Sunday, March 31, 2019

జీవిత నవల – 2


జీవిత నవల – 2
సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి.............

ఇంతకుముందు చెప్పినట్టు, జీవిత నవల ఇంకా శైశవ దశలోనే ఉంది. అందువల్ల, నేను రాసిన మెదటి జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్ (Lust For Life) నుండీ మొన్నటి ఇమ్మోర్టల్ వైఫ్ (Immortal Wife), లవ్ ఈజ్ ఎటర్నల్ (Love is Eternal) నవలల వరకూ నా రచనలలో నేను పైన చెప్పిన నియమాలని, పద్ధతులని ఏ విధంగా ఆచరణలో పెట్టానో సోదాహరణంగా విశదీకరిస్తే బహుశా ఆసక్తి ఉన్నవారికి అది ఉపయోగపడవచ్చు.

లస్ట్ ఫర్ లైఫ్ నవలకి ముందు నాకు జీవిత నవలలు రాయడంలో ఎటువంటి అనుభవమూ లేదు. ఆరోజుల్లో నేను నాటకరచయితని. ఒకరోజు, పారిస్‌లో నా స్నేహితులు నన్ను బలవంతంగా విన్సెంట్ వాన్‌గో (Vincent van Gogh) చిత్రాలు చూడటానికి తీసుకొని పోయారు. అది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన. ఒక పెద్ద హాలంతా నిండిపోయిన వాన్‌గో వర్ణచిత్రాలు నన్ను ఆమూలాగ్రం కదిలించి వేశాయి. ఆనాటి భావోద్వేగం మాటల్లో చెప్పలేనిది, మొదటిసారి బ్రదర్స్ కరామజోవ్ (Brothers Karamazov) నవల చదివినప్పుడు ఎటువంటి అనుభూతికి లోనయ్యానో అటువంటి ఉద్వేగమే, నన్ను అంతే తీవ్రంగా, కదిలించింది. ఎలాగైనాసరే, నన్నంతగా కదిలించిన వాన్‌గో గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే పట్టుదల నాలో కలిగింది. న్యూయార్క్ తిరిగి వచ్చేశాక, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలలో దొరికినంతవరకూ చెదురుమదురుగా విన్సెంట్ గురించిన వివరాలు అన్నీ చదివాను. ఒకపక్క నేను రాస్తున్న నాటకాలపై పనిచేస్తూనే, సాయంత్రాలన్నీ ఫిఫ్త్ ఎవెన్యూలోనూ, ఫార్టీ-సెకెండ్‌ స్ట్రీట్‌లోనూ ఉన్న పబ్లిక్ లైబ్రరీలలో విన్సెంట్‌ తన తమ్ముడు థియోకి రాసిన ఉత్తరాలు, మూడు సంపుటాలు, అన్నీ శ్రద్ధగా చదివాను. ఇదంతా అతని గురించి తెలుసుకోవాలనే కోరికతోనే గానీ, అతనిపై ఒక నవల రాయాలనే ఆలోచన నాలో ఏ కోశానా లేదు. కాని, అలా నాకు తెలియకుండానే, నా ప్రయత్నమేమీ వేరేగా లేకుండానే విన్సెంట్ నన్ను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. అతని కథ నన్నెంతగా వశం చేసుకుందంటే, అర్ధరాత్రి మూడింటికి లేచి థియో, విన్సెంట్ మధ్య సంభాషణలో లేదా, ‘ఓవెర్ స్యుర్ వాస్‌’లో (Auvers sur Oise పారిస్ నగరంలో ఒక ప్రాంతం) విన్సెంట్ మరణ సన్నివేశమో రాస్తుండేవాడిని. ఆటుపోట్లతో నిండిపోయిన విన్సెంట్ జీవిత ప్రయాణం ఎంతో భావంతో నిండుకుని, ఒక గొప్ప కథగా నాకనిపిస్తుండేది. ఆ సంవత్సరాంతానికల్లా నాకింక వేరే ఏ ఆలోచన పొసగక, ఆఖరికి అతన్ని నా ఆలోచనలనుంచి నెట్టివెయ్యడానికైనా సరే, విన్సెంట్ జీవిత నవల రాయాలని నిర్ణయించుకున్నాను.

కాని, అటువంటి కథని రాయడానికి నాకున్న నేపథ్యం ఏమాత్రమూ సరిపోదు. నేను పెరిగింది శాన్ ఫ్రాన్సిస్కోలో. చచ్చి, తలకిందులుగా వేలాడుతున్న రెండు కుందేళ్ల బొమ్మ కూడా అక్కడ గొప్ప కళాఖండమే! అందుకని నా మెదటి కర్తవ్యం ఆధునిక చిత్రకళ, చిత్రకారుల గురించి సాంతంగా చదివి తెలుసుకోవడం, ఆనక వీలయినంతగా వారు గీసిన చిత్రాలని చూడడం. భుజానికి ఒక సంచీ తగిలించుకుని, నేను యూరోప్‌కి వెళ్ళి విన్సెంట్ జీవితాన్ని అనుసరించాను. అతను నడిచిన దారిలో నడిచాను – బొరినాజ్‌లో (Borinage, బెల్జియం దేశంలో ప్రాంతం) అతను దిగిన బొగ్గుగనుల్లోకి నేనూ దిగాను, మేడమ్ డెనిస్ బేకరీలో అతనే గదిలో పడుకున్నాడో అక్కడే నేనూ పడుకున్నాను, హాలండులో అతను తన కుటుంబంతో నివసించినచోటే నేనూ ఉండి నోట్సు రాసుకున్నాను, దక్షిణ ఫ్రాన్స్‌లో అతను పనిచేసిన యెల్లో హౌస్‌లో పని చేశాను, సాన్ రేమీలో (Ste. Remy) అతనిని బంధించిన పిచ్చాసుపత్రిలోనే నేనూ కొన్నాళ్ళు ఉన్నాను, చివరికి అతని నలభయ్యవ వర్ధంతినాడు ఓవెర్ స్యుర్ వాస్‌ లోని చిన్న హోటల్లో అతను అద్దెకున్న గదిలో, అదే పక్క మీద, పడుకున్నాను.

జీవిత నవల రాయడంలోని లోటుపాట్లు నాకెంత తెలుసో, తెలీదో నాకే తెలియదు కాబట్టి, లస్ట్ ఫర్ లైఫ్ నవల రాయడానికి పూనుకున్న మొదటి ఉదయం, నాకు గుర్తుగా నాలుగు నియమాలు రాసుకున్నాను. అవి – 1. నాటకీయత; 2. వీలయినంత ఎక్కువగా సంభాషణ; 3. సజీవమైన పాత్రలు; 4. సున్నితమైన హాస్యపు సన్నివేశాలు.

అవే ఆనాడు నన్ను నడిపించిన నాలుగు సూత్రాలు. ఇప్పుడైతే, నవల ఎలా ఉండాలో, ఉండకూడదో యాభై పేజీలకి తక్కువ కాకుండా ముందే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రాసిపెట్టుకుని దాన్నే అనుసరిస్తున్నాను. అయినా, ఇప్పుడు వచ్చిన నా నవలలేవీ లస్ట్ ఫర్ లైఫ్ కంటే గొప్పగా లేవనే ప్రజాభిప్రాయం. అందుకే ఒక్కోసారి, ఆ రోజుల్లో సహజసిద్ధంగా తెలిసినదానినే ఈ పాతికేళ్లలో విశ్లేషించి వివరంగా చెప్పగలగడం మించి ఇంకేమీ కొత్తగా సాధించినదేమీ లేదేమో అనే సందిగ్దం నన్ను వేధిస్తూ ఉంటుంది.

ఏ ప్రేరణైతే నాచేత లస్ట్ ఫర్ లైఫ్ రాయించిందో సరిగ్గా అటువంటి ప్రేరణే ఇమ్మోర్టల్ వైఫ్ నవల రాయడానికి నన్ను పురికొల్పొంది. ఈ రెంటికీ మధ్య మూడు జీవిత చరిత్రలు రాసేంత కాలం ఎలా జీవిత నవలకు దూరంగా ఉండగలిగానో, నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులపై దే ఆల్సో రాన్ (They Also Ran) అనే నవల రాశాను. అందులో జాన్ ఫ్రీమాంట్‌పై అధ్యాయం రాస్తుండగా, ఆయన సతీమణి జెస్సీ బెంటన్ ఫ్రీమాంట్ మరోసారి నా తలపు తలుపు తట్టింది — కాలేజీ రోజుల్లో ఆమే నా ఆరాధ్య దేవత, నా భార్యని ఎంచుకోవడంలో కూడా ఆమే నాకు స్ఫూర్తి. విన్సెంట్ కథ నన్ను ఎలా ఆవహించిందో, జెస్సీ కథ కూడా అలానే నన్ను ఆక్రమించుకుంది.

ఇమ్మోర్టల్ వైఫ్ రాయడానికి పూనుకునేముందు, అంటే 1943లో, సుమారుగా అరవైమూడు సూత్రాలతో జీవిత నవల రాయడానికి రచయితకున్న స్వేచ్ఛాపరిమితులు, అతని ఎల్లలు, సరిహద్దులపై ఖచ్చితమైన నియమావళి రాసుకున్నాను. అందులోంచి ఒక ఉదాహరణ:

కథలో వడి ఉండాలి. పాటలా హాయిగా సాగిపోవాలి. ప్రధానంగా వ్యక్తుల కథ కాబట్టి చరిత్ర నేపథ్యంలోనే ఉండాలి. కనీసం సగం పైగా సంభాషణలుండాలి. జెస్సీ స్వగతాలు, ఆలోచనలు చాప కింద నీరులా ఉండాలి. ప్రతీది ఆమెగానే ఆలోచించాలి. పాత్రలన్నీ సజీవంగా, చైతన్యవంతంగా ఉండాలి. ప్రతీ సన్నివేశం, ప్రతీ పదం ఇప్పటి భాషలో ఉండాలి. పాఠకుడు జెస్సీతో మమేకమైపోవాలి. 1840 నుంచీ 1900 మధ్య కాలంలో ప్రపంచాన్ని ఆమె దృష్టితోనే చూపించాలి. వర్ణన కోసం వర్ణన ఉండకూడదు. వర్ణనలు జెస్సీ జీవితానికి అనుబంధంగా, ఆమె చూసి చేస్తున్నవిగానే ఉండాలి. చారిత్రక సత్యాల ఏకరువు కాకుండా అవి జీవితంలో భాగమైనవిగానే ఉండాలి. విషయ సామగ్రి కొత్తగా ఉండాలి. అది పడుగూ పేకలా వర్ణిస్తున్న ఆ జీవితంలో ఇమిడిపోవాలి. అంతర్లీనంగా హాస్యం వాడి కథకు తేలికదనాన్ని తేవాలి. కథలో ప్రధానాంశాలు ప్రవేశపెట్టడంలో, వాటిని అభివృద్ధి చెయ్యడంలో ఓపిక అవసరం. మొదట ఇదొక ప్రేమ కథ అని మర్చిపోకూడదు. జాన్, జెస్సీల మధ్య అనుబంధం ఎప్పటికప్పుడూ మారుతున్నా, వారి ప్రేమానురాగాల స్వభావం ఎప్పుడూ ఒకటే. మానవ సహజమైన పొరబాట్లు, తప్పిదాలు ఈ కథకి మూడో కోణం. ఒకరంటే ఒకరికి, అలానే వారిద్దరికీ ప్రపంచంపై ఉన్న విశ్వాసం, ఆశావహ దృక్పథమే జీవనానికి పునాది అనే వారి ఆదర్శం, ఈ కథకు నాలుగో కోణం. ప్రేమ, వివాహంపై కూలంకషంగా, లోతుగా కథనం ఉండాలి. ఆ బంధం సహజానుబంధంగా చూపాలి. ఏ వివరం వొదిలి పెట్టకుండా, ఏ విషయం ఎక్కువగా వర్ణించకుండా, అప్పటి కాలాన్ని కళ్ళకి కట్టినట్టుగా చిత్ర్రించాలి. కథాస్థలాలైన వాషింగ్టన్, సెయింట్ లూయిస్, మారిపోసాల మధ్య వైవిధ్యం ప్రస్ఫుటమవ్వాలి. చరిత్రను ఆసక్తికరంగా కథలో ఇమిడ్చి, ఏ ఒక్క జీవితమైనా సర్వమానవాళి జీవితానికి ప్రతీక అనే భావన కలిగించాలి.

ఏడేళ్ళ తర్వాత, ది ప్రెసిడెంట్స్ లేడీ (The President’s Lady) నవలకి అవసరమైన పథకం తయారుచేసుకుంటున్నప్పుడు, “రేచల్ మనసు తెలుసుకోవడం ఎలా” అని నేను మథనపడుతూ, నాకై నేను రాసుకొన్న సలహాలు ఇప్పుడు అప్రస్తుతం కావు.

పరిస్థితులకి ఆమె మనస్సుతో మనం స్పందించాలి. ఆమె కళ్లతో మనుషులని చూడాలి; ఆమె విలువలే మన విలువలు కావాలి; ఆమెని తబ్బిబ్బుచేసే సంగతులే మనల్ని కూడా కలవరపెట్టాలి; ఆమెకి ఏది కావాలో అది ఆమెకి దొరకాలని మనం కోరుకోవాలి; ఆండ్రూపై ఆమెకి గల ప్రేమని మనం సొంతం చేసుకోవాలి. ఆమెతో పాటుగా, ఆమె సుదీర్ఘమైన ఒంటరితనంలో మనమూ క్రుంగిపోవాలి; ఆమె కలతలే మన కలతలు, ఆమె అవసరాల నేపథ్యంతోనే మనం సంఘటనలని బేరీజు వెయ్యాలి. ఆవిడ స్నేహితులు, బంధువులు మనకూ అంతే దగ్గరవాళ్ళు. ఆండ్రూకి గుర్తింపు, కీర్తి లభించాలని మనం కోరుకోవాలి. వాటివల్ల అతను మనకు దూరమైపోతాడని భయపడాలి కూడా. ఆమె మతాన్ని ఆరాధించినప్పుడు మతమే మనకి కూడా ఆసరా కావాలి. రేచల్ అనే వేదిక మీద చరిత్ర నటించినట్టుగా చూపించాలి. ఆమె సామాజిక విజయాలకి మనం ఉప్పొంగిపోవాలి, ప్రాణాంతకమైన దెబ్బకి ఆమెతో మనం కూడా మరణించాలి. రేచల్‌ని మనం ప్రేమించాలి, ఆమెతో స్నేహం చెయ్యాలి, ఆమెని అర్థంచేసుకోవాలి. ఆమె జీవితాన్ని ఆమె హృదయంతో, మనస్సుతో మనం అనుభవించగలగాలి.

ఇదంతా ఆర్ద్రతతో, ఆమె పట్ల కరుణతో రచయిత కథ చెప్పగలిగితేనే సాధ్యం. ఆమెని మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే సాధ్యం. నిజాయితీగా, సూటిగా, ఉత్ప్రేక్షలు లేని కథనంతోనే సాధ్యం. అలా అయితేనే, పాఠకుడు రేచల్ పట్ల సహానుభూతికి లోను కాగలడు. కథలోని సన్నివేశాలలోంచి, అన్ని సంఘటనల లోనుంచి రేచల్‌ను చురుకుగా నడిపించుకుంటూ రావాలి. ప్రేమలోనూ, వైవాహిక జీవితంలో ఆమె పడిన బాధలు విశ్వసామాన్యమని చూపిస్తూనే, ఆమె జీవితం మిగతా అందరి స్త్రీలకంటే భిన్నమైనదని వెల్లడించాలి. ఆమె కూడా మనందరి లాగానే విధివైపరీత్యాలకు తల వంచినదిగానే చూపిస్తూ, రేచల్ లాంటి జీవితం నభూతో నభవిష్యతి అని ఆమె ప్రత్యేకతను నిరూపించగలగాలి.

నవలపై ఏడాదిన్నరపాటు పనిచేశాక, చివరి అధ్యాయం రాసేముందు, నవల ద్వారా ఏ సిద్ధాంతనిరూపణలు చెయ్యనవసరం లేదు గానీ, రేచల్ జీవితాన్ని వెలుగులోకి మరింతగా తీసుకుని వచ్చే బాధ్యత నాదే కదా? అని నాకు నేను చెప్పుకుంటూ, నవల ఎందుకోసం మొదలుపెట్టానో ఆ ఉద్దేశం నెరవేరిందా లేదా, ఈ నవలను ఒకటిగా పట్టి వుంచే అంతస్సూత్రం ఏమిటి? అనే మీమాంసలో పడ్డాను.

లింకన్ల జీవితకథపై నాకున్న అమితమైన ఆసక్తి కారణంగా ఆ విషయంపై చాలా చదివాను, కాని చాలా కాలం వరకూ నాకంటూ ఒక కొత్త కోణం చిక్కలేదు. అందరి లాగా నేను కూడా, “పాపం ఏబ్రహాం, మేరీతో ఎలా వేగాడో” అనే అనుకున్నాను. కొత్తగా చెప్పేదేం దొరక్క, ఓ పదేళ్ళపాటు ఆ కథని అలానే మగ్గనిచ్చాను. ఇంతలో లింకన్ల దాంపత్యంపై ఒక పత్రికకి వ్యాసం రాయవలసి వచ్చింది. ఆ వ్యాసానికి అవసరమైన సామగ్రి కోసం వెతుకుతుండగా, లింకన్ల రోజువారీ జీవితానికి సంబంధించిన వివరాలతో ఉన్న అరుదైన వ్యాసం ఒకటి దొరికింది – ముఖ్యంగా ఏబ్రహాం లింకన్ భర్తగా ఎలా మెసలుకునేవాడో ఆ వ్యాసంలో ఉంది. అది చదివి, “పాపం మేరీ!, ఏబ్రహాంతో ఎలా వేగిందో” అనుకున్నాను. ఆ క్షణం, వారి దాంపత్యంలో సమానత్వం నాకు అర్థమయింది. ఇక నేను వారి కథ చెప్పకుండా తప్పించుకోలేను. లింకన్ పెళ్ళిరోజున, “Love is Eternal” అని చెక్కిన ఉంగరాన్ని మేరీ వేలికి తొడిగాడు. అదే కథా వస్తువుగా వారి జీవితకథని చెప్పడానికి పూనుకున్నాను.

జీవిత నవలా రచయితకి తన కథపై చిన్న పిల్లవాడికుండే అంతులేని కుతూహలం ఉండాలి. ఉదాహరణకి, లింకన్ల జీవితకథలో నాలుగో అధ్యాయం రాయడం కోసం నేను రాసుకున్న నోట్సు నుంచి:

ఏబ్రహాం, మేరీలలో వివాహం తరువాత ఎటువంటి మార్పులు వచ్చాయి? ఏబ్రహాం ఆమెతో రోజులో ఎంత సమయం గడిపేవాడు? హోటల్లో మేరీ ఉండే గది ఎక్కడ ఉంది – ముందువైపా, వెనకనా, పక్కనా, మూలగానా? అందులోకి ఎంత వెలుగు వచ్చేది? గది వెచ్చగా ఉండేదా? ఆమె గదిని తనకి నచ్చినట్టు సర్దుకునేదా, ఉన్నది ఉన్నట్టుగానే వదిలేసేదా? గది ఏమాత్రం ఉంటుంది? గదిలోంచి చూస్తే బయట ఏం కనిపించేది? ఆమె హోటల్లో గడిపిన సమయంలో గదిలో ఎంతసేపు ఉండేది, బయట ఎంతసేపు గడిపేది? తనకోసం – చదువుకునే బల్ల, రీడింగు లాంపు వంటివి – ప్రత్యేకంగా అమర్చుకుందా? ఉదయం ఖాళీ సమయంలో ఆమె ఏం చేసేది – చదువుకునేదా, కుట్లు అల్లికలు, ఉత్తరాలు రాయడం, తిరిగి జవాబివ్వడం వంటి వ్యవహారాలు చక్కదిద్దుకునేదా? డబ్బు విషయంలో ఆమె ఏ విధంగా వ్యవహరించేది? ఏబ్రహాం ఆమెకి చేతి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేవాడా? ఆమెకంటూ స్వంతానికి డబ్బు ఉండేదా? ఏబ్రహాం పొదుపరి కాబట్టి, ఆమె కూడా అతని లాగనే పొదుపుగా ఉండేదా, విరివిగా ఖర్చుపెట్టేదా? చుట్టాలు, స్నేహితులని భోజనానికి పిలిచేదా? చివర్లో ఆమెని పిసినారిగా పేరు పొందింది – పిసినిగొట్టుతనం ఆమెకి ఏబ్రహాం నుంచే వచ్చిందా? గ్లోబ్ హోటల్లో వారి భోజనాల గది ఎక్కడుండేది? ఏబ్రహాం అందరితో కలిపి తినడానికి ఉత్సాహం చూపేవాడా, లేక ఇద్దరూ ఏకాంతంగా భోజనం చేసేవారా? లింకన్లకి పక్క గదుల్లో ఎవరుండేవారు? మనకి బ్లెడ్‌సో గురించి తెలుసు – ఆమె ఏ పియానో ఉపయోగించేది, ఏ పాటలు వాయించేది? మేరీని కూడా వాయించమని ఎప్పుడైనా ఆహ్వానించేదా?

చివరి రెండు అధ్యాయాలు రాయడానికి తయారవుతూ, నాకు నేను క్రమశిక్షణతో విధించుకున్న నియామావళి:

చెప్పేదానిని సరళంగా చెప్పాలి. కథని సాగదీయవద్దు. కథకి ఆయువుపట్టయిన సన్నివేశాలు మాత్రమే ఉండాలి – కథ వేగంగా, వడిగా సాగిపోవాలి. మొత్తం తిరుగుబాటునంతా మనం పనిగట్టుకుని పోరాడనక్కరలేదు, వైట్‌ హౌస్‌కి సంబంధించినంతవరకే అది కథకి అవసరం. అనవసరపు భేషజాలు, అభిప్రాయాలు, నిందాపూర్వక ధోరణి ఉండకూడదు. పాఠకులలో పగ, జాలి, కరుణలు రెచ్చగొట్టకూడదు. ఆవేశకావేషాలు లోతట్టుగానే ఉండాలి. రచయితని అవతలకి నెట్టి, కథ తనంతట తానుగా చెప్పుకోనివ్వాలి.

ఏదో ఒక నవల కోసం కాకుండా, జీవిత కథాప్రక్రియకి సాధారణంగా వర్తించే కొన్ని సూత్రాలు నేనిలా వ్రాసుకున్నాను:

తర్వాత ఎక్కడో అవసరమని కథలో ప్రతి వివరం ముందే ఇవ్వకూడదు. కథకి అక్కరలేని వ్యక్తుల, ప్రదేశాల, సంఘటనల ప్రస్థావన అనవసరం. డాంబికం, ఆడంబరం, ముందెప్పుడో ఏర్పరుకున్న పక్షపాతం, దురభిమానం; చరిత్రనంతా మనకి అనువైన సిద్ధాంతంలోకి నెట్టేసే వృథా ప్రయాస; ఆలోచనని అణగదొక్కే భావోద్వేగాలు – పాఠకుల అభిప్రాయాలు, అభిరుచులు, ఊహలు, విజ్ఞత గురించిన అంచనాలు; ఏ ఒక్క వర్గం కోసమో, ఒక వయసువారి కోసమో, ఒక ప్రదేశంవారి కోసమో రాయడం; వ్యక్తులని, సంఘటలని దుయ్యబట్టటం; తాత్వికధోరణి, ఉద్రేకం; ముఖ్యమైన ఆధారాలని దాచడం; లేదా మసిబూసి మారేడుకాయ చేసి పాఠకుడిని తప్పుదారి పట్టించడం; అర్థంలేని సాగతీతలు, మితిమీరిన కోపోద్రేకాల వర్ణనలు; ఇవి జీవిత నవలా రచయితగా చూపకూడని లక్షణాలు.

కథలో వ్యక్తులకి వారికి దక్కవలసిన సముచిత స్థానం వారికివ్వాలి, తీర్పు భగవంతుడికి వదిలెయ్యాలి; బాగా తెలిసిన విషయాలకి అధిక ప్రాధాన్యతనిచ్చి, అంతగా తెలియని విషయాలని నీరుగార్చి కథలో సమతౌల్యతని దెబ్బతీసే ధోరణి ప్రయత్నపూర్వకంగా అధిగమించాలి. పాండిత్యం ప్రకటించుకోడానికి తప్ప మరి దేనికీ పనికిరాని విషయసామగ్రి ఆవగింజంత కూడా అనవసరం. వేరేవారి పక్షపాత ధోరణులకి కొమ్ముకాయడం, ఒక వాదాన్నో, ఇజాన్నో, ఒక సిద్ధాంతాన్నో, ఎజండానో సమర్ధించడానికి చేసే ప్రయత్నాలు కూడవు. కృత్రిమమైన కొత్తపోకడలు, నిరాశావాదం, విధ్వంసం, డొంకతిరుగుడు వాదనలు పాఠకుడిని తప్పుదోవ పట్టిస్తాయి. బాగుంది కదా అనో, భావుకత్వం ఉంది కదా అనో కథ దారి మళ్ళించే సన్నివేశాలు అనవసరం.

జీవిత నవల శైశవదశలోనే ఉండటం మూలాన, దాని స్వరూప స్వభావాలపై, పరిమితులపై, శక్తి సామర్థ్యాలపై ఇంకా పూర్తి అవగాహన లేదు. అందుకని ఈ విషయాలపై పూర్తి స్థాయి చర్చ జరగవలసి ఉంది. అది నవలా? చరిత్రా? జీవిత చరిత్రా? పై మూడింటిలో అన్నీనా? లేక ఏదీ కాదా? ఇటువంటి విషయాలపై నిర్ణయాత్మకమైన, శాస్త్రీయమైన విమర్శకి మార్గం సుగమం చెయ్యడానికి తెర తీసే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాసం నేను రాస్తున్నాను. నా తరువాతి విమర్శకులు, రచయితలు ఈ వ్యాసంలో ప్రతిపాదించిన వాదనలకి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తారనే నమ్మకం నన్ను ఈ మొదటి అడుగు వేయించింది. “గత దశాబ్దంలో ఎంతోమంది ప్రముఖులు జీవిత నవలకు ఉదాత్తత, గంభీరత ఆపాదించే ప్రయత్నాలు చేసినప్పటికీ, అనాచ్ఛాదిత అయిన జాణ లాగానే ఇప్పటికీ అది ఎంచబడుతోంది. అందువల్ల జీవిత నవలా ప్రక్రియలో ఇప్పటిదాకా వచ్చిన అభివృద్ధి సరిపోదు. ఈ ప్రక్రియ ఎంత శక్తివంతమో, ప్రభావితమో విమర్శకులు ఇంకా పూర్తిగా గుర్తించలేదు” అని మేరీలాండ్ యూనివర్శిటీ ఆచార్యుడు కార్ల్ బోడే (Karl Bode), కాలేజ్ ఇంగ్లీష్ అనే పత్రికకి రాసిన వ్యాసంలో అభిప్రాయపడతాడు.

బోడే ప్రస్తావించిన వగలమారి పోకడలు, బహుశా ఫరెవర్ ఆంబర్ (Forever Amber), కిట్టీ వంటి నాసిరకం రచనల గురించి అయ్యుండాలి. ఎందుకంటే, ఇటువంటి నవలల రచయితలు ఎన్నో చోట్ల నుంచి సంగ్రహించిన కల్లిబొల్లి కబుర్లతో, విపరీత వ్యాఖ్యానాలతో, కాల్పనికతతో విచ్చలవిడిగా చరిత్రను కలిపివేయడం కారణం. జీవిత నవలా రచయితగా తమకు లేని స్వేచ్ఛను తీసుకోవడం కారణం. జీవిత నవల రచయితకి కాల్పనిక రచయితకి ఉన్న స్వేచ్ఛ ఉండదు, ఎందుకంటే అతను ఏ వ్యక్తి యొక్క జీవితాన్ని చిత్రించదలచుకున్నాడో, ఆ వ్యక్తి జీవిత వాస్తవాల పరిధికి కట్టుబడి ఉండాలి. అందుకని, ఇటువంటి నవలలని గత్రీ (W. R. Guthrie) లేదా పెన్ వారెన్‌లు (Robert Penn Warren) చారిత్రక నవలలుగా పరిగణించరు, అదే కారణాల చేత నేను కూడా వాటిని జీవిత నవలలుగా అంగీకరించను.

నా ఉద్దేశంలో అసలు సమస్య విశృంఖలత్వం కంటే కూడా రచయితల మర్యాద, సంస్కారాల భారం అని. బహుశా తమ నవలలోని పాత్ర్రలు ఒకప్పుడు వాస్తవంగా జీవించిన వ్యక్తులు కాబట్టి, వారి ఆంతరింగిక వ్యవహారాలని బైటపెట్టడం మర్యాద కాదనే సంకోచం వల్ల నిజాన్ని చెప్పడంలో, వెలికితీయడంలో రచయితలు వెనకాడవచ్చు. ఉదాహరణకి తమ పాత్రల లైంగిక జీవితం గురించిన వివరాలు. ఎంతో ముఖ్యమైన ఇలాంటి విషయాలు వెల్లడి చేయడంలో రచయిత ఎంతో సున్నితంగానూ, చాకచక్యంగానూ అదేసమయంలో నిజాయితీగానూ మసలుకోగలగాలి.

కొంచెం స్వాతంత్ర్యంతో, ప్రొఫెసర్ బోడే నా నవలలపై తన వ్యాసంలో రాసిన విశ్లేషణని ఇక్కడ యథాతథంగా ప్రస్తావిస్తాను. ఆయన విశ్లేషణలో నాకు జీవితనవల ప్రాథమిక నమూనా లభించింది. విన్సెంట్‌ వాన్ గో నవల తర్వాత వచ్చిన నవలలపై బోడే విశ్లేషణ ఇది:

“వ్రాసే ప్రతీ నవల శైలిలో మరింత మెరుగు పడింది. అధ్యయనపు లోతులు కూడా పెరిగాయి. స్టోన్ రాసిన మేరీ టాడ్ లింకన్ నవలతో ఈనాటి జీవిత నవల ఒక ఉచ్ఛస్థితికి చేరుకుందని చెప్పవచ్చు. ఈ నవల శాస్త్రీయమైన జీవిత చరిత్రలకి కూలంకషమైన పరిశోధనలో ఏమాత్రం తీసిపోదని లింకన్ల చరిత్రని లోతుగా అధ్యయనం చేసిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. స్టోన్ ఈ నవలలో ప్రదర్శించిన సమగ్ర శాస్త్రీయ దృష్టికి ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు. ఉదాహరణకి, లింకన్ల కాలం నాటికి వైట్‌హౌస్ ఎలా ఉండేదో ఖచ్చితమైన నమూనాని ఎంతో శ్రమకోర్చి స్టోన్ పునర్నిర్మించాడు. ఈ ఒక్క అంశమే స్వతంత్రమైన పరిశోధనగా నిలబడగలది. అంతే కాకుండా, నవలలోని సంభాషణలన్నీ కూడా చారిత్రకంగా వాస్తవమైన ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే రాశాడు. మేరీ వివాదాస్పదమైన వ్యక్తి, అటువంటి వ్యక్తిని స్టోన్ తన చిత్తం వచ్చిన రీతిలో చిత్రించవచ్చు. పైగా, ఆయన మేరీకి న్యాయం చేస్తాననే సంకల్పంతో నవల మొదలుపెట్టాడు. తను సంకల్పించిన ధ్యేయానికి కూడా అతీతంగా మేరీ సంక్లిష్ట మానసిక స్థితిని ఆయన ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా, నిజమైన కథగా మలిచాడు. మేరీ, ఏబ్రహాంలలో ఒకరు గొప్పవారైతే కావొచ్చు గాక, కానీ ఈ నవలలో వారిద్దరూ మరుపురాని మనుషులుగా మనకి చిరకాలం గుర్తుండిపోతారు. ఇక నవలలో చిన్న పాత్రలపై కూడా రచయిత చూపిన శ్రద్ధ వలన, వారిని నిరర్థకమైన చారిత్రక సమాచారంగా మనం విస్మరించలేం. నవలలోని సన్నివేశాల పూర్వరంగం మనకి తెలిసినప్పటికీ, కథనం ఉత్కంఠభరితంగా సాగింది. స్టోన్ వర్ణన కథకు రంగులద్దింది… పై పైన కనిపించే వాస్తవాలని చీల్చుకుంటూ లోపల దాగిన సత్యపు అసలు రంగు చూపించటం నవలాకారుడు, చరిత్రకారుడికంటే ప్రతిభావంతంగా చెయ్యగలడు. అటువంటి లక్ష్యం చాలా గొప్పది.”

హార్వర్డ్ విశ్వవిద్యాలయపు చరిత్ర అధ్యాపకుడు సామ్యుయెల్ మోరిసన్ (Samuel Morrison) తన హిస్టరీ యాజ్ ఎ లిటరరీ ఆర్ట్ వ్యాసంలో అన్న మాటలు జీవిత నవలా రచయితలందరూ గుర్తుంచుకోదగ్గవి. “చరిత్రకారులు నవలా రచయితల దగ్గరనుంచీ నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ఒక సాధారణ పాఠకుడు చరిత్రని తెలుసుకోవడానికి ఏ కెన్నెత్ రాబర్ట్ నవలనో, మార్గరెట్ మిచెల్ నవలనో దొరకబుచ్చుకుంటాడు గాని, ఫలానా చారిత్రకుడు ఏం రాశాడు, ఫలానా పండితుడు ఏమన్నాడు అని వెతకడు కదా? ఎందుకని అని ప్రశ్నించుకుంటే, సమాధానం అమెరికన్ చరిత్రకారులు చరిత్ర రచన అనే కళని పూర్తిగా మరిచిపోయారని చెప్పుకోక తప్పదు. ఎప్పుడైతే చరిత్ర సాహిత్యం నుంచి వేరుపడిందో, అప్పుడే సామాన్యపాఠకుడు దూరమయాడు. అందుకని అమెరికన్ చరిత్ర చదవడానికి విసుగు పుట్టించే, ఒక మింగుడుపడని కషాయంగా మిగిలిపోయింది.” ఈ దుస్థితిని చక్కదిద్దే బాధ్యత జీవిత నవలది.

జీవిత చరిత్రకి, జీవిత నవలకి, చారిత్రక నవలకి, కాల్పనిక నవలకి మధ్య తేడాలని స్పష్టపరచడం కూడా ఇక్కడ చాలా అవసరం.

కొన్నేళ్లక్రితం కీ వెస్టులో హెమ్మింగ్వేని కలిసినప్పుడు, మేమిద్దరం అప్పడు రాస్తున్న నవలల గురించి విపులంగా మాట్లాడుకున్నాం. ఆ సందర్భంలో హెమ్మింగ్వే “కల్పన అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఏ నవలైనా మన జీవితం నుంచో, మనం గమనించిన జీవితాల నుంచో కదా వచ్చేదీ? అని అభిప్రాయపడ్డాడు. అయితే, కాల్పనిక నవలాకారుడికి తన అనుభవాలని తన చిత్తం వచ్చిన రీతిలో అమర్చుకునే సౌలభ్యం ఉంది. పది జీవితాలను రంగరించి ఒక పాత్రని పుట్టించుకోగలడు. తన అవసరం కోసం, తన ఆదర్శం కోసం, ప్రపంచాన్ని ఒక స్వర్గం గానో నరకం గానో మార్చుకోగలడు. తను కల్పించిన పరిస్థితులకి ప్రత్యామ్నాయాలు కూడ అతనే సూచించుకుంటాడు.

కానీ, జీవిత నవలాకారుడు వాస్తవాలకి బందీ అయివుంటాడు. అయినంత మాత్రాన, అతడు వాస్తవాలకి కేవలం వార్తావహుడిగా మిగిలిపోతే కథకుడిగా రాణించలేడు. రాబర్ట్ గ్రేవ్స్ (Robert Graves) అన్నట్టు, “జీవిత నవల రచయితకి తన పాత్ర గురించిన ఊహాజ్ఞానం ఉండాలి. ఆ ఊహలు నిజమని అతను తర్వాత నిర్ధారించుకోగలగాలి. అలా తన పాత్ర తత్వాన్ని సహజంగా అర్థం చేసుకోగల దృష్టి రచయితకు వుండాలి. అంతేగాని, కేవలం పరిశోధనలోంచి కథ పుట్టుకొస్తుందనుకుంటే, ఆ రచయితకి కథపై అవగాహన లేనట్టే”.

ఇవన్నీ విస్తృతమైన పరిధులు. ఈ పరిధులకి కట్టుబడుతూ, జీవిత నవలా రచయిత, తన కల్పనా చాతుర్యాన్ని ప్రద్రర్శిస్తూ, కథని రక్తి కట్టించడానికి ఎంత స్వేచ్ఛగానో తన ఊహాలోకంలో విహరించవచ్చు. శిల్పపరంగా కాల్పనిక నవలకి, జీవితనవలకి తేడాలు పెద్దగా ఉండవు. జీవితనవల చదువుతున్న పాఠకుడు “ఇది నిజంగా జరిగిందా?” అని ప్రశ్నిస్తాడు. అదే కాల్పనిక నవల చదువుతున్న పాఠకుడు “ఈ విధంగా జరిగే అవకాశం ఉందా?” అని ఆలోచిస్తాడు. అటువంటి నమ్మకం పాఠకుడికి కలిగించే గుణం రెంటికి ఒకటే. ఒకవేళ చరిత్ర అసలేమీ తెలియని పాఠకుడు యాదృచ్ఛికంగా ఈ రెండు నవలలు చదివితే, వాటి మధ్య తేడాలని అతను కనిపెట్టలేడు. కాల్పనిక నవల నిజంగా జరిగిందేమో అని, జీవిత నవల చతురమైన కల్పన అని, అతను అబ్బురపడాలి. ఒకరోజు, మా శ్రీమతి వాళ్ళాఫీసులో పనిచేసే టెలిఫోను ఆపరేటరు దగ్గర లస్ట్ ఫర్ లైఫ్ పుస్తకం చూసి, అదెలా ఉందని అడిగిందట. “చాలా బావుంది కానీ, స్టోన్ చివర్లో పాపం హీరోని చంపకుండా ఉంటే బావుండేది” అందట ఆ అమ్మాయి. ఆ మాటలని నేనెంతో సంతోషంతో గుర్తుపెట్టుకున్నాను.

పరిధిలోనూ, స్వభావంలోనూ చారిత్రక నవల జీవిత నవలకు కొంత దగ్గరగా ఉంటుంది. జీవిత నవలలోని పాత్రలన్నీ ఒకప్పుడు ఈ ప్రపంచంలో జీవించిన వ్యక్తులు; గొప్ప చారిత్రకనవలలో కూడా, అంటే వార్ అండ్ పీస్ వంటి వాటిల్లో కూడా, చరిత్ర మాత్రం సత్యం, పాత్రలన్నీ కల్పితం. వాటిల్లోని పాత్రలు ఎందరెందరో వ్యక్తుల నమూనాలోంచి వచ్చినవి, అవి ఆనాటి చారిత్రక శక్తులకి, పరిస్థితులకి ప్రతీకలు. అంటువంటి వ్యక్తులు నిజంగా ఉండేవారు, నవలలోని ప్రధాన పాత్రలు ఎలాగైతే చరిత్రని ప్రభావితం చేశాయో, అలాగే వారూ నిజజీవితంలో చరిత్రని శాసించారు – అంతవరకే. అయితే, ఒక్కోసారి చారిత్రక నవల జీవిత నవలకి మరీ దగ్గరగా వస్తుంది – హ్యూయీ లాంగ్ (Huey Long of Louisiana) జీవితం నేపథ్యంగా రాబర్ట్ పెన్ వారెన్ రాసిన ఆల్ ది కింగ్స్ మెన్ (All the king’s men) నవలలో పాత్రల పేర్లు, కొన్ని చెదురుమదురు సంఘటనలు తప్పించి అంతా వాస్తవమైన వ్యక్తుల జీవితాలే. అలానే హెచ్.జీ. వెల్స్ (H.G.Wells) రాసిన ది వర్‌ల్డ్ ఆఫ్ విలియం క్లిసోడ్ (The world of William Clissold) నవలలో, క్లిసోడ్, అతని ప్రేమికులు కల్పిత పాత్రలైతే, కథలోని ముఖ్యపాత్రలన్నీ వారి నిజజీవితపు పేర్లతోనే వ్యవహరించబడ్డారు. వారు నిజజీవితంలో ఏ పాత్ర్రలు పోషించారో నవలలోనూ అదే పాత్రని పోషించారు. ఇక, మరో తరహా చారిత్రక నవలల్లో సగం పాత్రలు చారిత్రక వ్యక్తులైతే, మరికొన్ని పాత్రలు ముఖ్యంగా, కథా నాయికా నాయకులు కల్పిత పాత్రలైయుంటారు.

జీవిత నవలలో చారిత్రక నేపథ్యమే కాకుండా, వ్యక్తులు కూడా నిజజీవితంలోని వారే కదా? అటువంటప్పుడు జీవిత నవలకన్నా చారిత్రక నవల ఎందుకు ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది? ఇది నాకిప్పటివరకూ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇకపోతే, శాస్త్రీయమైన జీవిత చరిత్రకి, జీవిత నవలకి వ్యత్యాసం చాలా ఉంది. రెంటికీ వస్తుదాత చరిత్రే అయినా, శిల్పం, రూపం, దృక్పథం, వ్యక్తిత్వం, రచయితకీ పాఠకుడికీ ఉన్న సంబంధంలో ఈ రెండు ఉత్తర దక్షిణ దృవాల వంటివి.

స్వాభావికంగా, జీవిత చరిత్ర ఒక ప్రసంగం లాంటిది. ఒక వ్యక్తి జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసిన రచయిత, తన సొంత గొంతుతో పాఠకుడనే మూడో వ్యక్తికి చెప్పే ఉపన్యాసం అది. కానీ జీవిత నవలా రచయిత పాఠకుడిని పాత్రల మధ్యకి తీసుకొని పోతాడు. పాత్రల సంభాషణలని పాఠకుడు తన చెవులతో తానే స్వయంగా వింటాడు. అందుకే, తన ప్రధాన పాత్రల ప్రేరణలని రచయిత అవగాహన చేసుకోవడంతో జీవిత నవల రచయిత కర్తవ్యం అయిపోదు, వారి మనసుతో అతను ఆ ప్రేరణలకి స్పందించాలి. అప్పుడే, పాఠకుడు కూడా కథానాయకుడు లోనైన అనుభూతికి లోనవుతాడు. అతని విజయాలని ఆస్వాదిస్తాడు, అతని ఓటమికి కన్నీరు కారుస్తాడు. ఆ రకంగా నిరాపేక్షత జీవిత చరిత్ర లక్ష్యమైతే, అనుభూతితో తడిసి మెరిసిన సత్యత జీవిత నవలకి ఆత్మ.

ఇప్పుడిప్పుడే జీవిత నవల ప్రభావంతో జీవిత చరిత్రలు రాసే పద్ధతిలో మార్పులు వస్తున్నాయి. నేను చదువుకునే రోజుల్లో జీవిత చరిత్రలో ప్రతి పేజీ లోనూ పాదపీఠికలు ఉండేవి, ఏవైనా సంభాషణలు పాఠంలో భాగంగా ఉంటే, వాటిని ప్రత్యేకంగా చిన్న అక్షరాలతో కుదించి అచ్చువేసేవారు. 1937లో, సెయిలర్ ఆన్ ది హార్స్ బాక్ (Sailor on the horse back) రాసినప్పుడు, నేను జాక్ లండన్ (Jack London) మాటలు యథాతథంగా వాడి, కొటేషన్లలో పెట్టి, పాఠంలో భాగంగా ఉంచి అచ్చుకి పంపాను. ప్రెస్సులో, కంపోజర్ అప్పటి సంప్రదాయాన్ని అనుసరించి, సంభాషణలని చిన్న అచ్చులోకి మార్చేశాడు. నాకు నచ్చలేదు. అప్పుడు, ఆ పుస్తకం ప్రధాన సంపాదకుడు, నేనూ, కంపోజరుతో చాలా వాదించి అతన్ని ఒప్పించవలసి వచ్చింది. అప్పటినుండీ, అదే అనవాయతీగా మారింది.

మొన్నమొన్నటివరకూ, జీవిత చరిత్రలలో సంభాషణలు ఉండేవి కావు. ఒకవేళ, ఏదైనా సంభాషణకి చారిత్రకంగా, అక్షరబద్ధమైన సాక్ష్యాధారాలు ఉన్నా వాటిని ఉపయోగించేవారు కాదు. వాటిని పాఠంగా మార్చి రాసేవారు. అలా లేకుంటే, పాఠకుడు మొత్తం రచననే కథో, కల్పితమో అనుకునే ప్రమాదం ఉందని పండితుల అభిప్రాయం. అయితే, ఈ ధోరణి నాకు సమంజసంగా అనిపించదు. 1940లో నేను క్లారెన్స్ డారో ఫర్ ది డిఫెన్స్ (Clarence Darrow For the Defense) రాసినప్పుడు సంభాషణలు యధాతథంగా రాసి, పుస్తకం చివర్లో వాటికి ఆధారాలు ప్రచురించాను. ఉత్తమ పురుషలో రాసిన సంభాషణల వల్ల చరిత్ర పాఠకుడిపై ప్రగాఢమైన ముద్ర వెయ్యగలిగిందని నా అభిప్రాయం.

మా చిన్నతనంలో ఎవరో పండితులు తప్పించి జీవిత చరిత్రలు ఎవరూ చదివేవారు కాదు. ఈ విధంగా జీవిత చరిత్రల వైఫల్యం, జీవిత నవల ప్రాచుర్యంలోకి రావడానికొక కారణమేమో. అందుకే, జీవిత చరిత్ర రచన జీవిత నవలా ప్రక్రియనుండి కొత్త పాఠాలు నేర్చుకుంటుందని నేననుకుంటున్నాను. పుస్తకం సమాచార వ్యవస్థకి పందిరిరాట వంటిది. చదివించుకోలేని, చదవలేని పుస్తకాలు రాయడం వల్ల ఏం ప్రయోజనమో నాకు అర్థం కాదు. అయితే శాస్త్రీయ పరిశోధనా పద్ధతులు, చారిత్రక సమాచారాన్ని క్రోడీకరించుకునే మెలకువలు నేరిపినందుకు జీవిత నవల, జీవిత చరిత్ర ప్రక్రియకి సదా కృతజ్ఞరాలై ఉంటుంది.

చైతన్యమూర్తులన్నిటి లాగనే, జీవిత నవల కూడా సంఘర్షణ లోంచే పుట్టింది. అయినప్పటికీ, జీవిత చరిత్ర, నవల అనే రెండు ఉదాత్తమైన తల్లితండ్రులకి పుట్టిన అక్రమ సంతానంగా అది అపవాదులు మొయ్యటంలేదూ? ఇటు నవల, అటు జీవిత చరిత్ర, రెండింటి పరువూ తీసిందని, వాటిని భ్రష్టు పట్టించిందని, వాటికి గౌరవభంగం కలిగించిందనీ, జీవిత చరిత్రకున్న నమ్మశక్యమైన పరిశోధనా ప్రాతిపదిక దీనికి లేదనీ, రచయిత వ్యక్తిత్వ దోషాలతో చరిత్ర కలుషతమై పోతుందనీ, కథారూపంలోకి మార్చే క్రమంలో చరిత్ర స్వభావం మారిపోతుందనీ, వాస్తవమేదో, కల్పనేదో తెలుసుకోలేని సందిగ్దంలోకి పాఠకుడిని నెడుతుందనీ, చెల్లుబాటయ్యే విషయాలనే ఎంచుకొని, చరిత్రకి అన్యాయం చేస్తుందనీ, ఎప్పుడో మరణించిన వ్యక్తుల ఆంతరింగిక జీవితాలని ఎవరి అనుమతి లేకుండా బహిర్గతం చేస్తుందనీ, శిల్పం కోసం పాత్రలని వంచిస్తుందనీ జీవిత నవలపై ఘాటైన విమర్శలే ఉన్నాయి.

ఈ విమర్శలలో అంతో ఇంతో నిజం లేకపోలేదు. ఇవే కాకుండా, మరెన్నో లోపాలు ఇంకా విమర్శకుల కళ్లబడలేదేమో! అయితే, కొన్ని దోషాల కారణంగా ఒక సాహిత్య ప్రక్రియని బహిష్కరించడం, మనిషిలోని బలహీనతల కారణంచేత మొత్తం మానవాళినే అంతమెందించాలనే అర్థం లేని ఆలోచన వంటిదే. గడిచిన పాతికేళ్లలో ఈ ధోరణిలో మౌలికమైన మార్పు వచ్చిందనే నా స్వానుభవం. జీవిత నవల ఒక సాహిత్య ప్రక్రియగా తనకంటూ ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని, గౌరవాన్ని సంపాదించుకుందని విమర్శకులు గుర్తించారు. ముందుచూపు వున్న విమర్శకులు ఇప్పుడు సాహిత్య పరిషత్తులలో జీవిత నవలకి కూడా భాగం కల్పిస్తున్నారు. అదే విశాలదృక్పథంతో, ప్రతీ జీవిత నవల అత్యున్నతమైన ప్రమాణాలని అందుకోవాలని పట్టుదలగా కోరుతున్నారు కూడా. ఒక సాహిత్య ప్రక్రియని ఏకమొత్తంగా నిరాకరించే ధోరణిని మాని, ప్రతి రచనని దాని శైలి, దానివెనకున్న పరిశోధనలోని పటిష్టత, కథన చాతుర్యం మొదలైన ప్రాతపదికల ఆధారంగా బేరీజు వేస్తున్నారు. ఇవన్నీ హర్షించదగ్గ పరిణామాలు.

అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని మనుగడ సాధించడం మానవాళికి ప్రత్యేకమయిన గొప్ప లక్షణం. చరిత్ర, జీవిత చరిత్ర, రెండూ కూడా నిరంతరంగా పెరిగే ఈ అనుభవాల పాఠాలే. ఆధునిక ప్రపంచంలోని సమస్యలకి, సంఘర్షణలకి ఆ అనుభవసారంలోని జ్ఙానదీపికని అందించాలనేదే జీవిత నవలా కారుడు కనే అందమైన కల.

ఏ భేషజము లేకుండా మనుషుల జీవితాల్లో చిన్న విషయాలకే లోతుగా, నిజాయితీగా స్పందించడం, కష్టాలతో, సమస్యలతో కొంతమంది వ్యక్తుల మొక్కవోని పోరాటాన్నే కథలుగా తోటి పాఠకులతో పంచుకోవాలనే తపన – ఈ రెండే నా నవలలన్నిటికీ ప్రేరణలు.
-----------------------------------------------------------
రచన: నాగరాజు పప్పు,
మూలం: ఇర్వింగ్ స్టోన్,
(ఆంగ్ల మూలం: The biographical Novel.)
ఈమాట సౌజన్యంతో

No comments: