Monday, February 28, 2022

చదివితే నాలుక కదలని పద్యం

 చదివితే నాలుక కదలని పద్యం




సాహితీమిత్రులారా!



త్యాగరాజమొదలి కృత సుబ్రహ్మణ్య విజయంబను 

విద్వత్కర్ణామృతములోని ఈ అచలజిహ్వ పంచాచామరము

చదివి చూడండి మీకు నాలుక కదులుతుందో లేదో


మహామహామహోహిమాభమాపవాహభోగిహా

విహాయభూవివాహగోవివేగమాంగగోవిభూ

విహాయ భూవిహాపగాంబువేగవాహభావభూ

మహోభవాగమాభిగోపమావిభీమవైభవా

                                                 (సుబ్రహ్మణ్య విజయము - 1- ఆశ్వాసాంత సంబోధన)

దీనిలో నాలుకతాకులేని అక్షరాలతో కూర్చిన పంచాచామరము.

కావున ఇది అచలజిహ్వ .

Saturday, February 26, 2022

ప్రశ్నోత్తర పద్యం

 ప్రశ్నోత్తర పద్యం




సాహితీమిత్రులారా!



ఇది అంతర్లాపికకు చెందిన పద్యం

దీనిలో సమాధానం పద్యంలోనే ఉంటుంది

గమనించగలరు-


అలరుగణింప పంక్తిరథునాత్మజుడలెవ్వరు? మైథిలుండునే

లలనకు దండ్రి? మన్మధుని లావు శరంబులు నెవ్వ? కాళికా

చెఱువని నామమెద్ది? మఱిసీరియు శౌరికి నేమికావలెన్?

చెఱువుగ రామలక్ష్మణులు సీతకు దమ్ములు శంభుడన్న

యున్


ఈ పద్యంలో ప్రశ్నలు మొదట గమనిద్దాం-

పంక్తిరధునాత్మజుడలెవ్వరు?

(దశరథుని పుత్రులు ఎవరు?)

మైధిలుండునే లలనకు దండ్రి?

(జనకుడు ఎవరికి తండ్రి?)

మన్మధుని లావు శరంబులు నెవ్వ?

(మన్మధుని గొప్పవైన బాణాలు ఏవి?)

కాళికా చెఱు(లు)వని నామమెద్ది?

(కాళికా చెలువుని పేరేమి?)

సీరియు శౌరికి నేమికావలెన్?

(బలరాముడు శ్రీకృష్ణునికి ఏమికావాలి?)


వీటి అన్నిటికి సమాధానాలు వెదికితే మనకు పద్యం చివరిపాదంలో

అన్ని సమాధానాలు దొరుతాయి

రామలక్ష్మణులు, సీత, దమ్ములు(తామరపూలు), శంభుడు, అన్న


Thursday, February 24, 2022

గొలుసుకట్టు పొడుపు కత

 గొలుసుకట్టు పొడుపు కత




సాహితీమిత్రులారా!



పొడుపులోని చివరి పదం రెండవ పొడుపులో 

రావడం గొలుకట్టు పొడుపుకత

దీనిలో గమనించండి-

జోడు నిట్రాళ్లు

నిట్రాళ్లమీద కుడితిగోలెం

కుడితిగోలెంపైన పొన్నకాయ

పొన్నకాయమీద గరికపోచలు

గరికపోచలపూన గాడిదపిల్లలు నాట్యమాడుతున్నాయి


దీనికి విడుపు చెప్పండి-

       పొడుపు                                                                        విడుపు

జోడు నిట్రాళ్లు  ----------------                                                 కాళ్లు

నిట్రాళ్లమీద కుడితిగోలెం ------                                            పొట్ట

కుడితిగోలెంపైన పొన్నకాయ ---                                           తల

పొన్నకాయమీద గరికపోచలు ---                                           జుట్టు

గరికపోచలపూన గాడిదపిల్లలు నాట్యమాడుతున్నాయి --- పేలు


Tuesday, February 22, 2022

వస్తేరాడు - రాకుంటే వస్తాడు

 వస్తేరాడు - రాకుంటే వస్తాడు




సాహితీమిత్రులారా!

రాయలసీమ మాండలికాల్లోని

ఈ పొడుపు కత చూడండి-


"తల్లుల గాల్చుకొని,

పిల్లల్ని ఏరుకుతినే ముండా!''

మీ నాయన యాడకు బోయినాడు అంటే-

ముల్లుకు ముల్లడ్డ మెయ్యను బోయినాడు

వచ్చేరాడు, రాకుంటే వచ్చాడు

(వస్తేరాడు రాకుంటే వస్తాడు)


సమాధానం-

ఒకతను కందికంపను కాల్చుకు కందికాయలను తినే అమ్మాయితో

తల్లుల గాల్చుకొని,

పిల్లల్ని ఏరుకుతినే ముండా - అన్నాడు

అంటే ఇక్కడ కందికంప తల్లి, దానికి కాసిన కందులు దాని పిల్లలు

ఇందులో కందికంపను కాల్చుకుని కందులను తింటున్నదికావున

తల్లులను కాల్చుకు కందికంప పిల్లల(కందుల)ను తింటున్నది సరైందే కదా

మీ నాయన యాడ(ఎక్కడ)కు పోయినాడు అంటే అతనితో ఆ అమ్మాయి

చెప్పినది ముల్లుకు ముల్లడ్డమేయడానికి అంటే వంగకు ముల్లుంటుందికదా 

వంగతోటకు రక్షణగా ముల్లు(కంప)చెట్లను నరికి వాటికి కాపు వేయడం

ఏటి అవతల పొలాని వెళ్లాడు నాన్న కావున ఏరొస్తే నాన్న రాడు

ఏరు రాకపోతే నాన్నొస్తాడు అని విడుపు.

Sunday, February 20, 2022

ఖుస్రో పొడుపు పద్యం

 ఖుస్రో పొడుపు పద్యం




సాహితీమిత్రులారా!



అమీర్ ఖుస్రో కూర్చిన పొడుపు పద్యం గమనించండి-


బీసోం కా శిర్ కాట్ రియా

నా మారా నా ఖూన్ కియా


బీసోం కా 20 మంది శిరస్సులు ఖండించాను

కాని  ఒక్క నెత్తురు బొట్టుకూడ రాలలేదు, ఎవరినీ

హత్యచేయలేదు

ఇదేమిటీ అంటే దీనిలోని 

తమాషా రెండవపాదంలో సమాధానం ఉంది.

ఎక్కడ అంటే వాఖూన్ అంటే గోళ్ళు

చేతులకు పది, కాళ్ళకు పది మొత్తం 

ఇరవై గోళ్లుంటాయి కదా ఇవి వేళ్లకు తలకాయలు

ఈ తలకాయల్ని ఖండిస్తే రక్తం రాదు కదా

హత్యా కాదుకదా ఇదీ సమాధానం.

Friday, February 18, 2022

బ్రహ్మ ప్రార్థన

 బ్రహ్మ ప్రార్థన




సాహితీమిత్రులారా!



బ్రహ్మదేవుని ప్రార్థన పద్యం

గూఢచిత్రంలో ఉంది గమనించగలరు-


తమ్మినెచ్చెలి పుత్రుని తగ వధించు

వాని , మిత్రుని పుత్రుని వైరి, దాల్చు

నతని సోదరి, కొమరుండు హర్ష మొప్ప

భోగభాగ్యాయువుల నిచ్చి బ్రోచుమిమ్ము


తమ్మి - తామరలకు, నెచ్చెలి - మిత్రుడు (సూర్యుడు)

సూర్యుని కుమారుడు - కర్ణుడు, కర్ణుని వధించినవాడు-

అర్జునుడు, అర్జునిని స్నేహితుడు -కృష్ణుడు, 

కృష్ణుని కుమారుడు - మన్మథుడు, మన్మథుని విరోధి - శివుడు, 

శివుడు ధరించునది - చందమామ, చందమామ సోదరి - లక్ష్మిదేవి, 

లక్ష్మిదేవి కుమారుడు- బ్రహ్మ, ఆ బ్రహ్మదేవుడు 

మీకు భోగభాగ్యాలను ఆయువును ఇచ్చి కాపాడుగాక

Wednesday, February 16, 2022

వావివరుసల పద్యం - 3

 వావివరుసల పద్యం - 3




సాహితీమిత్రులారా!



ఈ పద్యంలోని వావివరుసలు గమనించి

ఈ పద్యానికి భావం చెప్పండి-


ధరణిపుత్రుని పినతల్లి తమ్ముని సుతు

                  తాత యల్లునిరాణి తండ్రికొడుకు

కొడుకు తండ్రికి తండ్రికోడలి సుతుబంటు

                  నణచి నాతని తండ్రికగ్రసుతుఁడు

తమ్ముని యేలిక తండ్రి వియ్యంకుని

                   కూతు నేర్పుగఁ జెఱఁగొన్నవాని

తనయుని ద్రుంచిన గనయౌషధముఁ దెచ్చు

                   తండ్రిసుతు పుత్రుతద్దొరకుమారు

యవ్వకోడలు కోడలు యన్నతండ్రి

భార్యవద్దను కొలువున్న భామజనకు

తనయుచేతన గూలిన ఘనుని తల్లి

ధరుఁడు మీకిచ్చు పుత్రుపౌత్రాభివృద్ధి

                                                              దీనికి భావం కామెంట్స్ లో ఉంచండి.

Monday, February 14, 2022

పొడుపు పద్యం

పొడుపు పద్యం




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యాన్ని విప్పండి-


పదములెనిమి కొమ్ములు వరలునాల్గు

తలయుతోకయు లేకున్నఁ గలదు యొకటి

కాళ్లు తల తోకకొమ్ములుఁ గానిలేక

జీవముండియుఁ దిరుఁగాడు చిత్రమొకటి

కూర్చె గంగాధరము తెల్సి కొండు దీని


పాదాలు 8, కొమ్ములు 4, తల తోక లేకున్నా ఉంటుందట?

దీనికి సమాధానం - పీత


కాళ్లు, తల, తోక లేకున్నా జీవముండి తిరుగాడేది?

సమాధానం - నత్త 

Saturday, February 12, 2022

నడవకయె నడచివచ్చితి

నడవకయె నడచివచ్చితి




సాహితీమిత్రులారా!



ఈ పద్యం గమనించండి-

నడవకయె నడచివచ్చితి

నడచిన నేనడచిరాను నడచెడునట్లు

నడవక నడచెడునట్లును

నడపించుము పాండురాజ! నరనాథమణీ


ఓ పాండురాజా! జీవనం సాగక నడచివచ్చితిని, 

జీవనము సాగునట్లయిన నేను నడచిరాను. 

కావున సాగెడువిధమున నేను నడువకుండ గడచెడురీతిని యేర్పాటు చేయుము.


దీనిలో నడవక  అనే పదం అనేకమార్లు 

రావడం జరిగింది వివిధ అర్థాలతో

గమనించగలరు.

Thursday, February 10, 2022

దీని భావం చెప్పండి

 దీని భావం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యం భావం చెప్పండి-

భక్షణ పేరిటిపక్షికి

భక్షణ యగునట్టిదాని భక్షణసఖునిన్

భక్షించువాని సూనుని

శిక్షించిన వాని మిత్రు సిరిమాకిచ్చున్


ఈ పద్యం భావాన్ని కామెంట్స్ లో పెట్టగలరు

Tuesday, February 8, 2022

ఆలినొల్లకయున్నవా నమ్మ మగని

 ఆలినొల్లకయున్నవా నమ్మ మగని




సాహితీమిత్రులారా!



ఈ గూఢచిత్ర ఆశీర్వాద పద్యం

గమనించండి-

ఆలినొల్లకయున్నవా నమ్మ మగని

నందులోపల నున్నవా నక్కమగని

నమ్మినాతనునిఁ జెఱుచు దా నమ్మ సవతి

సిరులు మీకిచ్చు నెప్పట్లఁ గరుణతోడ


ఆలినొల్లకయున్నవాడు - భీష్ముడు, 

అతని అమ్మ - గంగ, 

గంగ మగడు - సముద్రుడు, 

అందులోనున్నవాడు - మైనాకుడు, 

మైనాకుని అక్క - పార్వతి, 

ఆమె మగడు - శివుడు, 

శివుని నమ్మినవాడు - రావణుడు, 

రావణుని చెఱచినది - సీత, 

ఆమె తల్లి - భూదేవి, భూమికి సవతి లక్ష్మి,

ఆ లక్ష్మి మీకు ఎల్లపుడు సంపద లిచ్చుగాక!

Sunday, February 6, 2022

నరహరి శతకం

 నరహరి శతకం



సాహితీమిత్రులారా!

మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకాలోని మామిళ్ళపల్లిలో

ఉన్న నృసింహస్వామి ఆలయం ఎంతో పురాతనమైంది.

ఇక్కడున్న నృసింహస్వామిని స్తుతిస్తూ విద్యాశాఖలో వివిధ 

పదవులు నిర్వహించిన మొలగర రంగారావుగారు నరసింహ శతకం

1991లో రచించారు. తెలుగులో శతకమంతా ఒకేప్రాసగల

శతకాలు చాలానే వున్నాయి. కాని పేరును(నామ)ప్రాసగా

శతకం కూర్చారు రంగారావుగారు. మొదటి పద్యంలో నకార ప్రాసం,

రెండవ పద్యంలో ర(రేఫము) కార ప్రాసం, మూడవ పద్యంలో

హ కార ప్రాసం, నాలుగవ పద్యంలో ఇత్వరేఫము(రి) ప్రాసంగా

కూర్చారు. అంటే ఒకసారి నరహరి అని పూర్తికావటానికి 4 పద్యాలు

కావాలి. అలా 108 పద్యాలకు నరహరి నామం 27 మార్లు ఆవృత్తమౌతుంది. 

ఇలాంటి శతకాలు చాల తక్కువగా ఉన్నాయి.

ఇలాంటి శతకం భువనగిరి విజయరామయ్యగారు కూర్చినట్లు

చూచిఉన్నాను. ఇంకా కొందరు కూర్చి ఉండవచ్చు.

ఇక్కడ మానవ సహజనైజాన్ని తెలిపే 83వ పద్యం చూద్దాం-


మోహ విలగ్న చిత్తగతి మూర్ఖుడు గూలు నిరంతరాఘ సం

దోహ మహాహ్రదంబున ననూహ్యగతిన్ దనమేలుకైన య

య్యీ హ లొకింత గైకొనడికే విధి? నిన్ మది నూను? దుష్ట దం

భాహత బుద్ధియై నకట, మామిళపల్లి నృసింహ! యో! ప్రభూ!


Friday, February 4, 2022

కాటమరాయుడు కదిరి నరసింహుడా

 కాటమరాయుడు కదిరి నరసింహుడా




సాహితీమిత్రులారా!

కాటమరాయుడు కదిరి నరసింహుడా

ఈ పాటకు నండూరి శ్రీనివాస్ గారి వివరణ

ఆస్వాదించండి-



Wednesday, February 2, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ పద్యానికి అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యానికి అర్థం చెప్పండి

కమలాకమలామోదిత

కమలా కమలావతంస కమలాకమలా

కమలా కమలాన్వయవర

కమలాకమలాస్య రాధఁగానరె యిచటన్


ఈ పద్యానికి అర్థం కామెంట్స్ లో పెట్టగలరు