Sunday, November 11, 2018

శ్లోకము - 1


శ్లోకము - 1
సాహితీమిత్రులారా!

శ్లోకం గురించిన వ్యాసంలో మొదటి భాగం ఆస్వాదించండి.........

పరిచయము
భవభూతి వ్రాసిన ఉత్తరరామచరిత నాటకములో రెండవ అంకపు ప్రారంభ విష్కంభములో ఆత్రేయి అను ఒక తాపసి దండకారణ్యమును ప్రవేశించగా, వనదేవత ఆమెకు అతిథి సత్కారములను చేసి ఆమె రాకకు కారణ మడుగగా, ఆమె తాను వాల్మీకి ఆశ్రమమునుండి వస్తున్నానని, అగస్త్యాది మునుల దర్శనము చేసికొని వారివద్దనుండి వేదవిద్య నేర్చుకోవాలని తలబోస్తున్నాని చెప్పుతుంది. అప్పుడు ఆ వనదేవత ‘అన్నియు తెలిసిన వాల్మీకి ఉండగా, ఆ మహర్షి వద్ద నేర్చుకోక ఇక్కడికి ఎందుకు వచ్చావు?’ అని అడుగుతుంది. అక్కడ వాల్మీకికి కాలమంతా కుశలవులు అనే ఇద్దరు పిల్లలను పెంచి, పోషించి, వాళ్లకు విద్య నేర్పడములోనే గడచిపోతున్నదని, అంతేకాక ఆ ఇరువురితో సమానముగా తాను నేర్చుకోలేననియు, అది మాత్రమే కాక వాల్మీకి కాలము రామాయణ రచనలో సాగిపోయినదని కూడ చెబుతుంది.

సంభోగలోనున్న క్రౌంచ మిథునమును ఒక బోయవాడు తన బాణముతో పడగొట్టడము చూచి వాల్మీకి మహర్షి ఆశువుగా ఒక శ్లోకమును చెప్పినాడని, ఆ శ్లోకమును విన్న బ్రహ్మదేవుడు ‘వాగ్బ్రహ్మమునందు ఎఱుకగలవాఁడ వైతివి. కావున రామచరితమును వర్ణింపుము. నీ ప్రతిభాచక్షుస్సు ఆర్షమును, అవ్యాపహతజ్యోతియును. మొదలి కవివైతివి,’ అని వచించెనని, అనంతరము భగవంతుఁడు ప్రాచేతస మహర్షి మనుష్యులయందు మొదటిదైన యట్టి యా శబ్దబ్రహ్మపరిణామమున రామాయణమును రచించెనని మన కావ్యములు చెబుతున్నవి.

ఆ శ్లోకమే సంస్కృతములో-

మా నిషాద ప్రతిష్ఠాం త్వం
అగమః శాశ్వతీః సమః
యత్క్రౌంచమిథునాదేకం
అవధీః కామమోహితమ్ – (భవభూతి ఉత్తరరామచరితము, 2.05)

దీనిని శ్లోకరూపములోనే వేదము వేంకటరాయ శాస్త్రిగారు తెలుగులో క్రింది విధముగా అనువదించినారు:

ఓ నిషాద, ప్రతిష్ఠన్నీ
వొందుదో శాశ్వతాబ్దముల్
కామమోహిత మేకంబున్
గ్రౌంచయుగ్మానఁ జంపుటన్

వనదేవత దీనిని ‘నూతనఛందసామవతారః’ అని చెప్పినది. ఇదియే మనము సామాన్యముగా వ్యవహరించే అనుష్టుప్పు శ్లోకము. ఇది ఒక కొత్త ఛందస్సు అవతారముగా పేర్కొనబడినది.

శ్లోక లక్షణములు
మహాకవి కాలిదాసు వ్రాసినదని చెప్పబడే శ్రుతబోధలో శ్లోక లక్షణములు ఈ విధముగా నివ్వబడినవి –

పంచమం లఘు సర్వత్ర
సప్తమం ద్విచతుర్థయోః
షష్ఠం గురు విజానీయాత్
ఏతత్పద్యస్య లక్షణమ్ – (శ్రుతబోధ, 9)

శ్లోకే షష్ఠం గురు జ్ఞేయం
సర్వత్ర లఘు పంచమమ్
ద్విచతుష్పదయోర్హ్రస్వం
సప్తమం దీర్ఘమన్యయోః – (శ్రుతబోధ, 10)

శ్లోకములోని అన్ని పాదములను రెండు భాగములుగా విభజించవచ్చును. రెండవ భాగములోని గురు లఘువుల అమరికను గుఱించిన లక్షణములు పైన ఇవ్వబడినవి. అన్ని పాదాలలో ఐదవ అక్షరము లఘువు, ఆఱవ అక్షరము గురువు. కాని బేసి పాదములలో ఏడవ అక్షరము గురువు, అదే ఏడవ అక్షరము సరి పాదములలో లఘువు. నేను వీటినే మఱొక విధముగా విశదీకరిస్తాను. సరి పాదములలో (2, 4 పాదములు) 5, 6, 7 అక్షరములు జ-గణము, బేసి పాదములలో (1, 3 పాదములు) 5, 6, 7 అక్షరములు య-గణము. వీటిని రెంటిని చేర్చి శ్లోకమును నేను ‘జయ’ అని పిలుస్తాను. ఈ జయనామము జ్ఞాపకము పెట్టుకొనుటకు కూడ ఉపయోగ పడుతుంది. ఈ లక్షణములలో శ్లోక పాదములయందలి మొదటి నాలుగు అక్షరముల ప్రసక్తి లేదు. దానిని గుఱించి తఱువాత చెప్పుతాను.

సరి పాదములు:
శ్లోకములోని సరి పాదములలోని చివరి నాలుగు అక్షరముల అమరిక వేదకాలమునుండి మారకుండా ఉన్నది. చివరి నాలుగు అక్షరాలు IUIU, అనగా రెండు లగములు. ఇది వేదములలో వాడిన గాయత్రీ ఛందస్సులోనిది. గాయత్రిలో మూడు పాదములు, ప్రతి పాదములో 8 అక్షరములు. గాయత్రి అనగా పాడదగిన (గాయః) మూడు (త్రి) పాదములు అని అర్థము. క్రింద ఋగ్వేదమునుండి ఉదాహరణములు. నా అనువాదములు కచ్చితములు కావు.

అగ్నిర్హోతాం కవిక్రతుః
సత్యాశ్చిత్రాశ్రవస్తమః
దేవో దేవేభిరాగమత్ – (ఋగ్వేదము, 1-1-5)

(జ్ఞానబుద్ధిప్రదాతా స-
త్యానుశీలన భాస్వరా
దేవులతోడ దేవ రా)

ఉపత్వాగ్నే దివేదివే
దోషావస్తర్ధియా వయమ్
నమో భరంత ఏమసి – (ఋగ్వేదము, 1-1-7)

(తిమిరాంతక నిత్యమున్
నమనమ్ముల నిత్తు మో
హిమరాతీ స్తుతించుచున్)

పాదమునకు ఎనిమిది అక్షరములతో, చివర IUIUలతో ఉండే అమరిక గ్రీకు ఛందస్సులో కూడ ఉన్నది. దీనిని వారు గ్లైకానిక్ (glyconic) అంటారు.

ఋగ్వేదములో అనుష్టుప్పు చతుష్పదులు: పాదమునకు ఎనిమిది అక్షరములు ఉండే అనుష్టుప్పు ఛందస్సుకు చెందిన చతుష్పదులు కూడ ఋగ్వేదములో నున్నవి. 5, 6, 7 అక్షరముల గణస్వరూపము య-గణము కాక వేఱైనప్పుడు దానిని కుండలీకరణములలో తెలిపినాను. ఉదాహరణమునకు పురుషసూక్తమునుండి మొదటి చతుష్పది-

సహస్రశీర్షా పురుషః
సహస్రాక్షః సహస్రపాత్
సభూమిం విశ్వతో వృత్వా
(అ)త్యతిష్ఠద్దశాంగులమ్ – (ఋగ్వేదము, 10-90-1) (మొదటి పాదములో 5,6,7 అక్షరములు – భ-గణము)

(వేయి తలలుండుఁ గదా
వేయి కన్నుల్ పదమ్ములున్
ఆయతమ్మగు విశ్వమ్మున్
జేయి కప్పి మిగుల్చుఁగా)

సముద్రాదర్ణవాదధి
సంవత్సరో అజాయత
అహోరాత్రాణివిదధత్
విశ్వస్య మిషతో వశీ – (ఋగ్వేదము, 10-190-2) (మొదటి పాదము – జ-గణము, మూడవ పాదము – న-గణము)

(ఆయుదాకరమందున
హాయనమ్ము జనించఁగా
నాయహోరాత్రముల ని-
ర్ణాయకుండు సృజించెఁగా)

ఇందులో సరి పాదముల చివర త్రిపద గాయత్రిలోవలె రెండు లగములు ఉన్నాయి. కాని బేసి పాదములలో ఆ అమరిక మొదటి దానిలో, మొదటి పాదములో UIIU. శ్లోకమునందలి IUUI లేక IUUU మొదటి పాదములో లేదు. రెండవదానిలో మొదటి పాదములోలో IUII, మూడవ పాదములో IIIU. శ్లోకమునందలి IUUI లేక IUUU ఈ అమరికలలో అన్ని చోటులలో లేవు.

క్రింది అనుష్టుప్పును గమనిస్తే, దీనికి శ్లోకమునకు అమరికలో భేదము లేదు (బేసి పాదముల చివర IUUU, IUUI, సరి పాదముల చివర IUIU).

వాయురస్మా ఉపామంథత్
పినష్టిస్మా కృనన్నమా
కేశీవిషస్య పాత్రేణ
యద్రుద్రేణ పిబత్సహ – (ఋగ్వేదము, 10-136-7)

(వాయువు వంగని వాటిని కూడ విఱిచి మథించగా, కేశవుడు, రుద్రునితో పాత్రనుండి తాగినారు.)

దీనిని బట్టి శ్లోకపు మూస వేదములలో క్రమక్రమముగా మార్చబడినది, కూర్చబడినది.

ఇతిహాసము, కావ్యములలో అనుష్టుప్పు ప్రత్యేకతలు: మహాభారత రామాయణములలో కూడ శ్లోకపు మూసకు బదులు అక్కడక్కడ బేసి పాదములలోని 5, 6, 7 అక్షరములకు య-గణమునకు బదులుగా మిగిలిన గణములతో నున్నవి. క్రింద కొన్ని ఉదాహరణములు:

అహింసా సత్యవచనం
క్షమాచేతి వినిశ్చితమ్
బ్రాహ్మణస్య పరో ధర్మో
వేదానాం ధరణాదపి – (వ్యాసభారతము, 1-11-14) (మొదటి పాదము – న-గణము)

(బ్రాహ్మణుడు సాధు ప్రవర్తనతో, సత్యవంతుడై, క్షమార్హత కలిగినవాడై, వేదములను విధి తప్పక అభ్యసించు వాడై ఉండాలి.)

గరుడోఽపి యథాకాలం
జజ్ఞే పన్నగసూదనః
స జాతమాత్రో వినతాం
పరిత్యజ్య స్వమావిశాత్ – (వ్యాసభారతము, 1-14-22) (మూడవ పాదము – భ-గణము)

(గరుత్మంతుడు గుడ్డునుండి సరియైన సమయాన బయటికి వచ్చి పాములను చంపుటకై పుట్టినాడు. పుట్టగానే తల్లిని విడిచి, వెలుగును వెతుకుచు, వెళ్లినాడు.)

ధృష్టకేతుశ్చేకితానః
కాశిరాజశ్చ వీర్యవాన్
పురుజిత్కున్తిభోజశ్చ
శైవ్యశ్చ నరపుంగవః – (భగవద్గీత, 1.05) (మొదటి పాదము – ర-గణము)

(వాళ్లు గొప్ప వీరులు–ధృష్టకేతువు, చేకితానుడు, కాశిరాజు. అదే విధముగా పురుజిత్తు, కుంతిభోజుడు, శైవ్యుడు నరోత్తములు.)

యావానర్థ ఉదపానే
సర్వతః సంప్లుతోదకే
తావాన్సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః – (భగవద్గీత, 2.46) (మొదటి పాదము – స-గణము)

(చిఱుకోనేటి విధమ్మై
సరోవరపు వారియున్
వరవేదమ్ములట్లే యా
పరబ్రహ్మము తెల్పుఁగా)

అయమ్ స కాలః సంప్రాప్తః
సమయోఽద్య జలాగమః
సంపశ్య త్వం నభో మేఘైః
సంవృతం గిరి సంనిభైః – (వాల్మీకి రామాయణము, 4.28.2) (మొదటి పాదము – మ-గణము)

(లక్ష్మణా, దీనిని గుఱించి ఇంతకుముందే మనము ఆలోచించినాము. ఆ వర్షర్తువు ఆసన్నమైనది. ఆకాశమును చూస్తే, అక్కడ కొండలవలె మేఘాలు గుమిగూడి ఉన్నాయి.)

మేఘ కృష్ణాజిన ధరా
ధారా యజ్ఞోపవీతినః
మారుతాఽపూరిత గుహాః
ప్రాధీతా ఇవ పర్వతాః – (వాల్మీకి రామాయణము, 4.28.10) (బేసి పాదములు – న-గణము)

(మేఘములు కృష్ణాజినములువలె, వర్షధారలు యజ్ఞోపవీతములవలె, వీచే గాలితో నిండిన కొండగుహలు కంఠస్వరాలవలె, ఆ కొండలు వేదములను నేర్చుకొనే విద్యార్థులవలె కనబడుతున్నాయి.)

కావ్యాలలో కూడ ఇట్టి మార్పులతో శ్లోకములు ఉన్నాయి. మచ్చుకు రెండు ఉదాహరణములు:

తతో ముహూర్తాభ్యుచితే
జగచ్చక్షుషి భాస్కరే
భార్గవస్యాశ్రమపదం
స దదర్శ నృణాం వరః – (అశ్వఘోషుని బుద్ధచరితము, 6.1) (మొదటి పాదము – భ-గణము, మూడవ పాదము – న-గణము)

(జగన్నేత్రుఁడాశుగుఁడు
గగనానఁ గనంబడన్
భృగుశ్రేష్ఠు వసనమున్
సుగతుండప్డు గాంచెఁ దాన్)

సంపత్స్యతే వః కామో౽యం
కాలః కశ్చిత్ప్రతీక్ష్యతామ్
న త్వస్య సిద్ధౌ యాస్యామి
సర్గవ్యాపారమాత్మనా – (కాలిదాస కృత కుమారసంభవము, 2.54) (బేసి పాదములు – మ-గణము)

(నీ కోరిక నెరవేరుతుంది, అయితే నీవు దానికి వేచి ఉండాలి. నేనే ప్రత్యేకముగా అట్టి సృజనలో పాల్గొనను.)

మనము నిత్యము పఠించు దైవప్రార్థనాశ్లోకములలో కూడ కొన్ని ఇట్టివి కలవు. రెండు ఉదాహరణములు:

అగజానన పద్మార్కం
గజాననమహర్నిశమ్
అనేకదం తం భక్తానా
మేకదంతముపాస్మహే (మూడవ పాదములో – మ-గణము)

జయ మాతంగతనయే
జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే
జయ లీలాశుకప్రియే (బేసి పాదములలో – న-గణము)
-----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: