళ్ళు ముగ్గురు. రాజవోలు సుబ్బారాయుడు, వల్లూరి నరసింహ కవి, వెలిదండ్ల అళగిరి. శారదాంబ సమకాలికులు ముగ్గురు. మాడభూషి నరసింహాచార్యులు, శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి, శ్రీనివాసాచార్యులు. శారదాంబతో కలిసి ఏడుగురు. ఒకే విషయాన్ని ఏడుగురు ఎట్లా కవిత్వం చేశారు? కావ్యాలల్లారు? పోల్చి చూచి గుణగణాలను అంచనా వేయటం అది వేరే సంగతి. వీళ్ళ ఎవరికైనా మూల కథావనరు భాగవతమే.

భాగవతం పురాణం. పురాణేతిహాస కథలను ప్రబంధాలుగా పెంచి రాసే పద్ధతి మను, వసు చరిత్రల కాలానిది. ఆ మార్గంలోనే వేమూరి శారదాంబ భాగవత పురాణంలోని నాగ్నజితీ పరిణయ కథను పెంచి ప్రబంధం చేసింది. భాగవతం దశమస్కంధం ఉత్తరభాగంలో 126 నుండి 144 వరకు 19 గద్యపద్యాలలో ఉన్న కథ ఇది. శ్రీకృష్ణుడి ఎనిమిదిమంది భార్యలలో ఆరవ ఆమె నాగ్నజితి. ఆమె అసలు పేరు సుదంత. శ్రీకృష్ణుడి పెళ్లిళ్లు దశమస్కంధం పూర్వభాగం చివర రుక్మిణీ కల్యాణంతో ప్రారంభమై ఉత్తర భాగంలో కొనసాగుతాయి. రుక్మిణీ కళ్యాణం తరువాత వివరంగా చెప్పబడిన పెళ్లికథలలో లక్షణా పరిణయం తరువాతది నాగ్నజితీ పరిణయం. స్వయంవరానికి వీరత్వ నిరూపణ షరతుగా ఉండటం, శ్రీకృష్ణుడి విజయం, వైభవోపేతంగా వివాహం, భారీగా కట్నకానుకల చెల్లింపు రెండు పెళ్ళిళ్ళలోనూ సామాన్యమే. అయితే శారదాంబను ఆకర్షించిన అంశం ఏమిటోగానీ నాగ్నజితీ పరిణయ గాథను కావ్యరచనా విషయంగా స్వీకరించింది.

ఆధునిక యుగపు ఆలోచనలకు తీసిన తెర
కోసలపుర రాజైన నగ్నజిత్తు, ఆయన భార్య మోహనాంగి సంతానం లేదని బాధపడుతూ, నారదుడి బోధతో సంతానగౌరీ వ్రతం చేసి ఒక కొడుకును, ఒక కూతురిని కనటం, పెరిగి పెద్దదయిన కూతురు సుదంతకు తగిన మగడి కోసం వెతుకుతుండగా నారదుడు వచ్చి శ్రీకృష్ణుడే ఆమెకు తగిన భర్త అని చెప్పి కొన్నిరోజులలో నగరానికి వచ్చి తోటలూ దొడ్లూ పాడుచేసే ఏడు వృషభాలను పట్టి కట్టిన ధీరునకు కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేస్తే కృష్ణుడు వచ్చి ఆ పని సాధించి సుదంతను పెళ్లాడతాడని చెప్పి వెళ్ళటం శారదాంబ కావ్యకథా నిర్మాణంలో మొదటి అంతస్తు.

నగరానికి వచ్చిన శ్రీకృష్ణుడిని చూచి భాగవత సుదంత మాధవుడిని తనకారాధ్యుడైన నాథుడుగా కోరుకొన్నదన్న మాటను పట్టుకొని తండ్రి దగ్గర నారదుడు కృష్ణుడి గురించి చెప్పిన విషయాలు విని నాగ్నజితి మనసు కృష్ణుడిపై లగ్నమైనట్లు, ఆమె విరహ వ్యధ చూడలేక సుదంత చెలికత్తె ఇందుమతి యోగి వేషంలో ద్వారకకు వెళ్లి ఆ వార్త శ్రీకృష్ణుడికి చేరవేసినట్లు శారదాంబ దానిపై పెద్ద అల్లికపని చేసింది. కృష్ణుడు కొమ్ములు వంచి పట్టితెచ్చి స్తంభాలకు కట్టివేసిన ఏడు ఎద్దులు పరమశివుడి శాపం పొందిన కుబేర అనుచరులన్న కల్పన కూడా అదనమే. అస్థిపంజరం వంటి భాగవత కథను మాంసలం చేసి జీవవంతం చేసింది శారదాంబ.

ఈ క్రమంలో కావ్య లక్షణాలుగా దండి చెప్పిన అష్టాదశ వర్ణనలలో నగర వర్ణన, ఉద్యానవన వర్ణన, సూర్యాస్తమయ వర్ణన, ఋతు వర్ణన, విరహ వర్ణన, వివాహ వర్ణన, కుమారోదయ వర్ణన, నాయకాభ్యుదయం వంటి వాటికి అవకాశం కల్పించుకొన్నది శారదాంబ. నగర వర్ణనలో భౌగోళిక విశేషాలు, జలవనరులు, తోటలు, పంటపొలాలు, పశు సంపద మొదలైన వాటితో పాటు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారి వర్ణన సర్వసాధారణం. శారదాంబ ప్రత్యేకత ఆ నగర ఇల్లాళ్లను వర్ణించటం.

ఆధునిక స్త్రీ సహజ ఆత్మ చేతన నుండి నగరం అన్న తరువాత మహిళలు ఉండరా? వాళ్ళను ఎందుకు ప్రధాన స్రవంతి జనం నుండి మినహాయించారు? అన్న కొత్త ప్రశ్నలతో సంప్రదాయ నగర వర్ణనకు ఆమె చేసిన కొత్త చేర్పు ఇది. ఆ ఇల్లాళ్లు పతిని దైవంగా పూజించేవాళ్ళు, అత్తమామలయందు అణకువ చూపేవాళ్లు, బంధుమిత్రులను ఆదరించేవాళ్లు, బీదవాళ్ళను ఆదరించేవాళ్లు, పనులకు బద్ధకించనివాళ్ళు అని ఆమె చేసిన వర్ణన సంప్రదాయ స్త్రీ నమూనాకు భిన్నమైందేమీ కాదు. అది వేరే సంగతి. అయినా సంగీత సాహిత్య విద్యలు తెలిసినవాళ్లుగా వాళ్ళను పేర్కొనటం మాత్రం ఆమె ఆధునిక దృష్టిని సూచిస్తుందని చెప్పక తప్పదు. సుదంత పెరిగిన తీరు వివరించే పద్యాలలో అది మరింత స్పష్టంగా రుజువైంది.

పురాణ ప్రబంధాలలో బాలికలను వర్ణించే వేళ బొమ్మల పెళ్ళిళ్ళు చేయటం, చిలకలకు పాఠాలు చెప్పటం, పాటలు పాడటం, వీణ వాయించటం, బొమ్మలు గీయటం, తరచు వాళ్ళ కార్యకలాపాలుగా చెప్పబడ్డాయి. నగ్నజిత్తు కూతురైన సుదంత కూడా ఇవి చేస్తూనే పెరిగింది. అంతవరకే చెప్తే శారదాంబ గురించి చెప్పుకోవలసిందేమీ లేదు. అంతకు మించి సుదంత ‘…మృదు కావ్యములన్ బఠియింప నేర్చెగా/ పూని సునీతిమంతములఁ బొత్తములన్ రచియింపనేర్చె…’ నని చెప్తుంది కవయిత్రి. కావ్య పఠనా రచనాదులు శారదాంబ అనుభవ విషయాలు. ఆడపిల్లలు అవి నేరుస్తూ పెరగటాన్ని ఆధునిక సంస్కరణ దృక్పధం నుండే ఆమె సంభావించింది.

నాగ్నజితీ పరిణయము కావ్యం ముగింపులో భాగవత మూలానికి భిన్నంగా శారదాంబ చేసిన ఒక మార్పు ప్రత్యేకం పరిశీలించదగినది. శ్రీకృష్ణుడు భార్యలందరి పట్ల సమతాభావంతో మెలిగాడని చెప్పిన భాగవతమే ఆయన ‘సత్యభామా ప్రియకరుడ’ని చెప్తుంది. నాగ్నజితీ పరిణయ కథకు ముగింపుగా ఉన్న ‘ఇట్లు హరి నాగ్నజితిo బెండ్లియాడి యరణముల పుచ్చుకొని, ద్వారకా నగరంబునకు వచ్చి సత్యభామతో గ్రీడించుచుండె’ అన్న వాక్యం అదే సత్యమని, సమత్వం భ్రమ అని స్పష్టం చేయనే చేసింది. నాగ్నజితిని పెళ్ళాడి రావటం ఏమిటి? సత్యభామతో క్రీడించటం ఏమిటి? ఈ అసంబద్దత నాగ్నజితికే కాదు, ఆత్మగౌరవం కల ఏ స్త్రీకి అయినా అవమానకరమైనదే. ఈ స్పృహ మెండుగా ఉండటం వల్లనే శారదాంబ ‘… జగములెల్ల/ నేలుచును దంపతులు సుఖియించి రెలమి’ అని నాగ్నజితీ శ్రీకృష్ణుల దాంపత్య జీవితం గురించే చెప్పి ఈ కావ్యాన్ని ముగించింది.

ఆ రకంగా సంప్రదాయ కథలను ఆ చట్రంలోనే అయినా సంస్కరణోద్యమ ప్రభావంతో, సామాన్య లౌకిక స్వీయ జీవితానుభవ జ్ఞానం నుండి, అభివృద్ధిచెందిన ఆధునిక దృష్టి కోణంతో స్త్రీలు మార్చి రాయటానికి చేసిన ప్రారంభ ప్రయత్నాలకు ఈ నాగ్నజితీ పరిణయ కావ్యం ప్రాతినిధ్యం వహిస్తుంది. సరళ సుందరమైన పద్య రచన, కథనరీతి శారదాంబ కావ్యలక్షణం. పందొమ్మిదవ శతాబ్ది చివరి భాగంలో తెలుగు కవితాకాశంలో మెరుపై మెరిసిన శారదాంబ వారసత్వం 20వ శతాబ్దిలోకి ఎంతగా విస్తరించిందో ఇలాంటి కవులను వెలుగులోకి తెచ్చి అధ్యయనం చేసే క్రమంలో అర్ధం అవుతుంది.
----------------------------------------------------
రచన: కాత్యాయనీ విద్మహే, 
ఈమాట సౌజన్యంతో

No comments: