Saturday, May 18, 2019

సాహిత్యంలో చాటువులు - 2


సాహిత్యంలో  చాటువులు - 2

సాహితీమిత్రులారా!


“పరోపకారాయ ఫలంతి వృక్షాః / పరోపకారాయ దుహంతి గావః
పరోపకారాయ వహంతి నద్యః / పరోపకారార్థ మిదం శరీరం!”

వృక్షాలు పళ్ళని, ఆవులు పాలని, నదులు నీటిని యితరులకే వినియోగిస్తాయి కాని అవి అనుభవించవు కదా! అట్లే మానవులు కూడా పరోపకారంకలిగి ఉండాలి అని పై సుభాషితం తెలియ జేస్తుంది. అట్లే కొన్ని మంచి గుణాలు పుట్టుకతోనే వస్తాయి అని ఈ క్రింది సుభాషితం వివరిస్తుంది.

“ దాతృత్వం – ప్రియ వక్తృత్వం- ధీరత్వం – ఉచితజ్ఞతా/
అభ్యాసేన నలభ్యంతే చత్వారః సహజా గుణాః//

౧.దానంగుణం. ౨.మంచిగా మాటాడటం, ౩.దేనికి చలించక ధైర్యంగా ఉండడం, .౪.ఇది మంచి. ఇది చెడు అని తెలుసుకొనే జ్ఞానం కలిగి ఉండడం. అనే నాలుగు గుణాలు సహజ సిద్దమైనవి. నేర్చుకొంటే వచ్చేవి కావు. ఇటువంటి సహజ గుణాలతో కూడిన ‘రాయని భాస్కరుడు’ అనే అమాత్యుని గొప్ప దాన గుణాన్ని తెలిపే కొన్ని చాటు పద్యాలని చదివి ఆనందిద్దాం. చాటువులు హాస్యాన్నే కాదు ఆచరణని కూడా బోధిస్తాయి.

“ఏ వ్రాలైనను వ్రాయును
‘నా’ వ్రాయడు వ్రాసెనేని నవ్వులకైనన్
‘ సి’ వ్రాసి ‘తా’ వడివ్వడు
భావజ్ఞుడు రాయనార్య భాస్కరుడెలమిన్.”

‘రాయని భాస్కరునికి’ చిన్నప్పటి నుండే దానగుణం అబ్బింది అనడానికి పైపద్యం ఒక ఉదాహరణ. ఎలాగో చూడండి---

“గొప్పవాడైన రాయని భాస్కరుడు అక్షరాలు దిద్దేటపుడు ‘నా’ అనే అక్షరం వ్రాయడట! ఒకవేళ వ్రాసినా, దానిప్రక్కన అంటే ‘నా’ ప్రక్కన ‘సి’ వ్రాసి ‘తా’ వత్తు ( స్తి ) ఇవ్వడట! అనగా ‘నాస్తి’ అనేపదం వ్రాయడు. అని భావం. నాస్తి అంటే సంస్కృతంలో ‘లేదు’ అని అర్థం. సంస్కృతంలో ‘నాస్తి’ అని వ్రాయడు అన్నట్లే తెలుగులో ‘లేదు’ అని వ్రాయడు అనే ఇంకో చాటువు.

“చేకొని రాయని బాచడు
కాకాలు గుణించు పిన్నకాలము నాడే
‘ లా’ కేత్వమీయనేరడు
‘ దా’ కును కొమ్మీయ డట్టి ధన్యుడు కలడే”

రాయని భాస్కరుడు బాల్యంలో తెలుగు గుణింతాలు నేర్చుకొనే సమయంలో ‘లా’ గుణింతం వ్రాసేటప్పుడు ‘లా’ కేత్వమివ్వడట, అట్లే ‘దా’ గుణింతంలో ‘దా’కి కొమ్ము అంటే ‘దు’ అని వ్రాయడట అనగా “ లేదు” అనే రెండక్షరాలు వ్రాయడట! అతడు ఎంత గొప్పవాడో కదా! అని భావం. ఈ చాటువులు ‘ప్రతి వారు దానగుణం’ కలిగి ఉండాలని తెలియ జేస్తాయి. రాయని భాస్కరుని గొప్పతనాన్ని తెలిపే ఇంకో చాటువు.

“ సరి బేసైరిపుడేల భాస్కరులు భాషానాథ? పుత్రా! వసుం
ధరపై నొక్కడు మంత్రియయ్యే! వినుకొండన్ రామయామాత్య భా
స్కరుడో? ఔను! అయితే సహస్రకరశాఖల్లేవు? అదే యున్నవే !
తిరమై దానము చేయుచో –రిపుల హేతిన్ వ్రేయుచో –వ్రాయుచో!”

చక్కని మత్తేభ పద్యంలో, బ్రహ్మ నారదుల సంభాషణా రూపంలో పై చాటువు లిఖించ బడింది.

నారదుడు బ్రహ్మని ఇలా ప్రశ్నిస్తాడు? “ ఓ భాషానాథ ! (భాషకి అధిపతివైన ఓ బ్రహ్మదేవా!) భాస్కరులు=సూర్యులు. సరి సంఖ్య అయిన పండ్రెండుమంది (‘ద్వాదశాదిత్యులు’అని ప్రసిద్ది.) ఉండాలి కదా? ఇప్పుడు బేసి సంఖ్య అయిన పదకొండుగ కనబడుతున్నారు! ఇంకో సూర్యుడు యేమైనాడు.” అని.
అపుడు బ్రహ్మ ఇలా జవాబిస్తాడు. “ నాయనా నారదా! ఒక సూర్యుడు భూలోకంలో మంత్రిగా వెలిసాడు!”

నారదుడు – “ వినుకొండలో రాయని భాస్కరుడు అనే పేరుతో ఉన్నవాడా!”
బ్రహ్మ – “ ఔను! అతడే!”
నారదుడు – “ మరి సహస్ర కరములు అనగా కిరణాలు ( లేదా చేతులు)లేవు.”
బ్రహ్మ - “ అవిగో! అవి శత్రువులను సంహరించేటపుడు, దానము
చేసేటపుడు, వ్రాసేటప్పుడు.! కనబడుతున్నాయి కదా!”
అనగా రాయని భాస్కరుడు సూర్యునివలే గొప్ప తేజస్సు కలవాడని, శత్రుసంహారంలో , దానగుణంలో, రచనలు చేయటంలో చాల గొప్పవాడని భావం. చూసారా! దానగుణాన్ని పై చాటువులు ఎంత గొప్పగా చెప్పాయో!
-------------------------------------------------------
రచన- ‘విద్వాన్’ తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు ,
సుజనరంజని సౌజన్యంతో

No comments: