Thursday, May 23, 2019

విక్రమోర్వశీయం - 2


విక్రమోర్వశీయం - 2



సాహితీమిత్రులారా!

ఆ లేఖ చదివిన పురూరవుని ఆనందానికి అవధులు లేవు. తన చేతివేళ్ళు చమరుతుంటే 'ఇది నాకు ప్రాణప్రదమైనది.దీనిని నీవు భద్రంగా దాచి ఉంచు' అని విదూషకుడికి ఇచ్చాడు. ఊర్వశి, చిత్రలేఖలు పురూరవుని ముందుకి వచ్చి ప్రణమిల్లారు. కొంత సేపు సరస సల్లాపాలాడుకున్నారు. వేడుకగా ఏవో కబుర్లు చెప్పుకున్నారు. అయితే ఇంతలో దేవదూత వచ్చి 'చిత్రలేఖా! ఊర్వశీ! మీరిద్దరూ తక్షణమే బయలు దేరి స్వర్గలోకానికి రావాలి. భరత మునీంద్రుడు ఇదివరకు ఊర్వశికి నేర్పిన ఆట, ఇప్పుడు ఆడితే చూడాలని మునీంద్రుడు, ఇంద్రాది దిక్పాలకులు వేడుక పడుతున్నారు. వెంటనే రమ్మనమని అమరేంద్రుని ఆఙ్ఞ ' అని వారిని తొందర పెట్టాడు.

ఊర్వశి కన్నీరు కారుస్తూ పురూరవుని విడవలేక, విడవలేక చిత్రలేఖతో దేవదూత తెచ్చిన విమానంలో నాకలోకానికి వెళ్ళిపోయింది. పురూరవుడు నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. ఊర్వశి అందచందాలను చూస్తూ విదూషకుడు ఆమె లేఖను జారవిడిచాడు. అది గాలికి కొట్టుకుపోయి, లతామండపము సమీపాన గుబురుగా ఉన్న ఒక చెట్టు చాటున దాగి ఉన్న మహారాణి, నిపుణికల దగ్గర వచ్చి పడింది. మహారాణి దానిని చూచింది.

పురూరవుడు మాణవకుని 'ఊర్వశి వ్రాసిన లేఖ ఇలా ఇవ్వు. దానిని చూస్తూ అయినా పొద్దుపుచ్చుతా ' అన్నాడు. దానికి 'ఊర్వశితో పాటు ఉత్తరం కూడా పోయింది ' అని బదులిచ్చాడు. ప్రభువు కోపగించు కున్నాడు. ఇద్దరూ ఉత్తరం కోసం వనమంతా వెదకసాగారు. మహారాజు వ్యవహారమంతా కళ్ళారా చూస్తూనే ఉంది మహారాణి. ఇక ఆమెకు కోపం ఆగలేదు. వెంటనే ఆమె మహారాజు దగ్గరకి వచ్చి 'ఊరకనే ఎందుకు అలా విచార పడుతున్నారు? ఊర్వశి వ్రాసిన లేఖకోసం అలా అల్లల్లాడిపోతునారే? ఇదిగో ఆ లేఖ తీసికోండి ' అని భర్త చేతికి అందివ్వబోయింది. హఠాత్తు పరిణామానికి పురూరవడు నివ్వెరపోయి, నిశ్చేష్టుడై, నిబ్బరపడ్డాడు.

మహారాణి భర్తతో నిష్ఠూరాలాడి నిపుణికతో చరచర అక్కడినుండి వెళ్ళిపోయింది. అది చూచి పురూరవుడు సహించలేక ఆమె వెంటవెళ్ళి ఆమె దారికి అడ్డంగా నిలుచున్నాడు. ఎన్నో విధాల బ్రతిమాలుకున్నాడు. అయినా మహారాణి మనసు చల్లబడలేదు. ఆమె రాజు మాటలు వినిపించుకోకుండా అక్కడ నుంచి గబగబ తన మందిరానికి వెళ్ళిపోయింది. పురూరవుడి పని కుడితిలో పడ్డ ఎలక అయ్యింది.

అంతఃపురం చేరుకున్న రాణికి మనశ్శాంతి చిక్కలేదు. మహారాజుని అవమానించి కష్టపెట్టాను కదాని లోలోపల బాధపడ సాగింది. పశ్చాత్తాప పడుతూ లోలోపల కుమిలి పోయింది. చివరకు ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది. 'ప్రియానుప్రసాదం' అనే నోము పట్టాలని అనుకున్నది. ప్రియుడు కోపించి ఉన్నప్పుడు ఆయన కోపం పోగొట్టి వశపరచుకునే వ్రతం అది.

ఇక్కడ ఇలా ఉండగా అక్కడ దేవలోకంలో దేవ సభలో నాత్యమాడడానికి సర్వ సన్నద్దురాలై ఉన్నది ఊర్వశి. సరస్వతీదేవి రచించిన లక్ష్మీ స్వయంవరం అనే నాటకం అది. దానిని నాట్యాచారుడైన భరతుడు ఊర్వశికి నేర్పాడు. అత్యంత రమణీయమైన నాటకం అది. ఊర్వశి అన్యమనస్కురాలై పురుషోత్తమా అనడానికి బదులు పురూరవా అంది. దాంతో నాటకం రసాభాస అయింది. భరత మునీంద్రునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి 'నీవు క్షమించరాని తప్పు చేసావు. కనుక నీకు దివ్యఙ్ఞానం నశించుగాక! నీకు దేవలోక వాసం లేకుండపోవు గాక!' అని కఠోరంగా శపించాడు.

భరతముని శాపవాక్యాలు విని ఊర్వశి దుఃఖంతో తపించిపోయింది. ఊర్వశిని చూచి దేవేంద్రుడు 'సరే జరిగిందేదో జరిగింది. పురూరవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేసాడు. నీవు దిగులు పడకు. ఈ శాపం నీకు మేలే అవుతుంది. నీవు భూలోకం వెళ్ళు. పురూరవునితో కూడి కొంతకాలం సుఖించు. ఆయన వల్ల నీకొక కుమారుడు కలుగుతాడు. ఆ తరువాత అమరలోకం చేరుకుంటావు' అని అనుగ్రహించాడు.

ఊర్వశి లోలోపల సంతోషించింది. భరతముని శాపంతో తనకు పురూరవుని పొందు ప్రాప్తిస్తుందికదా అనుకున్నది. తన చెలి అయిన చిత్రలేఖతో కలసి దేవలోకం నుంచి బయలుదేరింది. ప్రతిష్ఠాననగరానికి వచ్చి పురూరవుని కలసుకున్నారు. చిత్రలేఖ 'మహారాజా! మీరు నిశ్చింతగా ఈమేతో కలసి సుఖించండి. ఎప్పటికీ దేవలోకం గురించి తలచుకోకుండా ఉండేటట్లు మా ఊర్వశిని సుఖపెట్టండి. తమరు శెలవు ఇప్పిస్తే వెళతాను' అని పురూరవునికి ఊర్వశిని అప్పగించి వెళ్ళిపోయింది. ఊర్వశిని తీసుకుని పురూరవుడు అంతఃపురానికి వెళ్ళాడు. తన స్నేహితుని కోర్కె ఎట్టకేలకు నెరవేరినందుకు మాణవకుడు కూడా చాలా సంతోషించి అక్కడినుండి వెడలిపోయాడు.

****************
పురూరవుడు, ఊర్వశి కలసి చాలాకాలం సుఖించారు. అంతఃపుర భవనాలలో, ఉద్యావనాలలో యధేచ్చగా సంచరిస్తూ తనివితీరా రతిక్రీడల తేలియాడారు. ఒకనాడు తనకు అడవులలోనూ, కొండప్రాంతాలలోనూ విహరించాలని ఉన్నట్లు ఊర్వశి పురూరవుడికి తెలియచేసింది. ప్రియురాలి వేడుక తీర్చదలచాడు చక్రవర్తి. రాజ్యపరిపాలనా వ్యవహారాలన్నీ మంత్రులకు అప్పగించాడు. ఊర్వశిని వెంటపెట్టుకుని అరణ్యాలకి బయలు దేరాడు. అలా వారిద్దరూ కైలాస పర్వత ప్రాంతాలలోని గంధమాదన పర్వతం మీద రమణీయ దృశ్యాలు తిలకిస్తూ యధేచ్చగా విహరించసాగారు.

అప్పటివరకు జరిగిన కాలం మంచికాలం. ఊర్వశి పురూరవునితో కూడి సకల సౌఖ్యాలను అనుభవించింది. అంతట ఆమెకు చెడు రోజులు ప్రాప్తించాయి. దురదృష్టం ముంచుకుని వచ్చింది. ఒకనాడు గంగానదీ తీరాన సైకత స్థలాలలో ఒక చక్కని విద్యాధర స్త్రీ విహరిస్తూ ఉండగా పురూరవుడు చూచాడు. అయితే అతని మనస్సులో దుర్బుద్ధి ఏమీలేదు. కాని ఊర్వశికి మత్సరం పుట్టింది. రాజుపై కోపగించుకుంది. పురూరవుడు ఎంతో బ్రతిమాలుకున్నాడు. అయినా ఊర్వశి వినలేదు. భరతుని శాపం వలన ఆమెకు దివ్యఙ్ఞానము నశించింది. వినాశకాలే విపరీతబుద్ధీ అన్నట్లు పురూరవునిపై అలిగి, అక్కడికి దగ్గరలో ఉన్న కుమార వనంలోనికి వెళ్ళింది.

అది ఒక దివ్య వనం. పూర్వం కుమారస్వామి తపస్సు చేసిన ప్రాంతం. తన తపోదీక్షకు ఎవరైనా భంగం కలిగిస్తారేమోనన్న తలంపుతో కుమారస్వామి ఒక కఠోర నియమం పెట్టాడు. 'స్త్రీ ఎవరైనా ఆ వనలో ప్రవేసిస్తే ఒక తీగ అయిపోవుగాక!' అని శపించాడు. దేవ, గంధర్వ, విధ్యాధరాది మగువలందరికీ ఈ శాపం సంగతి తెలుసు. అందువలన ఆ వనంలోకి ఎవరూ వెళ్ళరు. కుమారస్వామి తపస్సు చేయడం వలనే దానికి కుమారవనం అనే పేరు వచ్చింది.

అయితే ఇప్పుడు ఊర్వశి దివ్యఙ్ఞానం కోల్పోయి, మూఢురాలై కుమారవనంలో ప్రవేశించింది. వెంటనే ఆమె ఒక గురిగింజ తీగగా మారిపోయింది. ఊర్వశి ఎటువెళ్ళిందీ, ఏమైనదీ పురూరవుడికి తెలియదు. ఆమె ఎడబాటు భరించలేక ఎంతో విచారించాడు. పిచ్చెక్కినట్లయింది. ఏమీ తోచక వెర్రివాడిలా ఆ అరణ్యప్రాంతంలో తిరగ సాగాడు. అతనికి ఓ రత్నం కనపడింది. అప్పుడు ఆకాశవాణి 'రాజా! ఈ రత్నం తీసుకో. దీని పేరు సంగమనీయం. అది గొప్ప మహిమ కలది. పార్వతీదేవి పాదాల లత్తుక నుండి పుట్టిన దివ్యరత్నం. ఇది దగ్గర ఉంటే అప్పటివరకూ కనిపించకుండా ఉన్న ఇష్టమైనవి ఏదైనా తక్షణం కనిపించి తీరుతుంది' అని పలికింది. పురూరవుడు సంతోషించాడు. ఆ మణి తీసుకున్నాడు. ఎదురుగుండాఉన్న తీగను తాకాడు. వెంటనే ఆ తీగ ఊర్వశిగా మారిపోయింది. వాళ్ల ఆనందానికి అవధులు లేవు.

'ప్రియ సఖుడా! మీరు ఎన్ని భాదలు పడ్డారో అవన్నీ నేను ఙ్ఞాన దృష్టితో చూస్తూనే ఉన్నాను. భరత మునీంద్రుని శాపం వల్ల ఆ ఙ్ఞానం నాకు నశించి ప్రవేశించకూడని ఈ వనంలోకి ప్రవేశించాను అంటూ జరిగినదంతా చెప్పింది. ప్రతిష్ఠాననగరం విడిచి చాలారోజులైంది. మనం నగరానికి వెళ్ళిపోదాం. రండి అని తన మహిమ చేత మేఘవాహనం సృష్టించింది. వారిద్దరూ దాని మీద ఎక్కి సురక్షితంగా ప్రతిష్ఠాననగరం చేరుకున్నారు.

ఊర్వశితో సర్వ సౌఖ్యాలూ అనుభవిస్తూ పురూరవచక్రవర్తి అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తున్నాడు. కొంతకాలానికి ఊర్వశి గర్భవతి అయింది. అప్పుడామేకు పూర్వం ఇంద్రుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. పురూరవుని వలన ఒక కుమారుని కని తిరిగి దేవలోకానికి రమ్మని ఆయన ఆఙ్ఞ. ఆ విషయం తలచుకుని ఆమె ఒక ఆలోచన చేసింది. రాజును విడిచిపోకుండా ఉండేటట్లు చూడాలనుకుంది.

ఊర్వశికి ఒక చక్కని కుమారుడు కలిగాడు. వెంటనే ఆమె ఆ విషయం రాజుకు తెలియకుండా కుమారుణ్ణి తీసుకుని చ్యవనముని ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆశ్రమంలో ఉన్న సత్యవతి అన్న తాపస స్త్రీకి తన బిడ్డను అప్పగించి మళ్ళీ ప్రతిష్ఠానపురానికి వచ్చింది.

తాపసాంగన అయిన సత్యవతి ఊర్వశి కుమారుణ్ణి తన కన్న కుమారుని వలె అత్యంత గారాబంతో పెంచి పెద్ద చేసింది. చ్యవన మహర్షి ఆ బాలుడికి జరిపించవలసిన సంస్కారాలన్నీ జరిపించి, సకల శాస్త్రాలూ నేర్పాడు. రాజులకు ఉచితమైన ధనుర్విద్య భోధించాడు. ఆ పిల్లవాడు సకల శస్త్రాస్త్ర ప్రయోగాలలో ఆరితేరాడు. ఋషికుమారులతో పాటు అక్కడే ఉంటున్నాడు.

ఒక పర్వదినాన పురూరవుడు ఊర్వశితో కలసి త్రివేణీ సంగమమైన ప్రయాగలో స్నానం చేసి, పూజాదికాలు నిర్వర్తించాడు. తరువాత అలంకార సమయంలో దాసి సంగమనీయమణిని ఒక బంగారు బుట్టలో పెట్టుకుని తెచ్చింది. అప్పుడు అకాశంలో పోతున్న గ్రద్ద ఒకటి ఆ మణిని మాంసముద్ద అని అనుకొని క్రిందకి వాలి దానిని నోట కరచుకుని పోయింది.

ఆ విధంగా ఆ గ్రద్ద చ్యవనముని ఆశ్రమము పైగా పోతున్నది. ఋషికుమారులలో ఉన్న ఊర్వశి కుమారుడు దానిని చూచాడు. వంటనే ధనుస్సును తీసుకుని 'అర్ధనారాచం' అనే బాణంతో దాన్ని గురి చూచి కొట్టాడు. తక్షణమే గ్రద్ద మణితో సహా నేల కూలింది.

పురూరవ చక్రవర్తి మణిని గ్రద్ద తన్నుకు పోయిన సమాచారం విని కంచుకిని పిలిపించి మణిని తీసుకువచ్చే ఏర్పాటు చేయమని ఆఙ్ఞాపించాడు. వెంటనే కంచుకి నగరానికి వెళ్ళి తలారిని పిలిచి రాజాఙ్ఞ తెలియచేసాడు. అంతట తలారి నాలుగు దిక్కులకు మనుషులను పంపి గ్రద్ద కోసం వెతికించాడు. చ్యవనముని ఆశ్రమం వైపు వెళ్ళిన వాడు చచ్చి పడి ఉన్న గ్రద్ద నోట ఉన్న మణిని, దేహానికి ఉన్న బాణాన్ని తీసుకువచ్చి పురూరవుడికి అందచేసాడు.

పురూరవుడు ఆ బాణాన్ని పరిశీలించాడు. దానిమీద చెక్కిఉన్న అక్షరాలను చదివాడు. 'పురూరవ చక్రవర్తికి ఊర్వశి యందు పుట్టిన కుమారుడు ఆయువనే వాని బాణమిది. ఈ శరం శతృవుల ప్రాణాలను అపహరించి తీరుతుంది' అని ఉంది. ఆశ్చర్యచకితుడైనాడు పురూరవుడు.

ఇక్కడ ఇలా ఉండగా అక్కడ చ్యవన మహర్షికి ఆయువు బాణంతో గ్రద్దని కొట్టాడన్న సంగతి తెలిసి, వెంటనే సత్యవతిని పిలచి 'ఋషి ఆశ్రమంలో ఇలాంటి హింసాకాండ తగని పని. ఈ రాకుమారుడు ఆశ్రమ విరుద్దమైన పనులు చేయడం మొదలు పెట్టాడు. ఇక ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు. వెంటనే వీడిని తల్లితండ్రులకు అప్పగించు' అని ఆఙ్ఞాపించాడు. ఆయువును వెంటపెట్టుకుని సత్యవతి ప్రతిష్ఠానపురానికి వెళ్ళింది. పురూరవిదు ఆమెను ఆహ్వానించి సకల మర్యాదలు చేసి, భక్తితో పూజించాడు. సత్య్వతి సంగతులన్నీ వివరంగా తెలియజేసి ఊర్వశీ, పురూరవులకు బాలుని అప్పగించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయింది.

అంతట పురూరవుడు అమితానందంతో బాలుని కైగలించుకుని ముద్దాడాడు. 'దేవేద్రునికి జయంతుడు పుట్టినట్లు నాకీ కుమారుడు కలిగాడు' అని అన్నాడు. దేవేంద్రుడి పేరు వినగానే ఊర్వశికి పూర్వ స్మృతి కలిగింది. వెనుకటి విషయాలన్నీ ఒక్కసారిగా ఆమె మనో వీధిలో మెరిశాయి. ఇక ఈ రాజును విడిచి వెళ్ళవలసి ఉందే అని కన్నీరు కార్చసాగింది. పురూరవుడు ఏమి కారణమని అడిగాడు. ఊర్వశి లోగడ జరిగిన వృత్తాంతమంతా రాజుకు తెలియపరిచింది.

అంతా విన్న పురూరవుడు బరువుగా విశ్వసించాడు. పుత్రుడికి రాజ్యభారం అప్పగించి అరణ్యాలకి పోవాలని సంకల్పించు కున్నాడు. ఈ సంగతి దేవేంద్రుడికి తెలిసింది. పురూరవుడు తపొవనాలకు పోతే దేవతలకు తీరని నష్టం కలుగుతుంది. అందువలన ఇంద్రుడు నారదుడిని ప్రార్ధించాడు. భూలోకానికి వెళ్ళి ఏవిధంగానైనా పురూరవుని ప్రయత్నాన్ని మాన్పించవలసిందిగా ఆ మహర్షిని అర్ధించాడు.

నారదుడు ప్రతిష్ఠానపురం వెళ్ళాడు. పురూరవుడు నారద మహర్షిని సకలవిధ గౌరవ మర్యాదలతో, భక్తి ప్రపత్తులతో పూజించి, సతీసమేతంగా సాష్టాంగ నమస్కారం ఆచరించాడు. అప్పుడు నారదుడు 'మీరిద్దరూ ఎడబాయకుండా ఉండుగాక' అని ఆశీర్వదించాడు. అందుకు వారు సంతోషించారు.

'మహారాజా! నీవి అడవికి వెళుతున్నాట్టు దేవేంద్రుడు విన్నాడు. ఆయనకు తరచుగా నీ సహాయం అవసరం అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ నిర్ణయాన్ని మార్చుకోవలసిందిగా నన్ను చెప్పమని నీ వద్దకు పంపాడు. నీ ఇష్టప్రకారం నీవు ఎల్లప్పుడూ ఊర్వశితో కలసి సుఖించవచ్చునని కూడా చెప్పమన్నాడు. కనుక నీవు ఇక ఆ తపోవనాలకు వెళ్లవలసిన పని లేదు' అన్నాడు నారదమునీంద్రుడు.

'మునీంద్రా! నేను దేవేంద్రుని ఆఙ్ఞకు బద్ధుడను. ఆయన చెప్పినట్లు నడుచుకోడానికి సిద్ధంగా ఉన్నాను' అని నారదుడికి తెలియచేసాడు. మహర్షి ఈ విషయం ఇంద్రుడికి తెలియ పరిచాడు. ఇంద్రుడు సంతోషించాడు. పురూరవుడి కుమారుని పట్టాభిషేకానికి అవసరమైన పనులన్నీ చేయవలసిందిగా చెప్పి రంభ, మేనక, తిలోత్తమాది అప్సరసాంగనలను, ఇంకా అనేక అమూల్యమైన కానుకలను భూలోకానికి పంపాడు.

పురూరవుడికి, ఊర్వశికి జన్మించిన ఆయువు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఆ రాజ్యంలో ప్రజలు సకల సౌఖ్యాలూ అనుభవించారు.

(సమాప్తం)
---------------------------------------------------------
రచన - మువ్వల సుబరామయ్య, 
సుజనరంజని సౌజన్యంతో

No comments: