Sunday, November 25, 2018

బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు


బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు




సాహితీమిత్రులారా!

రావి కొండలరావు నటుడు, దర్శకుడు, రచయిత. నాటకం, సినీమా, టీవీ, పత్రికలు, ఇలా అన్ని రంగాలలోనూ విశేష అనుభవం ఉన్నవాడు. మిమిక్రీ కళాకారుడు. ప్రతి రంగంలోనూ నైపుణ్యం, పేరు ప్రఖ్యాతులూ గడించిన వాడు. ఎటువంటి భేషజాలూ లేకుండా 75 ఏళ్ళు దాటిన వయసులో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో క్రియాశీలంగా ఉంటూ జీవిస్తున్న వ్యక్తి. నిరాడంబరంగా, కలుపుగోలుగా ప్రవర్తించే సజ్జనుడు. ఆయన రచనలూ, నటనా అన్నీ చదువుకోవడానికీ, తిలకించ డానికీ హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. మనసును కలవరపెట్టే రచనా, ఒళ్ళు గగుర్పొడిపించే నటనా ఆయన ధోరణికి సరిపడవు. ఆయన రాసిన నాటికలూ, నాలుగైదు వందల సినిమాలకు రాసిన సంభాషణలు (స్క్రీన్‌ప్లే) ఆయన సుదీర్ఘ కృషిని సూచిస్తాయి. 1958లో ‘శోభ’ చిత్రంతో మొదలైన ఆయన సినీ నటనకు ఈమధ్యనే 50 ఏళ్ళు నిండిన సందర్భంగా ముంబయి, విజయవాడ తదితర నగరాల్లో ఆయనకు ఘనసన్మానాలు జరిగాయి.

రావి కొండలరావుగారు పుట్టినది సామర్లకోటలో. వారి తండ్రిది పోస్టుమాస్టరు ఉద్యోగం కనక తరుచుగా బదిలీలు అవుతూ ఉండేవి. ఆ కారణంగా ఆయన పాఠశాల చదువు కాకినాడలో మొదలై, అనేక ఊళ్ళలో కొనసాగింది. ఆయనకు అన్నయ్యలైన ఆర్.కె.రావు, రావి చలం (ఈయన జంషెడ్‌పూర్ నాటకరంగంలో ప్రసిద్ధుడు) ల ప్రభావం ఆయన మీద ఉండేది. కొండలరావు పదేళ్ళ లోపు వయసులో స్కూలు నాటకాల్లో వేసినపుడు ఆయన తండ్రి ఏమీ అనలేదుగాని బైటి సమాజాల్లో ఆడినప్పుడు మాత్రం సహించేవారు కారట. ఆయన చిన్నప్పుడు ఒకసారి తండ్రికి తెలియకుండా ఒక అన్నయ్య ఒక నాటికలో కొండలరావు చేత ఆడపాత్ర వేయించారట. ఆ ప్రదర్శనకు తండ్రి హాజరవుతాడని వాళ్ళకి తెలియదు. కొడుకును గుర్తుపట్టని తండ్రి స్టేజికేసి చూస్తూ పక్కనున్న వ్యక్తితో “వీడెవడో బాగానే చేస్తున్నాడే?” అన్నాడట. అప్పుడా పక్కనున్నాయన “అదేమిటండీ వాడు మీవాడేగా?” అన్నాట్ట. అంతే! పెద్దాయన ఉగ్రుడైపోయి స్టేజి మీదికి వెళ్ళి కొడుకు విగ్గు పట్టుకుని పీకేసి, కొట్టి, వీధులవెంట తరిమాడట. ప్రేక్షకులు ఇదేదో ‘కొత్త పాత్ర ప్రవేశం’ అని కూడా అనుకున్నారట. అప్పటికి ఆయన వయసు పదేళ్ళే.

తండ్రిగారి చివరి పోస్టింగు శ్రీకాకుళం కావడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. అన్నయ్య ఏకపాత్రాభినయంలో చిన్న చిన్న సహాయపాత్రలు వెయ్యడం, కన్యాశుల్కంలో వెంకటేశంగా నటించడం, చిన్నచిన్న కథలు రాయడం వగైరాలన్నీ కొండలరావు పిన్నవయసు ముచ్చట్లు. తండ్రిగారు చనిపోయాక నాటకాల్లో వెయ్యడానికి అడ్డు తొలగినట్టయింది.

స్కూల్లో ఉన్నప్పుడే కొండలరావుకు ఆరెస్సెస్ (R.S.S.) అభిమానం ఉండేది. గాంధీజీ హత్యానంతరం హిందూమహాసభ తదితర సంఘాల మీద విధించిన ఆంక్షలకు నిరసన తెలుపుతున్న ఇతర కుర్రాళ్ళతో బాటుగా అతన్నికూడా పోలీసులు అదుపులోకి తీసుకుని మూణ్ణెల్లు రాజమండ్రి జైలులో ఉంచారు. అదొక అద్భుతమైన పరిణామానికి అనుకోకుండా దారితీసిందని కొండలరావు అంటారు. చదువుకోవలసి రావడం వగైరాలేవీ లేకపోవడంతో టీనేజిలో ఉన్న కొండలరావుకు జైలు లైబ్రరీలో తెలుగు సాహిత్యం చదివేందుకు మంచి అవకాశం దొరికింది. ఆధునిక కథకుల్లో ప్రసిద్ధులందరి రచనలూ అతనక్కడ చదివి, అర్థం చేసుకుని ఆనందించాడు. ఆ విధంగా అతనికి స్వయంగా రచనలు చేసేందుకు తగిన స్ఫూర్తి లభించింది. కొడవటిగంటి కుటుంబరావు తదితరుల కథలు ఆదర్శంగా భావించి చేసిన ప్రయత్నాల ఫలితంగా చక్రపాణి నడిపిన యువ పత్రికలో 1949లో అతని కథ ఒకటి అచ్చయింది. దానితో ఉత్సాహం పెరిగింది.

ఆ ఊపుతో అతని చిన్న కథలూ, నాటికలూ అచ్చులో రాసాగాయి. కాలేజి లెక్చరర్ల ప్రోత్సాహంతో వారి అవసరార్థం అతను రాసిన ‘స్వయంవరం’ అనే స్త్రీ పాత్ర లేని నాటికను అందరూ మెచ్చుకున్నారు. వారిలో దాడి గోవిందరాజులు నాయుడు వంటి పెద్దలుకూడా ఉన్నారు. ఆయన జిల్లా జడ్జి, నటుడు కూడా. ఆ తరవాత కొండలరావు ‘కుక్కపిల్ల దొరికింది’ నాటిక రాశారు.

ఇంతలో, మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ ఉద్యోగానికి అభ్యర్థులను విశాఖపట్నంలో ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలిసి కొండలరావు కూడా వెళ్ళారు. శ్రీశ్రీ,, ఆరుద్ర మొదలైనవారు లోగడ పనిచేసిన పత్రిక అది. సబ్ఎడిటర్ ఉద్యోగానికి కొండలరావు ఎంపికయ్యారు. 1956లో మద్రాసులో ఆరు నెలలపాటు ఆనందవాణి ఆఫీసులో కూర్చుని వచ్చిన కథలని చదివి, వాటిలో మంచివాటిని ఏరిపెట్టడమే ఆయన పని. ఆఫీసులోనే ఉద్యోగం, నివాసం కూడా. కానీ, పత్రిక ఎక్కువకాలం నడవలేదు. అంతకుముందు 1948లో మద్రాసు వెళ్ళినప్పుడు ‘బాల’ పత్రికలో బొమ్మలు వేస్తున్న బాపూతోనూ, ముళ్ళపూడి వెంకటరమణతోనూ పరిచయం ఏర్పడింది. అప్పటికి అందరూ నిక్కర్లు వేసుకునే వయసువాళ్ళే.

ఆనందవాణి ఆఫీసుకి ఆంధ్రపత్రిక ఆఫీసు దగ్గరలోనే ఉండేది. కొండలరావుకి అందులో పనిచేస్తున్న కొడవటిగంటి కుటుంబరావు, నండూరి రామమోహనరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి మొదలైనవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే పిలకా గణపతిశాస్త్రి, తిరుమల రామచంద్ర తదితరులను కలుసుకున్నారు. ఆంధ్రపత్రికలో కొండలరావు కథలు కొన్ని అచ్చువేశారు. ఇవికాక తెన్నేటి సూరి నిర్వహిస్తున్న భారతి పత్రికలో ‘స్వయంవరం’, ‘కుక్కపిల్ల దొరికింది’ నాటికలు రెండూ అచ్చవడంతో కొండలరావుకు కొత్తవారిని కలుసుకున్నప్పుడల్లా స్వపరిచయం సులువయింది. ఒక సందర్భంలో ఆరుద్రకు ఎవరో పరిచయం చేసినప్పుడు తాను ఫలానా అని చెప్పగానే ఆరుద్ర వెంటనే “‘కుక్కపిల్ల దొరికింది’ రాసినది మీరేకదా” అంటూ పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళారట.

‘కుక్కపిల్ల దొరికింది’ నాటిక అచ్చవగానే చాలా ప్రజాదరణ పొందింది. నేను మద్రాసులో స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే (1957 ప్రాంతాలలో) ఆ నాటిక మా స్కూల్లో ప్రదర్శించారు. సులువుగా చెప్పగలిగిన డైలాగులతో, సున్నితమైన హాస్యంతో అది అందరికీ నచ్చిన హాస్యనాటిక. 1961లో మద్రాసు చిల్డ్రన్స్ థియేటర్లో ఈ నాటికను కొండలరావుగారే స్వయంగా వేశారు. అందులో నౌకరు కుర్రాడుగా నటించిన చాకులాంటి అబ్బాయి అందర్నీ ఆకర్షించాడు. అతనే రాజబాబు. త్వరలోనే అతను సినిమాల్లో బిజీ కమెడియన్‌గా స్థిరపడడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

ఆంధ్రపత్రికలో కొండలరావుకు ఉద్యోగం మటుకు రాలేదు. ఎందుకంటే ఒక్క ముళ్ళపూడి వెంకటరమణగారిని తప్ప డిగ్రీ లేనివారినెవరినీ వారు తీసుకునేవారు కాదు. అందుకని కొండలరావుకు అక్కడ అవకాశం లభించలేదు. ఆయన కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. అంతకు ముందు ఒకసారి 1954లో హైదరాబాదులో కొండలరావు ప్రఖ్య శ్రీరామమూర్తి రాసిన ‘కాళరాత్రి’ నాటకంలో నటించినప్పుడు సినీరచయిత డి.వి.నరసరాజుగారు జడ్జిగా వచ్చారు. ఆంధ్రనాటకపరిషత్తు నిర్వహించిన ఆ ప్రదర్శనలో జె.వి.సోమయాజులు, రమణమూర్తి తదితరులు కూడా నటించారు. కొండలరావు ఆ పరిచయాన్ని పురస్కరించుకుని నరసరాజుగారిని మళ్ళీ 1956లో మద్రాసులో కలుసుకున్నారు. ఆయన సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది.

అంతకుముందే కొండలరావు కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాసివచ్చారు. అయితే తెలుగు సినిమాల్లో పనిచెయ్యడం అదే మొదటిసారి. స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో పని తక్కువగా ఉండడంతో దర్శకత్వం వహిస్తున్న కమలాకర కామేశ్వరరావు కొండలరావును తనకు అసిస్టెంటుగా కూడా పని చెయ్యమని పిలిచారు. ఎన్.టి.రామారావు, అంజలీదేవి, రమణారెడ్డి తదితరులు నటిస్తున్న ఒక సన్నివేశంలో ఒక డాక్టరు పాత్ర అయోమయంగా నటించాలి. మామూలుగా డాక్టరు పాత్రలు వేసే ఒకతను అలా చెయ్యలేక తడబాటుపడి, కొండలరావునే వేసెయ్యమని ప్రాధేయపడ్డాడు. ఆ విధంగా కామేశ్వరరావు సలహాతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు.

ముద్దుకృష్ణ సహకారంతో కొన్ని సినిమాల్లో సహకార దర్శకుడిగా అవకాశాలొచ్చాయి. ఆ తరవాత ‘పూజాఫలం’ వంటి సినిమాల్లో బి.ఎన్.రెడ్డిగారితో పనిచేసే అవకాశాలొచ్చినప్పటికీ ఆయన పెట్టే ఆంక్షలు కొండలరావుకు ఇబ్బందికరంగా ఉండేవి. అప్పటికి ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. జరుగుబాటు కోసం ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. పని ఉన్నా లేకపోయినా డబ్బింగ్ వగైరాలకు తమ ఆఫీసు నుంచి ఎక్కడికీ వెళ్ళరాదని రెడ్డిగారు కోప్పడేవారు. అందుచేత ఆయనతో కష్టమనిపించేది. కొండలరావు బి.ఎన్. గారి ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు పైన హాలులో తన బృందంతో నాలుగిళ్ళ చావిడి నాటకం రిహార్సల్సు వేసుకునేవారట; బి.ఎన్. దానికి అనుమతించడమేకాక కొత్తగా హీరో వేషానికని వచ్చిన చంద్రమోహన్‌ను నాటకం రిహార్సల్సు చూసి నటనలో మెళుకువలు నేర్చుకోమనికూడా చెప్పేవారట.

‘నర్తనశాల’ తీస్తున్నప్పుడు కమలాకర కామేశ్వరరావు మళ్ళీ కొండలరావును పిలిచారు. రంగారావు, రామారావు, సావిత్రి తదితరులకు సెట్టు మీద సన్నివేశాన్ని వివరించడం, డైలాగులు చెప్పించడం కొండలరావు పని. మహాభారతం పద్యాలకు వాళ్ళు అర్థాలు అడుగుతారని ఆయన ముందురోజునే రచయిత సముద్రాల సీనియర్‌తో కూర్చుని పద్యాల అర్థాల వివరాలు తెలుసుకునేవారు. నాలుగు పేజీల డైలాగ్‌ని రంగారావు అవలీలగా అర్థం చేసుకుని, గుర్తుంచుకుని చెప్పేవారని కొండలరావు అన్నారు. అటువంటి మహానటులతో పనిచెయ్యడం మరుపురానిదని ఆయన ఇప్పటికీ అంటారు.

సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆ విధంగా ఆదుర్తి తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో ఒక డాక్టరు వేషం లభించింది. దాని తరవాత రామారావు వంటి పెద్దనటులతో తనకున్న పరిచయాల ద్వారా క్రమంగా చాలా సినిమాల్లో వేషాలు వెయ్యసాగారు. ఒక సందర్భంలో పి.పుల్లయ్య తీసిన ‘ప్రేమించి చూడు’లో అవకాశం వచ్చింది. దీన్ని గురించి కొంత కథ జరిగింది. తక్కిన వ్యాపకాలు ఎన్ని ఉన్నా కొండలరావు హాస్య ప్రియత్వం ఏ మాత్రం తగ్గలేదు. శ్రీకాకుళంలో తన చిన్నప్పటి తెలుగు మేస్టరు మిమిక్రీని ఆయన అందరికీ వినిపిస్తూ ఉండేవారు. మద్రాసులో మా ఇంట్లోనూ, బాపూ, రమణలున్న ఇతర ఇష్టాగోష్ఠుల్లోనూ ఇది తప్పక జరిగే వ్యవహారం. నాటక, సాహితీ రంగాల్లోని స్నేహితులేకాక చాలామంది సినీప్రముఖులు అది విని ఆనందించేవారు. ఇదెంతవరకూ వెళ్ళిందంటే ఆ రోజుల్లోనే ఆసక్తి పట్టలేక ఆరుద్ర శ్రీకాకుళం దాకా వెళ్ళి సదరు మాస్టార్ని కలుసుకుని మరీ వచ్చారు. ఎవరి మాటా వినిపించుకోకుండా, దబాయింపు ధోరణిలో “సాయ్‌లెన్స్” అని కేక పెట్టే తెలుగు మేస్టరుది ఒక వింత స్వభావం.

ఈ వైఖరి కలిగిన పాత్రగా ముళ్ళపూడి వెంకటరమణ ప్రేమించిచూడులో నాగేశ్వరరావు తండ్రి పాత్రకు డైలాగులు రాశారు. పి.పుల్లయ్యకు ఈ నేపథ్యమేమీ తెలియదు. రమణ మాట విని ఆయన కొండలరావును తన ఆఫీసుకు పిలిపించి, మొదటిసారిగా చూస్తూనే “గెటవుట్” అని కేకలేశారట. “ఇంత చిన్నవాడివి నాగేశ్వరరావుకు తండ్రిగా నువ్వేం పనికొస్తావు” అని పంపేశారట. రమణ సిఫార్సు చేసినట్టు తెలిసి కుటుంబరావుగారు కూడా కొండలరావును తనతో మళ్ళీ తన పాత మిత్రుడైన పుల్లయ్య దగ్గరికి తీసుకెళ్ళి, “ఇతని మిమిక్రీ నువ్వు చూడలేదు, నా మాట విని అతనికా వేషం ఇయ్యి” అని గట్టిగా చెప్పాకగాని పుల్లయ్య సరేననలేదట. చిత్రం రిలీజయాక ఆ కామెడీ పాత్ర అందరికీ నచ్చింది.

తక్కిన సినీనటుల్లాగా కాకుండా కొండలరావు తన నాటక, సాహితీరంగాల కృషిని విడిచి పెట్టలేదు. కుటుంబరావుగారి ద్వారా కొండలరావుకు చందమామవారి విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా ఉద్యోగం వచ్చింది. విజయచిత్రలో పాఠకుల ప్రశ్నలకు ఆయన జవాబులు రాసేవారు. ఒక పాఠకుడి ప్రశ్న: నా ఫోటో విజయచిత్రకు ముఖచిత్రంగా వేస్తే ఎలా ఉంటుంది? కొండలరావుగారి జవాబు: మీ ముఖంలా ఉంటుంది! అంతకుముందు ఆయన జ్యోతి మాసపత్రిక సంపాదకవర్గంలో ఉండేవారు. వివిధ పత్రికల్లో కథలూ, వ్యాసాలూ, సెటైర్లూ, నాటికలూ రాశారు. వాటి వివరాలు కింద చూడవచ్చు.

ఆయన హాస్యధోరణి ఎలాంటిదంటే కథ కంచికి అనే నాటికలో పాత్రల పేర్లు ఇవి: (అన్నమో) రామచంద్ర, (అరచేతిలో) వైకుంఠం, (ఆబాల) గోపాలం, (వల్లకాట్లో) రామనాథయ్య, (లోగుట్టు) పెరుమాళ్ళు, (నీతి) చంద్రిక వగైరా. ఆయన రాసి, దర్శకత్వం వహించిన నాలుగిళ్ళ చావిడి, పట్టాలు తప్పిన బండి, ప్రొఫెసర్ పరబ్రహ్మం మొదలైన నాటకాలు బాగా ప్రజాదరణ పొందాయి. పొట్టి ప్రసాద్, కాకరాల, నాగరాజారావు తదితరులు ఆయనకు మంచి సహనటులు. రాధాకుమారికి ముఖ్య పాత్రలుండేవి. ఒకవంక సినిమాపత్రిక పనులు చూస్తూ, రచనలు చేస్తూ, సినిమాలూ, నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఆయన నిత్యమూ బిజీగా ఉండేవారు. మద్రాసులో ఆయన నాటకాలు చూసిన దర్శకులు సినిమా వేషాలకు పిలిచేవారు. పట్టాలుతప్పిన బండిలో కాకరాలను చూశాకనే ఆయనకు బి.ఎన్.గారి ద్వారా రంగులరాట్నంలో అవకాశం వచ్చింది.

1974లో రామనవమి సందర్భంగా మేము బొంబాయిలో నడిపిన తెలుగు సాహిత్యసమితి అనే సంస్థ తరఫున కొండలరావుగారిని ప్రొఫెసర్ పరబ్రహ్మం నాటకం వెయ్యడానికి ఆహ్వానించాం. యవ్వన గుళికలవంటి వాటిని కనిపెట్టేందుకు ఒక నడివయసు పరిశోధకుడు చేసే విఫలప్రయత్నాలను గురించిన ఆ హాస్యనాటకం బ్రహ్మాండమైన జనాదరణ పొందంది. మద్రాసు నుంచి వచ్చిన కొండలరావు గారి బృందం మంచి నాటకాన్ని సమర్థవంతంగా ప్రదర్శించడమే కాక మాకున్న పరిమిత ఆర్థిక స్థోమతను సహృదయతతో అర్థం చేసుకుని మాతో సహకరించడం మేమెన్నటికీ మరిచిపోలేదు. అందులోని డైలాగులనూ, హాస్యసన్నివేశాలనూ మా మిత్రబృందం ఎంతో కాలంపాటు గుర్తు చేసుకుంటూనే ఉండేవాళ్ళం.

ఎవరినీ ప్రాధేయపడకుండా కేవలం నాటకానుభవంవల్ల కొండలరావు, రాధాకుమారి గార్లకు సినిమాల్లో వేషాలు దొరుకుతూ ఉండేవి. తరవాతి కాలంలో ఆయన చందమామ-విజయావారి భైరవద్వీపం సినిమాకు కథారచన, నిర్మాణనిర్వహణ చేశారు. సినిమా రంగం చరిత్ర గురించి ఇప్పటికీ ఎన్నో మంచి వ్యాసాలు రాస్తున్నారు. టీవీలో గొల్లపూడి మారుతీరావు గిరీశంగా కన్యాశుల్కం నాటకానికి దర్శకత్వం వహించారు. ఈ రోజుల్లో సినిమా పద్ధతులు తనకు సరిపడవనీ, కథ, స్క్రిప్టు, పాత్రపోషణ వగైరాలమీద ఎవరికీ శ్రద్ధలేదనీ అన్నారు. నాటకాల్లో ఆసక్తి ఉన్న మిత్రులతో కలిసి ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్న కొండలరావు, రాధాకుమారిగార్ల ఉత్సాహం ఆదర్శప్రాయం అనిపిస్తుంది.

రాధాకుమారిగారు ఆయనకు అన్నివిధాలా తగిన సహచరి. నటిగా ఎంతో ప్రతిభ కలిగిన నటీమణి. నేటికీ సినిమా, టీవీ, నాటకరంగాల్లో బిజీ ఆర్టిస్టు. ఆమె జన్మించినది విజయనగరంలో. స్త్రీలు ఎక్కువగా నాటకాల్లో వేషాలు వెయ్యని ఆ రోజుల్లోనే తన చిన్నతనంలో నటిగా కృషి మొదలుపెట్టారు. క్రమంగా ప్రొఫెషనల్ ఆర్టిస్టుగా అనేక సాంఘిక, పౌరాణికాల్లో నటించసాగారు. ఇక చదువు వెనకబడక తప్పలేదు. ఆమెకు సహనటులు జె.వి.సోమయాజులు, రమణమూర్తి, కొండలరావు మొదలైనవారు. అప్పటికే ఆమె ఉత్తమనటిగా బహుమతులు తెచ్చుకుంది. ఆమెకు సినిమా ఉత్సాహం కూడా కలిగింది. అప్పటికే కొండలరావు సినిమాల్లో వున్నారు గనక ముందు డబ్బింగ్ చెప్పడం నేర్చుకోవటానికి ఆమెను మద్రాసు పిలిపించారు. అప్పట్లో ఆయన సహకార దర్శకుడుగా ఉన్న ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఒక ముఖ్యపాత్రకి ఆమె డబ్బింగ్ చెప్పింది. త్వరలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చాలా చిత్రాల్లో ఆమెకు అవకాశాలు రాసాగాయి. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు.

రాధాకుమారి నటించిన నాటకాలు చూసిన సినీప్రముఖులు ఆమెకు చిత్రాలలో అవకాశాలు ఇవ్వసాగారు ఆమె తొలి చిత్రాలు: తేనెమనసులు, దాగుడుమూతలు. తర్వాత గయ్యాళి పాత్రలు, సాధు పాత్రలు చాలా చిత్రాల్లో వేశారు. అయితే కొందరు ఇతర సినీకళాకారుల్లాగా వీరిద్దరూ తమ సంస్కారాన్ని మరిచిపోలేదు. అందుకనే నాటకాలు వెయ్యడం మానలేదు. ఆమె దాదాపుగా 400 సినిమాల్లో వేశారు. ప్రస్తుతం 5, 6 సినిమాల్లో పాత్రధారణ చేస్తున్నారు. ఇటీవల ‘ఒకరికి ఒకరు’ ‘చందమామ’ చిత్రాల్లోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఓ పక్క టీవీ సీరియల్స్, ఇంకోపక్క సినిమాలూ, నాటకాలూ – నిత్యం బిజీగానే వున్నారు.

ప్రస్తుత కాలంలో తెలుగు నాటకరంగం పరిస్థితి గురించి బాబ్జీలు అడిగినప్పుడు కొండలరావుగారు చెప్పినది ఇది.

“టిక్కెట్ కొనుక్కుని చూసే ప్రేక్షకులు లేకపోవడం వల్ల తెలుగు నాటకం ఈ పరిస్థితుల్లో వుంది. ‘కమిట్మెంట్’ లేని ప్రేక్షకులూ ‘కమిట్మెంట్’ లేని నాటకరంగం. ఇదీ పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల నాటకరంగాలతో అసలు పోలికే లేదు. నంది నాటకోత్సవాలకి విరగబడి జనం వస్తారు. రవీంద్రభారతి నిండిపోయి బయట కూడా స్క్రీన్స్ పెట్టవలసి వస్తుంది. ఒక రూపాయి అయినా టికెట్ పెట్టండి అని ఎంత చెప్పినా వినరు. టికెట్ పెడితే రారండీ అంటారు. వచ్చినవాళ్ళే చాలు అన్నా వినరు. ఇటీవల ‘పడమట గాలి’ అనే నాటకం వేసినప్పుడు యాభైమంది ఆర్టిస్టులు, హాల్లో పదిమంది ప్రేక్షకులు, ఇదీ పరిస్థితి. నాటకం మీద అధారపడి బతకడం కుదరదు. ప్రొఫెషనల్ నాటకం కుదరదు. ఎమెచ్యూర్స్ మంచి నాటకాలే వేస్తున్నారు. ఎస్ వీ శేఖర్ రేపూ ఎల్లుండీ రెండు రోజులు ఇక్కడ తమిళ్ నాటకాలు ఆడుతున్నాడు. రెండు నాటకాలు. వెళ్ళి చూడండి. హౌస్ ఫుల్ అవుతాయి రెండురోజులూ. మెడ్రాస్ లో ఇరవై దాకా సభలున్నాయి. అందులో మెంబర్లుంటారు. ప్రతీ నెలా ఫీజు కడతారు. వాళ్ళకోసం ప్రతీ నెలా ఏదో వొక ప్రోగ్రాం వుంటుంది. ఆటో, పాటో, నాటకవోఁ. మెంబర్లు కాని వాళ్ళు టికెట్ కొనుక్కుని వెళ్తారు. ఇక్కడ మెంబర్లుగా చేరినా ఫీజు కట్టరు. రారు.”

తెలుగు నాటకరంగం పరిస్థితిని గురించి చాలామంది పెద్దలు చాలానే రాశారు. అది ప్రస్తుతపు తెలుగువారి సంస్కారాన్ని సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పట్టువదలని విక్రమార్కుళ్ళా కొండలరావుగారి వంటి కళాకారులు మాత్రం తమ వంతు కృషిని చేస్తూనే ఉన్నారు.

రావికొండలరావు రచనలు (ఇవన్నీ విశాలాంధ్ర బుక్‌హౌస్ తదితర దుకాణాల్లో దొరుకుతాయి):

రావి కొండలరావు నాటకాలు
రావి కొండలరావు కథలు
రావి కొండలరావు నాటికలు
బ్లాక్ అండ్ వైట్ (సినిమా వ్యాసాలు – నంది అవార్డ్ పురస్కృత)
మల్లీశ్వరి నవలా రూపం
మాయాబజార్ నవలారూపం
షావుకారు నవలారూపం
హ్యూమరథం – 1
హ్యూమరథం – 2 (సినిమావారిలోని చమత్కారాలు)
(సి) నీతి చంద్రిక (సినిమా సెటైర్)
అన్నీ అడ్డంకులే (సినిమా సెటైర్)
చిత్తూరు వి.నాగయ్య (జీవిత చరిత్ర)*
నేనూ – నా దర్శకులు (అక్కినేని)*
(* వాళ్ళు చెప్పగా రావి కొండలరావు రాసినవి)
-----------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో 

No comments: