Friday, August 24, 2018

కవికులగురువు - 1


కవికులగురువు - 1
సాహితీమిత్రులారా!

కవికుల గురువు కాళిదాసును గురించిన
వ్యాసంలో మొదటి భాగం
ఆస్వాదించండి-

మహాకవి కాళిదాసు గురించి వ్రాసిన తన వ్యాసంలో శ్రీ అరోబిందో అంటారు: భారతజాతి తనకున్నదంతా కోల్పోయినా, వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణం, వ్యాస మహాభారతం, కాళిదాస గ్రంధాలూ మిగిల్తే చాలు. అవి మన ఆలోచనా విధానాలకీ, విశ్లేషణకీ, మనం నిర్మించుకున్న సంస్కృతికీ, మన నైతిక, మానసిక, తాత్విక, రస సిద్ధులకీ వాటి పరిణామ క్రమానికీ, మనం జీవితాన్ని వైభవోపేతం చేసుకున్నపద్ధతులకీ, సాధనలకీ ప్రతీకలన్నది శ్రీ అరోబిందో పరిశోధించి మనకి అందించిన సత్యం.

పాత రోజుల్లో, అంటే కొన్ని వేలసంవత్సరాల క్రితం, భారతదేశంలో ప్రజలు రకరకాల జీవన విధానాల మీద ప్రయోగాలు చేశారు. వాటిలో ముఖ్యంగా చెప్పవలసినవి మూడు రకాల ప్రయోగాలు. మొదటిది నైతిక జీవనాన్ని, రెండవది తార్కిక జీవనాన్ని, మూడవది రసమయ జీవనాన్ని ఆధారంగా చేసుకున్నవి. నైతికజీవనాన్ని వాల్మీకి మహర్షి, తార్కికజీవనాన్ని వ్యాస మహర్షి, వివరిస్తూ ప్రతిబింబిస్తూ శ్రీమద్రామాయణ, మహాభారతాల్ని అందించారు.

కొన్ని వేల సంవత్సరాల తరువాత, ప్రజాజీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుని, ప్రజల్లో జీవితాన్ని పండగలా చేసుకోవాలనే ఆరాటం మొదలైంది. ఆ రసమయ ప్రపంచాన్ని మనకందించడం లోనూ, తన సృజనాత్మకతతో పరిపుష్టం చేయడం లోనూ, అలాంటి జీవితాన్ని ఆనందించడానికి సరైన మానసికస్థితుల్ని తెలియజెయ్యడం లోనూ, మార్గదర్శకుడైన వాడు మహాకవి కాళిదాసు. వాల్మీకి, వ్యాసులని వ్యతిరేకించకుండా, ఆ ధర్మాన్ని చాటుతూనే, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం అన్న ప్రక్రియని తనవైన కొత్త భావాల్తో కవిత్వరూపంలో ఆవిష్కరించిన స్రష్ట. రసమయ జీవితాన్ని తరవాత తరాల కోసం రకరకాల రంగుల్లో చిత్రీకరించిన తొలికవి. ఆ తరవాత వచ్చిన కవులు ఈతని పంథాలోనే పయనించారు. రసమయ భావప్రపంచాల్ని కావ్యాలుగా మలచారు. కాని, ఏ కవులూ కాళిదాసుకున్న ప్రతిభావ్యుత్పత్తుల్ని ప్రదర్శించలేకపోయారన్నది అందరూ ఒప్పుకున్న సత్యం. ఈ భావాల్నే కొందరు చిన్న శ్లోకంలో చమత్కారంగా చెప్పారు.

పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా
అద్యాపి తత్తుల్యకవే రభావాదనామికా సార్ధవతీ బభూవ

[పురా = పూర్వం రోజుల్లో; కవీనాం గణనా ప్రసంగే = కవులను లెక్కించే ప్రస్తావన వచ్చినప్పుడు; కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా = చిటికినవేలు మీద కాళిదాసు నిలబడ్డాడు. అద్యాపి = (అప్పటినుంచి) ఈ రోజు దాకా; తత్ తుల్యకవేః = అతనికి సమానమైన కవియొక్క; అభావాత్ = (ఉనికి) లేకపోవడంవల్ల; అనామికా = ఉంగరంవేలు (అనామిక); సార్ధవతీ బభూవ = సార్ధకనామధేయురాలైంది.]

(పూర్వం కవుల్ని లెక్క పెడదామని మొదలు పెట్టి, లెక్కపెట్టేవాడు చిటికిన వేలెత్తి ‘కాళిదాసు’ అన్నాడు. తర్వాత పక్కనున్న వేలు ఎత్తి ఇంకో కవి పేరు చెప్పాలంటే (అది ఉంగరం వేలు, చిటికినవేలు కన్న పెద్దది) అంతకన్న పెద్దకవిని లెక్కపెట్టాలి. అలాంటివాడు లేడు కాబట్టి ఆ లెక్కపెట్టేవాడు అక్కడే ఆగిపోయాడు. ఆ కారణం వల్ల ఉంగరం వేలుకి అనామిక (పేరులేనిది) అన్న పేరు సరిగ్గా సరిపోయింది.)

మిగిలిన కవులు కూడా గొప్ప కవిత్వాన్ని సృష్టించారనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని జయదేవుడు ఒక శ్లోకంలో మనోహరంగా చెప్తాడు.

యస్యాశ్చోర శ్చికురనికరః కర్ణపూరో మయూరో
భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః
హర్షో హర్షో హృదయవసతిః పంచబాణస్తు బాణః
కేషాం నైషా కథయ కవితాకామినీ కౌతుకాయ

[యస్యాః = ఎవరికి; చోరః = చోరకవి; చికురనికరః = చిక్కని జుట్టో; మయూరః = మయూరుడు; కర్ణపూరః = చెవికమ్మయో; భాసః = భాసుడు; హాసః =నవ్వో; కవికులగురుః = కవికులగురువైన; కాళిదాసః = కాళిదాసు; విలాసః = విలాసమో; హర్షః = శ్రీహర్షుడు; హర్షః = ఆనందమో; బాణః= బాణుడు; హృదయవసతిః = మనసులో నిలచిన; పంచబాణః = మన్మథుడో ; ఏషా కవితాకామినీ = అట్టి ఈ కవితాకామిని; కేషాం = ఎవరికి; కౌతుకాయ = ఉత్సాహము కొరకు (ఉత్సాహమునిచ్చునది); న తు = కాదో; కథయ = చెప్పుము?]

(కవితాకామినికి చోరకవి కేశపాశం, మయూరుడు చెవులకి ఆభరణంలాంటి వాళ్ళు. భాసుడు ఆమె చిరునవ్వు. కవికులగురువు కాళిదాసు ఆమె విలాసం. హర్షుడు ఆమె ఆనందం. బాణుడు ఆమె మనసులో నిలచిన మన్మథుడు. ఇలాంటి అమ్మాయి ఎవరికి ఉత్సాహం కలగించదో చెప్పండి )

ఈ ప్రశంసలో జయదేవకవి ఒక్క కాళిదాసుని గురించి చెప్పినప్పుడు మాత్రమే కవికులగురుః అని సంబోధించాడు.

భాష, భావం, రసఙ్ఞత, దృశ్యచిత్రీకరణ, పరిసరాల పరిశీలన, మనోహరమైన భావవ్యక్తీకరణ, శిల్పసౌందర్యం, రమ్యంగా కథ చెప్పడం, మనోవిశ్లేషణ, విషయపరిజ్ఞానం, … ఇలా ఎన్నో విషయాలు కవితాత్మలో భాగాలు. కాళిదాసు వీటన్నిటినీ నభూతో నభవిష్యతి అన్నట్లు పోషించి ప్రతి కావ్యాన్నీ, ప్రతి శ్లోకాన్నీ, ప్రతి నాటకాన్నీ భారతీయ సంస్కృతికి దర్పణంగా సృష్టించి అర్పించి కవికులగురువయ్యాడు. అంతే కాదు, అలాంటి విద్యని అభ్యసించడానికి పునాదుల్ని వేసి జాతికి అధ్యాపకుడయ్యాడు.

కాళిదాసు భారతీయ కవితకి ఆత్మ వంటివాడు. కవిత ఏ రూపాన్నైనా పొంది ఉండవచ్చు. కవితాత్మ పాలు కొంతైనా దానిలో ఉంటుంది. ఇలా కాళిదాసప్రభావం తరువాత తరాల కవుల్లో ఉంటూనే వచ్చింది. కాళిదాసు భారతసంతతికి కేవలం కవిత్వాన్నే ఇవ్వలేదు. ఇంకా కొన్ని మౌలిమైన, మేధాపరమైన, సాంస్కృతిక పరమైన ఉపాధుల్ని సమకూర్చాడు. అవేమిటి? కాళిదాసు కవికులగురువు ఎందుకయ్యాడు? అన్నది ఈ వ్యాసానికి మూలవస్తువు.

కవితాత్మలో కొన్ని భాగాల్ని కాళిదాసు ఎలా పండించి పోషించాడు? ఏ విధంగా అతడు మనకి అధ్యాపకుడు? అన్నది స్థూలంగా చర్చించడమే మిగిలిన వ్యాసం యొక్క ముఖ్యోద్దేశ్యం. కాళిదాసు కవిత్వంలో రసజ్ఞత గురించి వేరే చెప్పక్కర్లేదు. అది అన్నివేళలా తొణికిసలాడుతూనే ఉంటుంది. ఇక మిగిలిన విషయాలకొస్తే, ఇంత చిన్న వ్యాసంలో అన్నీ కూలంకషంగా (ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డు దాకా) చర్చించడం సాధ్యం కాదు కాబట్టి, కొన్నింటిని కాస్త విశదంగా, కొన్నింటిని స్థాలీపులాకంగా, కొన్నింటి గురించి సూక్షంగానూ చెప్పి ముగిస్తాను.

1. భాష
భాషని నాదయోగంగా భావించినవాడు కాళిదాసు. పలికే మాట (శబ్దం), దానికున్న అర్ధం, వీటి మధ్యనున్న విడదీయరాని అర్థనాదేశ్వరబంధం అర్ధనారీశ్వరబంధంలాంటిదని పూర్తిగా తెలిసినవాడు. కాబట్టే రఘువంశాన్ని,

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ — (రఘువంశః 1-1)

అని మొదలు పెట్టాడు. పైగా వాగర్థప్రతిపత్తి (శబ్దం, అర్థం రెండింటికీ సంబధించిన జ్ఞానం అబ్బడం) కోసమే జగత్తుకి తల్లిదండ్రులైన (పితరౌ) పార్వతిని, పరమేశ్వరుణ్ణీ ప్రార్థిస్తున్నానన్నాడు. పార్వతీపరమేశ్వరౌ = పార్వతీప + రమేశ్వరౌ అని విడదీస్తే శివుడు, విష్ణువు అనే అర్థం వస్తుంది. సంస్కృతభాషలో పితరౌ అంటే ఇద్దరు తండ్రులు అని కూడా అర్థం ఉంది. అందువల్ల ప్రపంచానికి తండ్రులైన శివవిష్ణువులను కూడా ప్రార్థిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. మొదటి శ్లోకంలోనే, వాగర్థప్రతిపత్తికోసం ప్రార్థిస్తున్నా (వందే) అనగానే అది పుష్కలంగా దొరికేసినట్టుంది, వెంటనే పార్వతీపరమేశ్వరౌ అనే గొప్ప శ్లేష చూపాడు.

రమ్యమైన పదాల్తో పూలజల్లులు కురిపించడం, కోమలమైన పదబంధాల్తో కట్టిపారెయ్యడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. సంస్కృతభాషతో పరిచయం తక్కువ ఉన్న (లేదా అసలు లేని) వాళ్ళకి కూడా హృద్యంగా తోచే విధంగా కూడా వ్రాశాడు. కేవలం పదనాదం ద్వారా రమ్యతను సృష్టించాడు. ఋతుసంహార కావ్యంలో కాళిదాసు ఆరు ఋతువుల్నీ ఆరు సర్గల్లో వర్ణించాడు. మచ్చుకి ఋతుసంహారం లోని మూడు శ్లోకాలు చూడండి.

సదా మనోఙ్ఞం స్వనదుత్సవోత్సుకం వికీర్ణ విస్తీర్ణ కలాపి శోభితం
ససంభ్రమాలింగనచుంబనాకులం ప్రవృత్తనృత్యం కులమద్యబర్హిణామ్ – (వర్ష ఋతువు)

(ఎప్పుడూ మనోజ్ఞంగా, శబ్దాలతో కూడిన మహోత్సవంలో తేలియాడుతూ, విస్తరించి విసరబడిన పింఛంతో శోభిస్తూ ఉన్న నెమళ్ళ గుంపులు ఇప్పుడు ముప్పిరిగొన్న ఆనందంలో ఒకదాన్నొకటి కౌగిలించుకుంటూ, ముద్దులాడుకుంటూ నాట్యం చెయ్యడం మొదలుపెట్టాయి. పైన చెప్పిన శబ్దాలు నెమళ్ళ కేకలు కావచ్చు లేదా మేఘాల గర్జనలు కావచ్చు.)

నితాంత లాక్షారసరాగరంజితైః నితంబినీనాం చరణైః సనూపురైః
పదే పదే హంసరుతానుకారిభిః జనస్య చిత్తం క్రియతే సమన్మథమ్ – (గ్రీష్మ ఋతువు)

(దట్టంగా పూసిన లాక్షారసం రంగు వల్ల ఎర్రబడి, అందెలతో కూడిన స్త్రీల పాదాలు అవి వేసే ప్రతీ అడుగులోనూ హంసల ధ్వనులను అనుకరిస్తున్నట్టుగా ఉన్నాయి. అది విన్న జనులందరి మనస్సులూ మన్మథప్రభావాన్ని పొందుతున్నాయి.)

ఆమ్రీ మంజులమంజరీ వరశరః సత్కింశుకం యద్ధనుః
జ్యా యస్యాలికులం కలంకరహితం ఛత్రం సితాంశుః సితం
మత్తేభో మలయానిలః పరభృతా యద్ద్వందినో లోకజిత్
సోఽయం వో వితరీతరీతు వితనుర్భద్రం వసంతాన్వితః – (వసంత ఋతువు)

(ఎవడి గొప్ప బాణాలు అందమైన ఆకర్షణీయమైన మామిడిపూల గుత్తులో, ఎవడి విల్లు మోదుగపువ్వో, ఎవడి వింటినారి తుమ్మెదల బారో, ఎవడి మచ్చలేని తెల్లని గొడుగు తెల్లని కిరణాల్తో కూడిన చందమామో, ఎవడి మదపుటేనుగు గంధపుచెట్లున్న మలయపర్వతపు వాయువో, ఎవడి వంది జనం (స్తోత్రపాఠాలు చేసేవాళ్ళు) కోకిలలో, అటువంటి లోకాల్ని జయించే మన్మథుడు, తన స్నేహితుడైన వసంతుడితో కలిసివచ్చి (అంటే వసంతకాలంలో) మీ అందరిమీదా సుఖభాగ్యాల్ని వెదజల్లుగాక! )

ఋతుసంహారం కాళిదాసు తొలిరోజుల్లో వ్రాసినది. రాను రాను, పదలాలిత్యానికి గాఢమైన భావాల్ని కూడా జోడించి తన భాషకీ, పదనాదానికీ కొత్త రంగులు దిద్దాడు. తరువాత వ్రాసిన రఘువంశ, కుమారసంభవ, మేఘదూత కావ్యాల్లో ఇది బాగా కనిపిస్తుంది. ఆ కావ్యాలు చదివి ఆనందించాలంటే సంస్కృతభాష నేర్చుకోవాలి. శ్రీమద్రామాయణం చదవాలంటే కొద్దిగా భాష తెలిస్తే చాలు. ఒక విధంగా చెప్పాలంటే, ఏ భాషవాళ్ళకి, ఆ భాషలో వాల్మీకి మహర్షి వ్రాసిన పాటలా ఉంటుంది. శ్లోకంలో ఉన్న పదాల్ని గద్యక్రమంలో (కర్త-కర్మ-క్రియ వరసలో) పేర్చుకుని అర్థం చేసుకోవడం చాలా సులువు. కాళిదాసు కావ్యాలకొస్తే, ఋతుసంహారంలో తప్ప మిగిలిన కావ్యాల్లో శ్లోకాల్ని గద్యక్రమంలో పేర్చుకోవడం, కొన్ని పదబంధాలకి అర్థాన్ని తెలుసుకోవడం అంత సులువు కాదు. భాషను ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి. ఆ పరిణామాన్ని పై మూడు శ్లోకాల్లోనే చూడవచ్చు. వీటిలో మూడవ శ్లోకం ఋతుసంహారంలో ఆఖరి సర్గ అయిన వసంతర్తువులో ఆఖరి శ్లోకం.

ఇలా భాషను నేర్వగా, నేర్వగా ఈ క్రింద చెప్పిన లాంటి శ్లోకాల్లో, గీతరచయిత వేటూరి చెప్పినట్టుగా ‘ఆరు ఋతువులూ ఆహార్యములై’ కనిపిస్తూంటే, భావాల విందు, నాదాల పసందు రెండింటినీ అనుభవిస్తాం.

అది కుబేరుడి అలకానగరం అవడం వల్ల అన్ని ఋతువులూ అన్ని వేళలా ఉంటాయి. అందువల్ల అక్కడి వనితలు అన్ని ఋతువుల పువ్వుల్నీ అన్ని వేళలా దేహమంతా ధరిస్తారని మేఘుడికి (మబ్బుకి) యక్షుడు చెప్తున్నాడు.

హస్తే లీలాకమల మలకే బాలకుందానువిద్ధం
నీతా లోధ్రప్రసవరజసా పాండుతామాననే శ్రీః
చూడాపాశే నవకురువకం చారు కర్ణే శిరీషం
సీమంతే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్ – (మేఘసందేశః 2-2)

[యత్ర= ఏ (అనగా ఆ కుబేరుని అలకానగరంలో); వధూనామ్ = స్త్రీల యొక్క; హస్తే = చేతిలో; లీలా కమలమ్ = విలాసం కోసం పట్టుకున్న తామరపువ్వు (ఇది శరదృతువులో లభిస్తుంది); అలకే = ముంగురుల్లో; బాలకుందానువిద్ధమ్ = తురుముకోబడ్డ అప్పుడే విరిసిన మల్లెలు (ఇది హేమంత ఋతువులో లభిస్తుంది); ఆననే = ముఖం మీద; లోధ్రప్రసవరజసా = లొద్దుగ పువ్వుల పుప్పొడిచేత (దీన్ని పౌడర్ లా వాడి); నీతా= ఇవ్వబడిన; పాండుతామ్ శ్రీః= గౌరవర్ణపు శోభ (లొద్దుగ శిశిర ఋతువులో లభిస్తుంది); చూడాపాశే = కొప్పు ముడిలో; నవకురువకం = ఎర్ర గోరింట పువ్వు (ఇది వసంత ఋతువులో లభిస్తుంది); కర్ణే = చెవియందు; చారు శిరీషం = అందమైన దిరిసెన పువ్వు (ఇది గ్రీష్మ ఋతువులో లభిస్తుంది); సీమంతే = పాపటలో; త్వత్ =నీ; ఉపగమజం = రాక వల్ల పుట్టిన (వర్షాకాలం లో లభించే); నీపం చ = నీపకుసుమమూ (ఉంటాయో/యి).]

ఈ విధమైన భాషావికాసమే కాళిదాసుని కవికులగురువుగా మాత్రమే కాదు, సంస్కృతగురువుగా కూడా నిలబెట్టింది. సంస్కృతం నేర్చుకోవడంలో మొదటి భాగం పంచకావ్యాలు గురువు దగ్గర కూర్చుని చదివి అర్థం చేసుకోవడం. పంచకావ్యాలంటే రఘువంశం (కాళిదాసు), కుమారసంభవం (కాళిదాసు), కిరాతార్జునీయం (భారవి), శిశుపాలవధం (మాఘుడు), నైషధీయ చరితం (శ్రీహర్షుడు). దాక్షిణాత్యులు కొందరు నైషధీయ చరితం బదులు మేఘసందేశం (కాళిదాసు) అని అంటారు. ఏ లెక్కన చూసినా, అధ్యయనం విషయానికొస్తే, కాళిదాస గ్రంథాలకే పెద్దపీట. భాష నేర్వాలన్నా, భాషాసౌందర్యాన్ని అనుభవించాలన్నా కాళిదాసే.

ఆ కావ్యాల్ని చదవడం కూడా పైన చెప్పిన వరస లోనే చదవాలి. అప్పుడే భాషని సవ్యంగా నేర్చుకోగలుగుతాం. రఘువంశంలో భాష సరళంగా ప్రారంభమై, ఒక కావ్యాన్నుండి మరో కావ్యానికి వెడుతూంటే సంక్లిష్టంగా మారుతూ విద్యార్థుల మెదడుకి పరీక్షలు పెడుతుంది. అందుకే, నైషధం విద్వదౌషధం అనే సామెత. ఈ పాఠ్యప్రణాళికలో, కాళిదాసు విద్యార్ధులకిచ్చిన గొప్ప బహుమతి రఘువంశం నుంచీ కూడా కవితాసువాసనల్ని వెదజల్లడం. ఒకప్రక్క భాషని నేర్చుకుంటూండగానే, అద్భుతమైన భావసంపదలో చదువుకునే వాళ్ళని ముంచి తేల్చడం. భాషావిషయమైన అంతరార్ధాల్ని తెలియజెప్పడం. (రఘువంశం మొదటి శ్లోకంలోనే చూడండి. పదానికీ, దానికుండే అర్థానికీ గల సంబంధంతో మొదలు పెట్టాడు కావ్యాన్ని.)

కాళిదాసుకి భాషావ్యాకరణాలపైన ఉన్న మక్కువ గురించి సరదాగా, సూచనప్రాయంగా కొన్ని ఉదాహరణలిస్తాను.

తా నరాధిపసుతా నృపాత్మజైః తే చ తాభి రగమన్ కృతార్థతామ్
సోఽభవ ద్వర వధూ సమాగమః ప్రత్యయ ప్రకృతి యోగ సన్నిభః (రఘువంశః 10- )

[తాః నరాధిపసుతాః = ఆ రాజకన్యలైన సీత, ఊర్మిళ, మాండవిక, శ్రుతకీర్తులు; నృపాత్మజైః = రాజకుమారులైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల చేతనూ; తే తాభిః చ = వీరు వారిచేతనూ (అంటే రామలక్ష్మణభరతశత్రుఘ్నులు, సీత-ఊర్మిళ-మాండవిక-శ్రుతకీర్తుల చేతనూ); కృతార్థతామ్ = కులం, శీలం, వయస్సు, రూపం మొదలయినవాటిని; అగమన్ = పొందిరి. సః వరవధూ సమాగమః = ఆ పెళ్ళికొడుకుల, పెళ్ళికూతుళ్ళ కలయిక; ప్రత్యయ ప్రకృతి యోగ సన్నిభః = ప్రత్యయాల యొక్క,ప్రకృతుల యొక్క కలయికలా ప్రకాశించినదిగా; అభవత్ = అయ్యెను.]

సంస్కృత భాషలో ప్రకృతికి ప్రత్యయాన్ని జత చేస్తేనే ఉద్దేశింపబడ్డ అర్థం వస్తుంది. దాదాపు ఇది అన్ని భారతీయభాషలకీ వర్తిస్తుంది. ఉదాహరణకి, భూ (ఉండు), డుకృఞ్ (చేయు) అనే పదాలు ప్రకృతులు (ఇవి ధాతువులైన ప్రకృతులు). వీటికి తిజ్ అనే ప్రత్యయం చేరి భవతి (ఉన్నది, ఉన్నాడు) కరోతి (చేయుచున్నది, చేయుచున్నాడు) మొదలైన అర్థాలున్న పదాలు ఏర్పడతాయి. ఇలా, సుప్, సన్ మొదలైన రకరకాల ప్రత్యయాలు వేర్వేరు ప్రకృతులకు చేరి రకరకాల పదాలు ఏర్పడి అర్థాన్నిస్తాయి. ఇలా పదార్థాల్నిచ్చే కలయికతో, పురుషార్ధాల్నిచ్చే వధూవరుల చేరికని పోలుస్తున్నాడు కాళిదాసు పై శ్లోకంలో.

ఇలా ఎన్నో సందర్భాల్లో వ్యాకరణ విషయాల ప్రసక్తిని తెస్తూనే ఉంటాడు. ధాతోః స్థాన ఇవాదేశం సుగ్రీవం సంన్యవేశయత్ — అంటాడు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యమిప్పించే సందర్భంలో (రఘు 12-58.) ధాతువు యొక్క స్థానంలో ఆదేశధాతువు వచ్చినట్టు వాలి స్థానంలో సుగ్రీవుణ్ణి స్థాపించాడని సామ్యం చెపుతున్నాడు. అస్తేర్భూః అనే పాణిని యొక్క వ్యాకరణ సూత్రప్రకారం అస ధాతుస్థానంలో భూ అనే ఆదేశ ధాతువు వచ్చి చేరుతుంది. ఇలాంటివే మరికొన్ని:

సంస్కారవత్యేవ గిరా మనీషీ
తయా స పూతశ్చ విభూషితశ్చ – (కుమారసంభవమ్ 1-28)

[సంస్కారవత్యా = వ్యాకరణం మొదలైనవి చదవగా పుట్టిన సంస్కారంతో కూడిన; గిరా = వాక్కుచేత; మనీషీ ఇవ= పండితుని వలె; తయా = ఆమె చేత (పార్వతీదేవి చేత); సః = అతడు (పార్వతి తండ్రియైన హిమవంతుడు); పూతః = పవిత్రుడు; చ= మరియు; విభూషితః చ = అలంకరింపబడ్డవాడు కూడా (అయ్యాడు).]

పురాణస్య కవే స్తస్య వర్ణస్థాన సమీరితా,
బభూవ కృతసంస్కారా చరితార్థైవ భారతీ – (రఘువంశః 10-36)

[పురాణస్య = మిక్కిలి పురాతనుడైన; కవేః = కవి అయిన(సర్వం తెలిసిన); వర్ణ = అకారం మొదలు క్షకారం వరకూ ఉన్న అక్షరాల యొక్క; స్థాన= ఉత్పత్తి స్థానాలైన కంఠం, అంగుడు, నాలుక, దంతాలు, పెదవులు యందు; సమీరితా=చక్కగా ఉచ్చరింపబడ్డదీ; కృతసంస్కారా= చేయబడిన (బాగా ఉచ్చరించాలనే) ప్రయత్నాలు గలదీ అయిన; భారతీ = వాణి లేదా వాక్కు; చరితార్థా ఏవ బభూవ = కృతార్థురాలు తప్పక అయినది.]

అందమైన, వినసొంపైన, సరళమైన పదాలు వాడి కవిత్వం వ్రాయడం కాళిదాసు ప్రత్యేకత. ఇతని కవితారీతి వైదర్భీ రీతి. వైదర్భీ రీతిలో గంభీరమైన భావాల్ని చిన్నచిన్న పదాల్లో హృద్యంగా చెప్పాలి. ఆ రీతిని అవలంబించి అద్భుతంగా కవిత్వం వ్రాసిన వారిలో ఇతడు అగ్రగణ్యుడు. ముఖ్యంగా, పదాలవాడకంలో ఇతని సందర్భశుద్ధి ఎన్నదగ్గది. ఆ పదాలేవీ ఇతడు కొత్తగా కల్పించినవి కావు. అవి చదివేటప్పుడు మనకు దొరికే సంపద ఎలా ఉంటుందో చెప్పడానికి రెండు ఉదాహరణలు.

హేమపాత్ర గతం దోర్భ్యా మాదధానః పయశ్చరుం
అనుప్రవేశా దాద్యస్య పుంస స్తేనాపి దుర్వహం – (రఘువంశః 10-51)

[ఆద్యస్య = సృష్టికి మొదటివాడైన; పుంసః = పురుషుని యొక్క (విష్ణువు యొక్క); అనుప్రవేశాత్ = చేరుటవలన; తేన అపి = వానికి కూడా (అగ్నిలోంచి వచ్చిన ప్రజాపత్యపురుషునికి కూడా); దుర్వహం = మోయడానికి సాధ్యంకాని; హేమపాత్రం గతం = బంగారు గిన్నెలో ఉన్న; పయశ్చరుం = పాలతో వండిన అన్నమును; దోర్భ్యాః = రెండు చేతులతోటీ; ఆదధానః = పట్టుకున్నవాడై; (బయటకు వచ్చాడు).]

దశరథుడు పుత్రకామేష్ఠి చేస్తే, యజ్ఞపురుషుడు వస్తున్న సందర్భం. పాలతో వండిన పరమాన్నంతో నిండిన బంగారుగిన్నె రెండు చేతుల్తోనూ మోయలేక మోయలేక మోసుకుంటూ యజ్ఞగుండం లోంచి బయటకి వచ్చాడు. కారణం ఆ పాయసంలో విష్ణుతేజం నిండి ఉండడమే. అందుకే అంత బరువు. పుట్టబోయే శ్రీరాముని అవతారం సంపూర్ణమైన అవతారం. హేమపాత్రమ్ అనడం ద్వారా లక్ష్మీదేవి రాకని కూడా సూచించాడు కాళిదాసు. వెంటనే పయశ్చరుమ్ అన్నాడు. పయః అంటే పాలు. చరుమ్ అంటే వార్చకుండా యజ్ఞాగ్నిలో ఉడికించే అన్నం. ఈ పదం ఏ ఒక్కర్నీ వైకుంఠంలో వదిలెయ్యకుండా అందరితో (ఆదిశేషుడు, శంఖచక్రాలు అన్నీ వస్తున్నాయి) అవతరిస్తున్నాడన్న సూచన. ఇలాంటి ప్రయోగంలో నేర్చిన చరు శబ్దాన్ని జీవితంలో మరువగలమా?

జ్యోతిర్లేఖా వలయి గళితం యస్య బర్హం భవానీ
పుత్రప్రేమ్ణా కువలయదళ ప్రాపి కర్ణే కరోతి – (మేఘసందేశః 1-48)

ఈ శ్లోకంలో పార్వతికి కుమారస్వామి మీద ఉన్న ప్రేమని గురించి చెపుతూ కాళిదాసు ఇలా అంటాడు. కుమారస్వామి వాహనం నెమలి. అందుకని పిల్లవాడి మీద ప్రేమకొద్దీ (పుత్రప్రేమ్ణా) పార్వతి (భవానీ) కాంతిరేఖలు వలయాలుగా కలిగిన (జ్యోతిర్లేఖా వలయి) నెమలి కన్నును (బర్హం) చెవికి ఆభరణంగా పెట్టుకుంటుంది (కర్ణే కరోతి). ఆ నెమలి కన్ను ఎలా వచ్చింది ఆవిడకు? గళితం అంటే అదంతట అదే రాలిపడింది అని. పార్వతీదేవి దాన్ని నెమలివంట్లోంచి లాక్కుని దాన్ని హింసించి తెచ్చుకున్నది కాదు. ఈ సునిశితమైన భావాన్ని చెబుతూ, గళితం అన్నపదాన్ని వాడాడు.

భాష విషయంలో చివరిమాట. పదాల్ని అందంగా కూర్చే ఈ నేర్పరి, మాటల గారడీ కూడా చెయ్యగలడని ఒకసారి నిరూపించి వదిలేశాడు. ఆ తర్వాత ఆ ఫక్కీని బాణుడు, శ్రీహర్షుడు, భారవి లాంటివాళ్ళు వాడి పండించారు. ఈ కాళిదాస పదవిన్యాసాన్ని చూడాలనుకుంటే రఘువంశకావ్యం లోని తొమ్మిదవ సర్గని చదవండి.

ప్రియతమా యతమానమపాహరత్, గజవతీ జవతీవ్ర హయాచమూః, ఘనరవా నరవాహన సంపదః, స్వనవతా నవతామరసాననః, — ఇలా సాగే పాదాల్లో అక్షరాల వరస 1234 23456789. ఈ పదవిన్యాసం వరస తప్పకుండా 54 దృతవిలంబిత వృత్తాల ఆఖరిపాదాల్లో వచ్చి మనసునీ, మేధస్సునీ గిలిగింతలు పెడుతుంది.

2. భావం
ఈ విషయాన్ని చర్చించాలంటే మొత్తం ఇతని కవిత్వాన్నంతా తిరగతోడాలి. ప్రతి శ్లోకమూ రసాత్మకమే. తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత. అందువల్ల ఇక్కడ నేను చెప్పబోయేది లేశమాత్రమే.

2-1. గంభీరభావాలు
స సేనాం మహతీం కర్షన్ పూర్వసాగరగామినీం
బభౌ హరజటాభ్రష్టాం గంగామివ భగీరథః – (రఘువంశః 4-32)

[పూర్వసాగరగామినీం = తూర్పు సముద్రం వైపుగా వెడుతున్న; మహతీం సేనాం = గొప్ప సైన్యాన్ని; కర్షన్ సః = వెంట తీసుకునిపోతున్న ఆ రఘుమహారాజు; హరజటాభ్రష్టాం = శివుని జటాజూటం నుంచి జారిపోయి, పూర్వసాగరగామినీం = తూర్పు సముద్రం వైపుగా వెడుతున్న; గంగాం = గంగానదిని; కర్షన్ = వెంట తీసుకునిపోతున్న; భగీరథః ఇవ = భగీరథుని వలె; బభౌ = ప్రకాశించెను.]

ఈ శ్లోకం చూడ్డానికి చిన్నదానిలా కనిపించినా అర్థం అపారం. ఎన్నో భావాల్ని చిన్న పదాల్లో పొదిగి వ్రాశాడు కాళిదాసు. ఇక్కడ మనం కొద్దిగా పాత కథ ఒకటి చెప్పుకోవాలి. సూర్యవంశంలోనే పుట్టిన సగరుడనే చక్రవర్తి రఘువుకు పూర్వీకుడు. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగంలో వాడే గుర్రాన్ని పాతాళంలో దాచేస్తాడు. ఆ గుర్రాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని అరవై వేలమంది కొడుకులు భూమిని తవ్వి సముద్రాన్ని తయారు చేస్తారు. (సగరుని కొడుకులు తయారుచేశారు కాబట్టి సముద్రాన్ని సాగరం అంటారు.) అక్కడ పాతాళంలో గుర్రాన్ని కపిలమహాముని దగ్గర ఉండడం చూసి, ఆయన్ని విమర్శించి, అతని శాపానికి భస్మమై పోతారు. వాళ్ళకి ఉత్తమగతులు లభించాలంటే స్వర్గంలో ఉన్న గంగను పాతాళానికి తేవలసి వచ్చింది. సగరుడూ అతని కొడుకు అసమంజసుడూ తపస్సు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని మనుమడు భగీరధుడు, తన తాతలకు ఉత్తమగతులు ప్రాప్తించాలని, రాజ్యం వదులుకుని, గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై, నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు? అని అడిగింది. అప్పుడు భగీరధుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. అనుగ్రహించిన శివుడు గంగను భూమి మీదకి వస్తూంటే తన తలపై మోపి, జటాజూటంలో బంధిస్తాడు. భగీరధుని ప్రార్ధనతో ఒక పాయను నేలపైకి వదులుతాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగుతుంది. దాన్ని భగీరథుడు తూర్పుసముద్రంలో ఉన్న తాతల బూడిదల మీదకు పంపి వాళ్ళకు ఉత్తమగతులు కలిగిస్తాడు. అకుంఠిత దీక్ష, అనంతమైన పట్టుదలకు మారు పేరుగా భగీరథ కృషిని పేర్కొంటారు. అదీ పాతకథ.

ఆ పాత సన్నివేశంతో పోలిక చెపుతున్నాడు కాళిదాసు. రఘువు వెనక తూర్పు సముద్రం వైపుగా వెడుతున్న గొప్ప సేన, ఈశ్వరుడి జడల మధ్య నుంచి జారిపోయి భగీరథుని వెనుక తూర్పు సముద్రం వైపు పరిగెత్తుతున్న గంగలా ఉంది అని. ఇది కేవలం వస్తువుల మధ్య, మనుష్యుల పోలిక మాత్రమే కాదు. ఆశయాల్లో పోలిక, భావసంపదలో పోలిక, ఆదర్శాల్లో పోలిక. ఇక్కడ మనకి కాళిదాసులోని ప్రతిభావ్యుత్పత్తులు అర్థమవుతాయి.

ఇప్పటి కథకి వస్తే, రఘుమహారాజు క్షత్రియధర్మాన్ని పాటించి ప్రజలకి మంచి పరిపాలనని అందించాలని, దిగ్విజయమనే ఒక యాత్ర మొదలుపెట్టాడు. అది అతని ధర్మప్రకారం ఒక పవిత్రకార్యం. అది అందరికీ (క్షత్రియునిగా ధర్మపాలన వల్ల రఘువుకీ, దాస్య, దరిద్రాల నుంచి విముక్తి కలిగి ప్రజలకీ) ఐశ్వర్యాన్నిచ్చేది. రాజుకు ఐశ్వర్యం అతని సేన, వీరత్వం. ఆ రెండింటినీ వెంట తీసుకుని ప్రజావిముక్తి కోసం తూర్పు సముద్రం వైపు రఘువు వెడుతున్నాడు. ఐశ్వర్యం అంటేనే ఈశ్వరకృపవల్ల లభించేది అని అర్థం. కాబట్టి, ఈశ్వరుడు వదిలిన గంగతో సేన పోల్చబడింది. రఘువు తన ప్రజల విముక్తి కోసం చేసే ప్రయత్నం అవడం వల్ల, రఘువుని అతని పూర్వీకుడైన భగీరథునితో పోల్చాడు (భగీరథుడు కూడా తాతల విముక్తి కోసం పాటుపడ్డాడు.) రఘువు ఆశయానికీ, భగీరథుని ఆశయానికీ కూడా చెప్పకుండా పోలిక చెప్పాడు. కర్షన్ అన్న శబ్దప్రయోగం వల్ల పూర్వం భగీరథుడు, ప్రస్తుతం రఘువు వాళ్ళ వాళ్ళ కృషితో సంపాదించిన ఫలం (గంగ, సేన) వాళ్ళని అనుసరించి రావడాన్ని సూచించాడు. మహతీం అనడం ద్వారా వాటి లోని పవిత్రత, వీరత్వం సూచించాడు. భ్రష్టాం అనడం ద్వారా గంగ క్రిందకి పడడాన్ని, సేనకి యుద్ధంలో తప్పనిసరైన నష్టాన్నీ సూచించాడు. మొత్తం శ్లోకానికి పతాకసన్నివేశం — పూర్వ సాగరగామినీం అనడం. ఇది ఎన్నో అర్థాలని సూచించే ప్రయోగం.

గంగ తూర్పు సముద్రంలో కలుస్తుందన్న సత్యం.
ఇద్దరూ సగర సంతతి వాళ్ళే కాబట్టి వాళ్ళ ధర్మమార్గం వేరుగా ఉండదు అని చెప్పడం. ధర్మం వేరైనది కావచ్చు. ఇక్కడ రఘువుది ప్రజాపాలనకైన క్షాత్రధర్మం, భగీరథుడిది తాతల ఋణాన్ని తీర్చే పౌత్రధర్మం.
‘సాగర’ శబ్దంతో సముద్రానికీ భగీరథుడికీ, రఘువుకీ ఉన్న సంబంధాన్ని మరొక్కసారి తెలియజెయ్యడం. (పైన చెప్పిన పాతకథ ప్రకారం.)
సూర్యవంశరాజులైన భగీరథుడు, రఘువు తెల్లవారి లేవగానే ఆరాధించేది పూర్వసాగరంలో ఉదయించే సూర్యుణ్ణే. వాళ్ళ మనోదృష్టి ఎప్పుడూ అక్కడే. అందువల్ల ఇక్కడ కాళిదాసు వాడిన ‘గమ’ శబ్దంలోని అద్భుతమైన ఈ సంజ్ఞని గమనించాలి.
మరొక ఉదాహరణ.

తాం హంసమాలా శ్శరదీవ గంగాం, మహౌషధీం నక్తమివాత్మభాసః
స్థిరోపదేశా ముపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః — (కుమారసంభవమ్ 1-30)

[స్థిరోపదేశాం = స్థిరమైన శిక్షణపొందుతున్న; తాం = ఆ పార్వతిని; ఉపదేశ కాలే = శిక్షణ పొందుతున్న సమయంలో; ప్రాక్తన జన్మ విద్యాః = ముందు జన్మల్లోని (అప్పుడు నేర్చిన) విద్యలు; శరది = శరత్కాలంలో; గంగాం = గంగానదిని; హంసమాలాః ఇవ = హంసల బారుల్లాగా; నక్తం = రాత్రి సమయంలో; మహౌషధీం = ఒక గొప్ప ఓషధీ లతని; ఆత్మభాసః ఇవ = దానిలో దాగియున్న వెలుగు వలె; ప్రపేదిరే = పొందినవి.]

పార్వతి చదువు నేర్చుకునే విధానాన్ని గురించి కాళిదాసు ఒకే ఒక శ్లోకం చెప్పాడు. అదే ఇది. ఆవిడ చదువంతా ఉపదేశంతోనే ముగిసిందిట. శిక్షణ మొదలవగానే ముందుజన్మల్లో నేర్చిన విద్యలన్నీ ఆమెని పొందాయి. అంటే, అవంతట అవే వచ్చి ఆమెలో నెలకొన్నాయనే భావం తెలపటానికి ప్రపేదిరే అనే భావగర్భితమైన క్రియని వాడాడు కాళిదాసు. అలా జరగడాన్ని రెండు రకాల సంఘటనల్తో పోల్చాడు.

ఈ పోలికలు, ‘ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః’కి దీటుగా ఉండాలి. లేకపోతే, విషయం అభాసుపాలవుతుంది.

ఆ ఘట్టంలో ఉన్న పవిత్రతకి ప్రతిరూపంగా హంసమాలా శ్శరదీవ గంగాం అని పోల్చాడు. హంస స్వచ్ఛతకీ, ఉత్తమతకీ, గంగ పవిత్రతకీ, లోతుకూ ప్రతీకలు. గంగపైన హంసలు సహజంగా వచ్చితీరడం అనే విషయాన్ని పవిత్రత ఉన్నచోట స్వచ్ఛత అన్నది అదంతట అది వచ్చితీరుతుందన్న ప్రతిపాదనగా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఆ సంఘటనతో ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః పోల్చాడు. ఇక్కడ ఇంకో కొన్ని చమత్కారాలు చేశాడు. హంసమాలాః అన్నాడు. అంటే హంసలబారు. ఇది చాలాకాలం పాటు నేర్చుకోవలసిన విద్యని సూచిస్తుంది. అది పార్వతికి క్షణంలో అబ్బేసింది. శరది అనడం ద్వారా ఉత్తినే అబ్బడం కాదు, ప్రస్ఫుటంగా కనిపించేలా అబ్బింది అని సూచించాడు. శరత్కాలపు వెన్నెల్లో హంసల బారులు అద్భుతమైన దర్శనాన్నిస్తాయి గదా!
ఆమె నేర్చిన విద్యలోని నిగూఢతనీ, గాఢతనీ తెలియజేస్తూ, మహౌషధీం నక్తమివాత్మభాసః అన్నాడు. మందుగా వాడే లత చూడడానికి మామూలుగానే కనిపించినా దాని లోపల దాని ఉపయోగం, అది చేసే మంచి, ఆ మంచి తాలూకు గాఢత మొదలయినవి దాగిన వెలుగుల్లా ఉంటాయి. లత పుట్టీపుట్టగానే దానికున్న పారంపర్యం వల్ల ఆ వెలుగులన్నీ దానికి సహజంగా అబ్బుతాయి. అలాగే పార్వతికి ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః. ఇక్కడ కూడా ఒక చమత్కారం చేశాడు. మామూలు వ్యక్తులు ఆ లతని తీసుకుంటే దాని ప్రభావం తెలియక మామూలైన ఒక లతగా భావిస్తారు. వాళ్ళు వైద్యులవగానే అది అర్థమవుతుంది. చీకటి అజ్ఞానానికి ప్రతీక కాబట్టి, నక్తం అన్న పదం వాడడం ద్వారా విద్యాభ్యాస స్థితిని సూచించాడు. మరొక అర్థంలో ఓషధులు రాత్రి సమయంలో తమ ప్రభావాన్ని తేజోరూపంలో బయటపెట్టినట్లుగా, ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః అన్నాడు. ఇంకొక చిన్న చమత్కారం – పార్వతి నల్లనిది. ఆమెలో మేల్కొన్న విద్యలు తేజోరూపంలో ఉన్నాయని సంజ్ఞ.
శరది అని తెల్ల రంగునీ, నక్త అని నల్లరంగునీ పోలికలో తెచ్చి వ్యతిరేకతలో ఏకతని చెప్పాడు.


మరి కొన్ని మంచి ఉదాహరణలు:

పార్వతి పుట్టడం గురించి:

సా భూధరాణామధిపేన తస్యాం, సమాధిమత్యా ముపపాది భవ్యా
సమ్యక్ ప్రయోగా దపరిక్షతాయాం నీతా వివోత్సాహ గుణేన సంపత్ – (కుమారసంభవమ్ 1-22)

(ఉత్సాహమనే గుణం ఉన్నవాడు నీతిని బాగా పాటించడం వల్ల కోరుకున్న పనుల్ని నెరవేర్చుకోగల్గుతాడు, వాడికి సంపద అదంతట అదిగా పుడుతుంది. అలాగే ఉత్సాహవంతుడైన హిమవంతుడు నీతివంతురాలైన మేనాదేవి యందు (మంచి సంతానం కలగానే సంకల్పంతో) జరిపిన సవ్యమైన ప్రయోగము చేత పార్వతి అనే ఒక గొప్ప సంపద పుట్టింది.)

దుష్యంతుడు ఆకాశం నుంచి వచ్చే పాట విన్న తర్వాత:

రమ్యాణి వీక్ష్య, మధురాంశ్చ నిశమ్య శబ్దాన్
పర్యత్సుకో భవతి యత్ సుఖితోఽపి జంతుః
త చ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం
భావస్థిరాణి జననాంతర సౌహృదాని – (అభిజ్ఞానశాకుంతలమ్ – పంచమాంకం)

(ఎంతటి సుఖావస్థలో ఉన్న ప్రాణి అయినా, అందమైన దృశ్యాల్ని చూసిన తర్వాత, మధురమైన శబ్దాల్ని విన్న తర్వాత, ఇలాంటి పర్యుత్సుకతని (excitement) పొందుతూనే ఉంటుంది. ఇంతకు పూర్వం తెలియని ఏదో ఒక విషయాన్ని గురించి మనసులో నెమరు వేసుకుంటూనే ఉంటుంది. అందువల్లే, పూర్వజన్మల్లో ఏర్పడ్డ స్నేహాలు మనస్సుల్లో గాఢంగా నాటుకుని ఉంటాయి. )

ఉన్మత్తుడైన పురూరవుడు అన్న మాటల్లో:

యదే వోపనతం దుఃఖా త్సుఖం త ద్రసవత్తరమ్
నిర్వాణాయ తరుచ్ఛాయా తప్తస్య హి విశేషతః – (విక్రమోర్వశీయమ్ – తృతీయాంకం)

(దుఃఖానుభవం నుంచి తీసుకొని రాబడ్డ సుఖం రసవత్తరంగా ఉంటుంది. ఎక్కువ ఎండలో పరితపించిన వాడికే చెట్టు నీడ మిక్కిలి ఆనందం కలిగిస్తుంది.)

దుష్యంతుడు శకుంతలను చూసి ఆమె బ్రాహ్మణ కన్యయోమో అని అనుకుని తర్వాత మనస్సమాధానం చేసుకునేటప్పుడు:

అసంశయం క్షత్రపరిగ్రహక్షమా య దార్య మస్యా మభిలాషి మే మనః
సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః – (అభిజ్ఞానశాకుంతలమ్ – ప్రథమాంకం)

(పరమ పవిత్రమైన నా మనసు ఈమెని కోరుకుంటోంది. కనుక ఈమె తప్పకుండా క్షత్రియుడు పెళ్ళాడడానికి తగినదే (క్షత్రియకన్యయే.) ఎందుకంటే, సత్పుషులకు ఏ విషయంలోనైనా సందేహం వస్తే, వాళ్ల అంతఃకరణ, ప్రవృత్తులే వాళ్లకి ప్రమాణాలు అవుతాయి.)

2-2. సరసభావాలు
కాళిదాసకవిత్వంలో గంభీరభావాలు ఎంత సులువుగా పలుకుతాయో, సరసమైన భావాలు కూడ అంత సహజంగానూ దొర్లుతాయి. ప్రకృతి పట్ల, రసమయజీవనం పట్ల ఇతనికున్న ప్రీతి దానికి కారణం కావచ్చు. ధనికులైనా, పేదవాళ్ళైనా అతనికి వ్యత్యాసం లేదు. ఋతుసంహారం, మేఘసందేశాల్లో ధనికవర్గాల విలాసాన్ని చూపిస్తే, అభిజ్ఞానశాకుంతలంలో సాధు జీవనాన్ని సాగించే శకుంతలలో విలాసాన్ని చూపిస్తాడు. అలకానగరాన్ని వేదికగా చేసుకుని యక్షుల ఐశ్వర్యవిలాసాల్ని, నృత్యగానవినోదాల్నీ ఉద్యానవిహారాల్నీ వర్ణిస్తాడు.

గత్యుత్కంపా దలకపతితై ర్యత్ర మందారపుష్పైః
పత్రచ్ఛేదైః కనకకమలైః కర్ణవిభ్రంశిభిశ్చ
ముక్తాజాలైః స్తనపరిసరచ్ఛిన్నసూత్రైశ్చ హారైః
నైశోమార్గః సవితు రుదయే సూచ్యతే కామినీనాం – (మేఘసందేశః 2-11)

(రాత్రంతా విలాసంగా గడిపి తెలతెల్లవారగానే హడవుడిగా ఇళ్ళకి వెళ్ళిపోయిన కామినీ జనాన్ని గురించి చెపుతున్న శ్లోకం ఇది. వాళ్ళు రాత్రి గడిపారని ఎలా చెప్పగలం అంటే, హడావుడిగా వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళ ముంగురుల్లో ఉన్న మందారపువ్వులు జారిపడతాయి, చిగురుటాలకుల్తో వాళ్ళ దేహంమీద చేసుకున్నఅలంకారాలూ రాలిపడిపోతాయి, చెవులకి పెట్టుకున్న బంగారు తామరలూ రాలిపోతాయి, తెగిపోయిన ముత్యాల హారాల నుంచి ముత్యాలు రాలిపడతాయి. ఇవన్నీ నేలమీద పడి రాత్రి వాళ్ళు నడిచిన దారులు తెలియజేస్తాయి.)


వాసశ్చిత్రం మధు నయనయో ర్విభ్రమాదేశదక్షం
పుష్పోద్భేదం సహ కిసలయై ర్భూషణానాం వికల్పాన్
లాక్షారాగం చరణకమలన్యాసయోగ్యం చ యస్యా
మేకః సూతే సకల మబలామండనం కల్పవృక్షః – (మేఘసందేశః 2-13)

(ఇంత విలాసంగా జీవించడానికి కావలసిన రంగురంగుల బట్టలు, కళ్ళకి జిలుగునీ, విలాసాన్నీ కలగజేసే మధువు, చిగురుటాకుల్తో కలిసి ప్రస్ఫుటంగా కనబడే పువ్వులు, ఆభరణాలు, కమలాల్లా ఉన్న పాదాలకి రాసుకునే లాక్షారసం… ఇలా కావలసిన అలంకారసామగ్రి అంతా కల్పవృక్షమే ఇస్తుంది.)

మునుల మధ్య వనంలో నివసిస్తున్న శకుంతల విలాసం గురించి చెపుతూ — ఆమె సహజమైన సౌందర్య సౌకుమార్యాల వల్లే ఆకర్షణీయంగా ఉంది, అంటాడు. దుష్యంతుడు మొదటిసారిగా శకుంతలని చూసినప్పుడు మనసులో అనుకున్న మాట.

సరసిజ మనువిద్ధం శైవలేనాపి రమ్యం
మలినమపి హిమాంశో ర్లక్ష్మ లక్ష్మీం తనోతి
ఇయమధిక మనోజ్ఞా వల్కలేనాపి తన్వీ
కిమివహి మధురాణాం మండనం నాకృతీనాం – (అభిజ్ఞానశాకుంతలమ్ – ప్రథమాంకం)

అందంగా లేని నాచుతో కూడినదైనా పద్మం అందంగానే కనబడుతుంది. చంద్రుళ్ళో మచ్చ నల్లగా ఉన్నా, అది అతనికి కొత్త శోభల్ని కలిగిస్తూనే ఉంటుంది. ముతకచీర కట్టుకున్నా ఈ సన్నని తీగ లాంటి అమ్మాయి అధికమనోజ్ఞురాలిగా కనబడుతోంది. సహజమైన అందం ఉన్నవాళ్ళకి అలంకారం కానిదేది?

ఆ శకుంతల అత్తవారింటికి వెడుతూంటే, వనమంతా కలిసి అన్ని అలంకార సామగ్రులూ సమకూర్చిందంటాడు. (యక్షులకి కల్పవృక్షమైతే శకుంతలకి వనమంతా.)

క్షౌమం కేనచి దిందుపాండు తరుణా మాంగల్య మావిష్కృతం
నిష్ఠ్యూత శ్చరణోపభోగసుభగో లాక్షారసః కేనచిత్
అన్యేభ్యో వనదేవతా కరతలై రాపర్వభగోత్థితైః
దత్తాన్యాభరణాని తత్కిసలయోద్భేద ప్రతిద్వందిభిః – (అభిజ్ఞానశాకుంతలం – చతుర్థాంకం)

ఒక చెట్టు చంద్రుడికున్న తళతళలతో కూడి, మంగళకార్యానికి తగినట్టున్న పట్టుచీర నిచ్చింది. మరొక చెట్టు ఆమె పాదాలు అందంగా కనిపించడానికి కావలసిన లాక్షారసాన్ని కక్కింది (ఇచ్చింది). వేరే చెట్లు, ఎర్రని తమ చేతుల్ని చాచి వనదేవతలిస్తున్నాయా అన్నట్టుగా ఎన్నో ఆభరణాల్ని ఇచ్చాయి. ఆ చెట్లకున్న ఎర్రని చిగురుటాకులు, ఆ వనదేవతల చేతుల్తో పోటీ పడుతున్నట్టున్నాయట.

శాకుంతలంలో అడుగడుగునా సరళంగా, సహజంగా జీవించే మునుల జీవితంలో ఉండే మాధుర్యాన్ని కూడా నొక్కి చెపుతాడు. రసమయజీవితానికి కావలిసినది స్పందించే రసహృదయమే కాని, మరే భేషజం కాదని మనకనిపించేలా తన కావ్యనాటకాల్ని మలిచాడు కాళిదాసు.
---------------------------------------------------------
రచన: భాస్కర్ కొంపెల్ల, 
ఈమాట అంతర్జాల పత్రిక సౌజన్యంతో

2 comments:

Anonymous said...

వాగర్థా వివ సంపృక్తౌ.... శ్లోకానికి వివరణ వ్రాస్తూ, పార్వతీప అంటే శివుడన్నారు. ఇదసలు అర్థం లేనిది. పార్వతీప అంటే శివుడు అనే అర్థం ఎక్కడా లేదు. రఘువంశానికి వ్యాఖ్యానం వ్రాసిన మల్లినాథుడు పితరౌ అన్నదానికి వ్యాఖ్య వ్రాస్తూ "మాతా చ పితా చ పితరౌ" అని స్పష్టంగా వ్రాశారు తప్ప ఇద్దరు తండ్రులు అని పేర్కొనలేదు.

Anonymous said...

ఈ సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసి 80% కంటే ఎక్కువ స్కోర్ చేసిన పేద ఆర్థిక నేపథ్యం నుండి వచ్చిన తెలివైన విద్యార్థులు ఎవరైనా మీకు కనిపిస్తే, దయచేసి వారిని అడగండి
NGOని సంప్రదించడానికి - ప్రేరణ (ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా మద్దతు ఉంది).

NGO వ్రాత పరీక్షను నిర్వహిస్తోంది మరియు పరీక్షలో ఉత్తీర్ణులైన వారు తదుపరి చదువుల కోసం ఆర్థిక సహాయం కోసం అర్హులు.

దయచేసి పొందడానికి క్రింద పేర్కొన్న వ్యక్తులను సంప్రదించమని విద్యార్థులను అడగండి
దరకాస్తు:

సంప్రదింపు నంబర్లు:
1. శ్రీమతి సరస్వతి - 9900906338
2. శ్రీ శివకుమార్ - 99866 30301
3. శ్రీమతి బిందు - 99645 34667