Monday, March 25, 2019

హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా?


హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా?



సాహితీమిత్రులారా!
కో అద్ధా వేద క ఇహ ప్ర వోచత్ కుత ఆజాతా కుత ఇయం విసృష్టిః।
అర్వాగ్ దేవా అస్య విసర్జనేనాఽథా కో వేద యత ఆబభూవ॥

                                                    – (నాసదీయ సూక్తం ఋగ్వేదం 10-129-06)

ఈ సృష్టి ఎక్కడినుండి వచ్చిందో, ఎలా సృష్టింపబడిందో ఎవరు చెప్పగలరు? దేవతలు కూడా సృష్టి మొదలయ్యాకే వచ్చిన వారు కదా, మరి ఈ సృష్టి ఎలా మొదలయ్యిందో ఆ ఎరుకగల వారెవ్వరు?

ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న।
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ త్సో అంగ వేద యది వా న వేద॥

                                                     – (నాసదీయ సూక్తం ఋగ్వేదం 10-129-07)

ఈ సృష్టి ఆ కర్త సంకల్పమే, అవునో, కాదో? అత్యున్నత ఆకాశంలో ఉండి అధివీక్షించే దేవదేవునకు తెలుసునా? ఆయనకు కూడా తెలుసునో తెలియదో!

ఈమధ్య దాకా మా అబ్బాయిలిద్దరూ రాత్రి పూట పడుకునే ముందు కథలు చెప్పమని అడిగేవారు. వంతులవారిగా నేను, మా ఆవిడ కథలు చెప్పేవాళ్ళం. నా వంతు వచ్చినప్పుడు భారత, భాగవత, రామాయణ కథలనే నాకు తోచిన విధంగా చెప్పేవాడిని. మూడు కన్నుల శివుడు హిమాలయాల్లో ఉంటాడని, పాల సముద్రంలో విష్ణువు పాముపై పడుకుంటే, ఆయన నాభి నుండి ఉద్భవించిన కమలంలో ఉండి బ్రహ్మ మనల్నందరినీ సృష్టిస్తాడని అల్లిబిల్లి కథలుగా అల్లి చెబుతుంటే మాపిల్లలు ఊఁ కొడుతూ నిద్రపోయేవారు.

ఏ ప్రాచీన నాగరికతకైనా ఈ రకమైన కథలు, కథనాలు ఉంటాయి. శక్తివంతమైన పౌరాణిక గాథలు (mythology) ఏ జాతికైనా వారి వారసత్వ సంపద. నిజానికి నా దృష్టిలో ‘హిందువు అంటే ఎవరు?’ అన్న ప్రశ్నకు భారత, భాగవత, రామాయణ కథలను తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న వారంతా హిందువులే. అయితే, ఈ ఇతిహాస, పురాణ కథల ఆధారంగా మన ప్రాచీన చరిత్రను నిర్మించుకోగలమా? అంతేకాక, ఇతర ఆధారాల ద్వారా మనకు తెలిసిన చరిత్రను ఉపయోగించి ఈ కథల్లో నిజానిజాలను, అంతరార్థాలను నిర్ధారించగలమా? ఈ విషయంపై గత 50 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న ఒక శాస్త్రవేత్త చెప్పిన అభిప్రాయాలను ఉటంకించడం ఇక్కడ అసమంజసం కాదనుకుంటాను:

“We have to be careful how we use history and myth to understand one another. In this context I would define a myth as a story that a group of people believe for a long time despite massive evidence that it is not actually true; the spirit of myth is the spirit of Oz: Pay no attention to the man behind the curtain. […] we need to use history to understand myth—that is, we need to understand why such a text was composed and retold many times […] But we cannot use the myth to reconstruct the actual history behind the text; we cannot say that the text is evidence. […] Such myths reveal to us the history of sentiments rather than events; motivations rather than movements.” (W. D. p. 23).

పై మాటలు రాసిన పరిశోధకురాలు మరెవరో కాదు, ప్రస్తుతం వివాదాస్పదమైన అమెరికన్‌ రచయిత్రి వెండీ డానిగర్‌ (Wendy Doniger). ఈ కొటేషన్ పెంగ్విన్-ఇండియా ఉపసంహరించుకున్న The Hindus: An alternative history పుస్తకంలో 23వ పేజీలో నుండి తీసుకున్నదే.
ఈ పుస్తకాన్ని నేను నాలుగేళ్ల క్రితమే చదివాను. అయితే, హిందూమత చరిత్రను కూలంకషంగా చర్చించిన ఈ పుస్తకంలో కొన్ని విషయాల్లో డానిగర్ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవించలే(దు)ను. అలాగే, కొన్నిచోట్ల ఆవిడ విశ్లేషించిన తీరుపై నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆవిడ ఇచ్చిన సమాచారంలో కొండొకచో చిన్న చిన్న పొరపాట్లు కూడా కనిపించాయి. హిందూమతానికి ముఖ్యమైన అంశాలు కొన్నింటిని ఆవిడ స్పృశించకుండా వదిలేయడం వల్ల ఈ పుస్తకంలో కొన్ని చర్చలు అసమగ్రమనిపించాయి.

అయితే, నాకు ఈ పుస్తకంలో హిందువులను అవమానపరిచే అంశాలు గాని, హిందూ మతాన్ని పనిగట్టుకొని కించపరిచే ఉద్దేశం గాని ఏ కోశానా కనిపించలేదు. ప్రతి పేజీలోను ఒక పరిశోధకురాలు తాను ఎన్నుకున్న అంశంపై అన్నీ దృక్కోణాలను విశ్లేషించడానికి, అన్నీ ప్రత్యామ్నాయ కథనాలను వీలైనంతగా చర్చించడానికి పడే తాపత్రయమే కనబడింది. ప్రతి అంశంపై ఇప్పటిదాకా మనకు తెలిసిన సమాచారం అసమగ్రమేనని ఇంకా ఎన్నో పరిశోధనలకు ఆస్కారం ఉందని అడుగడుగునా చెప్పుకునే సత్య శోధనా తత్పరతే కనిపించింది. విదేశీ వనితగా తాను చేసే విశ్లేషణల్లో తనకు తెలియకుండానే ‘పాశ్చాత్య పక్షపాతం’ (western bias) చొరబడే ప్రమాదం ఉందని ఒప్పుకునే నిజాయితీ కనబడింది.

అందుకే, ఈ పుస్తకాన్ని నిషేధించాలని దీనానాథ్ బాత్రా అనబడే వ్యక్తి ‘శిక్షా బచావో ఆందోళన్‌’ అనే సంస్థ ద్వారా కోర్టుకు వెళ్లాడని విని ఆశ్చర్యపోయాను. అంతే కాక, భారతదేశంలో ఈ పుస్తకాన్ని ప్రచురించిన పెంగ్విన్‌-ఇండియా వారు నాలుగేళ్ళ కోర్టు పోరాటం తరువాత ఆ సంస్థతో కోర్టు వెలుపల సంధి చేసుకొని ఈ పుస్తకాన్ని మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకోవాలని, మిగిలిన ప్రతులను తగులబెట్టాలని నిర్ణయించిందని విని మరింత విస్తుపోయాను.

ఎవరీ వెండీ డానిగర్?
వెండీ డానిగర్ (Wendy Doniger) అమెరికాలో భారతీయ శాస్త్రాన్ని గత 50యేళ్లుగా అధ్యయనం చేస్తున్న ప్రొఫెసర్. ఈమె న్యూయార్క్ నగరంలో యూదుల కుటుంబాన 1940లో జన్మించింది. ఆ రోజుల్లో ఈవిడ తండ్రి లెస్టర్ డానిగర్ ఒక ప్రచురణ సంస్థను నడిపేవాడు. వెండీ డానిగర్ ‘సంస్కృతము, భారతీయ విద్య’ అన్న అంశాలపై రాడ్‌క్లిఫ్ కాలేజీలో బి. ఏ. చేసి, అదే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీ నుండి 1963లో ఏం.ఏ.; ఆపై 1963-64లలో ఇండియాలో గడపి, 1968లో హార్వర్డ్ నుండే ‘Asceticism and Sexuality in the Mythology of Siva’ అన్న అంశంపై పిఎచ్. డి.; తరువాత నాలుగేళ్ళు ఇంగ్లాండ్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో, The Origins of Heresy in Hindu Mythology అన్న అంశంపై పనిచేసి 1973లో డి. ఫిల్. పట్టాలు పుచ్చుకున్నారు.

ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో హిస్టరీ ఆఫ్ రెలిజియన్స్ విభాగంలో, విశిష్టాధ్యాపకురాలిగా పనిచేస్తున్న వెండీ డానిగర్ హిందూ మతంపై ఎన్నో పుస్తకాలు, అనువాదాలు రాశారు. 1975లో సంస్కృతంలోని శివపురాణపు కథలకు అనువాదాన్ని, 1981లో ఋగ్వేదంలో 108 సూక్తాలకు, 1991లో మనుధర్మశాస్త్రానికి, 2002లో వాత్సాయన కామసూత్రానికి, 2006లో హర్షుని ప్రియదర్శిక, రత్నావళి కావ్యాలకు — అనువాదాలు ప్రచురించారు. మొదట్లో ఫ్రాయిడ్ సిద్ధాంతాలను ఆధారం చేసుకొని హిందూమతాన్ని, పురాణాలను విశ్లేషణ చేసిన ఈమె, ఆపై హిందూ పౌరాణిక గాథలపై మత, తత్త్వ, తాంత్రిక విషయాలను విస్తృతంగా చర్చిస్తూ 16 పుస్తకాలు వెలువరించారు. వీటిలో ప్రముఖమైనవి:

The Implied Spider: Politics and Theology in Myth. The 1996–1997 ACLS/AAR Lectures. New York: Columbia University Press, 1998,
Splitting the Difference: Gender and Myth in Ancient Greece and India. The 1996 Jordan Lectures. Chicago and London: University of London Press and University of Chicago Press, 1999.
The Bedtrick: Tales of Sex and Masquerade. Chicago: University of Chicago Press, 2000.
La Trappola della Giumenta. Trans. Vincenzo Vergiani. Milan: Adelphi Edizione, 2003.
The Woman Who Pretended to Be Who She Was. New York: Oxford University Press, 2005.
The Hindus: An Alternative History. New York: Penguin Press, 2009.
On Hinduism, Oxford University Press, 2013.
ఇవేకాక, ఎన్నో పుస్తకాలకు పరిష్కర్తగా పనిచేసిన డానిగర్, ప్రతిష్ఠాత్మకమైన జర్నళ్ళలో వందలకొద్ది పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. ప్రస్తుతం ఆవిడ సంపాదకురాలిగా, ఒక రచయితగా Norton anthology of primary Hindu writings అన్న పుస్తకంపై పని చేస్తున్నారు. నవంబర్ 2014లో మార్కెట్లో లభ్యమయ్యే ఈ పుస్తకంపై మరింత దుమారం చెలరేగే అవకాశం ఉంది.

దీనానాథ్‌ బాత్రా ఎవరు?
హిందీ, ఇంగ్లీష్ టీచరుగా, ఆపై ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీవిరమణ తీసుకున్న దీనానాథ్‌ బాత్రా, భారతీయ విద్యా బోధనలో దుష్ట పాశ్చాత్య ప్రభావాన్ని ఎదురుకోవడానికి ‘శిక్షా బచావో ఆందోళన్‌’ పేరిట ఒక సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పాకిస్తానులో భాగమైన పంజాబ్ ప్రాంతంలో జన్మించిన ఈయన, స్వాతంత్ర్యం తరువాత కుటుంబంతో సహా భారతదేశానికి తరలివచ్చారు. ఇప్పటికీ ఆయన పాకిస్తాన్ లోని చిన్ననాటి ఊరు, బడి, దేవాలయము గుర్తు చేసుకుంటూ ఉంటారు.

‘వసుధైక కుటుంబకమ్’, ‘ఏకం సత్ విప్రా బహుదా వదంతి,’ వంటి ఘనమైన సందేశాలను ప్రపంచానికి అందజేసిన హిందూమతానికి ప్రపంచంలో సరైన గుర్తింపు రాకపోవడానికి పాశ్చాత్య పండితులే కారణం అని ప్రబలంగా నమ్మే బాత్రా గత 10 సంవత్సరాలలో ఎంతోమంది రచయితలను, పుస్తక ప్రచురణ సంస్థలను కోర్టుకు తీసుకెళ్ళారు.

అంతకు ముందు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుపుతున్న రోజుల్లో మానవ వనరుల శాఖ మంత్రి అయిన మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలో నడిచే ‘విద్యాభారతి అఖిల భారతీయ విద్యా సంస్థాన్’ అనే సంస్థకు బాత్రా జనరల్ సెక్రటరిగా పనిచేశారు. ఆ రోజుల్లో, ఆ సంస్థ ద్వారా కేంద్రీయ విద్యాలయాలకు పుస్తకాలు అందజేసే NCERT పాఠ్యాంశాలలో 100కు పైగా వివాదాస్పదమైన మార్పులను బాత్రా ప్రవేశపెట్టారు.

2008లో రామానుజన్ రాసిన ‘మూడు వందల రామాయణాలు‘ వ్యాసాన్ని డిల్లీ యూనివర్సిటీ హిస్టరీ సిలబస్ నుండి తొలగించడానికి హైకోర్టును ఆశ్రయించిన వారిలో బాత్రా ప్రముఖుడు. కోర్టు నియోగించిన కమిటీ రామానుజన్ వ్యాసం సిలబస్‌లో ఉండాల్సిందేనని తీర్పు చెప్పింది. ఆ రోజుల్లో డిల్లీ యూనివర్సిటీలో హింసాకాండ, అల్లర్లు చెలరేగడమే కాకుండా, అక్కడి ప్రొఫెసర్లకు బెదిరింపు ఉత్తరాలు, ఫోన్‌కాల్స్ వచ్చేవి (ప్రొఫెసర్ ఉపేందర్ సింగ్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం.) యూనివర్సిటీ వారు 2011లో ఆ వ్యాసాన్ని తొలగించడానికే నిర్ణయించుకున్నారు.

అంతేకాక, ది హిందూ పబ్లిషర్ అయిన ఎన్. రామ్ ఫ్రంట్‌లైన్ పత్రికలో ‘శాఫ్రాన్ టెర్రర్‘ అన్న శీర్షికతో వ్యాసాన్ని ప్రచురించినందుకు బాత్రా ఆయనకు లీగల్ నోటిసులను పంపించారు. కేంద్రీయ పుస్తకాలలో 75 పంక్తులు అభ్యంతరకరమైనవిగా ఉన్నాయని NCERTకి వ్యతిరేకంగా 10 వేర్వేరు కోర్టు కేసులు కూడా వేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న వెండీ డానిగర్ పుస్తకాన్ని నిషేధించాలని గత నాలుగేళ్లుగా కోర్టులో పోరాటం చేసిన బాత్రా, పెంగ్విన్ నిర్ణయం సంతృప్తి నిచ్చిందని ఇకపై డానిగర్ రాసిన On Hinduism వంటి ఇతర పుస్తకాలపై దృష్టి సారిస్తానని చెబుతున్నారు. 84యేళ్ళ వయస్సులో కూడా అలుపెరుగక పనిచేసే ఈయన, రాజకీయాల్లో రాబోయే మార్పుల దృష్ట్యా భారతదేశానికి, భారతీయతకు మంచి రోజులు రాబోతున్నాయని ఉత్సాహంగా చెబుతున్నారు.
ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ
“I disapprove of what you say, but I will defend to the death your right to say it.”

– (attributed to Voltaire.)

ఎన్నో ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగాలలో వాక్-స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కుగా పేర్కొనబడింది. అయితే, ఈ వాక్-స్వాతంత్ర్యానికి ఎంతవరకూ హద్దులు ఉండాలి అన్న విషయంలో వివిధ దేశాల్లో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. వాక్-స్వాతంత్ర్యానికి ఏ రకమైన హద్దులు ఉండకూడదా? వాక్-స్వాతంత్ర్యం ప్రజల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పుడు, విద్వేషాలను, హింసను ప్రేరేపించినప్పుడు, ఆ స్వాతంత్ర్యాన్ని అరికట్టాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు వాక్-స్వాతంత్ర్యానికి సంబంధించిన చరిత్రను పరిశీలిద్దాం.

ప్రపంచంలో మొట్టమొదటి ప్రజాస్వామ్యంగా పేరొందిన గ్రీక్ నగరం ఏథెన్స్‌లో క్రీ.పూ. 470లో జన్మించిన సోక్రటీస్ (Socrates) సత్యము, నీతి వంటి అంశాలు సాపేక్షమని, సంక్లిష్టమైనవని, ఒకరికి నీతిగా కనిపించేది మరొకరికి అవినీతి అవుతుందని లోతైన తాత్విక చర్చలు చేసేవాడు. తత్త్వశాస్త్రం పేరిట యువతను అవినీతికి పురికొల్పుతున్నాడన్న నేరారోపణతో ఆయనకు మరణశిక్ష విధించింది ఆ మొట్టమొదటి ప్రజాస్వామిక నగరం. ప్రజలు విధించిన శిక్షను సంతోషంగా స్వీకరించి విషపానీయాన్ని తాగి మరణించాడు సోక్రటీస్.

తన బోధనలతో యువతను పెడదారి పట్టిస్తున్నాడనే నేరం మోపి ఏసుక్రీస్తును శిలువపైకి ఎక్కించి చంపించింది రోమను ప్రభుత్వం.

గలీలియో (Galilio Galieli) 1610లో తను చేసిన ఖగోళ పరిశోధనల సారాంశాన్ని Sidereus Nuncius అన్న పుస్తకంగా ప్రచురించాడు. ఇందులో, చంద్రునిపై కొండల గురించి, శుక్రగ్రహం యొక్క కక్ష్య గురించి, గురుగ్రహానికి ఉన్న ఉపగ్రహాల గురించి, సూర్యునిపై కనిపించే మచ్చల గురించే కాక, గ్రహాలు భూమి చుట్టూ కాక సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయన్న ప్రతిపాదన కూడా ఉంది. భూమి చుట్టూ అన్నీ గ్రహాలు తిరుగుతున్నాయని నమ్మే క్రిస్టియన్ మతస్థులకు ఇది చెంపపెట్టుగా తోచింది. బైబిల్ లోని సూత్రాలను ధిక్కరించే ఈ ప్రతిపాదనలు క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని, అందుకే ఆ పుస్తకాన్ని నిషేధించాలని రోమన్ చర్చ్ 1615లో నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ప్రతిగా గలీలియో తన సిద్ధాంతాలను సమర్థించుకుంటూ Dialogue Concerning the Two Chief World Systems అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకం పోపును సూటిగా విమర్శిస్తున్నట్టుగా, క్రిస్టియన్ మతానికి తిరుగుబాటుగా భావించి రోమన్ చర్చ్ గలీలియోకు జీవిత ఖైదును శిక్షగా విధించింది.

మిగిలిన మతాలతో పోలిస్తే, ఈ రకమైన మతమౌఢ్యం భారతదేశంలో ఇంతకు మునుపు లేదు. సిద్ధాంత చర్చలు, వాదవివాదాలతో భారతీయ తాత్వికత చరిత్ర అంతా నిండి ఉంది. నాసదీయ సూక్తంలో దేవుడి జ్ఞానాన్నే ప్రశ్నించే తాత్విక చింతన భారతీయ దర్శనాల్లో మొదటినుంచి కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో ఎన్నో సంవాద వివాదాలు కనిపిస్తాయి. వేదాలను నిరసించే వ్యాఖ్యలు ఉపనిషత్తులోను, ఇతిహాస, పురాణాలలోను కనిపిస్తాయి. వైదికమతానికి ఆవల ఉన్న బుద్ధ, జైన, అజీవక, చార్వాక మతాలు కూడా సంఘాలను, ఆరామాలను ఏర్పరచి సిద్ధాంత చర్చలు బాహాటంగా చేసేవారని మనకు తెలుసు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు మొదలైనవారు కూడా ఎన్నో రోజులు వాదవివాదాల్లో పాల్గొని తమ సిద్ధాంతాలని నిరూపించుకునేవారు. మామూలు ప్రజానీకం కూడా ఇతర మతాల పట్ల సహనంతో మెలిగేవారనే అనుకోవాలి. వెండీ డానిగర్ మాటల్లో చెప్పాలంటే:

“This open-mindedness was supported by the tendency of Hindus to be more orthoprax than orthodox. That is, most Hindus have not cared about straight opinions (ortho-doxy) nearly so much as they care about straight behavior (ortho-praxy). Although there is a very wide variety of codes of action, each community has a pretty clear sense of what should and shouldn’t be done, and some things were Simply Not Done.[…] but no one was impaled (the Hindu equivalent of burning at the stake) for saying that god was like this rather than like that. Each sect acknowledged the existence of gods other than their god(s), suitable for others to worship, though they might not care to worship them themselves.” [“The Hindus”, Doniger 2009, p. 46]

ఇక, వాక్-స్వాతంత్ర్య విషయానికి వస్తే, ఆధునిక ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలలో ఒకరుగా భావించే జాన్ స్టూవర్ట్ మిల్ (John Stuart Mill) అన్న తత్త్వవేత్త ఇతరులను దెబ్బతీసే ‘క్రియ’ (action) శిక్షార్హమైనదే అయినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే ‘అభిప్రాయం’ (opinion) శిక్షార్హం కాకూడదని అంటాడు. అయితే, ఆయన దృష్టిలో ఇటువంటి అభిప్రాయ వ్యక్తీకరణ కూడా కొన్ని అరుదైన సమయాల్లో శిక్షార్హం కావచ్చు. ఒక అభిప్రాయం ప్రత్యక్ష్య హింసను ప్రేరేపించేదయితే మాత్రమే దాన్ని చట్టరీత్యా నేరంగా నిర్ణయించడం సబబని ఆయన అభిప్రాయం.

“No one pretends that actions should be as free as opinions. On the contrary, even opinions lose their immunity, when the circumstances in which they are expressed are such as to constitute their expression a positive instigation to some mischievous act. An opinion that corn-dealers are starvers of the poor, or that private property is robbery, ought to be unmolested when simply circulated through the press, but may justly incur punishment when delivered orally to an excited mob assembled before the house of a corn-dealer, or when handed about among the same mob in the form of a placard. Acts, of whatever kind, which, without justifiable cause, do harm to others, may be, and in the more important cases absolutely require to be, controlled by the unfavorable sentiments, and, when needful, by the active interference of mankind. The liberty of the individual must be thus far limited; he must not make himself a nuisance to other people.[On Liberty, Mill, p. 101]”

అమెరికా రాజ్యాంగానికి తొట్టతొలి సవరణగా డిసంబర్ 15, 1791 నాడు ప్రకటించిన భావ ప్రకటనా స్వేచ్ఛ (Freedom of speech) అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. First Amendment Right అంటూ అమెరికన్లు గర్వంగా చెప్పుకొనే ఈ రాజ్యాంగ సవరణ, అమెరికా దేశంలో ఎదుటివారికి ప్రత్యక్షంగా హాని కలిగించనంతవరకూ ఏ రకమైన అభిప్రాయాన్నైనా ప్రకటించే హక్కును కల్పిస్తుంది.

ఈ మొదటి రాజ్యాంగ సవరణ హక్కు వల్ల అమెరికాలో పుస్తక నిషేధాలు చాలా అరుదుగా జరిగాయి. అమెరికాలో బానిసల బ్రతుకులను బాహాటంగా వర్ణించిన హారియట్ బీచర్ స్టోవ్ (Harriet Beecher Stowe) రాసిన Uncle Tom’s Cabin పుస్తకంపై చాలామంది కన్నెర్రజేశారు. స్టోవ్ రాసిన విషయాల్లో అసత్యాలు, అభూత కల్పనలు ఉన్నాయని, దక్షిణ అమెరికా ఎప్పుడు దర్శించని స్టోవ్ ఇక్కడి బానిసల గురించి రాయడం హాస్యాస్పదమని విమర్శలు గుప్పించారు. ఈ పుస్తకం అమ్మే దుకాణాలపై దాడులు, బెదిరింపులు కూడా జరిగాయి. అయినా, ఆ పుస్తకం నిషేధానికి గురికాలేదు.

అలాగే, The Scarlet Letter – Nathaniel Hawthorne, 1850; Leaves of Grass – Walt Whitman, 1855; The Adventures of Huckleberry Finn – Mark Twain, 1884; The Call of the Wild – Jack London, 1903; The Great Gatsby – F. Scott Fitzgerald, 1925; Gone With the Wind – Margaret Mitchell, 1936; For Whom the Bell Tolls – Ernest Hemingway, 1940; The Catcher in the Rye – J.D. Salinger, 1951; Fahrenheit 451 – Ray Bradbury, 1953; Catch-22 – Joseph Heller, 1961; The Autobiography of Malcolm X – Malcolm X and Alex Haley, 1965; Beloved – Toni Morrison, 1987, మొదలైన పుస్తకాలు ఎంతో వివాదాస్పదమయ్యాయి కానీ, ప్రభుత్వం ద్వారా నిషేధానికి నోచుకోలేదు.

అలాగే, క్రిస్టియన్ మతాన్ని విమర్శిస్తూ, అందులోని ప్రత్యామ్నాయ కథనాలను వివరిస్తూ వందలకొద్ది పుస్తకాలు, వేలకొలది పరిశోధక వ్యాసాలు వచ్చాయి. ఈ పుస్తకాలపై మతానుయాయులు ఎంతగా విరుచుకుపడ్డా ఆ పుస్తకాలు మాత్రం అమెరికా దేశంలో నిషేధానికి గురి కాలేదు.

చివరకు అమెరికన్ జాతీయ పతాకాన్ని కాల్చివేయడం కూడా ‘భావప్రకటన స్వేచ్ఛ’లో భాగమేనని 1969లోనూ, 1989లోనూ అమెరికన్ న్యాయస్థానాలు తీర్పు ఇచ్చి, అమెరికా జాతీయ జెండాను కాల్చినందుకు అరెస్టు అయిన వారిని నిర్దోషులుగా విడుదల చేశాయి.

భారతీయ శిక్షాస్మృతిలోని 295ఎ సెక్షన్ చరిత్ర
విచిత్రమేమిటంటే, భారతదేశం గురించి ఇప్పుడు పాశ్చాత్యుల కథనాలను నిషేధించడానికి భారతీయ శిక్షాస్మృతిలో తరచుగా ఉపయోగించే 295ఏ సెక్షనును మొదటగా ప్రవేశపెట్టింది బ్రిటిష్‌వారు. 1927లో పంజాబులో రాజపాల్ అనే వ్యక్తి ‘రంగీలా రసూల్‘ అంటూ మహమ్మద్ ప్రవక్త శృంగార కలాపాలను వర్ణించే చిన్న పుస్తకాన్ని రచయిత పేరులేకుండా ప్రచురించాడు. అప్పటికే పంజాబులో హిందూ-ముస్లిములమధ్య గొడవలతో శాంతిభద్రతలు కొరవడిన సమయంలో ఈ పుస్తకం మరింత అలజడిని రేపింది. 153ఎ సెక్షన్ ప్రకారం ప్రచురణకర్త రాజపాల్ పై చర్య తీసుకోవాలని కొంతమంది ముస్లిములు కోర్టుకు వెళ్లారు. జస్టిస్ దిలీప్ సింగ్ సెక్షన్ 153ఎ ప్రకారం ఇప్పటికే మరణించిన వ్యక్తి గురించి రాయడం నేరం కాదని, రాజపాల్ నిర్దోషి అని నిర్ణయించాడు. అయితే, అదే తీర్పులో మతపరమైన ఉద్రేకాలను రెచ్చగొట్టే అభిప్రాయాలు, పుస్తకాలు, కరపత్రాలు శిక్షార్హం చేయడానికి సెక్షన్ 295కు సరికొత్త క్లాజును జతచెయ్యాలని సూచన కూడా చేశారు. ఈ నిర్ణయం వెలువడిన తరువాత లాహోర్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ పుస్తకాన్ని ప్రచురించిన రాజపాల్ 1929లో హత్య చేయబడ్డాడు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈ విషయాన్ని పునఃసమీక్షించాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జస్టిస్ దిలీప్ సింగ్ చేసిన సూచన ప్రకారమే సెక్షన్ 295కు సరికొత్త క్లాజును జతచేయమని సిఫారసు చేసింది.

అయితే, ఈ కమిటీ సభ్యులలో ఒకరైన జిన్నా (M. Ali Jinnah), సెక్షన్ 295ఎ చట్టం మతపరమైన దాడులను ప్రత్యక్షంగా రెచ్చగొట్టే అభిప్రాయాలకే తప్ప ఈ చట్టం చారిత్రక దృక్పథాలను పరిశీలించేవారి పట్ల, మతాన్ని పరిశోధించే వారి పట్ల వర్తింపజేయ కూడదని అభిప్రాయపడ్డాడు. జిన్నా చెప్పిన వాక్యాలు:

[…] 295(A) should apply only to genuine cases of deliberate and malicious intent and “the fundamental principle that those who are engaged in historical works, those who are engaged in the ascertainment of truth and those who are engaged in bonafide and honest criticisms of a religion shall be protected.”

అయితే, బ్రిటిస్‌వారి పాలనలోనూ, ఆ తరువాతి కాలంలోనూ పై సూచనను పెడచెవిన పెట్టి 295ఎ సెక్షన్ ఆధారంగా ఎన్నో పుస్తకాలను నిషేధించారు. 1932లో రశీద్ జహాన్ (Rashid Jahan) రచించిన అంగారే అన్న పుస్తకంలో కథలు ఇస్లాం మతగురువులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆ పుస్తకాన్ని నిషేధించారు. 1934లో వైలీ (Max Wylie) రాసిన Hindu Heaven; 1937లో ఆర్థర్ మైల్స్ (Arthur Miles) రాసిన The Land of the Lingam, అన్న పుస్తకాలు హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని నిషేధానికి గురి అయ్యాయి.

స్వతంత్ర భారతంలో కూడా ఇదే విధమైన నిషేధాలు కొనసాగాయి. 1954లో ఆబ్రే మీనన్ (Aubrey Menen) రామాయణ కథను వ్యంగ్యంగా చిత్రిస్తూ రాసిన Rama Retold అన్న పుస్తకం నిషేధానికి గురైనది. 1983లో సేమోర్ హర్ష్ (seymour Hersh) రాసిన The Price of Power అన్న పుస్తకంలో మొరార్జీ దేశాయి సి.ఐ.ఏ. ఏజెంటుగా పనిచేశాడన్న కథనం రాసి ఉన్న కారణంగా ఈ పుస్తకం అమ్మకాలను పరువు నష్టం దావా కింద బాంబే హైకోర్టు నిలిపివేసింది.

1988లో సల్మాన్ రూష్దీ రాసిన The Satanic Versesని ఇదే సెక్షన్ ఉపయోగించి భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ పుస్తకాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం భారతదేశమే. 1995లో రూష్దీదే మరో రచన, The Moors Last Sighలో బాల్ థాకరేతో సహా పలు రాజకీయ నాయకులను వ్యంగ్యంగా చిత్రీకరించినందుకుగానూ భారత ప్రభుత్వం ఆ నవలను కూడా నిషేధించింది.

అయితే, గత 20 సంవత్సరాల్లో ఈ సెక్షనును ఉపయోగించి ఎన్నో పరిశోధనాత్మకమైన పుస్తకాలను హిందుత్వవాదులు విజయవంతంగా నిషేధింపజేయగలిగారు. శివాజీపై చారిత్రాత్మకంగా పరిశోధిస్తూ జేమ్స్ లేన్ (James Laine) రాసిన Shivaji: Hindu King in Islamic India (2003) అన్న పుస్తకంలో శివాజీ జననం గురించి రాసిన కథనంపై పెద్ద దుమారం చెలరేగింది. శివసేనకు చెందిన కొంతమంది అల్లరిమూకలు పూణేలో ఆయన పని చేసిన భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ (BORI) సంస్థపై దాడి చేశారు. ఈ దాడిలో కొన్ని విలువైన తాళపత్ర గ్రంథాలు కూడా నాశనమయ్యాయి. శంభాజీ బ్రిగేడ్ అనే మరో సంస్థకు చెందిన కొందరు ఆయనకు సహాయం చేసిన సంస్కృత పండితులపై దాడి చేశారు. ఈ పుస్తకాన్ని 2004లో మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. 2010లో భారత సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని తొలగించింది.

2003లో ద్విజేంద్ర ఝా (Dwijendra NarayaN Jha) రాసిన The Myth of the Holy Cow పెద్ద సంచలనాన్ని రేపింది. వైదిక బ్రాహ్మణులు ఆవుమాంసం తినేవారని ఆధారాలతో నిరూపించిన ఈ పుస్తకాన్ని హైదరాబాద్ సివిల్ కోర్టు నిషేధించింది. 2006లో ప్రముఖ భారతీయ క్రికెటర్ రవిశాస్త్రి oka ATapai ప్రత్యక్ష్య వ్యాఖ్యానం చేస్తూ తను బ్రాహ్మణుడే అయినా, తనకు బిల్‌తాంగ్ అన్న వంటకం చాలా ఇష్టమని చెప్పుకున్నాడు. బిల్‌తాంగ్ ఆవు మాంసంతో చేస్తారు కాబట్టి ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని ఇదే సెక్షన్ కింద ఆయనపై కోర్టులో కేసు వేశారు.

మరో హాస్యాస్పదమైన సంఘటన 2012లో జరిగింది. బాల్ థాకరే (Bal Thackeray) మరణించిన సందర్భంగా ముంబైలో బంద్ నిర్వహిస్తే షాహీన్ దాడా అనే 21-సంవత్సరాల అమ్మాయి “People like Thackeray are born and die daily and one should not observe a ‘bandh’ for that.” అని తన ఫేస్‌బుక్ పేజీ పై రాసుకుంది. దాన్ని రీనూ శ్రీనివాసన్ అనే మిత్రురాలు ‘లైక్’ చేసింది. వారి వ్యాఖ్యలు థాకరే అభిమానుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పాలఘర్ పోలీసులు ఆ ఇద్దరినీ 295ఎ సెక్షన్ కిందే అరెస్ట్ చేశారు. ఇది జరిగిన రెండు రోజులకు షాహీన్ వాళ్ళ మామయ్య ఆస్పత్రిపై శివసేనకు చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఆ తరువాత వారి అరెస్టు చెల్లదని కోర్టు నిర్ధారించి వారిపై కేసు ఎత్తివేసింది.

బాత్రా అభియోగాలు, నిజానిజాలు
వెండీ డానిగర్ పుస్తకం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని బాత్రా కోర్టులో వేసిన దావాలో మొత్తంగా 47 అభియోగాలు ఉన్నాయి. హిందూమత మూల గ్రంథాలను చదివిన వారికి, డానిగర్ పుస్తకం క్షుణ్ణంగా పరిశీలించిన వారికి ఈ అభియోగాలు చాలా వరకూ నవ్వు తెప్పిస్తాయి. ఈ అభియోగాలన్నింటికి వరుసబెట్టి జవాబు ఇవ్వడం నా ఉద్దేశ్యం కాదు కానీ, అందులో ప్రధానమైనవి కొన్నింటిని పరిశీలిస్తాను. బాత్రా పంపిన లీగల్ నోటిస్ పూర్తి పాఠం outlook పత్రిక సైటులో చూడవచ్చు.

[బాత్రా] 5. That after reading the said book my client is of the opinion my client states that the aforesaid book is written with a Christian Missionary Zeal and hidden agenda to denigrate Hindus and show their religion in poor light.

వెండీ డానిగర్ క్రిస్టియన్ మతస్థురాలు కాదు, యూదుమతానికి చెందింది అన్న నిజం తెలియజేయడం ఇక్కడ అప్రస్తుతం కాదనుకుంటాను. అయితే, తనకు తెలియకుండానే తన రాతల్లో ‘పాశ్చాత్య పక్షపాతం’ చొరబడే ప్రమాదం ఉందని ఒప్పుకొనే నిజాయితీ ఆమెకు ఉన్నది. (she often describes herself as a ‘recovering Orientalist’).

[బాత్రా] 6. That the entire list of the books authored by YOU NOTICEE shows that YOU NOTICEE concentrate, focus and write on the negative aspects and evil practices prevalent in Hinduism. That the words used by YOU NOTICEE for referring to various Hindu Gods are highly objectionable.

ప్రాథమిక హిందూమతాన్ని వివరిస్తూ ఇంగ్లీషులో ఇప్పటికే ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఈ పుస్తకం ఉద్దేశ్యం హిందూమతంలో ప్రత్యామ్నాయ కథనాలను వెలికి తీసుకురావడమేనని ఆవిడ ముందుమాటలోనే చెప్పుకున్నారు. ‘హిందూయిజం: ఒక ప్రత్యామ్నాయ చరిత్ర’ అని అని పుస్తకం శీర్షికలోనే ఉంది కదా. అయితే, ఈ పుస్తకంలో వివరించిన కథనాలు విభిన్న సంప్రదాయాలను తనలో కలుపుకొని, భిన్న అభిప్రాయాలను ఆదరించిన హిందూమతం యొక్క విశాల దృక్పథాన్ని, ఉత్కృష్టతను ఉగ్గడించేవిగానే ఉన్నాయి కానీ, హిందూమతాన్ని కించపరిచే విధంగా లేవు. ఆవిడ ముందుమాటలో రాసిన వాక్యాలు చూడండి:

“Since there are so many books about Hinduism, the author of yet another one has a duty to answer the potential reader’s Passover question: Why shouldn’t I pass over this book, or, Why is this book different from all other books? This book is not a brief survey (you noticed that already; I had intended it to be, but it got the bit between its teeth and ran away from me), nor, on the other hand, is it a reference book that covers all the facts and dates about Hinduism or a book about Hinduism as it is lived today. Several books of each of those sorts exist, some of them quite good, which you might read alongside this one. The Hindus: An Alternative History differs from those books in several ways.

First, it highlights a narrative alternative to the one constituted by the most famous texts in Sanskrit (the literary language of ancient India) and represented in most surveys in English. It tells a story that incorporates the narratives of and about alternative people—people who, from the standpoint of most high-caste Hindu males, are alternative in the sense of otherness, people of other religions, or cultures, or castes, or species (animals), or gender (women). Part of my agenda in writing an alternative history is to show how much the groups that conventional wisdom says were oppressed and silenced and played no part in the development of the tradition—women, Pariahs (oppressed castes, sometimes called Untouchables)—did actually contribute to Hinduism. My hope is not to reverse or misrepresent the hierarchies, which remain stubbornly hierarchical, or to deny that Sanskrit texts were almost always subject to a final filter in the hands of the male Brahmins (the highest of the four social classes, the class from which priests were drawn) who usually composed and preserved them. But I hope to bring in more actors, and more stories, upon the stage, to show the presence of brilliant and creative thinkers entirely off the track beaten by Brahmin Sanskritists and of diverse voices that slipped through the filter, and, indeed, to show that the filter itself was quite diverse, for there were many different sorts of Brahmins; some whispered into the ears of kings, but others were dirt poor and begged for their food every day.”

నిజానికి, ముందుమాటలో చెప్పుకున్నట్టుగా ప్రత్యామ్నాయ కథనాలు – ఇతిహాసపు చీకటికోణం కింద అట్టడుగున పడి కనిపించకుండా పోయిన కథలు – అంత ఎక్కువగా ఈ పుస్తకంలో కనిపించలేదనే ఈ పుస్తకంపై నాకున్న ఫిర్యాదు.

[బాత్రా] 7. That on the book jacket of the book Lord Krishna is shown sitting on buttocks of a naked woman surrounded by other naked women. That YOU NOTICEE have depicted Lord Krishna in such a vulgar, base perverse manner to outrage religious feelings of Hindus. That YOU NOTICEE and the publisher have done this with the full knowledge that Sri Krishna is revered as a divinity and there are many temples for Sri Krishna where Hindus worship the divinity. The intent is clearly to ridicule, humiliate & defame the Hindus and denigrate the Hindu traditions.

భాగవతంలోని కృష్ణుడు గోపికలతో సాగించిన రాసక్రీడలను దశమస్కంధంలో విపులంగా వర్ణించిన విషయం సంస్కృత భాగవతం కానీ, తెలుగు భాగవతం గాని మూల కృతులను చదువుకున్న వారికి తెలుసు. నిజంగా వారు నగ్నంగా శ్రీకృష్ణునితో ఉన్నారా అని సంశయపడే వారికి పోతన ఇలా సమాధానం చెబుతాడు:

హరి తను సంగసుఖంబున
బరవశలై వ్రేత లెల్లఁ బయ్యదలు నిజాం
బరములు నెఱుఁగమి చోద్యమె? – (ఆంధ్ర భాగ. -10.1-1098)

అలాగే సంస్కృత భాగవతంలో రాసక్రీడల శ్లోకాలు చదివిన వారికి ఆ పుస్తకం మీది ముఖచిత్రం అంతా చోద్యంగా అనిపించదు. మచ్చుకు ఈ శ్లోకం అర్థం తెలుసుకోండి:

నద్యాః పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకమ్
జుష్టం తత్తరలానన్ది కుముదామోదవాయునా
బాహుప్రసారపరిరమ్భకరాలకోరు
నీవీస్తనాలభననర్మనఖాగ్రపాతైః
క్ష్వేల్యావలోకహసితైర్వ్రజసున్దరీణాం
ఉత్తమ్భయన్రతిపతిం రమయాం చకార (10.29.45-46)

అయితే, పుస్తకం లోపల లోతైన చర్చలు చేస్తూ, పుస్తకం బయట ఆ చర్చలకు అంతగా పొంతనలేని గోపికల రాసలీల దృశ్యం ముఖచిత్రంగా ఉంచడంలో నిజంగానే ఔచిత్యం లేదు. అయితే, హిందూ మతాన్ని అవమానపరచే ఉద్దేశ్యం కన్నా, ఈ పుస్తకాన్ని మార్కెటింగ్ చేయడం కోసం ఆకర్షణీయంగా ఉంటుందని ఈ ముఖచిత్రాన్ని ఎంచుకున్నారని నిర్ధారించడం అంత కష్టమైన పనేం కాదు.

[బాత్రా] 9. That YOU NOTICEE has yourself stated at page 15 that your focus in approaching Hindu scriptures has been sexual.

“The Sanskrit texts [cited in my lecture] were written at a time of glorious sexual openness and insight, and I have focused precisely those parts of the texts.”

So the approach of YOU NOTICEE has been jaundiced, your approach is that of a woman hungry of sex.

ఈ అభియోగం పూర్తిగా నిరాధారమైనది. వెండీ డానిగర్ ఇక్కడ ఈ పుస్తకం గురించి చెప్పడం లేదు. 2003లో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతూ అప్పుడు తను పత్రికకు చెప్పిన విషయాల ఉటంకింపు ఇది.

ఒకసారి వెండీ డానిగర్ లండన్‌లో ఇచ్చిన తన ప్రసంగంలో, ‘లక్ష్మణుడు తనను కోరుకుంటున్నాడని’ సీత నింద వేసిన సంగతి వాల్మీకి రామాయణంలో ఉందని ప్రస్తావించినందుకు ఒక హిందువు ఆమెపై కోడిగుడ్డు విసిరాడట. ఆ సంఘటనకు సమాధానంగా మరుసటి రోజు ఆమె పత్రికకు చెప్పిన వాక్యాలను ఇక్కడ ఉటంకించారు. పూర్తి కొటేషన్ ఇది:

“The Sanskrit texts [cited in my lecture] were written at a time of glorious sexual openness and insight, and I have often focused on precisely those parts of the texts. . . .The irony is that I have praised these texts and translated them in such a way that many people outside the Hindu tradition—people who would otherwise go on thinking that Hinduism is nothing but a caste system that mistreats Untouchables—have come to learn about it and to admire the beauty, complexity and wisdom of the Hindu texts.”

[బాత్రా] 25. That YOU NOTICEE at page 14 has cited a passage from Valmiki’s Ramayan in which Sita accuses Laxman of wanting her for himself but has not mentioned that very passage from Valmiki Ramayana in your book.

ఇక్కడ బాత్రా ఉద్దేశం ఏమిటో అర్థం కాదు. నాకైతే, వాల్మీకి రామాయణంలో సీత లక్ష్మణుడిని అలా అనలేదని, ఇదంతా వెండీ డానిగర్ కల్పనేనన్న ఆరోపణ ధ్వనిస్తుంది. అయితే, సీత రామునికి ప్రాణహాని కలిగిందన్నా కోపంలో లక్ష్మణున్ని ఎంతగా దుర్భాషలాడిందో వాల్మీకి రామాయణం చదివిన వారికి విదితమే. మాయలేడిని పట్టితేవడానికి రాముడు వెళ్ళిన “సీతా, లక్ష్మణా” అన్న అరుపు విని సీత ఆందోళన చెంది లక్ష్మణున్ని రాముని కోసం వెళ్ళమంటుంది. లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలేసి వెళ్లలేనంటాడు. అప్పుడు లక్ష్మణున్ని అనుమానిస్తూ అన్న మాటలు అరణ్యకాండలో 45వ సర్వలోని ఈ శ్లోకాలలో కనిపిస్తాయి:

ఇచ్ఛసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణ మత్ కృతే|| 3-45-6
లోభాత్ తు మత్ కృతం నూనం న అనుగచ్ఛసి రాఘవం|

లక్ష్మణా, నీవు నా గురించే రాముని వినాశనం కోరుతున్నట్టు కనిపిస్తుంది. కచ్చితంగా (నూనం), నామీద మోహపడే నీవు రాముని జాడ వెతకడానికి వెళ్ళటం లేదు.

అలా లక్ష్మణున్ని కించపరిచి మాట్లాడుతుంటే, దానికి ప్రతిగా లక్ష్మణుడు సంయమనం కోల్పోకుండా తాను తన అన్న విధించిన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నట్టు సమాధానమిస్తాడు.

న్యాస భూతా అసి వైదేహి న్యస్తా మయి మహాత్మనా || 3-45-17
రామేణ త్వం వరారోహే న త్వాం త్యక్తుం ఇహ ఉత్సహే |

లక్ష్మణుడు: ఓ వైదేహి, నీకు రక్షకుడిగా ఆ మహాత్ముడు నన్ను నియోగించాడు. అందువల్ల నిన్ను వదలివెళ్లడం నా ధర్మం కాదు (నా వల్ల కాదు).

లక్ష్మణేన ఏవం ఉక్తా తు క్రుద్ధా సంరక్త లోచనా || 3-45-20
అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్య వాదినం |

ఆ మాటలు విన్న సీత ఎర్రబడ్డ కళ్ళతో కృద్ధురాలై, సత్యవాది అయిన లక్ష్మణుడిని పరుషంగా నిందిస్తూ ఇలా అంది:

అనార్య కరుణారంభ నృశంస కుల పాంసన || 3-45-21
అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్ |

ఓరి అనార్యుడా, కరుణా హీనుడా, కులానికి/వంశానికి చెడబుట్టిన వాడా, రాముడు గొప్ప సంకటంలో ఉండటం నీకు ప్రియంగా తోస్తోందని నాకనిపిస్తుంది.

రామస్య వ్యసన్మ్ దృష్ట్వా తేన ఏతాని ప్రభాషసే || 3-45-22
న ఏవ చిత్రం సపత్నేషు పాపం లక్ష్మణ యత్ భవేత్ |
త్వత్ విధేషు నృశంసేషు నిత్యం ప్రచ్ఛన్న చారిషు || 3-45-23

ఓరీ లక్ష్మణా, రాముని సంకట స్థితి చూసే నీవు ఈ ధర్మపన్నాలు పలుకుతున్నావు. దుష్ట ఆలోచనలతో రహస్యంగా మెలిగే నీలాంటి నికృష్ట శత్రువులు ఇలాంటి పాపపు పనులు చేయడంలో ఆశ్చర్యమేమున్నది?

సుదుష్టః త్వం వనే రామం ఏకం ఏకో అనుగచ్ఛసి |
మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేన వా || 3-45-24

ఎంత దుష్టుడివి నీవు, నాకోసమే రహస్యంగా నీవొక్కడివే రాముడిని అనుసరించి వచ్చావు. లేదా భరతుడు నిన్ను పురికొల్పి ఉంటాడు ఈ పని చెయ్యడానికి.

తత్ న సిద్ధ్యతి సౌమిత్రే తవ అపి భరతస్య వా |
కథం ఇందీవర శ్యామం రామం పద్మ నిభేక్షణం || 3-45-25
ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథక్ జనం |

ఇది నీ ఆలోచనే అయినా, భరతునిదైనా జరిగే పని కాదు. ఇందీవర శ్యాముడు, పద్మ నిభేక్షణుడు అయిన రాముణ్ణి తప్ప వేరెవ్వరిని భర్తగా కామించలేను/కోరుకోలేను.

ఇది కచ్చితంగా వాల్మీకి రామాయణంలోనిదే. యుద్ధకాండలో సీత లక్ష్మణుడిని అనరాని మాటలు అన్నాను కాబట్టే నాకిలా జరిగింది అని వాపోతుంది. ఇదే కథ తెలుగులోని రంగనాథ రామాయణంలోనూ, థాయిలాండ్ వారి రామకియెన్ లోనూ కనిపిస్తుంది. మరి ఈ కథనం భారతదేశంలో ఆధునిక రామాయణ కథల్లో వినిపించదెందుకు, అన్న ప్రశ్నకు సమాధానంగా డానిగర్ ఇలా అంటుంది:

“To the accusation that I cited a part of the Hindu textual tradition that one Hindu “had never heard of,” my reply is: Yes, and it’s my intention to go on doing just that. The parts of his own tradition that he objected to are embraced by many other Hindus and are, in any case, historically part of the record. One reason why this book is so long is that I wanted to show how very much there is of all that the egg faction would deny. And so I intend to go on celebrating the diversity and pluralism, not to mention the worldly wisdom and sensuality, of the Hindus that I have loved for about fifty years now and still counting.”

నిజానికి, కాస్త తెలివైన జడ్జి ఎవరైనా ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివి ఆపై ఈ కేసు పరిశీలించి ఉంటే ఇటువంటి నిరాధారమైన అభియోగాలు ఉన్నందుకు ఈ కేసు ఎందుకు పనికి రానిదని వెంటనే కొట్టివేసి ఉండేవాడు. కానీ అలా జరగలేదు.

[బాత్రా] 10. That YOU NOTICEE should be aware that in Hinduism linga is an abstract symbol of God [Shiva] with no sexual connotations but YOU NOTICEE emphasizes only those texts which portray linga as erect male sexual organ [page 22]. This shows your shallow knowledge of the Great Hindu religion and also your perverse mindset.

శివుని పూర్వ చరిత్ర గురించి నిజంగా మనకు చాలా విషయాలు తెలియవు. సింధులోయ నాగరికతకు సంబంధించి మొహంజొదారోలో లభించిన ముద్రికలలో జంతువుల మధ్య పద్మాసనంలో ఉన్న మూర్తి (పశుపతి?) శివుని తొలి రూపాల్లో ఒకటో కాదో మనకు తెలియదు. ఋగ్వేదంలో ప్రస్తావించిన ‘శిశ్నదేవుడు’ శివుడో కాదో మనకు తెలియదు. తొలత అనార్య దేవునిగా వర్ణింపబడిన ‘రుద్రుడు’ హిందూ మతంలో ప్రముఖ దేవునిగా ఎప్పుడు, ఎలా మారాడో మనకు అంతగా అంతు పట్టదు. శివుడిని జ్యోతిర్లింగంగా కీర్తించే శ్లోకాలు మనకు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కనిపిస్తే, పురాణాల్లో మాత్రం శివలింగాన్ని చర్మలింగంగా వర్ణించే కథలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు, పద్మ పురాణంలో భృగు మహర్షి కైలాసం వెళ్లినప్పుడు శివపార్వతులు ఏకాంతంలో ఉండి ఆయనను ఉపేక్షిస్తారు. కోపంతో భృగు మహర్షి పెట్టిన శాపం వల్ల శివుని అంగం భూమి మీద పడుతుంది. ఆ లింగం నుండి వెలువడిన అగ్ని భూమిని కాల్చేస్తుండగా భయభ్రాంతులై ప్రజలు మొరపెట్టుకోవడంతో, ఆ తేజస్సును యోని రూపంలో పార్వతి మాత్రమే ధరించగలదని ఆ ఋషులు చెబితే, పార్వతి యోని రూపంలో ఆ లింగాన్ని ధరించి శాంతిపజేస్తుందట. శివపురాణంలోని కథలో మాత్రం శివుడు దారుకావనంలో దిగంబరంగా తిరుగుతున్న వేళ ఋషిపత్నులు శివుణ్ణి చూసి మోహించడంతో, కోపగించిన ఋషులు శివుణ్ణి శపిస్తారు కాబట్టి అతడి అంగం శివలింగంగా మారుతుంది. ఇదే కథ స్కంద పురాణంలోనూ, కూర్మ పురాణంలోనూ కనిపిస్తుంది.

వెండీ డానిగర్ తన పుస్తకంలో ఈ విషయం మీద అన్ని వైపుల కోణాలకు సమాన ప్రతిపత్తిని కలగజేస్తూ ఈ అంశాన్ని సున్నితంగానే ప్రస్తావించినట్టు నాకనిపిస్తుంది. మచ్చుకు ఈ పంక్తులు చూడండి:

“In addition to understanding the history of the texts, we need to understand the relationship between records of historical events and the construction of imaginary worlds as well as the symbolism that often joins them. To begin with the symbolism of physical objects, sometimes a linga is just a linga—or, more often, both a linga and a cigar. Numerous Sanskrit texts and ancient sculptures (such as the Gudimallam linga from the third century BCE) define this image unequivocally as an iconic representation of the male sexual organ in erection, in particular as the erect phallus of the god Shiva. […]

But other texts treat the linga as an aniconic pillar of light or an abstract symbol of god (the word means simply a “sign,” as smoke is the sign of fire), with no sexual reference. To some, the stone lingas “convey an ascetic purity despite their obvious sexual symbolism.” There is nothing surprising about this range; some Christians see in the cross a vivid reminder of the agony on Calvary, while others see it as a symbol of their God in the abstract or of Christianity as a religion. But some Hindus who see the linga as an abstract symbol therefore object to the interpretations of those who view it anthropomorphically.”

[బాత్రా] 13. That YOU NOTICEE do not inform your readers in your voluminous 779 page book the most basic principle that for all Hindus Vedas are the supreme scripture and supersede anything and everything which is in conflict with Vedas. In Mahabharata [1-V-4] it is stated:

“Whenever there is conflict between what is declared in the Vedas and provisions in any of the Smritis, Puranas etc. what is declared in the Vedas shall prevail.”

వేదసాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్నవారికి ఆ వేదాలలో వర్ణించిన మతానికి, తరువాతి కాలం అభివృద్ధి చెందిన హిందూ మతానికి తేడాలు స్పష్టంగా తెలుసు. ఋగ్వేదంలో కనిపించే దేవతలు మిత్ర, వరుణ, అర్యమ, భగ, అంశ, ఇంద్ర, అగ్ని, ఉషస్ వంటి ప్రధాన దేవతలు తరువాతి హిందూ మతంలో ప్రాధాన్యత కోల్పోయారు. వేదాలలో ప్రముఖమైన అగ్నిస్తోమ (సోమయాగం), అశ్వమేధ, పురుషమేధ, అగ్నిచయన, చాతుర్మాస్య యజ్ఞాలు తరువాతి కాలంలో కనిపించవు. ప్రస్తుతం హిందూ మతంలో ప్రధానమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి తత్వం, లక్ష్మి, పార్వతి, సరస్వతి వంటి స్త్రీ దేవతల ప్రస్తావన వేదాలలో కనిపించదు. హిందూ మతానికి ప్రధానమని చాటిచెప్పే దశావతారాల ప్రస్తావన గాని, కర్మ సిద్ధాంతం గాని, పునర్జన్మ సిద్ధాంతం గాని వేదాలలో ఎక్కడా కనిపించదు.

నిజానికి వేదోత్తర కాలంలో వెలువడిన వాఙ్మయంలో వేదాల నిరసన బహుళంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ముండకోపనిషత్తులో విద్యలు పరా, అపరా విద్యలు అని రెండు రకాలని చెబుతూ, నాలుగు వేదాలు తక్కువ తరగతికి చెందిన అపరా విద్యలకు చెందినవని, పరా విద్యలు బ్రహ్మతత్త్వాన్ని తెలిపి ముక్తిని ప్రసాదిస్తాయని ఘోషిస్తున్నాయి.

తత్రాపరో ఋగ్వేదో యజుర్వేదః
సామవేదోఽ థర్వవేదః శిక్షా కల్పో
వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి।
అథ పరా, యయా తదక్షర మధిగమ్యతే ॥ (ముండకోపనిషత్తు I 2-4)

ఈ రెండువిద్యల్లో నాలుగు వేదాలు, వేదాంగాలైన శిక్షా , కల్పం, వ్యాకరణం, నిరుక్తం, చందస్సూ, జ్యోతిషమూ అన్నీ అపరా విద్యలే. ఇక శాశ్వతమూ, అమరమూ అయిన బ్రహ్మ తత్వాన్ని అందించే విద్య పరావిద్య.

భగవద్గీతలోనూ వేదవిద్యలను, కర్మకాండను నిరసిస్తూ శ్లోకాలు కనిపిస్తాయి. ప్రసిద్ధి చెందిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా’ అన్న శ్లోకానికి ముందున్న నాలుగు శ్లోకాలు, వేదాలలో ఉన్న జ్ఞానం పైపైన ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నా అది త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందిందని, ఆత్మజ్ఞానానికి పనికిరాదని ఖరాఖండిగా చెబుతున్నాయి.

యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః
వేద-వాద-రతాః పార్థ నాన్యదస్తీతి వాదినః (2.42)

పార్థా: అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు (వేద-వాద-రతాః) ఇంతకు మించింది వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.

కామాత్మానః స్వర్గ-పరా జన్మ-కర్మ-ఫల-ప్రదాం
క్రియా-విశేష-బహులాం భోగైశ్వర్య-గతిం ప్రతి (2.43)

కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవీ, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైశ్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.

భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥ (2-44)

భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్చయ జ్ఞానం ఏర్పడదు.

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్॥ (2-45)

అర్జునా! వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి. నీవు వాటికి అతీతుడవై, సుఖదుఃఖాది ద్వందాలని వదిలి, నిత్యము శుద్ధ సత్వములో నిలిచి, యోగక్షేమాలను వర్జించి ఆత్మజ్ఞానివి కమ్ము.

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే ।
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః॥ (2-46)

అంతటా జలం పొంగుతున్నప్పుడు బావి యొక్క ఉపయోగం ఎంతవరకో, అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.

[బాత్రా] 26. That YOU NOTICEE at page 36 has written:

“The women were forbidden to study the most ancient sacred text, the Vedas.” It is another totally false statement as there are at least 29 women risikas whose compositions are there in Rig Veda. Atharva Veda [XI.5.18] expressly sanctions study of Vedas by female. Details may be seen in book ‘Vedic Equality & Hinduism.’[ISBN: 81-7822-285-x].

నిజానికి వెండీ డానిగర్ వేద వాఙ్మయంలో స్త్రీ రచయితల పాత్ర గురించి ఋగ్వేదానికి తను చేసిన అనువాద పుస్తకంలో విపులంగా చర్చించారు. అయితే, మహాభారతం నుండి మనుధర్మ శాస్త్రం దాకా స్త్రీలు, శూద్రులు వేదాలు చదవకూడదని చెబుతున్నాయి. నేడు కూడా భారతదేశంలో స్త్రీలు వేదాలు చదవడానికి అనర్హులని చెప్పే పండితులు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితినే వివరిస్తూ The Hindus పుస్తకంలో వెండీ డానిగర్ స్త్రీలు వేదాలు చదవకూడదని అంటారని, కానీ స్త్రీలు వేదరచనలో పాలుపంచుకున్నారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని ప్రస్తావించారు.

“Women are sometimes said to have been excluded from the ancient Indian texts and therefore to have left no trace, history having been written by the winners, the men. But in fact women made significant contributions to the texts, both as the (usually unacknowledged) sources of many ancient as well as contemporary narratives and as the inspiration for many more. Some Hindu women did read and write, forging the crucial links between vernacular languages and Sanskrit. Women were forbidden to study the most ancient sacred text, the Veda, but the wives, whose presence was required at Vedic rituals, both heard and spoke Vedic verses,38 and they may well have had wider access to other Sanskrit texts. Later, in the second or third century CE, the Kama-sutra tells us not only that women had such access but even that they sometimes commissioned such texts to be written (1.3). Women in Sanskrit plays generally speak only dialects (Prakrits), while men speak only Sanskrit, but since the men and women converse together, generally without translators, the women must understand the men’s Sanskrit, and the men the women’s dialects. Moreover, some women in plays both speak and write Sanskrit, and some men speak in dialects, trampling on what is left of the convention. It is a basic principle of one school of Indian logic that something can be prohibited only if its occurrence is possible. The fact that the texts keep shouting that women should not read Vedic texts suggests that women were quite capable of doing so and probably did so whenever the pandits weren’t looking. Women as a group have always been oppressed in India (as elsewhere), but individual women have always succeeded in making their mark despite the obstacles.”

ప్రాచ్యవాదం, వలసవాదం
అయితే, భారతదేశం వంటి ప్రాచ్య దేశాల గురించి పాశ్చాత్య దేశపు పండితులు చేస్తున్న పరిశోధనలు నిస్వార్థంగా కనిపించినంత మాత్రాన వారి ప్రభావం గురించి తక్కువ అంచనా వేయవద్దు. ఫ్రెంచ్ తత్త్వవేత్త మిషెల్‌ ఫూకో (Michel Foucault) చెప్పినట్టు ఏ సమాజం లోనైనా జ్ఞానం అన్నది నిష్పక్షపాతమైన సత్యశోధన వల్ల మాత్రమే జన్మించదు. ఆయన దృష్టిలో జ్ఞానానికి, అధికారానికీ విడదీయరాని సంబంధం ఉంది. అధికారం జ్ఞానసృష్టికి ఉపయోగపడుతుంది; కొత్తగా సృష్టించిన ఆ జ్ఞానం అధికారం చెలాయించడానికి పనికివస్తుంది. ఈ సిద్ధాంతం ఆధారంగా పాశ్చాత్యులు ప్రాచ్యదేశాలను గురించి చేసిన పరిశోధనను గురించి క్షుణ్ణంగా పరిశీలించిన పాలస్తీనా దేశానికి చెందిన సయీద్ (Edward Wadie Said) అనే పండితుడు, పాశ్చాత్యల పరిశోధన, వారి వలసపాలనకు, సామ్రాజ్యవాదానికి ఎంతగానో దోహదపడిందని అభిప్రాయపడ్డారు. ప్రాచ్యాన్వేషణ సాగించిన పాశ్చాత్య విద్యావేత్తలూ, సంస్థలూ, ప్రభుత్వాలూ అన్నిటికీ అధికారం ఉండడం చేత, వాళ్ళకు తెలిసిందే నిజమని అందరినీ నమ్మించగలిచారు. ఆయన చేసిన ఈ బలమైన వాదానికే ప్రాచ్యవాదం (Orientalism) అని పేరు.

ఇప్పుడు వలసపాలన లేకున్నా, పాశ్చాత్యుల పరిశోధనల్లో వారికి తెలియకుండానే ఒక రకమైన ‘పాశ్చాత్య పక్షపాతం’ చొరబడుతుందని సయీద్ చేసిన విశ్లేషణల వల్ల మనకు అర్థం అవుతుంది. ఈ రకమైన పరిశోధనలు ప్రాచ్య దేశాలపై పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని కొనసాగించడానికి పనికివస్తాయి. ఈ రకమైన ఆధిపత్య దాడిని ఎదుర్కోవాలంటే పుస్తకాలను నిషేధించడం, వారి పరిశోధనలను నిరోధించడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమి లేదు. పాశ్చాత్య దృక్పథాలతో చేసిన సిద్ధాంత చట్రాలను సవాలు చేయగలిగే లోతైన పరిశోధనలు మాత్రమే వారి అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రతిఘటించగలుగుతాయి. జ్ఞానంపై పాశ్చాత్యుల గుత్తాధిపత్యాన్ని మనం ఎదురుకొనగలిగేంతగా మనం జ్ఞానాన్ని సముపార్జించుకున్నప్పుడే వారి జ్ఞానాన్ని, అధికారాన్ని ప్రతిఘటించగలం.

వలసపాలనలో భారతీయ సమాజపు పూర్వ విజ్ఞానం, మేధో సంపద పూర్తిగా మరుగున పడిపోయాయి. ఒకసారి వెల్చేరు నారాయణరావుగారు చెప్పినట్టు, వలసపాలన వలన మనకు ముఖ్యంగా జరిగిన కీడు ఆర్థిక నష్టమో, రాజకీయ దాస్యమో కాదు — మనం మన భారతీయ సమాజపు పూర్వ విజ్ఞానం కోల్పోవడమే మనకు కలిగిన దౌర్భాగ్యం.

హిందుత్వవాదం వల్లే హిందూమతానికి అత్యంతప్రమాదం
ఇప్పటి పరిస్థితిని సరిగా అర్థం చేసుకుంటే, ప్రస్తుతం హిందుత్వవాదులనుండే హిందూమతానికి అత్యంతప్రమాదం ఏర్పడుతుందని మనకు తెలుస్తుంది. మూల గ్రంథాలు చదివి భారతీయ సంస్కృతిలోని నిర్మాణ సంక్లిష్టతలను లోతుగా అర్థం చేసుకొనే జఠర పుష్టి లేని ఇప్పటి హిందుత్వవాదుల దృక్పథం నిజానికి పూర్తిగా పాశ్చాత్యవాదం. పాశ్చాత్య మతాలలో లాగా హిందూ మతానికి ఒక దేవుడు, ఒక ప్రబోధకుడు, ఒకే మూల గ్రంథం ఉన్నాయని వాదించడం ఏ మాత్రం భారతీయం కాదు. హిందూ విశ్వాసం ఒక్కడే దేవుడన్నవాడిని, అనేక మంది దేవుళ్లున్నారన్న వాడిని, అసలు దేముడే లేడన్నవాణ్ని కూడా సమానంగా ఆదరిస్తుంది. అలాగే శృంగారాన్ని సంకోచం లేకుండా చర్చించిన హిందూ మతం యొక్క విశిష్టతను గుర్తించుకోకుండా, బ్రిటిష్ వారి ద్వారా సంక్రమించిన విక్టోరియన్ నీతుల పరదాలు కప్పుకొని మన నాగరికతను మనమే చిన్నబుచ్చుకోవడం, విశాల వీథుల్లో పరిఢవిల్లిన హిందూ మతాన్ని ఇరుకు ఛాందస వీథుల్లో బురఖా వేసి నడిపించడం వంటిదే.

వెండీ డానిగర్ పుస్తకం ఇండియన్ మార్కెట్ల నుండి ఉపసంహరించడం వల్ల ఒరిగిందేమిటి? ఆ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ లేని ప్రచారం జరిగింది. అమెజాన్.కామ్‌లో పదకొండు వేల రాంక్ ఉన్న పుస్తకం యొక్క డిమాండ్ ఒక్క వారం రోజుల్లో ఆకాశాన్నంటి ఇప్పుడు ఆ పుస్తకం ప్రజాదరణలో 33వ స్థానానికి చేరుకుంది. ఇండియాలో కూడా డిజిటల్ కాపీలు, పెంగ్విన్-ఇంటర్నేషనల్ కాపీలు యదేచ్ఛగా లభ్యమవుతున్నాయి. ఈ పుస్తకానికి జరిగిన ప్రచారంతోపాటు మతదురభిమానంలో హిందువులు ముస్లిములకు ఏ మాత్రం తీసిపోరని, వారి మతాన్ని ఏ మాత్రం విమర్శించినా సహించరని ప్రపంచ వ్యాప్తంగా అందరూ అనుకోవడానికి ఈ నిషేధం ఆస్కారం కలిపించింది.

దృక్కోణాల విభేదం, లక్ష్యాల వైవిధ్యం వల్ల ఒకే సంఘటన, ఒకే సత్యం వేర్వేరుగా కనిపిస్తాయన్న సత్యం భారతీయ దార్శనీకులకు ఏనాడో తెలుసు. అంధగజన్యాయం లాగా, హిందూ మత చరిత్ర అనబడే గజాన్ని వర్ణించే ఎన్ని ప్రత్యామ్నాయ కథనాలు ఉంటే నిజాన్ని అంత బాగా అర్థం చేసుకోగలం. మన భాషా, చరిత్ర, సంస్కృతుల గురించి లోతైన అవగాహన కలుగజేసే సిద్ధాంతాలను ప్రతిపాదించగలిగే పరిశోధనలు, పరిశోధకులు, విశ్వవిద్యాలయాలు భారతదేశంలోనే తయారయినప్పుడు నిజమైన భారతీయ తత్త్వం విశ్వానికి వెల్లడి అవుతుంది. అంతేకాని, అభిప్రాయభేదాలను దీర్ఘ సంవాదాల ద్వారా పరిష్కరించుకొనే ఘనమైన సంప్రదాయం ఉన్న మన జాతికి ఇలా పుస్తకనిషేధాలు, పరిశోధకులపై బెదిరింపు దాడులు, భావప్రకటనాస్వేచ్ఛపై నియంత్రణలు — మునుపెన్నడూ లేని మతమౌఢ్యాన్ని, ఆత్మన్యూనతను పంచి పెంచి పోషిస్తాయే తప్ప ఏ రకంగానూ మేలు చేయవు. భారతీయ సంస్కృతిని రక్షిస్తున్నాం అని రొమ్ములు విరుచుకుంటున్న వారిచేతిలోనే మన సంస్కృతికి బమియన్ బుద్ధుల విగ్రహాలకు పట్టిన గతి పట్టకుండా చూసుకోవాల్సిన తక్షణావసరం మనందరిదీ కూడా.

ఉపయుక్త గ్రంథాలు
సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత – సంకలన కర్త: డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య 1989
శ్రీ వాల్మీకి ప్రణీత శ్రీ రామాయణం (అరణ్య కాండ), శ్రీ గోవిందా రాజీవ వ్యాఖ్యోపేతం, విజయ ముద్రశాల, 1972
రంగనాథ రామాయణము, గోన బుద్దారెడ్డి
The Argumentative Indian, Amartya Sen, Penguin Books, 2005
The Hindus, Wendy Doniger, The Penguin Press, 2009
On liberty, John Stuart Mill, 1863
Power/Knowledge: Selected Interviews and Other Writings, 1972-1977, Michel Foucault (Author) , Colin Gordon (Editor)
Orientalism, Said, Edward W, New York: Pantheon Books, 1978
-------------------------------------------------
రచన: సురేశ్ కొలిచాల, 
ఈమాట సౌజన్యంతో

No comments: