Wednesday, September 26, 2018

గ్రామ్యభాష – శిష్టభాష


గ్రామ్యభాష – శిష్టభాషసాహితీమిత్రులారా!సవరలు, కోయలు మొదలయిన మోటు జనులు సంఘములలో అందరూ ఒక్క విధమయిన భాషే మాట్లాడుతారు; శిష్ట భాష అనీ గ్రామ్య భాష అనీ తారతమ్యము ఉండదు. నాగరికులతో సంబంధముగలవారు కొందరు నాగరికుల మాటలు కొన్ని తమ భాషలో కలిపి వాడుకొంటారు. వాటి ఉచ్చారణ సరిగా ఉండకపోయినా, అందరూ వాటిని మెచ్చుకొంటారు. గాని నాగరికులు వాటిని “అపభ్రంశ” మంటారు. వర్ణవ్యవస్థ యేర్పడ్డ సంఘములలో భాషావ్యవస్థ కూడా ఏర్పడుతుంది. మాట్లాడేవారి ప్రతిష్ఠ, గౌరవము, కులీనత్వము మొదలయినవాటిని బట్టి వారి భాష “శిష్ట భాష” అని మెప్పుపొందుతుంది; అట్టి వారితో సహవాసము చేత, ఇతర జాతుల వారికి కూడా శిష్ట భాష అలవడుతుంది. క్రమక్రమముగా ఈ “శిష్టభాష” సంఘములో వ్యాపిస్తుంది. “దేశభాష” అనేది ఈలాగుననే ఏర్పడుతుంది.

వ్యవహార భ్రష్టమయి, నాగరికులు పూర్వము రచించిన గ్రంథములలో మాత్రము నిల్చి ఉన్న భాష, ఆ గ్రంథములు చదివే వారికే తెలుస్తుంది గాని ఇతరులకు తెలియదు. ‘గ్ర్యామ్య భాష’ అది మాట్లాడే జాతివారికే కాని ఇతరులకు బాగా తెలియదు. ‘శిష్ట భాష’ ఒక్కటే సంఘములోనివారికి, మొత్తము మీద అందరికీ తెలిసే భాష; గనుకనే దానికి ‘దేశ భాష’ అనే పేరు కలిగినది. అది అచ్చుకొట్టినట్టు దేశమందంతటా ఒక్క లాగున ఉండదు. వ్యవహారమందుండే భాషలన్నిటి “స్వభావము” ఇట్టిదే. మన తెలుగువారి దేశభాష ఒకొక్క జాతిలోనూ, ఒకొక్క మండలములో ఒకొక్క విశేషము కలిగి ఉన్నా మొత్తము మీద అందరికీ సామాన్యమై అంగీకరించక తప్పదు. ఏ ప్రదేశమందున్నా వారు ఆ ప్రదేశమందున్న శిష్టభాషలో గ్రంథములు రచిస్తే అక్కడివారికే కాక తక్కిన ప్రదేశములందున్న వారికి కూడా మొత్తము మీద సుబోధముగానే ఉంటవి. కవుల సంప్రదాయము అన్ని దేశములలోనూ ఇదే.

శిష్టజనులు వాడే భాష ‘ గ్రామ్యము’ అని నిందించడము అవివేకము. ‘గ్రామ్యమ్’ అనేది సంస్కృత భాషలోని శబ్దము; ఆ భాష అనుశాసించిన పాణిన్యాదులు గానీ, కావ్య లక్షణము రచించిన పండితులు కానీ శిష్ట భాష గ్రామ్యమని చెప్పలేదు. ఆంధ్ర శబ్ద చింతామణి, అప్పకవీయము, బాలవ్యాకరణము మొదలయిన లక్షణ గ్రంథములు రచించిన వారు ‘లక్షణ విరుద్ధ మయిన భాష గ్రామ్యము’ అన్నారు, గాని ఆ మాట తప్పు. గ్రామ్యమనగా పామరజన వ్యవహారమనిన్ని, పామరులనగా ఆభీరులు (మేకలు కాచే గొల్లజాతివాళ్ళు) మొదలయినవారనిన్ని లాక్షణికులు నిర్వచించినారు. లక్షణ విరుద్ధమయిన భాష “చ్యుత సంస్కారము” అని ‘ దోషము’ గా పేర్కొన్నారు. ఇంగ్లాండులో నేడు శిష్ట వ్యవహారమైందున్న ఇంగ్లీషు భాషే దేశ భాష; శిష్టులు కానివారి భాష Vulgar అని, Slang అని, Cockney అని, Cant అని, Patois అని, Brogue అని అంటారు; శిష్టులు అట్టి భాషను నోటను ఉచ్చరించనే ఉచ్చరించరు; శిష్టుల సంభాషణలో అట్టి మాటలు వినబడవు. Rail అనే మాట ‘రైల్’ అని గ్రామ్య జనులు పలుకుతారు. అది ‘Cockney’, ‘vulgar’ ఉచ్చారణ అంటారు. Funk వంటి మాటలు Slang అంటారు; ఇట్టి మాటలు శిష్టుల వాడుకలో చేరితే మరి నింద్యములు కావు. శబ్దముల శిష్టత్వమే అవి వాడేవారి శిష్టత్వము వల్ల కలుగుతుంది, గాని వాటికి స్వభావసిద్ధమయినది కాదు. ‘కూకో’, ‘కూర్చో’, ‘కూచో’, ‘కూకొని’, ‘కూర్చొని’, ‘కూర్చుని’, ‘కూచుని’ — వీటిలో ‘కూకో’, ‘కూకొని’ గ్రామ్యజనులున్ను తక్కినవి శిష్ట జనులున్ను వాడుతున్నారు; ప్రాచీనాంధ్ర కావ్యములందు ఇవి కనబడవు; కొత్త తెలుగు మాటలు. నేటి కవులు యధేష్టముగా ఈ “శిష్టభాషితములు” ప్రౌఢరచనలో ప్రయోగిస్తున్నారు. ‘కూకో’, ‘కూకొని’, ‘తొంగో’, ‘ తొంగొని’ గ్రామ్యములు గనుక శిష్టులు సంభాషణలో నయినా వాడరు. జాతీయత తెలియజేయడమునకు పాత్రోచితముగా నాటకాలలోనూ, నవలలోనూ, కథలలోనూ కొందరు ఇట్టి శబ్దములు ప్రయోగిస్తున్నారు. ఇట్టి వ్యవస్థ అన్ని దేశములలోను ఉన్నది.

సంస్కృత భాషారచనలో అపభ్రంశ భాష చేర్చరాదని లాక్షణికులు నిషేధించినారు; గాని అపభ్రంశ భాషలలో గ్రంథాలు రచించగూడదని చెప్పలేదు. బృహత్కథ, సప్తశతి, సేతుబంధము, కర్పూర మంజరి మొదలయిన గద్య కావ్యములూ, పద్య కావ్యములూ నాటకములూ గొప్ప కవులు ప్రాకృత భాషలో రచించినారు కారా? నికృష్టమైన పైశాచీ భాషలో రచించిన కావ్యములు (ఎంకిపాటల వంటివి) సయితము సహృదయులు మెచ్చుకున్నారే! కేవలమూ గ్రామ్య భాషలో కవిత కూర్చడము నిర్దోషమయి ఉండగా, మన శిష్ట వ్యవహారమందున్న తెలుగు కావ్యరచనకు యోగ్యము కాదనడమూ, అది గ్రామ్యమని నిందించడమూ అవివేక విలసితము కాదా?

” ఇంగ్లీషు భాష సంభాషణలో ఒక విధముగాను, గ్రంథాలలో మరి ఒక విధముగా ఉండదా? అట్టి భేదము తెలుగులో కూడా ఉండవద్దా? అని కొందరు అడుగుతారు. అటువంటి భేదము అన్ని భాషలలోను ఉన్నది. Saintsbury అనే ఇంగ్లీషు పండితుడు ఈ విషయమయి అన్న మాటలు ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరముగా చెప్పుతున్నాను. “willnot అని అనవలసి వచ్చినప్పుడు won’t అని వాడకూడదు; నిజమే. కాని won’t అని అనవలసినప్పుడు will not అని వాడడము అసహ్యముగా ఉంటుంది. ఏ సందర్భములో ఏది వాడవలెనో శిష్టుల వాడుకము పట్టి తెలుసుకోవలెను.” ఇష్టగోష్ఠిలో library, veterinary, deputy అనే మాటలు ‘లైబ్‌రి’, ‘ వెటరిన్‌రి’, ‘డెప్‌టి’ అనిన్ని సభలో ‘లైబ్‌రరి’, ‘వెటరినరి’, ‘డిప్యుటి’ అనిన్ని శిష్టులు ఉచ్చరిస్తారు. సంభాషణ లోని శైలి కిన్నీ గ్రంథములలోని శైలికిన్నీ కొంచెము భేదమున్నా అది అందరికీ తెలిసిన వ్యవస్థను అనుసరించి ఉంటుంది. ఇంగ్లండులో 200 సంవత్సరములయి వ్యావహారిక భాషలో గ్రంథరచన అందరూ అభ్యసిస్తూ ఉన్నందున శిష్టుల వాడుకను బట్టి కొన్ని వ్యవస్థలు ఏర్పడి ఉన్నవి. అవి Current English Dictionary, King’s English, ModernEnglish Usage అనే లక్షణ గ్రంథములందు Fowler పండితుడు తెలియజేసినాడు. అట్టి గ్రంథములు మరికొందరు కూడా రచించినారు. అయితే లాక్షణికులు వ్యవస్థ ఏర్పర్చే అధికారము గలవారు కారు; శిష్ట వ్యవహారమందు ఏర్పడిన వ్యవస్థను బట్టి అనుశాసనము చేస్తారు; అది “శాసనము” కాదు. వారి అనుశాసనము అన్ని నియమములోను అందరూ అనుసరించరు. ‘మా యిష్టము మాది’, ‘మా వాడుక, మా కిష్టము’ అనే కవులు ఇంగ్లీషువారిలోను, ఫ్రెంచి వారిలోను ఉన్నారు. తెలుగు వాడుకను గురించి వ్యవస్థలు నిరూపించి లక్షణము రచించే కాలము ఇంకా రాలేదు. తిక్కన చెప్పినట్టు పాత మాటలు విడిచిపెట్టి ఔచితిని బట్టి దేశభాషా శబ్దములు ప్రయోగించి గద్య కావ్యములు పద్య కావ్యములు రచించడము కవులు కొంత కాలము అభ్యసిస్తే కాని వ్యవస్థలు ఏర్పడవు. ముందుగా వ్యవస్థలు ఏర్పర్చుకొని మాతృభాషలో కవితలు ఏ దేశములో ఎవరూ కూర్చలేదు. భాషావ్యవస్థలు భాషలోనే ఉన్నవి; మనము వాటిని కనుక్కోవలెను.

బంగాళీ బాలకవులు తమ “చలిత్ భాష” (అనగా వర్తమాన వ్యవహారిక భాష) లోనే నానావిధ గ్రంథములూ రచిస్తున్నారు. సరికొత్త మాటలే కాని “పాతపడ్డ మాటలు వాడము” అని దీక్ష పట్టినారట. There is a strong body of writers who advocate the supersession of the old literary language by this living and vigorous form of spoken Bengali అని కలకత్తా విశ్వవిద్యాలయములోని పండితుడు డాక్టరు సునీతికుమార చటర్జి గారు “A Brief sketch of Bengali Phonetics” అనే గ్రంథములో వ్రాసినారు. తెలుగు బాలకవులు కూడా బంగాళీ వారివలె మాతృభాషాభిమానము కలవారై చక్కని కవితలు కూర్చగలిగితే ఆబాలగోపలమయిన అభినవాంధ్ర సారస్వతము ఉదయిస్తుంది. దానివల్ల వారికీ, వారి భాషకూ, వారి సంఘమునకూ లోకములో గౌరవ ప్రతిపత్తులు కలుగుతవి. సంఘముయొక్క భాగ్యము కవిబ్రహ్మల చేతిలో ఉన్నది.
---------------------------------------------------------
రచన: గిడుగు రామమూర్తి పంతులు, 
ఈమాట సౌజన్యంతో 

No comments: