Saturday, August 25, 2018

కవికులగురువు - 2


కవికులగురువు - 2
సాహితీమిత్రులారా!

కవికుల గురువు కాళిదాసును గురించిన వ్యాసంలో రెండవ భాగం
ఆస్వాదించండి-
నిన్నటి తరువాయి..........

5-3. వ్యంగ్యభావాలు
ఇన్ని చెప్పే కాళిదాసులో పుష్కలంగా కొంటెకోణాలు కూడా ఉన్నాయి. కొన్నింటిని కవిగా తనే చూపిస్తాడు. కొన్ని పాత్రల ద్వారా చెప్పిస్తాడు.

ఇందీవరశ్యామతనుర్ నృపోఽసౌ త్వం రోచనాగౌరశరీరయష్టిః
అన్యోన్యశోభా పరివృద్ధయే వాం యోగస్తటిట్టోయదయో రివాస్తు – (రఘువంశః 6-65)

(ఇందుమతికి స్వయంవరం అవుతూంటే, పక్కనున్న చెలికత్తె సునంద ఆమెకి ప్రతీరాజు గురించీ, వాడి రాజ్యం గురించీ చెపుతూంటుంది. ఒకడి దగ్గరకి రాగానే వాడేదేశానికి రాజో వాడికెంత రాజ్యముందో చెప్పి — నల్లగా కలవపువ్వులా ఉన్నాడు వీడు. నువ్వు పచ్చగా గోరోజనంలా, చక్కని శరీరం కలిగినదానివి. మీ ఇద్దరికీ సంబంధం కుదిరితే, మెరుపుతీగ-మేఘంలా ఉంటుంది. ఒకళ్ళ రంగుతో మరొకళ్లకి పోటీగా, అని కాకి ముక్కుకి దొండపండన్నట్టుగా చెపుతుంది.)

అలాగే, శాకుంతలంలో, దుష్యంతుడు శకుంతలని చూసి మనసులో ఏమనుకుంటున్నాడో ప్రథమాంకంలో చెప్పేస్తాడు. రెండో అంకంలో దుష్యంతుడు తన స్నేహితుడితో మళ్ళీ మెదలు పెడతాడు. అది పరాకాష్ఠకి వెడుతుంది. దుష్యంతుడు సిగ్గు వదిలేసి ఇలా అంటాడు

అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం కరరుహై
రనావిద్ధం రత్నం మధు నవ మనాస్వదితరసమ్
అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూప మనఘం
న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః – (అభిజ్ఞానశాకుంతలం – ద్వితీయాంకః)

ఈమె వాసన చూడబడని పువ్వు. ఏ గోళ్ళ చేతా గిల్లబడని చిగురుటాకు. కన్నం తొలవబడని రత్నం. రుచి చూడబడని తియ్యని కొత్తతేనె. చేసుకున్న పుణ్యాలకి పరిపూర్ణమైన ఫలం. ఎవడు ఈ అమ్మాయిని అనుభవించాలని బ్రహ్మ వ్రాసిపెట్టాడో! నాకు తెలియదు.

రసికులంతా దీన్ని విరహతాపంలా చిత్రీకరిస్తుంటారు. కాని, నాకైతే, ఈ శ్లోకంలో కనిపించే నిర్లజ్జని బట్టి కాళిదాసు దుష్యంతుడి వ్యామోహానికి పరాకాష్ఠగా దీన్ని మలిచాడనిపిస్తుంది.

మరొక సన్నివేశం. పార్వతి శివుడికై తపస్సు చేస్తూంటే, శివుడే కపటబ్రహ్మచారిగా వచ్చి శివుణ్ణి గురించి వేళాకోళంగా మాట్లాడతాడు. పార్వతి తన సమాధానాలతో తిప్పికొడుతుంది. చివరికి విసిగిపోయి, నువ్వేమనుకుంటే నాకేమిటయ్యా? వెళ్ళవయ్యా వెళ్ళు…” అంటుంది. ఇక్కడ కాళిదాసు ఆమెలో తెగింపుని కొంటెగా ఇలా చెపుతాడు. మమాత్ర భావైకరసం మనః స్థిరం, న కామవృత్తిర్వచనీయ మీక్ష్యతే (నా మనస్సు వాడే నా శృంగారమూర్తి అని నిశ్చయం చేసేసుకుంది. ఇలా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఆక్షేపణల్ని పట్టించుకోరు.)

ఈ శ్లోకం తరువాత వ్రాసిన రెండు చిన్న శ్లోకాలు ఎంత దర్శనీయాలో! శివుడు పార్వతిని చేపట్టిన రీతినీ, అప్పుడామె మనోభావాల్నీ కేవలం రెండు శ్లోకాలలో మనోహరంగా మన మనోఫలకం మీద చిత్రీకరిస్తాడు.
3. దృశ్య చిత్రీకరణ
ఒక సన్నివేశాన్ని రమ్యం గానో, లేదా రసయుక్తం గానో చెప్పడమే కాదు, కళ్ళకి కట్టినట్టు చూపించడంలో కూడా కాళిదాసు దిట్ట. పతాకసన్నివేశాల్ని మరీ మనోహరంగా చిత్రిస్తాడు. దీనికి మొదటి ఉదాహరణగా, శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన వెంటనే కాళిదాసు చెప్పిన శ్లోకం చూద్దాం. మామూలుగా సర్గంతా చిన్న వృత్తాల్లో వ్రాసినా, సర్గ చివర్లో పెద్ద వృత్తాలు వాడడం ఇతని అలవాటు. ఈ వాడకంలో కూడా ఒక పద్ధతి ఉంది. ఒక పని పూర్తయి సఫలత చేకూరినప్పుడు, ఆ సర్గ చివర సాధారణంగా మాలినీ వృత్తం వాడతాడు. ఇది ఆ కోవ లోదే.

అథ మదగురుపక్షై ర్లోకపాలద్విపానామ్
అనుగత మలిబృందై ర్గండభిత్తీర్విహాయ
ఉపనతమణిబంధే మూర్ధ్ని పౌలస్త్యశత్రోః
సురభి సురవిముక్తం పుష్పవర్షం పపాత – (రఘువంశః 12-102)

[అథ = పిమ్మట; మద = ఏనుగు కుంభస్థలం మీద తిరగడం వల్ల అంటుకున్న మదజలము చేత; గురు= బరువెక్కిన; పక్షైః = రెక్కలుగల; అలి బృందైః = తుమ్మెదగుంపుల చేత; లోకలపాలద్విపానామ్ = ఆకాశంలో ఉన్న దిక్పాలకుల ఏనుగుల యొక్క; గండభిత్తీః = గండస్థలాల్ని (నుదుటి ప్రదేశాల్ని); విహాయ = వదలిపెట్టి; అనుగతం = వెంబడింప బడ్డదీ; సురభి = పరిమళములు గలదీ; సురవిముక్తం = దేవతలచేత కురిపింపబడ్డదీ అయిన; పుష్పవర్షం = పువ్వుల వాన; ఉపనత మణిబంధే = సమీపకాలమున జరగబోతున్న కిరీటధారణముగల (కొద్దికాలములో కిరీటం పెట్టుకోబోతున్న); పౌలస్త్యశత్రోః = పులస్త్యుని మనుమడైన రావణుని శత్రువు యొక్క (శ్రీరాముని యొక్క); మూర్ధ్ని = తలపైన; పపాత = పడెను(కురిసెను).]

(పులస్త్యుని మనుమడైన రావణుడితో శ్రీరాముడు యుద్ధం చేస్తున్నాడు. దిక్కుల్ని పాలించే ఎనిమిది మంది దేవతలు వాళ్ళవాళ్ళ దిగ్గజాల్ని (ఏనుగుల్ని) ఎక్కి యుద్ధాన్ని చూస్తున్నారు. ఈ యుద్ధం జరుగుతున్నంతసేపూ, ఆ దిగ్గజాల గండస్థలాల మీద ఉన్న మదజలాలకోసం తుమ్మెదలు తచ్చాడుతూ తమ రెక్కలకి మదం అంటించుకుంటున్నాయి. వాటితో వాటి రెక్కలు బరువెక్కి ఎగరడానికి చాలా ప్రయాస పడుతున్నాయి. ఇంతలో రావణుణ్ణి శ్రీరాముడు యుద్ధంలో నేలకూల్చాడు. ఒక్కసారిగా దేవతలు సువాసనలు వెదజల్లే పువ్వుల్ని పెద్దవానగా కురిపించారు. తుమ్మెదలు ఈ గండస్థలాల్ని వదిలేసి ఆ పువ్వుల వెనక పడ్డాయి. భూమి వైపుగా పోతున్న వాటి వెనక ప్రయాణించడం తుమ్మెదలకి సులువుగా ఉంది. (క్రిందకి పడుతున్నప్పుడు రెక్కల బరువు లెక్క చెయ్యక్కర్లేదుగా). అలా తుమ్మెదల సంగీతంతో, పరిమళ భరితమైన పూలు శ్రీరాముడి తలపైన పడ్డాయి. ఆ సంగీతఘోష, పుష్పాభిషేకం, శత్రుసంహారం చేసి కొద్దిరోజుల్లో పట్టాభిషేకం చేసుకోబోయే ఆతని శిరస్సుకి తగిన సత్కారంలా ఉంది.)

ఈ శ్లోకంలో చాలా రమ్యతలున్నాయి. మాలినీ వృత్తం కావడం వల్ల ముందు లఘువుల సముదాయం మెల్లగా గురువుల గుంపుగా మారి ఉత్కంఠతను చాటుతుంది (crescendo.) ముఖ్యంగా ఆఖరి పాదంలో సురభి సురవిముక్తం అన్నంతసేపూ, దేవతల చేతుల్లో ప్రారంభమై మెల్లగా క్రిందకి దిగడం మొదలు పెట్టిన పువ్వుల వాన, పుష్పవర్షం అనేసరికి వేగం పెరిగినట్టూ, పపాత అనగానే శ్రీరాముడి తలమీద పడి ఆగినట్టూ అనిపిస్తుంది. నిజానికి మాలినీ వృత్తంలో ఆఖరి అక్షరం గురువు అవాలి. కాని సంస్కృత శ్లోకాల్లో ఆఖరి అక్షరం లఘువైనా పర్వాలేదనే నియమం ఉంది. ఈ శ్లోకంలో ఆ నియమాన్ని కాళిదాసు అద్భుతమైన ముగింపు కోసం వాడుకున్నాడు. అనుగత మలిబృందైః అన్నప్పుడు పైన పూలకి చెప్పిన వేగమే ఇక్కడ తుమ్మెదలకి వరిస్తుంది. కాని భావం పూర్తయ్యే మూడవ పాదంలో పౌలస్త్యశత్రోః అన్నపదాన్ని వినగానే అవి కూడా రావణుడిలాగే పూలని (స్తీలని) కొల్లగొట్టేవి కాబట్టి శ్రీరాముడి శిరస్సుని చూడగానే పారిపోయాయి.

ఆకాశంలో ఏనుగుల మీద దేవతలూ, పుష్పవృష్టి, వెంటాడే తుమ్మదలూ, నేలపై రథంమీద గెలిచి నిలచిన శ్రీరాముడు, తుమ్మెదల సంగీతం, పూల పరిమళం, రాముని తల మీదా, శరీరం మీదా పువ్వులూ, అక్కడివరకూ వచ్చి పారిపోయే తుమ్మెదలూ.. ఈ చిత్రాన్ని కాళిదాసు ఎంత మనోహరంగా మన మనసుల మీద ముద్రించాడో!

ఇందుమతీ స్వయంవరం సన్నివేశం లోని ఈ శ్లోకం చూడండి.

సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా
నరేంద్రమార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం స స భూమిపాలః – (రఘువంశః 6-67)

[పతింవరా సా = భర్తను వరించవలసిన ఆ ఇందుమతి; రాత్రౌ = రాత్రి వేళల్లో; సంచారిణీ = నడుస్తున్న; దీపశిఖా ఇవ = దీపజ్వాలలా; యం యం = ఏ ఏ రాజును; వ్యతీయాయ = దాటి వెళ్ళెనో; సః సః = ఆ ఆ ; భూమిపాలః = రాజు; నరేంద్రమార్గ = రాజవీథిలోని; అట్ట ఇవ = అట్టాలముల వలె; వివర్ణభావం = కాంతివిహీతని (వెలవెలబోవడాన్ని); ప్రపేదే = పొందెను.]

(ఇందుమతి స్వయంవరంలో తనకి నచ్చినవాణ్ణి ఎన్నుకోవాలి. ఆమె అందచందాలు మెచ్చి చాలామంది ఆశపడి వచ్చికూర్చున్నారు. ఆమె నడుస్తున్న దీపశిఖలా వాళ్ళ ఎదుటనుంచి నడిచి వెళుతోంది. ఆమె దగ్గరకి రాగానే ప్రతీ రాజుకీ తననే వరిస్తుందేమోనని ముఖం వెలిగిపోతోంది. కాని ఆమె దాటి వెళ్ళిపోగానే ఆ రాజు ముఖం కాంతి తప్పి వెలవెలబోతోంది.)

అట్టాలములంటే బాల్కనీ గదుల్లాంటివి. రాజమార్గంలో బాల్కనీ గదులు వరసగా ఉన్నాయి. ఒకడు పెద్ద దివ్వెని పట్టుకుని నడుస్తూంటే, వాడు ఒక బాల్కనీకి ఎదురుగా రాగానే ఆ బాల్కనీ అంతా వెలుగుతో నిండి పోతుంది. వాడు దివ్వె తీసుకుని ముందుకు పోగానే ఆ బాల్కనీ చీకటిగా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చే బాల్కనీ వెలుగుతో నిండుతుంది. ఇక్కడ కాళిదాసు రాజుల ముఖాల్ని ఆ గదుల్తో పోల్చాడు. గదుల్లాగే వాళ్ళ ముఖాలు కూడా కదలిక లేనివయాయని సంజ్ఞ.

ఇందుమతి దీపశిఖగా పోల్చడం ఆమె అందాన్నీ, తేజస్సునీ, స్వచ్ఛతనీ సూచిస్తోంది. నరేంద్రమార్గ అన్న పదానికి రెండు అర్థాలు స్ఫురించేలా రాస్తాడు. ఒక అర్థం రాజులు కూర్చున్న వరస అనీ (ఇందుమతి నడుస్తున్నదీ,) రెండోది రాజవీధి (దివ్వె నడుస్తున్నదీ) అనీ. సంచారిణీ అనడం ద్వారా ఇందుమతి దేహమే కాదు, మనసు కూడా విహరిస్తోందే అన్న భావం కలిగించాడు. ‘సంచారిన్’ శబ్దానికి అగరు గంధం నుంచి వచ్చే పొగ అనే అర్థం కూడా. అలా ఆమె మనసు ఎన్నోవిధాలైన ఆలోచనల్లో ఉందనే భావం కూడా. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం చేసేటప్పుడు మనసు పరిపరి విధాలుగా ఆలోచించడం సాధారణమే కదా! ఈ ఉపమాలంకారం ఎంత ప్రాచుర్యం పొందిందంటే, కవిని ‘దీపశిఖా కాళిదాస’నేటంత.

ఇంకొక ఉదాహరణ.

లతాగృహద్వారగతోఽథ నందీ వామప్రకోష్ఠార్పితహేమవేత్రః
ముఖార్పితై కాంగుళిసంజ్ఞ యైవ మాచాపలా యేతి గణాన్ వ్యనైషీత్

నిష్కంప వృక్షం నిభృతద్విరేఫం మూకాండజం శాంతమృగప్రచారం
తచ్ఛాసనాత్ కానన మేవ సర్వం చిత్రార్పితారంభ మివావతస్థే – (కుమారసంభవమ్ 3-41,42)

[అథ = అంతట; లతాగృహద్వారగతః = పొదరింటి గడప దగ్గర ఉన్న; వామ ప్రకోష్ఠ అర్పిత హేమవేత్రః = ఎడమచేతి మణికట్టుపై ఉంచుకోబడ్డ బంగారు బెత్తము కలవాడైన; నందీ = నందీశ్వరుడు;ముఖ-అర్పిత-ఏక-అంగుళి-సంజ్ఞయా ఏవ = నోటిమీద ఉంచుకున్న ఒక వ్రేలి యొక్క సంజ్ఞ చేతనే; గణాన్ = ప్రమథగణాల్ని; మా చాపలాయ = ‘అల్లరి చెయ్యకండి’; ఇతి=అని; వ్యనైషీత్ = ఆజ్ఞాపించెను (శిక్షించెను).

నిష్కంప వృక్షం = చలనం లేని చెట్లు గలదీ; నిభృతద్విరేఫం = కదలని తుమ్మెదలు గలదీ; మూకాండజం = కూయని పక్షులు గలదీ; శాంతమృగప్రచారం = ఆగిపోయిన మృగసంచారం కలదీ; కాననం సర్వం ఏవ = అడవి అంతాకూడా; తత్ శాసనాత్ = ఆ నందీశ్వరుని ఆజ్ఞవల్ల; చిత్రార్పిత = బొమ్మలో గీయబడ్డ; ఆరంభం ఇవ = ప్రయత్నంలా; అవతస్థే = ఉండెను.]

శివుడు తపస్సమాధిలో ఉన్నాడు. ఎవరు ఆయన సమీపానికి వెళ్ళాలన్నా, ముందు నందీశ్వరుడు వెళ్ళి ఆయనకి చెప్పి అనుజ్ఞ పొందితేనే దర్శనం. ఆ సమాధిస్థితికి నందీశ్వరుడు ఎలా తోడ్పడ్డాడో చెప్పిన రెండు శ్లోకాలివి. నందీశ్వరుడు ఎప్పుడూ అనవసరంగా బలప్రదర్శన చెయ్యని మహా బలవంతుడు. నందీశ్వరుడు బెత్తం చేతిలో ఉన్నా వ్రేలితోనే అదలించాడని వ్రాయడం ఒక ఉదాత్తత. ఆ అదలింపుకి సర్వజగత్తులోనూ సంచారం ఆగిపోడాన్ని అతిగంభీరంగా వివరించాడు రెండవ శ్లోకంలో. ప్రకృతి చిత్తరువులా నిలబడిపోవడం గురించి ‘నిష్కంప వృక్షం నిభృతద్విరేఫం మూకాండజం శాంతమృగప్రచారం’ అని రెండే రెండు పాదాల్లో కాళిదాసే చెప్పేస్తాడు. వేరేమీ చెప్పక్కర్లేదు.

4. కథాసంవిధానం
కాళిదాసు కథన ప్రతిభకి మచ్చుతునకలు రఘువంశం, ఆభిజ్ఞానశాకుంతలమ్. రఘువంశం గురించి కొద్దిగా విస్తరిస్తాను. రఘువంశ మహాకావ్యం ఇక్ష్వాకువంశంలో పుట్టిన కొందరు రాజుల కథ. దిలీపుడు, రఘువు, అజుడు, దశరథుడు, రాముడు, కుశుడు, అతిథి, నలుడు, పుండరీకుడు, అగ్నివర్ణుల కథ. అగ్నివర్ణుడు క్షయవ్యాధితో చనిపోతే గర్భవతి అయిన అతని భార్యకు పట్టాభిషేకం చెయ్యడంతో రఘువంశకావ్యం ముగుస్తుంది. ఇందరి కథల్ని 19 సర్గల్లో పాఠకులకి విసుగుపుట్టకుండా చెప్తాడు కాళిదాసు. ప్రతీ రాజు కథలోనూ ఒక ముఖ్యఘట్టాన్ని మాత్రమే ఎంచుకుని (ఒక్క రామకథలో తప్ప) ఆ రాజుల్లో ఉన్న గొప్పదనాలు, బలహీనతలు అన్నిటినీ నిష్కర్షగా చెప్తాడు. రఘువంశ రాజుల కీర్తిప్రమాణాలు క్రమేణా ఎలా క్షీణించాయో వివరిస్తాడు.

వాల్మీకి మహర్షి రామాయణం చదివిన వాళ్ళకి ఒక విషయం అర్థం అవుతుంది. వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణాన్ని ఒక మధురమైన కావ్యంగా జాతికి అందించాడు. మళ్ళీ దాన్ని తిరగ వ్రాయడానికి ప్రయత్నించ కూడదు – అని. ఆ విషయం కాళిదాసుకి కూడా తెలుసు. అయినా రఘువంశంలో రామకథని చెప్పి తీరాలి. శ్రీహరి ఆ వంశాన్ని ఎంచుకుని అందులో పుట్టాడు. ఆ కారణం వల్ల రామకథని మిగిలిన రాజుల కథలా తగ్గించలేడు. ఈ పరీక్షలో కాళిదాసు తన అభిరుచి, వివేకం వాడి ఎలా కృతకృత్యుడయాడన్నది 10 నుండి 15వ సర్గ వరకూ ఉన్న శ్రీరామకథని చదివినవాళ్ళకే అర్థమవుతుంది.

5. ఉపసంహారం
కాళిదాసు కవిత్వం కవులకి శిక్షణాలయం, సంస్కృత విద్యార్థులకి పాఠ్యప్రణాళిక, రసికులకి వినోదం, భాషాపండితులకి సంభ్రమాశ్చర్యాల్తో కూడిన ప్రశ్న, అలంకారికులకి విందు, ధార్మిక బుద్ధిగలవారు సంప్రదించే గ్రంథావళి. అసంగతంగా సాగే తాత్వికభావనలు, బహ్వర్థాలు, ప్రతిదాన్నీ కవితావస్తువుగా చూస్తూ అన్నిటికీ సమాన ప్రతిపత్తి కలిగించే అతని నిజాయితీ, ఇవన్నీ అతన్ని కవిగా, అధ్యాపకునిగా, మార్గదర్శకునిగా ఉన్నతస్థానంలో నిలబెట్టాయి. పార్వతీ పరమేశ్వరుల్ని పాత్రలుగా చూసేటప్పుడు మామూలుగా అందరి ప్రవృత్తుల్ని వర్ణించినట్లుగానే వాళ్ళని కూడా కవితాపరంగా చూశాడు. వారి పారమార్ధిక, దైవ విభూతుల్ని గురించి చెప్పినప్పుడు వేరొక పద్ధతి అవలంబించాడు. ఇక ఇతని విషయ, శాస్త్ర పరిజ్ఞానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. సాంప్రదాయాలు, రాచమర్యాదలు, ఆర్షధర్మ కర్మవిశేషాలు, స్మృతిశాస్త్రపురాణజ్ఞానం, ప్రకృతిధర్మాలు, జంతువృక్షమనుష్యదేవగణజాతుల వృత్తిప్రవృత్తులు, నైసర్గిక, సామాజిక, వాతావరణ, వ్యాకరణ, జ్యోతిష్య, లలితకళా, న్యాయ, యోగ, వేదాంతాది శాస్త్రజ్ఞానం… ఇలా ఎన్నో కోణాల్ని సరైన మోతాదుల్లో తన కవిత్వంలో చూపించాడు. క్లుప్తంగా, మధురమైన చిన్నపదాలలో, సరళమైన ఛందోరీతుల నుపయోగించి కవిత్వం వ్రాశాడు. ఇటువంటి దార్శనికత, బహుముఖప్రజ్ఞ అతన్ని కవికులగురువును చేశాయి.

చివరిగా ఒక విన్నపం – భారతీయ సంస్కృతిలో పుట్టిన ప్రతీవ్యక్తీ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా చదవవలసినవి రెండు పుస్తకాలు: 1. వాల్మీకి మహర్షి మనకందజేసిన శ్రీమద్రామాయణం; 2. కాళిదాస మహాకవి రచించిన రఘువంశం.
---------------------------------------------------------
రచన: భాస్కర్ కొంపెల్ల, 
ఈమాట అంతర్జాల పత్రిక సౌజన్యంతో

No comments: