Friday, November 23, 2018

సాహితీ చమత్కారాలు


సాహితీ చమత్కారాలుసాహితీమిత్రులారా!

బ్రహ్మకి కూడా నింద తప్పదా! “కవి నిరంకుశుడు” అన్నారు. అతనికి కోపం వస్తే వారూ వీరూ అనే తారతమ్యం వుండదు. కవికి ఆ స్వతంత్రత వుంది. క్రీ.శ. 1550 తర్వాత తెలుగు దేశాన్ని గోల్కొండ నవాబు ఇబ్రహీం కులీ కుతుబ్‌షా పరిపాలించాడు. ఇతను సాహిత్యపోషకుడు. ముఖ్యంగా తెలుగు కవిత్వాన్ని ఆదరించిన వాడు. అద్దంకి గంగాధర కవి రచించిన “తపతీసంవరణోపాఖ్యానం” కావ్యాన్ని కూడా అంకితం తీసుకున్న వాడు. కవులు అతనిని “ఇభరాముడు”, “మల్కిభరాముడు” అనేవారు. ఇతని సాహిత్య పోషణతో పాటు దానగుణం కూడా ప్రశంసార్హంగా వుండేది. అర్థులకు కల్పవృక్షమట! షట్చక్రవర్తుల కోవలోని వాడట! అటువంటి మల్కిభరాముడు పరమపదించాడు. చాలా మంది దిగులుచెంది వుంటారు. కానీ ఒక కవి తన దిగులును ఆవేశంగా మార్చుకుని ఇలా బ్రహ్మని దెప్పిపొడిచాడు

“రార విధాత యోరి వినరా తగురా తలకొట్లమారి ని
స్సారపు లోభిరాజులను జంపక మల్కిభరామ భూవరున్‌
చారు యశోధనున్‌ సుగుణి జంపితి వర్థుల కేమి దిక్కురా
చేరిక నింత రాజుల సృజింపగ నీ తరమా వసుంధరన్‌”

“ఓయీ బ్రహ్మా, ఇటు రా! నేను చెప్పేది విను. నువ్వొక తలకొట్లమారివి. నిస్సారవంతులైన, లోభులైన రాజుల్ని చంపాలి గానీ రాజశ్రేష్టుడు, మంచి కీర్తి సంపద గలవాడు, సుగుణవంతుడు ఐన మల్కిభరాముణ్ణి చంపావేమిటయ్యా! ఇక యాచకులకు దిక్కెవరు? భూమిలో మళ్ళీ ఇంతటి మహారాజుల్ని సృష్టించటం నీ తరం ఔతుందా?”

బ్రహ్మను ఇలా వ్యాజపరంగా ( ironical ) నిందించడం కవులకి అలవాటే. శ్రీనాథుడు కూడా “ఇంత అందమైన దానిని రాట్నం వడికే దానిగా చేసావేమిటయ్యా?” అని బ్రహ్మని ఆడిపోసుకున్నాడు. బ్రహ్మకు ఐదు ముఖాలుండేవనీ శివుడు కోపంతో ఒక శిరస్సును నరికివేశాడనీ అప్పటినుంచీ చతుర్ముఖుడైనాడనీ ఒక కథ వుంది. అందుకే  “తలగొట్లమారి” అన్నాడు కవి. కోపంలో, సరసంలో, యుద్ధంలో “రా కొట్టడం” సముచితమని కవుల సిద్ధాంతం. అందుకే బ్రహ్మను పట్టుకుని “రార, వినరా, తగురా” అనేశాడు. ఇంతకీ మల్కిభరాముడ్ని పొగడటానికి బ్రహ్మని నిందించ వలసి వచ్చింది. ఆత్మీయులు, ప్రాణసమానులు, కావలసిన వారూ పోయినప్పుడు హృదయం కలత చెందుతుంది. ఆవేదన ఉబికివస్తుంది. అప్పుడు ఈ రకమైన భావనలు వెలువడతాయి!

నాకు నేనే సాటి!

సంస్కృతాంధ్ర కవుల్లో చాలా మంది తమ గొప్ప గురించి చెప్పుకొన్నవారే! కాకపోతే కొందరు వినయంగా చెప్పుకొంటారు, ఇంకొందరు అహంకారంతో గర్వంతో చెప్పుకొంటారు. కవిపండిత లోకంలో అదొక అలంకారం కూడా!

18వ శతాబ్ది నాటి అడిదము సూరకవి ఇలా (సొంత డబ్బా?) చెప్పుకొన్నాడు

“గడియకు నూరు పద్దెములు గంటము లేక రచింతు, తిట్టగా
తొడగితినా పఠాలు మని తూలిపడుం గులశైలరాజముల్‌
విడిచి యనుగ్రహించి నిరుపేద ధనాధిప తుల్యు చేతు నే
నడిదము వాడ! సూరన సమాఖ్యుడ! నాకొకరుండు సాటియే?”

ఈ సూరకవి గొప్ప పండితుడే. లక్షణ గ్రంథాలు కూడా రాశాడు. అయితే “తిట్టుకవి” అనిపించుకున్నాడు. శాపం పెట్టగల సమర్థుడట!

గడియకు వందపద్యాలు చెప్పే సామర్య్థం తనకి వుందన్నాడు. అదికూడా గంటం (కలం) తో కాదు ఆశువుగా spontaneous  గా చెప్తాడట. గడియ అంటే ఇరవైనాలుగు నిమిషాలు. ఇరవైనాలుగు నిమిషాలలో వందపద్యాలు చెప్తాడట! ఇలా వేగంగా చెప్పిన వారు చాలామంది వున్నారు. తిట్టడం మొదలు పెడితే కులపర్వతాలే కూలిపోతాయట! ఇతనికా శక్తి వున్నట్టు తెలిపే చాటు పద్యాలున్నాయి. అంతేకాదు మంచి కూడా అంత తీవ్రంగానే వుంది. అనుగ్రహిస్తే, సహాయం చెయ్యాలనిపిస్తే నిరుపేదని సంపన్నుడిగా చేస్తానని ఘంటాపథంగా చెప్పాడు. “నేనడిదము వాడను” అనటంలో అంతరార్థం వుందన్నారు. అడిదము అంటే కత్తి అనే అర్థం వుంది. కాబట్టి సూరకవి కత్తి లాంటి వాడన్నమాట! ఇతని కవిత కత్తిలా పదునైనది.మాట కూడా పదునైనదే. కత్తిని మంచికీ వాడవచ్చు, చెడుకీ వాడవచ్చు. అలాగే సూరకవి రెండింటికీ ఉపయోగిస్తాడు. నాతో సాటి ఎవరున్నారు? అని ” extra ” గా మాట్లాడాడనుకోండి. ఇలా పెద్దవాళ్ళు అంటే దానికి “పాండిత్య వీరం” అని పేరుపెట్టారు. ఏమైనా ఈ పద్యం ఒకనాటి కవితా ప్రపంచాన్ని, కవుల స్వభావాన్నీ, శక్తినీ వెల్లడిస్తోంది.
---------------------------------------------------------
రచన: ద్వానా శాస్త్రి, 
ఈమాట సౌజన్యంతో 

No comments: