Monday, February 25, 2019

ఉద్యోగపర్వము – రాయబారాలు


ఉద్యోగపర్వము – రాయబారాలు



సాహితీమిత్రులారా!

మహాకవికి తన ప్రతిభా వ్యుత్పత్తులను సమగ్రంగా ప్రదర్శించటానికి తగిన వస్తువు లభించడం అతని అదృష్టం. కవి గొప్పతనం అతడు స్వీకరించిన వస్తువు మీద, తన్నిర్వహణ విధానం మీద ఆధారపడి ఉంటుంది. సవ్యసాచి అస్త్రకళాకౌశలానికి, భుజబలోద్రేక విలాసోన్నతికి గాండీవం లభించినట్లు తిక్కన ప్రతిభా వ్యుత్పత్తులకు, కావ్యశిల్ప కళాపారగత్వానికి తగిన భారతం కథావస్తువుగా లభించటం అతని భాగ్యవిశేషం.

భారత రచనలో కవిబ్రహ్మ తనకు గల రాజనీతివేతృత్వాన్ని, యుద్ధకళా పరిచయాన్ని, వేదాంత విద్యావైశారద్యాన్ని, కూలంకషమైన సర్వశాస్త్ర పాండిత్యాన్ని, అసాధారణమైన లౌకిక జ్ఞానసంపదను ప్రదర్శించటానికి తగిన అవకాశం దొరికింది. ముఖ్యంగా విరాటోద్యోగ పర్వాలలో అతడు చూపించిన కావ్యశిల్ప వైభవం, రాజనీతి శాస్త్ర వైదుష్యం అద్వితీయము, అనితరసాధ్యము. హృదయాహ్లాదకరము, ఊర్జితము, నానారసాభ్యుదయోల్లాసి అయిన కథ విరాట పర్వంలో ఉంది. కావ్యకళాజనిభూమి యైన కవిబ్రహ్మ తనకున్న కావ్యశిల్ప కళాపారగత్వాన్ని సమగ్రంగా ప్రదర్శించటానికి ఆ కథలో అవకాశం దొరికింది. మఱి ఉద్యోగ పర్వంలో అట్టి మనోహరమైన కథ లేదు. అసలీ పర్వంలో కథకు ప్రాధాన్యం మిక్కిలి తక్కువ. ఉపాఖ్యానాలను తొలగించి చూస్తే దీనిలోని ప్రధాన కథావస్తువు ద్రుపద పురోహితుని, సంజయుని, కృష్ణుని రాయబారాలే. ఈ మూడు రాయబారాల్లో ఉన్న కథను మూడు ముక్కలలో తేల్చి చెప్పవచ్చని విమర్శకుల అభిప్రాయం. “చిన్న నాటి నుంచీ కౌరవులు పాండవుల మీద పగబూని వారినెన్నో కష్టాల పాలు చేశారు. వాటినన్నింటిని సహించి శాంతాత్ములైన పాండవులు తమ రాజ్యభాగం తమ కిచ్చినట్లయితే సంధి కాగలదని సందేశ మంపుతున్నారు. అలా ఇచ్చి సంధి చేసుకోవడం కంటే న్యాయమేమున్నది? ” ద్రుపద పురోహితుడు చెప్పినా, సంజయుడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, చివరకు భీష్మ ద్రోణ విదుర ధృతరాష్ట్రాదులు చెప్పినా విషయమిదే. ఇంతమంది ఒకే విషయాన్ని చెప్పితే అది పునరుక్తి అవుతుంది. అలా పునరుక్తి కాకుండా, ఉత్కంఠ కలిగిస్తూ విషయ వివరణ చేయటం లోనే కవిబ్రహ్మ ప్రతిభ, అనన్య సామాన్యమైన వస్తు సంవిధాన నైపుణ్యం మనకు గోచరిస్తాయి.

‘ఉద్యోగ’ శబ్దానికి ప్రయత్నమని అర్థం. ప్రయత్నము సంధికా? సమరానికా? అన్నది ప్రశ్న. ఈ రెంటికీ అనియే చెప్పవలసి ఉంటుంది. సంధి సమర ప్రయత్నాలు ఎప్పుడూ ఏకకాలం లోనే జరగటం సహజం. సమర ప్రయత్నాలు సంపూర్ణంగా చేసుకొని, తమ స్థితిని బలపర్చుకున్న తరువాతనే సంధి ప్రయత్నాలు ప్రారంభించటం నేడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. Speak from strength అన్నది నేటికీ రాజనీతి శాస్త్రంలో ప్రధాన విషయం గానే ఉంది. అదే విధంగా ఉద్యోగ పర్వంలో కూడా సమర ప్రయత్నాలు పూర్తి అయిన తరువాతనే సంధి ప్రయత్నాలు ప్రారంభ మైనాయి. అయితే సమర ప్రయత్నాలు బయటికి కనపడకుండా నిగూఢంగా, సమర్థంగా సాగుతూ ఉండగా, సంధి ప్రయత్నాలు మాత్రం లోకంలో బహుళ ప్రచారం పొందుతాయి. అదే విధంగా, భారతంలో కూడా సమర ప్రయత్నాల ప్రాధాన్యం బయటికి కనపడకుండా, సంధి ప్రయత్నాలే విస్తృతంగా వర్ణింప బడటం గమనింప దగిన విశేషం. సంధి ప్రయత్నాలు విరివిగా జరిగినా, ఆ ప్రయత్నాలు చేసిన వారెవ్వరూ సంధి కాగలదన్న విశ్వాసంతో చేసిన వారు కారు. అందరూ అధర్మాన్ని ఎదుటివారిపై నెట్టి తాము ధర్మమార్గ వర్తులమని నిరూపించుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేశారు. ఉద్యోగ పర్వం లోని రాయబారాలని పరిశీలించి చూస్తే ఈ విషయం విశదమవుతుంది. అందుచేత సంధి ప్రయత్నాలు సమర ప్రయత్నాలకి బలాన్ని చేకూర్చేవి మాత్రమే కావడం చేత ఉద్యోగ శబ్దానికి సమరోద్యోగం గానే విమర్శకులు అర్థం చెప్పారు. తిక్కన కూడా ఈ పర్వాన్ని సమరోద్యోగ పర్వం గానే భావించాడనటానికి అంతరంగ సాక్ష్యాధారాలు తరువాతి పర్వాలలో లభిస్తాయి.

అభిమన్యుని వివాహానికి వచ్చిన రాజులందరితో నిండిన సభలో శ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసంతో ఉద్యోగ పర్వం ప్రారంభమవుతుంది. ఈ ఉపన్యాసం ఉద్యోగ పర్వ కథావిధానానికి బీజప్రాయమైనదని చెప్పవచ్చు. ఈ పర్వ పరమార్థమైన సంధి సమర ప్రయత్నాల ప్రాధాన్యం సూచన ప్రాయంగా ఇందులో ప్రతిపాదించటం జరిగింది. ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ, “అలఘు బల విక్రమోదాత్తులకైనా బలము లేక అనంతములగు శత్రు సైన్యములను గెలువ వశమా?” అని ప్రశ్నించుతూనే దానికి సమాధానంగా, “భూవల్లభకోటి యిచట ప్రోవగు,” అంటాడు శ్రీకృష్ణుడు. పాండవులకు తోడుపడే రాజులనందరిని పిలిపించాలని, సమర సన్నాహాలు చురుకుగా సాగించాలని ఇందులో ధ్వనిరూపంగా సూచించడం జరిగింది. పిదప సంధి ప్రయత్నాల విషయం ప్రస్తావిస్తూ, “ఎదిరి మత మెఱుగక యెట్టి కార్య నిశ్చయము సేయ వెరవు గాదు; కావున నియ్యవవసరమున తగిన మానిసి నందులకు పుచ్చవలయు” నని కార్యవిధానాన్ని నిర్ణయించాడు. ఉద్యోగ పర్వం లోని పరమార్థమని చెప్పదగిన సంధి, సమర ప్రయత్నాలను సూచ్యంగా, సూత్రప్రాయంగా శ్రీకృష్ణుడు తన ఉపన్యాసంలో ప్రతిపాదించాడు. ఆ సూత్రాన్ని గ్రహించి వయోజ్ఞాన వృద్ధుడైన ద్రుపదుడు తమకు తోడ్పడే రాజులందరి దగ్గరకు దూతల నంపే విషయాలను నిర్ధారణ చేసి, కౌరవసభకు వెళ్ళే రాయబారిగా తన పురోహితుడిని నిర్ణయించాడు. ఈ కార్య విధానాన్ని ఆమోదించి అచ్చటి రాజులందరూ సమర సన్నాహాలు చేయటానికి తమ తమ పట్టణాలకు ప్రయాణమయ్యారు. పాండవుల సమర ప్రయత్నాల చందం విన్న దుర్యోధనుడు కూడా బంధుమిత్రులయిన రాజులతో సమర సన్నాహాలు చురుకుగా సాగించాడు. ఈ విధంగా ఉభయ కటకాల్లోను సమరోద్యోగం ముమ్మురంగా సాగుతున్న సమయంలో ధర్మరాజు అనుమతితో పాంచాలపతి తన పురోహితుని కౌరవుల దగ్గరకు రాయబారిగా పంపటానికి సభకు రప్పించాడు.

వయోజ్ఞాన వృద్ధుడైన తన పురోహితునిలో దూతకు కావలసిన లక్షణాలన్నీ ఉన్నవని ద్రుపదుని భావం. పురోహితుడు అతనికి హితుడు. ముఖ్యంగా రాయబారి తనను పంపేవాని హితం త్రికరణ శుద్ధిగా కోరాలి. అంతే కాక రాయబార కార్యం మిక్కిలి క్లిష్టమైనది. ఆ కార్య నిర్వహణ కెంతో చాకచక్యం, ప్రజ్ఞాప్రాభవం కావాలి. ఎట్టి విషయాన్నయినా ఎదుటి వారి మనస్సు నొచ్చుకోకుండా చెప్పే నేర్పు అవసరం. ఎంత మతిమంతుడైనా చతురవచన కోవిదుడైనా, సమయజ్ఞత, పరేంగిత జ్ఞానం దూతకు కావలసిన ముఖ్య గుణాలు. వీటికి ఆభిజాత్య గౌరవం మరింత వన్నె పెడుతుంది. ఈ లక్షణాలన్నీ తన పురోహితునిలో ఉన్నవని ద్రుపదుడు సభ లోనే చెప్పటం జరిగింది. అయితే, ద్రుపదుడు సంధి కాగలదనే ఆశాభావం తోనే ఈ రాయబారిని పంపుతున్నాడా? ఈ పురోహితుడు కౌరవ సభలో ఏ కార్యాన్ని, ఏ పద్ధతిలో సాధించాలని పాంచాలపతి ఆశించాడు? ఈ రాయబారి ద్వారా పంపిన సందేశ మేమిటి? అనే ప్రశ్నలను పరిశీలిస్తే ఈ పురోహితుని రాయబారం లోని ఆంతర్యం మనకు చక్కగా అర్థమవుతుంది. కౌరవులతో సంధి కాగలదన్న విశ్వాసం ద్రుపదునకు లేదు. “ఎల్లభంగుల సంగరంబు కాగల యది,” అని అతని నిశ్చితాభిప్రాయములు. “న కస్యాంచి దవస్థాయాం దాస్యంతి వైరాజ్యం,” కౌరవులెట్టి స్థితి లోను రాజ్యభాగ మీయరు అని అతని తలంపు. ఏ విధం గానూ రాజ్యభాగ మీయని కౌరవుల దగ్గరకు రాయబారం పంపడం దేనికి? ఒకవేళ రాయబారి వెళ్ళినా అతడు సాధించుకొని రావలసిన పనులేమిటి? అనే ప్రశ్నలు కలగటం సహజం. వీటికి సమాధానంగా ద్రుపదుడు తన పురోహితుడు రాయబారిగా వెళ్ళి సాధించుకుని రావలసిన కార్యాలను రెండుగా నిర్దేశించాడు. అందు మొదటిది కౌరవ పక్షం లోని వీరుల మనస్సులు పాండవ పక్షం వైపుకు మరలేటట్లు చేయటం. రెండవది అవతలి పక్షం లోని వారి చిత్తవృత్తులు తెలిసికొని రావటం. వ్యాస భారతంలో ద్రుపదు డాశించిన ప్రయోజనాలు వీటికి ఇంచుక భిన్నంగా ఉంటాయి. కౌరవ పక్షం లోని అమాత్యుల్లో, యోధుల్లో బేధం పుట్టించటం, వారి సమర సన్నాహాలను ఛిన్నాభిన్నం చేయటం, కొంత కాల మక్కడే ఉండి వారి సమర ప్రయత్నాలు సాగకుండా చేసి, ఆ సమయంలో పాండవులకు సైన్య సమీకరణకు, ద్రవ్య సంచయానికి అవకాశం కలిగించటం, ద్రుపదుడీ రాయబారం నుంచి ఆశించిన ప్రయోజనాలుగా మూలంలో చెప్పబడ్డాయి. ఈ విషయాలు గోప్యంగా ఉంచదగ్గవే కానీ వాచ్యం చేయటం ఉచితం గాను ఉదాత్తం గాను ఉండకపోగా ఆ కృత్యం కుటిల రాజతంత్ర మవుతుంది. అందుచేత, కవిబ్రహ్మ ఈ రాయబార సందర్భాన్ని కొంత వరకు మార్చి తన అనువాదానికి మెరుగులు దిద్దుకున్నాడు.

ద్రుపదుడు తన కప్పగించిన రాయబార కార్యాన్ని పురోహితుడు ఏ విధంగా నిర్వహించాడో పరిశీలించవలసి ఉంది. ఇతడు హస్తినాపురికి చేరే సమయానికి ఉభయ పక్షాలలోను సమర సన్నాహాలు పూర్తి అయినవి. అంటే సమర ప్రయత్నాలు సంపూర్ణంగా చేసికొన్న తరువాతనే సంధి ప్రయత్నాలు ప్రారంభించబడడం గమనింపదగిన విశేషం. పురోహితుడు ధృతరాష్ట్ర, ధార్తరాష్ట్ర, భీష్మ, ద్రోణ, కృపాది ప్రధాన పురుషుల నందరినీ వారి వారి మందిరాలలోనే దర్శించి వారి వారి చిత్తవృత్తులను చక్కగా ఆకళింపు చేసికొన్న తరువాతనే కౌరవసభలో రాయబార కార్యాన్ని నడపటానికి పూనుకున్నాడు. మొదట కౌరవుల వలన పాండవులు పడిన కష్టాలను సభ్యుల మనస్సుల కెక్కేటట్లు చెప్పి, ధృతరాష్ట్రుని ఉద్దేశించి, “దీనికెల్ల నియ్యకొనియె నీ పెద్దరాజు నేమనఁగ నేర్తు,” అని కొసమెరుపుగా పలుకుతాడు. దుష్కృతాల కన్నింటికి వృద్ధరాజు సమ్మతి కలదని ముఖం మీదే కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడం జరిగింది. తరువాత ద్రౌపదీ పరాభవాన్ని, అరణ్య, అజ్ఞాతవాస క్లేశాలను స్మరిస్తూ ఇన్ని కష్టాల ననుభవించ గలిగిన పాండవులు కౌరవులతో సంధి గావించుకుని జీవించే కష్టాన్ని భరించలేరా? అని చెప్పటంలో పాండవుల కష్టసహిష్ణుత, సమయపాలన బుద్ధి, వంశగౌరవం, హృదయౌన్నత్యం – ఇత్యాది సద్గుణాలను కౌరవుల దుర్గుణాలతో తులనాత్మకంగా చూపిస్తూ సభ్యుల మనస్సులు పాండవుల వైపు మరలేటట్లు మాట్లాడతాడు. చివరకు, “కౌరవుల వృత్తము, పాండవుల వర్తనము తెఱగు మాత్సర్యం లేకుండా పరిశీలించి ధృతరాష్ట్రునకు గారవమున బుద్ధి చెప్పగా దగును మీకు,” అని చెప్పడంతో పురోహితుని రాయబార నిర్వహణ చాతుర్యం పరాకోటి కెక్కింది. కురుసభలో ధృతరాష్ట్రుని ఇలా కాదు అలా అని దిద్ది చెప్పగలవాడు భీష్ము డొక్కడే. పితృ ధనమైన రాజ్యభాగాన్ని పాండవుల కిచ్చి ధృతరాష్ట్రుడు వారిని తన కొడుకుల వలెనే చూచుకోవలనని కర్తవ్యాన్ని ఉపదేశిస్తూనే గాంగేయుడు, అలా చేయకపోతే కవ్వడి కోపాని కీలోకంలో ఎవ్వరూ ఆగలేరని పలుకుతాడు. అర్జునుని త్రిభువనైకధన్విగా పొగడిన భీష్ముని మాటలకు కోపించిన కర్ణుడు పాండవులు సమయాన్ని అతిక్రమించి రాజ్యభాగాన్ని అడగడమే తప్పని, రాజులను కూర్చుకొని ఎత్తివచ్చినంత మాత్రాన కురురాజు భయపడి రాజ్యభాగమిస్తాడా? అంటూ సంధి ప్రయత్నాలను భగ్నం చేయటానికి పూనుకుంటాడు. ఈ మాటలకు కటకటపడ్డ గంగానందనుడు కర్ణుని తీవ్రంగా మందలించుతాడు. కురుసభలో వాతావరణం మారిపోసాగింది. ద్రుపద పురోహితుని రాయబార ప్రయోజనానికి అనుగుణంగానే సభలోని కార్య విధానం పరిణమిస్తున్నది. కర్ణ గాంగేయులు వివాదం లోనికి దిగినారు. క్రమ క్రమంగా గురుకృపాదులు, దుర్యోధనాదులు ఆ వాగ్వాదం లోనికి దిగే అవకాశం లేకపోలేదు. ఆ కొలువుకూటం కలహకూటంగా మారే స్థితి ఎంతో దూరంలో లేదు. ప్రజ్ఞా చక్షువైన ధృతరాష్ట్రుడు పురోహితుని రాయబారం లోని ఆంతర్యాన్ని ఇట్టే పసిగట్టి పరిస్థితి విషమించక ముందే అతనిని హస్తినాపురి నుండి సాదరంగా సాగనంపాలని తలంచినాడు. గాంగేయుని భక్తితో అనునయించి, కర్ణుని మందలించి, పురోహితునితో, “నేను, బంధువులు, మంత్రులు, పెద్దలు ఆలోచించి ప్రజలందరకు ప్రీతి కలిగేటట్లు సౌమ్యుడైన వానిని బిడ్డలైన పాండవుల దగ్గరకు పంపుతాను,” అని అతనికి వీడ్కోలు చెప్పినాడు. ఈ విధంగా ఉద్యోగ పర్వంలో పురోహితుని రాయబారం ముగిసింది. ఈ రాయబారాన్ని పంపేటప్పుడు ద్రుపదు డాశించిన ప్రయోజనాలన్నీ పూర్తిగా చేకూరినవని చెప్పడంలో సందేహం లేదు. కౌరవ పక్షం లోని ప్రధాన పురుషుల చిత్త వృత్తులను పురోహితుడు చక్కగా అర్థం చేసుకున్నాడు. భీష్మాదుల మనస్సులు పాండవుల వైపుకు వ్రాలే విధంగా కౌరవుల సభలో రాయబార కార్యాన్ని నడిపించాడు. కర్ణ గాంగేయుల వాగ్వివాదం వలన ప్రధాన యోధులలో ఎలా భేదం కలిగించినాడో కూడా స్పష్టమవుతూనే ఉంది. ఈ రాయబారం వలన ద్రుపదుడు ఏయే ప్రయోజనాలు సాధించవలెనని ఆశించినాడో ఆవి అన్నీ కూడా నూటికి నూరుపాళ్ళు సాధింపబడినవని ఈ రాయబారాన్ని పరిశీలిస్తే విదిత మవుతుంది.

సౌమ్యునొక్కని పాండవుల దగ్గరకు పంపగలనని ధృతరాష్ట్రుడు పురోహితునితో చెప్పటం జరిగింది. ఆ సౌమ్యుడే తరువాత సంజయు డయ్యాడు. ధృతరాష్ట్రుడు సంజయుని ఏ స్థితిలో ఎందుకు రాయబారిగా పంపినాడో పరిశీలిస్తే గాని సంజయ రాయబారం లోని ఆంతర్యం సరిగ్గా అర్థం కాదు. విప్రుని రాయబారం తరువాత ధృతరాష్ట్రుడు క్లిష్ట పరిస్థితి నెదురుకొనవలసి వచ్చింది. తమ రాజ్యభాగం లేకుండా పాండవులు సంధి కంగీకరించరనే విషయం స్పష్టమయింది. వారికి పాలు పంచి ఇవ్వటంలో తన మాట ఎట్లున్నా దానికి దుర్యోధను డంగీకరించడు. కొడుకు మాట కెదురాడే సామర్థ్యం వృద్ధరాజుకు లేదు. ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహ పీడితుడు. అతిలోభ దూషితుడు. అట్టివాడు పాండవులకు రాజ్యభాగమిస్తాడా? పాలు పంచి ఇవ్వకపోతే యుద్ధము జరుగక తప్పదు. యుద్ధమే సంభవిస్తే గురు భీష్మాదుల వలన తమకే విజయము చేకూరగలదన్న ఆశ యొకవైపు, భీమార్జునుల కెదురు నిలుచు ప్రతివీరులు లేరన్న భయం ఒక వైపు, అతన్ని సందేహాందోళిత మనస్కునిగా చేశాయి. అందుచేత పాండవులకు భాగ మీయకుండా, యుద్ధము రాకుండా ఉండే మార్గాన్ని ఆలోచించడం మొదలు పెట్టాడు. తమ భాగాన్ని పొందకుండా పాండవు లూరుకోరు. ఏడక్షౌహిణుల సైన్యాన్ని కూర్చుకొని ఎత్తిరావటానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్టి స్థితిలో పాండవులు రాజ్యభాగం లేకుండా యుద్ధం మానివేసే పద్ధతిలో కార్యాన్ని సాధించుకుని రాగలిగిన సమర్థుని రాయబారిగా పంపవలెనని ధృతరాష్ట్రుడు యోచించినాడు. అట్టివాడు ఎవ్వరన్నది ప్రశ్న. గురుభీష్మాదులు యుద్ధ తంత్ర ప్రవీణులే గాని సంధికార్య నిర్వహణ చతురులు గారు. అంతేకాక తన కౌటిల్యాని కంగీకరించేవారు కారు. అతనికి తోడు నీడల లాగా బహిః ప్రాణాలవలె సంచరించే వారిద్దరున్నారు; విదురుడు, సంజయుడు. విదురుడు సమస్త కౌరవ సామ్రాజ్యానికి సచివుడు. ఇంక సంజయుడా ధృతరాష్ట్రునకు ఆంతరంగిక సచివుడు. వీరిద్దరూ మహారాజు మనోగతిని పూర్తిగా అర్థం చేసుకున్నవారు. సమస్త శాస్త్ర పారంగతులు. రాజనీతి దురంధరులు. చరర వచో నిపుణులు. ప్రజ్ఞావంతులు. రాజకార్య నిర్వహణ దక్షులు. వీరిద్దరూ రాయబార కార్య నిర్వహణ సమర్థులే. ఈ విషయాన్నే సంజయ రాయబారం తరువాత ధర్మరాజు సంజయునితో, “నీవు, విదురుడు గాక ఈ రాయబారాన్ని నడపగల సమర్థు డింకొకడున్నాడా?” అంటాడు. అయితే విదురుని వదలి సంజయునే ఎందుకు రాయబారిగా ఎన్నుకోవటం జరిగింది? రాజ్యభాగం లేకుండా పాండవులను యుద్ధము మానిపించే సంధి పద్ధతి కౌటిల్యంతో కూడింది. ధర్మ పక్షపాతి అయిన విదురుడే రాయబారి అయితే ఆ సంధి సందేశం లోని కౌటిల్యాన్ని సభ లోనే బయటపెట్టి ఉండేవాడు. విదురుడు ధృతరాష్ట్రునకు తమ్ముడు – ఆప్తుడు, సచివుడు. అన్నకు ఈ తమ్మునిపై ఎంతో ప్రత్యయం. ఈ తమ్మునికి అన్నపై ఎంతో గౌరవము, అంతకు మించిన చనువు. అన్న ఆలోచన అధర్మ మార్గంలో సాగితే వెంటనే సరిదిద్దే చనువు విదురునికి ఉంది. అందుచేత ధృతరాష్ట్రుడు కపటంతో కూడిని ఈ రాయబార కార్యనిర్వహణ భారాన్ని తనను చక్కగా అర్థం చేసుకొని, మారు మాటాడకుండా త్రికరణ శుద్ధిగా ప్రభుకార్య సాఫల్యానికి ప్రయత్నించే చతురతానిధియైన సంజయునకు అప్పగించడానికే నిశ్చయించుకున్నాడు.

ద్రుపద పురోహితుడు తిరిగి వచ్చి తన రాయబార విశేషాలను పాండవులకు నివేదించాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు సంజయుని రాయబారిగా పంపటానికి నిండు కొలువుకు రప్పించాడు. సంస్కృత భారతంలో ధృతరాష్ట్రుడు తన సంభాషణ మంతా సంజయు నుద్దేశించి చేయగా తెలుగు భారతంలో అధిక భాగం సభ నుద్దేశించి చేయటం గమనింప దగిన విశేషం. సభకు వచ్చిన సంజయునితో ఇలా అంటాడు కురురాజు:

పాండు నరపాల సుతు లుపప్లావ్యమునకు
వచ్చి యున్నారు నీవేగి వాసుదేవ
సహితముగ వారిఁ గని తద్వివాద మేమి
భంగి మాను నమ్మెయి దగఁ బలుక వలయు.

వాసుదేవ సహితంగా పాండవులను చూచి, అరణ్య, అజ్ఞాత వాస క్లేశాల వలన కలిగిన విషాదమును మాన్పుటకు వీలైన పద్ధతిలో మాట్లాడవలసినదిగా చెప్పిన తరువాత ధర్మజుని సభలో మొదట ఇలా చెప్పంటాడు:

మీ యయ్య మీరు వన వా
సాయాసము నిస్తరించి యభ్యుదయమునన్
డాయుట విని ముదితాత్ముం
డై ఇట పుత్తైంచె నన్ను ననుమీ మొదలన్.

‘మీ యయ్య’ అని సంభాషణ ప్రారంభించుటలోనే ధృతరాష్ట్రుని గడుసుదనం బయట పడుతున్నది. ఇలా చెప్పటం వలన అతని లోని పితృభావం వెల్లడియై పాండవు లాతనికి దుర్యోధనుని వంటి వారేనన్న అభిప్రాయం కలుగుతుంది. అరణ్య, అజ్ఞాత వాస క్లేశాలకు ఆ తండ్రి ఎంతో వ్యథ చెందాడని, దైవకృపచే తన పుత్రులు కష్టాలను గడచి అభ్యుదయం పొందటం విని ఎంతో సంతోషించాడని చెప్పటంలో అతనికి గల పుత్రవాత్సల్యం వ్యక్తమవుతుంది. మొదట సంజయుడు చెప్పవలసిన పద్ధతి ఇది అని చెప్పటంలోనే ధృతరాష్ట్రుని చతురత, లోకజ్ఞత స్పష్టమవుతున్నాయి. పాండవులపై గల వాత్సల్యానికి, సద్భావానికి సభలోని వారంతా సంతోషించేటట్లు మాట్లాడిన ధృతరాష్ట్రుడు సంజయునితో మాట్లాడటం మాని చుట్టూ ఉన్నవారితో చిన్న ఉపన్యాసం చేశాడు. అందులో అతడు పోయిన పోకడలు, చేసిన చమత్కారం ఇంతింత కాదు. కౌరవ పాండవుల మధ్య కలిగింది చిన్న కలక మాత్రమేనట. దానికి కారణం దుర్యోధనుడు. అదీ అతడు కార్యాకార్యజ్ఞుడు కాకపోవటం చేతనే కలిగిందట. అంతే గాని, ఆర్యులు, దృఢధైర్యులు, రణధుర్యులు అయిన పాండుసుతులు దోషాన్వితులే, అంటాడు ధృతరాష్ట్రుడు. దోషాన్వితులే? అని ప్రశ్నార్థకంగా చదువుకుంటే, కారనియే అర్థం వస్తుంది. సభవారికి అర్థమైనదిదే. కాని, దోషాన్వితులే అని కాకుస్వర విశేషంతో నిశ్చయార్థకంగా చదివినట్లయితే దోషాన్వితులే సుమా! అనే అర్థం రాకపోదు. విప్రుని రాయబారం పంపటం ఇత్యాదులు దోషాలు అని కురురాజు హృదయం కావచ్చు. అన్నదమ్ముల్లో వచ్చిన ఈ కలకను గోరంతలు కొండంతలు చేయవలసిన పని లేదని, వారు అన్యోన్యంగా కలిసి జీవించటం తనకు ఆనంద హేతువని పల్కుతూనే కలిసి జీవించవలసిన తీరును ఇలా సూచిస్తాడు.

క్షీరోదక వృత్తి మనము
వారలునుం గలిసి బ్రదుక వలదే నెమ్మిన్
వారిడుమఁ బడఁ దగియెడి
వారే పితృభాగ మేలువారలు గారే.

కౌరవులు, పాండవులు పాలూ నీరులా కలిసి జీవించాలని ధృతరాష్ట్రుని ఉద్దేశం. పైకి ఎంతో మంచి ఉద్దేశం లాగ కనిపిస్తున్నది. అయితే, క్రమాలంకారంలో పరిశీలిస్తే కౌరవులు పాలు, పాండవులు నీరు అవుతున్నారు. ఇలా చెప్పటం లోని ధృతరాష్ట్రుని లోతుగుండె ఎట్టిదో మనకు అర్థమవుతుంది. అంటే పాండవులు తమ రాజ్యభాగం సంగతి ఎత్తకుండా కౌరవులతో కలిసి బ్రదుకవలెనని వృద్ధరాజు అభిమతం. ఈ విధంగా సంధి జరిగేటట్లు ప్రయత్నించమని సంజయునకు సూచన. అంతటితో ఊరుకోక, “వారిడుమలబడ దగియెడు వారే పితృభాగ మేలువారలు గారే,” అని బల్లగుద్ది చెప్పుతున్నాడు. పాండవులు కష్టాలు పడ తగినవారు కాదు. తండ్రిభాగాన్ని పాలించటానికి యోగ్యులు అనే భావాన్ని సభకు కలిగించుతూనే తన హృదయగత భావాన్ని గడుసుదనంతో సూచిస్తూ ఉన్నాడు. “వారిడుమల బడదగియెడు వారే పితృభాగ మేలువారలు గారే,” అని కాకుస్వర విశేషంతో నిశ్చయార్థకంగా చదివితే , కారు అనే అర్థం వస్తుంది! ఈ సన్నివేశంలో ధృతరాష్ట్రుని వాక్యాలను సూక్ష్మంగా పరిశీలిస్తే ఇట్టివే పెక్కు విశేషాలు గోచరిస్తాయి. కౌరవ పాండవులు పాలూ నీరులా కలిసి జీవించాలని ఇప్పుడనుకున్నా పాండవులు వీరిని నమ్ముతారా? అనే సందేహం సభలోని వారికి కలుగకపోదు. అదే విషయాన్ని ధృతరాష్ట్రుడు చెప్పుతూనే అంతా చక్కదిద్దే సమర్ధత ధర్మరాజు కున్నదనే ‘భరోసా’ వెల్లడిస్తాడు. ఒకవేళ సంధి జరగకుండా ఉంటే పాండవ వీరుల కెదురు నిలిచే శక్తి ఎవ్వరికీ లేదంటూ వారి బలపరాక్రమాలను వర్ణించటానికి పూనుకొని ఇలా ప్రారంభిస్తాడు.

మనకీ కుండగ వచ్చునే మనము దుర్మానంబు వాటించి యొ
ప్పని కార్యంబులు వట్టి వారికిఁ దగం బాలీక గర్వంబు లా
డిన నిక్కంబగు నల్క నర్జునుడు గాండీవంబు మోపెట్ట గృ
ష్ణుని సారథ్యమునై జగత్త్రితయ సంక్షోభంబు గాకుండునే.

మనము దుర్మానాన్ని పాటించి వారి రాజ్యభాగ మీయకుండా ఉంటే జగత్ప్రళయం సంభవిస్తుంది. మనకు రాజ్యభాగ మీయకుండా ఉండటానికి వీలు లేదు, అంటూ తన వాక్ప్రవాహంతో సభను సమ్మోహితం చేసి, పాండవులకు రాజ్యభాగ మీయటానికి సిద్ధంగా ఉన్నాననే భావం వారికి కలిగించిన ధృతరాష్ట్రుడు సంజయుని వైపుకు తిరిగి ఇలా అంటాడు.

నీవు ధర్మరాజు పాలికి నెమ్మి నరుగు
మతడు పేరోలగం బున్న యవసరమున
గాన్పు మతనికి ననుజ వర్గంబునకును
బంధులకు నింపు పుట్టంగఁ బలుకు మచట.

నెయ్యము వాటించి కడుం
దియ్య మెసఁగ నలుక లెల్ల దీఱునటులుగా
గయ్యమను దలపు లోనుగ
నయ్యమనందనుడు మానునట్టి తెఱగునన్

శాంతి ప్రకారంబునం గార్యంబు నడపి యొక్కటియై మనుట యొడగూర్చి రమ్ము. రథంబెక్కి పొమ్ము.

సంజయుడు రాయబారిగా వెళ్ళి నిర్వహించుకొని రావలసిన కార్యమెట్టిదో ఈ పద్యాలలో నిర్దేశించటం జరిగింది. ధృతరాష్ట్రుడు నిజంగా సంధినే కోరుతున్నాడా? కోరితే ఏ పద్ధతిలో అది ఉండాలని అతని భావం? రాయబారిగా వెళ్ళుతున్న సంజయుడు సాధించుకు రావలసిన కార్యమేమిటి? ఇట్టి ప్రశ్నల కన్నింటికి సమాధానాలు ఈ పై పద్యాలను పరిశీలించి మాత్రమే తెలుసుకోవలసి ఉంది. సంజయుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి, అతడు నిండు కొలువులో ఉన్నప్పుడు దర్శించాలి. మొదట అతనికి, అతని తమ్ములకు, బంధువులకు ఇంపు పుట్టే విధంగా మాటాడాలి. ఆ తరువాత శాంతి ప్రకారంగా కురుపాండవులు ఒక్కటిగా కూడి జీవించే పద్ధతిలో కార్యాన్ని సాధించుకొని రావాలి. ఇదీ ధృతరాష్ట్రుని ఆదేశం. అయితే, శాంతి ప్రకారంగా కార్యాన్ని ఎలా నడిపించాలి? నెయ్యాన్ని పాటించి మిక్కిలి తియ్యగా మాట్లాడి, ఇంతకు ముందున్న కోపతాపాల నన్నిటిని పోగొట్టి, యుధిష్ఠిరుడు యుద్ధమనే తలంపు మానేటట్లు కార్యాన్ని నడిపించాలి. ‘మనకీ కుండగ వచ్చునే’ అని సభ నుద్దేశించి చేసిన ఉపన్యాసానికి, ఈ మాటలకు ఎంత భేదముందో గ్రహిస్తేనే గాని ధృతరాష్ట్రుని హృదయం మనకు అర్థం కాదు. పాండవులకు రాజ్యభాగ మీయటానికి సిద్ధంగా ఉన్నట్లు సభలోని వారిని భ్రమింపజేసిన ధృతరాష్ట్రుడు ఇక్కడ దాని ప్రస్తావనే తీసుకు రాకపోవడం గమనింప దగిన విశేషం. రాజ్యభాగం సంగతి తేలకుండా సంధి జరగడం సాధ్యమా? అనే సందేహం కలుగకపోదు. ఇది అసాధ్య కార్యం. దీన్ని సాధించుకొని రమ్మని ధృతరాష్ట్రుని ఆదేశం. బంధుస్నేహాన్ని పాటించి, మధురోక్తులతో పాండవుల క్రోధాన్ని చల్లార్చి, యుధిష్ఠిరుని యుద్ధ సంకల్పాన్ని మాన్చితే శాంతి నెలకొంటుందని, ఆ తరువాత కురుపాండవులు కలిసి జీవించగలరని ధృతరాష్ట్రుని ఉద్దేశం. కలిసి జీవించవలసిన తీరు కూడ ముందే సూచించినాడు. కౌరవులు పాండవులు క్షీరోదక వృత్తిని కలిసి బ్రతకాలని అతని ఆకాంక్ష. అయితే పురోహితుని రాయబారం వల్ల రాజ్యభాగం లేకుండా పాండవులు సంధి కంగీకరించరనే విషయం విస్పష్టంగా తేలింది. రాజ్యభాగం సంగతి లేకుండానే సంధి చేసుకు రమ్మని సంజయుని పంపుతున్నాడు ధృతరాష్ట్రుడు. ఇది ఎంత అసాధ్య కార్యమో అర్థమవుతూనే ఉంది. ఇట్టి అసాధ్య కార్యాన్ని సాధించుకొని రమ్మని ఆదేశించటంలో ధృతరాష్ట్రుని లోని కాపట్యం ఎటువంటిదో స్పష్టమవుతూనే ఉంది. ఇటువంటి రాయబారాన్ని నడిపే సంజయుడెట్టివాడో చెప్పాలంటే, ఒక్క మాటలో ‘జీవన్ముక్తుడు.’ అట్టివాడు తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మరుగు పరచి, కేవలము ప్రభుని ఆదేశము శిరసా వహించి, ఆ ప్రభుకార్యాన్ని ఎంత సమర్థంగా నిర్వర్తించాడో పరిశీలించవలసి ఉంది.

సంజయుడు ఉపప్లావ్యానికి వచ్చి నరనారాయణులను సందర్శించి సంధి సందేశాన్ని వినిపించటానికి ధర్మరాజు సభలో ప్రవేశిస్తాడు. ఆ సభలో మంత్రరక్షణ కళా ప్రావీణ్యగణ్యుడు, మహారాజనీతివేత్త అయిన శ్రీకృష్ణుడున్నాడు. నరాంశ సంభూతుడయిన సవ్యసాచి, ద్రుపదాది వృద్ధభూపతులు ఉన్న ధర్మరాజు పేరోలగమది. ధర్మరాజు సామాన్యుడా? వశీకృత చిత్తుడు. మెత్తని పులి. ఆ సభలో అట్టి ధర్మజుని ముందు తాను తెచ్చిన సారం లేని సంధి సందేశాన్ని వినిపించి, తన వ్యక్తిత్వానికి సరిపడని కపటంతో కూడిన రాయబారాన్ని విజయవంతంగా నడపటం సంజయుని వంటి వానికే చెల్లింది.

“భాగ్యవశం చేత నిన్ను చూడటం వలన నా చూపు చరితార్థమయ్యింది. ఇక్కడ మీరున్న విషయం విని మీ తండ్రి ధృతరాష్ట్ర మహారాజు నీవు, తమ్ములు, ద్రౌపది, పుత్రులు ఉన్న యోగక్షేమ సమాచారాలను తెలుసుకు రమ్మని నితాంత స్నేహపూర్ణ చేతోవృత్తితో నన్ను పంపించాడు,” అని ధర్మజునితో సంభాషణ ప్రారంభిస్తాడు సంజయుడు. మీ తండ్రి అని చెప్పటంలో పెన వైచుకున్న బాంధవ్యాన్ని గుర్తు చేస్తూ, మీ తండ్రి హృదయం పుత్రవాత్సల్యంతో నిండి ఉన్నది అని చెప్పటంలో సంజయుని నేర్పు వ్యక్తమవుతున్నది. ‘మీ యయ్య’ అని మొదట చెప్పమని ధృతరాష్ట్రుడు సంజయునితో చెప్పడం జరిగింది కదా. దానికి సమాధానంగా, “ఆ రాజు మా దెసం గల కారుణ్యము కతమునను సుఖమున నిట్లున్నారము,” అని ధర్మరాజు కీలెఱిగి వాత పెట్టినట్లు అన్నాడు. బాంధవ్యాన్ని ముందుకు నెట్టి ‘మీ తండ్రి’ అని సంజయుడంటే, దాన్ని వెనుకకు నెట్టి ‘ఆ రాజు’ అంటున్నాడు ధర్మరాజు. అరణ్య, అజ్ఞాత వాస క్లేశాల ననుభవించి, ఇప్పుడిలా ఉండటానికి ఆ రాజు కారుణ్యమే కారణమని గడుసుదనంతో చెప్పి మాటలో తన నేర్పు చూపిస్తున్నాడు. ధర్మజ సంజయులు ఉక్తి ప్రత్యుక్తి చాతుర్యంలో ఒకరి కొకరు తీసిపోయేవారు కారు. కౌరవ పక్షము లోని ప్రధాన పురుషుల యోగక్షేమాలను పేరు పేరునా ప్రశ్నిస్తూనే, అందులో కౌరవుల అవినీతిని, పెద్దల పట్ల అవిధేయతను స్ఫురింపజేస్తూ ఘోషయాత్రను గుర్తు చేసి తమ ఔన్నత్యాన్ని తెలుపుతూనే, అర్జునునకు ప్రతివీరులు లేరనే విషయము నీకు తెలుసు కదా? అంటూ చమత్కారంగా సంభాషణ సాగించాడు ధర్మరాజు.

ధర్మరాజు ప్రశ్నల కన్నింటికి సమాధానం చెప్పటం సాధ్యమయ్యేది కాదు. కౌరవులను సమర్థించి మాట్లాడి నెగ్గుకు రావటం దుర్లభం. తన వాదము బలహీనమయినప్పుడు ఎదుటివారు చెప్పినదాని నంగీకరిస్తూనే అదనెఱిగి వారిని బోల్తా కొట్టించటం ప్రజ్ఞావంతులు చేసే పని. అదేవిధంగా సంజయుడు కూడా “కురురాజు వద్ద అవినీతులు, నీతిమంతులు ఇలా అనేక విధాల వారున్నారు. వారిని గురించి అంత చెప్పవలసిన పని లేదు,” అంటూనే, “నీవు చంద్రునిలా చల్లనైన విమల హృదయంతో సంధి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నావు. వారందరికి సేమం నిన్నటివరకు లేకపోయినా నేటి నుంచి ఉంది.” అని ధర్మరాజు ముందరి కాళ్ళకు బంధం వేశాడు. తమ కష్టాలకు ధృతరాష్ట్రుడు కారణమని ధర్మరాజు సూచించటాన్ని గుర్తించిన సంజయుడు ఇలా అంటాడు.

ధృతరాష్ట్ర భూపతికి వృ
ద్ధత కతమునఁ జిత్తమొక విధము గామి సుతో
ద్ధతి మాన్పడ నాడు మనః
క్షతి పిదప బుట్టి ఇపుడు శాంతుండయ్యెన్.

ధృతరాష్ట్ర మహారాజు పెద్దతనం వల్ల మనస్సొక తీరుగా నుండక పోవటం చేత ఆనాడు దుర్యోధనుని ఔద్ధత్యాన్ని మాన్పలేక పోయాడు. తరువాత ఎంతో మానసిక క్షోభ ననుభవించాడు. ఇప్పుడాత డెంతో మారిపోయి ప్రశాంత చిత్తంతో ఉన్నాడు. ఏమైనా, ఇట్టి చందాలన్నీ నీవు పుణ్య చిత్తంతో సహించితేనే చెల్లుతాయి. నీ యజాత శత్రుత్వం సమస్త లోక విశ్రుతం కదా! అంటూ ధృతరాష్ట్రుని గతవర్తనను సమర్ధిస్తూ, ధర్మరాజును స్తుతిస్తూ అనుకూల వాతావరణాన్ని ఏర్పఱచుకొని తన సంధి సందేశాన్ని వినిపించటానికి పూనుకున్నాడు సంజయుడు. ధర్మరాజు వైపుకు తిరిగి చేతులు జోడించి, “ధృతరాష్ట్ర మహారాజు శాంతినే కోరి సంధి చేసుకోవటానికి తహతహ లాడుతున్నాడు. మనము వివేకంతో ప్రవర్తించవలసి ఉంది. మీ వంటి ధర్మజ్ఞులకు శాంతులకు చులకని కార్యం చేయటం తగవు కాదు. మడుగు వస్త్రానికి మసి దాకినట్లుగా మీ సత్కులానికి దుర్యోధనుని వలన కల్మషం కలిగింది. దానిని పోగొట్టగల కార్యనిపుణ హృదయుడవు నీవే. యుద్ధం వలన సమస్త జన క్షయం జరుగుతుంది. జయాపజయాలలో ఏది కలిగినా చివరకు సుఖం లభించదు. అంతేకాక నీవంటి దయాపయోనిధికి వృద్ధులను, బాలురను, సఖులను, గురువులను వధించిన తరువాత సమస్త సుఖాలు సమకూరితే మాత్రం ప్రయోజన మేముంటుంది. నీవు యుద్ధాని కంగీకరించవు గాని, మీ ముందు దేవతలైనా నిలువగలరా? ఇక కౌరవ పక్షము సంగతంటావా, వారిని జయించటానికి స్థాణునకైనా వశం కాదు. అట్టి మీ ఇరు పక్షాలకు అన్యోన్య కలహం నాకు మేలనిపించటం లేదు. నా మాటే కాదు రెండు పక్షాల హితాన్ని ప్రియాన్ని గోరేవారిని అడిగి చూడు.” అని కొలువు కూటాన్ని ఒక్కసారి కలయజూచి నాటకీయంగా, “వాసుదేవునకు మ్రొక్కుతున్నాను, సవ్యసాచికి చేతులు మోడ్చుతున్నాను. తక్కిన వారికి విన్నవించుతున్నాను. అసూయలు విడిచిపెట్టి అనుజ్ఞ సేయండి. ఈ కరుణాకరుడైన ధర్మరాజును క్రోధశాంతికి శరణు వేడుతున్నాను.” అంటూ ప్రణామ పూర్వకంగా ధర్మజుని ముఖం మీద చూపు నిలిపి, “దేవా, ఉపశమించుట లెస్స. ఈ పద్ధతికి కురుపితామహుడు సంతసించుతాడు. ఇది సర్వలోక సమ్మతమైన సంగతి.” అని తన సంధి సందేశాన్ని ముగించాడు సంజయుడు.

ఈ సందేశంలో ఎక్కడా రాజ్యభాగం సంగతి ప్రస్తావించబడ లేదు. ధర్మరాజు చేత యుద్ధాన్ని మాన్పించటమే సంజయుడు చేయవలసిన ముఖ్యమైన పని కదా. దాని కనుగుణంగా పాండవుల వంటి ధర్మజ్ఞులు, శాంతులు చులుకని కార్యమైన యుద్ధం చేయటం తగదని, అది సమస్త జనక్షయకరమని, జయాపజయాలు రెండూ చివరకు సౌఖ్యాన్ని ఇవ్వవని, అందులోను బంధువులను వధించటం వలన కలిగిన సౌఖ్యాల వలన ప్రయోజన ముండదని ఎంతో నేర్పుతో చెప్పటం జరిగింది. ఒకవేళ యుద్ధమే సంభవిస్తే కౌరవులను జయించటం మీకు సాధ్యం కాదు అని సూచనగా చెప్పి వెఱపించుతూ చెప్పటంలో సంజయుని చాతుర్యం, గడుసుదనం గమనింప దగినవి.

సంజయుని రాయబారం లోని ఆంతర్యం శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అనే విషయం ధర్మరాజు గ్రహించాడు. దాన్ని బట్టబయలు చేయటానికి సంభాషణ ఇలా సాగించాడు. “సంజయా! నా మాటల్లో స్నేహం తప్ప వేరొకటి నీ చెవులకు సోకిందా? ఎందుకు యుద్ధానికి అంత భయపడతావు. మేము మాత్రం యుద్ధం కావాలంటున్నామా. యుద్ధం లేకుండా కార్యసిద్ధి కలిగితే వెఱ్ఱివాడైనా యుద్ధం చేస్తాడా. మా సంగతి తెలియదా? మహారాజు ఆనాడు వక్రత్వంతో నీతిమార్గాన్ని విడిచిపెట్టి ఈ రోజు మమ్మల్ని చక్కని దారిలో నడవమని బుద్ధులు చెపుతున్నాడు. బాగానే ఉంది. ఎదుటివారిని తమలాగే చూస్తేనే సంధి అవుతుంది కానీ మాకు కుడుమియ్యండి, మీరు వక్క తీసుకోండి అంటే మనసులు చేరువవుతాయా! మహారాజు మారిపోయాడంటావు. అతని చరిత్ర మాకు నీకు తెలియనిదా. అడియాసలతో వచ్చి మమ్ముల నెందుకు బాధిస్తావు. కొడుకు విషం మ్రింగినా నమ్మకం తోనే చూస్తూ ఉంటాడు కదా ఆంబికేయుడు. కొడుకులు, శకుని, కర్ణుడు ఎలా నడిపించితే అలా నడుస్తాడే గాని వేరొకరీతిగా ఉండదు కదా అతని నడక. అయితే, నీవొక చమత్కారం చేశావు. ముందు మమ్ము పొగిడి తరువాత వారిని గెలవడం శక్యం కాదన్నావు. ఆ పక్షపాతాన్ని మాత్రం విడిచిపెట్టు. మాముందు కౌరవులు నిలువలేరన్న విషయం నీకు తెలియదా? సద్గుణవంతుడివైన నీవు వచ్చి మాకు కోపం శాంతించేటట్లు మాటాడినావు. ఎన్నో పరాభవాలు పొంది కూడా కౌరవుల దుర్గుణాలను సహించటం నీకు తెలియనిది కాదు కదా. ఇక ముందు మాత్రం అలాగే చేసి బాధలు కొని తెచ్చుకుంటామనే శంకలు విడిచిపెట్టు. మా యయ్యకు విచారము కలిగినట్లయితే చుట్టరికం మొలకెత్తగా మమ్ములను రమ్మని పిలిచి, కొడుకులకు మా రాజ్యభాగమిమ్మని చెప్పటం తగినది కదా. ఇది ప్రపంచమంతా ప్రశంసించే పద్ధతి,” అన్నాడు.

ఉత్తచేతులతో వచ్చి మమ్ములను జోకొట్ట చూస్తున్న నీ సంగతి నాకు తెలియదా అన్నట్లు సాగింది ధర్మరాజు ఉపన్యాసం; “ధృతరాష్ట్ర మహారాజు వెనుకటి స్థితిలో లేడు, ఎంతో మారిపోయాడు, మీయందు పుత్రవాత్సల్యం పొంగి పొర్లిపోతున్నదని అంటావు. అడియాసలతో వచ్చి ఎందుకయ్యా మమ్ములను ఊరికే బాధ పెడతావు. అతడు మారతాడా? కొడుకులు, శకుని, కర్ణుడు, గీచిన గీటు దాటతాడా. అది నీకు మాత్రం తెలియనిదా? ఒకవేళ మారితే బాంధవ్యం ఇప్పుడే అంకురించిన దన్నమాట. అటువంటప్పుడు మమ్ములను పిలిచి మా రాజ్యభాగం మాకిప్పించటం న్యాయం కదా,” అని చెప్పటంలో ధర్మరాజు మా రాజ్యభాగం సంగతి ఏమిటి? అది లేకుండా సంధి ఎలా జరుగుతుంది? అని సంజయుని నిలదీసి అడిగినాడు. రాజ్యభాగ విషయం ధృతరాష్ట్రుడు చెప్పలేదు. దానికి సమాధానం సంజయుని దగ్గర లేదు. ఇంకొకరెవరైనా అయితే తెల్లమొగం వేయవలసినదే. సంజయుడు సామాన్యుడా? ధర్మజుని విభవం అనింద్య చరిత్రము, అహింస అని ప్రశంసించి –

పాలిక కౌరవులు దు
శ్శీలతఁ జెడఁ దలచిరేనిఁ జెప్పెద రుధిరా
భీలాన్నంబున కంటెను
మేలగు భిక్షాన్నమైన మీ నడవడికిన్

అంటాడు. ఈ మాటలు సంజయుడు కాక మరెవ్వరు పలికినా ఎదుటి వారికి కోపాన్ని కలిగించేవే. ఎంత కర్కశ భావాన్ని అయినా సున్నితంగా చెప్పటంలో సంజయుడు సాటి లేనివాడు. “శాంతి దాంతి కలిగిన నీ పవిత్ర చరిత్ర హింసా కళంకితము కాకుడదు. తాల్మియే ధనంగా కలిగిన నీవు చివరకు క్రూరకర్మాస్పదమైన తీరులో బంధువులను, గురువులను వధించి సౌఖ్యం అనుభవించుతావా? అది ఆర్యుల చేత నిందింపదగినది, అస్థిరమైనది కదా.” అని హింస ధర్మమా? అధర్మమా? అనే చర్చ లోకి ధర్మరాజును మళ్ళించటానికి ప్రయత్నించాడు సంజయుడు. అది తేలేది కాదు. ఆ చర్చలో సంజయుని ఎదుర్కొని నెగ్గుకు రావటం కూడా ధర్మజున కంత తేలిక కాదు. తన నేవైపుకు మళ్ళించుతున్నాడో గుర్తించి ధర్మారాజు సంజయుని ముఖం మీద చూపు నిలిపి, “కొన్ని ధర్మాల వలె కనిపించి చివరకు అధర్మాలవుతవి. కొన్ని అధర్మ కర్మలు చివరకు ధర్మసమ్మతాలవుతవి. మనకెందుకీ వితర్కం. ఇది కర్తవ్యము, ఇది అకర్తవ్యము అని మనల శాసింప వాసుదేవుండు కలడు,” అని కార్య నిర్ణయ భారాన్ని కృష్ణుని పైకి నెట్టినాడు. శ్రీకృష్ణుడు సంజయ రాయబారము లోని మర్మాన్ని, కాపట్యాన్ని బట్టబయలు చేసి, కౌరవుల నిర్ణయాలను, ద్రౌపదీ పరాభవ సన్నివేశాన్ని కన్నులకు కట్టినట్లు వర్ణించి, “ఈ సంధి కార్యంబు అత్యంత దుర్ఘటంబు. దీనిని ఘటింపజేయుట అశక్యంబు. అయినను-

పాండవేయులఁ దగబ్రార్థించి యందుల
కక్కట యేనైన నరుగు దెంచి
కౌరవులకు బుద్ధిగాఁ జెప్పి రాజ్యంబు
పాలు చేసిన మృత్యు పాశములకు
దప్పరే వారలు దగవును నేర్పును
నా మీద నిలుచుట నాకు గీడె”

అని కురుపాండవ సంధి కార్యభారాన్ని తన మీద వేసుకున్నాడు. అప్పుడు సంజయుడు “అట్లయిన కడు లెస్స గదా! దేవా, నా వచ్చిన కార్యంబు సఫలంబయ్యెనని వినియెద,” అన్నాడు. తన రాయబార కార్యము సఫలమైనదని సంజయుడే అంటున్నాడు. ధర్మజుని చేత యుద్ధాన్ని మాన్పించటమే ఈ రాయబార ప్రయోజనము. యుద్ధప్రమాదము శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగా నైనా తొలగిందనియే చెప్పవచ్చు. జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుడు సంధికై ప్రయత్నిస్తే సంధి జరుగక పోతుందా అనే ఆశ ఉండటం సహజం. ఒకవేళ సంధి జరుగకపోయినా శ్రీకృష్ణు డంతటి వాని ప్రయత్నమే ఫలించకపోతే ఇంక చేయగలిగిన దేముంటుంది. అందుచేత ఏ విధంగా చూచినా సంజయుడు తాను వచ్చిన కార్యాన్ని సాధించుకొని వెళ్ళినాడనియే చెప్పవలసి ఉంది.

శ్రీకృష్ణ రాయబార సమయానికి భారత కథ మిక్కిలి క్లిష్టమైన ఘట్టానికి చేరింది. కౌరవ పాండవులకు సంధి జరిగితే సర్వజన శ్రేయస్సు, సమరం జరిగితే సర్వజన క్షయం కలుగుతుంది. ఇంతకు ముందు జరిగిన సంధి ప్రయత్నాలను పరిశీలిస్తే సమరం తప్పదనే భావమే అందరికీ ఉంది. ఆ యుద్ధం వలన కలిగే సమస్త జనక్షయాన్ని తప్పించటానికి యత్నించవలసిన బాధ్యత ప్రాజ్ఞులైన వారందరి మీదా ఉంది. కాని, మిగిలిన వారు తమ శక్తిసామర్థ్యాలు దానికి చాలవని తెలుసుకొని ఆ ప్రయత్నం చేయలేదు. శ్రీకృష్ణుడు వారివలె సామాన్యుడు కాడు కదా. పురుష రూపంలో ఉన్న పురుషోత్తముడు. అట్టి కృష్ణుడు అఖిల జనక్షయాన్ని తప్పించటానికి ప్రయత్నించటం ధర్మం. అతడలా చేయకపోతే, “ఉపేక్షించాడు గాని పూనుకుంటే సంధి జరుగదా,” అని ప్రాజ్ఞులు కాకున్నా అజ్ఞులైనా అనుకోకపోరు. రాయబారిగా వెళ్ళినప్పుడు విదురునితో సంభాషించే సన్నివేశంలో కృష్ణుడే ఈ విషయాన్ని వివరింపటం గమనింప వలసి ఉంది. అజ్ఞులకు కూడా అటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా ఉండటానికే ఈ కార్యభారాన్ని తనమీద వేసుకున్నాడు. అంతేకాకుండా ఆ తరువాత పార్థసారధియై సర్వజనక్షయకారకుడు కాబోతున్నాడు. అలా సర్వజన నాశనాన్ని చేయించిన కృష్ణుడు లోకకల్యాణం కోసం ఎందుకు ప్రయత్నించలేదు. ప్రయత్నిస్తే ఫలితం ఉండేది కదా – అని అనుకోవడానికి అవకాశం లేకపోలేదు. ఆ ప్రయత్నాన్ని చేయవలసినంత చేసిన తరువాత ధర్మ సంరక్షణార్థం కురుక్షేత్ర సంగ్రామానికి సూత్రధారుడు కావలసి వచ్చింది – అని చాటి చెప్పటం కోసమే రాయబార కార్యానికి పూనుకున్నాడు. సంధి జరుగుతుందని తలచి శ్రీకృష్ణుడు ఈ రాయబారానికి పూనుకోలేదు. పొందు పొసగదని, సమర మనివార్యమని, అది విధినియతి అని తెలిసి ప్రయత్నం చేయటం లోనే శ్రీకృష్ణ తత్వం లోని విశిష్టత గోచరిస్తుంది. “కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన,” అన్న ఒక్క గీతావాక్యం లోనే భగవద్గీత సారమంతా ఇమిడి ఉందని విజ్ఞులు చెపుతారు. గీతోపదేష్ఠ ఆ ఉపదేశాన్ని ఆచరణలో చూపించడానికే ఈ రాయబారానికి పూనుకున్నాడు. ఫలాపేక్ష లేకుండా మానవుడు ప్రయత్నం చేయాలనే సత్యాన్ని ఈ ఘట్టంలో వ్యంగ్యంగా, వాచ్యంగా సూచిస్తూనే ఉన్నాడు భగవానుడైన శ్రీకృష్ణుడు.

సంజయుడు వెళ్ళిన మరునాడు ధర్మరాజు – తమ్ములు, ద్రౌపది, కొడుకులు, రాజులు వెంటరాగా మాధవుని మందిరానికి వెళ్ళి పాండవ దూతగా కౌరవసభకు వెళ్ళవలసినదిగా అతనిని ప్రార్థిస్తాడు. సంధికి సంబంధించి తమ తమ అభిప్రాయాలను పాండవులు, ద్రౌపది వాసుదేవునకు అక్కడ వివరంగా చెపుతారు. రాయబారిగా వెళ్ళే కృష్ణుడు వారి ప్రసంగాలను ఎలా ఆలకించాడు? అప్పుడతని మనస్థితి ఎలా ఉంది? వారి మాటల కెలా ప్రత్యుత్తరమిస్తూ ఏ విధంగా వారిని చక్కదిద్దుతున్నాడు? అనే అంశాలను పరిశీలిస్తేనే గాని శ్రీకృష్ణ రాయబారం లోని తత్వం స్పష్టం కాదు. ధర్మరాజు, భీమార్జున నకుల సహదేవులు, ద్రౌపది వారి వారి సంస్కారాన్ని బట్టి శ్రీకృష్ణునితో ప్రసంగించారు. అందుచేతనే చెప్పే విషయ మొక్కటే అయినా చెప్పే తీరులో వైవిధ్యం ఏర్పడింది. ధర్మజాదుల చిత్త సంస్కార స్థాయి ననుసరించి తత్తదుచితంగానే వారికి వాసుదేవుడు సమాధానాలివ్వటం గమనింపవలసి ఉంది.

ధర్మరాజీ సందర్భంలో గంభీరమైన ఉపన్యాసం చేశాడు. ఇది అతని రాజనీతివేతృత్వాన్ని చాటి చెప్పేదిగా ఉంది. సంధి విషయంలో తన అభిప్రాయాలేమిటో వివరంగా చెప్పి, కౌరవుల సభలో శ్రీకృష్ణుడు నిర్వహించవలసిన కార్యాన్ని సవిస్తరంగా విశదీకరించి చివరకు, “పొమ్మెవ్వడ నీకు నేను బుద్ధులు చెప్పన్,” అనటంలోని ధర్మరాజు గడుసుదనం గమనింప దగింది. వశీకృత చిత్తుడైన ఇతడు చేసిన ఉపన్యాసంలో ఇతని మనోగతి ఏలాంటిదో తెలుసుకోవటం సామాన్యులకు సాధ్యమయ్యేదిగా లేదు. కౌరవు లైదూళ్ళిచ్చినా సంధి చేసుకోవటాని కీతడు సిద్ధంగా ఉన్నాడన్నట్లుగానే ఉందతని ప్రసంగం. సంధి జరగాలనే ఆకాంక్ష అయితే ఉన్నది కాని, సంధి జరుగుతుందనే ఆశ మాత్రం ధర్మరాజుకు లేదు. తార్కికంగా, గంభీరంగా, విరోధాభాస ధోరణిలో సాగిన ఈతని ఉపన్యాసం లోని అంతరార్థం అందరికీ అంతు పట్టేదిగా లేదు. ఇతడు యుద్ధవిముఖుడుగా, సంధికే కృతనిశ్చయుడై ఉన్నట్లుగా సభాసదులు భ్రాంతి చెందే అవకాశం లేకపోలేదు. తరువాతి భీముని ప్రసంగాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సంధి జరుగుతుందనే విశ్వాసంతో సమర సన్నాహాలను సడలించటం గాని, వీరులలో ఉత్సాహాన్ని జారిపోనీయడం గాని కూడని పనులు. ధర్మరాజు హృదయం తనకు పూర్తిగా అర్థమైనా సభాసదులలో కలిగిన భ్రాంతిని పోగొట్టటానికి శ్రీకృష్ణుడు సమరమే జరుగుతుందని అతని చెప్పినట్లుగా చెపుతూనే సభను హెచ్చరిస్తాడు. ఆ వైపున ఉన్న బంధు సుహృజ్జనులను సంపదకై వధించి దూఱెక్కుట దోషమందుట అను దురవస్థల కోర్వ వచ్చునే, అని పల్కిన ధర్మరాజుకు సమాధానంగా శ్రీకృష్ణుడిలా అంటాడు.

“క్రూరాత్ములగు కౌరవులు ఎల్లవారికి వధ్యులు గాదగుదురు. నీకేల అవధ్యులైరి? పాపాత్మకులగు హింసకులం బాముల నేట్లట్ల నిర్విచారంబుగ వధించుట కర్తవ్యం.”

ఈ విధంగా సమరమే కర్తవ్యంగా నిశ్చయం చేశాడు. అయితే సంధికై కౌరవ సభకు వెళ్ళటం దేనికి? వెళ్ళి ఏమి చేస్తావు? అనే ప్రశ్నలకు వెంటనే సమాధానంగా –

“ఆతలకు నేను జని వి
ఖ్యాయంబుగ నీదు వినయ మభివర్ణింతున్,

నీదు పుణ్యచరితంబులు, నీవు ధర్మ మార్గము దలచుటయుం దెలియం బలికెద” అంటాడు.

కౌరవసభలో ధర్మజుని వినయాన్ని సవిస్తరంగా వర్ణించి, ధర్మమార్గవర్తులైన పాండవుల సచ్చరిత్ర నందరికీ తెలియజెప్పి, వారిదేమీ తప్పు లేదు, కౌరవులదే దోషమంతా – అని నిరూపించటానికి వెళుతున్నాడట. కౌరవసభకు తాను వెళ్ళినప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో ముందుగానే ఊహించి ఎంత స్పష్టంగా ధర్మరాజుతో చెప్పినాడో గమనింపదగిన విశేషం.

“దుర్యోధనుం డియ్యకొనక తెఱంగు మాలిన మాటలాడుటయు, తండ్రి యతని వారింప నేరమికిఁ దోడుపేక్షకుండగుటయుఁజూచి మీ తొల్లింటి పాట్లునుం దలచి యెల్లవారును వారిని గర్హింతురు. ఇంతియ కాక మనకు నొండేమి వలయు.”

తామిద్దరూ ఆశించిన రాయబార ప్రయోజనమేమిటో చక్కగా సూచించటం జరిగింది. ఇంకా తానక్కడికి వెళ్ళి ఏమి చేస్తాడో ఇలా వివరిస్తాడు.

“నా యోపినంతయుఁ బెక్కుభంగుల సంధియ కావింపఁ జూచెద. అవ్విధంబు సిద్ధించిన మేలు కాదె? అట్లుగాక తక్కిన, నచ్చోటి యోధుల యుత్సాహంబు చందంబును, అందు చేయంగల వారి వర్తనంబులుఁ గొలందులు నెఱింగి, నీకు విజయంబగు తెఱంగున జను దెంచెద.”

తన రాయబార నిర్వహణ విధి విధానాన్ని, దాని ఫలితాన్ని, ప్రయోజనాన్ని ఇంత చక్కగా వివరించిన తరువాత శ్రీకృష్ణుడు సుయోధనుని ముక్కులో ఊపిరుండగా మీకు రాజ్యభాగమీయడు. యుద్ధమే కలుగుతుంది. నీవు ఉత్సాహాన్ని విడిచిపెట్టవద్దు, అంటూ హెచ్చరిస్తాడు.

భీముడు ధర్మరాజు వలెనో, అర్జునుని వలెనో శ్రీకృష్ణుని తత్వాన్ని ఆర్థం చేసుకున్నవాడు కాదు. దైవమానుషాలలో మానుషానికే అధిక ప్రాధాన్య మిచ్చినవాడు. ఇతడు ఉద్ధతుడైనా ఎట్టి స్థితిలోనూ అన్న మాట కెదురాడే వాడు కాడు. ధర్మరాజు ఉపన్యాసం లోని గడుసుదనం పూర్తిగా అర్థం కాక ఇతడ తన సహజప్రవృత్తికి విరుద్ధంగా మెత్తబడి మాట్లాడినాడు. ఇట్టి సంస్కారం గల భీముని యుద్ధానికి పురికొలుపుతూ మేలంపు మెయివడిని సంభాషణ సాగించాడు కృష్ణుడు. అర్జునుడు నరాంశ సంభూతుడు. గీతాశ్రోత. గీతోపదేష్ట అయిన శ్రీకృష్ణుని తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవాడు. వీరిద్దరి సంభాషణలో ప్రౌఢసంస్కారం, గాంభీర్యం, మహనీయత గోచరిస్తాయి. సంధి కాదు సమరమే జరుగుతుంది అని శ్రీకృష్ణుడు పదే పదే చెపుతున్నాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా అంటాడు.

ధృతరాష్ట్రుం డతి లోభ దూషితుడు ధాత్రీభాగ మీ నేర్చునే
సుతుడుం గష్టుడు సంధి యేల యగు నంచున్ మున్న కై పెక్కిన
ట్టి తలం పచ్యుత నీకు గల్గినది గాండీవంబు దివ్యాస్త్ర సం
తతియుం బెట్టిన యట్లయుండ మముఁ జింతం బాప రాదోకదే.

నరుడు నారాయణుని హృదయాన్ని ఎంత చక్కగా చదువ గలిగాడు! సంధి చేయమని ఎంత చక్కగా చెప్పాడు. శక్తి చాలక సంధి చేయమనటం కాదు. ఆ చెప్పటంలో ఎంత ప్రౌఢసంస్కార ముంది. అంతటితో ఊరుకోకుండా అసలు రహస్యాన్ని బయట పెట్టి ఎలా నిలవేసి అడుగుతున్నాడో గమనిస్తే గాని అర్జునుని పాత్ర సరిగా అర్థం కాదు.

నీవొనరింపఁ బూనిన పనిం గమలోదర కీడుపుట్టు నే
కావనినట్ల యుండి యవుఁ గార్యం లట్లగుటం బ్రయత్న సం
భావన సేఁత పౌరుషము పద్ధతి తత్ఫల సిద్ధి వొందుచో
దైవము తోడ్పడన్ వలయుఁ దథ్యము రెండును నీ వినోదముల్

కమలోదర అన్న సంబోధన లోనే శ్రీకృష్ణుని పరమేశ్వర తత్వాన్ని సూచించడం జరిగింది. పరమేశ్వరుడవయిన నువ్వు చేయబూనుకున్న పనికి కీడు కలుగుతుందా? అయితే ఇప్పుడు కురుపాండవులకు సంధి కాని పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాని, కొన్ని పనులు కానట్టే కనిపించి చివరకు ఫలిస్తాయి. ఎలా అంటావా? పురుష ప్రయత్నం, దైవం తోడ్పాటు ఈ రెండూ ఇప్పుడు నీ వినోదాలే. పురుష ప్రయత్నం చేసేది నీవే. దైవానివీ నీవే. పాండవ దూతగా కౌరవసభకు వెళ్ళి సంధికై నీవు చేసేది పురుష ప్రయత్నం. ఆ ప్రయత్నం ఫలించాలనే సంకల్పం నీ మనసులో కలిగితే దైవం తోడ్పడినట్లే. ఈ రెండూ జరిగితే తప్పకుండా పొందు పొసుగుతుంది. అది నీకిష్టం లేదంటావా. ఇదంతా దేనికి? ఇలా చేయమని మమ్ముల నాజ్ఞాపించరాదా? నీవు చెప్పినట్లు చేయడం నేడు మాకు క్రొత్తగా రాలేదు కదా! అంటూ సూటిగా ప్రశ్నించే అర్జునునికి శ్రీకృష్ణుడు ఏమని సమాధానం చెపుతాడు? సంధి అయ్యేటట్లు చూస్తానంటాడా? చేయటం నాకిష్టం లేదంటాడా?

వెరవున లావునం గృషికి వేయి విధంబుల మేలొనర్చినన్
దొరకొనునే ఫలంబు దఱితోఁ దగు వర్షము లేకయున్న నే
ప్పరుసున లెస్స చేసినను పౌరుషముల్ ఫలియించుటెల్ల నా
దరణమునం బ్రసన్నమగు దైవము చేఁతన సూవె ఫల్గుణా

కాఉన సంధికి బురుషకార మొనర్చెద నోపినంతయున్
దైవము చేత ఎట్లగునొ దాని నెఱుంగ,

అని పై ప్రశ్నలకు ప్రత్యుత్తరమిచ్చినాడు శ్రీకృష్ణుడు.

ఎన్నో ఉపాయాలతో శక్తినంతా ఉపయోగించి వేయివిధాలుగా వ్యవసాయం చేసినా సమయానికి వర్షం పడకపోతే పంట ఫలించదు. వేయి విధాలుగా మేలొనర్చటం పురుష లక్షణం, తఱితో తగు వర్షం కురియటం దైవము సేత. మానవ ప్రయత్నాలు దైవ సంకల్పము వల్లనే ఫలిస్తాయి. దైవ సంకల్పం లేకుండా ఏ మానవ ప్రయత్నం ఫలించదు. శ్రీకృష్ణుడు సంధికై శక్తి కొలదీ కృషి చేస్తాడట. దైవముచేత ఎలా ఉందో తా నెఱుగడట. ఓపినంతగా సంధి కోసం పురుష ప్రయత్నం చేస్తాను గాని దైవంగా మాత్రం తోడ్పడను సుమా, అని చెప్పడమే. అంటే పొందు పొసగదని వ్యంగ్యంగా సూచించటమే. ఆ వ్యంగ్యస్ఫూర్తిని అర్థం చేసుకోగల సంస్కారం అర్జునునికి ఉంది కాబట్టి అలా చెప్పటం జరిగింది. ధర్మజ భీమార్జునులతో తాను చెప్పిన మాటలు విన్న తరువాత కూడా, నీ పోయి నప్పుడ యీ కార్యంబు చక్కనగు అని అంటూ ఉన్న నకులునితో శ్రీకృష్ణుడేమని చెపుతాడు. ఉచితమైనది కయ్యమ అంటూ రణభేరి మ్రోగించే సహదేవునితో చెప్పవలసింది ఏముంది?

శ్రీకృష్ణునిలోని భగవత్తత్వం ద్రౌపదికి అర్థమయినట్లుగా ఎందరికో కాలేదని చెప్పటం అతిశయోక్తి కాదు. ‘దుష్ట నిగ్రహము పూని జగంబుల గాచునట్టి’ శ్రీకృష్ణుడు తన తోబుట్టువని గుర్తించిన పరమ భక్తురాలామె. ఆ భగవంతుడే సంధి కార్య నిర్వహణకు పూనుకుంటే అది కాకుండా ఉంటుందా? సంధి జరిగితే ఎన్నా మహావమానాలను పొందిన తన స్థితి ఏమిటి? ఈ విధమైన కంటకస్థితిలో ఆమె ఒక కంట అశ్రుకణాలు వేరొక కంట అగ్నికణాలు కురిపిస్తూ మాటాడింది. అర్జునునకు వ్యంగ్యంగా సూచించిన విషయాన్నే శ్రీకృష్ణుడు తన చెల్లెలయిన ద్రౌపదికి వాచ్యంగా చెప్పాడు. విషాద రోషాలు కావగలేని స్థితిలో ఉన్న ఆమెకు వ్యంగ్యంగా చెప్పితే అర్థం కాదని వాచ్యం చేశాడేమో. సంధి కార్య వచనాలు కౌరవుల చెవుల కెక్కవని ఎంత రమణీయంగా చెపుతాడు!

యమ మహిష ఘంటికా నా
దము వినఁ గౌతూహలంబు దళుకొత్తెడు చి
త్తములు గల కౌరవుల కి
ష్టము లగునే సంధికార్య శాంతవచనముల్.

కౌరవులు విధిప్రేరితులు, వారికి కాలమాసన్న మయ్యింది. సంధికార్య వచనాలు వారికిష్టం కావు, అని చెపుతూనే-

మొదల విధి నియతియు న
ట్టిద యందురు పెద్ద లది ఘటింపక పోదే
మదిఁ జూచి చెప్పినను ద
ప్పదు మేరువు దిరిగినేనిఁ బాంచాలా సుతా

అంటాడు. సంధి కాకపోవటం, సమరం జరగటం, అందులో కౌరవులు నశించటం అన్నది విధి నియతి. అది తప్పదు. ఏ మనస్సుతో తూచి చెప్పినా తప్పదు; ఎవరి అభిప్రాయమైనా అదే అని సామాన్యమైన అర్థము. శ్రీకృష్ణుని దైవమానుష సంబంధాలైన ఏ మనస్సుతో ఆలోచించి చూచినా అది తప్పదు అని విశేషార్థం మరొకటి గోచరిస్తున్నది. నేను మనస్సు లోకి చూచి చెప్పినా అది తప్పదు అనే ఇంకొక సూక్ష్మమైన విశేషార్థ మిందులో ధ్వనిస్తున్నది. అంటే, “నేను అంతర్ముఖుడనై విధి నిర్ణయాన్ని గమనించి చెపుతున్నాను. యుద్ధం తప్పదు. అందులో కౌరవులు నశించి తీరుతారు,” అని శ్రీకృష్ణుడీ పద్యంలో ధ్వనింప జేయటం గమనింప దగిన విశేషం.

శ్రీకృష్ణుడు హస్తినాపుర ప్రయాణంలో నారద జమదగ్ని కణ్వాది మహామును లాతనికి కన్పించిన సన్నివేశం సామాన్యమైనదిగా కనిపించినా పరిశీలిస్తే మహత్తరమైనదిగా గోచరిస్తుంది. వారిని చూచి మీ రిక్కడకు విజయం చేసిన కారణాన్ని సెలవీయండని నారాయణుడు అడుగగా నారదుడిలా అంటాడు.

అనఘ పుణ్యాత్ముడవగు నున్నుఁ గనుగొనఁ
గౌరవ సభ నీవు గారవమునఁ
బలికెడి పలుకుల భంగు లాకర్ణింప
విదుర భీష్మాదులు విని తెఱంగు
నుత్తరంబిచ్చు కార్యోక్తులు నెఱుగంగ
వేడుక వచ్చిరి వీరలెల్ల.

మహర్షులు కౌరవ సభకు రావడం వల్ల శ్రీకృష్ణ రాయబారానికి ఒక ఔన్నత్యం, ఔజ్జ్వల్యం చేకూరినవని చెప్పవచ్చు. త్రికాలజ్ఞులయిన నారదాది మునులకు సంధి జరగదనే విధి నిర్ణయం తెలియదా? తెలిస్తే ఎందుకు వచ్చినట్లు? విధి నియతి వారికి తెలుసు. విధి నియతి దైవమే సంధి కార్య నిర్వహణకు పూనుకొని, దానికై ఎలా ప్రయత్నం చేస్తాడో చూడాలనే కుతూహలం మహర్షులకు కలిగింది. పురుష ప్రయత్నం చేసేదీ తానే అయ్యి, దైవమూ తానే అయిన శ్రీకృష్ణుడు రాయబారానికి పూనుకోవటం ఒక గొప్ప విశేషం. ఆ విశేషాన్ని చూడాలనే ఉత్కంఠ మునులను కౌరవ సభకు రప్పించింది. అంతే కాకుండా, “అనఘ, పుణ్యాత్ముడవగు నిన్నుఁ గనుగొన కౌరవ సభ,” అని చెప్పడంలో కృష్ణుడు ప్రదర్శించే విశ్వరూపాన్ని సందర్శించటానికి కూడా వారు వచ్చారనే ధ్వని కూడా లేకపోలేదు.

శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ప్రవేశించి ధృతరాష్ట్రాదులను కుంతిని దర్శించిన తరువాత విదురుని ఆతిథ్యం స్వీకరించడానికి అతని గృహానికి వెళతాడు. అక్కడ అభ్యంతర మందిరంలో అతనితో ఏకాంతంగా సంభాషిస్తాడు. రాయబార నిర్వహణలో శ్రీకృష్ణుని మనోభావాలను అర్థం చేసుకోవటానికి ఈ సన్నివేశం ఎంతో తోడ్పడుతుంది. విదురుడు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు.

“నీవిట వచ్చుట వినిన యప్పుడు ధార్త్రరాష్ట్రులందరుం గూడం బాఱి తమలో నిశ్చయించిన తెఱంగు నీ శాసనం బుల్లంఘింప గలవారు పాండునందనులకు నేమియు నీకుండువారు దార ధాత్రి యంతయు బీఱువోవకుండ నేలువారు… … సంధి కానేరదు. వారి తలంపులు కీడు. పాండవేయులపై స్నేహంబునను నీమీద భక్తిం జెప్పెద నందు బోవలదు.”

దీనికి సమాధానంగా కృష్ణుడు నీవు తల్లిదండ్రుల లాగా హితం చెప్పావు. అయినా నేనెందుకు వచ్చానో చెపుతాను విను… అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి తనకంతా ముందే తెలుసన్నట్లుగా “ఎఱుగుదు నేను సుయోధను కొఱగామియు… సంధి పొసగదనియ మహాత్మా” అని పలుకుతాడు. ఇంత తెలిసి ఎందుకు వచ్చావని అంటావేమో.

పుడమి యెల్ల నొడ్డ గెడనయి గజవాణి
యుతముగాఁ గడంగి యుగ్రమృత్యు
ముఖము మొరగఁ దివురు మూర్ఖత మాంచుట
యధికమైన పుణ్యమనఘచరిత!

భారతదేశంలో ఉన్న రాజులంటా యుద్ధానికి సన్నద్ధమయ్యారు. సర్వజన క్షయం కాబోతున్నది. ఇట్టి స్థితిలో వారి మూర్ఖత్వాన్ని మాన్చే ప్రయత్నం చేయవద్దా! విశ్వ శ్రేయోదాయకమైన ఆ ప్రయత్నం పుణ్యప్రదం కదా. అయితే మాన్పటానికి వీలున్నదా అంటేవేమో.

దొరకొని పుణ్యం పాపము
నరుఁ డర్థిం జేయుచుండ నడుమ నొకట న
వ్వెర వెడలి తప్పినను ద
త్పరిణతి ఫలమొందునండ్రు ధర్మ నిధిజ్ఞుల్.

నరుడు పాపపుణ్యాలు చేస్తాడు. వాటి ఫలితాలని అనుభవిస్తాడు. ఏదో ఉపాయంతో ఆ ఫలితాలను అనుభవించటం తప్పించుకున్నా చిట్టచివరకు అనుభవించటం తప్పదు. పాపాత్ములైన కౌరవులు తాత్కాలికంగా సుఖాల ననుభవిస్తూ ఉన్నా పాపం యొక్క పరిణతి ఫలాన్ని వారనుభవించక తప్పదు. పుణ్యాత్ములైన పాండవులు ఎన్నో కష్టాల ననుభవించినా పుణ్యపరిణతి ఫలాన్ని వారు తప్పక పొందుతారు. యుద్ధం జరుగుతుంది. అందులో కౌరవులు నశించి పాండవులకు జయం కలుగుతుందని భ్యంగ్యంతరంగా చెప్పటమే. సమరమే జరుగుతుంది సంధి కాదు అని తెలిసి కూడ తాను రాయబారిగా రావటం లోని ప్రయోజనమేమిటో ఇంకా ఈ విధంగా వివరించి చెపుతాడు.

చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు
డడ్డపడి వారితోడఁ గోట్లాడియైన
దాని నుడుపంగఁ జొరకున్నవానిఁ గ్రూర
కర్ముడని చెప్పుదురు కర్మకాండ విదులు.

అన్నదమ్ములు దమలోనం బోరఁ గృష్ణుండు వారింపక యుపేక్షించె. తనచేత చక్కం బడదా యని యజ్ఞులైన జనులాడుదురు.

ఈ సన్నివేశంలో తాను చేయబోయే ప్రయత్నం యొక్క ఫలితాన్ని ముందే ఊహించిన కృష్ణుడు రాయబార కార్యానికి ఎందుకు పూనుకున్నాడో స్పష్టంగా చెప్పటం గమనింప వలసి ఉంది.

కౌరవసభలో శ్రీకృష్ణుడు రాయబారాన్ని నిర్వహించిన ఘట్టాన్ని భారతంలో సాటిలేని మహోజ్జ్వల ఘట్టంగా చెప్పవచ్చు. భీష్మ బాహిల్కాది కురువృద్ధులతో, ద్రోణ క్రుపాది ఆచార్యులతో, విదుర సంజయాది నీతికోవిదులతో, సకల రాజలోకంతో నిండి ఉన్నది కౌరవసభ. అంతేకాకుండా శ్రీకృష్ణ సందేశాన్ని ఆలకించటానికి వేంచేసిన త్రికాలజ్ఞులైన నారదాది మునుల వల్ల, ఆకాశమంతా నిండిన దేవతల వల్ల, ఆ సభకొక నిండుదనం, మహనీయత ఏర్పడ్డాయి. ఇక రాయబారాన్ని నిర్వహించే వాడా భగవానుడయిన శ్రీకృష్ణుడు. ఏ కార్యనిర్వహణమయినా, దాన్ని నిర్వహించే వ్యక్తి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. శ్రీకృష్ణుని అనుభావాన్ని గురించి వేరుగా చెప్పవలసిన అవసర మేముంది. అతని ధర్మోత్సాహం, మాహాత్మ్యం కౌరవ సభలో అతడు నిర్వహించిన రాయబారానికి ఔజ్జ్వల్యాన్ని, దీప్తిని చేకూర్చినాయి.

కౌరవసభలో ఉపన్యసించటానికి లేచి నిలుచున్న శ్రీకృష్ణుని రూపం సభ్యులను ఏ విధంగా ఆకర్షించింది? అతడు ఉపన్యాసాన్ని ఏవిధంగా ప్రారంభించాడు? చెప్పదలసిన విషయాలను ఎలా వివరించాడు? దాని ప్రభావం సదస్యులపై ఏ విధంగా ఉంది? ఇవన్నీ పరీశ్లించవలసిన విషయాలే. అంబుద శుభగాత్రుడు, పీతాంబరధారుడు, కమలదళనిభాక్షుడు అయిన హరి రూపాన్ని చూస్తున్న సభ్యుల లోచనాలు అమృతాన్ని ఆనినట్లు సమ్మదంలో తేలినవట. ఆ కొలువులోని వారందరు ఆ దివ్యమంగళ సుందర విగ్రహాన్ని దర్శించి, కదలక, మాటలేక, వింజమాకిడిన విధంగా తన్మయ స్థితిలో చిత్రిత ప్రతిమల వలె ఉన్నారు. అప్పుడు జలదస్వన గంభీరమైన ఎలుగుతో, దంతదీప్తులు వెలుగొందగా, అఖ్లీజనులు చెవులు రిక్కించి వినగా తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. ఇక్కడ కొద్దిపదాలలో శ్రీక్ష్ణుని రేఖాచిత్రణం మనోజ్ఞంగా చేయబడింది. నీలమేఘశ్యామ గ్రాతం — కట్టింది పీతాంబరము — పుండరీకాక్షములు — ఇందలి మనోహరమైన వర్ణసమ్మేళనం గమనింపదగిన విశేషం. అంబుద శుభగాత్రునకు దంతదీప్తులు ఒక వింత చెలువును చేకూర్చినాయి. పెదవి కదల్చక ముందే శ్రీకృష్ణుడు సభ్యుల మనస్సు నాకట్టుకున్నాడు. ఇక ఉపన్యాసాన్ని ఇలా ఆరంభిస్తాడు.

జననాథ! నీయెఱుంగని
పనులు గలవె? యైనఁ దగవుఁ బరమ హితంబుం
దన వారికిఁ జెప్పన తగు
నని వచ్చితి భారతాన్వయము ప్రియమందన్.

మానవ మనస్తత్వాన్ని కాచి వడకట్టిన శ్రీకృష్ణుని వంటి మహారాజనీతివేత్తే ఈ విధంగా ప్రసంగాన్ని ప్రారంభించగలడు. ధృతరాష్ట్రుడు తనకంటే పెద్దవాడు, పోరాని చుట్టము. అట్టివానికి ఉపదేశించినట్లుగా చెప్పటం ఉచితంగా ఉండదు. అందుచేత “అంతా నీకు తెలుసు” అన్నట్లు నేవెఱుగని పనులు గలవె అని వినయంగా ప్రారంభిస్తున్నాడు. అయితే జూదము, ద్రౌపదీ పరాభవము – మొదలైన పనులు గూడ నీ వెఱుగనివి కావు కదా అనే అర్థచ్ఛాయ కూడా ఇందులో లేకపోలేదు. అన్ని విషయాలు ధృతరాష్ట్రునకే తెలిస్తే తానెందుకు వచ్చాడో అన్నదానికి సమాధానంగా తనవారికి తగవు, హితాన్ని చెప్పటానికి తగుదునని వచ్చానని అంటున్నాడు. మూలం లోని ‘భారత’ అనే ధృతరాష్ట్రుని సంబోధన తెలుగులో ‘జననాథ’గా మారింది. రాజువైన నీకు జనహితం ముఖ్యమని తెలియదా అనే సూచన ఇందులో ఉంది. ఇదే విధంగా ఈ సాందర్భంలో శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని కురుప్రవర, కౌరవ్య వంశాగ్రణీ, ధరిత్రీ రమణాగ్రగణ్య, ఉర్వీరమణ – ఈ మొదలుగా సాభిప్రాయ విశేషణాలతో సంబోధింపటం గమనింపవలసి ఉంది.

వక్తబ్యాంశ మేమితో తెలీయ నీయకుండా ఉపన్యాసం సాగించటం ఒక పద్ధతి. పాండవ సభలో సంజయుడు చేసిన ఉపన్యాస మిటువంటిది. ఆ రాయబారానికి ఆ పద్ధతి తగి ఉంది. చెప్పదలచుకున్న విషయాన్ని సూత్రప్రాయంగా ముందు ప్రతిపాదించి దానిని వివరించటం వేరొక పద్ధతి. శ్రీకృష్ణుడు ఈ పద్ధతిని అవలంబించాడు.

క్షీరోదక గతిఁ బాండవ
కౌరవు లొడఁగూడి మనికి కార్యం బది నీ
వారసి నడువుము; వారన
వీరనఁ గురుముఖ్య, నీకు వేఱుం గలదే.

శ్రీకృష్ణుని ఉపన్యాసానికి ఈ పద్యం బీజప్రాయమైనదని చెప్పవచ్చు. తరువాతి ప్రసంగం దీని వివరణమే. క్షీరోదక గతి పాండవులు, కౌరవులు కలిసి జీవించటం కార్యం. అలా కలిసి జీవించేటట్లు చూడవలసిన బాధ్యత ధృతరాష్ట్రుని మీద ఉంది. అతడు కురు ముఖ్యుడు. కురుపాండవులలో అతనికి భేదభావం లేదు. ఇద్దరూ అతని బిడ్డలే. ఇలా ప్రసంగాన్ని ప్రారంభించిన కృష్ణుడు పాండవ కౌరవులు క్షీరోదక గతి కలిసి జీవించటం కార్యమంటున్నాడు. క్రమాలంకారంలో పాలు పాండవులు, నీరు కౌరవులు. క్షీర నీరములలో క్షీరం ప్రధానం కదా. సంజయుని రాయబారిగా పంపేటప్పుడు ధృతరాష్ట్రుడు కూడా “క్షీరోదక వృత్తి మనము వారలునుం గలసి బ్రదుక వలదే” అని చెప్పటం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవలసి ఉంది. ధృతరాష్ట్రుని ధృష్టిలో పాలు కౌరవులు, నీరు పాండవులు. రాయబారిగా వెళ్ళే కృష్ణునితో భీముడు కూడ “పాండవ కౌరవుల్ గలిసి పాలును నీరును బోలె నెమ్మిమై నుండగ” అంటాడు. ఇక్కడ పాటించిన క్రమాన్ని కూడా గమనింపవలసి ఉంది. ఒక చిన్న ఉపమానంతో ఎంతో ప్రయోజనాన్ని సాధించటం జరిగింది. పై పద్యంలో ‘కురుముఖ్య’ అని ధృతరాష్ట్రుని సంబోధించి కురువంశ సంప్రదాయాల నన్నింటినీ నిలబెట్టవలసిన బాధ్యత అతనిమీదే నిలిచి ఉన్నదని గుర్తు చేస్తూ, ఆ కురువంశ మెట్టిదో, దాని సుచరిత క్రమమెట్టిదో ఇలా వివరిస్తాడు.

భరత కులంబు ధర్మమును బాడియు సత్యము బొత్తుఁ బెంపునున్
గరుణయుఁ గల్గియుండు ననగా నుతి గన్నది యంది సద్గుణో
త్తరులరు నీవు నీయనుగు దమ్ముడు నీతనయుల్ యశోధురం
దర శుభ శీలురీ సుచరిత క్రమ మిప్పుడు దప్ప నేటికిన్.

భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, పొత్తు, పెంపు, కరుణ కలిగి నుతి కెక్కింది. దాయాది భాగాలకై తగవులాడుకొని కుత్తుకలను ఉత్తరించుకోవటానికి ఎప్పుడూ సిద్ధం కాలేదు. తండ్రి సౌఖ్యం కోసం రాజ్యాన్నే కాకుండా సర్వసౌఖ్యాలను త్యాగం చేసినవాడు భీష్ముడు. అన్న జాత్యంధుడైనా అతనిని సింహాసనం మీద కూర్చుండ బెట్టినవాడు పాండురాజు. ఈ విధంగా రాజ్యాన్ని త్యాగం చేయటమే గాని దానికై వంశ నాశనానికి పూనుకోవటం భరతవంశ సంప్రదాయం కాదు. ఆ వంశం యొక్క సుచరిత్ర క్రమాన్ని ఇప్పుడు తప్పటం దేనికి? ఈ వంశానికి ఇప్పుడూ కలిగిన హానిని పోగొట్టవలసిన బాధ్యత నీమీదే ఉంది. ఎందు చేతనంటావా?

ఈ వంశంబునకెల్ల నీవ కుదురిం దెవ్వారి చందంబు లె
ట్లై వర్తిల్లిన ఁగీడు మేలుఁ దుది నీయం దొందెడుం గాన స
ద్భావం బారసి, లోని పొత్తు, వెలి వృత్తంబున్, జన స్తుత్యంబుల్
గావింపం దగు నీక యెవ్విధమునం గౌరవ్య వంశాగ్రణీ.

ఈ భరత వంశానికి నీవే కుదురు. ఈ వంశం లోని మంచిచెడ్డలు నీకే చెందుతాయి. అందుచేత సద్భావంతో బయటికి బాగున్నార న్నట్లుగా కాకుండా మనస్సు లొక్కటిగా కలసి నీ బిడ్డలు జీవించేటట్లు చేయవలసిన కర్తవ్యం నీమీద ఉంది. సుయోధనాదులయిన నీ కొడుకులు ధర్మమార్గాన్ని విడిచి మీవంశ వర్తనానికి దూరులై బంధువుల మనస్సులు నొచ్చుకోనేటట్లు ప్రవర్తిస్తున్నారు. కౌరవులు పాండవులు సంధి చేసుకొని శాంతితో జీవించటం నీకు నాకు కులానికి ఈ రాజులకు మేలు. అంతేగాక ప్రపంచాని కంతటికీ శ్రేయస్కరం. యుద్ధమే జరిగితే మహాపద కలుగుతుంది. ఇదంతా జాగ్రత్తగా ఆలోచించి తప్పకుండా సంధి జరిగేటట్లు చూడు.” అని కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ ‘తెఱగు నీవశమున మదియ’ అంటాడు. కార్య విధానమంతా నీ అధీనం లోనే ఉంది అని చెప్పటంలో శ్రీకృష్ణుని నేర్పు వ్యక్తమవుతుంది. ధృతరాష్ట్రుని మూలశక్తిగా గుర్తించిన వాడు గదా కృష్ణుడు. ఆ వైపునున్న వృకోదరార్జునులను యుద్ధంలో అతిశయించే వారెందరున్నారు. ఈ వైపునున్న భీష్మద్రోణాదులను ఎదురు నిలిచే వారెందరున్నారు. వారు వీరు యుద్ధంలో కూలటం కన్నా అందరూ నీవారై కలసి బ్రదుకటం మేలు కదా. అందుచేత శాంతి వర్ధిల్లే టట్లు కార్యాన్ని నడిపించు. కౌరవ పాండవులలో ఎవరికి చావు, బాధ కలిగినా దుఃఖించేది నీవే కదా. అలా కాకుండా ఈ రెండు పక్షాల వారిని కాచుకోవలసిన కర్తవ్యం నీదే. అని ఉపదేశించి పాండవులు ఒక్క మాటగా ధృతరాష్ట్రునితో చెప్పమన్న విషయాన్ని చెప్పి, వారు సభ్యులతో చెప్పమన్న విషయాన్ని ఈ విధంగా వివరిస్తాడు.

సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ
బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె
వ్వార లుపేక్ష చేసిరది వారల చేటు గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్.

ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే చేటు కలుగుతుంది గాని ధర్మనిస్తారకము, సత్యశుభదాయకము అయిన దైవం లేకపోలేదు. కౌరవుల వలన సత్యానికి ధర్మానికి హాని చేకూరింది. ఆ సత్యధర్మాలను ఉద్ధరించటానికి దక్షులైన భీష్మద్రోణాదులు ఉపేక్ష వహిస్తున్నారు. దీనివలన వారికి కీడు కలుగుతుందే గాని సత్యాన్ని, ధర్మాన్ని పాలించే పాండవులను దైవం తప్పక రక్షిస్తాడు.

సత్యధర్మాలకు కీడు వాటిల్లినప్పుడు ఉపేక్షించటం కూడ అధర్మమేనని భీష్మాదులకు సూచిస్తూ వారికి స్వధర్మ స్మృతిని కలిగించటం గమనింపదగిన విశేషం. ఇంకా సభ్యులతో “ఏను ధర్మంబును నీతియును మున్నిడుకొని మనో వాక్ప్రకారంబు లేక రూపంబైన సత్యంబకాఁ జెప్పితి. ఇత్తెఱంగు మీకు మేలు.” అని చెపుతూ తానింత వరకు చేసిన ప్రసంగ పద్ధతిని తానే సమీక్షిస్తున్నాడు. కర్తవ్యం ఇంతకంటె వేరేమున్నదని వారితో ఒత్తి ఇలా చెపుతున్నాడు.

పాండవులకుఁ దగిన పాలు మేదినిఁ బంచి
ఇచ్చుకంటెఁ గార్యమెద్ది గలదు
ధర్మమెద్ది సముచితంబగు విధమెద్ది
శక్యమెద్ది చెపుడ వాక్యవిధులు.

తాను చెప్పవలసిన విషయాన్ని బల్ల గుద్ది చెప్పిన ధోరణిలో చెప్పిన తరువాత ధృతరాష్ట్ర మహారాజుతో పాండవులకు వారి తండ్రి పాలు వారికి పంచి ఇచ్చి నీ పాలు నీ పుత్ర పౌత్రచయంతో అనుభవించి సుఖంగా ఉండండి. ఇది బంధుమిత్రులు, సజ్జనులు మెచ్చుకొనే తీరు. అజాతశత్రుని ధర్మ వర్తనము, సత్యనిష్ఠ, శక్తిసామర్థ్యాలు, అతడు నిన్ను ఏవిధంగా అనుసరించాడో, నీకు తెలుసు కదా. అయినా చెపుతున్నాను విను. అంటూ ధృతరాష్ట్రునకు, ధర్మరాజు ఇంద్రప్రస్థ పురాన్ని పాలించేటప్పుడు ధృతరాష్ట్రునకు పెంపు పేరు కలిగించటానికి రాజసూయం చేసినట్లు చెపుతున్నాడు.

మద మడగించి భూపతి సమాజము నెల్లను నినుఁ గొల్వఁ జే
యుదునని పూని దిగ్విజయు మున్నతిఁ జేసి మహా విభూతితో
మది మదినుండ నీసుతుడు మంత్రులు సౌబలు జూదమార్చి సం
పదఁగొని యంతఁ బోవక సభన్ ద్రుపదాత్మజ భంగ పెట్టరే.

వక్త తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఏ క్రమంలో చెప్పాలో, ఏ అంశాని కెంత ప్రాధాయమిచ్చి మాటాడాలో ముందే నిర్ణయించుకుంటాడు. అంతే కాకుండా తాను ఉద్దేశించిన ప్రయోజనానికి అనుగుణంగా ఆయా అంశాలను ఎలా వ్యాఖ్యానించాలో కూడా నిర్ణయించుకోవటం వక్త ప్రతిభకు ఒరగల్లు. రాజసూయం దుర్యోధనుని అసూయకు కారణమయ్యింది. అది జూదానికి దారి తీసింది. జూదం ద్రౌపదీ పరాభవానికి, అది మహాభారత యుద్ధానికీ కారణమయ్యింది. అని చెప్పవచ్చు. అంటే మహాభారత సమరానికి బీజాలు రాజసూయం నాడే పడినాయి. అట్టి రాజసూయాన్ని ధృతరాష్ట్రుని పేరు, పెంపు వృద్ధి చేయటానికే ధర్మరాజు చేశాడని చెపుతున్నాడు కృష్ణుడు. ధర్మరాజు తన కీర్తి కొరకో, చక్రవర్తిత్వాన్ని కాంక్షించియో, లేక తన తండ్రికి పుణ్యలోకాలు ప్రాప్తించటానికో రాజసూయం చేసి ఉంటాడు. భూపతి సమాజమంతా ధృతరాష్ట్రుఁ గొల్వఁజేయటానికే దిగ్విజయం చేశాడట ధర్మరాజు. అట్టి ధర్మరాజు చేత జూదమాడించి నీ కొడుకులు సర్వసంపదలు హరించి, అంతటితో ఊరుకోకుండా నిండు సభలో ద్రౌపదిని పరాభవించి, వారిని అడవులకు పంపినారు. దానికి నీవు కూడ అంగీకరించావు. అయినా ధర్మరాజు అన్నింటిని ఓర్చి సంధి కోరుతున్నాడు. అతని శాంతం, వినయం, గౌరవం ఏ రాజులో ఉంది? అతనికతడే సాటి. అంటూ వ్యాఖ్యానిస్తూ తన విషయ వ్యాఖ్యాన నైపుణ్యాన్ని, ప్రదర్శనశక్తి ప్రాగల్భ్యాన్ని చూపించినాడు కృష్ణుడు. చెప్పవలసినదంతా చెప్పి కార్య నిర్ణయ భారాన్ని ధృతరాష్ట్రుని మీదే మోపుతూ చివరకు తన ఉపన్యాసాన్ని ఈ విధంగా ముగిస్తున్నాడు.

వారలు శాంతశూరులు భవచ్చరణంబులు గొల్వఁ బూని యు
న్నారటు గాక మీకది మనంబున కప్రియమేని నింతకుం
బోరికి వచ్చుచుండుదురు భూవర! రెండు తెఱంగులందు నీ
కారయఁ బథ్యమేది యగు నవ్విధ మేర్పడ నిశ్చయింపుమా.

నీ తమ్ముని బిడ్డలైన పాండవులకు వారి రాజ్యభాగం వారికిస్తే శాంతులై నీ పాదాలను గొల్వటానికి సిద్ధంగా ఉన్నారు. అది నీకిష్టం కాకపోతే శూరులైన వారు యుద్ధానికి సన్నద్ధులయ్యే ఉన్నారు. ఈ రెండు పద్ధతులలో నీకేది పథ్యమో నీవే నిర్ణయించుకో వలసింది అని ధృతరాష్ట్రునకే కార్య నిశ్చయాన్ని ఒదిలివేయటం జరిగింది. ఈ పద్యం ప్రారంభంలో ఉన్న శాంతశూరులు మనోజ్ఞమైన విచిత్ర విరోధాభాస సమాసం. పద్యభావమంతా ఈ పదబంధం లోనే సూచింపబడింది. శ్రీకృష్ణుడు చేసిన ఈ మహోజ్వలమైన ప్రసంగం సభలోని సదస్యులపై ఎటువంటి ప్రభావాన్ని కలిగించిందో ఈ క్రింది పద్యంలో మనోజ్ఞంగా వర్ణించబడింది.

అనవుడు రోమహర్షణము లంగములం బొడమన్ సదస్యు లె
ల్లను బ్రియమంది నెమ్మనములం బురుషోత్తముఁ డింత యొప్పఁ బ
ల్కునె మఱు మాటలాడ నయకోవిదుఁ డెవ్వడు ధీరుడెవ్వఁ డిం
దనువరి యెవ్వఁడంచు నచలాకృతులై నెఱి నూరకుండగన్.

ఆ స్థితిలో జామదగ్న్యుడు, కణ్వుడు, నారదుడు అనే ముగ్గురు మునీంద్రులు ‘కృష్ణుని మాట విని కౌరవ కులాన్ని రక్షింపు’మని దుర్యోధనునకు హితోపదేశం చేశారు. దానిని విన్న గాంధారేయుడు రాధేయుని చూచి చేయప్పళించి నవ్వి వీరలింత వెఱ్ఱులగుదురే యని పలికి వారల వైపు తిరిగి ఇలా అన్నాడు.

మునులార నన్ను విధి యే
మనిమును పుట్టించె నట్టులయ్యెడుఁ గాకీ
వినఁజవి గాని పలుకులకుఁ
బని గలదే యుడుగు డింక బహుభాషణముల్.

విధి ప్రేరణ చేతనే ఇతడీవిధంగా మాట్లాడినాడా అన్నట్లు పలికాడు సుయోధనుడు. వీని దుర్మానానికి, మూర్ఖత్వానికి, అవధి ఏముంది? ఇంతవరకు ధృతరాష్ట్రుడు మౌనాన్నే వహించాడు. శ్రీకృష్ణుడు కార్యం నీవశమే, సంధియో, సమరమో నిశ్చయించవల్సింది నీవే అంటున్నాడు. మునుల హితోపదేశాన్ని పెడచెవిని పెట్టటమే కాకుండా వారిని అపహసించి దురభిమానంతో మూర్ఖంగా సమాధానం చెపుతున్నాడు దుర్యోధనుడు. ఇట్టి స్థితిలో అతనికి మౌనముద్ర వదిలి పెదవి కదల్చక తప్పలేదు.

మీరు సెప్పిన బుద్ధులు గారవమునఁ
జేయగాంచినఁ బుణ్యంబు సేయనెట్లు
వా ముఖంబునఁ గార్యంబు నడవదేమి
సేయువాడ నొండెద్దియుఁ జెప్పలేదు.

“తెఱగు నీ వసమున యదియ” అని శ్రీకృష్ణుడంటే “నాముఖంబున కార్యంబు నడవదేమి సేయువాడ” అని చేతులు కడుగుకోవడం గమనింపదగిన విశేషం. ఆ తరువాత శౌరితో “అనఘా! నీవు ఇహము పరము కలిగే విధంగా చెప్పావు. కాని నీవు చెప్పినట్లుగా కార్యాన్ని నడపడానికి నాకు చనవు అనువు లేదు. ఎందుచేతనంటావా? నా కొడుకు మందబుద్ధి. నీవు మాకు పోరాని చుట్టానివి. మహానుభావుడవు. దయార్ద్ర చిత్తుడవు. ఎలాగైనా ఈ మందబుద్ధిని అనునయించి చక్కదిద్దు” అని భారాన్ని శ్రీకృష్ణుడిపై పెట్టినాడు. చెప్పలేదని నన్ను అనటం దేనికి, నీవే చెప్పి చూడు అన్నట్లుగా ఉంది. “నన్ను విధి ఏమని మును పుట్టించెనట్టు లయ్యెడు గాక ఈ విన చవిగాని పలుకులకు పనిగలదా” అని పలికిన దురభిమానం గల దుర్యోధనుని చక్కదిద్దటం అసాధ్య కార్యమని ధృతరాష్ట్రునకు, కృష్ణునకు, ఇద్దరకూ తెలుసు. అయితే ‘సుతువాడు’ కొడుకు వలచినట్టి వాడు అయిన ధృతరాష్ట్రుడు అట్టి వ్యర్థప్రయత్నానికి పూనుకోడు. భారతంలో అతని పాత్రను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం విశదమవుతుంది. కాని పురుష ప్రయత్నాన్ని పూర్తిగా చేయటానికి వచ్చిన శ్రీకృష్ణుడీ కార్యానికి పూనుకోకుండా ఎలా ఉంటాడు? అందుచేత సుయోధనునకు హితోపదేశం చేయటనికే నడుం కట్టాడు. ఇంతకు ముందు కృష్ణుడు సభ నుద్దేశించి ప్రసంగించాడు. దాని ప్రయోజనము, పద్ధతి వేరు. సదస్యులను సమ్మోహింపజేసే వాక్యవైఖరితో అది సాగింది. ఇప్పుడు దుర్యోధనునితో చేసిన ప్రసంగం అటువంటిది కాదు. ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడింది. దీని ప్రయోజనము, పద్ధతి వేరు. యుక్తియుక్తంగా మాట్లాడి, నచ్చచెప్పే తీరులో ఇది సాగుతుంది. “విమలతరమైన భరతవంశంలో జన్మించావు. నీకు దురాగ్రహం తగదు. నీ వారందరినీ చెడుమార్గం పట్టకుండా చూసుకో. అల్పబుద్ధుల పెడమాటలు చెవి యొగ్గి వినకు. దానివల్ల దోషం, కీడు కలుగుతుంది. పాండిత్య శౌర్య నిత్యులైన పాండుపుత్రులతో కలిసి బ్రదుకుట కురుముఖ్యుల కందరికీ సంతోషకరం. వారెల్లరూ కోరేది అదే పాండవులను గెల్వటం అసాధ్యం. యుద్ధమే జరిగితే నీకు కులనాశనం కలుగుతుంది. రాజుకు కులనాశనుడనే నింద మేలు కాదు. పాండవులతో కలిసి బ్రదుకు. అది ఏ విధంగా నంటావా-

రాజ్యము భారమెల్ల ధృతరాష్ట్రుని యందె వెలుంగుచుండఁ ద
త్పూజ్య కుమార పట్టమునఁ బొల్చి చరింపగ నీవు పాండవుల్
సజ్యతఁ దండ్రి చిత్తము ప్రసన్నతఁ బొందగఁ గొల్చి యుంకి సా
మ్రాజ్యముగాఁ దలంతురను రక్తమతిం దమకున్ ధరాధిపా.

రాజ్యభారమంతా ధృతరాష్ట్రుని యందే వెలుగొందగా నీవు పాండవులు కుమారపట్టమున ప్రకాశిస్తూ ఉంటే మీ తండ్రి మనస్సుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అప్పుడు మీ రాజ్యాన్ని సామ్రాజ్యంగా భావించి రాజులంతా అనురాగంతో మిమ్ములను సేవిస్తారు. అని కురుపాండవులు కలిసి జీవించ వలసిన పద్ధతిని శ్రీకృష్ణుడు చాల చక్కగా సూచించాడు.

భీష్మ ద్రోణులు దుర్యోధనుని చక్క దిద్దటానికి ఎన్నో మార్లు ప్రయత్నించి విఫలులయ్యారు. అతని దురభిమానాన్ని దుర్బుద్ధిని మాన్పటం వారికి శక్యం కాలేదు. కృష్ణు డప్పుడు కౌరవ సభలో ‘దక్షులెవ్వార లుపేక్ష చేసిరది వారల చేటగు’ అంటున్నాడు. మేము ఉపేక్ష చేయలేదు. చేయవలసినంత ప్రయత్నం చేస్తూనే ఉన్నామని తెలియ జేయటానికి భీష్మ ద్రోణులిద్దరు మరల సుయోధనునకు హితోపదేశం చేశారు. ఇందరు కొడుకుకు బుద్ధులు చెపుతున్నా తాను నోరు మెదపక పోవడం బాగుండదనుకున్న ధృతరాష్ట్రుడు దుర్యోధనుని వైపు తిరిగి “ఈ హరి నాశ్రయించి నీ అన్న అయిన అజాత శత్రుని దర్శించు. దీనివల్ల మన పనులన్నీ చక్కబడతాయి. కృష్ణుని మాట వినకపోతే చివరకు అంతా కీడే జరుగుతుంది” అన్నాడు. ఇది సభలో ఉన్నవారి కోసం చేసిన హితోపదేశమే కాని దుర్యోధనుని మనస్సు మార్చటానికి చేసిన ప్రయత్నం మాత్రం కాదు. అయినా దీనినే ఊతంగా తీసుకొని భీష్మ ద్రోణులు మరల దుర్యోధనునకు గట్టిగా కర్తవ్యాన్ని బోధించారు. ఆ మూర్ఖునకు ఈ పలుకులు తల కెక్కుతాయా? అతడు కృష్ణుని చూసి ఈ విధంగా అన్నాడు. గురువు, తండ్రి, తాత ఎప్పుడూ నన్నే నిందిస్తారు. ఇప్పుడు నీవూ నన్నే నిందిస్తున్నావు గాని న్యాయమాలోచించవేమిటి? పాండవులను అకారణంగా కష్టాల పాలు చేశానంటున్నారు. ఆలోచించి చూస్తే అందులో నా తప్పేమైనా ఉందా? ధర్మరాజు శకునితో జూదమాడి ఓడిపోయాడు. దానిలో నా బాధ్యత ఏముంది? అతడే దారిని పడినా తన ఇష్టంతోనే పడ్డాడు. నా చిన్నతనంలో తెలియనప్పుడు తండ్రి తాత వారికి రాజ్యభాగమిస్తే ఊరుకున్నాను గాని ఇప్పుడు మరల అలా చేస్తే నే సమ్మతిస్తానా? నా నిశ్చయాన్ని చెప్తున్నా విను.

ఏ మును వారు పంచుకొని యేలుట గల్గదు పల్కకుండు మిం
కేమియు వాడిసూది మొన యించుక మోపిన యంత మాత్రమున్
భూమి యొనర్చి పాండు నృప పుత్రుల కిత్తునె యెవ్వరైన సం
గ్రామమునన్ జయంబు గొని రాజ్యము సేయుట నిశ్చయించితిన్.

మేము పాండవులు రాజ్యాన్ని పంచుకొని పాలించటం జరగదు. ఈ విషయాన్ని గురించి నీవు మాటాడ వద్దు. వారికి వాడిసూదిమొన మోపిన నేల కూడా ఇవ్వను. ఎవరినా యుద్ధంలో జయాన్ని పొంది రాజ్యాన్ని పాలించుకోవటమే కార్యంగా నిశ్చయించాను – అని పలుకుతూ ఉన్న దుర్యోధనుని ధోరణి ఎవరికైనా కోపాన్ని తెప్పించేది గానే ఉన్నది. పెనుకోపం రావలసిన స్థితిలో కృష్ణుడు కినుకతో కూడిన నవ్వు నవ్వినాడు. ఆ నవ్వు ముఖానికొక కొత్త అందాన్ని ఇచ్చింది. అతనిలో ఏమాత్రం ఉద్రిక్తత లేదు. ఏ కొంచం కూడా గాంభీర్యం సడలలేదు. కాని ఆ చిరునవ్వులో తృణీకారభావం, అపహాస్యం తొంగి చూస్తూనే ఉన్నాయి. కౌరవుల నాశనం తప్పదు. దానికింక ఆలస్యం లేదు అని ధ్వనించేటట్లుగా “మొన తలబడియెదు నీ చెప్పిన యట్టుల, తడవు లేదు” అంటూ ప్రౌఢంగా పలుకుతాడు. దుర్యోధనుని దుర్ణయాల నన్నింటిని ఉగ్గడించుతూ కినిసి, జంకించి మాటాడుతాడు.

ఇది కృష్ణుడు కౌరవసభలో చేసిన మూడవ ప్రసంగం. కోపించి దుర్యోధనుని దుష్కార్యాల నన్నింటిని తీవ్రధోరణిలో ఎత్తి చూపిస్తూ సదస్యుల కతనిపై వైముఖ్యాన్ని పాండవులపై సానుభూతిని కలిగేటట్లు చేసి అతడు కటకటపడే విధంగా సాగింది. ఈ స్థితిలో దుశ్శాసనుని ప్రోత్సాహంతో దుర్యోధనుడు దిగ్గున లేచి సభ నుండి నిష్క్రమించాడు. ఒక్కసారి కొలువంతా సంచలించిపోయింది. అతని వెనుక కర్ణుడు, తమ్ములు, శకుని, మిత్రులైన రాజులు నడచారు. సభాగౌరవాన్ని ధిక్కరించి కనీస మర్యాదను కూడ విడిచి కొలువు వెడలిన సుయోధనుని చూచి గాంగేయుడు “ఇతడు క్రొవ్వి రాజుననే వృథాబిమానంతో మతి చెడి లోభ మోహ మదమాత్సర్యాలు తన్ను త్రిప్పగా ఇట్లసంగతంగా ఎందుకు వెళ్ళాడు. వెనుక వెళ్ళిన రాజులంతా ఏమనుకొని వెళ్ళారు” అని కృష్ణుని వైపు తిరిగి “ఈ రాజుల కందరకూ కాలం పక్వమయ్యింది” అన్నాడు. కృష్ణుని రాయబారం చివరి ఘట్టానికి చేరింది.

ధృతరాష్ట్రుడు “నా ముఖంబున కార్యంబు నడవదేమి సేయువాడ” అంటూ తన అశక్తతను వెల్లడించి కార్యనిర్ణయము చేయవలసింది తన కొడుకేనని సూచించాడు. ఆ దుర్యోధనుని దురభిమానం, దుర్ణయం, దుర్బుద్ధి ఎటువంటివో సభలోని వారందరికీ స్పష్టంగా తెలిసింది. సంధికి ఏ పరిస్థితి లోను అంగీకరించడనే సంగతి కూడ తేటతెల్ల మయ్యింది. అతని మనస్సు మార్చగల సామర్థ్యం కూడ ఎవ్వరికీ లేదని తేలిపోయింది. కురుపాండవులు శాంతిగా జీవించటానికి దుర్యోధను డొక్కడే ప్రతిబంధకం అనే విషయం సదస్యుల కందరికీ స్పష్టమయ్యేటట్లు శ్రీకృష్ణుడు కార్య విధానాన్ని నడిపించాడు. కొడుకు ముఖ్యమో, కులము ముఖ్యమో తేల్చి చెప్పవలసిన పరిస్థితిని ధృతరాష్ట్రునకు కల్పిస్తున్నాడు కృష్ణుడు. కొడుకును కాదని కులాన్ని రక్షించుకుంటాడా? కొడుకును కాదనలేక కులాన్ని నాశనం చేసుకొని కులనాశనుడనే పేరు తెచ్చుకుంటాడా? కులమే కాదు సర్వ నాశనం జరిగినా కొడుకును కాదనే శక్తి ధృతరాష్ట్రునకు లేదు. అతని పుత్రవ్యామోహ మట్టిది. కొడుకు సంగతి సభకు వెల్లడయ్యింది. ఇక తండ్రి స్వరూపాన్ని బయట పెట్టవలసి ఉంది. దానికై కృష్ణుడు సభలోని వారి నుద్దేశించి ఈ విధంగా అంటున్నాడు.

ఈ దుర్యోధనుఁడింత గర్వి యగునే యీయున్న వారెల్ల నా
చే దైన్యంబునఁ బొందుటొప్పదని చర్చింపండ ఈ భంగికిన్
లేదే యొండు దెఱంగు సత్కులముఁ బాలింపంగ వర్జింప రా
దే దుష్టత్మకు నీచు నొక్కరునిఁ బొదే భేద మీ జాతికిన్.

“ఈ దుర్యోధనుడింత గర్వి అవుతాడా? ఇక్కడున్న వారంతా బాధ పడతారని కూడా ఆలోచింపడా? దీనిని చక్కదిద్దటానికి వేరు దారి లేదా?” అంటూనే “సత్కులాన్ని రక్షించటానికి దుష్టుడు నీచుడు అయిన వాని నొక్కని విడిచిపెట్టరాదా? దానితో భరత జాతికి భేదభావం పోదా?” అని చెప్పి, “అటువంటిది అపూర్వ విషయం కాదు. వీద్యుడు దుర్మాంసాన్ని కోసినట్లు నేను కంసుని సంహరించి ఆ కులాన్ని ఉద్ధరించటం మీకు తెలియదా? అదే విధంగా మీరూ చేస్తే బాగుండదా? అలా చేస్తే ఆపదలన్నీ తీరిపోతాయి. వంశగౌరవం అధికమవుతుంది. కురుపాండవులు కలిసి జీవించుతారు. ఈ పద్ధతి మీకు తగింది కాదా?” అని పలికిన కృష్ణుని మాటలు విని ధృతరాష్ట్రుడు అదిరి పడ్డాడు. అతని నెత్తిపై పిడుగు పడినట్టయ్యింది. సభలోని వారు దుర్యోధనుని వర్జింపమని చెప్పితే తన గతి ఏమి కాను? దుర్యోధనుడు లేని లోకం అతనికి శూన్యం కదా! ఆ స్థితి నుంచి బయట పడటానికి విదురుని పంపి గాంధారిని సభకు రప్పించి, ఆమె చేత కొడుకుకు హితబోధ చేయించుతాడు. వానికి తల్లి మాటలు తలకెక్కుతాయా? గాంధారి చెప్పిన హితాన్ని పెడచెవిన బెట్టి మరల సభ నుంచి పోయి కర్ణాదులతో కలిసి దురాలోచన చేయటానికి పూనుకున్నాడు. శ్రీకృష్ణుడు గురుభీష్ములను కూర్చుకొని తమను పట్టటానికి ప్రయత్నిస్తున్నాడు. మనమే అతనిని పట్టి బంధించితే కార్యం తీరిపోలేదా? దీనితో పాండవులకు దిగులు పుడుతుంది. యుద్ధం మాటే ఎత్తరు. ఒకవేళ ఎత్తి వచ్చినా వారిని తేలికగా నిర్జింపవచ్చు. కోరలు తీసిన పాములు ఏమి చేస్తాయి. అని దుష్టచతుష్టయం దుర్మంత్రం చేసి హరిని బంధించటానికి ప్రయత్నం ప్రారంభించారు. దానిని గుర్తించి సాత్యకి, జనార్దనునకు ఆవిషయం తెలిపి, అతని అనుమతితో కౌరవేశ్వర, బాహ్లిక, భీష్మ విదురులకు దానిని తెలిపాడు. అప్పుడు విదురుడు అదిరిపడి ధృతరాష్ట్రునకా విషయం ఒత్తి చెపుతాడు. తాను వచ్చిన పని ముగిసిందన్నట్లు ధృతరాష్ట్రుని వద్ద సెలవు తీసుకుంటూ శ్రీకృష్ణుడీ విధంగా అంటాడు.

రోషము నాపయిం గలిగి క్రూరతఁ గౌరవు లింతసేత సం
తోషమ నీవు ప్రాభవముతోఁ దగ నాకు ననుజ్ఞ యిమ్ము ని
ర్దోషత నేను నోపుగతి దోర్బల దుర్జయులైన వారి వి
ద్వేషమ్య్ఁ జక్కబెట్టి జగతీవర యింతకు పోయి వచ్చెదన్.

అతని రాయబార కార్యం ఇంచు మించుగా ముగిసినట్లే. రాజు దగ్గర సెలవు కూడా తీసుకున్నాడు. ధృఅతరాష్ట్రుడు విదురుని పంపి, దుర్యోధనుని అతని పరివారాన్ని సభకు రప్పించి, తాను, విదురుడు వానిని గట్టిగా మందలించుతారు. ఆ స్థితిలో కట్టెదుర ఉన్న సుయోధనుని చక్కగా చూచి కృష్ణుడు “నేనొక్కడనే నని తలంచి దుర్మదంతో బంధించటానికి ఉత్సాహం చూపావా?” అంటూ చిరునవ్వు నవ్వి విశ్వరూపాన్ని చూపించాడు. ఈ విశ్వరూప ప్రదర్శనంతో శ్రీకృష్ణుని రాయబారం ముగిసింది. విశ్వరూపాన్ని సందర్శించిన తరువాత కూడ దుర్యోధనుని మనస్సులో మార్పు రాలేదు. విధి నియతి ఎంత బలీయమైనదో దీనివల్ల స్పష్టమవుతుంది. కృష్ణుడు కురుపాండవులకు సంధి చేసి సర్వజన క్షయం కాకుండా ఉండటానికి చేయవలసినంత పురుష ప్రయత్నాన్ని చేసి చివరకు తన దివ్యమైన విశ్వరూప ప్రదర్శనంతో తన రాయబార కార్యాన్ని ముగించటం వల్ల దీనికొక గాంభీర్యం, ఔజ్జ్వల్యం చేకూరినాయి.

ఉద్యోగ పర్వంలోని ఈ మూడు రాయబారాలు మూడు విభిన్నమైన రీతులలో తీర్చిదిద్దబడి కవి ప్రజ్ఞా ప్రాభవానికి నికశోపలాలై ఒప్పినవనటంలో సందేహం లేదు. దేని ప్రత్యేకత దానిదే. మొదటిది ద్రుపద పురోహితుని రాయబారం. విప్రుని చేత నిర్వహించబడింది. వేదాధ్యయన సంపన్నుడయిన విప్రుడు రాయబారాన్ని నిర్వహించితే ఏ విధంగా ఉంటుందో దీనివలన తెలుసుకోవచ్చు. మనసులో మాయ, మర్మం లేకుండా ఎదుటివారి ముఖం మీద కుండ బ్రద్దలు కొట్టినట్లు మాట్లాడటం విప్రుని లక్షణం. “నిండు మనంబు నవ్యనవనీతమానము పల్కు దారుణాఖండలశస్త్రతుల్యము” అన్నాడు కదా ఆదికవి. ఈ లక్షణమే ఈ రాయబారంలో గోచరిస్తుంది. తిక్కన పాత్రల స్వభావాలను ఇతర పాత్రల ప్రసంగాలలో సూచించిన విధంగానే ఈ మూడు రాయబారాలను పాత్రల ముఖంగా సమీక్షిస్తాడు. వీటిని చక్కగా అవగాహన చేసుకోవటానికి అవి సూత్రప్రాయంగా (clue) ఉపకరిస్తాయి. ద్రుపద పురోహితుని రాయబార నిర్వహణ విధానం భీష్ముని ముఖంగా ఈ విధంగా సమీక్షించబడింది.

నీ వాక్యము విప్ర స్వా
భావికమై యిట్లు శ్రుతికిఁ బరుషంబయినన్
భావింపఁ గార్యమున యం
దేవిధమున సభకు నింత నిష్టంబగునే.

పురోహితుని మాటలు చెవులకు పెళుసుగా ఉన్నా ఆలోచించితే చెప్పిన కార్యపద్ధతి సభకు చాలా ఇష్టంగా ఉంది అన్నాడు భీష్ముడు. ఇతని వాక్యాలు శ్రుతికి పరుషంగా ఉండటానికి కారణం విప్రస్వభావం. విప్రుని పల్కులు దారుణాఖండల శస్త్రతుల్యాలు కదా. ఈ రాయబారం యొక్క ప్రధాన లక్షణం పారుష్యమని తిక్కన్న గారే సూచించటం గమనింపదగిన ముఖ్య విశేషం.

మహారాజనీతివేత్తచే నిర్వహింపబడినది రెండవ రాయబారం. సంజయుడు ప్రాజ్ఞుడు. జాతి చేత సూతుడైనా రాజనీతిలో ధర్మజాదులకు దీటు రాదగినవాడు. ప్రభుభక్తికి మారుపేరు సంజయుడు. తన ప్రభువైన ధృతరాష్ట్రునికై తన సర్వాన్ని త్యాగం చేయటానికి వెనుదీయని విశ్వాసపాత్రుడైనా విశిష్ట రాజభక్తిపరాయణుడు. తన జీవితాన్ని ధృతరాష్ట్రుని సేవకై అంకితం చేసినవాడు. అతనిని నీడలా అనుసరించినవాడు. అతడు హస్తినాపురంలో ఉన్నప్పుడే గాక ఆశ్రమవాసంలో కూడా అనుసరించి జీవితాంతం తన ప్రభువును సేవించినవాడు. అంధుడైన ధృతరాష్ట్రునకు సంజయ విదురిలిద్దరు రెండు కళ్ళు. ఇద్దరూ సమస్త శాస్త్ర పారంగతులు. పవిత్ర జీవితం గడిపిన వారు.

ధృతరాష్ట్రుని కౌటిల్యాన్ని, అధర్మ మార్గాన్ని ఎప్పుడూ ఆమోదించినవారు కారు. అతనిని ఆ మార్గం నుండి మళ్ళించటానికి నిరంతరం ప్రయత్నించిన వారు. ఇద్దరికీ రాజు దగ్గర చనువు మిక్కుటమే. అయితే అందులో భేదం లేకపోలేదు. అన్న దగ్గర తమ్మునకు, రాజు దగ్గర మంత్రికి ఉండేటటువంటిది విదురునిది. ఆంతరంగికుడు, విశ్వాసపాత్రుడు అయిన సేవకునకు రాజు దగ్గర ఉండే చనువు సంజయునిది. ఈ సంజయుని రాయబారిగా నిర్ణయించటం లోనే ధృతరాష్ట్రుని మేధాశక్తి వ్యక్తమవుతున్నది. రాజ్య భాగం లేకుండానే నేరిమి మాటలతో అలుకలన్నీ దీర్చి సంధి చేసుకుని రమ్మని సంజయుని పంపటంలో గ్రుడ్డిరాజు కౌటిల్య మెంతటిదో అర్థమవుతూ ఉంది. ఇట్టి రాయబారాన్ని నడిపింపడం సంజయుని వ్యక్తిత్వానికి విరుద్ధమైనది. అయినా తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మరుగు పరిచి, తన ప్రభువు కోసం కుటిలమైన రాయబారాన్ని నడపటానికి పూనుకొని ధర్మరాజు వంటి వానిని ఢీకొని ఎంతో చాతుర్యంతో తన కార్యాన్ని సాధించుకొని వచ్చిన వాడు సంజయుడు. హస్తినాపురికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని ఏకాంతమందిరంలో దర్శించినప్పుడు అంతవరకు ఉగ్గబట్టిన అతని వ్యక్తిత్వం ఒక్కసారి బయటపడింది. ఈ సన్నివేశాన్ని పరిశీలిస్తే సంజయుడు ఎటువంటివాడో, ధృతరాష్ట్రుని, కురుపాండవులను ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో, రాజు దగ్గర అతనికున్న చనువు ఎటువంటిదో కార్య విధానంలో ఉన్న కీలకాన్ని అతడు ఎంత అర్థం చేసుకున్నాడో స్పష్టమవుతుంది. తన రాయబార ఫలితాన్ని సూచనా మాత్రంగా చక్కని రీతిలో ఈ విధంగా తెలుపుతాడు.

మానుషశక్తి యొల్లడు సమంచిత దైవమ యూదియుండు నీ
పైన నతండు పుణ్యమును పాపముఁ బెట్టిన వాడు నీవు నీ
సూను వశంబ కాని యొక చొప్పుఁ దలంపవు కర్ణ సౌబలా
ధీనము కార్య నిశ్చయము దెల్లము నీమత మొప్పదేమియున్.

ధర్మరాజు మానవశక్తిపై ఆధారపడి లేడు. దైవం మీదే భారం వేశాడు. అంటే శ్రీకృష్ణుని మీద కార్య భారాన్ని మోపాడు. అతడు పాపమో పుణ్యమో కార్య నిర్ణయ భారాన్ని నీమీదే ఉంచాడు. నీవా నీ కొడుకు మాటకు కట్టుబడి ఉండేవాడివే గాని స్వబుద్ధి ఉపయోగించవు. పోనీ నీ కొడుకు తన బుద్ధి మీద ఆధారపడినవాడా? కాదు. కర్ణ శకునులు ఏది చెపితే అది చేసేవాడు. కార్య నిశ్చయము కర్ణసౌబలాధీనం కావటం స్పష్టమైన విషయం. అది మంచి పద్ధతి కాదు. అని అసలు విషయాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ఎంతో చక్కగా చెప్పాడు. కురు పాండవుల కలహాన్ని, అందులో ధృతరాష్ట్రుని పాత్రను చెపుతూ ధర్మరాజు అవలంబించే కార్యపద్ధతిని ఇలా వివరిస్తాడు.

అనయము పుట్టె జూదమున యప్పుడ యెంతయుఁ జిచ్చువెట్టి కా
ల్చినయది నీయుపేక్షయ వశీకృత చిత్తుడు ధర్మసూతి మె
త్తని పులి యెల్లవారలు నధర్మము నీ పయిఁ బెట్టునంతకున్
వినడును గానడుం బిదప నీకును నాకు మరల్ప వచ్చునే.

సంజయుడు రాయబారాన్ని ఎంతో నేర్పుతో నిర్వహించి తిరిగి వచ్చిన తరువాత అక్కడి స్థితిని సూక్ష్మబుద్ధితో విశ్లేషించి సూత్రప్రాయంగా ధృతరాష్ట్రునకు ఏకాంతమందిరంలో నివేదించి మరునాడు కురుసభలో విషయాన్ని అంతా వివరిస్తాడు. సంజయుడు నిర్వహించిన రాయబారం తీరు ధర్మరాజు ముఖంగా ఇలా సమీక్షించబడింది. ధర్మరాజు సంజయునితో ఈవిధంగా అంటాడు.

ఎదురున్న రూపు వలుకగఁ దుది కటకటఁ బడవు నీవు దుర్ణయమును బే
ట్టిదమును బెండును నగుపలు కొదవదు నీ నాలుకకు నయోన్నత యెప్పుడున్
నీవొండె విదురుండొండెను గావలయుం గాక యిట్టి కార్యంబులకున్
రా వేఱె కలరే తగువారీ వినయము నేర్పు గలదె ఇతరుల కెందున్.

ఈ ధర్మరాజు మాటలని పరిశీలించి చూస్తే సంజయరాయబారం లోని ప్రధాన గుణం చాతుర్యమని తిక్కన్న గారే సూచించారు.

మూడవ రాయబారం జగన్నాటక సూత్రధారి యయిన శ్రీకృష్ణుడు నిర్వహించినది. కురుక్షేత్ర సంగ్రామం జరగటం విధినియతి అని తెలిసిన భగవానుడు కురుపాండవులకు పొందు కుదర్చటానికి పురుష ప్రయత్నమంతా చేసిన రాయబారమిది. దీని నిర్వహణ పద్ధతి ఇట్టిదని చెప్పి ఒప్పించటం మానవులకు సాధ్యమయ్యేది కాదు. అందుచేత తిక్కన్నగారు శ్రీకృష్ణుని ముఖంగానే దీనిని సమీక్షించటం ఉచితమని భావించారు. కౌరవ సభనుండి తిరిగి వచ్చిన తరువాత శ్రీకృష్ణుడు తాను రాయబారం నిర్వహించిన తీరును సూత్రప్రాయంగా ధర్మరాజుకు ఈ విధంగా వివరించుతాడు.

“ఏనును నా యోపినంత సామవాదంబు లాడితి. నారదాది మహామునులను సుయోధనునకు బుద్ధులు సెప్పునట్లు సేసితి. ఏమి సెప్పినను నెంతటం బోకున్నం గినుక దెచ్చికొని జంకించియు భంగించియు ధిక్కరించియుఁ దృణీకరించియుం జూచితి. కార్యంబు భగ్నంబగుట కొల్లక వెండియు శాంత వచనంబులు పలికితి. అతం డశక్తత దుర్జనత సేయం జూచిన నమానుషంబులగు వానిం గొన్ని వెడమాయలం బన్ని పెక్కు పోకలం బోయితి. ఎన్ని భంగుల సంధియ కావలయునని పొరలం గలయంతయుం బొరలితి. అప్పాపాత్ముం డెట్లునుం జక్కంబడక రాజ్యంబు పాలిచ్చువాడు గాడు. కౌరవుల యెడ దండంబు దక్క నొండుపాయంబు లేదు.”

ఈ వాక్యాలను సూత్రాలుగా గ్రహించి కృష్ణుని రాయబారాన్ని పరిశీలిస్తే దాని నిర్వహణ విధానం విశదమవుతుంది. కృష్ణరాయబారం లోని ముఖ్యలక్షణం ఔజ్జ్వల్యమని విమర్శకుల అభిప్రాయం. మొదటి రెండు రాయబారాలు తిక్కన్న భారత భారతికి ఎత్తిన మణిదీపాలు. కవిబ్రహ్మ కవితాసరస్వతికి వెలకట్టలేని మణికిరీటం శ్రీకృష్ణుని రాయబారం.
--------------------------------------------------------
రచన: పొట్లూరి నారాయణదాసు, 
ఈమాట సౌజన్యంతో

No comments: