Tuesday, March 5, 2019

మనుచరిత్రము – మాఘములలో పురస్త్రీ విలాసముల పోలిక


మనుచరిత్రము – మాఘములలో 

పురస్త్రీ విలాసముల పోలికసాహితీమిత్రులారా!


అత్తఱిఁ బట్టణంబు వికచాంబురుహాక్షులు కౌతుకంబునన్
జిత్తము లుల్లసిల్లఁ గయిసేసి గృహాంగణసౌధమాలికల్
హత్తి నరేంద్రవీథిఁ జతురంగబలంబులుఁ గొల్వఁగా మరు
న్మత్తగజంబుపైఁ జనుకుమారశిరోమణిఁ జూచి రుబ్బునన్.

ఆ సమయమున మందరాద్రి సానువులలో గల అ పట్టణములో వికచాంబురుహాక్షులు బాగా అలంకరించుకుని, మనస్సు ఉప్పొంగగా, తమ ఇళ్ళ మేడలపైకెక్కి రాచమార్గాన చతురంగబల సమేతుడై ఐరావతముపై వెళుతున్న కుమారశిరోమణిని ఉప్పొంగిపోతూ చూచారు.

ఏదో ఒక అందమైన పూలతీవె తాలూకు రెమ్మ అర్ధంతరంగా కన్నుల ముందు నిలిచినట్టున్న ఆ పద్యం అల్లసాని పెద్దనార్యుని మనుచరిత్ర పంచమాశ్వాసములోనిది. రాకుమారుడు స్వరోచికి గంధర్వరాజతనయ మనోరమకూ వివాహం నిశ్చయమైనది. రాకుమారుడు స్వరోచి కల్యాణమంటపానికి లేఖస్వామి చౌదంతిపై (నాలుగు కొమ్ముల ఐరావతం) మెరవణిగా పోతున్నాడు.

వికచాంబురుహాక్షులు = విచ్చిన తామరరేకల వంటి కన్నుగలవారు; స్వరోచి రాకుమారుని వీక్షించటానికై కళ్ళు విప్పార్చుకున్నారన్న వ్యంగ్యం సులభంగా బోధపడుతున్నది. హత్తి – ఇది కన్నడశబ్దం. ‘ఎక్కి’ అని అర్థం. కొందరు వ్యాఖ్యాతలు ‘హత్తుకుని’ అని వివరించారు. కన్నడ శబ్దార్థమే ఇక్కడ సరిగ్గా అన్వయిస్తుంది.

పై పద్యాన్ని చూడగానే పోతనామాత్యుని మహాభాగవత పద్యం స్ఫురిస్తుంది. మథురానగరయువతులు శ్రీకృష్ణుని చూడటానికి పడిన తత్తరపాటును దృశ్యమానం చేసే చిన్ని కందం అది.

వీటఁ గల చేడె లెల్లను
హాటకమణిఘటితతుంగహర్మ్యాగ్రములం
గూటువలు గొనుచుఁ జూచిరి
పాటించి విశాలవక్షుఁ బద్మదళాక్షున్. (ఆంధ్రమహాభాగవతము – 10.1.1251)

ఇళ్ళలో ఉన్న వనితలు, రత్నాలు తాపడం చేసిన ఎత్తయిన బంగారుమేడలమీద పై నుండి గుంపులుగా చేరి విశాలవక్షుడు, పద్మదళాక్షుడైన కృష్ణుణ్ణి కళ్ళప్పగించి చూచారు.

మన పెద్దన పద్యం ఒక అందమైన పద్యాల వరుసకు, ఒక రసవద్ఘట్టానికి తెరతీత. నిజానికి స్వారోచిషమనుసంభవం పంచమాశ్వాసములో ఇందీవరాక్షుని శాపవృత్తాంతము, స్వరోచి ద్వారా ఆతనికి శాపవిమోచనం కలుగుట అన్నవి ప్రధానమైన ఘట్టాలు. ఆ ఘట్టాలు ముగిసిన పిదప మిగిలిన కథను – ఇందీవరాక్షుడు తన పుత్రిక మనోరమను స్వరోచికి ఇచ్చి వివాహము చేసెను, అన్న అర్థం వచ్చే ఒక్క వాక్యంతో సరిపెట్టవచ్చు. ప్రబంధప్రవరుడైన పెద్దనార్యుడు తన అసమానప్రతిభతో తదన్య ఘట్టాలను రసపరిపుష్టం చేశాడు. అందులో భాగంగా దేవకాంతల విరహవిన్యాసాలను కూర్చాడు. అదివరకు ద్వితీయాశ్వాసంలో వరూధినీప్రవరాఖ్యోపాఖ్యానంలో అప్సరోశిరోమణి వరూధిని ప్రవరుని చూసి వలచిన ఘట్టాన్ని లోకోత్తరంగా పెద్దన మలచియున్నాడు. ఆ నేపథ్యములో స్వరోచి వృత్తాంతములో తిరిగి దేవకాంతల విభ్రమాన్ని వర్ణించటంలో ఏ మాత్రం తత్తరపడినా వరూధిని సంభ్రమమే పునరుక్తి అయ్యే అవకాశం ఉన్నది. ఆ అవకాశం రానివ్వకుండా, పాఠకుని మనసుకు వరూధినిని గుర్తు తెప్పించకుండా, ఒక్కొక్క అచ్చరకాంత విభ్రమాన్ని వినూత్నంగా ఒక్కొక్క తెరగున చలనచిత్రం వలే కళ్ళకు కట్టింపజేశాడు పెద్దనార్యుడు.

ఆ ఘట్టపు తీరుతెన్నులను అనుశీలిస్తే మాఘకవి శిశుపాలవధమ్ మహాప్రబంధములోని ఒక ఘట్టం గుర్తుకు వస్తుంది.

శిశుపాలవధమ్ అన్న సంస్కృత ప్రౌఢమహాకావ్యాన్ని రచించిన మాఘుడు ఆ కావ్యం త్రయోదశ సర్గలో శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి ఏతెంచిన ఘట్టంలో ఆ నగరయోషితలు ఆ లీలామానుషవిగ్రహుని చూచిన తత్తరపాటును, సంభ్రమాన్ని, ఇతర సాత్త్వికభావాలనూ, విలాసాలను పదునెనిమిది శ్లోకాల్లో మనోహరంగా నిమంత్రించినాడు. అంతకు పూర్వం వ్యాసభగవానుడు భాగవతంలో శ్రీకృష్ణుని మథురానగరవిహారసమయాన పురస్త్రీల సంభ్రమాన్ని ఒకటి రెండు శ్లోకాల్లో వర్ణించియున్నాడు. బహుశా ఆ ఘట్టాన్ని స్వీకరించి స్వతంత్రంగా మాఘకవి ప్రబంధధ్వనియుతంగా శిశుపాలవధమ్ కావ్యఘట్టాన్ని వివరంగా మలచివుంటాడు.

శిశుపాలవధమ్ కావ్యం ఇతివృత్తనిర్వహణ విషయంలో భారవి కిరాతార్జునీయమ్ కావ్యాన్ని అనేక తావులలో అనుసరించినది. కిరాతార్జునీయమ్ దశమ సర్గలోనూ తాపసి వేషధారి అర్జునుని చూచిన అచ్చరలు, అచ్చెరువొందిన వర్ణనాక్రమం ఉన్నప్పటికీ, ఆ ఘట్టానికీ, మాఘకవి కల్పించిన ఘట్టానికి పోలిక లేదు. భారవి కావ్యంలో అచ్చరల ఉద్దేశ్యము, వారి చిత్తవృత్తులు, ప్రవర్తన, ఆంగికములు మాఘకవి నాయికలతో పోలిస్తే పూర్తిగా భిన్నములు.

మాఘకవి కల్పించిన ఆ ఘట్టాన్ని ఆంధ్రకవితాపితామహుడు అల్లసాని పెద్దన చదివి ఉంటాడు. మనుచరిత్ర నాందిలో పెద్దనార్యుడు ఆదరించి, కంఠోక్తిగా స్తుతించిన కవులలో మాఘుడొకడు. ఆ పద్యం –

వనజాక్షోపమ వామలూరుతనయున్ ద్వైపాయనున్ భట్టబా
ణుని భాసున్ భవభూతి భారవి సుబంధున్ బిల్హణున్ గాళిదా
సుని మాఘున్ శివభద్రు మల్హణ కవిం జోరున్ మురారిన్ మయూ
రుని సౌమిల్లుని దండిఁ బ్రస్తుతులఁ బేర్కొందున్ వచశ్శుద్ధికిన్.

విష్ణువు వంటి వాల్మీకిని, వ్యాసుని, భట్టబాణుని, భాసకవిని, భారవి, సుబంధుడు, బిల్హణుడు, కాళిదాసు, మాఘుడు, శివభద్రుడు, మల్హణకవి, చోరకవి, మురారి, మయూరుడు, సౌమిల్లుడు, దండి ఇత్యాది కవులను వాక్శుద్ధికై స్తోత్రములందు స్మరింతును.

బహుశా శిశుపాలవధమ్ ప్రేరణతో పెద్దన మహాకవి స్వారోచిషమనుసంభవంలోనూ అటువంటి ఘట్టాన్ని కల్పించి, పురయోషితలసంభ్రమ ఘట్టాన్ని అంతకంతకు పెంచి, తేనెలు చిందే తీయని తెలుగులో పది శ్లోకాల రమణీయవర్ణన చేశాడు.

ఒక్క పెద్దన కవి మాత్రమే కాదు. సంస్కృతప్రౌఢప్రబంధమహాకావ్యమైన నైషధీయచరితాన్ని రచించిన పదకొండవ శతాబ్దపు మహాకవి శ్రీ హర్షుడు కూడా మాఘకవి ఘట్టాన్ని పోలిన ఘట్టాన్ని నైషధకావ్యములో ఒకచోట కూర్చినాడు. నలమహారాజు పెళ్ళికొడుకై ఊరేగే సందర్భములో మహారాజును చూసి పురస్త్రీలు చేసిన హావభావ విన్యాసాలను సంస్కృతప్రౌఢకవి పదిహేనవ సర్గలో తొమ్మిది శ్లోకాలలో నిమంత్రిస్తే, ఆ కావ్యాన్ననుసరించిన కవిసార్వభౌముడు శ్రీనాథుడు తెలుగుప్రబంధము శృంగారనైషధములో ఆరు పద్యాలకు కుదించి వర్ణించినాడు. అయితే నైషధకావ్యములో కొంత వ్యత్యాసము లేకపోలేదు. నైషధ కవి శైలి కూడా వేరు. రీతి నారికేళపాకము.

తెనుగుకవికి సంస్కృతకవి ఘట్టం ప్రేరణ యేమో అన్నట్టు అగుపడినా, మనుచరిత్రలో మధుర కల్పనలకూ, శిశుపాలవధములోని కల్పనలకూ భేదం చాలా పెద్దది. తెలుగు కల్పనలు జీవం తొణికిసలాడుతూ, వలపుకత్తెల హావభావాదులను దృశ్యబద్ధం చేస్తూ, తెనుగు పలుకుబడుల తీయందనాలతో, శబ్దగుణాలతో మిసమిసలాడితే, సంస్కృతకవి కల్పనలు బిగువైన సమాసాలతో, క్లుప్తతకు ప్రాధాన్యతనిస్తూ, పాంచాలీ రీతిలో పదచిత్రాలుగా తీర్చబడినట్టు స్పష్టంగా అగుపిస్తుంది. రెండూ రెండే. ఆంధ్రకవితాపితామహుడైన అల్లసాని పెద్దన స్వారోచిషమనుసంభవ కావ్య పంచమాశ్వాసాంతర్గతఘట్టమున శిరీషకుసుమపేశలసుధామయోక్తులతో కూర్చిన మనోహరపద్యకుసుమాలను పూర్వకవి అయిన మాఘుని శిశుపాలవధమ్ త్రయోదశ సర్గ ఘట్టము నేపథ్యంలోని కొన్ని శ్లోకాలతో పోల్చి చర్చించి, అనుశీలించటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

మాఘకవి వర్ణించిన జాణలు అప్పటమైన సంస్కృత వనితలు. ఆ కవి నర్మదాతీరవాసి కనుక కాస్తో కూస్తో అక్కడి సంప్రదాయపు ఒప్పులకుప్పలు. నగరకాంతలు, ధనవంతులబిడ్డలు. నాటి స్థలకాలమాన పరిస్థితుల దృష్ట్యా అంతో ఇంతో నగరసంస్కారాన్ని అందిపుచ్చుకున్నవారు.

పెద్దన తీర్చిన గంధర్వకాంతలు పట్టణవాసులైనప్పటికీ ముగ్ధలైన పల్లెపడుచుల తీరు. వీరు అప్పటమైన తెలుగు అందాలకు ప్రతీకలు. తెలుగుప్రబంధపు ఈ ఘట్టంలో అచ్చతెనుగు నుడికారాన్ని, పలుకుబడులను, ముదితల కుతూహలాన్ని, హావభావాలను, ఇతర వేడుకలను, మనోజ్ఞంగా కళ్ళకు కట్టించాడు కవి.

‘క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః’ (క్షణక్షణానికి నవ్యంగా పరిణమించే రూపమే రామణీయత) అన్న భావానికి నిదర్శనం లాంటి పెద్దనకవి పద్యాలు ఇవీ. (అనుశీలనలో సౌలభ్యం కొరకు వరుసక్రమం మార్చబడింది)

1. అంచెలుగట్టి కాలితొడుసై
యువతుల నూపురరవళులకు రాజహంసలు పొందిన సంభ్రమాన్ని కాళిదాసు వర్ణిస్తాడు.

సా తీరసోపాన పథావతారాత్ అన్యోన్యకేయూరవిఘట్టనీభిః|
సనూపురక్షోభపదాభిరాసీత్ ఉద్విగ్నహంసా సరిదఙ్గనాభిః|| (రఘు. – 16.56)

అంతఃపురస్త్రీలు సరయూనదిలో జలకాలాటకు మెట్లవరుసనుండి దిగుతున్నారు. వారి భుజకీర్తులు (కేయూరములు) రాచుకున్న శబ్దాన్ని, వారు సోపానమార్గాన దిగుతున్నప్పుడు వచ్చిన గజ్జెల చప్పుళ్ళను విని ఆ నదిలో విహరిస్తున్న హంసలు ఉద్విగ్నం చెందాయి.

అంచెలుగట్టి కాలితొడుసై చననీవు గదమ్మ ప్రోదిరా
యంచ లివేటి సంగడములయ్యెను ’దయ్యమ యేటి వేడ్క నా’
కంచుఁ బదంబునన్ మొరయు నందియ యూడగఁ దన్నిపోయి వీ
క్షించె లతాంగి యోర్తు మురజిన్నిభుసాగరమేఖలావిభున్.

రాజకుమారుని చూడాలని ఒక లతాంగి మేడపైకి దాదాపుగా పరిగెత్తుతూ పోతున్నది. ఆమె గజ్జెల సద్దు అందంగా రవళించింది. ఆ అందెల రవళి విని, ఆ సద్దుకు మురిసి పెంపుడు రాజహంసలు కాలికి అడ్డువచ్చి తగులుకొంటున్నవి. రాకుమారుని చూచే ఆత్రుతలో ఉన్న ఆ అమ్మాయి, హంసల తాకిడికి ఆ ముగ్ధ ముచ్చటగా ‘చననీవు గదమ్మ’ అని విసుక్కుంది. ఆపై ఆ విసుగు అందెలపై మళ్ళింది. ఈ కాలిఅందెలు బంధములు (ఇనుపగుండ్లు) ఆయె’ నని, ఒక్క కాలి అందియను ఊడివచ్చేలా తన్ని, పరుగెత్తి మురారి వలే ప్రకాశించే మహారాజును వీక్షించింది. ముదిత అందెల రవళిని విని రాజహంసలు సంభ్రమముతో తమకు పరిచితమైన శబ్దం వినవస్తున్నదని, ఆ సద్దును అనుసరించటం ఒకానొక కవిసమయం. ఆ కవిసమయాన్ని ఆలంబనగా చేసికొని పెద్దనకవి ప్రస్తుతపద్యాన్ని రచించినాడు.

ఈ పద్యంలో అల్లసాని వారు దాదాపుగా ఒక పద్యచలనచిత్రాన్నే కళ్ళకు కట్టించారు. లతాంగి అనడం కొంటెతనం. తీవెలాంటి శరీరం గల అమ్మాయి, అందుకనే సునాయాసంగా అందియను తన్నగలిగింది. ‘దయ్యమ, ఏటి వేడ్క నాకు’ అన్న చోట వనిత భ్రూకుటిల విలాసాదులను ఊహించుకోవలసిందే. మొదటి మూడుపాదాల్లో అచ్చతెనుగు జిగిని చివరి పాదంలో మురజిన్నిభుసాగరమేఖలావిభుడు అన్న బిగువైన సంస్కృతసమాసముతో ముడిపెట్టాడు కవి. కవి వివక్షితమో కాదో తెలియదు కానీ ఈ పద్యాన్ని పరిశీలిస్తే ఒక చిన్న చమత్కారం కనబడుతుంది. మొదటి మూడుపాదాల శబ్దాలలో వి(క)నబడిన తత్తరపాటు, అలికిడీ నాలుగవ పాదం వరకూ వచ్చేవరకు నెమ్మదించి, చివరన సుదీర్ఘసమాసం చదువుకునేప్పుడు పూర్తిగా విరమించినట్లు ధ్వనించడం ఆ చమత్కృతి. తద్వారా లతాంగికి స్వరోచిసుందరస్వరూపసంపూర్ణదర్శనలాభం చేకూరినట్టుగా పద్య శిల్పం భ్రమింపజేస్తున్నది.

‘ఏటి వేడ్క నాకు’ – ఇప్పటికిన్నీ ముఖ్యంగా జనపదాలలో పైని పెద్దన ప్రయోగానికి సారూప్యమైన అర్థంలో ‘ఇది యాడ సంబడం మాకు’ అన్న పలుకుబడి రాయలసీమలో తరుచుగా వినిపిస్తుంది. సంగడములు, తొడుసు, మొరయు – ఇవి అచ్చమైన తెలుగు పదాలు. సంగడములు అంటే వ్యాయామానికి ఉపయోగించే ఇనుప గుండ్లు, లేదా బంధములు. తొడుసు అంటే జంజాటము. మొర అంటే చప్పుడు.

పై పద్యం ఈ క్రింది శ్లోకపు ఛాయను స్వీకరించి పెంపు చేసిందా అని అనిపించేలా, మాఘకవి పలికించిన నూపురరవళి ఇది.

వ్యచలన్ విశంకట కటీరకస్థలీ శిఖరస్ఖలన్ ముఖర మేఖలాకులాః|
భవనాని తుంగ తపనీయ సంక్రమ క్రమణ క్వణత్ కనక నూపురాః స్త్రియః||

ఒక భాగ్యవంతుని ఇంట స్త్రీలు తమ ఘనమైన కటిభాగంపై బంగరు మొలనూళ్ళు కిణకిణమంటుండగా, బంగరు గజ్జెలు ఘల్లు ఘల్లు మనిపిస్తూ, కేశవుని దర్శనార్థం ఇంటి మేడ చేరుకోవటానికి బంగరు మెట్లపైకి ఎక్కుతున్నారు.

స్త్రియః అన్న సాధారణార్థాన్ని మాఘకవి ఉపయోగిస్తే, పెద్దన లతాంగి అన్న సాభిప్రాయమైన శబ్దం ఉపయోగించారు. శంకటకటీరక, ముఖరమేఖలా, సంక్రమక్రమణ – ఇక్కడల్లా వృత్త్యనుప్రాసాలంకారం. యువతుల రశన, నూపుర రవళులకు శబ్దానుకరణగా మాఘుడు అల్లిన చమత్కారం ఈ శ్లోకం. పెద్దన లతాంగిది, మాఘుని ఇంద్రప్రస్థపుర స్త్రీలది కూడా అతికుతూహలమే. కుతూహలం రమ్యదృష్టౌ చాపల్యం పరికీర్తితమ్ – అని ఉక్తి. రమ్యమైన విషయాలను చూచి ఆనందించాలన్న తపన – కుతూహలము.

పై శ్లోకం ఒక శబ్దచిత్రం కూడా. ఈ పద్యాన్ని పైకి చదువుకుంటే వచ్చే లయ – ఈ శ్లోకార్థాన్ని తదనుగుణమైన శబ్దాలతో సంగీతపరంగా ప్రతీయమానం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ గుణం పెద్దనార్యుని కవిత్వంలో పలుచోట్ల కనిపిస్తుందని సంగీతజ్ఞుల పరిశీలన. మాఘుని శ్లోకంలోని ఈ గుణమే పెద్దనకవిని ఆ కవిపై అనురక్తునిగా చేసిందేమో!

2. చిలుకలకొల్కి కల్కి యొక చేడియ
చిలుకలకొల్కి కల్కి యొక చేడియ నాటకసాల మేడపై
నిలువుననాడుచుండి ధరణీపతి జూడదలంచి యంచునన్
నిలిచి రహిన్ కనుంగొనుచు నెయ్యమునన్ దనువల్లి యుబ్బికం
చెల తెగిపడ్డఁ గేతనము చీరచెఱంగున మూసెఁ జన్నులన్.

కనుకొలకులు చిలుకముక్కులా ఎర్రగా, అందంగా ఉండే చేడియ ఒకత్తి మేడపై నాటకసాలలో నర్తిస్తూ, మేడ అంచున నుంచుని మహారాజును వీక్షించింది. ఆమెకు వెంటనే శృంగారభావం ముప్పిరిగొనగా, తనువల్లి ఉబ్బి, రవిక ముడి జారితే, పక్కన నున్న జెండాగుడ్డను లాగి పైభాగాన్ని కప్పుకుంది.

నీవీబంధము వీడుట, పయ్యెద పొంగుట కామేంగితములు. మనుచరిత్ర ద్వితీయాశ్వాసంలో ప్రవరాఖ్యోపాఖ్యానంలో ‘ప్రాంచద్భూషణ బాహుమూలరుచితో పాలిండ్లు పొంగార…’ పద్యంలో వరూధిని కామేంగితము స్పష్టము. నీవీబంధశిథిలము శృంగారకావ్యాలలో చాలాచోట్ల కనబడుతుంది. తాళ్ళపాక తిరువేంగళప్ప తెనుగు అమరుక కావ్యంలోని ఒక ఉటంకింపు ఇది.

చనుఁగవ మిట్టలం బులకజాలము పుట్టఁగఁజేఁయఁ గౌఁగిటన్
ఘనముగ నే బిగింపఁ, దమిఁ గ్రక్కున నీవిక జాఱ మానమో
చన యిఁకఁ జాలుఁ జాలు నను సన్నపుఁ బల్కుల తోడ నిద్రవో
యెనొ సతి, మూర్ఛఁ జెందెనొ, లయించెనొ, డెందమునం గరంగెనో. (శృంగారామరుకము, 23.)

యాదృచ్ఛికంగా తాళ్ళపాక తిరువేంగళుని ఈ పద్య శైలి పెద్దన కవిశైలి వలే మాధుర్యాది శబ్దగుణాలతో, అల్పప్రాణవర్ణజాలంతో మనోహరంగా ఒప్పుతోంది.

తిరిగి మన పెద్దన పద్యానికి వెళితే – తనువల్లి, ధరణీపతి, కేతనము అన్న మూడు సంస్కృత తత్సమములు తక్క, పద్యం దాదాపుగా తేటతెనుగులో సాగింది. మొదటిపాదం వరకూ నాయిక నృత్యం చేసింది కదా! ఇప్పుడు ఆ చంపకమాల మొదటిపాదాన్ని తిరిగి గొంతెత్తి గట్టిగా, నిదానంగా చదువుకుందాం. “చిలుకలకొల్కి కల్కి యొక చేడియ నాటకసాల మేడపై.” తధిగిణతోంత తోంత తకతోంత తతోంత తతోంత తోంత తోమ్ – నృత్యానికి అనుగుణంగా శబ్దజాలం నర్తిస్తున్నట్టు లేదూ!

దృశ్యకావ్యాదులలో సాత్త్వికాభినయమూ, శ్రవ్యకావ్యరసనిర్వహణలో సాత్త్వికభావములు ప్రధానమైనవి. సమాహితమైన మనస్సు నుండు ఉత్పన్నమైనది సాత్త్వికభావము. అనగా మనస్సు యొక్క సమాధ్యవస్థ యందు సత్త్వములు నిష్పన్నమగును. ఇవి స్థంభ – స్వేద – రోమాంచ – స్వరభేద – వేపథు – వైవర్ణ్య – అశ్రు – ప్రలయములు అని ఎనిమిది విధములు. ప్రస్తుత పద్యంలో స్థంభమనే సాత్త్వికభావాన్ని నాయిక ద్వారా ప్రకటించాడు పెద్దనకవి.

శబ్దగుణాలను పది విధాలుగా వింగడించారు ఆలంకారికులు.

శ్లేషః ప్రసాదః సమతా మాధుర్యం సుకుమారతా
అర్థవ్యక్తి రుదారత్వం ఓజో కాన్తి సమాధయః

పై గుణాలలో, మాధుర్యము, సుకుమారత్వము, అర్థవ్యక్తి, కాంతి అన్న గుణాలు పెద్దన కవి కవిత్త్వంలో తేపతేపకును కనుగొనవచ్చును. ఈ గుణాలు చిత్తద్రుతికారకాలు.

మాధుర్యము – సంయోగపర హ్రస్వాతిరిక్త వర్ణఘటితత్వే సతి పృథక్పదత్వం మాధుర్యమ్ (దీర్ఘమైన సంధులు, సమాసాదులూ లేక అలతి అలతి పదాల కూర్పు మాధుర్యము.)
సుకుమారత్వము -అపరుషవర్ణఘటితత్వం సుకుమారత్వమ్. (పరుషమైన వర్ణాలు – మహాప్రాణాక్షరాలు లేని కూర్పు, సుకుమారత్వము.) (ఈ చిలుకలకొల్కి పద్యాన్ని మరొకమారు గమనించండి)
అర్థవ్యక్తి – ఝడితి ప్రతీయమానార్థాన్వయకత్వమ్ అర్థవ్యక్తిః (చదివిన వెంటనే అర్థం ఛప్పున స్ఫురించటం అర్థవ్యక్తి.)
కాన్తి – అవిదగ్ధ వైదికాది ప్రయోగయోగ్యానాం పదానాం పరిహారేణ ప్రయుజ్యమానేషు లోకోత్తరశోభారూప మౌజ్జ్వల్యం కాన్తిః (అతి సామాన్యమైన శబ్దప్రయోగాలకు భిన్నంగా సరసమైన, సుందరమైన శబ్దాలను లోకోత్తరశోభారూపకంగా కూర్చటం కాంతి.) (చిలుకలకొల్కి – అన్న ప్రయోగం దీనికి ఉదాహరణ.)
ఈ శబ్దగుణాలు పెద్దన కవి కవిత్వంలో పలుకు పలుకునా పాఠకుని పలుకరిస్తాయి. చిలుకలకొల్కి పద్యం పై నాలుగు గుణాలకు ఉదాహరణగా నిలబడుతున్నది.

మాఘకవి కల్పించిన కేతనమూ మనోహరంగా ఉన్నది. అయితే మాఘుడు కేతనాన్ని – పెద్దన కవిలా క్రిందికి లాగక, పైకి ఎగురవేశాడు.

అధిరూఢయా నిజనికేతముచ్చకైః పవనావధూత వసనాన్తయైకయా|
విహితోపశోభముపయాతి మాధవే నగరం వ్యరోచత పతాకయేవ తత్||

వాసుదేవుని చూచుటకు ఒక యువతి తన ఇంటిమేడ పైకెక్కింది. అక్కడ తీవ్రంగా వీస్తున్న గాలి వలన ఆవిడ చీరచెంగు పైకి ఎగసినది. ఆ వస్త్రాంచలము మాధవుని నగర రాక సందర్భంగా అలంకరింపబడి ఎగురవేసిన నగరపతాకంలా ప్రకాశించినది. అమ్మాయి చీరచెంగు నగరపతాకంలా ఉన్నదనడం మనోహరమైన ఉత్ప్రేక్ష. అమ్మాయి వస్త్రాంచలం నగరకేతనంలా పైకెగురడం, ఆ నగరయువతుల లావణ్యాతిశయాన్ని వ్యంజింపజేయుట రమణీయమైన వస్తుధ్వని. యువతి మేడపైకెక్కడం ఇంతకు పూర్వం వలెనే అతికుతూహలం చేత.

పెద్దన గారి చిలుకలకొల్కి కేతనాన్ని పైటగా కప్పుకుంటే, మాఘుని నాయిక చీరచెంగు అలా పైకెగసి నగరపతాకలా మెరిసింది. మాఘకవి వర్ణనలో వ్యంగ్యము రంజింపజేసినా, పెద్దన కవిత్త్వం మనోహరమైన శబ్దగుణాలతోనూ, ముగ్ధ హావభావ విలాసాలను దృశ్యమానం చేయుటలోనూ ఉత్కృష్టంగా ఉన్నది.

3. కీరమనోజ్ఞవాణి యొక కిన్నరి కిన్నెర
కీరమనోజ్ఞవాణి యొక కిన్నరి కిన్నెర మీటిమీటి యొ
య్యారపు లీల నేఁగి వసుధాధిపుఁ గన్గొనె జిల్గుపయ్యెదన్
హారముఁ జక్కఁ బెట్టెడు కుచాహితహస్తము పైఁడి గోళ్ళు హిం
సారతిసేయు దర్పకుని సంపెఁగ ముల్కులుఁ బోలె మించఁగన్.

కిన్నరి – అంటే దేవకాంత. విద్యాధరోऽప్సరో యక్షరక్షో గన్ధర్వకిన్నరాః పిశాచో గుహ్యకస్సిద్ధో భూతోऽమీ దేవయోనయః అని అమరం. కిన్నరులు అనగా అశ్వముఖులు. వీరికే కింపురుషులని, తురఙ్గవదనులని, మరియు మయులని పేరు. (ఈ నలుగురూ వేర్వేరు జాతులని మరొక వాదమున్నదట.)

చిలుకపలుకుల కలికి వంటి ఒక కిన్నరి తన కిన్నెరను చాలాసేపు వాయించి, ఆపై ఒయ్యారంగా నడిచి, రాకుమారుని చూచింది. వల్లకీవాదనము అదేపనిగనొనర్చుట వలన, వీణ తీవెల తాలూకు పసిడిపూత ఆమె వ్రేలికి అంటుకున్నది. రాకుమారుని చూస్తూ, తన పలుచని పైటపైని ముత్యాలహారాన్ని సర్దుకున్నది. అలా ఆ దేవకాంత పయ్యెదను స్పృశిస్తున్న నఖసువర్ణకాంతులు – విరహులను హింసించే మన్మథుని సంపెంగపువ్వు బాణములవలే ప్రకాశించినాయి.

కిన్నెర అనునది – తెలుగు మాట. ఒక విధమైన వీణ. మీటిమీటి – శబ్దావృత్తి వీణావాదనపరవశత్వానికి సూచన.

కిన్నెర మీటు సందర్భంలో ‘వాణి’ శబ్దప్రయోగం – చమత్కారభరితం. ఇదివరకటి చంపకమాలలో నృత్యాన్ని ప్రస్తావించిన పెద్దన ఇప్పుడు ఉత్పలమాలతో సంగీతాన్ని తడుముతున్నాడు. కొనగోటి వ్రేళ్ళు మదనుని బాణపు ములుకులు – ఇది రమణీయమైన ఉత్ప్రేక్ష. పయ్యెదపైని ముత్యాలహారాన్ని గోళ్ళతో సర్దుకోవడం వెనుక వనిత శృంగారభావం వివక్షితం. భావధ్వని ప్రౌఢనాయిక స్వభావం.

మాఘకవి ప్రౌఢల విలాసాలను ఆరు శ్లోకాలలో నిమంత్రించినాడు. అందులో పై పద్యాన్ని పోలిన ఒక శ్లోకం ఇది.

అధికోన్నమద్ధనపయోధరం ముహుః ప్రచలత్కలాపి కలశంఖకస్వనా|
అభికృష్ణమంగుళిముఖేన కాచన ద్రుతమేకకర్ణవివరం వ్యఘట్టయత్||

ఒక యువతి శ్రీకృష్ణునికి ఎదురుగా, తన పయ్యెదను పైకెత్తి తన ముంజేతి కంకణాలు నెమలి వలే కలస్వనం చేస్తుండగా, అలవోకగా చేతిబ్రొటన వ్రేలితో చెవి పైభాగాన్ని కదిలించింది.

ఇక్కడ కూడా చెవుల వద్ద కండూతిని తీర్చుకునే నెపంతో ఆ ప్రౌఢాంగన తన శరీరాంగాలను ప్రదర్శించింది. ఆమె ఉద్దేశ్యం వెనుక శృంగారభావం వివక్షితం. (వస్తుతస్తు భావావిష్కరణార్థమేవ ఇతి భావః – మల్లినాథసూరి వ్యాఖ్య.)

యథావిధిగా మాఘకవికల్పన నిశ్చలమైన పదచిత్రం; పెద్దన కవిది పద్యరూపం కట్టిన చలనచిత్రం.

4. అలరులబంతి జృంభికకు నడ్డము
అలరులబంతి జృంభికకు నడ్డము సేయుచుఁ గర్ణపాళిపై
కలకలఁ ద్రోయుచున్ దరఁగలౌ ప్రమదాశ్రులు గోటమీటుచున్
జెలి భుజపీఠినొత్తగిలి చిల్కను దువ్వుచు వాలుఁగన్నుఁ గ్రే
వల కుదధారచేర నొక వారవిలాసిని చూచె రాసుతున్.

ఒకానొక వారవిలాసిని పూబంతితో ఆవులింతను అడ్డుపెట్టుకుని, ముంగురులను చెవియంచు పైకి తోస్తూ (కర్ణపాళిపైకి + అలకలన్ త్రోయుచున్), ఆనందభాష్పాలను గోటితో చెదురు చేస్తూ, తన పెంపుడు చిలుకను దువ్వుతూ, చెలి భుజంపై ఒత్తిగిలి, వాలుకన్నులతో స్వరోచిని తిలకించింది.

గణిక వైఖరిని బట్టి స్వభావోక్తి అలంకారం. అశ్రువు అనబడే సాత్త్వికభావం సూచించబడింది. రాకుమారుని రాక కోసం పడిగాపులు గాచి, అలసినదన్న భావం వ్యంగ్యముగా అవులింతచేత సూచితము. పూర్వఘట్టంలో వరూధినిని కలస్వనముతో వేదన నెపంబుతో ఏడిపించిన పెద్దన, ఈ ప్రమదను ప్ర-మదగా తీర్చి అశ్రువులను చిందింపజేశాడు.

సంస్కృతకవి సుదతి తాలూకు ఆవులింత ఇదీ.

నళినాన్తికోపపల్లవశ్రియా వ్యవధాయ చారు ముఖమేకపాణినా|
స్ఫురదంగుళీవివరనిఃసృతోల్లసదశనప్రభాంకురమజృంభతాపరా||

ఒక సుదతి తామరపూరేకు వంటి చేత్తో ముఖాన్ని కాస్త కప్పుకుని, అందమైన మోమును అలవోకగా పక్కకు తిప్పుకుని, చేతివ్రేళ్ళ మధ్య తన దంతకాంతులు ప్రసరించేలా ఆవులించినది. ఈ శ్లోకములో వనిత దన్తకాంతుల ప్రభ తక్క మరే విధమైన ప్రత్యేకతా, ఏ విధమైన శృంగారభావము వివక్షితము కావడము లేదు. ఈ లోటును పెద్దన కవి పూరించినాడు.

మాఘకవి కవిత పదచిత్రం. పెద్దనార్యుని కూర్పు వనిత సాత్త్విక భావాన్ని కూడా సూచిస్తున్న పదచిత్ర విశేషం.

5. ఒక నేత్రాంబుజ మొక్క గల్ల మొక
ఒక నేత్రాంబుజ మొక్క గల్ల మొక చన్నొయ్యారపున్ లీల్న వీ
థికిఁ దోఁపన్ దలుపోరగా నొక పురంధ్రీరత్నమీక్షించె రా
జకిశోరంబుఁ దదీయలై వెలయు భాషాలక్ష్ములన్ జూచి త్ర్యం
బకభాగమొఱంగి మైత్రికి శివాభాగంబ యేతెంచెనాన్.

ఒక పురంధ్రిని అర్థనారీశ్వరమూర్తి యొక్క వామభాగంతో (ఉమ) పోల్చిన ఉత్ప్రేక్ష ఇది. పతివ్రత కాబట్టి ఉమతో పోల్చాడు కవి. ఒక పురంధ్రీరత్నము స్వరోచి మహారాజుకు వశులైన సరస్వతిని, లక్ష్మిని చూచి, మైత్ర్యర్థం, ఒక కలువ కన్నును, ఒక్క వైపు చెక్కిలిని, పయ్యెద వామభాగాన్ని తలుపు ఓరగా చేర్చి చూచిందట.

అర్ధనారీశ్వరమూర్తి ప్రస్తావనతో కూర్చిన మాఘకవి కల్పన ఇది.

వ్యతనోపదాస్య చరణం ప్రసాధికా కరపల్లవాత్ రసవశేన కాచన|
ద్రుతయావకైకపదచిత్రితావనీం పదవీగతేన గిరిజా హరార్ధతామ్||

తన కుడికాలిని మడిచి చేతితో పట్టుకుని, లత్తుక అలదుకున్న ఎడమకాలిని భూమిపై మోపుతూ, రశవసంతో ఒక యువతి శ్రీకృష్ణున్ని చూడటానికి, ఇంట లత్తుక ముద్రలు చిత్రిస్తూ (కుంటుతూ) పరిగెత్తింది. ఎడమ కాలి పారాణి ముద్రల వలన ఆవిడ హరుని అర్ధభాగమైన గిరిజను పోలి ఉంది.

మాఘకవి కల్పన రమణీయమైనప్పటికీ, రసవశేన – అన్నది వాచ్యం. యువతి యొక్క అతికుతూహలమే ఇక్కడ కూడా వివక్షితం.

పెద్దన కవి కల్పించిన యోషిత తలుపోరగా నిలుచుంది. లక్ష్మీసరస్వతుల నిద్దరిని స్వరోచి మహారాజు మూర్తిలో నిలిపి, ఉమాదేవిని ఆ యువతిలో ప్రతిష్ఠించాడు కవి. అది కూడా మైత్ర్యర్థం – అంటే సిరి, చదువు లిద్దరూ అది వరకే అమరిన మహారాజులో ఆమెలోని ఉమ కూడా చెలిమి చేయగోరినది.

పెద్దన పద్యాన్ని కొందరు వ్యాఖ్యాతలు – కిశోరము అన్న శబ్దానికి బాలుడు అన్న అర్థాన్ని, పురన్ధ్రీ సుచరిత్రాత్తు సతీ సాధ్వీ పతివ్రతా – అన్న అమరం, స్వజనైస్సహ పురం ధారయతి ఇతి పురన్ధ్రీ – సతీసుతపరివారంతో గృహమును ధరించునది పురన్ధ్రీ – అన్న వ్యుత్పత్తిని పురస్కరించుకుని, ఆ పతివ్రత రాజకిశోరాన్ని తల్లి తనయుని వంక చూచిన చందాన దయార్ద్ర దృష్టితో చూచినదని వ్యాఖ్యానించినారు.

యువరాజు కావున రాజకిశోరుడన్న పిలుపు. పురంధ్రి అన్న శబ్దాన్ని సాధారణార్థంలో అంగన అన్న అర్థంలో ఉపయోగించిన ప్రయోగాలు లేకపోలేదు. శిశుపాలవధకావ్యం మల్లినాథసూరి సర్వంకష వ్యాఖ్యానంలో ఈ ఘట్టంలోనే అట్టి ప్రయోగం ఉన్నది. పైగా పద్యంలో స్పష్టంగా ‘మైత్రికి’ అని ఉన్నది. స్వరోచికి విద్య, ఐశ్వర్యము వశమైనందున భాషాలక్ష్ములు ‘తదీయ’లై రాజకుమారుని వరించినవారని పెద్దన ఉత్ప్రేక్షించాడు.

అలా కాక పురన్ధ్రీ అన్న శబ్దం సాధ్వి అన్న అర్థంలో సాభిప్రాయమైతే, ఈ ఘట్టంలో కవివివక్షితమైన భావం శృంగారమా, కాదా అన్న సందేహం వస్తున్నది. ఒకవేళ శృంగారభావం కాకపోతే, ఈ ఘట్టంలో మిగిలిన యువతుల విలాసాలన్నిటినీ శృంగారపరంగా నిమంత్రించి, ఈ ఒక్క పద్యంలో తదన్యంగా నిర్మించుట ఏలనన్న సందేహం వస్తుంది. ఈ వ్యాసకర్త వంటి అల్పజ్ఞులు ఇట్టి వాదాలను పరిష్కరించడానికి సమర్థులు కారు.

రసపట్టులో తర్కం కూడదు కనుక ముందుకు సాగుదాం.
6. కలయన్ గూర్మి జెమర్చు నంగముల
కలయన్ గూర్మి జెమర్చు నంగముల లగ్నంబై నసన్నంపు మం
జుల కౌశేయమునందు మించు కమలస్తోమంబుచే జూచె నొ
క్కలతా తన్వి చెలంగిపొంగుమది కాంక్షల్ దీర మేనెల్ల గ
న్నులు గావించి కుమారు జవ్వనము చెన్నున్జూచు చందంబునన్.

తీవెలాంటి తనువైభవం గల ఒక చిన్నది తామరరేకులు చిత్రించిన పట్టుచీర కట్టుకుంది. రాకుమారుని చూడరాగా, ఆమె తనువంతా కళ్ళై స్వరోచిని చూచినట్లు వస్త్రము చెమటచేత శరీరానికి అంటుకుని యున్నది.

ఇక్కడ స్వేదము, ఔత్సుక్యము అన్న సాత్త్వికభావములు సూచితములు. ఉత్ప్రేక్షాలంకారము. ఇదివరకు ఉత్పలమాల, చంపకమాలలతో సంగీతసాహిత్యాలను స్పృశించిన కవి, ప్రస్తుతం మత్తేభ వృత్తంతో శిల్పకళను ప్రస్తావించడం గమనార్హం. ఈ పద్యానికి మాఘంలో పోలిక లేదు. అయితే స్వేదమనే సాత్త్వికభావాన్ని, అనిమేషత్వం అన్న అనుభావాన్ని సూచిస్తూ, తదేకంగా శౌరిని ఒక యువతి వీక్షించిన శ్లోకం శిశుపాలవధమ్లో ఉంది.

నిజ సౌరభ భ్రమిత భృంగపక్షతి వ్యజనానిల క్షయిత ఘర్మవారిణా|
అభిశౌరి కాచిదనిమేషదృష్టినా పురదేవతేవ వపుషా వ్యభావ్యత||

ఒకమ్మాయి శరీరసౌరభానికి తుమ్మెదలు ముసురుకుంటున్నాయి. ఆమె మధుసూదనుణ్ణి తదేకంగా చూస్తున్నందువలన చమటలు పట్టినాయి. ఆ స్వేదాన్ని తేంట్లు తమ రెక్కలతో వీస్తున్న గాలితో పోగొడుతున్నాయి. శౌరికి అభిముఖంగా అలా రెప్పవాల్చక చూస్తున్న ఆమె నగరదేవత వలే శోభించినది.

దేవత – ప్రయోగము ఎందుకంటే, దేవయోనులు అనిమేషలు. అనగా వారికి కనురెప్పపాటు ఉండదు. నగరదేవత వలే ఉన్నదనుట ఉత్ప్రేక్షాలంకారం. ఆమె చమటకు తేంట్లు ముసురుకొనుట వల్ల ఆమె పద్మినీ జాతి కన్య అన్న భావం ప్రతీయమానమై వస్తుధ్వని.

మాఘకవి కూర్చిన యువతి అనిమేషత్వాన్ని నైషధకర్త కూడా సమాంతరఘట్టములో ప్రయోగించాడు.

దిదృక్షురన్యా వినిమేషవీక్షణా నృణా మయోగ్యాం దధతీ తనుశ్రియమ్|
పదాగ్రమాత్రేణ యదస్పృశన్మహీం నతావతా కేవల మప్సరోऽభవత్|| (నైషధ. – 15.76)

నలమహారాజును చూడగోరి ఱెప్పపాటు వేయడము మరచిన ఒక యువతి అచ్చరవలె సౌందర్యాతిశయము, ఱెప్పపాటు వేయకపోవుట అన్న అచ్చర లక్షణములున్ననూ, భూమిని తాకి నిలుచుండుట వలన అచ్చర కాలేకపోయినది.

7. జిలుగుల పెట్టుచున్ దొడల జంద్రిక
జిలుగుల పెట్టుచున్ దొడల జంద్రిక పావడయంటమై తడిన్
బెళపెళ లేని చీర గటి బింకపు జన్నుల చేర్చికొంచు వే
జలకము లాడియాడి యొకచాన కరస్థిత కేశయై నృపున్
వెలువడి జూచె లోబడితి నీకని బాసకు నిల్చెనో యనన్

ఒక ముదిత స్నానము చేస్తుండగా, రాకుమారుడు వస్తున్న వైనాన్ని విని, తన ఒడలు, కేశములు పూర్తిగా తుడుచుకోక, పొడి చంద్రికపావడను ఊరువులకు అంటుకొనేలా చుట్టుకుని, పయ్యంట చీరను కుచములపై కప్పుకుని, నీరు కారుతున్న కేశపాశాన్ని చేత్తో పట్టుకుని స్వరోచిని, రాజా నేను నీకు లోబడితిని అన్నట్టుగా తిలకించింది. ఇది ఉత్ప్రేక్షాలంకారము. (తడి ఒంటితో, కేశపాశాలను చేత పట్టుకుని రాజు ఎదుట ప్రమాణం చేయుట ఒకప్పటి ఆచారమట.)

ఈ పద్యమున్నూ స్వతంత్రరచన. ఛాయామాత్రంగా ఒక శ్లోకం మాఘంలో కనబడుతున్నది.

వలయార్పితాऽసితమహోపలప్రభా బహులీకృతప్రతనురోమరాజినా|
హరివీక్షణేऽక్షణికచక్షుషాన్యయా కరపల్లవేనగళదంబరం దధే||

ఒక యువతి హరిపై ధ్యాసతో సుఖపరవశయై తన వస్త్రాన్ని జార్చుకుంది. అలా జారిన వస్త్రాన్ని – ఇంద్రనీలమణులు పొదిగిన కంకణముతో మెరుస్తున్న రోమాలా అన్నట్టు కనిపించే చేతిపై కప్పుకుంది. ఇంద్రనీలమణి కాంతులతో చేతిపై రోమరాజి అగుపించడం ద్వారా భ్రాంతిమంత అలంకారం వ్యంగ్యమవుతున్నందుకు వస్తుతః అలంకారధ్వని. స్థంభము సాత్త్వికభావము.

క్రింది పద్యములోనూ ఈ మాఘకవి శ్లోకపు ఛాయ కనిపిస్తుంది.

8. పరవశదైన్య మాడుకొను ప్రౌఢలఁ
పరవశదైన్య మాడుకొను ప్రౌఢలఁ గానదు ఘర్మవారిచేఁ
గరఁగి స్రవించు చిత్రకము గాన దనాదృతవీటిపాటలా
ధరమున సున్నమంటిన విధంబును గానదు నవ్వులాట కా
భరణము గొన్న గానదొక బాల నృపాలుని జూచి నివ్వెఱన్

రాకుమారుని చూచిన పరవశంతో ఒక ముగ్ధ బాహ్యస్మృతి కోలుపోయి -తనను ఆడిపోసుకునే ముగ్ధలను చూడదు, -చెమట చేత కరగిన తిలకమును పట్టించుకొనదు, -తాంబూలసేవనసమయమున పెదవిపై నంటుకున్న సున్నమును పరికింపదు, -పరిహాసానికి తన ఆభరణాన్ని లాగుకొన్న చెలులను లక్ష్యపెట్టదు.

ఇక్కడ స్థంభము, స్వేదము అన్న సాత్త్వికభావాలు సూచితములు.

ఈ పద్యానికి పుట్టపర్తి నారాయణాచార్యులు మనోహరమైన వ్యాఖ్య చేశారు. ఈ పద్యపాఠాన్ని ఆచార్యులవారికి వివరిస్తూ, తమ తండ్రి ఇందులో పెద్దనగారి రచనాస్వరూపము ద్యోతకమవుతుందని అన్నారట. పెద్దనగారి కవిత్త్వంలో ఈ ముగ్ధత్వం చాలాచోట్ల కనిపిస్తుందని ఆచార్యుల వ్యాఖ్య. మనోహరమైన, నిశితమైన పరిశీలన ఇది. బాగా అనుశీలిస్తే మాన్యులైన పాఠకులకు అవగతమవుతుంది.

నైషధములోనూ ఇటువంటి పరవశదైన్యమొకత్తి కనిపిస్తుంది.

కరస్థతామ్బూలజిఘత్సురేకికా విలోకనైకాగ్ర విలోచనోత్పలా|
ముఖే నిచిక్షేప ముఖద్విరాజతా రుషేవ లీలాకమలం విలాసినీ||

ఒక విలాసిని తామ్బూలచర్వణము చేయబోయి, నలుని చూస్తూ మైమరచి, చేతనున్న కమలపత్రాన్ని నోటనుంచుకుని కొరికినది. తన ముఖమునకు ప్రత్యర్థిగా ఉన్న కమలముపై రోషముతో కాబోలు అని అట. ఒక పదచిత్రాన్ని పద్యపు ఆదిలో నిక్షేపించి, తర్వాత పునశ్చరణ చేసినట్టు, కవిప్రౌఢోక్తి సిద్ధంగా అలంకరించటం, కాళిదాసు కవితలోనూ, శ్రీహర్ష కవిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. మాఘకవి కవితలో అటువంటి శ్లోకాలు లేకపోలేదు కానీ శైలిలో భాగం కాదని తోస్తుంది.

సంస్కృతసుదతికి గల రోషాన్ని పరిహరించి, శ్రీనాథకవి చేసిన మనోహరమైన అనువాదమిది.

తమ్ములము సేయుచో నొక్క తలిరుఁ బోణి
రాకుమారునిఁ జూచు పరాకు కతన
మడిచి తాంబూలపత్త్రంబు మాఱుగాఁగ
గఱచెఁ గెంగేలినడిగేలి కమలదలము. (శృంగారనైషధము – 6.63)

మనుచరిత్రలోని ఈ ఘట్టంలో చివరకు మిగిలిన రెండు పద్యాలు ఇవి. ఈ పద్యాలకు సామ్యరూపాలు మాఘములో కనిపించవు.

వలపులపల్లవుండొకఁడు వట్టి చలంబున నేఁప దీనయై
యలుకలు తీర్చి తీర్చి యొక యచ్చరవచ్చి నృపాలు నన్నగ
ర్వెలువడిజూచెఁ గాముకుఁడు వెంటనె రానపుడాత్తఘర్మయై
వెలవెలఁబాఱెఁ దన్ముఖమువెల్వెలఁబాఱె విటాననాబ్జమున్.

ఒకానొక అప్సర తన ప్రియుని కోపాన్ని పోగొట్టి పోగొట్టి విసిగింది. బయటకు వచ్చి నృపాలుని చూచి మురిసింది. ఆమె వెనుకనే ఆతడూ వచ్చాడు. నృపాలుని చూచి మురవడం ప్రియునికి తెలిసిందని ఆమె మోము చిన్నబోయింది. నా మాట సాగకపోయిందన్న తలంపుతో ప్రియుని మోమూ చిన్నబోయింది.

అలికులవేణి యొక్కతె రతాంతమునన్ దనయంగవల్లికన్
బులకలు చొక్కు లేఁజమరు పుట్టఁగ నేఁగి నరేంద్రుఁ జూడ నా
పులకలు చొక్కు లేజమరు బోవకయట్టుల యుండెనట్టిదౌఁ
జెలువగువానిఁ గన్గొనిన చెల్వకుఁ జూపుల కావె కూటముల్‌


ఒక చెలువ రతాంతమున గగుర్పాటును, చిఱుచెమటను దాపక స్వరోచిని తిలకింపనుత్సాహపడి వచ్చినది. రాకుమారుని జూచిన ఉత్సాహమున తిరిగి యామెకు స్థమ్భ, రోమాంచ స్వేదాదులు జనియించెను. ఇది అర్థాంతరన్యాసాలంకారము. స్థంభరోమాంచస్వేదములు సాత్త్వికభావాలు.

ఆపైని ఒక సుదీర్ఘమైన వచనంతో ఆ ఘట్టాన్ని ముగిస్తాడు పెద్దనార్యుడు. పలుకుపలుకునా సంయుక్తాక్షరాల వాడకంలోనూ, మహాప్రాణాక్షరాల ఉపయోగంలోనూ పరమపిసినారితనం ప్రదర్శిస్తూ, పాఠకుడు లేదా శ్రోత కర్ణము ఎక్కడ కందిపోతుందో అన్న విధంగా, జాజుల పూమాల కడుతున్న చందాన, ఆంధ్రకవితాపితామహుడు పలికించిన ముగ్ధల విలాసాల ఉదంతం ఇది. ఈ ఘట్టాలను పోల్చుకుంటే, కాలానుగుణంగా చిన్నవాడైనా, కవిత్త్వంలో సంస్కృతమాఘకవికి పెద్దన – పెద్దన్న అనిపిస్తాడు. శిశుపాలవధమ్ అన్న విలువకట్టలేని సొత్తును సంస్కృతవాణికి అందించి స్వర్గానికేగిన ఆ మహనీయుడు పెద్దన కవితను స్వర్గంలో చదువుకుని సాహో! అని ఉంటాడు.

ఈ ఘటములో పెద్దన నిలిపిన దేవకాంతలలో – ఒక్కొక్క యువతి ఒక్కొక్క సాలభంజిక! పెద్దన కూర్చిన శిరీషకుసుమపేశసుధామయోక్తులలో మునిగి రససిద్ధుడైన చెందిన ప్రతి సహృదయుడు – భోజరాజు!

ఆ మహాకవి అందించి పోయిన ప్రబంధ సౌరభాలకు జోతలు చెప్పడం తప్ప మరేం చేయగలం?

చిలుకలపల్కు పొల్కి నుడి, చెల్వపు నెమ్మి విలాసముల్ కృతుల్
తెలివి పొసంగు క్రొవ్విరులఁ దేనియలౌ సరసంపుఁ బల్కులున్
కలువలఱేని మిన్కులటు కైతలు, పొంకపు శైలి, శయ్యయున్
పలికెడు వొజ్జ, యాంధ్రకవివర్యుడు పెద్దన కిత్తు జోతలున్.
-------------------------------------------------------
రచన: రవి, 
ఈమాట సౌజన్యంతో

No comments: