Tuesday, July 23, 2019

కవిత్వం గురించి ఎజ్రా పౌండ్‌


కవిత్వం గురించి ఎజ్రా పౌండ్‌సాహితీమిత్రులారా!

భావకవిత్వం తర్వాత తెలుగు సాహిత్య విమర్శాప్రమాణాల గురించి కవులు మాట్లాడటం లేదంటున్నారు వెల్చేరు నారాయణరావు గారు.
అలా కవులే నిర్మించిన ప్రమాణాలు లేనందువల్ల మొదటగా కలిగే దుస్థితి ఏది మంచి సాహిత్యమో ఏది కాదో తెలియకపోవటం. దీని వల్ల ఇప్పటి తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో, అధికారబలం, అంగబలాలే రచనల, రచయితల గుణాల్ని తేల్చేవయ్యాయి. నామట్టుకు నేను చాలా కాలం నుంచి వచనకవితా సాహిత్యంలో మంచిచెడ్డల్ని చూడటంలో ఉపయోగపడే ప్రమాణాల కోసం వెదికి ఇప్పటికీ ఉపయోగపడేవి కన్పించని స్థితిలో వున్నాను. కొత్తగా కవిత్వం రాసే వారికి స్పష్టమైన ప్రమాణాలు కనిపిస్తే వాళ్ళు వాటి మార్గనిర్దేశంతో కవితాసాధన చేసి ఆ తర్వాత ఆ ప్రమాణాల పరిధుల్ని కూడ అధిగమించి ఇంకా ఉన్నతమైన సాహిత్యాన్ని సృష్టించే అవకాశం కలుగుతుంది.

ఈ నేపథ్యంలో కవిత్వం గురించి లోతుగా ఆలోచించిన కొందరు పాశ్చాత్య కవుల భావాల్ని అనువదింపజేసి “ఈమాట” ద్వారా అందిస్తే కొంత ఉపయోగం వుండవచ్చని అనిపించింది. ఆ శ్రేణిలో ఇది మొదటిది. వీటిని ప్రచురించటంలో మా ఉద్దేశ్యం తెలుగు సాహితీకారులు ఈ భావాల్ని కళ్ళు మూసుకుని శిరసావహించి పాటించాలని కాదు. నిజానికి ఈ భావాల్లో అసలు ఏవీ తెలుగు సాహిత్యానికి ఉపకరించేవి కాకపోవచ్చు కూడ. పైగా ఇప్పటికే ఎంతోమంది తెలుగు సాహితీవిమర్శకులు పాశ్చాత్యభావాల్ని పుంఖానుపుంఖాలుగా ఉట్టంకించి, ఆ భావాలు తెలుగు సాహిత్యానికి ఎలా వర్తిస్తాయో మాటమాత్రం చెప్పకుండా, మనకి విసుగు తెప్పించారు కూడా (ఏ యూనివర్సిటీ పరిశోధనావ్యాసం చూసినా, ఏ వచనకవితా సంకలనానికైనా గొప్పవారు రాసే ముందుమాటలు చూసినా ఇవి కనిపిస్తాయి). ఈ వ్యాసాల్ని ప్రచురించటంలో మేం ఆశిస్తున్న ప్రయోజనం చాలా పరిమితమైంది. అది, పాశ్చాత్య విమర్శకుల భావాలని చూసి, వాళ్ళ ఆలోచనాదృష్టుల్ని గమనించి, వాటి గురించి ఆలోచించటం ద్వారా, మనమూ మన భాషకీ ప్రస్తుత సాహిత్యానికీ సరిపడే సాహిత్య విమర్శా భావాలని నిర్మించుకోవటానికి ఇవి కొంత దోహదం చేస్తాయనేది.

(ఎజ్రా పౌండ్‌ హెయిలీ, ఐడహో లో 1885లో పుట్టాడు. కొత్త కవిత్వాన్ని తయారుచెయ్యాలని లండన్‌కి వలస్‌ వెళ్ళాడు. “భావచిత్రమార్గం” (ఇమేజిజం) నిర్దేశించాడు. నవ్యకవిత్వ తత్వాన్ని ఆవిష్కరించిన వారిలో ముఖ్యుడు. వ్యష్టిజీవితపు నిర్వ్దంద్వలయని ప్రతిబింబించే కవితారూపాన్ని అన్వేషించాడు. విస్పష్టమైన సహజవస్తువుల భాష కోసం వెదికాడు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో ఫాసిస్టుల పక్షం వహించి యుద్ధం అయ్యాక అమెరికాకి బలవంతాన పంపబడి ఉన్మాదస్థితి కారణంగా కేసు తప్పించుకుని 1972లో ఇటలీలో మరణించాడు. అతను 1918లో ప్రచురించిన ఒక వ్యాసానికి ఇది అనువాదం. పాఠకుల సౌకర్యం కోసం మూలవ్యాసాన్ని కూడ పొందుపరుస్తున్నాం. అది కావాలంటే ఇక్కడ నొక్కండి. ఆ వ్యాసం వున్న పుస్తకం Strong Words: modern poets on modern poetry, pp. 17 – 25; edited by W. N. Herbert & Matthew Hollis, First published 2000 by Bloodaxe Books Ltd, Highgreen, Tarset, Northumberland NE48 1RP, Great Britain, ISBN: 1 85224 515 8 )

************

ఇటీవల కవిత్వంలో ఓ కొత్తరీతిని గురించి చాలా గోలగా వుంది. దాన్ని గురించి మాట్లాడే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి గతాన్ని సమీక్షిస్తే నన్ను క్షమిస్తారనుకుంటాను.

1912 వసంతంలోనో వేసవి కొత్తల్లోనో ఎచ్‌.డి., ఆల్డింగ్‌టన్‌, నేనూ ఓ మూడు విషయాల్లో అంగీకారానికి వచ్చామని నిశ్చయించాం :

1. “వస్తువు” మానసికమైందైనా భౌతికమైందైనా దాన్ని సూటిగానే ప్రదర్శించటం.

2. ఆ భావప్రకటనకి ఉపయోగించని ఒక్క పొల్లు పదాన్నైనా సహించకపోవటం.

3. లయ గురించి సంగీతంలోలా (మారే పొడవుల) స్వరసంపుటుల్ని వరసగా కూర్చటం (క్రమబద్ధమైన దరువులా కాకుండా).

మిగిలిన చాలా గుణాల విషయంలో మేము విభేదించినా యీ మూడిట్లో ఏకీభవించటం వల్ల మాదీ ఓ సంఘం అని చెప్పుకునే హక్కు సాధించామనుకుంటాను.

ఆ తర్వాత చాలామంది ఈ సంఘంలో చేరటమో అనుసరించటమో చేశారు గాని వాళ్ళు పై వాటితో, ముఖ్యంగా రెండో గుణంతో అంగీకరిస్తున్న సూచనలు అణుమాత్రం కూడా చూపటం లేదు, వాటిలో మంచి ఎంతున్నా. నిజానికి వచనకవిత్వం కూడా పోచుకోలు రాతల్లో అంతకుముందు వచ్చిన నీరసపు రచనల్తో సమానంగానే వుంది; దాని సొంత దోషాల్ని అదీ వెంట తెచ్చుకుంది. వాడిన పదసంపుటులు పాతవాళ్ళంత చెత్తగానే వుంటున్నాయి వాళ్ళకులా యతిప్రాసలూ సంప్రదాయ ఛందస్సుల బాదరబందీ వీళ్ళకి లేకపోయినా. ఇక వీళ్ళ కవిత్వంలో సంగీతం వుందా లేదా అనేది పాఠకుల ఖర్మకే వదిలేద్దాం. వీళ్ళ వచనకవిత్వంలో ఎప్పుడన్నా అరిగిపోయి రసహీనమైన పద్యచ్ఛందాల ఛాయలు కనపడితే మరోప్పుడు అసలు సంగీతపు వాసనలు కూడా వుండవు. ఐతే మొత్తం మీద యీ క్షేత్రాన్ని దున్నటం అనేది మంచిపనే. ఈ కొత్త రీతిలో కొద్దిగానన్నా మంచిరచనలు వచ్చి వుండొచ్చు; అలా ఐతే ఫరవాలేదు.

విమర్శ అంటే పరిధులు నిర్ణయించటమో నిషేధాలు విధించటమో కాదు. అతిక్రమణకి అనుకూలమైన స్థలాల్ని క్రమబద్ధంగా చూపించటం. మందంగా వున్న పాఠకుల్ని ఉలిక్కిపడి లేచేట్టు చెయ్యటం. విమర్శలో వున్న మంచి విషయాలు యదాలాపంగా అన్న మాటల్లోనో లేకపోతే ఎవరన్నా అనుభవం వున్న కళాకారుడు పైకొస్తున్న కుర్రవాళ్ళకి సహాయం చేస్తూ చూపే కొండగుర్తులు, అనుభవం వల్ల వచ్చిన జాగ్రత్తల, రూపాల్లో వుంటాయి సాధారణంగా.

“భావచిత్రమార్గం” (ఇమేజిజం) గురించిన తొలి అభిప్రాయాలు బయటికి వస్తున్న రోజుల్లో నేనూ కవితాసాధనలో ఉపకరించటానికి కొన్ని జాగ్రత్తల్ని రాసి వుంచాను. 1913 మార్చి లో “పొయెట్రీ” పత్రికలో ప్రచురించిన ఆ జాగ్రత్తల్ని మళ్ళీ ఇక్కడ పొందుపరుస్తున్నా.

కవి చెయ్యకూడని పనులు కొన్ని

“భావచిత్రం” (ఇమేజ్‌) అంటే బుద్ధి బలమూ ఉద్వేగమూ పెనవేసుకున్న ఒక విచిత్ర మానసికస్థితిని క్షణమాత్రంలో ప్రదర్శించగలిగేది. అలాటి మానసికస్థితిని ప్రదర్శించటం వల్లనే ఒక గొప్ప చిత్రకళాఖండాన్ని చూసినప్పుడు కలిగే లాటి అనుభూతులు స్వేచ్ఛా భావన, స్థలకాలాల పరిధుల నుంచి విముక్తి, ఉన్నత మానసికస్థితి కలుగుతాయి.

గుట్టలుగా చెత్తరచనల్ని పేర్చటం కన్నా జీవితకాలం మొత్తం మీద అలాటి ఒక్క భావచిత్రాన్ని గీసినా సాఫల్యమే.

ఇప్పుడు నేనన్న వాటి గురించి కొందరు వాదానికి దిగొచ్చు. కాని తక్షణకర్తవ్యం కొత్తగా కవిత్వం రాస్తున్న వారి కోసం ‘ కవిత్వంలో చెయ్యకూడని పనుల ‘ స్పష్టమైన జాబితా ఒకటి ఇవ్వటం. ఐతే ఈ జాబితాలోవి అన్నీ శుద్ధ నిషిద్ధా లనలేం.

మొదటగా, ముందు చెప్పిన మూడు సూత్రాల్ని (సూటిగా చెపాలనే పట్టుదల, మాటలపొదుపు, స్వరసంపుటుల పేర్పు) శిలాశాసనాలుగా కాక సుదీర్ఘమైన తీవ్రాలోచన (అది నీది కాకపోయినా సరే) ఫలితాలనీ, అందువల్ల కనీసం పరిశీలనార్హాలనీ భావించాలి. అసలు ఎవరి మాటలైనా శిలాశాసనాలు కావు.

చెప్పుకోదగ్గ రచనలు స్వయంగా చెయ్యనివాళ్ళు చేసే విమర్శల్ని అసలు పట్టించుకోనే కూడదు. గ్రీకు కవులూ నాటకకారుల రచనల్నీ, వాటిలోని ఛందస్సుల్ని వివరించటానికి గ్రీక్‌రోమన్‌ వైయాకరణులు తయారుచేసిన కల్పిత సిద్ధాంతాల్నీ, పోల్చి చూస్తే ఈ విషయం తెలీటం లేదూ?

భాష

అనవసరమైన ఒక్క పదాన్ని గాని, నూతన విశేషాల్ని బయటపెట్టని ఓ విశేషణాన్ని గాని వాడకు.

‘ dim lands of peace ‘ లాటి పదవిన్యాసాలొద్దు. అది భావచిత్రాన్ని మసకబారుస్తుంది. స్పష్టరూపాన్నీ అరూపాన్నీ కలగలుపుతుంది. ఎప్పుడైనా సరే భావానికి అచ్చమైన ప్రతినిధి సహజవస్తువేననే విషయాన్ని రచయితలు గ్రహించకపోతే యిలాగే ఔతుంది.

అరూపాల్తో జాగ్రత్తగా మసులు. మంచివచనంలో అదివరకే చెప్పిన విషయాన్ని మామూలురకం వచనకవితలో మళ్ళీ చెప్పకు. చక్కటివచనం రాయటం చచ్చేంత కష్టం. ఆ శ్రమ నుంచి తప్పించుకోవటానికి నీ రాతల్ని పాదాల్లోకి విరగ్గొట్టినంత మాత్రాన బుద్ధున్న వాడెవడూ బోల్తాపడతా డనుకోకు.

విద్వాంసుడికి ఇవాళ నచ్చనిది సామాన్యుడికి రేపు నచ్చదు.

కవిత్వకళ సంగీతకళ కంటే ఏమీ తేలిక కాదు. సగటురకం సంగీతం పంతులు సరిగమల మీద పెట్టేంత శ్రమనైనా నువ్వు కవిత్వం మీద పెట్టకుండా విద్వాంసుల్ని మెప్పించగలననుకోకు.

వీలైనంతమంది గొప్పకవుల ప్రభావం నీ మీద పడనియ్యి. ఆ తరవాత వాళ్ళ ఋణాన్ని ఒప్పుకునే సహృదయత నన్నా చూపించు, లేదా ఆ అప్పుని గుట్టు చప్పుడు కాకుండా దాచెయ్యి.

“ప్రభావం పడటం” అంటే ఆ పూట నీకు విపరీతంగా నచ్చిన ఒకరిద్దరు కవుల తళుకుబెళుకు పదాలకి మసిపూసి మారేడు కాయ చెయ్యటం కాదు. అలంకారాలు వాడొద్దు . వాడితే మాత్రం మంచివే వాడు.

లయప్రాసలు

ముందుగా సమతుల్యాలైన అద్భుతధ్వనుల్తో నీ మనసంతా నింపుకో. అవి పరాయిభాషల్లో వైతే మరీ మంచిది పదాల అర్థాలు ధ్వనికదలికలకి అడ్డం పడవు. పదాల నుంచి ధ్వనుల్ని విడదియ్యగలగాలి. పూర్వుల పద్యాల్ని నిర్దాక్షిణ్యంగా వాటి ధ్వనిపరమాణువుల్లోకి, పొడవు పొట్టి అక్షరాల్లోకి, ఒత్తులూ మెత్తలూ లోకి, అచ్చులూ హల్లులూ లోకి విడగొట్టేసి విను.

ఓ కవిత దాన్లోని సంగీతం మీద ఆధారపడనక్కర్లేదు; పడితే మాత్రం ఆ సంగీతం కవిత్వంలో నిష్ణాతుణ్ణి కూడ తన్మయుణ్ణి చెయ్యాలి.

కొత్తగా కవిత్వం రాస్తున్న వాళ్ళకి ‘దగ్గరగా పోలిన పదధ్వనులు ‘, పదాది అక్షరమైత్రి, దగ్గరగా దూరంగా వచ్చే ఏకాక్షర, అనేకాక్షర ప్రాసలు ఓ సంగీతజ్ఞుడికి ఎలాగైతే తన విద్యలోని సూక్ష్మాలు తెలుస్తాయో, అలా తెలియాలి. ఓ కళాకారుడికి వీటితో ఎప్పటికైనా పని పడినా పడకపోయినా వీటి మీద నిజానికి ప్రతి ఒక్క దాని మీద ఎంతైనా సమయం వెచ్చించటం అవసరం.

ఓ విషయాన్ని వచనంలో చెప్తే నీరసంగా ఉంటుందని కవిత్వంలో చెబ్దామని భ్రమపడకు.

పటాటోప ప్రదర్శన వద్దు, దాన్ని శుష్కసిద్ధాంత వ్యాసకర్తలకి ఒదిలెయ్యి. వర్ణనలు వద్దు. ఓ చిత్రకారుడు దృశ్యాల్ని నీకంటే బాగా వర్ణించగలడు, ఆ దృశ్యం గురించి అతనికే ఎక్కువ తెలుస్తుందని గ్రహించు.

“స్వర్ణవర్ణాచ్ఛాదిత ఉష ( Dawn in russet mantle clad )” అని షేక్స్పియర్‌ అన్నది ఏ చిత్రకారుడూ చిత్రించలేనిది. ఈ పదచిత్రంలో వున్నది వర్ణన కాదు, మనోదృశ్యం.

శాస్త్రజ్ఞుడి దారిలో నడువు, సబ్బులు ప్రచారం చేసేవాడి దారిలో కాదు.

ఓ శాస్త్రజ్ఞుడు ఏ గొప్ప విషయాన్నీ కనుక్కోకుండానే తనకి గొప్పపేరు వస్తుందని ఎదురుచూడడు. తన ముందువాళ్ళు ఏం సాధించారో ముందుగా తెలుసుకుంటాడు. అక్కడి నుంచి తను ముందుకు సాగుతాడు. తన జనవశీకరణశక్తి మీద నమ్మకం పెట్టుక్కూచోడు. తను చేసే మామూలు పనికి స్నేహితులైనా చప్పట్లు కొట్టాలని ఆశించడు. ఐతే దురదృష్టవశాత్తు ఓనమాలు కూడా రాని కవులకి యిలాటి బాధలు లేవు. మరి జనం కవిత్వం వంక కన్నెత్తి చూడటం లేదంటే అందులో వింతేముంది?

నీ రాతని చిన్నచిన్న విడివిడి ధ్వనుల ముక్కల కింద చెక్కకు. ఏ పాదానికాపాదం పూర్తిగా ఆగిపోయేట్టూ, తర్వాతి పాదం మొదల్ని ఎత్తి బలంగా లేపాల్సి వచ్చేట్టూ చెయ్యకు. పాదం చివర్లో కదిలే లయతరంగాన్ని పట్టుకుని తర్వాతి పాదం మొదలు దాంతోపాటే లేవాలి కావాలని పాదం చివర్లో సుదీర్ఘ వ్యవధి యివ్వదల్చుకుంటే తప్ప.

టూకీగా నీ కళలో సంగీతచ్ఛాయలున్న విషయాల విషయంలో ఓ మంచి సంగీతకారుడిలా ప్రవర్తించు. అతనికున్న నియమాలు నీకూ వర్తిస్తాయి; అవే వర్తిస్తాయి.

సహజంగానే, నీ లయనిర్మాణం వల్ల పదాల రూపం గాని, సహజధ్వని గాని, అర్థం గాని నాశనం కాకూడదు. మొదట్లో అంత పటిష్టమైన లయనిర్మాణం దొరకటం అసంభావ్యమైనా, పాదాంతాలూ విరామాల కృత్రిమబంధాలు కొంత చేటు చెయ్యొచ్చు.

గాయకుడు శ్రుతి మీద, వాద్యసహకారం మీద ఆధారపడొచ్చు. నీకా సదుపాయం లేదు. కవిత్వంలో, “అఖండసమ్మేళనం ( harmony )” అనే పదం వాడుక సరైనది కాదు. అది వేర్వేరు శ్రుతుల్లో ఉన్న శబ్దాలు ఒకేసారి వినపడటం. ఉన్నతమైన వచనకవితలో కవిత ఐపోయాక కూడ శ్రోత చెవిలో మిగిలిపోయే శబ్దశేషం వుంటుంది.

ఓ లయ ఆనందం కలిగించాలంటే దాన్లో కొంత చమక్‌ వుండాలి. అది విచిత్రంగా వింతగా వుండక్కర్లేదు గాని అసలంటూ వాడితే దాన్ని చక్కగా వాడాలి.

నీ కవిత్వంలో పాఠకుడి ఊహానేత్రం మీద పడే భాగం మరోభాష లోకి అనువదిస్తే ఏమీ కోల్పోదు. చెవికి సోకేది మాత్రం నీ భాష వాళ్ళకే అందుతుంది.

మిల్టన్‌ భాషాడంబరం కన్నా డాంటే నైశిత్యాన్ని పాటించు. మరీ నీరసంగా లేని వర్స్డ్‌వర్త్‌ నంతటినీ వల్లెవెయ్యి.

నీకు కేవలం వస్తువే కావాలంటే లాటిన్‌, గ్రీక్‌ గ్రంథాలు చదువు. నీకా భాషలు రాకపోతే హాయిగా Chauser చదువుకో. మంచివచనం నీకు హానిచెయ్యదు సరిగదా, దాన్ని రాసే ప్రయత్నం నీకు క్రమశిక్షణ నిస్తుంది కూడా.

అలాగే అనువాదం కూడ మంచి సాధన. ముఖ్యంగా, మూలాన్ని నువ్వు తిరిగిరాయబోతే అది ‘అసమంగా వూగిసలాడితే’. అనువదిస్తున్న పద్యం అర్థం అలా వూగిసలాడకూడదు.

నువ్వు సమతుల్యత వున్న రూపాన్ని వాడేటప్పుడు చెయ్యకూడని పని చెప్పదల్చుకున్న ముక్కల్ని ముందుగా కూర్చుకుని మిగిలిపోయిన ఖాళీల్ని చెత్తతో భర్తీ చెయ్యటం.

ఒక యింద్రియం తాలూకు గ్రహణతా తత్వాన్ని మరో దాంతో నిర్వచించబోయి ముంచకు. సామాన్యంగా దీనిక్కారణం సరైన పదాన్ని వెదికి పట్టుకోలేని సోమరితనం. ఈ మాటకి బహుశ ఎక్కడన్నా మినహాయింపులుండొచ్చు.

మొదటి మూడు సూత్రాలు కలిసి యిప్పుడు ప్రమాణాలుగా ఉ్రదంధాలుగా పైకెత్తుకోబడుతున్న కుకవిత్వంలో పదింట తొమ్మిదివంతుల్ని ఏరిపారేస్తాయి. నువ్వూ అదే కుకవితానిర్మాణ నేరం చెయ్యకుండా అడ్డుపడతాయి.

నా మార్గం

లయ. నాకు నిర్వ్దంద్వలయలో నమ్మకం. అంటే ప్రదర్శించాల్సిన ఉద్వేగానికి గాని, ఉద్వేగచ్ఛాయకి గాని సరిగ్గా ఖచ్చితంగా సరితూగే లయన్నమాట. ఎవరికి వారికి ఓ ప్రత్యేక వివరణాత్మకత ఉన్న లయ కావాలి. అప్పుడది వారి సొంత ముద్ర ఔతుంది. అది మరొకరికి నకిలీ కాదు, ఇంకొకరి మక్కికి మక్కి అనుకరణకి చోటివ్వదు.

ప్రతీకలు. మనం లోకంలో చూసే వస్తువులే సరైన ప్రతీకలు. అసలు “ప్రతీకలు” వాడితే అవి కొట్టొచ్చినట్టు కనపడకూడదు. ప్రతీకలు అర్థం కానివారికి కూడ పద్యం అర్థవంతంగా వుండాలి. ఉదాహరణకి నువ్వు డేగని ప్రతీకగా వాడినా దాన్ని కేవలం డేగగానే భావించే వాళ్ళకి కూడ ఆ కవిత అర్థవంతంగానే వుండాలి.

పనితనం. నా ఉద్దేశ్యంలో పనితనం ఓ కవి నిజాయితీకి నిజమైన పరీక్ష. తన మనసులో వున్న భావాన్ని ప్రస్ఫుటీకరించటంలో తనకి అడ్డొచ్చే ఎలాటి సంప్రదాయ నియమాల్నైనా కూలదోస్తాడు మంచిపనితనం వున్న కవి.

రూపం. కవితావస్తువులు కొన్ని ఘనపదార్థాలు, మరికొన్ని ద్రవపదార్థాలు. అంటే కొన్ని వస్తువులు చెట్ల లాగా నిర్దుష్టమైన ఆకారాల్లో వుంటే మరికొన్ని ద్రవాల్లా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని ధరిస్తాయి. కవిత్వంలో ఖచ్చితమైన రూపానికి కూడ స్థానం వుంది. ఐతే బోలెడన్ని వస్తువులు అలాటి ఖచ్చితమైన రూపాలున్న కవిత్వంలో ఒదగవు.

‘అన్ని సాధనాల్ని వాడితేనే సార్థకత ‘. నిజమైన కళాకారుడికి అప్పటివరకు వాడుకలో వున్న అన్ని రకాల ఛందస్సులూ కవితా విప్లవాలూ కరతలామలకాలుగా వుండాలి. నా మట్టుకు నేను యీ విషయంలో గట్టిగా కృషి చేసాను. ముఖ్యంగా కవితావిప్లవాలు ప్రారంభమైన, పరిణతి పొందిన కాలాల్ని వెదికే పనిలో. నేను నా కవితల్ని పూర్తిగా సానపట్టకుండానే నా నోట్సుపుస్తకాల్ని జనం లోకి విసిరేస్తానని ఒక అపవాదు వుంది. అది కొంత నిజం కూడా. ఏ కవితావిప్లవమైనా పూర్ణపరిణతిని సాధించటానికి చాలా వ్యవధి తీసుకుంటుందని నేననుకుంటాను. డాంటే మహాకావ్యం రావటానికి దాదాపు మూడు శతాబ్దాల పాటు రంగం సిద్ధం చెయ్యబడింది. అలాగే షేక్స్పియర్‌ రచనలకి ఎన్నెన్నో దీర్ఘకాల ప్రేరణలు అవసరమయ్యాయి. గొప్పకవిత్వం అనేది బయటకు రావటమే ముఖ్యం గాని దాన్ని ఎవరు రాసారనేది కాదు. ఒకరి నిష్ఫల ప్రయోగాలు ఎందరికో కాలవ్యయం కాకుండా సహాయపడతాయి. అందుకే నేననేది ఒకడు ఓ కొత్తలయని సమర్థవంతంగా ప్రయోగించి చూపినా, లేక అందరూ అంగీకరిస్తున్న చెత్తలో ఒక్క పోచని కరాఖండిగా తీసిపారెయ్యగలిగినా, అతను ఎంతోకొంత సాధించాడని ఒప్పుకోకతప్పదు.

అంతా ‘అద్భుతమైన ‘ కవిత్వాన్నే ఎవరూ రాయలేరు. న భూతో న భవిష్యతి అన్నట్టుగా రాయనప్పుడు కనీసం ముందుముందు తనకీ ముందుతరాల వారికీ పనికొచ్చే ప్రయోగాల్ని ప్రయత్నించి చూడటం చాలా మంచిది.

‘నేర్చుకోవలసింది లావు జీవితకాలం సన్నం’. ఇసక పునాదుల మీద కవిత్వపు కోటలు కట్టాలనుకోవటం పనికిమాలినతనం. అనుభవం పెరుగుతున్న కొద్ది రచనలో పరిపక్వత కనిపించకపోతే అది వ్యర్థం.

ఇంక ‘అనుసరణ’ల గురించి. చిత్రకళా విద్యార్థులు ముందుగా కళాఖండాలకి నకళ్ళు గీసి ఆ పనిలో నిష్ణాతులయాకే సొంత ప్రయత్నాలు చెయ్యాలని ప్రముఖచిత్రకారులు బోధించటం మనం చూస్తూనే వున్నాం.

‘కలం పట్టిన ప్రతివాడూ కవే’. ప్రతివారికీ కవిత్వం గురించి ఎంత తెలిస్తే అంత మంచిది. రాయదల్చుకున్న ప్రతివాడూ రాయాలి. చాలామంది ఆపని చేస్తారు కూడా. ‘లంబోదర లకుమికరా’ అని పాడగలిగే పాటి సంగీతం ప్రతివారికీ రావాలని నా నమ్మకం. ఐతే ప్రతివాడూ కచేరీలు చెయ్యాలని, నోటికొచ్చిందల్లా రాసేసి ప్రచురించాలని మాత్రం కోరను.

ఏ కళలోనైనా నిష్ణాతుడు కావటానికి ఓ జీవితకాలం కావాలి. ఈ విషయంలో ఔత్సాహికులకీ అదే వృత్తి ఐన వాళ్ళకీ తేడా లేదు. నిజానికి వాళ్ళిద్దర్లో నేను ఔత్సాహికుడి వైపే మొగ్గు చూపుతాను. ఐతే ఔత్సాహికుణ్ణీ విద్వాంసుణ్ణీ మాత్రం ఒకే గాటన కట్టెయ్యను. కవిత్వం గురించి ఇప్పుడున్న అయోమయం చాలాకాలం పాటు కొనసాగక తప్పదు. ఎందుకంటే కవిత్వతత్వం అస్థిమూలాల్లోకి ఇంకేదాకా, కవిత్వం అనేది ఓ ఉన్నతమైన కళనీ ఉబుసుపోక కార్యక్రమం కాదనీ అర్థం అయ్యేవరకు, ఔత్సాహికుల కాకిగోలలో అసలైన కళాకారుల స్వరాలు బయటికి వినిపించవు.

ప్రాచీనకాలాల్లో అద్భుతంగా చెప్పబడ్డ విషయాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పటంలో, అందులోనూ అంత బాగానూ అంత దృఢంగానూ కూడా చెప్పలేకపోవటంలో అర్థం లేదు.

సంప్రదాయ కవిత్వం గురించి నేను చేసిన కృషిలో చాలాభాగం, వాళ్ళు ఏయే విషయాల్ని చాలా గొప్పగా చెప్పారో, వేటిని మనకి ఒదిలేసారో తెలుసుకోటానికి వెచ్చించాను. తేలిందేమంటే మనకి బోలెడంత మిగిలి వున్నదని. ఒకోసారి వాళ్ళలాటి భావోద్వేగాలే మనకూ కలిగినా మనం వాళ్ళకన్నా భిన్నమైన దారుల్లో, అనుభవాల్తో, అక్కడికి చేరతాం. ఏ కాలానికైనా కొన్ని ప్రత్యేకత లుంటాయి. ఐతే కొన్ని కాలాల్నుంచి మాత్రమే బహుకాలం నిలిచే రచనలు వస్తాయి. ఇరవై ఏళ్ళ వయసులో ఎవరూ గొప్ప కవిత్వం రాయలేరు వాళ్ళు రాసేవి పుస్తకాల్నుంచి, సంప్రదాయం నుంచి, వాడుక నుంచి వచ్చేవే కాని జీవితాన్నుంచి కాదు. ఐతే తన కళకీ జీవితానికీ మధ్య వున్న జాగాని గుర్తించిన కళాకారుడు మరుగున పడ్డ ఓ కవిత్వాంశాన్ని మళ్ళీ జాగృతం చెయ్యొచ్చు. లేదా సమకాలీన కళలో లోపించిన ఓ అంశాన్ని మళ్ళీ ప్రవేశపెట్టి ఆ కళకి సంపూర్ణతని కలిగించి దానికి తిరిగి జీవితంతో ఐక్యత కలిగించొచ్చు.
------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: