Sunday, July 21, 2019

రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు


రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు





సాహితీమిత్రులారా!

మౌళిఁ గెంజడల జొంపము ఫాలపట్టికఁ
          దీండ్రించు భసితత్రిపుండకంబుఁ
గర్ణకీలిత రత్నకామాక్షియుగళంబుఁ
          బలుచని నెమ్మేనఁ బట్టుకంథ
కరముల బంగారు సరకట్టుఁ గిన్నెర
          హరిణశృంగంబుఁ బేరురమునందుఁ
గరమూలమున భూరి కరవాల సన్నంపు
          నడుమున నొడ్డియాణంబు దిద్దు

పెరగుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన
యోగవాగలు శూలంబు నాగసరము
పొలుపు దళుకొత్తు చెట్టునఁ బుట్టినట్లు
నిరుపమాకార సిద్ధుఁడు నరుగుఁదెంచె.

ఇది ‘సిద్ధపురుషుఁడు: తెన్నాలి రామలింగయ కందర్పకేళీ విలాసము’ అన్న శీర్షికతో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు 1989లో ప్రకటించిన సాహిత్యసంపద వ్యాససంపుటం లోని ‘ప్రబంధరత్నాకరము చతుర్థాశ్వాసము – ప్రత్యంతరవిశేషములు’ అన్న వ్యాసంలో (పు. 304-5లు) ఉదాహరింపబడిన పాఠం. ప్రబంధరత్నాకరము అంటే తంజావూరు సరస్వతీ మహలు గ్రంథాలయంలో ఉన్న పెదపాటి జగన్నాథకవి సంకలనగ్రంథం. అందులో లేని పద్యాలు కొన్ని ప్రబంధరత్నాకరము ప్రత్యంతరంలో కొర్లపాటి శ్రీరామమూర్తి గారికి దొరికాయి. వాటిని ఆయన మొదట భారతి పత్రిక లోనూ, ఆ తర్వాత తమ సాహిత్యసంపద వ్యాససంపుటం లోనూ ప్రకటించారు. తంజావూరు ప్రతిలో తెనాలి రామకృష్ణుని రచన కందర్పకేతు విలాసము అని, ప్రత్యంతరంలో కందర్పకేళీ విలాసము అని ఉన్నందువల్ల అవి రెండూ వేర్వేరు గ్రంథాలని ఆయన అభిప్రాయపడ్డారు. కందర్పకేతు విలాసము కథాకావ్యమని, కందర్పకేళీ విలాసము పేరును బట్టి కామశాస్త్రగ్రంథం కావచ్చునని ఊహించారు. అయితే, కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణకవి రచనమేనని, అది సంస్కృతంలో సుబంధుని వాసవదత్తా కథకూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధానికీ సంయుక్తానువాదమని మునుపు నేను ప్రతిపాదించాను. ఆసక్తి గల పాఠకులు ఆ వ్యాసాలను ఈమాట పత్రిక పూర్వసంచికలలో చూడవచ్చును. కందర్పకేళీ విలాసము అన్నది లేఖనదోషమని, ఆ పేరు గల కావ్యమేదీ ఉండి ఉండదని, పైని ఉదాహరించిన పద్యం కందర్పకేతు విలాసము లోనిదే కాని, కందర్పకేళీ విలాసము లోనిది కాదని – ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడుతున్నది.

శీర్షికలో రామలింగకవి అని ఉన్నది. అందువల్ల అందువల్ల ఈ కావ్యరచన నాటికి ఆయన ఇంకా రామలింగడు గానే ఉన్నాడని, సమాశ్రయణం పొందలేదని, రామకృష్ణుడుగా మారలేదని గ్రహించాలి.

ముందుగా పద్యపాఠాన్ని విమర్శించి చూద్దాము. సీసపద్యం రెండవ పాదంలోని కర్ణకీలిత రత్నకామాక్షియుగళంబు అన్నదానిలో ‘కామాక్షి’ అనన్వితం. ఆ మాటకు అర్థం లేదు. దానిని కర్ణకీలిత రత్నకర్ణికాయుగళంబు అని సవరించి చదువుకోవాలి. కర్ణిక అంటే చెవికమ్మ. ‘కర్ణికా తాలపత్రం స్యాత్’ అని అమరకోశం. ‘కర్ణికా కర్ణభూషణం’ అని యాదవ ప్రకాశుల వైజయంతీ కోశం. అయితే, కర్ణిక కర్ణకీలితం కావటం వృథా కథితకథనమే అవుతుంది. ‘చెవికి చెవికమ్మను అలంకరించుకొని’ అన్నట్లు. అందువల్ల, దానిని కర్ణకీలిత రత్నకర్ణికాయుగళంబు అనటం కంటే గండకీలిత రత్నకర్ణికాయుగళంబు అని సవరించటం మేలు. ఇది నిరంకుశమైన సవరణ కాదనీ, మూలవిధేయమేననీ ముందు ప్రతిపాదింపబడుతున్నది.

నాలుగో పాదంలో, భూరి కరవాల అన్నచోట భూరి కరవాలంబు అని ఉండాలి. వైకృతం చేసి భూరి కరవాలు అనటానికి వీలుండదు. అది సమాసత్రుటితమని డా. శ్రీరామమూర్తి దానిని ‘భూరి తరవారి’ అని సరిదిద్దారు. పద్యం సిద్ధపురుష వర్ణనం. ఆ సంగతి శీర్షికలోనే ఉన్నది. కథాసందర్భాన్ని బట్టి ఆ సిద్ధముని శాపానుగ్రహదక్షుడు. ఆయన కరమూలాన భూరి తరవారి (ఖడ్గవిశేషం) అనావశ్యకమే అవుతుంది. పైగా అటువంటి పట్టా కత్తి సిద్ధపురుషాభివర్ణనలో అసంగతం. ఆయన వేషధారణలో అది అనుచితం.

ఎలాగూ దిద్దవలసినదే కనుక దానిని ‘భూరి కరపాళి’ అని దిద్దుకొందాము. కరపాళి అంటే చేతికర్ర. కరపాలి అంటే కత్తి అనే అర్థం కూడా ఉన్నది కాని, అది అసంగతమని ఇప్పుడే అనుకొన్నాము. ‘కరపాలీ హస్తయష్టౌ’ అని శబ్దార్థకల్పతరువు. హస్తదండమని భావమన్నమాట.

ఎత్తుగీతి మొదట, పెరగుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన అని ఉన్నది. దానికి అన్వయం లేదు. వ్రాతప్రతిలో ఆ విధంగా ఉండి ఉండదు. లేదా, లేఖకదోషం అనుకోవాలి. కొర్లపాటి వారు తమ తెలుగు సాహిత్యచరిత్ర తృతీయభాగంలో (పు.188) దానికి మారుగా ‘పిఱుఁదుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన’ అని ఉదాహరించారు. ఇది తమవద్ద ఉన్న వ్రాతప్రతిని బట్టి సరిచేసిన పాఠమో, లేక యథాయోగ్యంగా ఊహించి వారు సరిచేసిన పాఠమో తెలియటం లేదు. ఏ సంగతీ వారు చెప్పలేదు.

పెరగుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన అన్న పాఠానికి అర్థం లేదు. పిఱుఁదుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన, కూడా అటువంటిదే. పులితోలు పిరుదుపై ఉండటం ఏమిటి? అది సరి కాదు. పోనీ, వ్యాఘ్రచర్మాన్ని చుట్టచుట్టి ఆ చుట్టను పిరుదు మీద కట్టుకొన్నాడని భావించటం కూడా సాధ్యం కాదు. మొత్తం మీద –

‘పెరగుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన’, ‘పిఱుఁదుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన’ — అన్న రెండు పాఠాలూ అనన్వితంగానే ఉన్నాయి. అందువల్ల ఈ రెండవ పాఠాన్ని బట్టి ఉత్సాదనీయంగా – బిరుదు వైయాఘ్రచర్మకౌపీనకలన – అన్నది కవి ఉద్దేశించిన పాఠమని ఊహించి దిద్దుకోవాలి. దీనితో అన్వయదోషం తొలగిపోతుంది. వ్రాతప్రతికి సన్నిహితంగానూ ఉంటుంది. బిరుదైన వైయాఘ్రచర్మం అన్నమాట. వ్యాఘ్ర శబ్దానికి తద్ధితం వైయాఘ్రం.

నాల్గవ సీస చరణం చివరి దళంలో సన్నంపు నడుము అని ఉన్నందువల్ల – ఆ తర్వాత ఉన్న ‘దిద్దు’ను దొద్దు (చిరుబొజ్జను కలిగి ఉండటం) అని దిద్దటానికి వీలులేకపోయింది. వ్రాతప్రతిలో పెరగుపై వ్యాఘ్రచర్మ ఇత్యాదిగా ఉన్నట్లయితే, దానిని –

కరమూలమున భూరి కరపాళి, సన్నంపు
నడుమున నొడ్డియాణంబు నుద్ది
పెనఁగు వైయాఘ్రచర్మకౌపీనకలన

అని సరి చేసుకోవాలి. నడుమున యోగపట్టెకు జతగా పెనగొన్న పులితోలుతోడి బిళ్ళగోచి – అని అర్థం. అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర లోని ఔషధసిద్ధుని రూపానికి — ఐణేయమైన యొడ్డాణంబు లవణిచే, నక్కళించిన పొట్ట మక్కళించి (1-59) అన్న వర్ణనకు — అనురణనం ఇది. ఈ సవరణలతో పద్యరూపం ఇలా ఉంటుంది:

మౌళిఁ గెంజడల జొంపము, ఫాలపట్టికఁ
          దీండ్రించు భసితత్రిపుండకంబుఁ
గండకీలిత రత్నకర్ణికా(కుండల?)యుగళంబుఁ,
          బలుచని నెమ్మేనఁ బట్టుకంథ
కరముల బంగారు సరకట్టుఁ గిన్నెర,
          హరిణశృంగంబుఁ బేరురమునందుఁ
గరమూలమున భూరి కరపాళి, సన్నంపు
          నడుమున నొడ్డియాణంబు దిద్దు (నుద్ది)

పెనఁగు వైయాఘ్రచర్మకౌపీనకలన,
యోగవాగలు, శూలంబు, నాగసరము
పొలుపు దళుకొత్తు చెట్టునఁ బుట్టినట్లు
నిరుపమాకారసిద్ధుఁడు నరుగుఁదెంచె.

(శిరసుపై గుబురు కట్టిన ఎర్రని జడలు, పలక లాగా నునుపుదేరి సువిశాలంగా ఉన్న నెన్నుదుటిపై ధగధగ మెరుస్తున్న మూడు విభూతిపట్టెలు, చెక్కిళ్ళను పలకరిస్తున్నట్లున్న రత్నాలు పొదిగిన చెవికమ్మలు, యోగవిద్యాభ్యాసం వల్ల పలచబారి దృఢంగా ఉన్న నిండైన శరీరంపైని చిరుగుల బొంత, చేతులలో బంగారు మెట్లవరుస తీర్చిదిద్దినట్లున్న కిన్నెర వాద్యం, విశాలమైన వక్షఃస్థలం మీద అలంకారంగా వ్రేలాడుతున్న లేడికొమ్ము, చంకను పొదివిపట్టిన హస్తదండం, సన్నని నడుముకు ఒడ్డాణం చుట్టినట్లు బిళ్ళగోచి పెట్టిన వ్యాఘ్రచర్మాంబరం, అంతరిక్షమార్గాన సంచరించే యోగులు తొడుక్కొనే పావుకోళ్ళు, నిలువెత్తు శూలం, నాగస్వరం కలిగి సాక్షాత్తు కల్పవృక్షం వరాలను ప్రసాదింపగోరి కట్టెదుట ప్రత్యక్షమైన సాక్షాన్మహేశ్వరమూర్తి వంటి సాటిలేని ఆకృతిశోభతో ఒక సిద్ధపురుషుడు అక్కడికి వచ్చాడు.)

రామలింగకవి, కథానాయకుడు కందర్పకేతుని సంగమాభిలాషను వర్ణింపదలచినప్పుడు అందుకు ఉపయుజ్యమైన భావాన్ని శ్రీ కాళిదాస కృతిగా ప్రసిద్ధిని గన్న శృంగారతిలకములో నుంచి తీసికొని సందర్భోచితంగా అనువాదం చేసుకొన్నట్లే, ఈ సిద్ధపురుషవర్ణనకు అర్హమైన వస్తువిస్తృతి సుబంధుని వాసవదత్తా కథలో లేకపోవటం వల్ల, మహాకవి శ్రీ వామన భట్టబాణుని అపురూపమైన కనకలేఖా కల్యాణమనే సంస్కృత నాటకంలో నుంచి తీసికొని, దానిని తన వర్ణ్యవస్తుసాక్షాత్కరణ నైపుణితో పారితథ్యంగా తెలుగుచేశాడు. ఈ అనువాదాభిమానాన్ని విమర్శకులు కవులకు జన్మాంతరసంస్కారవిశేషంగా అలవడే కవిత్వబీజపు అనవాప్తతకు, ప్రతిభాశూన్యతకు నిదర్శనగా భావింపకూడదు. ఇది రామలింగకవికి ఆ మహాకవిపై కుదురుకొన్న గౌరవాతిశయానికి సాక్ష్యమే కాని, భావదారిద్ర్యం కాదు. అంతే కాక, దీనిని బట్టి క్రీ.శ. 15వ శతాబ్ది ఉత్తరార్ధం నాటికింకా తెలుగుదేశంలో వామనాచార్యుని కృతులు పఠనపాఠనాలలో ఉండేవని గ్రహించాలి. సామాన్యుడా మరి? సాక్షాత్తు వేదభాష్యకర్త శ్రీ విద్యారణ్యులవారి శిష్యతల్లజుడు. పైగా, తనలాగానే రాజాశ్రయానికి లోగినవాడు. తాను కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండినట్లు ఆయనా పెదకోమటి వేమారెడ్డి ఆస్థానిని అలంకరించి గౌరవాలను అందుకొన్నవాడు. తనలాగానే కాలం కలిసి రానప్పుడు పోషకులు లేక తలవంచుకొని అజ్ఞాతవాసం లోనో, అనర్హవాసం లోనో ఉన్నవాడు. ఆ ఆత్మసాత్కృతి వల్ల వామన భట్టబాణుని కావ్యజాతం రామలింగకవిని ఆకర్షించి ఉండటం భావ్యమే అవుతుంది. కనకలేఖా కల్యాణం చదువుకొని, దానినుంచి తెలుగు చేశాడు. పైగా వామన భట్టబాణుని కవితను శ్రీనాథుడంతటివాడు, పిల్లలమర్రి పినవీరభద్రుని అంతటివాడు అనుసరించి, అనుకరించారు కదా. ఆయన కృతులలోని రసవదార్థాన్ని చుబ్బనచూరలుగా తెలుగువారికి పంచిపెట్టారు కదా. తానూ అనుసరించాడు.

కనకలేఖా కల్యాణం నాటకం తృతీయాంకంలో యువరాజు విజయవర్మ వద్దకు విరూపాక్షుడనే సిద్ధపురుషుడు ఆకాశమార్గాన దిగివచ్చి మాట్లాడిన సన్నివేశం ఉన్నది. ఆ సందర్భంలో వామన భట్టబాణుడు చేసిన సిద్ధపురుష వర్ణన ఇది:

పాణౌ వేత్రం పవిత్రం భసితవిరచితం పుణ్డ్రకం ఫాలదేశే
రౌద్రాక్షం దామ కణ్ఠే స్ఫటికమణిమయం కుణ్డలం గణ్డసీమ్ని
వైయాఘ్రం చర్మపట్టం కటిభువిమహితే పాదుకే పాదయుగ్మే
కన్థాం కల్పద్రుమోత్థామపి వపుషి వహన్నేష సిద్ధోభ్యుపైతి.

(చేతిలో బెత్తం, తపస్సిద్ధిని సూచిస్తున్న యజ్ఞోపవీతం, విశాలమైన నెన్నుదుట విభూతి రేఖ, మెడలో రుద్రాక్షహారం, చెక్కిళ్ళపైని మెరుములీనుతున్న స్ఫటికమణిమయాలైన కుండలాలు, నడుముకు చుట్టిన పులితోలు, రెండు పాదాలకు పావుకోళ్ళు, మేనిపై చిరుగుల బొంత ధరించి కల్పవృక్షం మానవాకృతిని దాల్చినట్లుగా ఉన్న సిద్ధపురుషుడు ఎదురుగా వస్తున్నాడు.)

రామలింగకవి బహువిస్తారమైన గ్రంథపరిశీలనకు, ప్రతివిహిత సూక్ష్మేక్షికకు, శాస్త్రజన్య సంస్కారశాలీనతకు, నిరంతర విద్యావ్యసనితకు నికషోపలమైన సన్నివేశం ఇది. స్పష్టమైన శబ్దానుసరణకు మేలైన ఉదాహరణ. కొన్ని పదబంధాలను చూడండి:

భసితవిరచితం పుణ్డ్రకం ఫాలదేశే = ఫాలపట్టికఁ దీండ్రించు భసిత త్రిపుండ్రకంబు.
స్ఫటికమణిమయం కుణ్డలం గణ్డసీమ్ని = గండ (<కర్ణ) కీలిత రత్నకర్ణికా(కుండల?)యుగళంబు.
వైయాఘ్రం చర్మపట్టం కటిభువి = నడుమున, బిరుదు వైయాఘ్రచర్మకౌపీనకలన.
పాదుకే పాదయుగ్మే = యోగవాగలు.
కన్థాం వపుషి = పలుచని నెమ్మేనఁ బట్టుకంథ.
కల్పద్రుమోత్థాం = పొలుపు దళుకొత్తు చెట్టునఁ బుట్టినట్లు.
ఏష సిద్ధః అభ్యుపైతి = నిరుపమాకారసిద్ధుండు నరుగుఁదెంచె.
మొదలైనవన్నీ వామనుని సంస్కృతానికి నీడలే. కల్పద్రుమోత్థాం అన్న రూపణను వ్యస్తంగా పఠించి ఆంధ్రీకర్త, పొలుపు దళుకొత్తు చెట్టునఁ బుట్టినట్లు, అని చిత్రికపట్టాడు. ఏష సిద్ధః అభ్యుపైతి అన్న నిర్దేశాన్ని నిరుపమాకారసిద్ధుండు నరుగుఁదెంచె, అని వాసవదత్త పలికినట్లుగా మార్చి సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించాడు. కరముల బంగారు సరకట్టుఁ గిన్నెర – అన్నప్పుడు పసిడి కిన్నెర వీణావిశేషమేనని, సరకట్టు (=మెట్లవరుస) దానికే సూచకమనీ గ్రహించాలి. భగవన్నామ జపానురక్తుడైన సిద్ధుని చేతిలో బెత్తానికంటె (వేత్రం = బెత్తము) బంగారు కిన్నెరను ఉంచటం వల్ల కావ్యంలో దృశ్యదర్శనీయత మరింత రాణింపుకు వచ్చింది.

కొర్లపాటి శ్రీరామమూర్తిగారు ప్రకటించిన ప్రబంధరత్నాకరం లుప్తశేష ప్రత్యంతరంలో ఈ పద్యం ‘సిద్ధపురుషుఁడు: తెన్నాలి రామలింగయ కందర్పకేళీ విలాసము’ అనే శీర్షికతో ఉన్నదని ముందే మనవి చేశాను. కథాసన్నివేశాన్ని బట్టి ఇది సుబంధుని వాసవదత్తా కథకు అనువాదమైన కందర్పకేతు విలాసము లోనిదని ప్రతిపాదించటం జరిగింది. ఇది కందర్పకేళీ విలాసము అనే అభూతపూర్వమైన గ్రంథం లోనిది కాదనీ, సుబంధుని వాసవదత్తా కథకు అనువాద రూపమైన కందర్పకేతు విలాసము లోనిదేననీ నిశ్చయించటానికి పైని పేర్కొన్న కథాసన్నివేశంతోపాటు మరొక ప్రబలమైన ఆధారం కూడా ఉన్నది. అది – ఇదే సందర్భంలో పెద్దాపుర సంస్థానం ఆస్థానవిద్వాంసుడు వక్కలంక వీరభద్రకవి తన వాసవదత్తా పరిణయములో చేసిన సిద్ధపురుష రూపకల్పన:

ఉభయబలములు పోరాడుచుండునంత
నచట కేతెంచె యోగవిద్యావిశేష
కరతలాంచిత జపమాలికా మనోజ్ఞ
మూర్తియై యొప్పి యొక సిద్ధమునివరుండు.

పటుజటాజూటంబు భసితత్రిపుండ్రకంబు
          గండలంబిత తామ్ర కుండలములు
ధవళయజ్ఞోపవీతంబులుఁ(నుఁ?) గాంచన
          యోగపట్టికయు శాతోదరంబు
దీర్ఘకూర్చం బనిందిత తనూవిభవంబుఁ
          బదముల మణిమయపాదుకలును
గరమున జలకుండికయు నాగబెత్తంబు
          శ్రుతితల ద్విగుణాక్షసూత్రకంబుఁ

గలిగి యడుగిడి యడుగిడి నలిననాభ!
చక్రహస్త! మురాంతక! శ్యామలాంగ!
కృష్ణ! కేశవ! పాహి లక్ష్మీశ! యనుచు
న మ్మునీంద్రుండు వలికి డాయంగ నరిగి. — వాసవదత్తా (4-97,98)

ఈ పద్యం కందర్పకేతు విలాసంలోని సిద్ధపురుష వర్ణనకు అనుకరణమని తెలుస్తూనే ఉన్నది. పదసంఘటన ఉభయకావ్యాలలోనూ యాదృచ్చికం అనుకోవటానికి వీలులేదు. పద్యం ఎత్తుగడను మొదలుకొని (మౌళిఁ గెంజడల జొంపము – పటుజటాజూటంబు) పద్యమంతటా పరచుకొని ఉన్న కల్పనాసామ్యం (భసితత్రిపుండ్రంబు – భసితత్రిపుండ్రంబు; రత్న(గండ)కీలితరత్నకర్ణికా(కుండల)యుగళంబు – గండలంబిత తామ్ర కుండలములు) వంటివాటిని బట్టి వీరభద్రకవి కందర్పకేతు విలాసాన్ని ముందుంచుకొని వ్రాశాడనే అనిపిస్తున్నది. తనకు పూర్వం రచితమైన ఆ మహాగ్రంథాన్ని పేర్కొనకపోయినా, ఆయన ధ్యేయకవిస్తుతిలో తెనాలి రామలింగకవిని స్మరించుకొన్నాడు.

రాయాస్థానమునందుఁ బూజఁగొని భూప్రఖ్యాతిగా సత్కృతుల్
వేయాఱుల్ విరచించినట్టి ఘనులన్ వేమాఱు భావింతు స
ద్గేయప్రాభవు నల్లసాని కులజున్ ధీశాలిఁ బెద్దన్నఁ దే
జోయుక్తిం దగు సూరనార్యుఁ గవిరాజున్ రామలింగాఖ్యునిన్. — వాసవదత్తా (1-12)

ఇందులో రామలింగకవిని ప్రత్యేకించి కవిరాజుగా పేర్కొనటం విశేషగౌరవసూచనకే గాని యతిమాత్రనిర్వహణార్థం కాదన్న సంగతి స్పష్టమే.

ఇక, తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం లోనిదే, రెండవ పద్యం:

ధరభుజగైణసింహములఁ దద్గణవేణ్యవలోకనద్వయో
దరములకోడి వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ బూన నిక్కఁ దిన డాఁగ స్రవింపఁగ నూర్పులూర్ప స
త్వరముగ నేఁగి నీడఁ గని తత్తఱ మందఁగఁ జేసి తౌ చెలీ.

ఇది చాగంటి శేషయ్యగారు 1951లో ప్రకటించిన ఆంధ్రకవితరంగిణిలో (సంపుటం 8; పుట 39) తెనాలి రామకృష్ణుని చరిత్రలో, ‘చాటుపద్యమణిమంజరి నుండి యుద్ధృతము’ అని ఉదాహరించిన పద్యపాఠం. ఇది చాటుపద్యమని పేర్కొంటూనే, శేషయ్యగారు “ఈ పద్యము మనకు లభ్యము కాని యేకందర్పకేతువిలాసములోనిదో యై యుండునని నాయభిప్రాయము” అని కూడా సూచించారు. 1951లోనే అచ్చయినవే, ఆంధ్రకవితరంగిణి మరికొన్ని ప్రతులలో ‘దరభుజగైణసింహముల’ అన్న పాఠం కూడా ఉన్నది. అది సవరణ పాఠమై ఉంటుంది.

పద్యార్థాన్ని పరిశీలిద్దాము. కావ్యనాయిక అందాన్ని ఆమె చెలికత్తె మెచ్చుకొంటున్నదని తెలుస్తూనే ఉన్నది. అయితే, పద్యం ముమ్మొదటను ఉన్న ‘ధర’ అన్న ఉపక్రమణికకు అర్థం లేదు. అది, ఈ భూమియందు అని అర్థం చెప్పుకొని కేవలం పాదపూరకమని సరిపుచ్చుకోవటానికి వీలులేని స్థానంలో ఉన్నది. ధర భుజగైణసింహములన్, అన్నది కర్మార్థకమైతే, దానికి ‘ఓడి’ మొదలైన ధాత్వర్థాలతో ఫలాశ్రయత్వం లేదు. తత్+గణ అన్నప్పుడు ఆ ‘గణ’ శబ్దానికి అర్థం లేదు. అన్వయం లేదు. అంతకంటె, దరభుజగైణసింహముల అన్న పాఠం మేలు. ‘స్రవింపఁగ’ అన్న పదానికి పద్యంలో అన్వయం లేదు.

వేటూరి ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్యమణిమంజరికి 1988లో వెలువడిన తృతీయ ముద్రణ ప్రతిలో ఈ పద్యపాఠం ఈ విధంగా ఉన్నది:

దరభుజగైణసింహములఁ దద్గతవేణ్యవలోకనద్వయో
దరముల కోడి వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ బూన నిక్కఁ దిన డాఁగ స్రవింపఁగ నూర్పులూర్ప స
త్వరముగ నేఁగి నీడగని తత్తఱ మందఁగఁ జేసి తౌ చెలీ.

ఇందులోనూ మొదటి పాదంలో ‘తత్+ గత’ అన్నదానికి అన్వయం లేదు. మూడవ పాదంలో ‘స్రవింపఁగ’ అని ఉన్నదానికి అర్థాన్వయాలు రెండూ లేవు. ‘స,త్వరముగ నేఁగి’ అన్న క్త్వాంత దళానికి కారకాన్వయం కనబడదు. మొదటి పాదంలో ‘తద్గళ’ అన్న పాఠాన్ని స్వీకరిస్తే, నిర్దేశకార్థాన్ని నాయికా సంబుద్ధితో అన్వయింపవలసివస్తుంది. అదీ కుదరదు.

పై ఇద్దరికంటె మునుపే, 1893లో శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగారు తమ కవిజీవితములు (పు.241)లో చూపిన పాఠం:

దర, భజ, గేణ, సింహములు తద్గళ, వే, ణ్యవలోకనద్వయో
దరముల కోడి, వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులం గుహాం
తరముల పూన నిక్క, తిన డాఁగ, స్రవింప, నిటూర్పులూర్చ స
త్వరముగ నేఁగి నీడఁగని తత్తరమందఁగఁ జేసి తౌ చెలీ.

ఇందులోనూ పైని పేర్కొన్న దోషజాతం ఉండనే ఉన్నది. కాగా, మూడు పాఠాలలోనూ మూడవ పాదంలో యతి తప్పింది. గుహా(న్త)రముల – (డాఁ)గ అన్నప్పుడు అనుస్వారసంబంధ యతి చెల్లదు. కనుక దోషం. భుజగేణసింహములు అన్నచోట అపసంధి. పద్యంలో అర్థాన్వయం ఎలాగూ లేదు.

పై మూడు పాఠాలలోని దోషాలను సవరిస్తే, రామలింగకవి పద్యం ఈ విధంగా ఉంటుంది:

దర, భుజ, గైణ, సింహములు త్వ ద్గళ, వే, ణ్యవలోకనద్వ, యో
దరముల కోడి – వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ – బూన, నిక్కఁ, దిన, దాఁగ; భ్రమింపఁగ, నూర్పు లూర్ప, స
త్వరముగ నేఁగ, నీడఁ గని తత్తరమందఁగఁ జేసి తౌఁ జెలీ!

‘తద్గళ’ అన్న నిర్దేశానికి అర్థం లేదు. చెలికత్తెను సంబోధిస్తున్న మాట కాబట్టి – త్వత్ + గళ అని ఉండాలి. ‘డాఁగ’ అన్నప్పటి యతిదోషం దాఁగ అని సవరించుకొంటే సరిపోతుంది. అది ‘స్రవించటం’ కాదు – ‘భ్రమించటం.’ స్రవింపఁగ అన్నదానిని భ్రమింపఁగ అని దిద్దుకోవాలి. లేకపోతే పద్యార్థం బోధపడదు.

పద్యభావం ఇది: ఓ చెలీ! లోకంలో ఉపమానద్రవ్యములైన 1) దర (శంఖము) 2) భుజగ (పాము) 3) ఏణ (జింక) 4) సింహము అన్నవి వరుసగా నీయొక్క 1) గళ (కంఠము) 2) వేణి (జడ) 3) అవలోకనద్వయ (కనుగవ) 4) ఉదరములకు సాటిరాలేక – అంటే, దరము గళానికి, భుజగము వేణికి, ఏణము కన్నుగవకు, సింహము ఉదరానికి సాటి కాలేకపోయాయి. ఆ అవమానభారం వలన –

దరము గళమునకున్ ఓడి – వారిధిపదంబులన్ పూనన్; భ్రమింపఁగన్.
శంఖము గళానికి ఔపమ్యలోపం వలన సముద్రతలంలో తలదాచుకొనవలసి రాగా; భ్రమింపఁగన్ = తిరుగుళ్ళు పడగా (శంఖం నీటిలో భ్రమింపవలసిరావటం – కొట్టుమిట్టుకులాడుతుండటం అని ఒక అర్థం; తిరుగుళ్ళు అంటే శంఖానికి దక్షిణావర్తము, వామావర్తము అని భేదాలేర్పడటం అని మరొక అర్థం).

భుజగము వేణికిన్ ఓడి – పుట్టలన్ నిక్కన్; ఊర్పులు + ఊర్పన్.
పాము ఆమె జడకు సాటిరాలేక పుట్టలలో నిక్కవలసిరాగా (అనగా, తలదాచుకొనవలసిరాగా), ఊర్పులు + ఊర్పన్ = చేసేది లేక నిట్టూర్పవలసి ఉండటం (బుసలుకొడుతూ ఉండిపోవటం).

ఏణము అవలోకనద్వయమునకున్ ఓడి – పూరులన్ తినన్; సత్వరముగన్ ఏఁగన్.
జింక ఆమె కన్నుల వంటి అందమైన కన్నులు తనకు లేవన్న అవమానంకొద్దీ పూరి మేయవలసిరాగా (దురవస్థకు లోనయిందని భావం), ఆ బెదురు కారణాన పరుగులు తీయవలసిరాగా.

సింహము ఉదరమునకున్ ఓడి – గుహాంతరములన్ దాఁగన్; నీడఁ గని తత్తరమున్ + అందఁగన్.
సింహము ఆమె నడుము వంటి సన్నని నడుము తనకు లేనందువల్ల (ముఖం చెల్లక, సిగ్గుతో) గుహాంతర్భాగంలో దాగి ఉండేట్లుగా, తన నీడను చూసి తానే భయపడేట్లుగా.

ఒనర్చితివి = చేశావు. ఔన్ = అవును, ఇది నీకే తగును – అని ప్రశంసార్థం.
పద్యంలో క్రమాన్వయం సార్థకంగా ఉండటం వల్ల ఇది యథాసంఖ్యమనే అలంకారం. మెడ, జడ, కన్నులు, నడుము అన్న నాలుగు ఉపమేయవస్తువుల శోభాతిశాయిత వల్ల శంఖము, పాము, జింక, సింహము అన్న వస్త్వంతరాలను అణగింపజేశాడు. ఇది మీలనము అనే అలంకారమని కావ్యాలంకారసంగ్రహంలో భట్టుమూర్తి. ఇది పద్యంలోని అలంకారశోభ. తెనాలి రామలింగకవి వర్ణనానైపుణికి, పద్యరచనాకౌశలికి, అతివిస్తారమైన వ్యుత్పత్తిగౌరవానికి, అనల్పకల్పనాశిల్పానికి, చిత్తవిస్తారరూపమైన చమత్కృతధోరణికి నిదర్శకాలైన పద్యాలివి. దురన్వయాలను సరిచేసి సమన్వయించుకొంటే విశేషార్థాలు వెల్లడవుతాయి. మహాకవుల శబ్దసాగరం ఎంత లోతైనదో తెలిసివస్తుంది.
-------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: