Sunday, March 3, 2019

వనమయూరము


వనమయూరము




సాహితీమిత్రులారా!

పరిచయము
అన్ని వృత్తములను రాగయుక్తముగా పాడుకొన వీలగును. కాని అందులో కొన్ని మాత్రమే తాళబద్ధములు. అట్టి వృత్తములలో వనమయూరము ఒకటి. ఈ వనమయూర వృత్తమునకు ఎన్నో పేరులు ఉన్నాయి, అవి: వనమయూరము, ఇందువదన, కాంత, మహిత, వరసుందరి, స్ఖలిత, కుట్మల. వనమయూర వృత్తములో కాలిదాసాది సంస్కృతకవులు వ్రాయలేదు. అనగా అది బహుశా ఆ కాలములో వాడుకలో లేదేమో? ఈ వృత్తమును నాట్యశాస్త్ర రచయిత పేర్కొనలేదు. పింగళ ఛందస్సులో చివరి అధ్యాయములో అత్రానుక్తం గాథా, అనగా చెప్పబడని ఇతర పద్యములలో ఇది పేర్కొనబడినది. బహుశా హలాయుధుడు (10వ శతాబ్దము) తన మృతసంజీవని వ్యాఖ్యలో దీనిని చేర్చియుంటాడు.

సూత్రము: వరసుందరీ భూజౌ స్నౌ గౌ. అందులోని లక్ష్యపద్యము-

స్వాదు శిశిరోజ్జ్వల సుగంధిజలపూర్ణ
వీచిచయ చంచల విచిత్ర శతపత్రమ్
హంసకలకూజిత మనోహర తటాంతం
పశ్య వరసుందరి, సరోవరముదారమ్ – పింగళ ఛందస్సు, 8.9

వనమయూరమను పేరు మొట్టమొదట నాగవర్మ (సుమారు క్రీ.శ. 990) ఛందోంబుధిలో మనకు కనబడుతుంది.

బందిరె సరోజరిపు భాను మరు దింద్రం
ముందిరె హరద్వయగణం విమల సంపూ-
ర్ణేందువదనే యతి పదాంతదొళెనిందం
దెందుమిదు కేళ్ పెసరినిం వనమయూరం – నాగవర్మ ఛందోంబుధి, సమవృత్త, 174

(సరోజరిపు – చంద్రుడు అధిపతిగా నుండు భ-గణము, భాను – సూర్యుడు అధిపతిగా నుండు జ-గణము, మరుత్ – వాయువు అధిపతిగా నుండు స-గణము, ఇంద్ర – ఇంద్రుడు అధిపతిగా నుండు న-గణము, హరద్వయము – రెండు గురువులు. పాదాంతములో యతి. తన భార్యను ఉద్దేశించిన ఇందువదన పదము వృత్తముయొక్క మఱొక పేరా అన్నది సందేహాస్పదము. పాదము ఏడు, ఏడు అక్షరములుగా విఱుగుతుందని మఱొక లక్షణ పద్యము ఉన్నది. నాలుగు, ఏడు, ఎనిమిది అక్షరముల విఱుపు కూడ చెప్పబడినది. దీని మఱొక పేరు కుట్మల అని చెప్పబడినది.)

జయకీర్తి (సుమారు క్రీ.శ. 1000) ఛందోనుశాసనములో దీని లక్షణము ఇలా చెప్పబడినది: భాజసనగా యది గురుర్వనమయూరః. హేమచంద్రుడు (12వ శతాబ్దము) భ్జస్నాద్గౌ స్ఖలితమ్ అన్నాడు. అంతేకాక మహితా, కాంతా, వనమయూరశ్చేత్యన్యే అని ఇతర నామములను కూడ తెలిపినాడు. కేదారభట్టు (15వ శతాబ్దమునకు పూర్వము) వృత్తరత్నాకరములో ఇందువదనా భజసనైః సగురుయుగ్మైః అంటాడు. అందులోని లక్ష్య పద్యము-

కుందరదనా కుటిల కుంతలకలాపా
మంద మృదుల స్మితవతీ కమలనేత్రా
సుందరసరఃపరిసరే విహరమాణా
ఇందువదనా మనసి సా యువతిరాస్తే – కేదారభట్ట వృత్తరత్నాకరము, 3.82

రేచన కవిజనాశ్రయములో వనమయూరపు లక్షణ-లక్ష్య పద్యము క్రింది విధముగా నున్నది.

నందితగుణా భజస-నంబులు గగం బిం
పొంది చనఁగా వనమ-యూరమగుఁ బేర్మిన్ – రేచన కవిజనాశ్రయము, వృత్తప్రకరణము

తెలుగు కావ్యములలో వనమయూర వృత్తము భారత, భాగవత, కుమారసంభవాదులలో వాడబడినది.

రాజకులశేఖర ప-రంతప వివేక
భ్రాజిత జగద్వలయ – భాసుర సముద్య-
త్తేజ నిరవద్య యువ-తీమదన వీరో-
గ్రాజి విజయా త్రిభువ-నాంకుశ నరేంద్రా – నన్నయ భారతము, ఆది 5.261

పోర నొడ లస్త్ర పరి-పూతముగ ధీరో-
దారతఁ బిఱిందికిఁ బ-దం బిడక దృవ్య-
ద్వైరితతి నొంచి తెగు-వారగుట మేలు-
ర్వీరమణకోటి కని – వేదములు సెప్పున్ – తిక్కన భారతము, స్త్రీ 1.110

భూసురకదంబ సుర-భూరుహ వికాసో-
ద్భాసిత కృపారస వి-పాక సుగుణైకో-
ల్లాస హర హారమృగ-లాంఛన మృణాళీ
హాసినవ కీర్తి విస-రాకలితలోకా – ఎఱ్ఱన భారతము, అరణ్య 6.411

మేరునగధీరు నిర-మిత్రు సుచరిత్రున్
వారిధిగభీరు నిర-వద్యు జనవంద్యున్
చారుతరమూర్తి నతి-శాంతు గుణవంతున్
మారహరు సర్వజన-మాన్యు మునిమాన్యున్ – నన్నెచోడుని కుమారసంభవము, 3.113

అంత సురలేయు నిబి-డాస్త్రముల పాలై
పంతములు దక్కి హత – పౌరుషముతో ని-
శ్చింతగతి రక్కసులు – సిగ్గు డిగి భూమిన్
గంతుగొని పాఱి రప-కారపరు లార్వన్ – సింగన భాగవతము, 6.378

ఈయన రుమాజనకుఁ-డేననిన నెంతో
ప్రేయముగఁ జూచుఁ దన – బిడ్డ యనినట్టున్
శ్రీయుతుఁడు కోటిశత-సేన కధినాథుం
డీయన యొకండు లయ-హేళి రణకేళిన్ – విశ్వనాథ, శ్రీరామాయణకల్పవృక్షము, కిష్కింధ, సమీకరణ, 20

వనమయూరపు అమరిక
వనమయూర వృత్తపు పాదములో మూడు పంచమాత్రలైన భ-లములు (UIII), రెండు గురువులు (UU) ఉంటాయి. చివరి చతుర్మాత్ర విరామయతి వలన పంచమాత్రా తుల్యము. అనగా ఈ వృత్తపు గతి ఖండగతి. దీని తాళము ఖండగతి ఏకతాళము, మిశ్రగతి ఝంపతాళాము, ఖండచాపు తాళములకు సరిపోతుంది. అప్పుడప్పుడు ఇతర తాళములలో కూడ పాటలను కట్టుతారు. యక్షగానములలలో కూడ దీనిని వాడుతారు. ఈ గతితో మయూరగతి రగడ అనే ఒక రగడ కూడ పేర్కొనబడినది[1].

మయూరగతి రగడ –

మారమణి పల్లవ కు-మారమణి మోదం
బూరఁ గరుణింపను మ-యూరగతితో నే
తేర మది నిన్న నిటు – దీర్ఘమగు దండెన్
భారముగ రాజిలెడు – పల్లకియు వచ్చెన్ – శహాజీ విష్ణుపల్లకి సేవాప్రబంధము

సంస్కృతములో శ్రీమనవాళ మహాముని (15వ శతాబ్దము) ఈ వృత్తములో నరసింహస్వామిపైన ఒక అష్టకమును వ్రాసినారు. దానిని శ్రీ విద్యాభూషణులు తాళయుక్తముగా పాడినారు.

వనమయూరములాటి వృత్తములు తమిళములోని తేవారములో గలవు. తెలుగులో పంచమాత్రల ద్విపదలయ కూడ ఇట్టిదే. కన్నడములో కర్ణాట చతుష్పది అమరిక కూడ ఇట్టిదే. వీటిలో మూడు పంచమాత్రలు, ఒక త్రిమాత్ర ఉంటాయి. పాదాంత యతివలన, త్రిమాత్రను కొనసాగించి వనమయూరపు లయను సృష్టించ వీలగును. నాగవర్మ, జయకీర్తులకు తెలుగు ద్విపద పరిచితమై ఉండుటకు అవకాశము ఉన్నది. ఆ విధముగా ఈ వృత్తము కల్పించబడినదేమో?

కన్నడములో లలితవృత్తము అనే ఒక వృత్తము ఉన్నది. దీని అమరిక తెలుగులోని ఉద్ధురమాలావృత్తమైన లయగ్రాహి వంటిదే. లయగ్రాహిలో నాలుగు ప్రాసయతులు ఉంటే, లలిత వృత్తములో మూడు ప్రాస యతులు మాత్రమే (చివరిది లేదు). ఈ లలిత వృత్తము పురాతనమైనదే. ఇందులో కన్నడములో ఒక శాసనము కూడ ఉన్నది. దీనిని తఱువాత పేర్కొంటాను. లలిత లేక లయగ్రాహి యందలి చివరి 14 అక్షరముల అమరిక వనమయూరపు అమరికయే.

UIII UIII – UIII UIII – UIII UIII – UIII UU- లలిత లేక లయగ్రాహి
                                  UIII UIII – UIII UU – వనమయూరము

సామాన్యముగా చిన్న వృత్తములను చేర్చి పెద్ద వృత్తమును నిర్మిస్తారు. వనమయూరపు పాదములను చేర్చగా లలిత వృత్తము జనించినదా లేక లలిత వృత్తమునుండి వనమయూరము పుట్టినదా అన్న ప్రశ్నకు జవాబు సులభము కాదు. కాని సామ్యము మాత్రము నిస్సంశయముగా ఉన్నది.

వనమయూరపు అమరికలో మూడు ఎదురు నడక లేని పంచమాత్రలు, ఒక గుర్వంతమైన చతుర్మాత్ర గలవు. ఎదురు నడక లేని పంచమాత్రలు ఆఱు – UIU, UUI, UIII, IIIU, IIUI, IIIII. ఎదురు నడక లేని గుర్వంతమైన చతుర్మాత్రలు రెండు – UU, IIU. వీటితో వనమయూర వృత్తపు లయతో ఒక పాదమును 6 x 6 x 6 x 2 = 432 విధములుగా వ్రాయ వీలగును. పాదములోని అక్షరముల కనిష్ఠ పరిమితి 11, గరిష్ఠ పరిమితి 18. అక్షర సంఖ్య, వృత్తముల సంఖ్య వరుసగా ఈ విధముగా నుంటుంది: 11 – 8, 12 – 44, 13 – 102, 14 – 129, 15 – 96, 16 – 42, 17 – 10, 18 -1. ఇట్టి వృత్తములు కొన్ని లక్షణ గ్రంథములలో పేర్కొనబడినవి. కొన్నికల్పింపబడినవి. ఈ వృత్తములు మొదటి పట్టికలో ఇవ్వబడినవి. పట్టికలో వృత్తముల ఇతర నామములు, వాటిని ఏయే లాక్షణికులు కనుగొన్నారో అనే విషయాలు ఉన్నాయి. అందులో ఐదింటిని కన్నడములో జన్నకవి కల్పించినట్లు వెంకటాచల శాస్త్రిగారు పేర్కొన్నారు[2]. క్రింద ప్రతి వృత్తమును రెండు ఉదాహరణములతో విశదీకరించినాను.

వనమయూరము – భ/జ/స/న/గగ UIII UIII – UIII UU 14 శక్వరి 3823

ఈదినము మంచి దిన – మెల్లరకుఁ గాదా
ఖేదములు మాయమగుఁ – గృష్ణుఁ డనరాదా
మోదమిడు రాగ మది – మోహనము గాదా
సాధానము సేతు నిఁక – సారిగపధాసా

హారముల వేతుఁగద – హారి గళమందున్
సారమతి నీవె గద – చారుతర రూపా
శ్రీరమణ రాత్రి నను – జేరఁగను రావా
శారద శశాంకుఁ గని – శారికలు నవ్వున్

ఆకసమునందు హృద-యమ్ము లలరంగా
నాకు నొక యిందువద-నమ్ము గనిపించెన్
చీఁకటులు మాయు నిక – చిందు ముద మెందున్
శ్రీకరమె “యీదు” యిది – చిత్తమున నిండున్

శ్రావణములో భువియు – శ్యామలము జూడన్
జీవమయమాయె వని – చెల్వములతోడన్
ఈ వనమయూరములు – హృద్యముగ నాడెన్
గ్రీవములు రమ్యముగ – గీతికల బాడెన్

దారుదేహ – ర/ర/ర/గగ UIU UIU – UIU UU 11 త్రిష్టుప్పు 147

ఎందుకో మానస – మ్మిందు జేరంగా
సింధువై పారెనే – చిందుతో నీకై
మందమందమ్ముగా – మత్తు జల్లంగా
వంద గీతమ్ములన్ – బాడనా నీకై

దారుదేహమ్ముతో – దర్శన మ్మీవా
చారుహాసమ్ముతోఁ – జక్కగా రావా
కోరికల్ దీర్చరా – కోమలాకారా
చేరవా చిత్తజా – జీవనాధారా

శాలీ – ర/త/త/గగ UIU UUI – UUI UU 11 త్రిష్టుప్పు 291

అందమా నీవుండు – యాచోటు లేవో
ఛందమా నీవుండు – సంగీత మేదో
గంధమా నీవుండు – ఖశ్వాస మేదో
బంధమా నీవుండు – స్వాంత మ్మదేదో

చాలురా నీమాట – సత్యమ్ము గాదే
చాలురా నీయాట – సాంత్వమ్ము నీదే
గోలురా నీతోడు – గోపాల బాలా
యేలరా ధీశాలి – యీరీతి శీలీ

ప్రాకారబంధ (లయగ్రాహి, విధ్యంగమాల) – త/త/త/గగ UUI UUI – UUI UU 11 త్రిష్టుప్పు 293

నాగుండెలో నుండు – నందాబ్ధిచంద్రా
నాగొంతులో నుండు – నాదాల సంద్రా
నాగీతమం దుండి – నర్తించు దేవా
వాగర్థ రూపాల – వాగ్భూషణా రా

ఆకాశమం దుండు – యందాల తారా
శ్రీకారమం దుండు – చిత్రంపు వంపా
రాకేందుబింబంపు – రశ్మీ, సుచిత్ర-
ప్రాకారబంధా, వ-రాంగీ సుమిత్రా

మురళీమోహన – స/జ/త/మ IIUI UIU – UIU UU 12 జగతి 299

మురళీధరా హరే – మోహనా కృష్ణా
వరమీయ వేగ రా – పద్మపత్రాక్షా
సరసీరుహమ్ము లా – చారు హాసమ్ముల్
నరకాంతకుండె యీ – నాకు వాసమ్ముల్

తెలిమంచు చుక్కయో – తేనియల్ చిందో
వలఱేని యస్త్రమో – వాణి గీతమ్మో
లలిఁ బెంచు లాస్యమో – రాశి రత్నమ్మో
అలివేణి యెవ్వరో – యామె చైత్రమ్మో

రమణ (కంజాక్షీ) – న/మ/య/య IIIU UUI – UUI UU 12 జగతి 584

కమలమా యీరోజు – కవ్వించబోకే
కమలె నా చేతమ్ము – కన్నీళ్లు నిండెన్
యమళమై యుండంగ – నాశించఁగా నా
రమణుఁడో రాలేదు – రాత్రిన్ రమించన్

అలలతో హోరెత్తె – నంభోధి సంధ్యన్
శిలలపైఁ గూలంగఁ – క్షీరమ్ము సిందెన్
మిలమిలల్ వెల్గంగ – మీనమ్ము లెందున్
చెలువమా నేనెట్లు – చిత్రింతు నిన్నున్

వజ్రకటక – స/య/య/య IIUI UUI – UUI UU 12 జగతి 588

ఇది లంక నారాజ్య – మిందుందు ఱేఁడై
యెదిరించఁగా నౌనె – నెవ్వారికైనన్
మెదలంగ నౌనే స-మీరమ్ము వేగన్
గదలంగ నౌనే శు-కమ్మైన నిందున్

కనులిందు వ్రాయంగఁ – గావ్యమ్ము లెన్నో
మనమిందుఁ బాడంగ – మౌనంపు గీతిన్
దనువో గవేషించఁ – దాపమ్ము దీరన్
నను జూడ రాలేదు – నాసామి యేలా

హేమంత – భ/య/య/య UIII UUI – UUI UU 12 జగతి 591

మ్రోడులను జూడంగ – మోదమ్ము రాదే
వాడలిట నెందెందుఁ – బ్రాలేయ రాశుల్
వీడకను బాధించెఁ – బ్రేమాగ్నికీలల్
కాడె నను హేమంత – కాలంపు మంచుల్

ఆననముఁ జూపించు – మానందమొందన్
మానసములోనుండు – మాణిక్య దేహా
కాననములో బర్హి – కవ్వించ నాడెన్
వానవలె రారమ్ము – ప్రాణమ్ము పూయన్

వనితావిలోక – త/త/స/య UUI UUI – IIUI UU 12 జగతి 741

రాగమ్ములోఁ బాడ – రసగంగ సాఁగున్
యోగమ్ములోఁ గూడ – నొక హాయి యూఁగున్
వేగమ్ముగా రమ్ము – ప్రియమారఁ బల్కన్
భోగమ్ములే యిమ్ము – పులకించి కుల్కన్

పాలించరా వేగ – ప్రణయాంతరంగా
ఆలించరా వేగ – మసితాననాంగా
లీలామయా దేవ – ప్రియ చారువేషా
మేలమ్ముతో రమ్ము – మృదువాక్య భూషా

రాగాలస – ర/ర/త/స UIU UIU – UUI IIU 12 జగతి 1811

రాగిణీ యేల నీ – రాగాలసము నీ
యోగమే చాలు నీ – యుర్వీస్థలముపై
వేగమే రా దరిన్ – బ్రేమాబ్ధి మునుఁగన్
భోగసంపన్నమై – మోదమ్ము లొసఁగన్

శ్రీధరా రమ్ము నా – చిత్తమ్ము విరియన్
మాధవా రమ్ము నీ – మాధుర్య మొలుకన్
యాదవా రమ్ము నీ – యందమ్ము వెలుఁగన్
రాధ నే వేచితిన్ – రాగాల నిశిలో

నిష్కళంక – భ/న/య/ర/గ UIII IIIU – UUI UU 13 అతిజగతి 1151

నే నెపుడుఁ దలఁతుఁగా – నీ నిష్కళంక
మ్మైన ముఖకమలమున్ – హర్షమ్ముతోడన్
దీన నను గనఁగ రా – దేవాలయ మ్మీ
మానసము ప్రియతమా – మాయావినోదా

చక్కఁగ నరదమనన్ – సంక్రాంతి వచ్చున్
జుక్కలను ధరణిపైఁ – జూడంగ వచ్చున్
కుక్కుటము లడుగిడున్ – గోపమ్ముతోడన్
మిక్కుటము హరుసముల్ – మేలైన వాడన్

లాలసరాగ – న/స/ర/ర/గ IIIII UUI – UUI UU 13 అతిజగతి 1184

అలలవలె నా కోర్కె – లా నింగిఁ దాకెన్
ఫలితమవ నా పూజ – ప్రార్థిచుచుందున్
లలన కిట డెందమ్ము – లాస్యమ్ము సేసెన్
తెలుఁగు నుడి నేఁ బాడి – దీపమ్ము నుంతున్

మధురముగ మాటాడు – మౌనమ్ము వద్దే
పదములను జక్కంగఁ – బాడంగ ముద్దే
సదమలము గానమ్ము – సంతోషకారీ
ముదితమగు డెందమ్ము – పూవై మిటారీ

ఆనంద వృత్తము – త/భ/న/ర/గ UUI UIII – IIUI UU 13 అతిజగతి 1525

ప్రాణస్వరూపునికిఁ – బ్రణతోఽస్మి యందున్
ఆ నాఁటి భీమునికి – నభివాదనమ్ముల్
ఆనంద రూపునికి – నభివందనమ్ముల్
గానస్వరూపునికిఁ – గయిమోడ్పు లిత్తున్

ప్రాణమ్ము వేఱగును – పరమాత్మ వేఱౌ
శ్రీనాథు సంస్మరణ – చిరశాంతి నిచ్చున్
ఆనందమూర్తిఁ గని – హరిపాద మందన్
గానమ్ము భక్తియును – గడతేర్చు గాదా

అనంగప్రియా – స/జ/త/స/గ IIUI UIU – UIII UU 13 అతిజగతి 1836

ఒక నావ నీటిలో – నూఁగుచును దేలెన్
ఒక పాట నోటిలో – నూఁగుచును రాలెన్
ఒక తార మింటిలో – నుజ్జ్వలిత మయ్యెన్
ఒక ప్రేమ భావ మీ – యుల్లమున నిండెన్

కను గాంచుమో యనం – గప్రియ శుభాంగీ
విను మొక్క గీతికన్ – వేగము వరాంగీ
మనమిందుఁ గోరెఁగా – మానినిని ధాత్రిన్
తనువిందుఁ గోరెఁగాఁ – దామరసనేత్రిన్

చటుల (సౌందర్య) – భ/య/జ/స/గ (1, 8) UIII UUI – UIII UU 13 అతిజగతి 1871

కావ్యమును వ్రాయించు – కన్నుల కలమ్ముల్
దివ్యముగ మ్రోయించు – తీయని రవమ్ముల్
భవ్యమగు నానంద – భావనకు గీతుల్
శ్రావ్య మవి చిద్రూప – సౌందర్య రీతుల్

నీ చటుల శృంగార – నృత్యమును జూడన్
లోచనము లానంద – రోచనము లాయెన్
నా చెవుల కింపైన – నవ్య శుభ గీతుల్
నీ చరణ మంజీర – నిస్వనము లాయెన్

నటహంస – ర/త/న/స/గ UIU UUI – IIIII UU 13 అతిజగతి 2019

ఆడనా నృత్యమ్ము – నతి మధుర రీతిన్
పాడనా గీతమ్ముఁ – బరవశము సేయన్
నేఁడు హేమంతమ్ము – నిశి బిలుచుచుండెన్
నేఁడు రా నన్ గూడ – నెనరు మది నిండున్

భైరవీ రత్నాంగి – వలచి సరసాంగీ
చారుకేశీ బౌళి – శహన బహుదారీ
ఆరభీ ఆభేరి – యమన నటహంసా
గారవమ్మై నాదు – గళమునను రారే

రాగలాలస – ర/ర/భ/న/గ UIU UIU – UIII IIU 13 అతిజగతి 3987

తీయఁగాఁ బాడనా – తెల్గు నొక పదమున్
మాయలోఁ దేల్చనా – మంత్రముల నడుమన్
హాయిలో ముంచనా – హర్షమను నదిలో
వేయి దీపాలతో – వెల్గు ధను వియనా

రాగదీపమ్ములో – లాలసల రుచులా
మ్రోఁగు యీ వీణలో – మోదముల ఝరులా
భోగ మీ రాత్రిలో – పూర్ణశశి సిరులా
యోగమందుండఁగా – నొప్పు పలు విరులా

నీలమణి – త/త/భ/న/గ UUI UUI – UIII IIU 13 అతిజగతి 4005

శ్రీరామ నామమ్ము – సీత మదిఁ దలఁచెన్
శ్రీరాశి నామమ్ము – సీత పతి దలఁచెన్
వారిర్వు రెల్లప్డు – భావముల నొకరే
వారిర్వు రెల్లప్డు – స్వాంతముల నొకరే

నీలమ్ము నీరూపు – నీలమణి వెలుఁగుల్
శ్రీలిచ్చు నీనవ్వు – చెల్వముల మెఱుఁగై
యాలించ నీగీతి – యాశయగు మదిలో
తేలించుమా నన్ను – దీయనగు సుడిలో

ప్రియతమ – న/భ/జ/స/గగ IIIU IIIU – IIIU UU 14 శక్వరి 1912

కనులతోఁ బిలువనా – కళలు పెంపొందన్
మనసుతోఁ గలువనా – మమత లింపారన్
దినము నే నుడువనా – తియగ నామమ్మున్
అనఘ రా కనఁగ రా – హరుస మీయంగన్

చెలువమౌ సిరులలోఁ – జెలి సదా నీవే
పిలుపులోఁ దలఁపులోఁ – బ్రియతమా నీవే
వలపులోఁ బదములోఁ – బ్రణయినీ నీవే
కలలలోఁ గవితలోఁ – గథలలో నీవే

శరభలలిత – న/భ/న/త/గగ IIIU IIIII – UUI UU 14 శక్వరి 2552

అలలపైఁ బవనములు, – హ్లాదంపు చోటుల్
కొలనిలోఁ గమలములు, – గుమ్మంచుఁ దేఁటుల్
వెలుఁగుతో వలయములు, – వింతైన జ్యోతుల్
చెలువమై దినముఖము – శ్రీలిచ్చు దీప్తుల్

శరభ మా సికతమునఁ – సాఁగించె యాత్రన్
వరమెగా మరువు నదిఁ – బాంథుండు వెళ్లన్
గరములన్ మధుఘటము – కాలమ్ము సాఁగున్
గరుణతో నతఁ డొసఁగుఁ – గైవల్య సిద్ధిన్

వరలక్ష్మి – న/స/జ/జ/గగ IIIII UIU IIUI UU 14 శక్వరి 2912

నిదుర యను మాయలో – నెలవంక నవ్వెన్
మదనుఁ డొక బాణమున్ – మదిలోన రువ్వెన్
హృదయమున నీవెగా – నిలలోన నాకున్
ముదమలరఁ బ్రేమ యా – పువువోలెఁ దాఁకున్

జలనిధికిఁ బట్టి యో – జలజాక్షి రావా
సరసతర దృష్టులన్ – జలుపంగ మాపై
జలశయను భార్య యో – జలజాలయా రా
వలపు దొర తల్లి యో – వరలక్ష్మి మాతా

రమణీయ – స/న/భ/జ/గగ IIUI IIUI – IIUI UU 14 శక్వరి 3004

సుమరాశి విరబూసి – సొగసీనె నీకై
భ్రమరాలు సడి సేసె – వనియందు నీకై
రమణీయమగు సంధ్య – రసమాల నీకే
కమనీయమగు నాదు – కవనమ్ము నీకే

దిన మిప్డు ముగియంగఁ – దిమిరమ్ము నిండెన్
దినవయ్య యొక ముద్ద – తినిపింతు నీకున్
వినవయ్య కథ నొండు – వినిపింతు నీకున్
గనుమూసి నిదురించు – కమలాక్ష కృష్ణా

నవనందిని (రజనీకర) – స/జ/స/న/గగ IIUI UIII – UIII UU 14 అతిశక్వరి 3820

అవనీతలమ్ము పలు – యందముల నిండెన్
నవ రాగ గీతికలు – నాల్గు దెసలందున్
నవనందినీ లహరి – నందమిడ నాడెన్
నవమైన యామనియు – నర్తనము సేసెన్

రజనీకర ద్యుతులు – రమ్యముగఁ దోఁచెన్
రజనిన్ బ్రమోదమున – రాగలత పూచెన్
వ్రజమందు నృత్యముల – రావములు లేచెన్
వ్రజనాథుఁ డందముగ – రాసములఁ గూర్చెన్

మనోహర – స/న/ర/జ/లగ IIUI IIUI – UIU IIU 14 శక్వరి 6844

నగుమోము గలవాఁడు – నా మనోహరుఁడే
జగదేకమగు సొంపుఁ – జల్లు శ్రీకరుఁడే
సుగమిచ్చి నను బ్రోవు – సుందరాననుఁడే
యిఁగ వచ్చి నను జేరు – నిందు కాంతులలో

అరుణోదయము వేళ – యందమై వెలుఁగుల్
చిఱు సవ్వడులతోడఁ – జెల్వమై పులుఁగుల్
తెరువందుఁ దెలి మ్రుగ్గు – దెల్లవారులలో
నరవిందములతోడ – నంబుజాకరముల్

మల్లికా – స/జ/స/జ/లగ IIUI UIII – UIU IIU 14 శక్వరి 6892

కనులందు వెన్నెలల – కాంతులన్ గనఁగా
మనమందు మల్లికల – మత్తు పర్విడఁగా
విననయ్యె రాగముల – వేయి సుస్వరముల్
ప్రణయంపు కామలత – పల్లవించెనుగా

ఒకరోజు పాడె నది – యుల్లమం దళియై
ఒకరోజు పూచె నది – యుల్లమం దలరై
ఒకరోజు తోఁచె నది – యుల్లమం దినుఁడై
ఒకరోజు లేచె నది – యుల్లమం దనుఁగై

కైరవిణీ – భ/జ/భ/జ/లగ UIII UIU – IIIU IIU
14 శక్వరి 7087

మానసము నీకునై – మలసెనే చెలియా
కానగను వత్తువా – కలలలో సకియా
నీనగవు కాంతిలో – నిలువనా లలితో
వానవలె రమ్ము నీ – వలపు కర్వలితో

కైరవిణిఁ గాంచరా – ఖదిరుఁడా త్వరగా
తారలట నవ్వె నీ – తమిని నిర్దయగా
కోరికలు కొండలా – కుటిల మీ బ్రదుకా
చేరఁగ నశక్యమా – చెలువమే వృథయా

మందార – స/న/ర/భ/లగ IIUI IIUI – UUI IIU 14 శక్వరి 7356

నిను జూడ మనసాయె – నీరేజ నయనా
చినదానిఁ గన రమ్ము – శేషేంద్ర శయనా
ననవోలె ముకుళించె – నాడెంద మిటరా
వినిపింతు నొక గీతి – వేవేగ మిటు రా

మణులుండు గని నీవు – మందార తరువా
తనువిందు నిను గోరెఁ – దాపమ్మె నెరవా
స్వన మొండు విన నీదు – వాక్యమ్ము లని నా
కనుదోయి నిను జూడఁ – గాంక్షించెఁ గుటిలా

అలసగతి (విచిత్రలలితా) – న/స/న/భ/య IIIII UIII – UIII UU 15 అతిశక్వరి 7648

అలసగతి సాఁగెగద – హ్రాదినియు సొంపై
తళతళల దీపిలఁగఁ – దమ్మిదొర వెల్గున్
జలముపయిఁ జాపనిడి – జారెఁ జిన నావల్
తెలుఁగు పద మొండు మెల- దేలె నల గాలిన్

అరుణముగ నంబరము – లందముల నింపన్
దరుణము విచిత్ర లలి-తమ్మగును గాదా
సరసముగఁ బాడఁగను – ఛందముల వ్రాయన్
హరుసమగు డెంద మిట – నర్ణవపు పొంగై

వనమరాళము – భ/న/న/భ/య UIII IIIII – UIII UU 15 అతిశక్వరి 7679

రమ్ము సకి గన వనమ-రాళముల యాటల్
రమ్ము సకి విన నళుల – రమ్యమగు గీతుల్
రమ్ము సకి గొన నెడఁద – రాగముల ప్రీతుల్
సొమ్ములవి మన స్మృతుల – సుందరపు మన్కిన్

హారములు వలదు హరి – యక్కునను జేర్చన్
హీరములు వలదు హరి – హృద్యముగ నిల్వన్
క్షీరములు వలదు హరి – చేరువను నుండన్
కోరికలు వలదు హరి – కూరిమిని గూడన్

మత్తభృంగ – భ/జ/త/న/లగ UIII UIU – UIII IIU 14 శక్వరి 7983

కాను మిట మత్త భృం-గమ్ములను వనిలో
వానవలె సూనముల్ – వందలుగ కురియన్
దేనెవలె గాలిలోఁ – దీయనగు రజముల్
ఓ నవ వసంతమా – యుర్విపయిఁ ద్వర రా

అందముగ వత్తువా – యామని విరులతో
సుందరతఁ దెత్తువా – సొంపుల సరులతో
మందముగ గాలిలో – మాధురుల సెలగా
జందురుని గాంతితో – సంతసపు వలగా

మదనవతీ – న/స/జ/న/య IIIII UIU – IIIII UU 15 అతిశక్వరి 8032

మదనవతి పిల్వఁగా – మమత లిటఁ బొంగెన్
నదియువలెఁ బారెఁగా – నగుచు నలవోలెన్
మదియుఁ బులకించెఁగా – మఱిమఱియు హాయిన్
అధరముల నిచ్చుఁగా – హరుసముల రేయిన్

వలయమున గోపికల్ – వలపు లిడు నృత్యం
బలరగను జేయఁగా – మణియువలె వెల్గెన్
వెలుఁగులకు ఱేఁడుగా – వెదురు నుడు లూఁదెన్
కలలవలె రాత్రిలోఁ – గలవరము గల్గెన్

కోమల (పూర్ణశశివదనా) – భ/జ/స/న/స UIII UIII – UIII IIU 15 అతిశక్వరి 16111

ప్రేమలకు నాశలకుఁ – బ్రీతికిని గృహమై
కోమలము మానసము – కోమలికి నయమై
కామసుమ మెల్లెడల – కామలత కొనలో
నా మధుర రాగముల – కందములు వనిలో

మోదమగు నిన్ను గన – పూర్ణశశివదనా
వేదమగు నీ నుడులు – శ్వేతసుమరదనా
నాదమును నే వినఁగ – నాకమును గననా
రా దరికిఁ బ్రేమమున – రాసమున మననా

పద్యముల పోకడలు – భావకవి తపమా
పద్యముల కల్పనలు – భావకవి జపమా
పద్యముల నృత్యములు – భావకవి వరమా
పద్యముల యందములు – వాణి మణిసరమా

లలితపద (కమలదళ) – న/న/న/జ/స/గ IIIII IIIII – UIII UU 16 అష్టి 15360

మన మదియు మధురిపుని – మందిరమె యంటిన్
మన మనికి నిలకడయు – మాధవుఁడె యంటిన్
నిను గనఁగఁ గమలదళ-నేత్ర యిట నుంటిన్
విన లలితపదములను – వేఁగు హృది నుంటిన్

నదియువలె నెడఁద యిట – నాట్యములఁ బారెన్
పదములను తరఁగ లనఁ – బాడుచును నాడెన్
నిధియు నవ విధములుగ – నిన్ను గన వచ్చున్
ముదములను వదలకను – మోహనుఁడె యిచ్చున్

లలనా – ర/న/న/న/న/గ UIU IIIII – IIIII IIU 16 అష్టి 32763

ఎందుకో నను గనవు – హృదయ మిటఁ గుమిలెన్
ముందు రా నను గనఁగ – ముదపు దివె వెలుఁగున్
చింద రా వలపు సుధ – చెలువముల లలనా
పొందఁగా సుఖములను – బొలుపిడ సురదనా

ఫుల్లమౌ విరులవలెఁ – బులకితము దనువుల్
చల్లనౌ పవనములు – సరసముగఁ దగులన్
మెల్లఁగా రవము పడ – మృదువుగను జెవులన్
ఉల్లమో నిను దలఁచె – నుసిగొనుచు లలనా

వసుధారా – న న న న న గగ, IIIII IIIII – IIIII UU 17 అత్యష్టి 32768

మురిసినది మనసు కడు – ముదమలర నేఁడే
తరిసినది తరిసినది – తనులతయు తోడై
కురిసినది వలపిపుడు – కుతుక మిడు జల్లై
చిఱు కలలు బలు హృదికిఁ – జెఱుగని పటమ్ముల్

రస మొలుక నవ మృదుల – రవములిట మ్రోఁగెన్
హసనముల గుసుమములు – హరువు లిడి పూచెన్
దెసల నొక వెలుఁగు నది – తిరిగె వసుధారై
వసిగొనుచు ముసిముసిగ – వలపు నను దాఁకెన్

చమరివాల – న/న/న/జ/న/లగ IIIII IIIII – UIII IIU 17 అత్యష్టి 64512

అలలవలె శశికరము – లంబరపు కడలిన్
గలలు గన సమయ మిది – కౌముదిని గనుచున్
వలపు నును తలఁపులకు – వర్ణముల నిడుచున్
జెలియ హృది యలరఁగను – జేరు శుభ ఘడియల్

పడఁతి కురు లవి చమరి – వాలమన నమరెన్
ముడుల జడ ముదము లిడెఁ – బూలసరములతో
నడువఁగను నిటునటుల – నాగమనఁ గదలెన్
వడిగ హృది దడదడల – స్వానములఁ జెలఁగెన్

హిమమణి – (న)5/స IIIII IIIII – IIIII IIU 18 ధృతి 131072

హరి యనెద నుదయమున – హరి యనెద నిశిలో
హరి యనెద స్వగృహమున – హరి యనెద వనిలో
హరి యనెద హరుసమున – హరి యనెద వ్యధలో
హరి యనెద బ్రతుకునను – హరి యనెద తుదిలో

కమలమును గన వదన – కమలమును దలఁతున్
సుమములను గనఁ గదలు – సొబగులను దలఁతున్
భ్రమరముల గనఁ గురుల – వలయములఁ దలఁతున్
హిమమణులఁ గన వలపు – హృదయమును దలఁతున్

మందాక్రాంతములో వనమయూరపు లయలు
మందాక్రాంత వృత్తపు అమరిక – UUUU – IIIIIU – UIU UIUU. శాంతాకారం – భుజగశయనం – పద్మనాభం సురేశం ఇట్టి పంక్తియే. మొదటి నాలుగు గురువులను తప్పించి మిగిలిన అమరికను గమనిద్దామా? అది IIIIIU – UIU UIUU. దీనిని మూడు పంచ మాత్రలు, ఒక చతుర్మాత్రగా పునర్నిర్మాణము చేయ వీలగును – IIIII UUI – UUI UU. దీనినే నేను లాలసరాగ అని పిలిచినాను. ఇది ఒక సార్థకనామ గణాక్షర వృత్తము కూడ. అంతే కాదు, విలోమమైన అమరికలో కూడ వనమయూరపు నడకను మనము గమనించవచ్చును. మందాక్రాంతములో చివరి గురువును వదలి కుడినుండి ఎడమకు అమరికను చేసినప్పుడు లభించిన ఈ గురులఘువుల వరుసకు UIU UIU – UIII IIU వనమయూరపు లయ గలదు. దీనిని నేను రాగలాలస అని పిలిచినాను. మందాక్రాంతపు లయతో ఉండే వీణాక్వాణము అనేవృత్తపు అమరిక – UUUU – IIIUU – UIU UIUU. ఇందులో కూడ మొదటి నాలుగు గురువులను తొలగించినపుడు లభించిన అమరికలో IIIUU – UIU UIUU వనమయూరపు లయ ఉన్నది – IIIU UUI – U UI UU. దీనినే నేను రమణ వృత్తము అని పిలిచినాను. వీణాక్వాణ వృత్తములో కూడ విలోమ దిశనుండి వనమయూరపు లయతో ఒక వృత్తమును కల్పించ వీలగును. దానికి రాగాలస అని పేరుంచాను. క్రింద ఉదాహరణములు-

మందాక్రాంతము – మ/భ/న/త/త/గగ UUUU – IIIII UUI – UUI UU 17 అత్యష్టి 18929

మోదమ్మెందున్ – భువనమునఁ బుష్పించు – పూలన్ని నీకై
వేధించంగా – వివశ నిట, నుప్పొంగెఁ – బ్రేమమ్ము నీకై
కాదంబమ్మై – కవనములఁ బాడంగఁ – గల్పింతు నీకై
నాదించంగా – నవముగను సృష్టింతు – నాకమ్ము నీకై

ఇందులోని లాలసరాగ వృత్తము –
లాలసరాగ – న/స/ర/ర/గ IIIII UUI – UUI UU 13 అతిజగతి 1184

భువనమునఁ బుష్పించు – పూలన్ని నీకై
వివశ నిట, నుప్పొంగెఁ – బ్రేమమ్ము నీకై
కవనములఁ బాడంగఁ – గల్పింతు నీకై
నవముగను సృష్టింతు – నాకమ్ము నీకై

వీణాక్వాణము – మ/భ/స/ర/ర/గ UUUU – IIIU UUI – UUI UU 16 అష్టి 9457

ఆనందమ్మై – యలలతో హోరెత్తె – నంభోధి సంధ్యన్
శ్రేణుల్గా యా – శిలలపైఁ గూలంగఁ – క్షీరమ్ము సిందెన్
మేనిన్ రంగుల్ – మిలమిలల్ వెల్గంగ – మీనమ్ము లెందున్
శ్రీ నిండారన్ – జెలువమా నేనెట్లు – చిత్రింతు నిన్నున్

ఇందులోని రమణ వృత్తము –
రమణ (కంజాక్షీ) – న/మ/య/య IIIU UUI – UUI UU 12 జగతి 584

అలలతో హోరెత్తె – నంభోధి సంధ్యన్
శిలలపైఁ గూలంగఁ – క్షీరమ్ము సిందెన్
మిలమిలల్ వెల్గంగ – మీనమ్ము లెందున్
జెలువమా నేనెట్లు – చిత్రింతు నిన్నున్

స్రగ్ధరలో మందాక్రాంతపు లయ
సంస్కృత సాహిత్యములో దీర్ఘ వృత్తముల ఉపయోగములో శార్దూలవిక్రీడితము తఱువాత స్రగ్ధరా వృత్తమునకే స్థానము. పాదమునకు 21 అక్షరాలు, ఏడేడు అక్షరాలకు విఱుపు. తెలుగులో నన్నెచోడుడు కుమారసంభవ కావ్యమును ఈ వృత్తముతోనే ఆరంభించినాడు. శత్రుచ్ఛేదైక మంత్రం – సకల ముపనిష-ద్వాక్య సంపూజ్య మంత్రం… స్రగ్ధరయొక్క ఒక పాదము. స్రగ్ధరా వృత్తములో మందాక్రాంతమును గర్భితము చేయ వీలగును. మందాక్రాంతములో వనమయూరపు గతివలెనే స్రగ్ధరలో కూడ ఉన్నది. క్రింద ఒక ఉదాహరణము-

స్రగ్ధర – మ/ర/భ/న/య/య/య UU UUI UU – IIII IIU – UIU UIUU 21 ప్రకృతి 302993

నేఁడీ నేత్రమ్ములందున్ – నెనరు దివియలన్ – నృత్య గానమ్ము చూడన్
వాఁడా పద్మాక్షుఁ డిప్డున్ – వనితను గనఁగా – వచ్చునో వంతఁ దీర్చన్
గూడన్ రాకుండె దానున్ – గునపము వొడిచెన్ – గుండె వ్రచ్చెన్ బాధతో
మాడెన్ దేహ మ్మదెల్లన్ – మన మది కుమిలెన్ – మౌనమందుంటి నేడ్వన్

దీనికి ఈ విధముగా విఱుపులు కలిగించినప్పుడు మనకు ఇందులో వనమయూరపు నడకతో లాలసరాగ వృత్తము గోచరిస్తుంది – UU UUI UUI – IIIII UUI – UUI UU

నేఁడీ నేత్రమ్ములందుండు – నెనరు చిఱు దీపంపు – నృత్యమ్ము చూడన్
వాఁడా రాజీవనేత్రుండు – వనితఁ గన రాఁడేల – వమ్మయ్యె నాశల్
కూడన్ రాకుండె దానేల – గునపమును గ్రుచ్చంగ – గుండెల్ దునింగెన్
మాడెన్ నాసర్వ దేహమ్ము – మనము కడు రోదించె – మౌనమ్మునందున్

ఇందులోని లాలసరాగ వృత్తము –
లాలసరాగ – న/స/ర/ర/గ IIIII UUI – UUI UU 13 అతిజగతి 1184

నెనరు చిఱు దీపంపు – నృత్యమ్ము చూడన్
వనితఁ గన రాఁడేల – వమ్మయ్యె నాశల్
గునపమును గ్రుచ్చంగ – గుండెల్ దునింగెన్
మనము కడు రోదించె – మౌనమ్మునందున్

శుభాంగి, గజరాజేంద్ర వృత్తములో వనమయూరపు లయ
శార్దూలవిక్రీడితములో త/త/గ గణములకు బదులు ర/ర/గ గణములను ఉంచగా లభించిన వృత్తమునకు శుభాంగి అనియు, మత్తేభవిక్రీడితవృత్తము చివర త/త/గ గణములకు బదులు ర/ర/గ గణములు ఉంచగా లభించిన వృత్తమునకు గజరాజేంద్ర అనియు పేరుల నుంచినాను. ఈ రెండు వృత్తములలో కూడ వనమయూరపు లయతో ఉండే హేమంత వృత్తము గలదు. క్రింద నా ఉదాహరణములు-

శుభాంగి – మ/స/జ/స – ర/ర/గ UUU IIU IUI IIU – UIU UIUU19 అతిధృతి 75609

అమ్మా వేగము మమ్ము కావగను రా-వమ్మ కారుణ్య దీపా
చిమ్మంగా నమృతమ్ము జీవములు రా-జిల్ల శ్రీకార రూపా
సొమ్ముల్ మేడలు వద్దు భావములలో – శుద్ధిఁ బ్రార్థింతు మమ్మా
సమ్మానమ్ములు నీదు ప్రోవులగు హా-సమ్ము మోదమ్ము సుమ్మా

ఇందులోని హేమంత వృత్తము –
హేమంత – భ/య/య/య UIII UUI – UUI UU12 జగతి 591

కావగను రావమ్మ – కారుణ్య దీపా
జీవములు రాజిల్ల – శ్రీకార రూపా
భావములలో శుద్ధిఁ – బ్రార్థింతు మమ్మా
ప్రోవులగు హాసమ్ము – మోదమ్ము సుమ్మా

గజరాజేంద్ర – స/భ/ర/న/త/త/గగ IIUU IIU IUI IIU – UIU UIU U 20 కృతి 151220

కనఁగా దేహము పొంగు నాననము దాఁ-కంగ నాశించుచుంటిన్
వినఁగా నీదు గళమ్ము వీనులిట నా-ప్రేమ వేదమ్ము గోరెన్
మనఁగా నీదరి నెప్డు మానసము ర-మ్మంచు మారాము సేసెన్
వనజాక్షా హరి నీవె నా నిధియు స-ర్వమ్ము నా జీవమందున్

ఇందులోని హేమంత వృత్తము –
హేమంత – భ/య/య/య UIII UUI – UUI UU 12 జగతి 591

ఆననము దాఁకంగ – నాశించుచుంటిన్
వీనులిట నా ప్రేమ – వేదమ్ము గోరెన్
మానసము రమ్మంచు – మారాము సేసెన్
నా నిధియు సర్వమ్ము – నాజీవమందున్

నీలశార్దూలము (లీలామయి) వృత్తములో వనమయూరపు లయ
మాలినీ వృత్తమునకు గణములు – న/న/మ/య/య. చివరి య-గణము ప్రక్కన మఱొక య-గణమును చేర్చినప్పుడు లభించు వృత్తమునకు నీలశార్దూలము అని పేరు. దీని లయ భిన్నమైనది. దానిని ఈ విధముగా వివరించ వీలగును – IIII IIU – UUI UUI – UUI UU. ఇందులో UUI UUI – UUI UU అమరికతో నుండు వృత్తమునకు ప్రాకారబంధ లేక లయగ్రాహి అని పేరు. అనగా నీలశార్దూలమునకు మొదట రెండు చతుర్మాత్రలు, తఱువాత మూడు పంచమాత్రలు, చివర పంచమాత్రా తుల్యమైన ఒక చతుర్మాత్ర. క్రింద నొక ఉదాహరణము-

నీలశార్దూలము – న/న/మ/య/య/య IIII IIU – UUI UUI – UUI UU 18 ధృతి 37440

వెలుఁగుల విరియై – వేగమ్ముగా రమ్ము – ప్రేమమ్ము పూయన్
సలలిత మధువై – సాగంగ గానమ్ము – సంతోష మీయన్
చెలువపు నదియై – శ్రీగంగయై రాగ – చిత్రమ్ము గీయన్
వలపుల తలఁపై – వాగర్థ మందుండు – వైచిత్రి మోయన్

పై పద్యములో వనమయూరపు లయతో నుండు లయగ్రాహి (ప్రాకారబంధ) వృత్తము గర్భితమై యున్నది. అది-

లయగ్రాహి లేక ప్రాకారబంధ – త/త/త/గగ UUI UUI – UUI UU 11 త్రిష్టుప్పు 293

వేగమ్ముగా రమ్ము – ప్రేమమ్ము పూయన్
సాగంగ గానమ్ము – సంతోష మీయన్
శ్రీగంగయై రాగ – చిత్రమ్ము గీయన్
వాగర్థ మందుండు – వైచిత్రి మోయన్

వనమయూరపు లయతో తేటగీతి
తేటగీతిని నేను త్ర్యస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, షణ్మాత్రా గతులలో వ్రాసియున్నాను. వనమయూరపు లయతో ఖండగతిలో తేటగీతి-

ఖండగతిలో తేటగీతి –
ఆమనికి నీవెగద యంద-మగు ఘడియలు
శ్రీమయము లయ్యెగద చిందు – చిఱు నగవులు
నా మనసు నిచ్చితిని నా వ-నజ ముఖికిని
రా మధుర రాత్రి యిది రాగ-రస మొలుకఁగ

ఇందులోని కోమల వృత్తము –
కోమల – భ/జ/స/న/స UIII UIII – UIII IIU 15 అతిశక్వరి 16111

ఆమనికి నీవెగద – యందమగు ఘడియల్
శ్రీమయము లయ్యెగద – చిందు చిఱు నగవుల్
నా మనసు నిచ్చితిని – నా వనజ ముఖికిన్
రా మధుర రాత్రి యిది – రాగరస మొలుకన్

ఎదురు నడకతో వనమయూరము
ఈ వనమయూర వర్గములోని వృత్తములన్నియు ఎదురు నడక లేని పంచమాత్రలతో సృజింపబడినవి. ఎదురు నడకతో ఇది ఎలా ధ్వనిస్తుందో అని పరిశీలించాలని కుతూహలము కలిగినది. దాని ఫలితమే ప్రసూన వృత్తము. ఇందులో భ-లమునకు (UIII) బదులు జ-లమును (IUII) ఉపయోగించినాను.

ఎదురునడకతో వనమయూరము –
ప్రసూన – జ/స/న/భ/గగ IUII IUII – IUII UU 14 శక్వరి 3550

కళామయ విలాసము – గనంగను రావా
విలాసపు విపంచిని – వినంగను రావా
విలోలము మనస్సిది – విహారము సేసెన్
కలాపము నొనర్చుచుఁ – గవిత్వము వ్రాసెన్

దినమ్మున జ్వలించెను – దివాకరు డందున్
వనమ్మున జలించుచు – ప్రసూనము లెందున్
మనమ్మున నటించెను – మయూరము సొంపై
యనంతము ముదమ్మిట – ననంగుని కింపై

విహాయస పథమ్మున – విచిత్రము తారల్
మహోన్నత నగమ్మున – మహా హిమరాశుల్
అహా నిశి శశాంకుని – యపూర్వపు జ్యోత్స్నల్
విహారము వనిన్ గడు – ప్రియమ్మగుఁ గాదా

వనమయూరములో మఱికొన్ని లయలు
ఇంతవఱకు పంచమాత్రల ఖండగతిలో వనమయూరమును, అదే లయతో నిండిన ఎన్నో వృత్తములను మీకు పరిచయము చేసినాను. వనమయూరపు అమరిక – UIII UIII – UIII UU. దీనిని U – IIIU IIIU IIIUUగా విడదీసి వ్రాసినప్పుదు న-గముల స్వరూపము మనకు గోచరిస్తుంది. అదే విధముగా UI – IIUI IIUI IIUUగా విఱిచినప్పుడు స-లముల స్వరూపము కనబడుతుంది. అలాగే ఇలా UII – IUIIIUII IUU వ్రాసినప్పుడు జ-లముల అమరిక విదితమవుతుంది. వీటికి పాదాంతర్గత ప్రాసయతిని ఉంచి వ్రాసినప్పుడు మనకు క్రొత్త నడకలు పరిచితమవుతుంది. అట్టి నడకలకు ఉదాహరణములు-

న-గముల (IIIU) నడకతో వనమయూరము –

రా విరులతో సరులతో సిరులతో రా
రా వరముగా స్వరముగాఁ జిరముగా రా
రా వరదగా మెఱపుగా నుఱుముగా రా
రా వలపుతోఁ దలఁపుతోఁ గలియఁగా రా

ఈ మనసులోఁ గనులలో దినము నీవే
నా మనికిలో నునికిలో ననిశ మీవే
రా మధురమౌ సుధలతో వధువుగా రా
శ్రీమతివిగా బ్రతుకులో నతులితమ్మై

స-లముల (IIUI) నడకతో వనమయూరము –

దేవ నిను జూడ మనసాయెఁ గనులారన్
బ్రోవు మనియందు నను నెందు వినవేలా
త్రోవ గనరాదు వనమందుఁ జనలేనే
నీవె వెతలోన గతి నాకు జత రావా

చూడు మురిపించు విరులెందుఁ దరులందున్
జూడు చిఱుజల్లు హరివిల్లు హరుసమ్మై
పాడు మలరించు కలగీతి లలితమ్మై
నేఁడె కురిపించు సరసాల విరి నవ్వుల్

జ-లముల (IUII) నడకతో వనమయూరము –

చూడుము వసంతము హసించెను రసించన్
తోడగు ద్రుమమ్ముల సుమమ్ములు రమించన్
పాడుము స్వరమ్ముల సరమ్ములఁ దరించన్
పాడుము తెలుంగున వెలుంగుల యెలుంగై

నామది విలాసపు కలాపపు తలంపుల్
ప్రేమపు నభమ్మునఁ బ్రభాతము శుభమ్మై
కోమల హృదిన్ బలు ముదాకర పదమ్ముల్
రా మురవినాశన మనమ్మున స్వనమ్మై
(భ-ల)n/గగ మూసలతో వృత్తములు
ఒక నిర్దిష్టమైన సంఖ్యగల భ-ల గణములు, చివర గగము ఉండే వృత్తములు కొన్ని ఉన్నాయి. వాటిని క్రింద చూడవచ్చును-

n = 1, కామలతికా – UIII UU
n = 2, మృదువాణి * – UIII UIII UU (* నాచే కల్పితము)
n = 3, వనమయూరము – UIII UIII – UIII UU
n = 4, మాధురి – UIII UIII – UIII UIII UU (* నాచే కల్పితము)
n = 5, సుగంధి – UIII UIII – UIII UIII – UIII UU
n = 6, మంగళమహాశ్రీ – UIII UIII – UIII UIII – UIII UIII UU
n = 7, లయగ్రాహి (లలిత వృత్తము) – UIII UIII – UIII UIII – UIII UIII – UIII UU

కామలతికా (కామలలితా) – భ/య UIII UU 6 గాయత్రి 15

ప్రేమమతితోడన్ / నా మనికిలోనన్ / నీ మమత నింపన్ / కామలతికా రా

రామునికి నీడై / భూమిజయు వెళ్లెన్ / భూమిజకుఁ దోడై / రాముఁడును వెళ్లెన్

మృదువాణి – భ/జ/స/గ UIII UIII UU యతి లేదు 10 పంక్తి 239

సింధునదిపైన నొక నౌకన్ / సుందరతరాంధ్రమునఁ బాటన్
జిందులిడి యాడుదము రా యా- / నందమునఁ బాడుదము సొంపై
(సుబ్రహ్మణ్య భారతి తమిళ పాటకు అనుసరణ)

చారుమతి నీవె యలివేణీ / స్ఫారమతి నీవె మృదువాణీ
కారణము నీవె స్వరరాణీ / ధారుణికి దివ్వె నొకటిమ్మా

మాధురి – భ/జ/స/న/భ/య UIII UIII – UIII UIII UU 18 ధృతి 61167

మారునికిఁ జెల్లి నవ – మాధురికి నాకృతివి నీవా
కోరికల కొండలను – గోపురమునందు దివె నీవా
వారినిధియందుఁగల – వన్నెల ప్రవాళములు నీవా
చేరి నను శీఘ్రముగ – శ్రీల వర మీయ దరి రావా

ప్రాసయతితో –

నీల గగనమ్ము తన – నీలిమను గాంచె జలరాశిన్
నీల జలరాశి తన – నీలిమను గాంచె గగనానన్
నీలమగు రాత్రి తన – నీలిమను గాంచఁ బరికించెన్
నీలవపుఁ డెప్పుడిట – నీలనిశిఁ గాంచ నను వచ్చున్

ఐదు భ-లములు ఉండే వృత్తమును పొత్తపి వేంకటరమణకవి తప్ప మఱెవ్వరు చెప్పలేదు. క్రింద రమణకవి సుగంధికి నా ఉదాహరణములు-

సుగంధి – భ/జ/స/న/భ/జ/స/గ UIII UIII – UIII UIII – UIII UU 22 ఆకృతి 978671

నా మగువ బంగరము – నా చెలియ చెంగలువ – నవ్వుల సుమమ్మే
ఆమెయొక శిల్పమగు – నామెయొక కల్పతరు – వామె ద్యునదమ్మే
కామునికిఁ జెల్లెలట – కల్మిసతి కూఁతురట – కాకలి రవమ్మే
ఆమెయు సుగంధియగు – నందమగు గంధఫలి – యామె కవనమ్మే

ప్రాసయతితో –

కుందనపు బొమ్మ యతి-గంధముల రెమ్మ కడు – మందమగు వాతం
బందమగు చిత్రపట – మిందు కిరణాల మిస – చెందువ బెడంగుల్
సిందురపు టెఱ్ఱదన – మింధనపు వేడిమియు – చిందులిడు నృత్యం
బందు నిను జూచెదను – సుందరత యెప్పుడు సు-గంధి మది నీవే

ఆఱు భ-లములు, గగముతో ఉండే వృత్తము పాదమునకు 26 అక్షరములతో నుండు మంగళమాహాశ్రీ వృత్తము. ఇందులోని చివరి నాలుగు మాత్రా గణములు వనమయూరమునకు సరి పోతుంది. క్రింద ఒక ఉదాహరణము –

మంగళమహాశ్రీ – భ/జ/స/న/భ/జ/స/న/గగ UIII UIII – UIII UIII – UIII UIII UU 26 ఉత్కృతి 15658735

దేవునికి మంగళము – దేవికిని మంగళము – తేనియల మాధురుల గీతుల్
భావుకతఁ బాడెదను – భవ్యమగు సంగతులు – స్వాదుమయ సమ్మిళిత రీతుల్
ప్రోవుమని వేడెదను – మోదమునఁ బొంగుచును – మోహనుని బుష్పములఁ గొల్తున్
జీవనము వాఁడొసఁగె – చిందులిడి రంగఁడని – చిత్త మిట రంగులను నిండెన్

ఇందులోని వనమయూరము –

మంగళము తేనియల – మాధురుల గీతుల్
సంగతులు స్వాదుమయ – సమ్మిళిత రీతుల్
పొంగుచును మోహనుని – బుష్పములఁ గొల్తున్
రంగఁడని చిత్త మిట – రంగులను నిండెన్

వనమయూర యమళము – లయగ్రాహి
వనమయూర యమళములోని ప్రతి పాదములో రెండు వనమయూర వృత్తపు పాదములు ఉంటాయి. దీనికి తరువోజకు సామ్యము ఉన్నది. అందులో ఇంద్ర, సూర్య గణములు; ఇందులో పంచమాత్రలు, చతుర్మాత్రలు. అందులో రెండు ద్విపద పాదములు, ఇందులో రెండు వనమయూరపు పాదములు. అక్కడ అక్షర సామ్య యతి, ఇక్కడ ప్రాసయతి. దీనికి లయగ్రాహికి కూడ పోలికలు ఉన్నవి. లయగ్రాహిలో చివరి గణముతప్ప మిగిలినవి భలములు, ఇందులో నాలుగవ, ఎనిమిదవ గణములు గగములు. వనమయూర యమళమును లయగ్రాహిగా మార్చాలంటే మూడవ మాత్రాగణమైన గగమును భ-లము చేయవలెను. క్రింద అట్టి ఉదాహరణములను ఇచ్చినాను.

వనమయూరయమళము – భల/భల – భల/గగ – భల/భల – భల/గగ
భ/జ/స/న/మ/న/భ/జ/స/గ – UIII UIII – UIII UU – UIII UIII – UIII UU

రెమ్మలను బూచి పలు – తుమ్మెదల విందై – సొమ్మసిలఁ జేసితివి – కమ్మఁగఁ బసందై
కమ్మగను వీచు పవ-నమ్ముల సుగమ్మై – కిమ్మనక నూఁగును మొ-గమ్మది నవమ్మై
సొమ్ము వనదేవతకు – నిమ్మహిని నీవే – కొమ్మ నవ మన్మథుని – యమ్ము లిఁక కావే
యిమ్ముగను నవ్వుచును – రమ్ము విరిబాలా – చిమ్ముచును సంతసము – గ్రమ్మ రసడోలా

వనమయూర యమళము => లయగ్రాహి –
లయగ్రాహి – భ/జ/స/న/భ/జ/స/న/భ/య UIII UIII – UIII UIII – UIII UIII – UIII UU

రెమ్మలను బూచి పలు – తుమ్మెదల విందగుచు – సొమ్మసిలఁ జేసితివి – కమ్మఁగఁ బసందై
కమ్మగను వీచు పవ-నమ్ముల సుగమ్ముగను – గిమ్మనక నూఁగును మొ-గమ్మది నవమ్మై
సొమ్ము వనదేవతకు – నిమ్మహిని నీవెగద – కొమ్మ నవ మన్మథుని – యమ్ము లిఁక కావే
యిమ్ముగను నవ్వుచును – రమ్ము విరిబాలయయి – చిమ్ముచును సంతసము – గ్రమ్మ రసడోలా

వనమయూర యమళము –

శ్రీల నలరారు వర – బాల పశుపాలా – మాలలను దాలిచిన – మాలి రసలోలా
లీలలను జూపు సర-సాల గుణశీలా – యేల నను జూడ విట – నేల ఘననీలా
చాలు నటనమ్ము లిఁక – చాలు లలితాంగా – కేల నిడు వేణువును – ఱాలు గరుగంగా
తేలెదము డెందమునఁ – బూలు విరియంగా – వ్రాలెదము పాదముల – మ్రోల సిరిరంగా

వనమయూర యమళము => లయగ్రాహి –

శ్రీల నలరారు వర – బాల పశుపాల విరి – మాలలను దాలిచిన – మాలి రసలోలా
లీలలను జూపు సర-సాల గుణశీల హరి – యేల నను జూడ విట – నేల ఘననీలా
చాలు నటనమ్ము లిఁక – చాలు లలితాంగ చిఱు – కేల నిడు వేణువును – ఱాలు గరుగంగా
తేలెదము డెందమునఁ – బూలు విరియంగ వడి – వ్రాలెదము పాదముల – మ్రోల సిరిరంగా

లయగ్రాహినుండి వనమయూరము పుట్టినదా లేకపోతే రెండు వనమయూర వృత్తములు లయగ్రాహిగా మారినదా అనే ప్రశ్నకు జవాబు సులభతరము కాదు. లయగ్రాహిలో నాలుగవ ప్రాసయతిని తొలగిస్తే అది కన్నడములోని లలిత వృత్తము అవుతుంది. ఈ లలిత వృత్తము నాగవర్మ ఛందోంబుధిలో, జయకీర్తి ఛందోనుశాసనములో (నృత్తలలితము) పేర్కొనబడినది. కొన్ని కన్నడ కావ్యములలో, యక్షగానములలో ఈ లలిత వృత్తపు ప్రయోగము గలదు. ఇక్కడ ఒక శాసనప్రయోగాన్ని (క్రీ.శ. 1057, బెళతూరు) మీదృష్టిలో ఉంచుతాను[3].

శ్రీరమణి గౌరి శచి – ధారిణియ పుత్రి రతి – భూరమణి యందద సరూపళి’వళ్పా
దారె జయధారె జస-ధారె నయధారె భయ-హారె పతిభక్తి ధృతశక్తి యెనె సందీ
వీరనిధియం చలద – వారినిధియం గుణద – చారునిధియం నెగళ్దే’ కలెయనింతే
నారిజనరన్న మన-దార మఱెవర్ సకళ – ధారిణియొళింతు వరకాంతె దొరెయాదళ్

(నుగునాడు అధిపతి రవిగని కూతురు నవిలెనాడు అధిపతి ఏచన భార్య అయిన దేకబ్బె సహగమనము చేసికొన్నప్పుడు వ్రాయబడిన పద్యములలో ఇది ఒకటి. ఆమె శ్రీదేవి, గౌరి, శచి, ధారిణుల పుత్రికి సమానురాలని, సీత, రతి, భూదేవి మున్నగువారిలా అందగత్తె అనియు, గుణవంతురాలు, కీర్తిమతి, ఉదారస్వభావము గలది, భయహారి, పతిభక్తిగల నారీరత్నము అనియు – ఇట్టి స్త్రీని ఈ భూమిపైన మఱువ శక్యమా అని అర్థము.)

వనమయూర యమళమును తమిళకవి అరుణగిరినాథర్ (పదహైదవ శతాబ్దము) తిరుప్పుగళ్‌లో ఉపయోగించినాడు. దాని ధ్వని ముద్రికను ఇక్కడ వినగలరు.

వనమయూరము – ద్విపద – కర్ణాట చతుష్పది
కర్ణాట చతుష్పదిలో ప్రతిపాదములో మూడు పంచమాత్రలు, ఒక త్రిమాత్ర ఉంటాయి[2]. ద్విపదలో మూడు ఇంద్రగణములు, ఒక త్రిమాత్రయైన సూర్యగణము ఉన్నాయి. ద్విపదను కూడ పంచమాత్రలతో వ్రాసినప్పుడు ఈ రెంటికి వ్యత్యాసము లేదు. రెంటికి పాదాంత విరామయతి గలదు. కర్ణాటక చతుష్పదిలో అంత్యప్రాస కూడ ఉన్నది. క్రింద ఉదాహరణములు-

కర్ణాట చతుష్పది – 5/5 – 5/3 మాత్రలు, ప్రాస, అంత్యప్రాస

ఆననముఁ జూపు మది – యందముల ప్రోవు
మానసము నిన్ను గన – మైమఱచి పోవు
వీణియలు మ్రోఁగు మది – వెలుఁగుతో నిండుఁ
దేనియల నది పారుఁ – దీపి హృది నుండు

కర్ణాట చతుష్పది / ద్విపద –

మాధవా యన వెల్గు – మదిలోనఁ బ్రాఁకు
మోదమ్ము తావితోఁ – బూలయ్యె నాకు
శ్రీధరా యన శ్రీల – చెల్వమ్ము దోఁచు
నాదాల పవనమ్ము – నయముగా వీచు

వనమయూరపు లయలో మూడు పంచమాత్రలు, ఒక గుర్వంతమైన చతుర్మాత్ర ఉన్నాయి. పైన చెప్పిన చతుష్పది, ద్విపదలలోని చివరి త్రిమాత్ర పాటలో చతుర్మాత్ర లేక పంచమాత్రలకు సమానము. ఉదాహరణముగా అన్నమాచార్యుల జో అచ్యుతానంద… పాటను తీసికొనండి. అది ఇలా సాగుతుంది –

జో అచ్యుతానంద – జోజో ముకుంద
రావె పరమానంద – రామ గోవింద

నందునింటను జేరి – నయము మీఱంగ
చంద్రవదనలు నీకు – సేవ సేయంగ
నందముగ వారింట – నాడుచుండంగ
మందలకు దొంగ – మా ముద్దు రంగ

గోవర్థనంబెల్ల – గొడుగుగాగ పట్టి
కావరమ్మున నున్న – కంసు పడకొట్టి
నీవుమధురాపురము – నేల చేబట్టి
ఠీవితో నేలిన(నా)- దేవకీ పట్టి

ఇక్కడ పై విధముగా వ్రాస్తే పంచమాత్రల ద్విపదతో సరిపోతుంది. కాని పాటలో చివరి పదమును సాగదీసి పాడుతారు. అప్పుడు అది వనమయూరపు లయకు సరిపోతుంది. కావున సంగీతములో ఈ లయ సుప్రసిద్ధమైనదని చెప్పుట అతిశయోక్తి కాదు.

నృత్యప్రియ – జాతి పద్యము
వనమయూరపు లయతో ఒక జాతి పద్యమును సృష్టించుట అవశ్యము. దానికి నృత్యప్రియ (మయూరమునకు మఱొక పేరు) అని పేరు పెట్టినాను. ఈ నృత్యప్రియ జాతి పద్యములో పాదమునకు మూడు పంచమాత్రలు, ఒక చతుర్మాత్ర, మూడవ గణముతో అక్షరసామ్య యతి, పాదాంత విరామయతి. అంత్యప్రాస ఐచ్ఛికము. క్రింద నా ఉదాహరణములు-

నృత్యప్రియ – జాతి పద్యము – పం/పం – పం/చ
(పం – పంచమాత్ర – UUI, UIU, UIII, IIUI, IIIU, IIIII, చ – చతుర్మాత్ర – UU, IIU)

కూయుచున్ బింఛాల – గుమి కదల నెంతో
హాయిగా నృత్యప్రి-యములు వనిలోనన్
బాయకన్ నర్తించెఁ – బరవశముతోడన్
దీయఁగా మేఘాల – తిమిరముల నీడన్

మాయింటిలోనుండు – మల్లియల మొక్కా
తీయఁగా విరిసితివి – తేనియల చుక్కా
మోయలే నీతావి – మోహన మ్మిదియు(యూ)
నాయంచ యెటకేగె – నలిగె నీ మదియు(యూ)

రాగదీపము మండె – రమ్ము సందీపా
మూఁగమనసున వీణ – మ్రోఁగెఁ జిద్రూపా
వేగె నీ హృదయ మిటఁ – బ్రేమాగ్ని గాల్చె(ల్చే)
యోగమున విరహమున – యుల్ల మది పిల్చె(ల్చే)

ముగింపు
కొత్త సంవత్సరము రాబోతుంది, అది 2019. అతిజగతి ఛందమునకు చెందిన2019వ వృత్తము నటహంస వనమయూరవర్గమునకు చెందినదే. నటహంస వృత్తములో నూతన సంవత్సర శుభాకాంక్షలతో, 2019 మొత్తము వచ్చేటట్లు నిర్మింపబడిన ఒక చమత్కార చతురస్రముతో (magic square) ఈ వ్యాసమును ముగిస్తాను.

వర్షమా రావేల – వర మొసఁగ మాకై
హర్షమై వ్యాపించు – హసనముల జల్లై
ఘర్షణ మ్మాపంగ – ఘడియ యది నేఁడే
తర్షమున్ దీర్చంగఁ – ద్వరగ సుధ నీవే

శాంతితో నీ భూమి – సమరసము నుండున్
గాంతితో నీ భూమి – కడు సుఖము నుండున్
జెంత దైవమ్ముండ – సిరుల నిలు నిండున్
సంతస మ్మెందెందు – స్వరలహరి నిండున్
---------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: