Sunday, May 26, 2019

పురాస్మృతులు


పురాస్మృతులుసాహితీమిత్రులారా!

దాశరథి కృష్ణమాచార్య గారి
స్మృతులలోని ఒక స్మృతి ఆయన మాటల్లో --

నా అచ్చైన పుస్తకాలలో మొట్టమొదటిది "అగ్నిధార." సాహితీ మేఖల పక్షాన 1949 లో అచ్చైనది. మిత్రులు శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు, శ్రీ పులిజాల హనుమంతరావుగారు ఈ పుస్తకం తొలిముద్రణ చేయించారు. నా సాహిత్యజీవితంలో తొలుదొలుత ప్రోత్సాహమిచ్చిన వారిలో ముఖ్యులు శ్రీరామానుజరావుగారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవాలకు పిలిచి, కవిసమ్మేళనాలలో పాల్గొనే అవకాశం కలిగించి, కవితా పరిమళాలు దశదిశల వ్యాపించేట్టు చేసిన మిత్రులకు నా కృతజ్ఞతలు.

అగ్నిధార అనేపేరును కొందరు ఆక్షేపించారు. అగ్ని ధారలా ప్రవహిస్తుందా? అన్నారు కొందరు. విద్యుత్తు అగ్నికాదా? అది ప్రవహించదా? సముద్రంలోని బడబ, అగ్నికాదా? అది నీటిలో అన్నివైపులా సాగిపోదా? అయినా అగ్ని ప్రవహించడాన్ని ఊహించండి. అసలు "అగ్నిధార" లోని అగ్ని అన్నపదం దేనికి సంకేతమో ఆలోచించండి. అగ్ని అనేది చైతన్యానికి సంకేతం. ఆ చైతన్యం ఒక మానవుని హృదయంలోనుండి ఇంకొకనిలోకి ప్రవహించి, ఇలా జాతినంతటినీ ఏకసూత్రాన బంధిస్తుంది. ఇలా వాదిస్తుండేవాణ్ణి. తరువాత కొన్నాళ్ళకు ఒక హిందీ పత్రికలో సుమిత్రానందన్‌ పంత్‌గారి కవిత ఒకటి ప్రచురితమైంది. అందులోని ఒకపంక్తిలో "పావక్‌ కే ప్రహాహ్‌ సీ" అన్న ప్రయోగం కనపడింది. అగ్నిధార అన్నమాటకు కడు దగ్గరగా ఉన్న ఆ ప్రయోగం చూచి నేను మరీ ధైర్యంగా వాదించేవాణ్ణి.

ఈ "అగ్నిధార"లోని ఖండికలు చాలావరకు నాజైలు జీవితంలోను, జైలులోనించి వెలువడిన కొత్తలోనూ రాసినవి. నిజాం రాష్ట్రంలో ప్రభుత్వ నిరంకుశత్వం, ప్రజల అగచాట్లు, భారత స్వాతంత్ర్యం, భారత సైన్యాల ప్రవేశం, నైజాం ప్రభుత్వపతనం - ఇవన్నీ నా ఈ రచనకు పునాదులు.

అయితే వీటితోపాటు అంతర్వాహినిగా కొంత శృంగారం వెలువడక పోలేదు. "అంగారం, శృంగారం నీ రచనలో కలగలిసి వుంటాయి" అంటాడు నా బాల్యమిత్రుడూ, ప్రముఖ రచయిత, విమర్శకుడు శ్రీ డి. రామలింగం. ఇది నాలోని ప్రత్యేకత అని అతని అభిప్రాయం, ఈరెండు భిన్నవిషయాలు కలగలసి సాగడం సాధ్యమా? అని కొందరు అనవచ్చు. దానికి ఉదాహరణలు చాలా కవుల్లో చూపుతాను - ముఖ్యంగా నా ఉర్దూకవి మిత్రులలో మఖ్దూం మొహీయుద్దీన్‌ ఎంత విప్లవకవియో అంత శృంగారకవి. అతని "సురేఖ్‌ సవేరా" చూడండి. అలాగే కైఫీ అజ్మీ, సర్దార్‌ జాఫ్రీ మున్నగువారు. సైనికుడు యుద్ధరంగంలో పోరాడుతూకూడా అప్పుడప్పుడూ తన ప్రియురాలి అందమిఅన కళ్ళను తలచుకోవడం అస్వాభావికమా? కానేకాదు. క్రాంతిని ప్రబోధించే ఎందరో కవులు కమ్మని శృంగారం రాశారు. దానికి ఉదాహరణగా నేను ఎన్నో కవితలను చూపగలను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కరకు నైజాం సిపాయీలను ఎదిరిస్తూ అరణ్యాలలో తిరుగుతున్నప్పుడున్నూ, జైల్లోనూ - మావూళ్ళో నదికి మంచినీళ్లు తీసుకుపోవడానికి వచ్చే పచ్చని అమ్మాయి, తలపులో మెదలుతుండేది. నేను జైల్లో ప్రవేశించినప్పుడు నా వయస్సు సుమారు ఇరవై. ఆకాశంలోకి తలెత్తి చూస్తే, మేఘాలు అందమైన అమ్మాయిల ఆకారాలు ధరించి, పొంగిన వక్షస్థలాలతో నన్ను కవ్వించడానికి వచ్చేవి. తల దించి జైలు బ్యారకువైపు చూస్తే, నగ్న ఖడ్గం తళతళా మెరుస్తుండగా తుపాకీకి చెక్కి, కవాతుచేసే భటుడు కనిపించేవాడు. వాణ్ణి నరికేసి , లేదా వానిచే నరకబడి, ఆ ఆకాశంలో కనిపించే మేఘభామిని వైపు వెళ్లాలనిపించేది!

నెల్లికుదురు (మానుకోట తాలూకా) గ్రామంలో పోలీసు స్టేషన్‌ నుంచి తప్పించుకుని అడవిలోపడి పరుగెత్తినప్పుడు, గుఱ్ఱాలమీద నలభై మంది సైనికులు నన్ను వెదుకుతూ వెంటాడినప్పుడు, క్షణం ఆగకుండా అరణ్యంలో పరుగెత్తుతుంటే, ఎక్కడో పది గుడిసెలు, చిన్నపల్లె. అక్కడ కాస్తసేపు ఆగి మంచినీళ్లు అడిగితే, ఆప్యాయంగా ముంతతో నీళ్లు అందించిన రైతు పిల్ల ఒయ్యారం, ఆమెకళ్లలోని అమాయికత నన్ను మైమరపించాయి. నిజామాబాదు జైల్లో కిటికీలోంచి చూస్తే, బయట మామిడికొమ్మ చిగిర్చి, పూలుపూస్తే, లక్ష ఉగాదులు ఒక్కసారి హృదయంలో దూకినట్లుండేది.

మహాకవి "ఇక్బాల్‌" రాసిన ఒక విప్లవగీతంలో -

'జిస్‌ ఖేత్‌సె దహ్ఖా\న్‌కు మయస్సర్‌ నహో రోజీ
ఉస్‌ ఖేత్‌కె హర్‌ ఖూషయె గందం కు జలాదో'

'ఏ పొలమున నిరుపేదకు దొరకదొ తిండి
ఆ పొలమునగల పంటను కాల్చేయండి'

అనే పద్యపాదం ఒకటుంది. అది చదువుతున్నప్పుడల్లా హృదయం ఉద్రేకంతో పొంగి పోయేది. కాస్త చల్లబడ్డాక ఆలోచిస్తే, ఆ పొలాన్ని కాపలాకాసే అందమైన అమ్మాయికి ఏ అపకారం జరక్కుండా ఆ పంట తగలబెట్టాలి సుమా! అనేది హృదయం.

ఇలా శృంగార వీరరసాలు కలగలసి నాలో పెల్లుబికేవి. వాటికి తార్కాణం అగ్నిధార. ప్రముఖ దేశభక్తులు, అమృతహృదయులు, కీ॥ శే॥ వట్టికోట ఆళ్వారుస్వామిగారు నాకు నిజామాబాదు జైల్లో కనిపించారు 1948లో. నేనూ, నాతోపాటు మరో ముప్ఫైమంది రాజకీయఖైదీలు వరంగల్లు జైలునుంచి నిజామాబాదు జైలుకు మార్చబడినపుడు అక్కడ అడుగు పెట్టగానే మొట్టమొదట కనిపించిన మిత్రుడు శ్రీవట్టికోట ఆళ్వారుస్వామి. ఆజానుబాహు విగ్రహం, పచ్చని దేహచ్ఛాయ, చిన్నచడ్డీ, చాలీచాలని గీట్లఅంగీ, నెత్తిన చిన్నటోపీతో, నీళ్లపంపు వద్దకు వెళుతున్నా డాయన. హత్యలుచేసి శిక్షలు పొందినవారికిచ్చే దుస్తులు ఆయనకిచ్చారు! అవే తొడుక్కుని ఆయన కాలక్షేపం చేస్తున్నాడు. నేనంటే - ముఖ్యంగా కవులంటే - ఆయనకు ఎక్కడ లేని అభిమానం. స్వయంగా కవిత రాయకపోయినా, కవిత వినాలని, చదవాలనీ ఎంతో కుతూహలం ఆయనకు. విప్లవాత్మకమైన రచన వింటే ఉప్పొంగిపోయేవాడు. జైలు గోడమీద బొగ్గుతో ఈ పద్యం రాశాను ఒకనాడు.

ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్నుబోలిన రాజు మాకెన్నడేని;
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ, కోటిరత్నాల వీణ.

ఈపద్యం కంఠస్థంచేసి తరచు చదువుతూ వుండేవాడు. జైలు అధికార్లు చెరిపినప్పుడల్లా మరోగోడమీద ఆపద్యం ప్రత్యక్ష మయ్యేది. అది నేను రాస్తున్నానని వాళ్ల దురభిప్రాయం. తరువాత ఆళ్వారు రాస్తున్నాడని కనిపెట్టారు. ఆళ్వారూ, నేనూ కలిసివున్న మూడునెల్లూ మూడు గడియల్లా గడిచాయి జైల్లో. తరువాత ఆయన్ను గుల్బర్గా జైలుకు మార్చారు. నేను హైదరాబాదు (చంచల్గూడా) జైలుకి వచ్చేశాను. అకాల మృత్యువు వాతబడిన శ్రీ ఆళ్వారుస్వామి త్యాగమూర్తి నా హృదయ ఫలకంమీద సర్వదా అధిష్ఠించి ఉంటాడు. ఆయనకు మైత్రీచిహ్నంగా ఈచిన్ని పొత్తము అంకితము చేసుకున్నాను. కల్మషాలులేని కమనీయమూర్తి, కరుణ జాలువారే అనురాగమూర్తి ఆళ్వారు. ఆయనను కోల్పోయి మేము ఎలా జీవిస్తున్నామో నాకు ఆశ్చర్యంగా వుంటుంది. అతను లేకుండా జీవించి ఉన్నందుకు నావరకు నేను సిగ్గుపడుతున్నాను. రాతముఖ్యంకాదు, చేత ముఖ్యం, అన్న ఆయన సూక్తి ఎప్పుడూ నా మనస్సులో మెదులుతుంటుంది. నా జీవితంలోకూడా అనుసరణీయమైన సూత్రం అదే.

'అగ్నిధార'ను ఈనాడు పునర్ముద్రించడానికి పూనుకున్న వారు నా మిత్రులు శ్రీచందా రాజేశ్వరరావుగారు. ఇందుకు ప్రోత్సాహమిచ్చిన వారు శ్రీ ం. ఋ. బలరామాచార్యులు, శ్రీ ఫ్. హనుమంతరావుగారలు. పునర్ముద్రింపబడిన ఈనాడు, సుమారు పదిహేనేండ్లనాటి నా జీవితాన్ని, కాలాన్ని స్మృతికి తెచ్చుకుంటే ఆనందవిషాదాలు, శృంగారవీరాలు అహమహమికతో కళ్ళముందు పరుగెత్తుతాయి. మల్లెలూ, మోదుగులూ రెండూ నాకు నచ్చినట్లు శృంగార, వీరరసాలు రెండూ నా హృదయాన్ని పొంగిస్తాయి. ఆ నాటికీ, ఈ నాటికీ ఆ రెండు రసాల రసాలాల ఫలాలను ఆస్వాదించి ఆనందిస్తున్నాను.

ఈ రెండవ ముద్రణకుగూడా పీఠిక వ్రాసి నన్ను ఆశీర్వదించిన శ్రీ దేవులపల్లి రామానుజరావుగారి సహృదయతకు నా జోహారులు.

-- దాశరథి

హైదరాబాదు
26-1-1963


వీరాంధ్రుడా!

పటు బాహాబలురైన ఆంధ్రుల గత
ప్రాశస్త్యముల్‌ వల్లె వే
యుటలో కొన్ని తరాలు దాటినవి; పూ
ర్వోదంతముల్‌ నేటి సం
కటముల్‌ తీర్పవుగాక, నాటి జ్వలితాం
గారమ్ము లీనాటి కుం
పటిలో బూడిద కప్పుకొన్నవి, రగు
ల్పన్‌ లెమ్ము వీరాంధ్రుడా!

ముక్కలు ముక్కలై చెదరి
పోయెనురా! మనజాతి, హూణ భూ
భుక్కుల రాజనీతికి క
వుంగిళు లొడ్డిన 'రాజు' చేతిలో
చిక్కెను కోటిమంది నివ
సించెడి బంగరు తెల్గునేల, నే
డక్కడ తెల్గుటంగనల
ప్రాణము, మానము దక్కకుండెడిన్‌.

నాటి మహాంధ్రరాట్‌ కరక
నత్‌ కరవాల కరాళధార ఈ
నాటికి తెల్గువాని నయ
నమ్ముల తళ్కులు పెట్టుచున్న దా
రాటము జెందుచున్నది, ప
రాజితమైన తెలుంగునేల పో
రాటమునందు గెల్చుకొని
ప్రాజ్య మహావిభవమ్ము లందగన్‌.

ఎత్తిన కత్తి డింపక జ
యేందిర నందిన పూర్వు లాంధ్రరా
హుత్తుల నెత్తురుల్‌ మసలు
చున్నవి తెల్గులగుండెలన్‌; పరా
యత్త మహాంధ్ర సంపద స్వ
య మ్మొనరింపగ పోరు సల్పగా
వత్తురు స్త్రీలు సైతము, కృ
పాణము లెత్తి జయింత్రు శత్రులన్‌.

తుంగభద్రానదీ భంగమ్ము లిరువాగు
లొరసి పారుచు రుచు లరయునపుడు,
కృష్ణవేణీ తరంగిణి నాలుకలు సాచి
ఇరుకెలంకుల 'మజా' లరయునపుడు,
గోదావరీ వీచికా దివ్యహస్తాలు
దరుల రెండిట మన్ను తరచునపుడు
మలయాచలాధూత మధు సుగంధిలవాత
పోతముల్‌ తెలగాణ బొరలునపుడు,

ఇటు విముక్తాంధ్రభూమి తీపెక్కుచుండ
అటు విషాక్తాంధ్రసీమ చేదై జ్వలించు;
ఇటు తెలుగుజాణ ముక్తిసౌహిత్య మూన
అటు తెలంగాణ దాస్య సంకటములోన!

భారతమాత ఈ తెలుగు
పాపని బొజ్జన దాని కాచి దు
ద్వార మహోగ్రదాస్య విష
బాధలు తాను భరించి, నే డిదే
స్వైరత నందగా, తెలుగు
పాపడు వీడు స్వమాతృ భారతీ
స్మేరపతాక చేత గొన
జెల్లదె ఈ తెలంగాణ భూములన్‌?
--------------------------------------------------------
రచన - దాశరథి కృష్ణమాచార్య, 
సుజనరంజని సౌజన్యంతో

No comments: