Tuesday, June 16, 2020

కేవలం గొంతు మాత్రమే పలికే పద్యం


కేవలం గొంతు మాత్రమే పలికే పద్యం





సాహితీమిత్రులారా!

కంఠము, తాలువు, మూర్ధము, దంతము, ఓష్ఠము అనే
ఈ అయిదు వర్ణ ఉత్పత్తి స్థానములు.
కంఠం(గొంతు) నందు పుట్టేవాటిని కంఠ్యములు అని అంటారు.
ఒక ఉత్పత్తిస్థానంనుండి పుట్టే వాటిని తీసుకొని కూర్చిన
దాన్ని ఏకస్థాన చిత్రం అంటారు.
మిగిలిన వర్ణోత్పత్తి స్థానాలను
పరిహరించడం జరుగుతుంది.

ఈ శ్లోకం దండి కావ్యాదర్శంలోనిది చూడండి.

అగా గాం గాంగకాకాంక గాహకాఘక కాకహా
అహాహాంగఖగాం కాగగ కంకాగ ఖగాంకగ

(హానిలేని అంగముగల సూర్యుని(గరుడుని)గుర్తుగా
ధరించిన పర్వతము(మేరువు)నందు సంచరించు
కంఖములనెడి పర్వతపక్షులచేత
ప్రస్తుతిగొన్న గమనము కలవాడా!
గంగాజలము నందలి కుటిలమైన
అంకమునందు వ్రేలాడుచున్న కుత్సితపాప
మనెడి కాకమును(చంపినవాడవేని)చంపి
స్వర్గమునకు పోయితివి.)

అ,ఆ,క,ఖ,గ,ఘ,ఙ,హ,(విసర్గ)-
అనేవి కంఠము(గొంతు)నుండి పుట్టేవి
కావున
వీటిని కంఠ్యములు అంటారు.
ఈ శ్లోకంలో ఈ చెప్పబడిన వాటినుండి మాత్రమే
తీసుకొని శ్లోకం కూర్చడం జరిగింది.
కావున
ఇది ఏకస్థానచిత్రం అనదగినదే.

No comments: