Tuesday, November 27, 2018

నా రామాయణం


నా రామాయణం
సాహితీమిత్రులారా!

అనగా అనగా ఒకరోజు. ఆ రోజున శ్రీరాములవారు అయోధ్యలో కొలువు చేస్తున్నారు. ప్రతిరోజూ కొలువు చెయ్యడం ఆ నాటి ప్రభుధర్మం. ఆచారం. అప్పటి రోజుల్లో కొలువు చెయ్యడం అంటే, ప్రజల ఈతి బాధలు  విని, ఓదార్చి,వారిని మన్నించి, వాళ్ళ  అవసరాలకి ఆదుకోవడం. అంతే కానీ, “కొలువు,” అంటే ఇప్పుడు తెలుగుదేశంలో రాజకీయవేత్తలు పాటించే అర్థం కాదు. ఇప్పుడు, మంత్రిగారు కొలువు తీర్చి కూచున్నారు అంటే, అసలు అర్థం ఇది మస్తుగా లంచాలు మింగి, బ్రేవ్‌ మని త్రేన్చి, ఆ  రూపాయలన్నీ, నల్ల బజారులో తెల్ల డాలర్లు గా  మార్చి, అమెరికాలోనో, సింగపూరు లోనో,మేనల్లుళ్ళ పెళ్ళాల పేరిటో, మేనకోడళ్ళ మొగుళ్ళ పేరిటో బ్యాంకుల్లో దాచుకోవడం అని!

శ్రీరాములవారి, ఈ కొలువుకి ముందే, అప్పటికే, ఎవడో దారినపోయే దానయ్య సీతమ్మవారి శీలాన్ని శంకించడం, రోడ్డుమీద తాగుబోతు వాగుడు వాగడం జరిగింది. శ్రీరాములవారు,  ఆవిడని గంగానది ఆవలిగట్టున అడవుల్లోకి పంపించడం కూడా అయిపోయింది. సీతమ్మ తన శీలాన్ని,లంకలో అగ్నిపరీక్ష అయిన తరువాత కూడా, తిరిగి మరోసారి శంకించినందుకు కృద్ధురాలై, శపథం చేసి తల్లి భూదేవి వడిలోకి చేరుకోవడం అన్నీ జరిగిపోయాయి.వాల్మీకి గారు నెత్తీనోరూ మొత్తుకుంటూ, చెప్పుతూనే వున్నారు; సీతమ్మ శీలం శంకించవద్దని. అయినా,  ప్రజల మాటని, అది అపవాదయినా సరే! తోసిపుచ్చి
రాజ్యపాలన కొనసాగించడం ఇప్పుడు “లాలూ” మంత్రులకి చెల్లుతుందేమోగానీ, ఆ  రోజుల్లో  నిజాయితీవున్న రాజులకి చెల్లేది కాదు.  అప్పటి ప్రభువులకి అది ఆనవాయితీ కూడా కాదు.

సీతమ్మ రసాతలంలోకి వెళ్ళిన మరుక్షణం నించీ రాములవారి మనసు మనసులో వుండేది కాదు.  భూదేవి తన ముద్దుల బిడ్డని తాను  తీసుకోపోయిన రోజు నుంచీ శ్రీరాములవారికి పరధ్యాన్నం బాగా పెరిగిపోయింది. అందుకే అన్నారు; మానసిక బాధ భరించడం మానవులకే కాదు, దేవుడికైనా తప్పదూ, అని.

ఆరోజు శ్రీరాములవారు మామూలుగా సభలో రత్నఖచిత సింహాసనం మీద కూచున్నారు. ఆయన ఎడమపక్కన సింహాసనం  ఖాళీ! శ్రీరాముల వారి కుడిపక్కన యధావిధిగా లక్ష్మణ స్వామి నించొని వున్నాడు. దేవర వారి పాదాల దగ్గిర హనుమంతుడు “మరా మరా మరా…” అంటూ ధ్యానం చేస్తూ తలవంచుకొని కూచున్నాడు. అందరికీ అలవాటయిపోయిన మళయాళ రాజు రవివర్మగారి బొమ్మలా ముద్దొచ్చేట్టు ముచ్చటగా కనిపించటల్లేదు,ఈకొలువు. కొలువులో ఏదో చెప్పలేని వెలితి!  నిజం చెప్పాలంటే, అదేదో లోపించినట్టే ఉన్నది!!

ఆ రోజున ఒక వింత జరిగింది. మామూలుగా శ్రీరాములవారి ఎడమచేతి ఉంగరపువేలి మూడో కణుపుకి,  ప్రేయసి కన్నా ఘట్టిగా హత్తుకోపోయి  వుండే పెళ్ళినాటి వజ్రపుటుంగరం,  ఎందుకో, చటుక్కున జారి క్రింద పడి పోయింది. అదే! పెళ్ళిరోజున బంగారు పానకపు  బిందెలోనుంచి  శ్రీరాములవారు సీతమ్మచేతిని ముద్దుగా గిల్లేసి మరీ తీసుకున్న ఉంగరం! సీతమ్మని తలచుకుంటూ శ్రీరాములవారు ఆ వజ్రపుటుంగరాన్ని కుడిచేత్తో పరధ్యాసగా వేలిచుట్టూ అటూ ఇటూ తిప్పడం మూలంగా కాబోలు; ఉంగరం బిగువు కాస్తా తగ్గి సడలిపోయి వుండాలి! ఈ ఉంగరం భూమిమీద పడడం, అది ఒక  సన్నటి బొక్క చేసుకుంటూ సరసరా భూమిని దొలుచుకుంటూ భూమిలోకి జఱ్ఱున జెఱ్ఱిలా చొచ్చుకో పోవడం; అంతా ఒక్క క్షణంలో
జరిగిపోయింది. సీతమ్మ దగ్గిరకే తాను కూడా వెళ్ళీపోయిందేమో అన్నట్టుగా!

శ్రీరాములవారు వెంటనే హనుమంతుడిని పురమాయించారు “నా ఉంగరం క్రిందపడి  భూమిలోకి దొలుచుకో పోయింది. నువ్వు వెంటనే వెళ్ళి నా ఉంగరం వెతికి తీసుకో రావాలి,”  అని.

హనుమంతుడు అవసరమయితే నలుసంత చిన్న కోతిగానన్నా మారగలడు.లేదా, కావాలంటే, వింధ్య పర్వతమంత పేద్ధ కోతిగా కూడా  మారి పోగలడు. అది ఆయనకున్న వరం.

శ్రీరాములవారి ఆజ్ఞ!  హనుమంతుడు వెంటనే చిన్న నలుసంత కోతిగా మారిపోయి ఆ చిన్న బొక్కలోనుంచి తనూ దూసుకో పోయాడు. పోయి పోయి పోయి తిన్నగా పాతాళలోకం లో పడ్డాడు. అక్కడ బోలెడుమంది అమ్మాయిలున్నారు.వాళ్ళు ఈ బుల్లి నలుసంత కోతిని చూసి,  బుగ్గలమీద వేలేసుకొని,  “చూసావుటే! ఈ చోద్యం! ఈ చిన్న బుల్లి కోతిని?  ఎక్కడో పైనుంచి కింద పడ్డది. దీనిని, మన భూతాలరాజుగారికి కూర, పప్పు, పులుసూతో పాటు నంచుకోడానికి వడ్డిద్దాం,” అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ  హనుమంతుడిని పట్టుకొని, కంచంలో పెట్టి పాతాళభూతాల రాజు దగ్గిరకి తీసుకో పోయారు.

అక్కడ పాతాళంలో హనుమంతుడు అలా ఉండగా… ఇక్కడ భూలోకంలో వశిష్ఠుడు, బ్రహ్మదేవుడు, ఇద్దరూ  జంటగా అయోధ్యలో శ్రీరాముల వారి కొలువుకి వచ్చారు. ఒచ్చి, “చూడు శ్రీరామా! మేమునీతో చాలా రహస్యంగా కొన్ని విషయాలు మాట్లాడాలి. మేము నీతో మాట్లాడబోయే విషయాలు మరెవ్వరూ వినకూడదు.మనమధ్య ఈ సంభాషణ పూర్తి అయ్యేవరకూ ఎవ్వరూ లోపలకికూడా రాకూడదు. ఒకవేళ ఎవరన్నా పొరపాటుగానైనా సరే, మన రహస్య సంభాషణలకు భంగం కలిగిస్తే, వాళ్ళని నీవు వెంటనే వధించవలసి వస్తుంది!  మరి నీకు ఈ షరతు సమ్మతమేనా?” అని అడిగారు.  శ్రీరాములవారు వెంటనే, “అట్లాగే కానీయండి,” అని ఒప్పుకున్నారు. మరి హనుమంతుడు లేడు కదా! అందుకని, లక్ష్మణుడిని సింహద్వారం  దగ్గిర కాపలా పెట్టి, “లోపలికి పురుగునికూడా రానీయవద్దు,” అని హెచ్చరించారు.

లక్ష్మణుడు పెద్దగుమ్మం దగ్గిర కాపలాకున్న కొద్ది ఘడియల తరువాత, విశ్వామిత్రమహర్షి వచ్చి, “నేను వెంటనే రాముణ్ణి చూడాలి. ఇది చాలా ముఖ్యం. రాముడెక్కడ?” అని గద్దించాడు. తెలియనిది ఏమున్నది గనక? ఆయన గారికి అసలే ముక్కుమీద కోపం. లక్ష్మణుడు అతివినయంగా మహర్షికి నమస్కరించిన తరువాత చేతులుకట్టుకొని చెప్పాడు “లోపలికి ఇప్పుడు ఎవరూ పోవటానికి వీలు లేదు. శ్రీరాముల వారు ఎవరితోనో రహస్యంగా మంతనాలు చేస్తున్నారు. తమరు మరోసారి రావడం మంచిది,” అని ప్రాధేయ పడ్డాడు. విశ్వామిత్రుడు వెంటనే, “రాముడికి నాతో చెప్పకూడని రహస్యం ఏముంటుంది? నేను ఇప్పుడే లోపలికి వెళ్ళితీరాలి,” అని అన్నాడు. లక్ష్మణుడు, “నేను అన్నగారిని అడిగి, ఆయన అనుజ్ఞ తీసికోనిదే ఎవ్వరినీ లోపలకి వెళ్ళనీయలేను,” అని అన్నాడు. “అయితే తక్షణం లోపలికి పోయి రాముడికి చెప్పు, నేను వచ్చానని,” అని విశ్వామిత్రుడు మళ్ళీ గద్దించాడు. “రాముల వారు బయటికి వచ్చేవరకూ నేనే కాదు; ఎవ్వరూ లోపలికి పోరాదని నాకు మరీ మరీ చెప్పారు. అందుచేత మీరు కాస్సేపు ఓపికపట్టి వేచి ఉండండి,”  అని లక్ష్మణుడు అనంగానే, విశ్వామిత్రుడు తోకతొక్కిన తాచులా బుసకొడుతూ,”నువ్వు వెంటనే రాముడికి నేను వచ్చినట్టు చెప్పకపోతే, నేను అయోధ్య బూడిద పాలు కావాలని శపిస్తా! తరువాత నీ ఇష్టం” అంటూ బెదిరించాడు.

లక్ష్మణుడికి విశ్వామిత్రుడిని గురించి తెలియనిది ఏమున్నది గనుక! ముందు నుయ్యి, వెనకగొయ్యి అన్నట్టుగా ఇరకాటకంలో పడ్డాడు. “నేను లోపలికి పోతే, శ్రీరాముడు నన్ను వధించాలి. నేను లోపలికి పోకపోతే,ఈ కోపిష్టి మహానుభావుడు అయోధ్యలో పురుగుకూడా లేకండా బూడిద చేస్తాడు. దేశంలో అందరి మేలు కోసం నేను మరణించడమే మేలు,” అని తనలోతాను తర్కించుకొని, లక్ష్మణుడు లోపలికి వెళ్ళాడు.

“ఏమిటి విశేషం?” అని శ్రీరాములవారు ప్రశ్నించారు. “విశ్వామిత్ర మహర్షి, బయట పెద్దగుమ్మం దగ్గిర ఉన్నారు,” అని లక్ష్మణుడి సమాధానం.”వెంటనే వారిని లోపలికి పంపించు,” అని శ్రీరాముని ఆదేశం. విశ్వామిత్రుడు లోపలికి వచ్చాడు. వశిష్ఠుడు, బ్రహ్మ శ్రీరామునితో చేస్తున్నరహస్య సంభాషణలు అప్పటికే పూర్తి అయ్యాయి.వాళ్ళు శ్రీరాముడితో చెప్పిన  మాటల సారాశం ఇది “రామా! నీవు  కర్మానుసారిగా, ఈ భూలోకంలో చెయ్యవలసిన పని అంతా పూర్తి అయ్యింది. నీవు ఇక ఈ మానవావతారం చాలించి మళ్ళీ దేవతల్లో చేరవలసిన సమయం వచ్చింది. ఈ విషయం చెప్పడానికే మేము సురలోకం నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక మేము శలవు తీసుకుంటాము.”

వాళ్ళిద్దరూ వెళ్ళంగానే, లక్ష్మణుడు, “అన్నా! రామా! నువ్వు ఇప్పుడు నా శిరస్సు ఖండించాలి,” అని అన్నాడు. అందుకు శ్రీరాముడు,”లక్ష్మణా! నీ అపరాథం ఏమీ లేకుండా నీ శిరస్సు ఖండించడం దేనికి? బ్రహ్మ,వశిష్ఠులవారూ, వచ్చిన పని ఎప్పుడో పూర్తి అయ్యింది,” అని అన్నాడు.లక్ష్మణుడు, “శ్రీరామా! నీవు ఆడిన మాట తప్పని వాడవని అందరికీ తెలుసు. నేను నీ తమ్ముడిని గనుక నీవు నన్ను వధించడానికి వెనుదీయడం ధర్మం కాదు. శ్రీరాముడు మాటతప్పినాడన్న మాట, ఆ కళంకం, నా మూలంగా నీకు రాకూడదు. నీవు నీభార్యనే తిరిగి అడవులకు పంపినది మాట నిలబెట్టుకోవడం కోసమే కదా? నువ్వు ఇప్పుడు నన్ను శిక్షించక వదిలితే, నన్ను నేనే శిక్షించుకోవాలి. అనుజ్ఞ ఇవ్వు అన్నా! శలవు,” అని చెప్పి తను సరయూ నదికి వెళ్ళి మునిగి మరి తిరిగి కనిపించకుండ అంతర్థానం అయ్యాడు. లక్ష్మణుడు, శేషుని అవతారం! తన దేహం చాలించవలసిన సమయం వచ్చిందని తనకి తెలుసు!

లక్ష్మణుడు అట్లా దేహత్యాగం చేసిన తరువాత, శ్రీరాములవారు,లవకుశులకు పట్టాభిషేకం చెయ్యడానికి కావలసిన ఏర్పాటులన్నీచెయ్యమని విభీషణుడికి, సుగ్రీవుడికి, మిగిలిన ముఖ్య అనుచరులందరికీ చెప్పి,తనుకూడా సరయూ నదికి పోయి తన మానవ తనువు చాలించాడు.

ఇది ఇలా ఉండగా, హనుమంతుడు ఇంకా పాతాళలోకంలోనే ఉన్నాడు. మరి,తను, శ్రీరాములవారి ఉంగరం తేవాలిగదా! అది రామాజ్ఞ గదా!!  అక్కడే, ఆ పళ్ళెంలో కూచొని, “మరా మరా మరా…” అంటూ రామనామం జపిస్తూనే ఉన్నాడు.

భూతాలరాజు హనుమంతుడిని అడిగాడు
“నువ్వు ఎవడివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు?”
“నేను హనుమంతుడిని. శ్రీరాముని సేవకుడిని.”
“సరే! మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు?”
“నాదేవుడు రాముడి ఉంగరం గోతిలో పడి తిన్నగా ఇక్కడకి వచ్చింది. నాకు ఆ ఉంగరం ఇచ్చేస్తే, నేను నాపాలిటి పెన్నిధి రాముడి సన్నిధికి వెంటనే వెళ్ళిపోతాను,” అని హనుమంతుడు చెప్పాడు.

భూతాలరాజు పాతాళభైరవుడికన్నా భీకరంగా నవ్వి, “ఇదిగో! ఈ పళ్ళెం చూడు. ఇందులో ఉంగరాలన్నీ రాములవార్ల ఉంగరాలే! మరి నీ రాముడి ఉంగరం వెతికి తీసుకొని నువ్వు పైకి పోవచ్చు,” అన్నాడు మీసాలు మెలిపెట్టుకుంటూ!

బోలెడు ఉంగరాలతో నిండివున్న ఆ బంగారు పళ్ళెం చూసి, హనుమంతుడు బేజారెత్తి పోయాడు. “ఈ పళ్ళెంలో కొన్ని వేల ఉంగరాలున్నాయి. అన్నీచూడటానికి ఒకే మాదిరిగా ఉన్నాయే! వీటిలో నా రాముడి ఉంగరం ఏదో నాకు తెలియటల్లేదు,” అంటూ, బుఱ్ఱ గోక్కున్నాడు.

భూతాలరాజు అన్నాడు “చూడు! ఈ పళ్ళెంలో ఎన్ని ఉంగరాలున్నాయో,అంతమంది రాముళ్ళు ఉన్నారు. నువ్వు భూలోకానికి వెళ్ళేటప్పటికీ, నీ రాముడు తన అవతారం చాలించేసి ఉంటాడు. ఒక్కొక్క రాముడూ తన మానవావతారం చాలించడానికి ముందుగా ఆ రాముడి ఉంగరం నా పాతాళలోకానికి వస్తుంది. ఆ ఉంగరాలన్నీ జాగ్రత్తగా దాచి ఉంచడం నా పని, నా బాధ్యత! ఇక నువ్వు భూలోకానికి పోవచ్చు,” అని ముగించాడు.

హనుమంతుడు భూమి పైకి వచ్చాడు. అప్పటినించీ, మళ్ళీ రాముని అవతారం కోసం ఎదురుచూస్తూ “మరా మరా మరా…” అని ధ్యానంలో మునిగిపోయాడు, కిష్కింధాపురిలో ఓ కొండమీద!!

కథ కంచికీ, మనం ఇంటికీ!!
*** *** **

నేను తిరిగి నా భాషలో చెప్పిన పైపాతకథ; దాని అసలు కథా కమామీషు క్లుప్తంగా ఇది

హిందీలో ఒక జానపదకథగా ప్రచారంలో ఉన్న కథ పైకథ అని విస్కాన్‌సిన్‌ విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న శ్రీమతి కిరిణ్‌ నారాయణ్‌,చికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేసిన ఎ.కె. రామానుజన్‌ గారికి చెప్పింది. ఆయన, “మూడువందల రామాయణాలు,” అన్న వ్యాసంలో ఈ కథ ముచ్చటించి, కిరిణ్‌ నారాయణ్‌ కి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ వ్యాసం చదివాక, నేను “నా వాల్మీకిని,” ముఖ్యంగా నా వాల్మీకి ఉత్తరాకాండనీ, మళ్ళీ మళ్ళీ చదువుకున్నా! మీ వాల్మీకికీ, నా వాల్మీకికీ ఎన్నో తేడాలుండచ్చు. నా వాల్మీకి నా వాల్మీకే! మీ ఋషులు మీ వాళ్ళు; నా ఋషులు నా వాళ్ళు! మీకు కాలపురుషుడూ, దూర్వాసుడూ ఇష్టమయితే, వాళ్ళగురించే రాసుకోండి. అసలు విషయాన్ని పక్కకి నెట్టకండి.

పోతే, రాముడు, సీత, దశగ్రీవుడు, హనుమంతుడూ, రామాయణకథలో ముఖ్యపాత్రలు. సరిగా వినండి. ముఖ్య పాత్రలు. ఈ ముఖ్య పాత్రలని వాడుకొని ముచ్చటగా మరెన్నో రామాయణ కథలు చెప్పుకోవచ్చు. అయితే, ముఖ్య పాత్రలకున్న పరిధులు తోసిపుచ్చి, కొత్త కొత్త పరిధులు కల్పించి కథలు చెప్పడం మొదలుపెడితే, అసలు కథకే ముప్పు. ఉదాహరణకి ఈ నానుడి చూడండి

“కుక్క కాటుకి చెప్పు దెబ్బ,” అని అందరికీ తెలుసు; అది అందరూ రాసే పద్ధతి.పోతే, కొత్త కథకుడు కొత్తదనం కోసం, “చెప్పుదెబ్బే కదా! కుక్కకాటుకి,” అని రాస్తే, అసలు నానుడి అర్థం మొత్తంగా తిరకాసు కాలేదు. అంతకి మితిమీరి, కవిగారి లైసెన్స్‌ అనుకుంటూ, చెప్పుకుక్కకి కాటుదెబ్బ అనో, చెప్పుకాటుకి కుక్కదెబ్బ అనో రాసి మురిసిపోతే, వాక్యం దెబ్బతినదు గానీ, అసలు ఆ నానుడి అర్థం దెబ్బ తింటుంది గదా! మరి ఆ నానుడికి ఉన్న సొంపు ఏం కావాలి? అందుకని,రామాయణంలో ముఖ్య పాత్రల పేరులు వాడుతూ, కొత్తదనం కోసం రామాయణాలు రాస్తే, అందులో కొన్ని రామాయణాల కథలు కొందరికి ఇంపు; మరికొన్ని రామాయణాల కథలు అందరికీ అనింపూ అవడం సహజమేగా!

నా ఈ రామాయణం కథ నాకు సొంపు.
ఇతి.
----------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో(2000 July)

No comments: