Sunday, September 2, 2018

సమాజాభివృద్ధి కోసమే భాషాభివృద్ధి


సమాజాభివృద్ధి కోసమే భాషాభివృద్ధి

సాహితీమిత్రులారా!


తెలుగు భాషకు ప్రమాదం ఏర్పడిందని బాధపడేవారు మునుపటికంటే ఇప్పుడు బాగా పెరిగిపోయారు. ఒక వేళ ప్రమాదం ఉన్నదనుకుంటే, ఆ ప్రమాదానికి కారణమవుతున్నవారు, దాన్ని పెంచి, పోషిస్తున్న వారు కూడా ఇప్పుడు బాధపడే వరసలోకి చేరిపోయారు. అందరూ కలసి గుండెలు బాదుకోవడం తప్ప, భాషను కాపాడుకోవడానికి చేయవలసిన పనులు మాత్రం చేయడం లేదు.

ఇంతకూ తెలుగుకు ముంచుకువస్తున్న ముప్పు ఏమిటి? ఈ ప్రశ్నకు భాషాభిమానులందరి దగ్గరా సమాధానం దొరుకుతుందని చెప్పలేము. చాలా మంది దృష్టిలో, మన వాడకంలో ఇంగ్లీషు పదాలు ఎక్కువగా దొర్లుతుండడం ఒక పెద్ద ప్రమాదం.ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీషులో మాట్లాడుకుంటారని మన మీద మనం వేసుకునే ఇష్టమైన ఛలోక్తి. దుకాణాల బోర్డులు తెలుగులో లేకపోవడం, టీవీ న్యూస్ రీడర్లు, యాంకర్లు సగం ముప్పాతిక ఇంగ్లీషు మాటలతో కార్యక్రమాలను నిర్వహించటం కానీ, పిల్లలు తల్లిదండ్రులను మమ్మీడాడీలని పిలవడంకానీ, ఔత్సాహిక భాషాభిమానులకు చాలా కోపం తెప్పించే విషయాలు. ఇక భాష మనుగడతో బాటు, స్వచ్ఛత మీద కూడా పట్టింపు ఉన్న చాదస్తపు పెద్ద మనుషులు , వత్తులు పలకలేని నటుల మీద, రాయలేని అలాగా జనం విద్యార్దుల మీద, చాలా నిరసన చూపిస్తారు. పొట్టలో చుక్క కనిపించకపోతే, భాషకు అపచారం జరిగిపోతోందంటూ విలవిలలాడిపోతారు. ఇక ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో తెలుగు మాట్లాడితే ఉపాధ్యాయులు దండించిన సందర్భాలు పత్రికల్లో చదివినప్పుడు మాత్రం తెలుగు ప్రేమికుడికి విపరీతమైన ఆగ్రహావేశాలు కలుగుతాయి.

పైన ఉదహరించిన ఏ సందర్భం వల్లకూడా తెలుగు భాషకు వచ్చిన పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ, తెలుగు భాష దుస్థితిని చెప్పడానికి అవి కూడా ఉదాహరణలే. సొంతభాష పైన నిజమైన ప్రేమ పట్టింపు లేని సమాజం ఉన్నచోట, భాషను వదిలి సాము చేసే పాలకులున్న చోట ఇటువంటి దుస్థితే నెలకొని ఉంటుంది. వేగంగా నష్టపోతున్న భాషగా తెలుగును పరిగణించవలసిందే. రానున్న కొద్ది సంవత్సరాలలో తెలుగు మాయమైపోతుందని బెంబేలు పడనక్కరలేదు కానీ, పరిస్థితి ఇదే తీరులో కొనసాగితే, ఒక యాభై ఏళ్ల తరువాత తెలుగు అవశేష ప్రాయంగా మిగిలినా ఆశ్చర్యపోనక్కరలేదు.

తెలుగుకు జరుగుతున్న నష్టం ఒక తీరుగా ఉంటే , ఆ నష్టానికి విరుగుడు పేరుతో చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్నది మరింత నష్టం. ప్రభుత్వాలు మాత్రమే కాదు, భాష మీద నిజమైన ప్రేమ, తపన ఉన్న సంస్థలు, వ్యక్తులు కూడా పొరబాటు వైద్యానికే పాల్పడుతున్నారు. అందుకు అవగాహనలోని లోపాలే కారణం. తెలుగును కాపాడుకోడం అంటే పాత సాహిత్యాన్ని ఆదరించడం, కొత్త సాహిత్యానికి వేదికలు కల్పించడం పాత సాంస్కృతిక కళా రూపాలను స్మరించుకోవడం, పెద్ద ఎత్తున ఉత్సవాలు మహాసభలు నిర్వహించటం, ఎవరంతటవారు నిర్వచించిన తెలుగుదనాన్ని ఆడంబరంగానో, కళాత్మకంగానో ప్రదర్సించే ప్రయత్నం చెయ్యడం –ఇవన్నీ భాషాభిమానం పేరుతో జరుగుతున్న ప్రయత్నాలు. తన భాషను సంస్కృతులను ప్రేమించే సమాజం, పైన చెప్పిన కార్యక్రమాలను కూడా చేస్తుంది, చేయాలి కూడా. కానీ, వాటిని మాత్రమే భాషాభివృద్ధి చర్యలుగా భావించటం వ్యక్తులు ప్రైవేటు సంస్థల విషయం లో అయితే అమాయకత్వం కావచ్చును, ప్రభుత్వమే అట్లా భావిస్తూ ఉంటే మాత్రం అది మభ్యపెట్టే ప్రయత్నమూ, మోసకారితనమూ అని చెప్పాలి.

భాషోద్యమాలు ఏవైనా ఆ భాషా వ్యవహర్తల సర్వతో ముఖాభివృద్ధిని కోరుకునేవే. వ్యవహర్తలు లేకుండా భాష ఉండదు. దేశాన్ని ప్రేమించడం అంటే మనుషులను ప్రేమించడం ఎట్లాగో, భాషను ప్రేమించడం అంటే కూడా ఆ భాషా వ్యవహర్తల పురోగతిని కోరుకోవడమే. సర్వతోముఖాభివృద్ధి అంటే కేవలం సాహిత్య సాంస్కృతిక అంశాలు మాత్రమే కాదు. ఒకప్పుడు చదువు అంటే కేవలం సాహిత్య వైదాంతాది విషయాలు అధ్యయనం చెయ్యడం మాత్రమే. పుస్తకాలు అధికంగా సాహిత్య సంబంధమైనవే ఉండేవి.ఆ విద్యారంగం కూడా సమాజం లోని కొన్ని శ్రేణులకు మాత్రమే పరిమితమై ఉండేది. వలస పాలన కాలంలో అందుబాటులోకి వచ్చిన సార్వత్రిక విద్య –భాష వినియోగాన్ని, చదువు నిర్వచనాన్నిపూర్తిగా మార్చివేసింది. ఆధునిక జీవన విధానం, ఆవిష్కృతమైన నవీన శాస్త్రాలు-భాషను ఒక కీలకమైన , అత్యవసరమైన సాధనంగా ముందుకు తెచ్చాయి. అందుకే గురజాడ అప్పారావు సాహిత్యకారుడే అయినా, పండితులతో చర్చల్లో గిడుగు రామమూర్తి పంతులు సాహిత్య గ్రంథాలనే ఉదాహరణలుగా పేర్కొన్నా- వారు చేసినది సాహిత్యోద్యమం మాత్రం కాదు. “నాది ప్రజల ఉద్యమం ” అని గురజాడ వ్యావహారిక భాషోద్యమం గురించి అన్నారంటే, అది సాహిత్యానికి మించిన విస్తృత పరిధి ఉన్న ఉద్యమమన్న సూచన ఉన్నది. ఆధునిక సమాజం అవతరిస్తున్నప్పుడు, విద్య అందరికీ అందే రోజులు వస్తున్నప్పుడు , చదువు మాధ్యమంగా ఉండే భాష సరళంగా సుబోధకరంగా మాట్లాడే భాషకు దగ్గరగా ఉండాలన్న అవగాహన గురజాడ- గిడుగు ఉద్యమానికి ప్రాతిపదిక. అందుకే వారు పాఠ్య పుస్తకాలలో భాష ప్రమాణాలను నిర్ణయించే విద్య, ప్రభుత్వ వ్యవస్థల్లో పాలుపంచుకుని, విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగారు.

అయితే, వ్యావహారిక ఉద్యమం కొన్ని విజయాలను సాధించిన తరువాత, ఉద్యమంగా పలచబడిపోయింది. విస్తరిస్తున్న విద్య, పత్రికా రంగం, ఇతర మాధ్యమాలు ఇక వ్యవహార భాషను సొంతంగా స్థిరపరుస్తాయనే భావించారు. కానీ, వాడుక భాష అని స్థూలంగా చెప్పదగిన దాన్ని నాటి ఉద్యమం ప్రతిపాదించింది కానీ, ఆధునిక ప్రమాణ భాషను రూపొందించే కర్తవ్యాన్ని అది తీసుకోలేదు. అటువంటి కర్తవ్యం చేపట్టవలసింది ప్రభుత్వాలు. తెలుగును ఆధునిక భాషగా స్థిరపరచేందుకు,ఆధునిక వైజ్ఞానిక శాస్త్రీయ అవసరాలను నేరవేర్చగలిగిన భాషగా రూపొండించేందుకు సంస్థాగత ప్రయత్నాల అవసరం ఉన్నది.సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ-ఆ దిశగా కొన్ని ముందడుగులు వేశాయి కానీ, ఆ వ్యవస్థలే క్షీణించడంతో భాష ఇప్పుడు అనాధ అయింది.
తెలుగును విస్తృతంగా వాడే పత్రికలున్నాయి. చదివే పాఠకులున్నారు. కానీ సమస్త సందర్భాలలోనూ ఉపయోగించగలిగిన పదజాలం లేదు. వాడే పదజాలాన్ని ప్రామాణికమని నిర్ధారించే వ్యవస్థలు లేవు. ఎప్పటికప్పుడు అదనపు జోడింపులతో వచ్చే ఒక సమగ్ర నిఘంటువు లేదు. ఒక మాటను పది రకాలుగా రాయడానికి , పలకడానికి అవకాశమున్నప్పుడు, వాక్య నిర్మాణాలలో ఎనలేని స్వేచ్ఛ ఉన్నప్పుడు –భాష యంత్రాలకు మాత్రం ఎట్లా లొంగుతుంది? అందువల్లనే, తెలుగు కంప్యూటరీకరణ అసమగ్రంగా సాగుతున్నది. యాంత్రిక అనువాదాలలో అనేక సమస్యలున్నాయి. భాషకు ఆవశ్యకమైన ఇటువంటి మౌలిక వసతులు లేకపోవడం వల్ల , ఆధునిక భావనలను తెలుగులో వివరించడం కష్టతరమవుతున్నది. మౌలిక ప్రతిపాదనల చర్చకు తెలుగు యోగ్యం కాకుండా ఉన్నది. కొన్ని శాస్త్రాల్లో తెలుగుకు కొంత ఆస్కారమున్నది కానీ , మరికొన్నిటికి కనీస పరిభాష నిర్మాణం కూడా జరగలేదు. ఇంటర్మీడియేట్ స్థాయిలో కూడా ఇంగ్లీషులో తప్ప తెలుగులో చదవలేని శాస్త్రాలు ఉన్నాయి. తెలుగుకు ఇటువంటి పరిమితులుండటమే దాని విస్తృతిని వైభవాన్ని అడ్డుకుంటున్నది. పారిశ్రామికంగా, ఆర్ధికంగా ముందంజలొ ఉండే సమాజంలో భాషలు కూడా సంపన్నంగా ఉంటాయన్న మాట నిజమే అయినా, వర్ధమాన సమాజాలు ముందంజ వేయడానికి భాషను కాపాడుకుని దాన్ని పరిపుష్టం చేయడం కూడా ఒక మార్గం.

ఆశ్చర్యమూ విచారమూ కలిగే అంశమేమిటంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యవస్థలను కంప్యూటరీకరణ చేస్తున్న తెలుగువారు, తెలుగు సమాజానికి అవసరమైన సాంకేతిక పరికరాలను, వ్యవస్థలనూ కల్పించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ తెలుగుకు సమాచార సాంకేతికతలో ఏర్పడిన అనేక సాధనాలు, సదుపాయాలూ-ప్రభుత్వ ,ప్రైవేటు వ్యవస్థల నుంచి సమకూరినవే అయినప్పటికీ, అవి ఎంతో ఆలస్యంగా సమకూరినవో లేదా కేవలం పరిమిత ప్రయోజనం కోసం వ్యాపార దృష్టితో కల్పించినవే. వాటిలోని అసమగ్రతలను, ఖాళీలను భర్తీ చేసినవారు ప్రవాసాంధ్రులే. వారు వ్యక్తులుగా, ఔత్సాహికులుగా తెలుగును ఇంటర్నెట్లో సమర్ధంగా వినియోగించుకోవడానికి అనేక దోహదాలు చేశారు. అయితే విడివిడి ప్రయత్నాలు కాక, ఒక సామూహిక ప్రయత్నం ద్వారా –తెలుగును ఆధునిక ,వైజ్ఞానిక ,శాస్త్రీయ భాషగా తీర్చిదిద్దడానికి కావలసిన మౌలిక వ్యవస్థలను (పరిభాష, పదజాలాన్ని, ప్రమాణీకరించగలిగిన శాశ్వత నిఘంటు వ్యవస్థ, సమాచార సాంకేతికతను తెలుగు భాషను సమన్వయం చేసే ఒక ఇంటర్ డిసిప్లీనరీ వ్యవస్థ ..మొదలైనవి)ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలి.
తెలుగుకు విశిష్ట భాష గుర్తింపు కావాలనుకోవడం ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. తెలుగును ఆధునిక భాషగా మలచుకోవాలనుకోవడం అభివృద్దికి ఆవశ్యకమైన అంశం. అవ్యాజమై, అమూర్తమైన ఆరాధనను చూపడం కంటే నిర్దిష్టమైన చర్యలతో భాషను కాపాడుకోవడం నేటి అవసరం. గిడుగు –గురజాడ సంకల్పించింది అదే, వారికి మనం ఇవ్వగలిగే నివాళీ, చేయగలిగే కొనసాగింపూ అదే.
---------------------------------------------------------
రచన - కె. శ్రీనివాస్, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

No comments: