Saturday, November 24, 2018

అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్


అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్సాహితీమిత్రులారా!
సినిమాపాటలు ప్రపంచంలో మనదేశానికి ప్రత్యేకం. వాస్తవికత దృష్య్టా సినిమాల్లో అసలు పాటలుండాలా అన్న చర్చను పక్కన పెడితే సినిమాలతో సంబంధం లేకుండా పాటలు శాశ్వతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జానపద, లలిత, శాస్త్రీయ సంగీతాల బలమైన ప్రభావం మొదటినుంచీ మన ప్రజల హృదయాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉండడం వల్లనే పాటలకు సినిమాలు వాహకంగా పనిచేశాయని అనుకోవాలి. ఇదంతా వినేవారి దృక్పథం. ఇక చిత్రనిర్మాణంలోని ఆర్థిక సమస్యలనుబట్టి చూస్తే సినిమా అనేది బోలెడు డబ్బు పోసి తీసే కదిలే బొమ్మ కనుక కథను సందర్భోచితంగా రక్తి కట్టించడమే సంగీతపు పరమార్థంగా నిర్మాతలు భావించబడడంలో ఆశ్చర్యంలేదు. సినిమాలు పాతబడిపోయి, నటీనటులు out of fashion అయిపోయిన తరవాత కూడా సినీసంగీతం జనాదరణ పొందుతోందంటే అందుకు కొంతవరకూ nostalgia కారణం అనుకున్నప్పటికీ ముఖ్యకారణం ఆ సంగీతంలో ఉండే “శాశ్వత” విలువలే అని ఒప్పుకోవాలి.

1921లో పుట్టి 1952లో మరణించిన సి.ఆర్‌.సుబ్బరామన్‌ తొలి సినీ సంగీతదర్శకులలో చాలా గొప్పవాడు. కొన్ని దశాబ్దాల కిందట సినీసంగీతం గురించిన తన వ్యాసంలో ఘంటసాల ప్రముఖ సంగీతదర్శకులను ప్రస్తావిస్తూ మొదటగా పేర్కొన్నది సుబ్బరామన్‌నే. తెలుగువారికి చిరపరిచితాలైన దేవదాసు, లైలామజ్నూ వగైరా చిత్రాల పాటలు ఆయన ప్రతిభకు మచ్చు తునకలు మాత్రమే. ఇటీవల ఈ వ్యాస రచయిత సుబ్బరామన్‌తో పనిచేసిన ఒక వేణు విద్వాంసుణ్ణి కలుసుకుని సేకరించిన కొన్ని విశేషాలు తెలుసుకోదగినవి. వీటిలో కొన్ని వ్యక్తిగతమైనవి.

1940లలో సినీరంగంలో పేరుపొందిన దక్షిణాది సంగీతదర్శకులు వి.నాగయ్య, ఎస్‌.రాజేశ్వరరావు, ఎస్‌.వి.సుబ్బయ్య నాయుడు, జి.రామనాథన్‌, ఘంటసాల, పెండ్యాల తదితరులు. ఒక్కొక్కరూ ఒక్కొక్క నిర్మాణ సంస్థలో పనిచేసేవారు. సినిమాలూ, నటీనటులూ పైకి రావడానికి సంగీతం చాలా దోహదం చేస్తుందనే గుర్తింపు ఆ రోజుల్లో మొదలయింది. నాటకాల్లో

పద్యాలూ, పాటల కోసం ఎగబడినట్టే జనం సినిమా పాటలు వినసాగారు. ఆ కాలంలో తారాజువ్వలా ఎగసినవాడు సుబ్బరామన్‌. సినిమా అనే కొత్తరకం ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎలాంటి సంగీతం అవసరమో ఆయన అతి త్వరలోనే గుర్తించినట్టు కనబడుతుంది.

సుబ్బరామన్‌ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువాడు. మదురై సమీపంలోని చింతామణి ఆయన స్వస్థలం. ఆయన మొదట ఎవరివద్ద సంగీతం నేర్చుకున్నాడో తెలియదుగాని ఒక self-taught genius అని అందరూ అనుకునేవారు. 1940లలో మద్రాసుకు వచ్చి ఆయన మొదట్లో His Masters Voice ఆర్కెస్ట్రా నిర్వాహకుడుగా పనిచేశారు. ఆరోజుల్లో సినిమాపాటలను రికార్డులుగా విడుదల చెయ్యడానికి సినీ గాయకులు మద్రాసులో జెమినీ స్టూడియో సమీపంలో ఉన్న HMV సంస్థలో సినీ ఆర్కెస్ట్రాతో కాకుండా అక్కడి ఆర్కెస్ట్రాతోనే మళ్ళీ పాడవలసివచ్చేది. ఆ తరవాత ఆయన స్వతంత్రంగా తమిళంలోనూ, తెలుగులోనూ సంగీతదర్శకత్వ బాధ్యతలు చేపట్టి, ఎనలేని కీర్తినీ, ప్రజాదరణనూ పొందారు.

ఆయనకు బాగా తాగుడు అలవాటుండేది. దేవదాసు చిత్రనిర్మాణంలో ఆయన ఒక వాటాదారు. ఆయనతో వివాహేతరసంబంధం ఉన్న ఒకావిడ ద్వారా సహనిర్మాతలు 1952లో ఆయనకు విష ప్రయోగం చేసి చంపించారన్న వదంతి ఆ రోజుల్లో వినిపించింది. రికార్డింగ్‌ పూర్తిచేసి మధ్యాహ్న భోజనానికి తన షెవ్రొలెట్‌ కారులో దర్జాగా వెళ్ళిన ఆయన శవాన్ని ఆ సాయంత్రమే, అదే కారులో తేవలసి వచ్చిందట. ఆయన మృతిచెందిన కొద్దిగంటల్లోనే శవాన్ని హడావిడిగా మదురైకి తరలించి అంత్యక్రియలు చేశారని విన్నప్పుడు అనుమానం బలపడుతుంది కాని ఆధారాలేవీ లేవు. ఆ తరవాత ఆస్తి విషయంలో ఆయన భార్యకూ, ఆయన తండ్రికీ మధ్య గొడవలు కూడా తలెత్తాయట. ఆయన కుమారుడు కణ్ణన్‌ నేటికీ సినీ పరిశ్రమలో ఉన్నారట. శంకర్‌గణేశ్‌ ద్వయంలో ఇటీవల మరణించిన శంకర్‌ సుబ్బరామన్‌కు తమ్ముడు. గట్టిగా ముప్ఫై రెండేళ్ళు కూడా బతకని సుబ్బరామన్‌ ఆ కొద్ది సంవత్సరాల్లోనే మరపురాని కృషి చేశారు.

సుబ్బరామన్‌ గొప్పతనం తెలుసుకోవటానికి ఒక్కవిషయం చాలు. ఆయనకు సహాయకులుగా పనిచేసినవారంతా తరవాత గొప్ప సంగీతదర్శకులయారు. వారిలో ముఖ్యులు ఘంటసాల, విశ్వనాథన్‌, రామమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి (వయొలిన్‌ వాయించేవారు), ఆర్‌.ఎస్‌.గోవర్ధనం, సుబ్రహ్మణ్యం (మేండొలిన్‌) రాజు, లింగప్ప తదితరులు. వీరిలో ఘంటసాల తాను అప్పటికే సంగీతదర్శకుడైనా సుబ్బరామన్‌తో సహకరించడం విశేషం. తాను సుబ్బరామన్‌ వద్ద సంగీతం నేర్చుకున్నానని పి.లీల అన్నారు. తెలుగు సినిమాలో పాడేందుకు తొలి అవకాశంలైలా మజ్నూలో మాధవపెద్ది సత్యం, సుసర్ల దక్షిణామూర్తిలకు వారిద్దరూ కలిసి పాడిన “మనుచుగా తా ఖుదా తోడై” ద్వారా లభించింది. సినీ నేపథ్య సంగీతం రీరికార్డింగ్‌ జరుగుతున్నప్పుడు తెరమీద చిత్రం చూస్తూ సుబ్బరామన్‌ “ఆశువుగా” పియానో మీద వాయించేవారని ఈమధ్య ఒక టీవీ ఇంటర్వ్యూలో విశ్వనాథన్‌ చెప్పారు. అలా ఆయన వాయిస్తున్నప్పుడు వెంట వెంటనే స్వరాలు నోట్‌ చేసుకునే పని తానూ, రామమూర్తి, గోవర్ధనం, లింగప్ప చేసేవారమని ఆయన అన్నారు. ఆ రోజుల్లో సుబ్బరామన్‌ చాలా డబ్బు ఖర్చుపెట్టి మద్రాసులోని అత్యుత్తమమైన వాద్యబృందం నిర్వహించేవారట.

దేవదాసు సుబ్బరామన్‌ విషయంలో కూడా విషాదాంతమే. ఆ పాటల ప్రజాదరణను ఆయన చూడడం జరగనేలేదు. నిర్మాతలతో ఘర్షణ ఆయనకు ప్రాణాంతకమే అయింది. సుబ్బరామన్‌ ఒకసారి తాను ఏర్పాటుచేసిన రికార్డింగ్‌కు ఘంటసాల రాలేదని అలిగి “ఓ దేవదా” వగైరా పాటలన్నిటినీ మొదట్లో పిఠాపురంచేత పాడించారట. ఆ తరవాత రాజీ కుదిరి “కుడి ఎడమైతే,జగమే మాయ” వగైరాలు రికార్డు చేశారట. వ్యక్తిగత స్పర్ధలవల్ల జరిగినవే అయినా ఇవన్నీ సుబ్బరామన్‌ వ్యక్తిత్వాన్ని సూచించే విషయాలు. దీన్ని బట్టి సుబ్బరామన్‌ కల్పనాశక్తి ఎంతటి వేగంతో పరుగులు తీసేదో, ఇతరులపట్ల ఆయనకు ఓర్పు ఎంత తక్కువగా ఉండేదో తెలుస్తుంది. క్రియేటివ్‌ కళాకారుడి రెస్ట్‌లెస్‌నెస్‌ ఆయనలో ఎక్కువగాఉండేదేమో. ఆయన అద్భుతంగా పాడి, హార్మోనియం వాయించే వారట. పచ్చనిచాయతో, ఎప్పుడూ తాంబూలం నములుతూ అందర్నీ నవ్వుతూ పలకరించేవారని మా నాన్న(కుటుంబరావు)గారు నాతో అనేవారు. అన్నట్టు “ఓ దేవదా” యుగళగీతం తానే పాడాననీ, నిర్మాతతో గొడవల వల్ల కె.రాణి పేరు వేశారనీ జిక్కీ ఒకసందర్భంలో చెప్పారు. ఆ పాటలో ముందు “ఓహోహో” అన్నది మాత్రం రాణి. అది తరవాత తెచ్చి, అతికించినట్టుగా కాస్త వేరు శ్రుతిలో వినిపిస్తుంది.

సంగీతం విషయంలో సుబ్బరామన్‌ ప్రతిభ అపూర్వం, అసామాన్యం. అకాల మరణం చెందకుండాఉంటే ఎస్‌.రాజేశ్వరరావు వంటి గొప్ప సంగీత దర్శకులకు ఆయన గట్టిపోటీగా నిలిచేవా రనడంలో సందేహంలేదు. కర్ణాటక రాగాలపై ఆయనకు ఉన్న అధికారం పి.లీల, ఎమ్‌.ఎల్‌. వసంతకుమారి కలిసి “మన మగళ్‌” చిత్రానికి పాడిన “ఎల్లాం ఇన్బ మయం” అన్న ఒక్క పాట వింటే తెలిసిపోతుంది. అందులో సింహేంద్రమధ్యమం, మోహన, దర్బార్‌, హిందోళం వంటి రాగాల మాలికలో స్వరకల్పన అద్భుతంగా అనిపిస్తుంది. అదే సినిమాలోని సుబ్రహ్మణ్యభారతి పాట “చిన్నం జిరు కిళియే”లో కూడా కాఫీ, మాండ్‌ మొదలైన రాగాల మెలొడీ అనుపమానమైనది. ఈ పాట ఎంత బావుంటుందంటే ఎమ్‌.ఎల్‌.వసంతకుమారి, వీణ విద్వాంసుడు చిట్టిబాబు తమ కచేరీల్లో చివర దీన్ని వినిపించేవారు. సినిమాపాటలకు అటువంటి గౌరవం దక్కడం చాలా అరుదు. దేవదాసులోని మువ్వగోపాల పదం “ఇంత తెలిసి యుండి” ఖరహరప్రియతో మొదలైన అందమైన రాగమాలిక. సుబ్బరామన్‌ రిహార్సల్‌కు వచ్చిన పి.లీల, ఎమ్‌.ఎల్‌.వసంతకుమారి తదితరులు ఆయన ముందుకు వచ్చే సాహసం లేక రమ్మని పిలిచేదాకా వెనకాలే కూర్చునేవారట.

తొలి రోజుల్లో సినిమా పాటలకు “catchiness” సమకూర్చిన ప్రతిభ నిస్సందేహంగా సుబ్బరామన్‌దే. ఆయన దరువుల్లోనూ, స్వర ప్రస్తారంలోనూ “సాహసం” కనబడుతుంది. ఒకే పాటలోనే కల్పన అంతులేకుండా సాగిపోతూ ఉంటుంది. ఉదాహరణకు 1949లో రిలీజైన లైలా మజ్నూలో “విరి తావుల లీల” అనే ఘంటసాల, భానుమతి పాడిన యుగళ గీతం ఇప్పుడు వింటే కాస్త “పాత”గా అనిపిస్తుందేమో కాని పాట వేగం తగ్గకుండానే మెలొడీ వినిపిస్తుంది. ఢోలక్‌ ప్రధానంగా వినిపించే ఈ పాటలో చరణాల ట్యూన్‌ గుర్రంలా పరుగులు తీస్తుంది. అదే చిత్రంలోని ఘంటసాల, భానుమతి పాడిన “చెలుని గని” అనే పాట తరవాత దేవదాసులోని “చెలియ లేదు” పాటకు పూర్వ రూపంలా అనిపిస్తుంది. Waltz దరువు మీద సాగే ఈ పాట పల్లవిలో “ఓబో” వాయిద్యం పై వినబడే

counter melody ఎంతో అందమైనది. లైలా మజ్నూలోనే “మనుచుగా తా ఖుదా తోడౖె” అనే పాటలో “ముస్లిం” సంగీతం వినబడుతుంది. అందులో ఘంటసాల చరణం అందుకోగానే అది పాడుతున్నది “హీరో” అని తెలిసిపోతుందంటే అది గాయకుడి, సంగీత దర్శకుడి ప్రతిభ కూడా. ఈ పాటలో ఎంతో డ్రామా ఉంది. భానుమతి పాడిన “్రపేమే నేరమౌనా”లో తాళగతి ఆగి, నడిచే తీరు అప్పట్లో కొత్తే. అద్భుతమైన భావోద్వేగానికి మరొక ఉదాహరణ భానుమతి పాడిన “నిను బాసి పోవుదాన”. ఈ డ్రమెటిక్‌ లక్షణం దేవదాసు పాటల్లో కూడా చాలా మటుకు వినిపిస్తుంది. ఘంటసాల, భానుమతి పాడిన “దివ్య ప్రేమ” అనే పాటలో భానుమతి “కలలే నిజమాయె” అంటున్నప్పుడు ఎంతో అందమైన నాజూకు గమకం వినిపిస్తుంది. సుబ్బరామన్‌ది అంతటి గొప్ప ఊహ.

దేవదాసులో సుబ్బరామన్‌ ఒక్క పహాడీ రాగాన్ని వివిధ భావాలకూ, సన్నివేశాలకూ వాడుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. “ఓ దేవదా, పల్లెకు పోదాం, అందాల ఆనందం” వంటివి ఉత్సాహ భరితాలు. “చెలియ లేదు”లో విషాదం. “తానే మారెనా” మరో రకం. “కల ఇదనీ” వకుళాభరణం, మాయామాళవగౌళ రాగాలతో రూపొందినది. ఈ పాటలన్నిటిలోనూ మధ్యలో వచ్చే “బిట్స్‌” పాటను ఎంతగానో హైలైట్‌ చేస్తాయి.

చండీరాణిలో విశ్వనాథన్‌, రామమూర్తి పూర్తి చేసిన “ఓ తారకా” అనే పాటలో చరణం నడక సుబ్బరామన్‌ ట్రేడ్‌మార్కే. సుబ్బరామన్‌ది ప్రధానంగా ట్యూన్‌ కట్టే ధోరణి. తక్కినవాటిని ఆయన లక్ష్యపెట్టినట్టు కనబడదు. సాహిత్యం ట్యూన్‌కు లోబడవలసిందే. అందువల్లనే తొలిరోజుల్లో సముద్రాల(సీ) రాసిన చాలా పాటల సాహిత్యం అంత గొప్పగా అనిపించదు. తెలుగు సంగీతదర్శకులైన ఘంటసాల, రాజేశ్వరరావు, పెండ్యాల తదితరులు సాహిత్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు.

1950, 60, 70లలో సినిమారంగం మార్పులుచెంది బలం సంతరించుకున్నాక తక్కిన శాఖలతోబాటు సంగీతంకూడా మారుతూ వచ్చింది. దీని సత్ఫలితాలను తక్కినవారిలాగా చవి చూడకుండానే సుబ్బరామన్‌ కాలంచేశారని తలుచుకున్నప్పుడు సంగీతాభిమానులకు బాధ కలుగుతుంది. సుడిగాలిలా వచ్చి సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి అకస్మాత్తుగా నిష్క్రమించిన సుబ్బరామన్‌ శకం పూర్తయి యాభై సంవత్సరాలు దాటినా ఆయన సదా స్మరణీయుడే.
----------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో 

No comments: