Saturday, September 8, 2018

ఆవంతయన్నచో గోవంత పెద్దది

ఆవంతయన్నచో గోవంత పెద్దది




సాహితీమిత్రులారా!



ఈ పద్యంలో పదాలను అసలు అర్థంలో కాక
హాస్యార్థంలో పద్యంగా కూర్చారు
బయిరెడ్డి సుబ్రహ్మణ్యం గారు
తన శ్రీ వేంకటేశ సారస్వత వినోదిని కావ్యంలో
చూడండి-

ఆవంతయన్నచో గోవంత పెద్దది
                   కంఠహారముపేరె కంఠమాల
గాంధారియన్నచో గంధర్వుకూతురు
                   సీతమ్మనేత్రమే శీతకన్ను
కీర్తిలోశేషుండు కీర్తిశేషుండౌను
                   రాగంబులఁగుసంభరాగమొకటి
బ్రహ్మరథమటన్న బ్రహ్మదేవునితేరు
                  పొలములోని యెలుక పొలయలుకగు
రామఠమనంగ నవవాసరాము మఠము
బకముసలిపెడు జపమది బకజవమ్ము
హాస్యజనకమౌ వ్యుత్పత్తులగునవివ్వి
దేవ! శ్రీ వేంకటేశ! పద్మావతీశ!


పదాలు అసలర్థాలు-

ఆవంత అంటే ఆవు అంత అని కాదు
            ఆవగింజంత చిన్నది

కంఠమాల అంటే  మెడలోవేసుకునే హారంకాదు
               మెడచుట్టూ వచ్చే ఒక రకమైన వ్రణం

గాంధారి అంటే గంధర్వరాజు కూతురు కాదు
             గాంధారదేశపురాజు కూతురు

శీతకన్ను అంటే సీతాదేవి కన్నుకాదు
              గమనించక పోవుట

కీర్తిశేషుడు అంటే కీర్తిలో శేషుడని కాదు
               మరణించి కీర్తి మిగిలియున్నవాడు

కుసుంభరాగము అంటే - కుంకుమపూవువలె లోనలేని ప్రేమ

బ్రహ్మరథం అంటే విద్వద్విప్రులు మోయు శవవాహనము

పొలయలుక అంటే  ప్రణయకలహము

రామఠము అంటే రమటదేశంలో పుట్టు ఇంగువ

బకజపము అంటే కపటజపము

No comments: