Saturday, August 4, 2018

కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోదయము – మొదటి ప్రతీకాత్మక భారతీయ నాటకం.


కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోదయము – 
మొదటి ప్రతీకాత్మక భారతీయ నాటకం.




సాహితీమిత్రులారా!



ఒక గహనమైన సిద్ధాంతాన్ని కానీ, క్లిష్టమైన సందేశాన్ని కానీ చెప్పాలనుకున్నప్పుడు ప్రతీకను (Allegory) ఉపయోగించటం- భారతదేశంలో వేదకాలమంత పురాతనమైనది. దీనికి దృష్టాంతంగా ప్రాచీన ఉపనిషత్సాహిత్యంలో, ముండకోపనిషత్తులోని ప్రముఖమైన శ్లోకం ఇది.

ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే |
తయోరన్యః పిప్పలం స్వాదత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి ||

ఒక చెట్టుపైన రెండు పక్షులు ఉన్నాయి. క్రింద కొమ్మ మీద ఉన్న పక్షి పళ్ళను తింటున్నది. అది మధురమైన పళ్ళను తిన్నప్పుడు సుఖాన్ని, చేదు పళ్ళను తిన్నప్పుడు దుఃఖాన్ని పొందుతున్నది. రెండవ పక్షి ఏమీ తినకుండా ప్రశాంతంగా కూర్చొని చూస్తూ, సుఖదుఃఖాలకు అతీతమైన ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంది.

వృక్షం – జీవునికి, మొదటిపక్షి జీవాత్మకు, రెండవ పక్షిని పరమాత్మకూ ప్రతీకలుగా నిలిపి కూర్చిన అందమైన శ్లోకం ఇది. కాలక్రమంలో మత సంబంధమైన చర్చలలోనూ, ఆధ్యాత్మిక సంబంధమైన సిద్ధాంతాలలోనూ, తత్త్వప్రతిపాదనల విషయాలలోనూ ప్రతీకలను ఉపయోగించటం దాదాపు ప్రతిమతంలోనూ, వివిధ దర్శనాదులలోనూ అనివార్యమైన విషయంగా మారింది. ఈ Allegory అనేది బౌద్ధంలోనూ, బౌద్ధాన్ని పోలిన తావోయిజమ్ వంటి పాశ్చాత్య దర్శనాలలో ఎక్కువగా కనిపిస్తుంది. బౌద్ధసాహిత్యంలో మిళిందప్రశ్నలలో ప్రతీకలు మిక్కుటంగా కనిపిస్తాయి. జైన సాహిత్యంలోనూ ప్రతీకలు ఎక్కువే.

మొత్తానికి ప్రతీకల ద్వారా వినిపించే ఆయా ఆధ్యాత్మిక, మత సంబంధమైన విషయాలే సాహిత్యంలోనూ ప్రవేశించాయి. మహాభాగవతంలో పురంజనుని వృత్తాంతం చక్కని ప్రతీకాత్మక ఉపకథ. నాటక సాహిత్యానికి వస్తే, అశ్వఘోషుని ప్రతీకాత్మకమైన నాటకం ఒకటి ఉన్నట్టు పరిశోధకులు భావించారు కానీ స్పష్టమైన ఆనవాళ్ళు దొరకలేదు.

సంస్క్కృతసాహిత్యంలో రూపకసాహిత్యం చాలా పురాతనమైనది. భాసమహాకవి కాళిదాసుకంటే చాలాపురాతనమైన కవి. ఆ భాసమహాకవి రచించినట్టు చెప్పబడుతున్న బాలచరితమ్ అన్న నాటకంలోని ప్రతీకాత్మకమైన ఉదంతం ఇది.

మధూకుడనే ఒకానొక మహర్షి కంసుని సర్వనాశనం కమ్మని శపిస్తాడు. ఆ శాపరూపుడు వజ్రబాహుడనే పేరుతో కంసుని అంతఃపురంలోకి అడుగుపెడతాడు. కంసుని రాజ్యశ్రీని విష్ణువు ఆజ్ఞప్రకారం అక్కడనుండి వైదొలగమని చెప్పి, తన మిత్రులైన ప్రసుప్త, అలక్ష్మి, ఖలతి, కాళరాత్రి, మహానిద్ర, పింగలాక్షులతో కలిసి కంసుని ఇంట నివాసం ఏర్పరచుకొంటాడు. – ఈ ఘట్టం లోని పాత్రలపేర్లను, ఆ పేర్ల స్వభావాలకు ప్రతీకలుగా నిలిపి, భాసుడు అందమైన నాటకీయత సృష్టిస్తాడు. ఈ ఘట్టం బహుశా – నేడు లభ్యమవుతున్న సంస్కృతనాటకసాహిత్యం ప్రకారం మొట్టమొదటి Allegory కావచ్చు.

భాసనాటకంలోని శాప, రాజ్యశ్రీ తదితర పాత్రలు కేవలం ఒకఘట్టానికే పరిమితం. ఇతివృత్తాన్ని, పాత్రలను, రచన మొత్తాన్ని పరోక్షమైన ఒక సిద్ధాంతాన్ని చెప్పడానికి ఉద్దేశించిన మొదటి సమగ్రమైన ప్రతీకాత్మక రచన కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోదయము.

ఇక్కడ ఒక విషయం. సాహిత్యంలో ప్రతిప్రక్రియకూ కొన్ని పరిమితులూ, పరిధులూ,లక్ష్యాలూ ఉన్నాయి. నాట్యశాస్త్రంలో నాట్యస్వరూపాన్ని గురించి విరూపాక్షునికి బ్రహ్మ వివరిస్తూన్న సందర్భంలో ఇలా అంటాడు.

క్వచిద్దర్మః క్వచిత్క్రీడా క్వచిదర్థః క్వచిచ్ఛమః |
క్వచిద్ధాస్యం క్వచిద్యుద్ధం క్వచిత్కామః క్వచిద్వధః ||
(1- 108)
ధర్మ్యం యశస్యమాయుష్యం హితం బుద్ధివివర్ధనమ్ |
లోకోపదేశజననం నాట్యమేతద్భవిష్యతి ||
(1-115)
వేదవిద్యేతిహాసానా మాఖ్యానపరికల్పనమ్ |
వినోదకరణం లోకే నాట్యమేతద్భవిష్యతి ||
శ్రుతిస్మృతి సదాచార పరిశేషార్థకల్పనమ్ |
వినోదజననం లోకే నాట్యమేతద్భవిష్యతి ||
(1- 119,120 అధికపాఠము)

నాట్యశాస్త్రంలో కొంత ధర్మము, కొంత క్రీడ, కొంత అర్థము, కొంత శాంతి, కొంత హాస్యము, కొంత యుద్ధము, కొంత కామము, ఒకింత వధయునూ కలసి యుండును. ఇది ధర్మమును బోధించును. ఇది యశస్కరము, ఆయుష్షును కలుగజేయునదియునూ. ఇది హితమును గూర్చి బుద్ధికుశలతను పెంపొందించును. లోకులకు ఉపదేశకారకమై ఈ విధముగా నాట్యము ఉద్భవించును. వేదవిద్య, ఇతిహాసాదుల కథలను, వేదపురాణాదుల సదాచారముల యొక్క మూలభావములను పరికల్పించి లోకమును వినోదింపజేయుట నాట్యమగును.

నాట్యశాస్త్రంలో నాట్యస్వరూపం చాలా సమగ్రంగా వివరించినప్పటికి, సంస్కృత సాహిత్యప్రస్థానంలో నాట్యశాస్త్రపు మూలభావం మాత్రం “రసాస్వాదన” గా పరిణమించింది.నాటకం అన్న సాహిత్య ప్రక్రియ – ప్రధానంగా రసప్రతీతికి, తాపోపశమనానికి, ప్రేక్షకుడిని ఆనందింపజేయడానికి లక్ష్యమై కొనసాగింది. ఆపై, అనేక వత్సరాల తర్వాత, సంస్కృతనాటకాలు అనేకం వెలువడిన నేపథ్యంలో నాట్యశాస్త్రాన్ని కాలానుగుణంగా సంస్కరించిన దశరూపకకర్త మరింత సూటిగా ఒకమాట అంటాడు.

ఆనందనిష్యందిషు రూపకేషు వ్యుత్పత్తిమాత్రం ఫలమల్పబుద్ధిః |
యోऽపాతిహాసాదివదాహ సాధుస్తస్మై నమః స్వాదుపరాన్ముఖాయ ||

ఆనందం చిందే నాటకసాహిత్యాన్ని ధర్మార్థకామాదుల ప్రాప్తికోసమని ఎంచే అల్పబుద్ధులకూ, రసాస్వాదనావిముఖులకొక నమస్కారం.

ఈ మూలసూత్రానికి విభిన్నంగా, నాటకప్రక్రియను కేవలం రసాస్వాదనకు కాకుండా, మొట్టమొదటి సారి వైష్ణవాద్వైతసిద్ధాంత తత్త్వబోధకు ఉపయోగించిన నాటకం – ప్రబోధచంద్రోదయము. సూక్ష్మంగా గమనిస్తే – ఈ మార్పు మూలసూత్రానికి విభిన్నమే కానీ విరోధం కాదు. అటు నాటకసూత్రాలను, సంధి సంధ్యంగాలనూ, రసపోషణనూ పాటిస్తూనే ఇటు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధకంగా, ప్రతీకాత్మకపాత్రలతో కృష్ణమిశ్రుడు ఒక క్లిష్టమైన ప్రయోగం సఫలంగా చేశాడు.

ప్రబోధచంద్రోదయమ్ -
ప్రసిద్ధమైన బోధ – ప్రబోధ.
ప్రబోధము అనే చంద్రుని యొక్క పుట్టుక – ప్రబోధచంద్రోదయము.

ప్రబోధచంద్రోదయనాటకపు ప్రధానరసం శాంతము. కొంతపాలు హాస్యాన్ని, వీరరసాన్ని కూడా అక్కడక్కడా పోషిస్తాడు కవి.

కవి – కాలము:

విశ్వవిఖ్యాతమైన ఖజురహో దేవాలయాలను నిర్మించినది చండేలా రాజులు. ఆ రాజులలో కీర్తివర్మ ముఖ్యుడు. కీర్తివర్మ ఆస్థానకవి కృష్ణమిశ్రుడు. ఆ కీర్తివర్మ చేది రాజైన కర్ణుని జయించాడు. కీర్తివర్మ కర్ణుడిని జయించినప్పటికీ, యుద్ధంలో రక్తపాతాన్ని చూసి దుఃఖపడ్డాడుట. ఆతని దుఃఖాన్ని ఉపశమింపజేయటానికి, గోపాలకుడనే మంత్రిని ఆనందింపజేయడానికీ కృష్ణమిశ్రుడు ప్రబోధచంద్రోదయాన్ని రచించాడని అంటారు. కీర్తివర్మ ఎదుట నాటకాన్ని ప్రదర్శించినట్లు ఈ నాటకపు నాంది చెబుతున్నది.

ఆధారాలను బట్టి చూస్తే – పద్దెనిమిదవ శతాబ్దంలో పురాతత్త్వ శాస్త్రజ్ఞులు కనుగొన్న శాసనాన్ని క్రీ. శ. 1028 నాటిదిగాను, అది చేదిరాజైన కర్ణుడిదిగాను గుర్తించారు. అదే విధంగా కీర్తివర్మ తాలూకు క్రీ.శ – 1098 నాటి శాసనాన్ని చారిత్రకులు కనుగొన్నారు. వీరికి సమకాలికుడు కాబట్టి – కృష్ణమిశ్రుని కాలం 11 వ శతాబ్దపు ద్వితీయార్ధం అని అంచనా.

సంగ్రహంగా ఇతివృత్తం:

ఈ నాటక పరమార్థం అద్వైతసిద్ధాంత ప్రతిపాదన. అంటే పురుషుడికి – తాను దైవం తాలూకు మానవ రూపం అన్న జ్జానోదయం, వివేకం ద్వారా కలుగటం – ఈ కథకు పరమార్థం. ఈ జ్ఞానోదయాన్నే ప్రబోధ చంద్రోదయము అని అంటాడు కవి. అయితే ప్రాపంచిక జీవనంలో నిమగ్నమైన పురుషునికి స్వతఃసిద్ధంగా వివేకం కలుగదు. అలా కలుగాలంటే కామ క్రోధ లోభమోహాది అరిషడ్వర్గాలు నశించాలి. (తనలో ఉన్న) వివేకాన్ని మేల్కొలపాలి. వివేకానికి ఉపనిషత్తుల సారమూ, దైవ(విష్ణు)భక్తీ దోహదపడాలి. అప్పుడు వైరాగ్యం, వైరాగ్యం నుండి శాంతి జనించి, ధ్యానంతో ప్రబోధచంద్రోదయం కలుగుతుంది. ఈ ఆధ్యాత్మిక శబ్దజాలాన్ని నిజజీవిత పాత్రలుగా మలిచి – వివేకం, మహామోహము అనే ఇరు వర్గాల మధ్య యుద్ధాన్ని నేపథ్యంగా చిత్రీకరించిన నాటకం ఇది.

అనగనగా పురుషుడు, పురుషుని భార్య మోహము. వీరి సంతానం మనస్సు.
మనస్సు నకు ఇద్దరు భార్యలు. ప్రవృత్తి, నివృత్తి.

నివృత్తి పుత్రుడు వివేకుడు – నాయకుడు. ప్రవృత్తి పుత్రుడు మహామోహుడు – ప్రతినాయకుడు

వివేకుడి భార్య ఉపనిషద్దేవి. మరొక భార్య మతి. వస్తువిచారుడు, సంతోషుడు, క్షమ – వివేకుని సైన్యం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులనే వారు – ఈయన పక్షంలోని అష్ట మంత్రివర్గం. విష్ణుభక్తి వివేకుని ఇష్టదైవం. శాంతి, కరుణ,మైత్రి పరిచారికలు.

మహామోహుని సైన్యంలో – కాముడు, అతని భార్య రతి, అహంకారి, అతని పుత్రుడు లోభుడు, లోభుని భార్య తృష్ణ, దంభుడనే కొడుకు, క్రోధుడు – క్రోధుని భార్య హింస మొదలైన వారు.ఇంకా చార్వాకుడు, దిగంబరసిద్ధాంతి, బుద్ధాగముడు, సోమసిద్ధాంతుడు – ఇతని పరివారం.

వివేకునికి, మహామోహునికి మధ్య యుద్ధం జరుగుతుంది. మహామోహుని పరివారం నశిస్తుంది. అతడు కనుమరుగవుతాడు. అటుపై, వివేకునికీ, ఉపనిషద్దేవికీ ప్రబోధచంద్రుడు ఉదయించడం నాటకపరిసమాప్తి.

***

విశేషాలు:

సాధారణంగా కావ్యం నాంది లో ఇతివృత్తాన్ని చెప్పడం కద్దు. ఈ నాటకం అష్టపదనాంది. ఇందులో మొదటి శ్లోకం ఇది.

మధ్యాహ్నార్క మరీచికాస్వివ పయఃపూరో యదజ్ఞానతః
ఖం వాయుర్జ్వలనో జలం క్షితిరితి త్రైలోక్యమున్మీలతి |
యత్తత్వం విదుషాం నిమీలతి పునః స్రగ్భోగిభోగోపమమ్
సాంద్రానందముపాస్మహే తదమలం స్వాత్మావబోధం మహః ||

దేని అజ్ఞానము వలన ముల్లోకాలూ ఎండమావి వలే పంచభూతాలుగా ప్రాపిస్తాయో, తిరిగి దేని తత్త్వం వివేకులను (సర్పపు భ్రాంతిని తొలగించిన) పూలదండవలే మేల్కొలుపుతుందో, ఏది గొప్ప ఆనందానికి నిలయమై భాసిస్తుందో, అట్టి ఆత్మావబోధమైన నిర్మలమైన తేజస్సును ఉపాసిస్తున్నాను.

శైలి:
కృష్ణమిశ్రుని కవిత్త్వం ధారాశుద్ధి గలది. అర్థవ్యక్తి భరితమైనది. అర్థవ్యక్తి – అంటే చదువుతూ (లేదా వింటూ) ఉన్నప్పుడే సద్యఃస్ఫూర్తిగా అర్థం అవగతం అవడం. ఉదాహరణకు ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.

ఏకామిషప్రభావమేవ సహోదరాణాం
ఉజ్జృంభతే జగతి వైరమివ ప్రసిద్ధమ్ |
పృథ్వీనిమిత్తమభవత్ కురుపాండవానాం
తీవ్రస్తథా హి భువనక్షయకృద్విరోధః ||

(కాముడు, వివేకమూ ఒకే తండ్రి (మనస్సు) బిడ్డలైనా వారిద్దరికీ మధ్య జ్ఞాతివైరమెందుకు ఉదయించిందని రతి కాముణ్ణి ఒక సందర్భంలో ప్రశ్నిస్తుంది. దానికి సమాధానంగా కాముడు ఈ శ్లోకాన్ని చెబుతాడు.”ప్రపంచంలో జ్ఞాతుల మధ్య వైరం ఒకే కారణాన్ని ఆపేక్షించడం వలన కలుగుతుంది. కాసింత భూమి కోసం కురుపాండవుల వైరం మొదలై, మొత్తం భూమిని నశింపజేసింది కదా!”)

తత్వ సిద్ధాంతాలను ఒక దృశ్యనాటకంలో నిక్షేపించటం చాలా కష్టం. అందుకు కృష్ణమిశ్రుడు అర్థవ్యక్తిని బాగా ఉపయోగించుకున్నాడు. కవిత్వాన్ని సాధ్యమైనంత సరళంగా మార్చాడు. ఈ క్రింది శ్లోకం చూడండి.

యస్మాత్ విశ్వముదేతి యత్ర రమతే యస్మిన్ పునర్లీయతే
భాసా యస్య జగద్విభాతి సహజానందోజ్జ్వలం యన్మహః |
శాన్తం శాశ్వతమక్రియం యం పునర్భావాయ భూతేశ్వరం
ద్వైతధ్వాన్తమపాస్య యాన్తి కృతినః ప్రస్తౌమి తం పూరుషమ్ ||

ఎవ్వని నుంచి విశ్వం పుడుతుందో, ఎక్కడ సంగమిస్తుందో, ఎక్కడ తిరిగి లీనమవుతుందో, ఎవని కాంతి జగత్తును వెలిగిస్తుందో, సహజమైన ఆనందంతో ఉజ్జ్వలంగా ఉంటుందో, శుద్ధుడు, శాశ్వతుడు, క్రియారహితుడైన ఎవ్వని పవిత్రులు, అద్వైతసిద్ధులూ చేరుకొని, తిరిగి రారో, అట్టి పురుషుని స్తుతిస్తున్నాను.

పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని ఒక ప్రముఖమైన పద్యం ఈ ఛాయలతో ఉంటుంది.

ఉ||
ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయు డెవ్వడు సర్వము దానయైనవా
డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరునే శరణంబు వేడెదన్.

ఆముక్తమాల్యదలోని మాలదాసరి ఉపాఖ్యానంలోని శ్లోకమూ అలాగే మొదలవుతుంది.

ఉ||
ఎవ్వని చూడ్కి జేసి జనియించు జగంబు వసించు నిజ్జగం
బెవ్వని యందు డిందు మరి యెవ్వనియం దిది యట్టి విష్ణుతో
నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేడ నే
నెవ్విధినైన నిన్ గదియనేని యనన్విని బంధ మూడ్చినన్.

అనువాదాలు, అనుసరణలు:

ప్రబోధచంద్రోదయ నాటకం సంస్కృతసాహిత్యంలో ఒక ఒరవడి సృష్టించింది. ఘనశ్యాముడన్న కవి ఈ నాటకానికి వ్యాఖ్యానాన్ని రచించాడు. మరొక వ్యాఖ్యానాన్ని రాయల వారి కాలంలో నాదెండ్ల గోపమంత్రి వ్రాశాడుట. తదనంతరం పలు నాటకాలు ప్రబోధచంద్రోదయాన్ని అనుసరించి సాగాయి. వీటిలో వేదాంతదేశికుల వారి పది అంకాల ’సంకల్ప సూర్యోదయము’ ప్రముఖమైనది. ఇది విశిష్టాద్వైతపరమైన ప్రకరణము. మిగిలినవి కూడా కొన్ని-

మోహపరాజయము – యశపాలుడు
చైతన్యచంద్రోదయము – కవికర్ణపూరుడు (చైతన్య ప్రభుపాదుని తత్త్వస్థాపన)
పూర్ణపురుషార్థచంద్రోదయము – జాతవేదుడు. ఇంకా భావనాపురుషోత్తమము, ధర్మవిజయము, విద్యాపరిణయము, వేదాంతవిలాసము, అమృతోదయము, ఇత్యాది పెక్కు రచనలకు ప్రబోధచంద్రోదయం మూలము.

ముగింపు:
రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ఫ్రాన్సు దేశంలో Absurd Art అన్న ఒక సామాజిక చలనం మొదలయిన విషయం విజ్ఞులైన పాఠకులకు తెలుసు. అంతకు చాలాకాలం ముందు ద్వైతాద్వైత విశిష్టాద్వైత మతాల నేపథ్యంలో బౌద్ధమతం ప్రాభవం కోలుపోయిన దశలో, భక్తియుగం ఊపునందుకుంటున్న కాలంలో, ప్రాకృత భాషాభేదాలు నెమ్మదిగా దేశ్యభాషలలో పరిణామం చెంది, భరతఖండం మరింత భిన్నత్వాన్ని సంతరించుకుంటున్న సంధియుగంలో ప్రతీకాత్మక నాటకాల వెల్లువ మొదలయినట్టు తెలుస్తూంది. ఈ వెల్లువకు నాంది ఈ ప్రబోధచంద్రోదయము. ప్రబోధచంద్రోదయాన్ని తెలుగు పద్యకావ్యంగా నంది మల్లయ్య అనే ప్రబంధకవి రచించాడు. ఆధునిక కాలంలో చక్కటి తెనుగుసేత – కందుకూరి వీరేశలింగం గారు చేశారు. ప్రబోధచంద్రోదయనాటకంపై ఓ చిన్న సూచన ఈ వ్యాసోద్దేశ్యం.
---------------------------------------------------------
రచన - రవి E.N.V, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

No comments: