Friday, May 10, 2019

సత్య మొహంతితో ముఖాముఖి – 1: సాహిత్యంలో వాస్తవికవాదం


సత్య మొహంతితో ముఖాముఖి – 

1: సాహిత్యంలో వాస్తవికవాదం



సాహితీమిత్రులారా!


భారతీయ సాహిత్యం అంటూ ఒక ప్రత్యేకమైన లక్షణం మన సాహిత్యానికి ఉందా? ఉంటే భారతీయ సాహిత్యాన్ని, ఆమాటకొస్తే ప్రపంచ సాహిత్యం అనేదాన్ని కూడా, పాఠకులు, విమర్శకులు ఏ విధంగా అధ్యయనం చేయాలి? ఈ ముఖాముఖీలో ఈ ప్రశ్నలను విశ్లేషించడానికి ప్రయత్నిస్తాము. దీనితో పాటు, భారతీయ ప్రాదేశిక భాషాసాంప్రదాయాలను తులనాత్మకంగా అధ్యయనం చేయడం సాధ్యమేనా? ఎలా? అన్న విషయం కూడా చర్చించే ప్రయత్నం చేస్తాము. ఈ ప్రశ్నలను విచారించే క్రమంలో వీటికి సంబంధించిన మరికొన్ని విషయాలు చర్చకు వస్తాయి: చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు, తాత్త్వికులు కలిసి నెరిపే బహుముఖ పరిశోధనా ప్రణాళికలో సాహితీ విమర్శను ఒక భాగంగా చూడవచ్చా? పశ్చిమ దేశాలనుండి దిగుమతి అయే ఉత్తర-ఆధునికత (post-modernism) వంటి సిద్ధాంతాలు భారతీయ సాహిత్యాధ్యయనానికి వర్తిస్తాయా?

సత్య పి. మొహంతి (Satya P. Mohanty) ప్రస్తుతం కార్నెల్ విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల శాఖలో ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. వీరు తాత్త్వికశాస్త్రం లోనూ, సాహిత్యం లోనూ వాస్తవికవాదం (philosophical and literary realism) పైనా, భారతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేసే సమకాలీన విధివిధానాలపైనా విస్తృతంగా రచనలు చేశారు. ఇటీవలే ఆయన ఫకీర్ మోహన్ సేనాపతి 1897-99లో వ్రాసిన ఛ మన ఆఠ గుంట అనే ఒడియా నవలను ఆంగ్లంలోకి అనువదించడంతో పాటు విమర్శనాత్మకమైన ఉపోద్ఘాతాన్ని కూడా వ్రాశారు. బ్రిటీషు కాలం నాటి ఒడిషా లోని ఒక కుగ్రామంలో రామచంద్ర మంగరాజ్ అనే అత్యాశాపరుడైన భూస్వామి ఉత్థానపతనాలను ఈ నవల చిత్రీకరిస్తుంది. కేవలం గ్రామీణ వాతావరణాన్ని గురించి వ్రాయడమే కాకుండా, ఈ నవల 1793 నాటి పర్మనెంట్ సెటిల్‌మెంట్ ఆక్ట్ ఒడిషా, బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో తీసుకొచ్చిన మార్పులను కథన రూపంలో వ్యక్తపరుస్తుంది. మొహంతి ఆసక్తికరమైన పరిశోధనల ఫలితమే Colonialism, Modernity and Literature: A View from India అన్నపేరుతో ఇటీవలే వెలువడ్డ వ్యాసాల సంకలనం. ఈ సంకలనంలో ఆంగ్లం, హిందీ, తెలుగు, అస్సామి, స్పానిష్ వంటి వివిధ భాషల మేధావులు, సేనాపతి నవల ప్రాతిపదికగా వారి సంప్రదాయాలలో సాహిత్యంలో వాస్తవికవాదాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నించారు. మొహంతి తమ సంపాదకీయంలో సామాజిక శాస్త్రవేత్తలు, సాహితీ విమర్శకులు వలస పాలన నాటి ప్రాదేశిక నవలల అధ్యయనం వల్ల యూరో అమెరికన్ పద్ధతులకు విభిన్నమైన ప్రత్యామ్నాయ ఆధునికతల గురించి క్రొత్త సంగతులు తెలుసుకోవచ్చని సూచిస్తారు.

మీరు ఈ మధ్యే ప్రచురించిన కలోనియలిజం, మాడర్నిటి అండ్ లిటరేచర్: ఎ వ్యూ ఫ్రమ్ ఇండియా అనే వ్యాస సంకలనం గురించి మేము కొన్ని ప్రశ్నలు అడగాలనుకొంటున్నాం. ఈ పుస్తకం భారతీయ తులనాత్మక సాహిత్య పరిశోధనకి ఒక నమూనా వంటిదని, ఈ గ్రంథాన్ని ప్రచురించడానికి చాలా సమయం పట్టిందని, యు. ఆర్. అనంత మూర్తి 2000 సంవత్సరంలో కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో ఇచ్చిన ఉపన్యాసం స్ఫూర్తితో మీరీ కృషి మొదలుపెట్టారని విన్నాం.

అవును. వేరు వేరు భాషల శాస్త్రవేత్తలతో పని చేయటం, భారతదేశానికి చెందినవారే కాకుండా యూరోప్, లాటిన్ అమెరికా సాహిత్యాలను విశ్లేషించే అమెరికన్ విమర్శకులతో పనిచేయటం చాలా ఉత్తేజకరమైన విషయమనే చెప్పాలి. ఐతే, అసలు స్ఫూర్తి మాత్రం అనంతమూర్తి, వారి సార్వత్రిక, విశ్వజనీన సాహితీ దృక్పథం అని చెప్పాలి. మా ఈ సంకలనం వారికే అంకితం. అనంతమూర్తి కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో చేసిన ఉపన్యాసంలో పలు విషయాలను ప్రస్తావించినప్పటికిని, వారు ప్రధానంగా ఫకీర్ మోహన్ సేనాపతి వ్రాసిన ఛ మన ఆఠ గుంట (1897-99), రబీంద్రనాథ్ టాగూర్ గోరా (1907-09) నవలల తులనాత్మక పరిశీలన చేశారు. ఈ రెండు గ్రంథాలు వారిని చాలా ప్రభావితం చేశాయి.

మీరు భారతీయ సాహిత్యం పై చాలా పరిశోధన చేశారు. మీరు చేసిన ఈ పరిశోధనల ఫలితాల గురించి తెలుసుకోవాలని వుంది. కాని ముందుగా, మేము మీ సైద్ధాంతికపరమైన రచనలకు, అనువాద వ్యాఖ్యానాది ప్రక్రియలకు మధ్య ఉన్న సంబంధాలను గురించి అడగవచ్చా? గత ఇరవై సంవత్సరాలకు పైగా మీరు తాత్త్విక వాస్తవికవాదం పైన రచనలు చేశారు. ఇటీవల సాహిత్యంలో వాస్తవికవాదం పైన వ్రాయడం మొదలుపెట్టారు. ఐతే, సాహిత్యంలో కనిపించే వాస్తవికతకీ సైద్ధాంతిక లేదా తాత్త్విక వాస్తవికతకీ మధ్య ఉన్న సంబంధాలను విశదీకరించగలరా? మామూలుగా వాడుకలో ఉన్న పరిశోధనా పద్ధతులు సామాజిక దృక్కోణాలకు పెద్ద పీటను వేస్తాయి. ప్రస్తుతం ఉన్న సాహిత్య విమర్శకు, ఈ దృక్కోణాలకు మధ్య ఉన్న అనుసంధానాలల్లో చాలా లోపాలున్నాయని మీ రచనల ద్వారా తెలుస్తుంది. విద్యార్థులూ, పండితులూ కూడా, ఈ అనుసంధానాల మూలాలను పునర్విచారణ చేయాలని, ఉన్నవి ఉన్నట్టుగా అంగీకరించవద్దని మీ వాదం. మీ ప్రతిపాదనలో వాస్తవికవాదానికున్న స్థానం ఏమిటి?

నా ఉద్దేశంలో, సైద్ధాంతిక (theoretical) లేదా తాత్త్విక వాస్తవికవాదానికి (philosophical realism) సాహిత్య వాస్తవికవాదానికి (literary realism) మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఈ రెండు సిద్ధాంతాలు వ్యక్తావ్యక్తంగా మన జ్ఞానాన్ని గురించి — అంటే మనం దేన్నైనా ఏవిధంగా తెలుసుకోగలం, లేక మనకు అసలు తెలిసింది ఏమిటి అన్న విషయాల గురించి– ఏం చెబుతాయో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సామాజిక విషయాల అవగాహన పట్ల ఒక నిష్పాక్షిక దృక్పథాన్ని ఏర్పరచుకోగలమా? భిన్నమైన సామాజిక దృక్పథాల వల్ల జనితమైన వక్రీకరణలను, మరీ ముఖ్యంగా ఆధిపత్య సిద్ధాంతాలు, భావజాలాలవల్ల కలిగే వక్రీకరణలను అధిగమించి కచ్చితమైన, నమ్మదగిన జ్ఞానాన్ని పొందగలమా అన్నది ప్రశ్న.

దీని గురించి మరి కొంత వివరిస్తాను. ముందు సాహిత్య విమర్శకుడైన నాకు తాత్త్విక వాస్తవికత మీద ఎలా ఆసక్తి పుట్టిందో చెప్తూ దానిలోనించి మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను.

1980ల్లో, నా విమర్శనా రచనల్లో, చెప్పాలంటే అప్పట్లో వ్రాసేవారందరి రచనల్లో కూడా, ఉత్తర నిర్మాణక్రమవాదం (Post Structuralism) వినిపించిన విషయాలను వివిధ భౌతిక వాదాలు, సామాజిక విమర్శనా దృక్పథాలతో — మార్క్సిజమ్, ఫెమినిజమ్ వంటి సిద్ధాంతాలతో — సమ్మిళితం చేయాలన్న ఆకాంక్ష చాల బలంగా కనిపించేది. అయితే సాహిత్య విమర్శలో ఎన్నో ప్రశ్నలను ఉత్తర నిర్మాణక్రమవాదం లేవనెత్తినా వాటన్నిటికీ అది సమాధానం చెప్పలేక పోయింది.

ఈ ప్రశ్నలకు మూలం సంపూర్ణ మూలవాద (Foundationalism) విమర్శలో ఉంది. హసెల్ (Edmund Husserl) ప్రతిపాదించిన ప్రత్యక్షం/ఉపస్థితి (presence) అన్న భావన అనుభవం, పరిశీలన అనే మూలాలు ఉంటాయనీ, వాటిద్వారా మనం విస్పష్టమైన జ్ఞానం పొందగలమనే చెబుతుంది. మన దైనందిన అనుభవం సాధ్యం కావాలంటే సాధారణ విషయాలను గ్రహణ చేయగలం, కొంతలో కొంతైనా బాహ్యజ్ఞానం పొందగలం అన్న మూలవిశ్వాసం మనం కలిగి ఉండాలి. కానీ ఆ విశ్వాసంపై విమర్శ డెరీడా (Jacques Derrida) ఆరంభించిన ఉచ్ఛేదన (Deconstruction) ప్రక్రియతో మొదలైనదని చెప్పవచ్చు. ఈ భావనను డెరీడా ఉచ్ఛేదించటం వల్ల అనుభవం పైన ఉన్న మన నమ్మిక సడలిపోయింది. అంటే, మన అనుభవాల్లో అత్యంత నిశ్చితమైనది, ఖచ్చితమైనది ఏదీ ఉండదు అన్న అవగాహన; అలాగే వ్యక్తిగత అనుభవాలైనా, శాస్త్రజ్ఞుల గమనికలైనా, మనకు అందుబాటు లోకి వచ్చేది సిద్ధాంతబద్ధంగానే అని కూడా తెలుస్తుంది. అందువల్ల, ఏదీ దాని నిర్దుష్టమైన స్వరూపంలో మనం గ్రహించలేము అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతుంది.

ఈ విషయాన్ని గుర్తించిన తరువాత ఉత్పన్నమయే మొట్ట మొదటి ప్రశ్న ఇది: తెలుసుకోగలిగిన ప్రతి విషయమూ సిద్ధాంతాల ద్వారానే తెలుసుకోగలిగితే, అసలు దేని గురించైనా నిష్పాక్షికంగా తెలుసుకోగలమా? తెలుసుకోవాలనే మన ప్రతి ప్రయత్నం ఏదో ఒక సైద్ధాంతిక దృక్కోణానికి లోబడి ఉండేది కాదా? లియొటార్ (Jean Lyotard) చేసిన వాదనను అనుసరించి, ప్రతి జ్ఞానమీమాంసక క్రియ ఏదో ఒక దృక్కోణానికి పరిమితం కావలసిందేనా?

1980లలో దృక్పథవాదం (Relativism) సరి అయిందేనా, అది ఒక సుబద్ధమైన జ్ఞానమీమాంసక ప్రక్రియేనా అన్న సమస్యల పైన నేను చాలా విమర్శనాత్మక రచనలను చేశాను. ఈ ప్రయత్నంలో భాగంగా నేను వివిధ రకాలైన తాత్త్విక వాస్తవికవాదాలను అధ్యయనం చేశాను. ఈ వాదాలన్నీ నిష్పాక్షిక దృక్పథం ద్వారా బాహ్యజ్ఞానం సాధ్యం అని ప్రధానంగా ప్రతిపాదిస్తాయి. కాని, మన 20వ శతాబ్దపు మూలవాద నమ్మకాలు తప్పని, వాటిని మీమాంస, స్వీయ విమర్శ ద్వారా సరిచేసుకోవాలని నేను రాసిన Us and Them అన్న వ్యాసం దరిమిలా తెలుసుకోగాలిగాను. నా ఈ వాదం ప్రకారం నిష్పాక్షిక దృక్పథం అంటే తటస్థత కాదు. అటువంటి దృక్పథాన్ని సాధించాలి అంటే మనం ఇతరమైన ఆత్మాశ్రయ దృక్పథాలు, స్వీయ సంస్కృతి ద్వారా చేకూరిన పక్షపాత ధోరణులు, భావజాలాల వంటివి, ఇంకా మన సామాజిక స్థాయీ విభేదాల వంటివి, జ్ఞానమీమాంసలో భాగమని గుర్తించాలి. ఈ విషయాల అన్వేషణలో భాగంగా నేను తర్క మీమాంస (Analytic philosophy) నుండి, ముఖ్యంగా కూన్ (Thomas Kuhn) రచనలనుంచి చాలా నేర్చుకున్నాను.

ఐతే, తాత్త్విక వాస్తవికవాదం, సాహిత్య వాస్తవికవాదం ఈ రెండూ నిష్పాక్షిక దృక్కోణానికి కట్టుబడి ఉన్నాయని చెప్పగలమా?

అవును. ఈ రెంటికి మధ్య చాలా పోలిక చూపవచ్చును. సాహిత్య వాస్తవికవాదం, తాత్త్విక వాస్తవికవాదం లాగానే, చాలావరకు ఒక నిష్పాక్షిక దృక్పథానికి (సామాజికంగా, సాంస్కృతికంగా) కట్టుబడి ఉంటుంది. వాస్తవికవాద రచయితలు ఎప్పుడూ కూడా సాహితీ ప్రక్రియలపై ప్రబలంగా ఉన్న కట్టుబాట్లను, వాటి చేత మలచబడ్డ రచనా ప్రక్రియలను సరిదిద్దాలని ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్తుంటారు. మీకు ఈ విషయం యొక్క నిదర్శనం ఎలియట్ (George Eliot) చేసిన సూచనలో కనిపిస్తుంది. ఆవిడ ప్రతిరూపాలను దాటిపొమ్మని చెప్తుంది. (ఎందుచేతనంటే, ఊహాజనితమైన, కల్పితమైన ప్రతిరూపాలను తయారు చేయడం చాలా సులభం కదా.) ఇదే విధంగా ఛ మన నవలలో లాల్ బిహారీ డే అనే పాత్ర దృష్టిలో భారతీయ గ్రామీణ వాతావరణం ఒక జడమైన ప్రాచ్యవాదంతో నిండి ఉందన్న విమర్శ అంతర్లీనంగా కనబడుతుంది. మొదట్లో వాస్తవికవాద రచయితలు, విషయాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించేవారు. వారి కాలాల్లో ఉన్న సమాజ ప్రతిరూపాలను, వాటి వక్రీకరణలను అధిగమిస్తూ తమ వాస్తవికత్వాన్ని ఆవిష్కరించడమే ఈ ప్రయత్నం యొక్క అర్థం అని మనం గమనించాలి. తమ రచనల్లో ప్రబలమైన దృక్పథాలు సూచించే విధంగా కాక, నిష్పాక్షికత్వానికి, సత్యానికి చేరువగా ఉండాలని ఈ రచయితల ఆదుర్దా. ఇదేదో సమాజాన్ని వర్ణనాత్మక వాస్తవికత ద్వారానే చూపడం లాంటిది అనుకుంటే మాత్రం పొరపాటే. గొప్ప వాస్తవికవాద రచనాకారులెప్పుడూ కూడా వాస్తవికతను కేవలం చూపరు, దాన్ని సమగ్రంగా విశ్లేషిస్తారు. వారి ఉల్లేఖనలు ఈ విశ్లేషణలను ఎల్లప్పుడూ సమర్ధిస్తాయి.

సైద్ధాంతిక లేదా జ్ఞానమీమాంసక వాస్తవికవాదానికి, సాహితీ వాస్తవికవాదానికి చెందిన కొన్ని ధోరణుల మధ్య పోలిక ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైన ఉత్తరాధునికతకీ సాహిత్యంలో కనిపించే ఉత్తరాధునికతకీ మధ్య ఎటువంటి సంబంధము లేదనే చెప్పాలి. సాహిత్యంలో ఉత్తరాధునికత అంటే ఆధునిక రచనాధోరణుల తదుపరి వచ్చేదని అర్థం. సాహిత్య చరిత్రలు వ్రాసేవారు గుర్తించిన ఆధునికత్వ రచనా ప్రక్రియలు క్షీణించిన దరిమిలా ఇది పుట్టుకొచ్చింది. ఈ పదం కూడా సాహిత్యకారులే సూచించారు. ఐతే, అసలు సిసలు ఉత్తరాధునికత ఒక సిద్ధాంతబద్ధమైన తాత్త్విక ధోరణి, జ్ఞానమీమాంసక దృక్పథం.

కావాలంటే మీరొక ఉత్తరాధునిక కవో, నవలారచయితో కావచ్చును. తదనుగుణంగా సంపాదకులు మీ రచనలకు ఆ ముద్ర కూడా వెయ్యవచ్చు. కానీ మీరు తాత్త్వికంగా కూడా ఉత్తరాధునికులా అన్నది తెలుసుకోవడానికి అది సరిపోదు. ఒక రచయిత ఉత్తరాధునిక రచనా ప్రక్రియలను ఉపయోగిస్తూ తాత్త్వికవాద రచనలను చేయవచ్చు. అటువంటి రచనలలో సామాజిక వక్రీకరణలను, ఒక నిజమైన నిష్పాక్షిక దృక్పథంతో వాస్తవికతను చూపే ఆస్కారం ఉంటుంది. మీరు, వీలయితే, పింఛాన్ (Thomas Pynchon) లేదా రూష్దీ (Salman Rushdie) లాంటి రచయితలు అనుసరించిన రచనా పద్ధతులను ఉపయోగిస్తూనే ఎలియట్‌లా నవలలు వ్రాయవచ్చును. 1980లలో కుంకుమ్ సంగారి (Kumkum Sangari) రూష్దీని మార్కేజ్‌తో (Gabriel Garcia Marquez) పోలుస్తూ ఒక గొప్ప విశ్లేషణ రమారమి ఈ పద్ధతిలోనే వ్రాశారు. ఆవిడ ఈ వ్యాసంలో మేజికల్ రియలిజం ప్రక్రియ అవాస్తవిక కల్పనలతో కూడి వుంటుంది అనే అభిప్రాయాన్ని పాఠకులు పునఃపరిశీలించి మార్చుకోవలసినదిగా అర్థిస్తారు. మీరు వార్గాస్ (Jennifer Harrod Vargas) వ్యాసం చదివినట్లైతే ఈ విషయం మరింత ప్రస్ఫుటమవుతుంది. మేజిక్ రియలిస్ట్ రచయితలు అవలంబించేది కూడా వాస్తవికవాదపు జ్ఞానమీమాంసలో ఒక భాగమే అని ఈ ఇద్దరూ వాదించారు. ఈ రచనా పద్ధతిని అవలంబించడం ద్వారా వీరికి వాస్తవికత యొక్క స్వరూపం నిష్పాక్షికంగా లభ్యం అవుతుంది అని దీని అర్థం.

వలస పాలన సమయంలొ రచించినప్పటికీ, సేనాపతి నవల ఛ మన ఆఠ గుంట ఈ కారణం వల్లనే అంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ నవల అన్యాపదేశ ప్రస్తావనల ద్వారా, వ్యంగ్యం ద్వారా ఆనాటి భారతీయ సమాజాన్ని, సంస్కృతిని, విశ్లేషణాపూరితంగా వర్ణిస్తుంది. అందువలన, ఫకీర్ మోహన్ సేనాపతి వాస్తవిక ధోరణిలో వ్రాసినప్పటికీ ఆయనను ఒక ఉత్తరాధునిక రచయితగా కూడా చూడవచ్చును. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రచన ఉత్తరాధునిక నవల ఆవిర్భావం కన్నా 60 నుండి 70 సంవత్సరాలకు ముందే జరిగింది.

ఈ నవల కోసమై వ్రాసిన ఉపోద్ఘాతంలో మీరు సేనాపతి పాఠకులను క్రియాశీలులు కమ్మని సవాలు చేస్తాడని, ఊరికే సామాజిక వాస్తవికత్వాన్ని అంగీకరించవద్దని ప్రేరేపిస్తాడని అన్నారు. ఈ నవలలోని ఆధునికత (మీరు పూర్వం విశ్లేషించిన 16 వ శతాబ్దపు బలరాం దాస్ లక్ష్మీ పురాణం లాగే) దాని ఆత్మార్థక కథాస్వరూపంలో ఉందని చెప్పవచ్చును. నవలలో సాగే కథనం పాఠకుడి సహచర్యం, తోడ్పాటు కోరుకుంటుంది. ఈ తోడ్పాటు సహాయంతోనే సమాజంలో ప్రబలంగా ఉన్న సాంఘిక, రాజకీయ స్వరూప స్వభావాలను విమర్శించే అవకాశం ఉంటుంది. ఐతే, మీరు పాఠకుడి పాత్ర గురించి వ్యాఖ్యానించిన వైనం మాకు ఆశ్చర్యం కలిగించింది. మీరు పాఠకుడికి కథనాన్ని నడిపే బాధ్యతనూ, అధికారాన్నీ అప్పగిస్తారు. ఈ అప్పగింతలో కల్పనకు యదార్థానికి మధ్య ఉన్న అంతరాన్ని, దృక్పథబద్ధమైన అభిప్రాయానికీ సత్యానికీ మధ్య ఉన్న భేదాన్ని పాఠకుడు చూడగలగటం ఒక ‘జ్ఞానమీమాంసక లక్షణం’గా కనిపిస్తుంది. సేనాపతి ఈ శైలితో ఒక రకంగా పాఠకుడు సాధికారత పొందినా, మరొక విధంగా దారి తప్పుతాడు కూడా. ఇటువంటి మేధోలాఘవం ఉన్న వాస్తవిక రచనలు సహజంగా పాఠకుల నుండి చాలా ఆశిస్తాయి. ఐతే, ఇటువంటి పరిస్థితుల్లో, ఇంతటి క్రియాత్మకతతో పాఠకుడు ఆత్మవిమర్శ చేసుకోవడంతో పాటు, సామాజిక ఆచారాలకూ, వ్యవస్థలకూ ఒక విమర్శకుడిగా మారటం అన్నది ఒక నైతిక ఆవశ్యకతగా అవతరిస్తుంది అంటే అది మీకు సమ్మతమేనా?

ఓడిషాలో బలరాం దాస్ ఆరంభించిన స్త్రీవాద, కులవ్యతిరేక పురాణమనేది ఒక సజీవ సాంప్రదాయం. మార్గశిర మాసంలో లక్ష్మీ పురాణాన్ని విధిగా ప్రతి పల్లెలోను, పట్టణంలోను సాంప్రదాయికంగా హిందువుల ఇళ్ళలో చదువుతూ ఉంటారు. బలరాం దాస్ ఒక స్వతంత్రుడైన అసాంప్రదాయిక భక్త కవి. ఈయన తన కావ్యంతో ఒక క్రొత్త విద్రోహకర గాథను రచించడమే కాకుండా దానికి అనుబంధమైన సాంఘిక సంప్రదాయాన్ని కూడా నెలకొల్పాడు. గత 450 సంవత్సరాలుగా మహిళలు ఈ పురాణాన్ని చదువుతూనే ఉన్నారు, చర్చిస్తూనే ఉన్నారు, ఇంకా ఈ కథ లోని కుల వ్యతిరేక, స్త్రీవాద అంతఃసూచనలను విశ్లేషిస్తూనే ఉన్నారు. ఇంకా లోతుగా చెప్పాలంటే, ఈ సంప్రదాయం సమూలమైన, అభ్యుదయకారకమైన, ఒక క్రొత్త సామాజిక, రాజకీయ అవకాశం స్త్రీలకు కల్పించింది.

సేనాపతి వ్రాసిన నవల ఈ సంప్రదాయం నుండి వచ్చి ఉండవచ్చును లేదా లేకపోవచ్చును కూడా. (కాగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన స్త్రీవాద మేధావి, బిద్యుత్ మొహంతి, సేనాపతి పరోక్షంగానైనా లక్ష్మీ పురాణం చేత ప్రభావితు డయ్యాడని వాదించారు). కాని ఈ నవల లోని కథకుడు కేవలం ఒక తటస్థుడు కాడు. అన్నింటి కన్నా ముఖ్యమైంది ఏమిటంటే, ఈ నవల లోని కథకుడి దృక్పథం లౌక్యంతో పాటు అత్యంత తీక్షణమైన సామాజిక విమర్శకుడిది కూడా. ఈ నవలను మళ్ళీ మళ్ళీ చదివే పాఠకులకు ఈ విషయం అర్థమవుతుంది. హాస్యం, చమత్కారం ద్వారా చాల ప్రభావవంతమైన విమర్శ సాధ్యమవుతుంది. ఓడియా భాషకు చెందిన ప్రముఖ విమర్శకులైన రబి శంకర్ మిశ్ర లాంటి వారితో పాటుగా నేను చూపదలచుకున్న దేమిటంటే, ఈ నవల యొక్క శక్తి దాని భాష లోనూ కథనంలో జరిగిన క్రొత్త ఆవిష్కరణల లోనూ ఉన్నదని. రబి శంకర్ మిశ్రా ఈ నవలపై వ్రాసిన విమర్శనా వ్యాసంలొ డెరీడా, భాఖ్తిన్‌ల ప్రభావం కనబడుతుంది. కథావస్తుపరంగా చూసినట్లైతే, ఈ నవల సాంతం ఒక భూస్వామికి ఉన్న పేరాశ గురించి మాత్రమే కాదు. (అనంతమూర్తి ఈ విషయాన్ని చాల ముందే గ్రహించారు.) సేనాపతి నవల విభిన్న స్థాయిలలో జరిగిన ఒక వాస్తవికపు రచనగా పేర్కొనవచ్చును. శిశిర్ కుమార్ దాస్ లాంటి వారు చెప్పినట్లు, ఈ నవల బ్రిటిష్ వలస పాలనా సమయంలోని భారతీయ సమాజాన్ని గ్రామీణ దృక్పథంతో చాలా విపులంగా చిత్రీకరిస్తుంది. అలాగే, నా ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా, ఈ చిత్రీకరణ లోని నిర్దుష్టత దాని వర్ణనలో కాక పాఠకుడి విమర్శన, విశ్లేషణా పటిమలో ఇమిడి ఉంటుంది.

సాహితీ వాస్తవికత్వపు వాదనల్లో ఒక దశలవారీ పరిణామక్రమం మాకు కనిపిస్తుంది. ఒక క్రమంలో ప్రతి నవల దాని పూర్వపు నవలలపై ఆధారపడి తనను తాను నిర్మించుకుంటుంది అనే వాదన ఇది. ఇక్కడ కాలానుక్రమం, సరళరేఖాత్మకం అని అవ్యక్తంగా, అంతర్లీనంగా ఉన్న అభిప్రాయం. కాని, మీరు మీ ఉపోద్ఘాతంలో ఛ మన ఆఠ గుంట యొక్క కథన ప్రక్రియ ఈ కాలానుక్రమణ పద్ధతికి భిన్నంగా ఉన్నట్లు చెబుతారు. ఈ నవల అవలంబించే కథన ప్రక్రియ ముల్క్ రాజ్ ఆనంద్ సహజత్వానికన్నా, సల్మాన్ రూష్దీ ఆత్మార్థక ఉత్తరాధునికతకి (reflexive post-modernity) చేరువగా ఉందని మీ వాదం. ఐతే, సాహిత్య వాస్తవికవాదం అన్న ఊహ ఈ దశలవారీ ప్రవృత్తిని అనుసరిస్తుందని, సాహిత్యం అంటే పూర్వకాలపు ఉద్దేశాలు కలిగి, హేగెల్ ప్రతిపాదించిన మార్కిస్టు చారిత్రక దృక్పథానికి చేరువగా ఉందని మీరంగీకరిస్తారా? లేని పక్షంలో, వాస్తవికవాదంపై జరుతున్న కొత్త పరిశోధనలు కాలం వర్తులాకారమైనదనే ఒక సరికొత్త ఊహను అనుసరిస్తూ వస్తున్నాయి అని గుర్తించాలి. ఈ ఊహ కాలానుక్రమణ నిర్మాణాన్ని కూలదోయటం చేతనే సాధ్యమవుతుంది. వాస్తవానికి, కాలానికి, చరిత్రకి మధ్య ఉన్న సంబంధంపై సాహిత్య వాస్తవికవాదపు రాజకీయ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ఆందుకే ఈ ప్రశ్న.

అవును. కచ్చితంగా మనం సాహిత్యంలో అతిసామాన్యమైన అభివృద్ధి, అభ్యుదయం నమూనాలను దాటి వెళ్ళాలి. భారతీయ నవలా సాహిత్యాన్ని అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంగా కాకుండా — అంటే సులభతరమైన వాస్తవికవాదం నుండి సంక్లిష్టమైన ఆత్మార్థక ఉత్తరాధునికత, మేజికల్ రియలిజమ్ లాంటివి — శతాబ్దాలుగా రచయితలు ఏ విధంగా ఆయా సమయాల్లో వారి దైనందిన వాస్తవాలను రచనలుగా ఎలా మలిచారో తెలుసుకోవాలి.

సాహిత్యం సామాజిక శాస్త్రాలు కనుగొనే అంశాలను అపేక్షించగలదు అన్న విషయం ఆధారంగా ఒక క్రొత్త పరిశోధక నమూనాను ఉత్పాదించవచ్చును. భారత దేశపు వాస్తవిక నవలల విషయంలో ఈ అంశం కచ్చితంగా నిజమని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రేంచంద్ నవల గోదాన్ కోసమై వ్రాసిన ఉపోద్ఘాతంలో వసుధ దాల్మియా ఉటంకించారు. చరిత్రకారులు, సామాజిక స్పృహ ఉన్న మేధావులు కనుగొనే ఊహలను, ఆవిష్కరణలను దశాబ్దాలకు మునుపే సాహిత్యం అపేక్షిస్తుంది అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. మీకు తెలిసే ఉంటుంది, థామ్సన్ (E. P. Thompson) 1966లో టైమ్స్ పత్రికలో History from below అన్న వ్యాసం ప్రచురించారు. సాహితీ విమర్శకులుగా మనం ఆయనను అనుసరించి సాహిత్యాన్ని నిమ్నవర్గాల దృక్కోణంలోంచి చూసే ఒక బహుశాస్త్రీయ ప్రణాళికను నిర్మించవచ్చు. ఈ విషయం ఇట్లా ఉంచితే, నేను హరీష్ త్రివేదితో కలిసి 2006 సంవత్సరంలో ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీకి (E.P.W) ఒక ప్రత్యేక సంచిక చేసినప్పుడు ఈ విధమైన చారిత్రక ప్రణాళికను ఉద్దేశించి కొన్ని సూచనలను చేయడం జరిగింది. హిస్టరీ ఫ్రమ్ బిలోను ధ్వనిస్తూ లిటరరీ వ్యూ ఫ్రమ్ బిలో అనే సూచన చేశాము. దరిమిలా ఇక్కడ, అమెరికాలోనూ మేము ఏర్పాటు చేసిన తులనాత్మక భారతీయ సాహిత్య సమావేశాలలో ఈ ప్రణాళికను ప్రస్తావించాము.


సేనాపతి వాస్తవికత్వపు పోకడను వర్ణన ప్రధానమైనదిగా (descriptive) కాక, విశ్లేషణ పూరితమైనదిగా (analytical) చూడాలని మీరు పాఠకులను ప్రోత్సహించారు. ఐతే, మీరు ప్రతిపాదించిన ఈ పద్ధతి రెండు రకాల ప్రభావాలు కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. మొదటగా, విశ్లేషణ పూరిత వాస్తవికవాదం మనం పరంపరగా అందుకొన్న వాస్తవిక ధోరణుల పట్ల ఉన్న అసంతుష్టికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ విషయంగా పాల్ సాయర్, మొహాపాత్ర, వెల్చేరు నారాయణరావు లాంటి వారి రచనల్లో మనకు ఉదాహరణలు కనిపిస్తాయి. వాస్తవికత చాలమంది విమర్శకులకు ప్రస్తుతం ఉన్న వాదాల మీద కలిగిన హేతుపూరితమైన అసంతృప్తిని సూచిస్తుంది. చూడబోతే, వీరందరూ వాస్తవికతను వీడకపోయినప్పటికీ, దీనిని గురించి క్రొత్తగా మునుపెన్నడు లేనట్లుగా వ్రాస్తున్నారు. రెండవది, ఆఫ్రికా నుండి, ఇండియా నుండి వెలువడుతున్న దేశీయ నవలలను ఇక యూరోపియను చట్రాలకు బిగించనవసరం లేని కారణంగా, విశ్లేషణాపూరితమైన వాస్తవికవాదం నవలావిశ్లేషణ పద్ధతులలో సమూలమైన మార్పులను తీసుకురాగలిగింది.

వర్ణన ప్రధాన వాస్తవికవాదానికి, విశ్లేషణాపూరిత వాస్తవికవాదానికి మధ్య ఉన్న అంతరం యొక్క అంతరార్థం మీకు లూకాచ్ (Georgy Lukacs) సహజత్వపు, వాస్తవికత్వపు నవలల మధ్య చూపిన భేదంలో ప్రతిధ్వనిస్తుంది. లూకాచ్ వాదం ప్రకారం సహజత్వాన్ని ప్రతిబింబించే నవలల్లో కొన్ని కేవలం వర్ణన ప్రధానమైనవి కాగా, మరి కొన్నింటిలో, ఉదాహరణకు బాల్జాక్ వ్రాసిన నవలల్లో, అంతర్లీనంగా ఉన్న సామాజిక, చారిత్రక నేపథ్యాల ధోరణులకు వివరణలు సైతం కనిపిస్తాయి. ఈ రెండవ పద్ధతిలో వ్రాయబడ్డ నవలలు వాస్తవికత్వాన్ని ఇంకా గాఢంగా ఎత్తి చూపుతాయి. వివరణ ప్రధానమైన ఈ నవలలు సంస్కృతిలో భాగంగా పైకి కనిపించే వాటినే కాకుండా, అంతర్హేతుకంగా పని చేసే వివిధ శక్తుల నిమిత్తకారణాలను కూడా తమ వివరణల్లో పొందుపరుస్తాయి.

లూకాచ్ ఈ అంతరాన్ని ఆయన చేసిన నవలావిశ్లేషణలకు సంతృప్తికరంగా వర్తింపజేయలేక పోయినప్పటికి, ఆయన చూపిన ఈ భేదం చాలా విలువైనది. నిజానికి ఆయన అభిరుచులే ఆయనను పరిమితం చేశాయి. ఆయన యూరొప్‌కి చెందిన కొందరు ఆధునిక రచయితల రచనల పైన చేసిన ప్రతిస్పందనలు తప్పుదోవ పట్టించే విధంగా ఉంటాయి. కాని, మన పరిధిలో, మన ప్రయోజనార్థం లూకాచ్ నవలల మధ్య చూపిన ఈ అంతరాన్ని గుర్తించడం చాల ముఖ్యం. ఈ గుర్తింపు ద్వారా ఈ నవల లోని జ్ఞానసంపదని, రచనాప్రక్రియలకు చెందిన వృత్తాంత స్వరూప సృజన స్థాయిలను, మనం సరిగా అర్థం చేసుకోగలం.

మన సాహిత్యానికి తిరిగి వస్తే, సేనాపతి సృజించిన కథకుడు ఒక ముఖ్యమైన సాహితీ సృష్టి అని నేను, నాతో పాటుగా మరికొందరము, వాదించాము. సేనాపతి తన సృజన కోసం మౌఖికమైన సాంప్రదాయాల పైన, ఇతర సాంఘిక, సాంస్కృతిక ఆచారాల పైన ఆధార పడ్డాడు. అందువల్ల, కేవలం కథన ప్రక్రియ ద్వారా ప్రతిబింబత్వంతో సాధ్యంకాని లోతైన వాస్తవికతను మరింత గాఢంగా ఆయన సృష్టించగలిగాడు. ప్రతిబింబత్వం కేవలం దృశ్యమానమైన సమాజ పరిస్ఠితులను విశ్వాసపాత్రంగా వర్ణించగలుగుతుంది. అంతే. కాని, సేనాపతి సృష్టించిన కథకుడు పాఠకుడిని ఒక క్రియారూపక సహభాగిగా మారేందుకు ప్రేరేపిస్తాడు. అందులో పాఠకుడి పాత్ర కథనాన్ని ఊరికే తెలుసుకోవడానికే పరిమితం కాదు. పాఠకుడు సామాజిక దృక్పథాలతో సమ్మిళితంగా ఉన్న నిర్హేతుక పక్షపాత వైఖరులను కూడా తెలుసుకో గలుగుతాడు.

ఇదే అభిప్రాయాన్ని పాల్ సాయర్ జార్జి ఎలియట్‌ను, సేనాపతిని పోల్చుతున్న సందర్భంలో వెలిబుచ్చాడు. హిమాంశు మొహాపాత్ర సైతం ఇదే భావనను ఛ మన ను గోదాన్‌తో పోలుస్తూ చేశాడు. ఉల్కా అంజారియా 2006 E.P.W వ్యాసం (శ్రీ లాల్ శుక్లాను, సేనాపతిని పోలుస్తూ), జెన్నిఫర్ వార్గాస్ వ్రాసిన తులనాత్మక వ్యాసం కూడా ఈ కోవకు చెందినవే. నారాయణ రావు రచనల్లో, తిలోత్తమ మిశ్ర బారువాను, సేనాపతిని పోల్చుతూ చేసిన రచనలో కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. నా దృష్టిలో ఈ E.P.W సంకలనం ద్వారా వెలువడ్డ ప్రతి వ్యాసం కూడా ఒక బహుళవర్ష ప్రణాళికను ప్రేరేపిస్తుంది. సాహిత్యంలో వర్ణన ప్రధానమైన వాస్తవికతకు, విశ్లేషణ ప్రధానమైన వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాలను విస్తారంగా శోధిస్తూ అవి భారత దేశ పరిస్థితులకు ఎలా వర్తిస్తాయో అని సిద్ధాంత గ్రంథాలు వ్రాయవచ్చును. దీని వలన, భారతీయ చారిత్రాత్మక నేపథ్యంలో వాస్తవికత్వపు ధోరణులను గురించి మరింత కూలంకషంగా తెలుసుకొనగలిగే అవకాశం లభిస్తుంది. ఇంతకు పూర్వమే ప్రస్తావించిన కుంకుమ్ సంగారి 1980ల్లో రూష్దీని, మార్కెజ్‌ని పోల్చుతూ వ్రాసిన వ్యాసం, లేదా ఒడియా ఆదివాసి కవి భీమ బోయి, స్వామి వివేకానందల గురించి ముక్తి లాఖి మంఘారం చేసిన తులనాత్మక విశ్లేషణ సైతం ఈ కోవ లోకి చెందినవే అని చెప్పవచ్చు.

మీరు విశ్లేషణ పూరిత వాస్తవికవాదం గురించి చేసిన రెండవ సూచన ఇంకోసారి చూద్దాం. 19 వ శతాబ్దపు భారత దేశంలో వాస్తవిక సాహిత్య పద్ధతిని అధీన (subaltern) దృష్టికోణం నుండి వలసవాద వ్యతిరేక చైతన్యాన్ని సాధించడానికై అప్పుడప్పుడు ఉపయోగించేవారని మీ వాదం. దీని ద్వారా మీరు మొత్తంగా వాదపు ప్రాథమిక కేంద్రాన్నే మారుస్తున్నారు, అంటే యూరోపియన్ సాహితీ విమర్శకు ప్రధానమైన నిష్పాక్షిక దృక్పథం, సామాజిక సంఘర్షణ, బూర్జువా వర్గాల ఆవిర్భావం, ఇంకా బూర్జువా విశ్వదృక్పథం వంటి వాటి నుండి దృష్టిని వాస్తవికవాద కథన ధోరణుల్లో అంతర్లీనంగా ఉండే కథకుడి స్వరం, భావం, చూపు, వ్యంగ్యభరితమైన వ్యాఖ్యానం, కథనం లోని నిలుపుదలలు, మౌనాలు, వెల్లడులు లాంటి వాటికి మార్చుతున్నారు. వాస్తవికత అంటే, కనీసం ఒక స్థాయిలో, కేవలం ఒడియా, అసామీ, పాలా సంప్రదాయాల్లో వ్యక్తమయ్యే ప్రదర్శన స్వరానికీ, సంస్కృత, ఆధునిక ‘బెంగాలి బాబు-వ్యతిరేకి’ విమర్శకుడికీ మధ్య జరిగే ఘర్షణగా చెప్పవచ్చా? ఈ విధమైన విశ్లేషణ మనలను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది, ఏమి చూసేలా చేస్తుంది?

నా వాదాన్ని వాస్తవిక నవలలన్నింటికి వర్తించకూడదు. ఎందుచేతనంటే, ఇంకా ఎంతో సాహిత్య, చారిత్రక ప్రధానమైన పరిశోధన జరగవలసి ఉంది. ఐతే, విశేషంగా ఈ విశ్లేషణ ద్వారా మనం అధీన దృక్కోణం (sub-altern perspective) గురించి చాలా తెలుసుకోవచ్చు. ఈ చర్చ మనలను సాధారణంగా అధీన ఆలోచనా సరళి, విచారాల పట్ల నిర్మాణ క్రమవాదులు వినిపించే సంశయవాదాల నుండి విముక్తి కలిగిస్తుంది. కొన్ని సందర్భాలల్లో అధీన దృక్కోణాన్ని బలమైన వేరే దృక్పథాలు ముంచేస్తాయి అని చెప్పటం సరైన విషయమే అయినా, చారిత్రక, సామాజిక సందర్భాలను అధిగమించి అతిగా సాధారణీకరింపబడిన ఏ ఒక్క అభిప్రాయం కూడా పూర్తిగా సరైనది కాదు.

అనుభవ పూర్వకంగా మనం తెలుసుకోలేని విషయాలెన్నో ఉన్నాయి. కేవలం ఈ ఒక్క కారణం వల్లనే ఆధీన దృక్కోణంపై సంశయ పడకూడదు. అధీన దృక్కోణాన్ని గురించిన ఏ ప్రశ్నయినా కూడా సంపూర్తి గానూ, ప్రాథమికం గానూ, సైద్ధాంతికమైనదే అయివుండదు. అటువంటి జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే మనకు ఆత్మార్థకమైన, సందర్భోచితమైన సైద్ధాంతిక సాధనాలు కావలసి ఉంటుంది. చరిత్రకారులు, ఇతర సామాజిక శాస్త్రజ్ఞులు చేసే కృషి ఇక్కడ బాగా పనికి వస్తుంది. మీరు సూచించిన విమర్శకులు చేసే సాహితీ విశ్లేషణ కూడా ఒక యుక్తమైన అంశమే. థామ్సన్ వ్రాసిన Moral economy of the crowdలో (1971), లేదా జేమ్స్ స్కాట్ (James Scott) వ్రాసిన Weapons of the weakలో, ఇటువంటి సంశయవాదం మచ్చుకైనా కనిపించదు. హాబ్స్‌బామ్ (Eric Hobsbawm) సంశయ వాదాన్ని యదార్థమైన పరిశోధనా సందర్భాల్లో, భావజాలపరమైన పక్షపాత వైఖరుల్లో, ఇంకా సైద్ధాంతిక పద్ధతిలో ప్రకటిస్తూ ఎంత జాగరూకతతో, ఆత్మార్థక దృష్టితో ‘గ్రాస్ రూట్స్’ చరిత్రను నిర్మిస్తాడో గమనించండి.

కేవలం ఉత్తర నిర్మాణక్రమవాదం చేత ప్రభావితం కాబడ్డ పక్షాల్లో కనిపించే మితిమీరిన దుస్సందేహ విధానం ఒక్కటే కాదు పరిశోధకులుగా మనకు ఉపలబ్ధంగా ఉన్నది. మంచి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భాల్ల్లోనే, సాహితీ విమర్శకులు ఉపయోగకరమైన వ్యాఖ్యానాలు చేయవచ్చు. అధీన వ్యక్తి అన్నవాడు మాట్లాడలేడు, అతడు చెప్పింది మనం అర్థం చేసుకోలేము అని వాదించే ముందు — ఉదాహరణకు, మౌఖికమైన, అభినయ ప్రదర్శన ప్రధానమైన సంప్రదాయాల నుండి వెలువడిన — ఏ విధమైన సాహితీ పద్ధతులు మనకు దేశీయ సాహిత్యాల్లో నిబిడీకృతంగా ఇమిడి ఉన్న విమర్శను చూపిస్తాయి అని విమర్శకులు అడిగితే బావుంటుంది. అసమియా రచయిత హేమచంద్ర బరూవాతో సేనాపతిని జతచేసి చదివినట్లైతే, తిలోత్తమ మిశ్ర చూపినట్లుగా, ఈ రకమైన విశ్లేషణకు ఆస్కారం ఉంటుంది. (ఈ మౌఖిక సంప్రదాయాన్ని, నవలల్లో కథన ప్రక్రియ మీద విశ్లేషణను ఖండాంతరాలకు వర్తింప జేస్తే, సేనాపతి వ్రాసిన నవలను, ఉదాహరణకు ఆమోస్ టుటుఒలా (Amos Tutuola) 1952లో యోరుబా జానపద గాథలపై ఆధారపడి వెలువరించిన The Palm-Wine Drinkardతో పోల్చవచ్చును.)

మీరు చెప్పిన దాన్ని పునఃపరిశీలిస్తే గనుక, వాస్తవికవాద నవలకు నిష్పాక్షిక సామాజిక వాస్తవికత్వం ముఖ్యం కాదు అని తెలియజేసే ఉద్దేశమేమీ నాకు లేదని స్పష్టం అవుతుంది. సాహిత్యంలో నిష్పాక్షిక వాస్తవికత్వాన్ని ప్రతిబింబించడం ప్రకృతికి అద్దం పట్టి అతి సూక్ష్మమైన విషయాలను వర్ణించడం ద్వారా సాధ్యపడదు అనే నేను చెప్పడం. మనం చర్చిస్తున్న ప్రతి నవల, ప్రతిబింబత్వం ఏ విధంగా జ్ఞానమీమాంసక ప్రాధాన్యం కలిగి వుంటుందో చూపగలగాలి. భారత దేశానికి, ఆఫ్రికాకి చెందిన నవలలు ఆధారపడే జానపద గాథా పద్ధతులను విశ్లేషించే సమయంలో ఈ విషయాలని దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఇప్పుడు అనువాదం గురించి కొంచెం మాట్లాడుకుందాం, ముఖ్యంగా మీరు సహానువాదకులతో కలిసి చేసిన ఛ మన ఆఠ గుంట అనువాద ప్రక్రియ గురించి. మీ నలుగురు అనువాదం చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా అనువాద ప్రక్రియ స్తంభించిన సందర్భాలున్నాయా? ప్రత్యేకించి, ఉద్దేశపూర్వకంగా, అన్యాపదేశమైన విషయాలను సూచించేదిగా నిర్మించిన పాఠ్యాన్ని ఆంగ్లంలోకి అనువదించే క్రమంలో మీ అనువాదం ఆగిన సందర్భాలున్నాయా? మీరు ఈ నవల యొక్క మౌఖిక, ప్రదర్శనాత్మక, సాంకేతిక భాగాలను, మరీ ముఖ్యంగా కథకుడు ప్రదర్శించే వ్యంగ్య ప్రవృత్తి, వ్యక్తావ్యక్త సంశయాత్మక ధోరణి, లేదా సున్నితంగా తీర్పులు చేయటాన్ని తిరస్కరించడం వంటివి అనువదించేటప్పుడు మీరు ఏ పద్ధతులను అవలంబించారు? మీ ఉపోద్ఘాతంలో అనువాదపు మేరని గురించిన కొన్ని సూచనలు కనబడతాయి. ఉదాహరణకు, ఉపోద్ఘాతంలో మీరు గ్రామంలో చెరువు దగ్గర స్త్రీల సంవాదాల్లో లాల్ బిహారి డే ప్రాచ్యవాద భావాలను వ్యంగ్యంగా చిత్రీకరించే విధానాన్ని వర్ణిస్తారు. ఈ రకమైన అనువాద ప్రక్రియ మీకు మీ సహానువాదకులకు 19వ శతాబ్దపు భారతీయ వాస్తవిక నవల ఒక ఘనీభవించిన ఉపరితలంలా కాక వివిధ భాషలకు చెంది అప్పటికే అనువదింపబడ్డ సాహిత్యపు ఒక పొరలా అనిపించిందా?

అవును. మీరు ఊహించినట్లుగానే మా అనువాద ప్రక్రియ చాల సార్లు స్తంభించింది. ఈ పని చాల కష్టమనే చెప్పాలి. సేనాపతి భాష విభిన్న స్థాయిలలో కథనాన్ని వ్యక్తం చేస్తుంది. చిన్నకారు రైతులు ఉపయోగించే నుడికారాల నుండి ఉన్నతకులాలు వాడే సంస్కృతీకరించబడ్డ ఒడియా భాష, పారశీక ప్రభావితమైన పద సరళి నుండి ఆంగ్ల సంస్కృత భాషల (ఆధిపత్యం కలిగినవిగా) ప్రత్యక్ష ప్రతిధ్వనులు, ఇంకా చెప్పాలంటే అనాపేక్షితంగా వచ్చే సాదాసీదా కథన పద్ధతి నుండి నిశితమైన వ్యంగ్య ధోరణి వరకు, ఇవన్నీ ఆంగ్లీకరించడానికి గాను భాషను చాలా వరకు చదును పరచవలసి ఉంటుంది. (ఇంతకు పూర్వం జరిగిన హిందీ అనువాదం చాలా బాగుందని విన్నాను. అలాగే తెలుగు అనువాదం గురించి కూడా విన్నాను. కొందరు బెంగాలీ పాఠకులు బాంగ్లా అనువాదం మూల భాషా ధ్వనిని కోల్పోయిందన్న అసంతృప్తిని వ్యక్తపరిచారు. బాంగ్లాలో సంస్కృతీకరించబడిన ‘సాధు’ నుడికారాన్ని మిగతా నుడికారాలన్నింటికన్నా ఎక్కువ విలువైనదిగా భావిస్తారు. ఇది ఒక కారణం కావచ్చు.)

ఈ నవల కేవలం సాహితీవేత్తలే కాకుండా ఆసక్తిపరులైన పాఠకులందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, మేము అత్యవసరం అనుకున్న పాద వ్యాఖ్యలను, ఒక పట్టికతో పాటుగా, నవల చివరలో జత చేయడం జరిగింది. మా సంపాదకురాలు, లిండా నార్టన్, నాతో ఈ ఉపోద్ఘాతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధారణ పాఠక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని వ్రాయమని సూచించింది. ఒకవేళ ఇదే పనిని ఇప్పుడు చేయవలసి వస్తే, నేను ఇంకోలా చేస్తాను. పాఠకుడికి ఈ నవలను కనీసం రెండు సార్లయినా చదవాలన్న విషయాన్ని ఖరాఖండిగా వివరిస్తాను. మొదటిసారి మీరు కథను తెలుసుకోవడానికి మాత్రమే చదువుతారు. మీకు నవలలో అప్పటికి అత్యంత ఆసక్తికరమైన విషయం బోధపడదు. ఏది ఏమైనప్పటికీ, నేను, పాల్ సెయింట్ పియేర్‌ మొదటిసారిగా అనువాదంలో పాల్గొనటం ప్రారంభించిన తరువాత వెలుగు చూసిన మొదటి చిత్తుప్రతి చాలా బిరుసుగా ఉన్నప్పటికీ, ఈ నవల లోని సంక్లిష్టతను — బాఖ్తిన్ సిద్ధాంతీకరించినట్లు గద్యంలోని లయను, సేనాపతి యొక్క స్వరాన్ని — చాలా వరకు ప్రతిబింబించింది. ఈ అనువాదం రబి శంకర్ మిశ్ర అప్పటికే చేసిన వ్యాఖ్యానాన్ని పరిగణన లోకి తీసుకొన్న తరువాత జరిగింది. (అనువాదం చిత్తుప్రతి మిశ్ర, జతీంద్ర నాయక్ ఇరువురూ కలిసి చేశారు).

ఈ ప్రతిని మరింత కూలంకషంగా పరిశీలించి, సాధ్యమైనంత వరకు సేనాపతి ఒడియాకు చేరువగా ఉంచాలని మా ఉద్దేశం. ఐతే, ఇదంతా చేస్తూనే నుడికారాన్ని, శైలిని కూడా చదవడానికి యోగ్యంగా, సరళతరంగా ఉంచే ప్రయత్నం చేశాము. మేము కొన్ని పదాలను అనువదించకుండానే వదిలివేశాము (ఉదా: ‘నబత’) ఇటువంటి పదాలకు ఆంగ్లంలో సరిసమానమైన పదాలు లేవు. ఏదేమైనా, సందర్భోచితంగా వాటి అర్థాలు బోధపడతాయి. అలాగే, మరి కొన్ని పదాలను — కోస్ (అంటె రమారమి రెండు కిలోమీటర్లు) వంటివి, సేనాపతి కాలంలో వ్యావహారికంగా ఉపయోగింపబడి ప్రస్తుతం వాడుకలో లేని పదాలను కూడా అనువదించకుండా వదిలేశాము. మేము ప్రస్తుత సమయం నుంచి నవలాకాలపు చారిత్రక దూరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయానికి ప్రాధాన్యత సంతరించాలన్న ఉద్దేశ్యంతో ఇటువంటి పదాలను మూలభాష లోనే ఉంచాము. ఆఖరుగా, మా పదజాలం సగటు భారతీయుడు కాని పాఠకుడు ప్రతిస్పందించ గలిగేలాగా ఉండాలి. ఉదాహరణకు, ‘చరిత’ పద్ధతిని అన్యాపదేశంగా ఉపయోగించాము. ‘రామచంద్ర మంగరాజ చరిత’ అన్న పదసమూహాన్ని ‘ది లైఫ్ ఆఫ్ రామచంద్ర మంగరాజ్’ గా అనువదించాము. ఇందులో మొదటగా వచ్చే ప్రతి అక్షరాన్ని కాపిటల్ కేస్‌లో పెట్టటం జరిగింది. ఇటువంటి నిర్ణయాల వల్ల, మా ఈ తర్జుమా సూక్ష్మంగా పశ్చిమ దేశాల్లోని ‘లైవ్స్ ఆఫ్ సెయింట్స్’ పద్ధతిని సూచిస్తుంది. ఈ సందర్భంలో కథకుడు చాలా వ్యంగ్యాన్ని ప్రదర్శిస్తాడు. పాఠకులు ‘చరిత’ని బయాగ్రఫీగా అనువదించిన పక్షంలో ఈ వ్యంగ్యాన్ని అర్థం చేసుకొనే అవకాశాన్ని కోల్పోతారు.

కొన్నింటిని అనువాదంతో పాటుగా విస్తారమైన పాదవ్యాఖ్యలతో వివరించాల్సి వచ్చింది. రబి శంకర్ మిశ్రతో పాటుగా నేను అనువాదం ఆఖరులో ఇవి జత చేశాను. కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రెస్ కాపీ ఎడిటర్ మాకు చాలా తోడ్పడ్డాడు. ఈ నవలలో భారతీయ తత్త్వశాస్త్రంలో అంతర్భాగమైన ‘న్యాయ’ శాఖను రచయిత పెక్కు సందర్భాల్లో సూచన ప్రాయంగా ప్రస్తావిస్తాడు. మేము దీన్ని ముందు గమనించిన దానికన్నా ఎక్కువ సార్లు కనిపించింది. ఇందు కోసమై మేము పాఠంలో ఈ సూచనల పొరను పాఠకుడు గమనించేలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది. అదే సమయంలో ప్రస్తావన జరిగిన ప్రతిసారి వ్యాఖ్యానించడం కొంచెం అతి అని కూడా అనిపించవచ్చు. అందువలన దీర్ఘ వ్యాఖ్యానాలను చేయలేదు.

ఈ నవలపై నేను వ్రాసిన వ్యాఖ్యానం కూడా ఒక రకమైన అనువాదం అని వాదించవచ్చును. రబి మిశ్ర తన 1991-92 వ్యాసాల్లో, పాల్ పియేర్‌ చేసిన విధంగా అనువాద సిద్ధాంత దృక్పథంతో వ్యాఖ్యానం చేశారు. కథకుడి ప్రాధాన్యతతో పాటు నవలలోని ‘ఉపమాత్మక అంతరార్థం’ (Metaphorical subtext, నా పరిభాషలో) ద్వారా కథన ప్రక్రియ ఆవిష్కరించే దాని కన్నా ఘనంగా, పాఠ్యం యొక్క అన్యాపదేశ స్థాయి ద్వారా నవలలోని అధీన విలువలను నేను చూపదలచుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే, అనువాదాన్ని దశలవారీగా జరిగే ఒక ప్రక్రియగా చూడవచ్చు. ముందుగా పదాల ఎన్నికతో మొదలై, తరువాత వాక్యాల కూర్పు, వివరణలతో పాదవ్యాఖ్యలు కొనసాగుతాయి. ఆఖరున వ్యాఖ్యాన ప్రధాన వ్యాసాలు వస్తాయి. ఈ వ్యాసాలు సమకాలీన భారతీయ పాఠకుడికి భారతీయ నవల పైనున్న అభిప్రాయాల్ని ఎదిరించి, అదిలించే విధంగా ఉంటాయి, మరీ ముఖ్యంగా గ్రామీణ జీవనానికి అద్దం పట్టే నవల ఏ విధంగా ఉంటుందో వివరిస్తాయి. అనువాదాలు, వ్యాఖ్యాన వ్యాసాల మాదిరిగానే, మన సమకాలిక పరిస్థితులతో విమర్శనాపూరిత సంబంధం కలిగి ఉంటాయి. ఛ మన లాంటి సంక్లిష్టమైన రచనలు మనలను మంచి పాఠకులుగా మారుస్తాయి. ఇలాంటి నవలలు వాటికి కావలసిన పాఠకులను కాలానుగుణంగా అవే తయారు చేసుకుంటాయి. ఇలా మంచి పాఠకులుగా మారే ప్రక్రియ కేవలం ఒక ‘సాహితీ’ ప్రక్రియ మాత్రమే కాదు. ఎందుకంటే, ఈ ప్రక్రియ పాఠకులు జీవించే విస్తారమైన సంస్కృతి, అందులోని అలవాట్లు, భావజాలపు పెట్టుబడులపై ఆధారపడి ఉంటుంది. మన దృక్పథాలలో నిక్షిప్తమై ఉన్న కొన్ని భావాలను — నాగరిక దృక్పథాలు గ్రామీణ దృక్పథాల కన్నా మెరుగైనవి, వ్రాత మౌఖికమైన దానికన్నా ప్రధానమైనది — వంటి వాటిని ఛ మన నవల సవాలు చేస్తుంది.

నవల యొక్క మౌఖిక పరిమాణం అనువాదం చివరి దశలో కనిపిస్తుంది. ఐతే, ఒడియా జానపద ప్రదర్శన పద్ధతి పాలాతో ఈ నవలకు గల అనుబంధం సంగతి నాకు తరువాత తట్టింది. ఉపోద్ఘాతంలో నేను గుర్తించిన ‘టౌటర్'(Tauter) అనబడే సామాజిక నమూనా (social type) పాలా ప్రధాన గాయకుడికి దగ్గర బంధువు. ఎందుచేతనంటే, ఇరువురూ వ్యంగ్యాన్ని విస్తారంగా ఉపయోగిస్తారు. హేమచంద్ర బరూవా రచన ‘ఫెయ్‌ర్ వితౌట్, ఫౌల్ వితిన్’కి తిలోత్తమ మిశ్ర చేసిన అనువాదం నా ఈ అనుమానాన్ని ధ్రువపరుస్తుంది. ఈ అనువాదం ద్వారా ఒడిషాలోని ‘థియా-పాలా’ సాంప్రదాయాల మధ్య ఉన్న సంబంధాలు నా కర్థమయ్యాయి. ఆసాం ఒడిషా మధ్య విస్తారమైన సాంస్కృతిక అనుసంధానాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు శంకరదేవుని కాలం (15 వ శతాబ్దం) నుండి ఉన్నాయనీ, ఈ విషయంగా ఇరు భాషల పాలా పద్ధతులు శతాబ్దాలుగా ఒకరినొకరు ప్రభావితం చేసుకొని ఉంటాయి అనీ అసామీయ జానపద సంప్రదాయాలపై పనిచేసే పరిశోధకులు నమ్ముతారు. ఈ విషయాన్ని తిలోత్తమ మిశ్ర నాతో స్వయంగా ఒక సందర్భంలో చెప్పారు. నేను ఈ విషయంగా ఇంకా అవగాహన పెంచుకోదలచుకున్నాను. నాకు తెలిసి ఇంకా దీనిపై ఎవరూ పరిశోధన చేయలేదు. పాలా ప్రతిధ్వనులు బరూవా, సేనాపతి రచనల్లో ఇంకా నిశితంగా పరిశీలించగలిగితే బావుంటుంది.

పాలా’కీ తూర్పుభారతంలో ఉద్భవించిన సాహిత్యానికీ మధ్య ఉన్న సంబంధాలను తెలుసుకోవాలంటే పాలా ఆసాం, బెంగాల్ (బాంగ్లాదేశ్ సహితంగా), ఇంకా ఒడీషాలో ఏ విధంగా పరిణామం చెందిందో అన్న విషయాలను తెలియజేసే ఒక సమగ్రమైన చరిత్రొకటి కావాలి. ఈ మూడు క్షేత్రాల్లోని పాలా సంప్రదాయాల మధ్య జరిపే తులనాత్మక పరిశీలన చాలా జ్ఞానదాయకంగా ఉంటుంది. ఆసాంలో పాలా అన్నది ఆదివాసి ప్రార్థనా సంప్రదాయం నుండి ఉత్పన్నమైంది అని తెలుసుకున్నప్పుడు నాకు చాలా విస్మయం కలిగింది. నా ఉద్దేశ్యంలో నాందేవ్ 14 వ శతాబ్దంలో ప్రాచుర్యం కలిగించిన కీర్తన పద్ధతి కూడా ఈ సంప్రదాయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చునని. ఛ మన తో నాకు కలిగిన అనుబంధం నేను చిన్నప్పుడు చూసిన మౌఖిక ప్రదర్శన ద్వారా ఏర్పడి ఉండవచ్చును. నాకన్నా ఏడు సంవత్సరాలు పెద్దయిన మా అన్నయ్య ఈ నవలలోని హాస్యభరితమైన సన్నివేశాలను నాకు చదివి వినిపించేవారు. అప్పుడు నా వయసు ఇంకా ఇరవై కూడా దాటలేదు. నాకు బాగా గుర్తు, ఆయన ఒక్కొక్కసారి పూర్తిగా కుర్చీ మీద నుండి క్రింద పడేటంతగా మరీ నవ్వేవారు. ఒడీయా సాహిత్యంలో సేనాపతి నవలలకు చాలా అగ్రస్థానం ఉన్నప్పటికిని, నేను ప్రప్రథమంగా ఈ నవలలను ఏ సాహిత్య కారణం గానో చదవలేదు. ఈ నవలను మొదటి సారిగా చదువుతున్నప్పుడు ఏ పరిశోధనా దృష్టి తోను చదవవలసిన పనిలేదు అన్నది నాకు ఒక సంతోషకరమైన విషయం. గత కొన్ని దశాబ్దాలుగా నా ప్రయత్నం అంతా, తెలిసి చేసినా తెలియక చేసినా, ఈ నవలతో నా ప్రప్రధమ పరిచయం ఎందువల్ల అంత ప్రభావవంతం గాను, శక్తివంతం గాను ఉన్నదో అని తెలుసుకోవడమే. ఈ ప్రభావం యొక్క మూలాన్ని అక్షరబద్ధమైన పాఠ్యంలో, దాని సాంస్కృతిక మూలాల్లో కనుక్కోవాలని నా ఉద్దేశం.
--------------------------------------------------------
రచన: భరణి కొల్లిపర 
 మూలం: 
ఈ ముఖాముఖీ 2011 అక్టోబర్, నవంబర్ మాసాల్లో 
రష్మి దూబే భట్నాగర్, రాజేందర్ కౌర్ 
సంయుక్తంగా నిర్వహించారు.
ఈమాట సౌజన్యంతో

No comments: