Friday, June 19, 2020

పద్యమంతా లఘువులే


పద్యమంతా లఘువులే






సాహితీమిత్రులారా!

ఒక మాత్రా కాలంలో అంటే ఒక చిటిక వేసేంత కాలంలో పలుకగలిగే అక్షరాన్ని లఘువు అంటాం. ఏ పద్యంలోనైనా అన్నీ లఘువులే ఉంటే దాన్ని సర్వలఘువు అంటాం. అదే కందపద్యంలో అన్ని గణాలు లఘువులయితే దాన్ని సర్వలఘుకందం అంటాం. కానీ రెండు, నాలుగు పాదాంతాలలో గురువు ఉంటుంది. ఇలాంటిది తెలుగులో మొదట నన్నెచోడుడు కుమారసంభవం(10వ ఆశ్వాసం 187వ పద్యం)లో రచించాడు.

తగుఁదగదని మనమున మును
వగవఁగ నొడఁబడఁగ వగవ వగవఁగఁబడయున్
దగుఁదగ దని వగ వని వగ
వగవఁగఁ బని గలదె తనకు వగ మఱి జగతిన్

తారకాసురునితో శుక్రాచార్యుడు - కుమారస్వామితో యుద్ధానికి వెళ్ళేసమయులో కొంత నీతిబోధ చేస్తూ అన్న పద్యమిది.
"ఈ పని చేయతగును ఈ పని చేయకూడదని మనసులో ముందుగా విచారించాలి. అలా ఆలోచించగా కర్త్యం బోధపడుతుంది. ఇది చెయ్యవచ్చు ఇది చెయ్యకూడదు అని ముందుగా ఆలోచింపని విధం తనకు లోకానికి మిక్కిలి దుఖం కలిగిస్తుంది తరువాత విచారించి ప్రయోజనంలేదు."  అని భావం.

ఇలాంటి పద్యమే పోతన గజేంద్రమోక్షణంలో గజేంద్రుని రక్షింపబోవు విష్ణువుతో లక్ష్మీదేవి తత్తరపడుతూ వెళుతూన్న ఆమె మనసులోని భావాన్ని ఈ పద్యంగా చిత్రించారు పోతన.

అడిగెదనని కడువడిఁజను
నడిగినఁ దను మగుడ నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్  
                                                                 (శ్రీమదాంధ్రమహాభాగవతం - 8- 103)

No comments: