Monday, February 18, 2019

జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4


జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4



సాహితీమిత్రులారా!

సైంటిస్టులకీ జ్యోతిష్కులకీ మధ్య పరస్పర అపనమ్మకాలు
సైంటిస్టులూ, భౌతికవాదులూ చాలామంది జ్యోతిష్కులు మోసగాళ్ళనీ, లేదా భ్రమల్లో జీవించే మూర్ఖులనీ భావిస్తూ ఉంటారు. జ్యోతిష్కులు కూడా సైంటిస్టుల్ని కళ్ళముందు కనపడుతున్న సత్యాన్ని చూడలేని గుడ్డివాళ్ళనీ, ఉద్దేశ్యపూర్వకంగా నిజాల్ని వక్రీకరిస్తారనీ, జ్యోతిషం లాంటి ఖచ్చితమైన శాస్త్రాన్ని కూడా అవగాహన చేసుకోలేని మూర్ఖులనీ భావిస్తూ ఉంటారు. జ్యోతిష్కుల్లో అత్యధికులు భౌతికవాదాన్ని నిరాకరిస్తారు. అధిభౌతికమైన ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉంటారు – అంటే పునర్జన్మ, కర్మ మొదలైన విషయాల్ని నమ్ముతారు. భౌతికం కాని ఏదో ఒకానొక శక్తి ద్వారా గ్రహాలు జీవుల్ని ప్రభావితం చేస్తున్నాయని నమ్ముతారు. సహజంగానే భౌతికవాదులు ఈ విధమైన నమ్మకాల్ని నిరాకరిస్తారు. అందుచేత వీళ్ళ ఘర్షణ చాలా మటుకు రెండు విభిన్న దృక్పథాల మధ్య సంఘర్షణగా కనిపిస్తూ ఉంటుంది.

జ్యోతిషం ఖచ్చితంగా పనిచేస్తుంది అని అమాయకంగా నమ్మే రోజుల్లో నాకు ఒక సంగతి అర్థమయ్యేది కాదు. ‘దృక్పథం ఏదైనా కానీ. జ్యోతిషం ఎలా పనిచేస్తుందో మనకి ప్రస్తుతానికి తెలియకపోతే నష్టమేమిటి? అది ఖచ్చితంగా పని చేస్తుంది కదా. అసలంటూ అది పని చేస్తుంది అని సైంటిస్టులకి జ్యోతిష్కులు నిరూపించేస్తే చాలు కదా. ఎలా పనిచేస్తుందో వాళ్ళే కనుక్కుంటారు కదా.’ అనుకునేవాణ్ణి. అయితే అనేక మంది జ్యోతిష్కులతో చర్చించినమీదట నాకు క్రమంగా బోధపడిన విషయమేమిటంటే, జ్యోతిష్కులు జ్యోతిషం ఖచ్చితంగా పనిచేస్తుంది అని వాదిస్తారు గానీ, నిజంగా అలా పనిచేస్తుంది అని తామే నమ్మరు అని. జ్యోతిష్కుల్లో కూడా సైన్సుని నమ్మేవాళ్ళు, పచ్చి భౌతికవాదులు ఉంటారు. వాళ్ళు కూడా జ్యోతిషం నిర్ణయాత్మకం (Deterministic)గా పనిచేస్తుంది అని భావించరు. జ్యోతిషం పనిచేస్తుంది గానీ, అది నిర్ణయాత్మకం కాదు అంటారు. అది అంతా నాకు చాలా గందరగోళాన్ని కలిగించింది. అసలు జ్యోతిషం ఖచ్చితమే కాకపోతే ఇంక జ్యోతిష్కులు సైంటిస్టులకి నిరూపించగలిగేది ఏముంది? ఈ గందరగోళం గురించి కొంత వివరంగా తెలుసుకోవాలంటే కొన్నేళ్ళ క్రితం నాకు పరిచయమైన ఒక స్నేహితుడి గురించి చెప్పాలి.

ఒక కెనడియన్ జ్యోతిష్కుడి కథ
సుమారు ఏడు సంవత్సరాల క్రితం నాకొక కెనడియన్ జ్యోతిష్కుడు పరిచయమయ్యాడు. అతని పేరు మార్టిన్ బెర్జిన్స్. అతను జ్యోతిషం నిజమని నిరూపించడానికి ఒక ప్రయోగం చేశాడు. ఒక 42 మంది వ్యక్తుల్ని ఎన్నుకొని వాళ్ళ జన్మ వివరాలు తీసుకున్నాడు. అందులో ఒక్కొక్క వ్యక్తికీ రెండు జాతకాలు తయారు చేశాడు. ఒకటి సరైనది. ఇంకోటి తప్పుది. తొమ్మిదిమంది జ్యోతిష్కుల్ని కూడా ఎన్నుకుని ప్రతీ జ్యోతిష్కుడికీ కొంతమంది వ్యక్తుల జాతకాలు ఇచ్చాడు. జ్యోతిష్కులు జాతకులతో మాట్లాడవచ్చు. వ్యక్తుల జీవిత విశేషాల్నిబట్టి ఏ జాతకం సరైనదో జ్యోతిష్కులు నిర్ణయించాలి. అందులో 29 మంది వ్యక్తులకి సరైన జాతకాలు ఏవో జ్యోతిష్కులు కనుక్కోగలిగారు. 13 మందికి మాత్రం తప్పు జాతకాన్ని ఎంపిక చేశారు. అంటే డెబ్భై శాతం సందర్భాల్లో వాళ్ళు విజయవంతమయ్యారు అన్నమాట. రాండమ్ చాన్సు ప్రకారం అలా జరిగే అవకాశం (random probability) 0.00౦7 మాత్రమే.

తన ప్రయోగం యొక్క డేటాను మార్టిన్ అనేక సంవత్సరాలపాటు విశ్లేషించాడు. ప్రతీ జాతకానికీ అతను భూఅయస్కాంత క్షేత్ర విలువని జోడించి పరిశీలించాడు. ఆశ్చర్యకరంగా అతను కనిపెట్టినదేమిటంటే, జ్యోతిష్కులు విజయవంతంగా ఎన్నుకోగలిగిన జాతకాలకి జన్మ సమయంలో భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత (Geomagnetic activity) ఎక్కువగా ఉన్నదనీ, వాళ్ళు సరిగ్గా ఎన్నుకోలేకపోయిన జాతకాలకి తక్కువగా ఉన్నదనీ! దాన్నిబట్టి ఒక శిశువు పుట్టడానికి సుమారుగా పదిహేను రోజుల ముందు ఉండే భూఅయస్కాంత క్షేత్ర తీవ్రత శిశువు మెదడుని ప్రభావితం చేస్తూ ఉండి ఉండవచ్చు అనీ, దానివల్లనే జాతకాలు ఎంతవరకు పనిచేస్తాయో నిర్ణయమవుతున్నాయి అనీ అతను స్టాటిస్టిక్సు ప్రకారం పరిశోధించి ప్రతిపాదించాడు.

తన పరిశోధన ఫలితాల్ని అనేకమంది జ్యోతిష్కులకీ, సైంటిస్టులకీ అతను పంపించాడు. సెమినార్లలో పాల్గొని తన ప్రయోగాన్ని వివరించాడు. తన ప్రయోగం కేవలం ఒక చిన్న ప్రయత్నమనీ (pilot experiment), దీన్ని చాలా చోట్ల, చాలా ఎక్కువమందితో మళ్ళీ చేయవలసి ఉన్నదనీ (replication), దానివల్ల చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు రావచ్చుననీ అతను వాళ్ళని అభ్యర్ధించాడు. అయితే ఆశ్చర్యకరంగా సైంటిస్టులూ, జ్యోతిష్కులూ కూడా అతని ఫలితాల్ని ఉపేక్షించారు. కనీసం అదే స్థాయిలో మరొక చిన్న ప్రయోగాన్ని చెయ్యడానికి కూడా ఎవరూ ఉత్సాహం చూపలేదు. అంతే కాక అతనికి తన ప్రయోగానికి కావలసిన సమాచారాన్ని సేకరిస్తున్న సమయంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ గారిని భూఅయస్కాంత క్షేత్ర వివరాల కోసం కలిసినప్పుడు, ఆయన దయతో మార్టిన్ కి ఇలా సెలవిచ్చాడట –‘నీలాంటి వ్యక్తుల్ని ఈ భూప్రపంచం నుంచి తుడిచిపెట్టాలి అని నేను భావిస్తాను’ అని. జ్యోతిషం పట్ల ఆయనకున్న వ్యతిరేకత అంత గాఢమైనది.

జ్యోతిషం నిర్ణయాత్మకంగా (Deterministic) పని చేస్తుందా?
సైంటిస్టులకీ జ్యోతిష్కులకీ మధ్య జరిగిన ఒక చర్చలో మార్టిన్ ప్రయోగం చర్చకి వచ్చింది. సైంటిస్టులు ఏమన్నారంటే, ‘అతని ప్రయోగంలో సమాచారం లీకవడానికి చాలా అవకాశం ఉన్నది కాబట్టి, అసలా ప్రయోగమే తప్పు. ఎవరికైనా చేతనైతే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ని తయారు చెయ్యాలి. ఆ ప్రోగ్రామ్ కి రెండు జాతకాలు, జీవిత విశేషాలు ఇచ్చి, ఏది సరైన జాతకమో నిర్ణయించమనాలి. అది ఎక్కువ సందర్భాలలో సరైన జాతకాల్ని ఎన్నుకుంటే జ్యోతిషం నిజమని నిరూపితమైనట్టే’ అని. అది నిజంగా జరగాలి అంటే, జ్యోతిష సూత్రాలు కంప్యూటరైజ్ చెయ్యడానికి అనుగుణంగా గణితంలాగా నిర్ణయాత్మకం (Deterministic) అవ్వాలి.

ఆ చర్చ గురించి మార్టిన్ అభిప్రాయమేమిటని అడిగాను. జ్యోతిషం నిర్ణయాత్మకం కాదని అతని అభిప్రాయం. మార్టిన్ ఒక వృత్తినిపుణుడైన జ్యోతిష్కుడు. అనేక వేల గంటలు అతను జాతకాలు చెప్పడంలో గడిపాడు. అయినా అతని అభిప్రాయం ప్రకారం జ్యోతిషం ఖచ్చితమైన గణిత నియమాల్లాంటి నియమాలు కలిగిన శాస్త్రం లాంటిది కాదు. ఒక జాతకం చెప్పడానికి ఇద్దరు వ్యక్తులు సంభాషించవలసిందే అని అతని అభిప్రాయం.

భాష నేర్చుకోవడం, ఇద్దరు వ్యక్తులు సంభాషించుకోవడం మొదలైన ప్రక్రియలు మెదడు యొక్క సంక్లిష్టమైన కార్యాలపైన ఆధారపడతాయి. అందులో తెలియకుండానే ఎంతో సమాచార మార్పిడి జరుగుతుంది. జ్యోతిషం కూడా అటువంటి ఒక సంక్లిష్టమైన ప్రక్రియ అని మార్టిన్ అభిప్రాయం. ఒక జ్యోతిష్కుడు, జాతకుడు సంభాషించుకునేటప్పుడు ఇద్దరికీ తెలియకుండానే సమాచార మార్పిడి జరిగి, ఇద్దరికీ అంతకు ముందు తెలియని క్రొత్త విశేషాలు బయటపడతాయి అనీ, అది మెదడు చేసే ఒకానొక సంక్లిష్ట ప్రక్రియ (cognitive process) అనీ వివరిస్తూ, క్వాంటమ్ ఫిజిక్సులోని కొన్ని విశేషాల్ని ఉపమానాలుగా వినియోగించి అతను రాసిన ఒక వ్యాసాన్ని నాకు పంపించాడు.

మార్టిన్ అభిప్రాయాలతో నేను అంగీకరించలేకపోయాను. సాంప్రదాయవాదులైన జ్యోతిష్కులు జాతకాలు చెప్పడానికి అంత: ప్రబోధమూ, ఆత్మ పరిశుద్ధి, దైవోపాసనా కావాలంటారు. అవి లేకపోతే జ్యోతిషం ఖచ్చితమైన శాస్త్రం కాదంటారు. మార్టిన్ భౌతికవాది కాబట్టి అంత: ప్రబోధం (intuition) లాంటి ఆధ్యాత్మిక భావనలకి బదులుగా క్వాంటమ్ ఫిజిక్సు లాంటి భావాలని తనకి తెలియకుండానే వాడుతున్నాడని నాకు అనిపించింది. చాలామంది ఖచ్చితమని భావించే ఏవో కొన్ని జ్యోతిష సూత్రాల్ని ఎన్నుకుని, వాటితో ఒక కంప్యూటర్ ప్రోగ్రాం ని రాసి, అవి తప్పో, ఒప్పో నిరూపించవచ్చు కదా, అలా ప్రయత్నించాలని నాకు అనిపిస్తున్నది, అని అతనితో అన్నాను. నీ జీవితకాలమంతా ప్రయత్నించినా నువ్వు సఫలం కాలేవని అతను అన్నాడు.

తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్ని ప్రేమించి, ఆమె మోసం చేసిందని తెలిసినప్పుడు చూపించే అంత: సంఘర్షణని నేను అనుభవించాను. ‘నువ్వు (జ్యోతిషం) నిర్ణయాత్మకం అనుకుని నిన్ను ప్రేమించాను. అసలు నువ్వు నిర్ణయాత్మకమే కాకపోతే – నిన్ను ఏం చూసి ప్రేమించానో, అదే అసత్యమని తేలితే – ఇంక నా ప్రేమకి, నమ్మకానికి ఆధారమే లేదు’ అని భావించాను. నేనే కాదు, జ్యోతిషం పట్ల గట్టిగా ఆకర్షితులైనవాళ్ళు ఎవరైనా సరే, జ్యోతిషం నిర్ణయాత్మకం కాదు అని నిరూపితమైతే అదే విధమైన సంఘర్షణకి గురి అవుతారు. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, చాలామంది ఎవరి నమ్మకాల్ని వాళ్ళు గట్టిగా పట్టుకుని, వాటికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాసరే, ఆ నమ్మకాలు దెబ్బతినకూడదని, కళ్ళు మూసుకుని కూర్చోడానికే ఇష్టపడతారు కానీ, నిజాయితీగా తమ నమ్మకాల్ని ప్రశ్నించుకోడానికి ఇష్టపడరు.

మార్టిన్ తన ప్రయోగం సఫలమైందనీ, అటువంటి ప్రయోగాన్ని మళ్ళీ చెయ్యాలనీ జ్యోతిష్కులకి విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటంటే, ఒకవేళ ఇంకోసారి ప్రయోగం చేస్తే, అందులో జ్యోతిషం తప్పు అని నిరూపితమైతే, తాము ఒప్పుకోలేరు కాబట్టి. కానీ మరొకళ్ళు ప్రయోగాలు చేసి జ్యోతిషం నిజమని నిరూపిస్తే మాత్రం వెంటనే వాళ్ళు ఆ ప్రయోగాల్ని తమ సమర్ధనకి ఉపయోగించుకుంటారు. ఒకవేళ వేరేవాళ్ళు జ్యోతిషం తప్పని నిరూపిస్తే, పక్షపాతం ఆరోపిస్తారు. మరి సైంటిస్టులు అతని పరిశోధనల్ని ఉపేక్షించడానికి కారణమేమిటంటే, జ్యోతిషం నిర్ణయాత్మకం కాకపోయినా సరే పని చేస్తుంది అన్న భావనని వాళ్ళు అంగీకరించక పోవడం. జ్యోతిష్కులూ, జాతకులూ సంభాషించుకునే అవకాశం ఉండడం వల్ల మార్టిన్ ప్రయోగం సక్రమమైనది కాదని భావించడం. అంతే కాక, జ్యోతిషం పట్ల చులకనభావం, జ్యోతిషానికి ప్రచారం కల్పించకూడదనే రాజకీయధోరణీ కూడా అందుకు కారణం. ఇటువంటి ధోరణులు మార్టిన్ ని చాలా నిరాశ పరిచాయి.

మిషెల్ గోక్ లా చేసిన పరిశోధనల తాలూకు డేటాని కూడా భూ అయస్కాంత క్షేత్ర తీవ్రతల్ని బట్టి విశ్లేషిస్తే ఇంకా చక్కని ఫలితాలు వస్తాయని మార్టిన్ భావించాడు. విసుగు చెందకుండా అతను వివరమైన వ్యాసాల్ని జాఫ్రీ డిన్ కీ, ఇంకా ఇతర సైంటిస్టులకీ, జ్యోతిష్కులకీ పంపిస్తూ ఉండేవాడు. సైంటిస్టులూ, జ్యోతిష్కులూ కూడా జ్యోతిషం నిర్ణయాత్మకం అన్న భావనని వదిలి మరొక కోణంలో జ్యోతిషాన్ని పరిశీలించాలని మార్టిన్ అభిప్రాయపడుతూ ఉండేవాడు. యూరోపు, అమెరికా దేశాల్లో అనేకమందితో సంభాషించి, తన భావనల్ని సానుభూతితో స్వీకరించేవాళ్ళు ఎవరూ లేరని గ్రహించి అతను నిరాశ పడ్డాడు. (నేను చాలా కాలంగా అతనితో సంభాషించకపోవడం వల్ల అతని పరిశోధనలు ఈ మధ్యకాలంలో ఏమైనా పురోగమించాయేమో తెలియదు.)

జ్యోతిషం భవిష్యత్తులో శాస్త్రం కాగలదా?
యూకే కి చెందిన రచయితా, శాస్త్రజ్ఞుడూ అయిన డాక్టర్ ఫ్రాంక్ మెక్ గిలియాన్ 2002 వ సంవత్సరంలో Journal of Scientific Exploration (2002, Volume 16, No.1) లో ఒక వ్యాసం రాశాడు. అందులో జ్యోతిషం పని చేస్తుంది అనడానికి కొంత శాస్త్రీయమైన ఆధారం ఉండవచ్చు అని ఈ క్రింది విషయాలని వివరిస్తాడు.

మనుషుల, జంతువుల మెదడులో ఉండే పీనియల్ గ్రంధి మెలటోనిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. మెలటోనిన్ తయారీకి, వెలుతురుకీ సంబంధం ఉంది. మనుషులు/జంతువులు వెలుగులో ఉన్నప్పుడు మెలటోనిన్ తయారీ మందగిస్తుంది. చీకటిలో మాత్రమే ఈ హార్మోన్ ఎక్కువగా తయారై, విడుదలవుతుంది. సూర్యకాంతి మెలటోనిన్ పైన అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ, చంద్రుని కళలకూ (కాంతికీ), మెలటోనిన్ ఉత్పత్తి కావడానికీ కూడా సంబంధం ఉన్నదని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. కంటికి కనిపించే కాంతి మాత్రమే కాక, ఇతర విద్యుదయస్కాంత క్షేత్రాలు (భూ అయస్కాంత క్షేత్రంతో సమానమైన బలం కలిగినవి) కూడా మెలటోనిన్ ఉత్పత్తిపైన ప్రభావం కలిగి ఉన్నాయి. ఇటువంటి అయస్కాంత క్షేత్రాలు పీనియల్ గ్రంధి పైన ప్రత్యక్షప్రభావాన్ని కలిగి ఉన్నాయని కూడా మరికొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. మెలటోనిన్ ప్రత్యుత్పత్తికి సంబంధించిన హార్మోన్లపై వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే, మెలటోనిన్ ఎక్కువగా విడుదల అయితే, ప్రత్యుత్పత్తి హార్మోన్ల విడుదల మందగిస్తుంది. మెలటోనిన్ తక్కువగా ఉంటే, ప్రత్యుత్పత్తి హార్మోన్ల విడుదల ఎక్కువ అవుతుంది. ఈ విషయాన్ని అనేక పరిశోధనలు ధ్రువపరిచాయి.
ఉదాహరణలు: ధ్రువప్రాంతాల్లో జీవించే ఎస్కిమో స్త్రీలలో చలికాలంలోని చీకటి మాసాల్లో ఋతుక్రమం ఆగిపోతుంది. (వెలుగు ఉండదు కాబట్టి, మెలటోనిన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఫలితంగా ప్రత్యుత్పత్తి హార్మోన్లు మందగిస్తాయి). ఫిన్లాండులో బాగా ఉత్తరంగా ఉన్న ప్రాంతాల్లో వేసవి కాలంలోనే ఎక్కువగా సాధారణ మరియు కవలల గర్భధారణ జరుగుతోందని మరొక పరిశోధన సూచిస్తోంది.

మరొక పరిశోధనలో క్రొత్తగా జన్మించిన ఎలుక పిల్లలకి మెలటోనిన్ హార్మోన్ ఇచ్చారు. దాని ఫలితంగా ఆ ఎలుకలు పెద్దవి అయిన తరువాత వాటిలో సహజంగా సంభవించవలసిన ప్రత్యుత్పత్తి సంబంధమైన శారీరిక మార్పులు (secondary sexual characteristics) ఆలస్యంగా కలిగాయి. అంతే కాక ఆ ఎలుకల/జంతువుల సాధారణమైన ఎదుగుదలా, ఇతర ఆరోగ్య పరిస్థితులూ, మాతృత్వ స్వభావం, కొత్త ప్రదేశాల్ని కనుగొనే స్వభావాల పైన కూడా ప్రభావం పడిందని అదే ప్రయోగాన్ని వేర్వేరుసార్లు చేసినప్పుడు బయటపడింది.
అయితే ఎలుక పిల్లలు పుట్టిన ఆరు రోజుల తరువాత ఈ హార్మోన్ ను ఇస్తే దాని ప్రభావం ఏమీ లేదనీ, కేవలం పుట్టిన ఆరు రోజులలోపల ఇస్తే మాత్రమే దాని ప్రభావం కనిపించిందనీ కూడా కనిపెట్టబడింది. అంటే, పుట్టిన తరువాత కొద్ది రోజుల వ్యవధిలో ప్రయోగించబడిన మెలటోనిన్ జంతువుల భవిష్యత్ స్వభావాన్ని ముందే నిర్ణీతం (pre-program) చేస్తోంది అన్నమాట. సున్నితమైన ఆ కాలవ్యవధానం తరువాత దాని ప్రభావం లేదు. మనుషుల్లో కూడా ఇదేవిధమైన పరిశీలనలు చేయబడ్డాయి. పుట్టుకతో చూపు లేనివాళ్ళ విషయంలోనూ, పుట్టిన సమయానికి అటూ ఇటూగా చీకటి-వెలుగుల తేడాలు అధికంగా గల కాలాన్ని అనుభవించినవాళ్ళలోనూ ఇటువంటి విషయాలే గమనించబడ్డాయి.

పుట్టిన సమయంలో కాంతి మాత్రమే కాకుండా, పరివ్యాప్తమై ఉండే విద్యుదయస్కాంత క్షేత్రాలూ (ambient electro magnetic radiation), భూ అయస్కాంత క్షేత్రమూ కూడా మనుషుల ఎదుగుదలని ప్రభావితం చేస్తాయి అని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. చిన్నవయసులోనే వచ్చే మూర్ఛరోగానికి పుట్టినరోజు నుంచి రెండు రోజులవరకు ఉండే భూ అయస్కాంత క్షేత్రంలోని మార్పులే కారణం కావచ్చని ఒక పరిశోధన సూచిస్తోంది.
అలాగే భూ అయస్కాంత క్షేత్ర మార్పులే ప్రసవ సమయాన్ని నిర్ణయిస్తున్నాయి అనీ, మగపిల్లల పుట్టుకకీ ప్రసవానికి మూడు రోజుల ముందు ఉన్న భూ అయస్కాంతక్షేత్ర తీవ్రతకీ సంబంధం ఉండవచ్చు అని కూడా మరికొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

స్కిజోఫ్రినియాతో బాధ పడేవాళ్ళ జననాలు వసంత విషువత్ కాలానికి (spring equinox) దగ్గరలో ఎక్కువగా జరుగుతున్నాయనడానికి ఆధారాలు ఉన్నాయి. ఉత్తరార్ధ గోళంలో చలికాలంలో వెలుతురు తక్కువగా ఉంటుంది కాబట్టి మెలటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వసంత విషువత్తు నుంచీ వెలుతురు ఎక్కువ అవుతుంది కాబట్టి మెలటోనిన్ ఉత్పత్తిలో మార్పు కలుగుతుంది. ఈవిధమైన మార్పు స్కిజోఫ్రినియా మీద ప్రభావం కలుగజేస్తూ ఉండవచ్చు అని భావించడానికి ఆస్కారం ఉంది.
భూమధ్య రేఖకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఋతువులని బట్టి పగటి సమయంలోనూ, వెలుతురులోనూ మార్పు పెద్దగా రాదు. అక్కడ స్కిజోఫ్రినియా జననాలపై ఈ విధమైన ఋతువుల ప్రభావం కనబడలేదు. అంతే కాకుండా ఋతువులకీ, అనేక ఇతర వ్యాధులకీ గల సంబంధాన్ని గురించిన పరిశోధనల్ని బట్టి – ఋతువులకీ, భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులకీ, విద్యుదయస్కాంత క్షేత్రాలకీ మెలటోనిన్ ఉత్పత్తికీ సంబంధం ఉన్నదనీ, అది కొందరు పిల్లలని ప్రభావితం చేసి భవిష్యత్తులో కొన్ని భౌతిక, మానసిక లక్షణాలకీ, వ్యాధులకీ కారణమౌతున్నదనీ భావించవచ్చు.

జీవ వ్యవస్థలపైన (biological systems) ఋతువులు, సూర్య, చంద్రులే కాక కొన్ని ఖగోళ సంఘటనలు కూడా ప్రభావితం చూపుతాయి అని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సూర్యుడిలో ఏర్పడే మచ్చలు, సౌర వాయువులు (solar wind), నక్షత్రాలు పేలడం (supernovae) మొదలైనవి. సౌర కుటుంబంలోని కొన్ని గ్రహాలు భూమి పైకి వీచే సౌర వాయువుల్నీ, భూమియొక్క విద్యుదయస్కాంత క్షేత్రాల్నీ అనునాదాన్ని (resonance) పోలిన పద్ధతిలో ప్రభావితం చేస్తాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. వాటి ప్రభావాల ఫలితాలు మెలటోనిన్ ఉత్పత్తిపైన ఉండవచ్చు. మెలటోనిన్ ఉత్పత్తిలో మార్పులు తీసుకువచ్చే సౌర-భూ అయస్కాంతక్షేత్ర ప్రభావాలు మన దైనందిన జీవితం పైన కూడా ఉండవచ్చు. యుద్ధాలకీ, ఈ అయస్కాంత క్షేత్రాల్లో మార్పులకీ సంబంధం ఉండవచ్చు అని కూడా ఒక పరిశోధన సూచిస్తున్నది.
ఇవీ స్థూలంగా ఆ వ్యాసంలోని అంశాలు. ఈ వ్యాసాన్ని సమీక్షించిన జాఫ్రీ డీన్ ఇటువంటి పరిశోధనల గురించి చాలా జాగ్రత్త వహించాలనీ, జ్యోతిషం అంతా సత్యమే అన్న తప్పుడు అభిప్రాయాన్ని ఇటువంటి పరిశోధనలు కలుగజేస్తాయనీ అన్నాడు. గ్రహాల ప్రభావం భూమిపై ఉండవచ్చుఅన్న సూచనకి అతడు ‘హవాయి ద్వీపంలో సముద్రపు కెరటాలపైన ఒక మనిషి సర్ఫింగ్ చేస్తే, దాని ప్రభావం ఆస్ట్రేలియా తీరంలోని సముద్రపుటలలపైన పడుతుంది’ అన్న మాట ఎంత నిజమో, అదీ అంత నిజమే అన్న అభిప్రాయాన్ని ప్రకటిస్తాడు.
ఫ్రాంక్ మెక్ గిలియాన్ వ్యాసంగానీ, ఇటువంటి పరిశోధనల్నే ప్రకటించే ‘జ్యోతిషం కూడా సైన్సే’ అనే పుస్తకాలు కానీ జ్యోతిషం ఇప్పటికిప్పుడు, యథాతథంగా సైన్సే అని చెప్పవు. కానీ జ్యోతిషానికి సంబంధించిన కొన్ని ప్రాథమికమైన అవగాహనలు భవిష్యత్తులో, యథాతథంగా కాకపోయినా, ఏదో ఒక రూపంలో శాస్త్రీయ సత్యాలు కావచ్చు అన్న ఆశని మాత్రమే ప్రకటిస్తాయి.
జ్యోతిషమూ – కొన్ని సూక్ష్మాంశాలు
ఇందులో జ్యోతిషానికి సంబంధించిన నా ఊహలు కొన్ని వివరిస్తాను. వీటికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవనీ, ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే అనీ మనవి.

దేవమాన దశా పద్ధతి: ఫ్రాంక్ మెక్ గిలియాన్ గారి వ్యాసంలో మెలటోనిన్ హార్మోను శిశువుల పుట్టిన రోజు నుండీ కొన్ని రోజుల వరకు ప్రభావాన్ని కలిగి ఉంటుందనీ, అది వారి భవిష్యత్ ప్రవర్తనని ప్రభావితం చేస్తుందనీ (pre-program) చెప్పబడింది. పాశ్చాత్య జ్యోతిషంలో ప్రిడిక్షన్సు చెప్పడానికి చాలా ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్ధతిని progression అంటారు. మన భారతీయ జ్యోతిషంలో కూడా దీని ప్రసక్తి ఉన్నదనీ, దీన్ని దేవమాన దశా పద్ధతి అంటారనీ కొందరు పెద్దలు అంటారు. ఈ పద్ధతిలోని సూత్రం ఏమిటంటే, మనిషి పుట్టినరోజు నుండీ ఒక్కో రోజు అతని భవిష్యత్తులోని ఒక్కో సంవత్సరాన్ని నిర్ణయిస్తుంది. అంటే, ఉదాహరణకి నాకు ముప్ఫయ్యవ సంవత్సరంలో జరగబోయే సంఘటనల్ని నేను పుట్టిన రోజు నుండి ముప్ఫయ్యవ రోజున ఉన్న గ్రహస్థితులు సూచిస్తాయి అన్నమాట. ఆవిధంగా ప్రతి జాతకానికీ పుట్టిన రోజునుండి సుమారు తొంభై రోజులవరకు ఒక్కోరోజు గ్రహస్థితుల్నీ పరిశీలించి, ఆ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తారు అన్నమాట. మెక్ గిలియాన్ గారి వ్యాసంలోని అంశానికీ, ఈ జ్యోతిష సూత్రానికీ ఉన్న పోలిక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

జ్యోతిషం మన:స్థితిని ప్రతిబింబిస్తుంది తప్ప గట్టి నిజాల్ని కాదు: కొంతమంది పాశ్చాత్య జ్యోతిష్కుల భావనల ప్రకారం , జ్యోతిషం ద్వారా చెప్పే ఫలితాలు కేవలం జాతకుల మన: స్థితిని ప్రతిబింబిస్తాయే తప్ప బహి:ప్రపంచంలోని నిజాల్ని (objective reality) కాదు. ఉదాహరణలు:

ఒకావిడ ఒక వ్యక్తికి జాతకం చూసి ఫలానా సమయంలో నీ తండ్రితో తీవ్ర సమస్యలు గానీ, తండ్రి చనిపోవడం గానీ జరిగి ఉండాలని చెప్పింది. ఆ జాతకుడు పదహారేళ్ళ వయసు నుండీ స్వతంత్రంగానే బతుకుతున్నాడు. ఆ సమయంలో తండ్రి చనిపోలేదు కానీ, తాను మార్గదర్శకుడుగా (mentor) భావించి, అమితంగా గౌరవించే ఒకానొక వ్యక్తితో తీవ్రమైన విభేదాలు వచ్చి అతనితో విడిపోయాడు.

నాకు తెలిసిన ఒక స్నేహితుడికి ఆర్థికమైన ఇబ్బందులు తట్టుకోడానికి ఉద్యోగంలో మంచి మార్పు కావాలి. ఒక ఏడాది పాటు చిన్న ఉద్యోగం చేసాడు. ఎంత ప్రోత్సాహించినా పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చెయ్యలేదు. చివరికి మరొక స్నేహితుడి ప్రోద్బలంతో అతను ప్రయత్నం చెయ్యగా మంచి బహుళ జాతి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నిజానికి అతని ప్రతిభని, చదువుని, అనుభవాన్ని, ఆ సమయంలో మార్కెట్ లో ఉన్న అవకాశాల్ని బట్టి ఏ విధంగా చూసినా, అతనికా ఉద్యోగం రావడం చాలా మామూలు సంగతి. అతను ఎప్పుడు ప్రయత్నం చేసినా అటువంటి ఉద్యోగం ఖచ్చితంగా వచ్చి ఉండేది. కానీ అప్పుడు ఆ ఉద్యోగం రావడం అతనికీ, అతని కుటుంబానికీ భూమ్యాకాశాలు పట్టనంత సంతోషం కలిగించింది. చాలా కాలం తరువాత అతని జాతకం చూసిన జ్యోతిష్కుడు ఒకడు ఫలానా సమయంలో నీకు ఉద్యోగంలో చాలా మంచి మార్పు వచ్చి ఉండాలి అని చెప్పాడు. అతను చెప్పిన విషయం నిజమే కానీ, అది ఆ స్నేహితుడి మన:స్థితి దృష్ట్యా చూస్తే ఎక్కువ నిజం. అతను ప్రయత్నించి ఉంటే అటువంటి ఉద్యోగం సంపాదించడం అతనికి ఎప్పుడూ ఒక లెక్కలోనిది కాదు.

ఇటువంటి ఉదాహరణల గురించి ఆలోచించినప్పుడు నాకు జ్యోతిషం ద్వారా మనుషుల కళాకళలు (moods) మాత్రమే కొంతమటుకు ముందే నిర్దేశితమౌతున్నాయేమో అనీ, ఆయా మన: స్థితుల్నిబట్టి ప్రాపంచికానుభవాల్ని మనమే నిర్మించుకుంటున్నామేమో అనీ ఒక భావన కలుగుతుంటుంది. గ్రహగతులు మనుషుల మన: స్థితుల్ని ప్రేరేపిస్తాయి తప్ప, మన జీవితాల్ని నిర్దేశించవు అని చాలా మంది జ్యోతిష్కులు అంటారు. The stars IMPEL, they do not COMPEL అనే సూక్తి జ్యోతిషంలో చాలా ప్రసిద్ధమైనదే. అయితే మనుషుల కళాకళలు హార్మోన్ల చేత ప్రభావితమౌతాయి కాబట్టి, మెక్ గిలియాన్ గారి వ్యాసంలో చెప్పినట్టు ఆ హార్మోన్ల పనితీరు గ్రహగతులచేత ముందే నిర్దేశితమయ్యే అవకాశమే ఉంటే, జ్యోతిషం భవిష్యత్ శాస్త్రం కావడానికి సావకాశం ఉన్నట్టే అని నా భావన.

జ్యోతిష సంకేతాలను తేలికగా కొట్టిపారెయ్యలేము: జ్యోతిష సంకేతాలు చాలా గహనమైనవి, ఆకర్షణీయమైనవి. ఫ్రాయిడ్ సిద్ధాంతాలు తప్పుల తడకలనీ, ఏ విధంగానూ శాస్త్రీయమైనవి కావు అనీ ఆధునికులు అంటారు. అయినప్పటికీ అతను ప్రతిపాదించిన ఇడ్, ఇగో, సూపర్ ఇగో లాంటి సంకేతాలను ఇప్పటికీ అభిమానించి, ఉపయోగించేవాళ్ళు తారసపడుతూనే ఉంటారు. ఆ సంకేతాలకున్న ఆకర్షణ అలాంటిది. జ్యోతిష సంకేతాలు కూడా ఒక ప్రత్యేకమైన ప్రాపంచిక దృక్పథాన్ని కలుగజేస్తాయి. వాటిని అవగాహన చేసుకోవడం ద్వారా మనుషుల మౌలిక స్వభావాన్ని అవగాహన చేసుకున్న తృప్తి కలుగుతుంది.

చదరంగం ఆటలో ఒక్కొక్క పావుకీ కొన్ని పరిమితమైన కదలికలు, నియమాలు ఉంటాయి. అయితే వాటి ప్రస్తారాలు, సంయోగాల (permutations and combinations) ద్వారా అనంత వైవిధ్యంగల అద్భుతమైన క్రీడ ఒకటి సాధ్యమౌతోంది. అదే విధంగా పరిమిత సంఖ్యలో ఉండే జ్యోతిష సంకేతాలని అనంత విధాలుగా సంయోగించి (combinatorial explosion), వాటి ద్వారా మనుషుల స్వభావాన్నీ, జీవన వైవిధ్యాన్నీ అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం ద్వారా జ్యోతిష్కులు ఒక మేధో సంబంధమైన క్రీడని ఆడుతున్నారని గమనించాలి. అది వాళ్ళకి అపారమైన తృప్తినీ, సరదానీ (enjoyment) ఇస్తోందనీ కూడా గ్రహించాలి. జ్యోతిషాన్ని పై పై కారణాలు చూపి తిరస్కరించినంత మాత్రాన జ్యోతిష్కులు ఆ శాస్త్రం పట్ల విముఖులైపోరనీ, అందుకు కారణం జ్యోతిష సంకేతాల్లోని బలమేననీ నా అభిప్రాయం.

జ్యోతిషం పట్ల కొంత సాధారణ పరిజ్ఞానం కలిగిన వ్యక్తికి కూడా జ్యోతిష సంకేతాలు చాలా సరళంగా యావత్ర్పపంచాన్నీ ఒక చక్కని అమరికలో పెట్టుకున్న తృప్తిని కలిగిస్తాయి. ఉదాహరణకి జాతక చక్రంలోని పన్నెండు భావాలనీ చూడండి. అవి మనిషి జీవితాన్ని పన్నెండు విభాగాలుగా సూచిస్తాయి. నా వివరణతో సాంప్రదాయ జ్యోతిష్కులు అంగీకరించకపోవచ్చు గానీ ఈ పన్నెండు విభాగాలూ ఎలా వచ్చాయో చూడండి –

మనిషి స్వభావంలో మూడు రకాలైన శక్తులు ఉన్నాయి. 1) చొరవగా పనులు చేయడం. 2) ఒక విషయం మీద స్థిరంగా నిలబడడం 3) విచక్షణని ఉపయోగించి పరిస్థితులకి అనుగుణంగా సద్దుబాటు చేసుకోవడం. ఈ మూడు శక్తుల్నీ జ్యోతిషంలో వరుసగా చర (Dynamic or Movable), స్థిర (Fixed), ద్విస్వభావ (Flexible or Mutable) రాశులు లేక భావాలని అంటారు.

అలాగే మనిషి జీవితంలో నాలుగు ప్రధానమైన విభాగాలు ఉన్నాయి. 1) బౌద్ధికమైన జీవితం (intellectual life) 2) కుటుంబ జీవితం(family life) 3) వృత్తి సంబంధమైన జీవితం (professional life) 4) సామాజిక జీవితం (social life). వీటినే జ్యోతిషం అగ్ని(intellectual), జల(emotional), భూ(resources), వాయు(communicative) తత్త్వాలని సంకేతిస్తుంది. ఈ నాలుగు విభాగాల్లోనూ మూడు శక్తులతో ప్రవర్తించడం ద్వారా మొత్తం పన్నెండు విభాగాలు ఏర్పడుతున్నాయని జ్యోతిషం అంటుంది.

ఈ రకమైన అవగాహనకి ఒక్క ఉదాహరణ మాత్రం ఇస్తాను. భూ తత్త్వం, చర భావం అయిన దశమభావం (Tenth house) ఉద్యోగాన్ని సూచిస్తుంది. సమాజంలో బ్రతకడానికి కావలసిన సాధనాల (resources) కోసం చేయవలసిన ప్రయత్నాన్ని(dynamism) ఇది సూచిస్తుంది. భూ తత్త్వం, స్థిర భావం అయిన రెండవ భావం (second house) ఉద్యోగం వలన కలిగే ఆదాయాన్నీ, వస్తు సముదాయాన్నీ(resources) సమకూర్చుకోడాన్నీ, దాచుకోడాన్నీ (fixed) సూచిస్తుంది. భూ తత్త్వం, ద్విస్వభావ భావం అయిన ఆరవ ఇల్లు (sixth house) ఆదాయ, వృత్తి విషయాల్లో (resources) తాను చేసుకోవలసిన సర్దుబాట్లు (flexibility and adjustments) సూచిస్తుంది. అంటే తాను చేసే అప్పులు, తాను ఒదిగి ఉండవలసిన పరిస్థితులు, ధనాన్ని కోల్పోయే పరిస్థితులు మొదలైనవి.

ఈ విధంగా జ్యోతిష సంకేతాలు ఒక ఆకర్షణీయమైన తర్కాన్ని (logic) కలిగి ఉంటాయి. ఆయా సంకేతాల యొక్క సంయోగాల్ని బట్టి అనంత విధాలైన పరిస్థితులని ఊహించుకోడానికి, పరిశీలించడానికీ కుతూహలం కలిగిస్తాయి. చాలా ప్రాథమికమైన ఈ సంకేతాలు తప్పని ఋజువు చేయడం కష్టం అన్నమాట అలా ఉంచితే, ఇన్ని వేల సంవత్సరాలుగా జ్యోతిష్కుల అనుభవాలకీ, పరిశీలనకీ తట్టుకుని ఈ సంకేతాలు నిలబడి ఉండడం ఆశ్చర్యకరమైన సంగతి. ఉదాహరణకి ఒక ఔత్సాహిక జ్యోతిష్కుడికి తన అనుభవంలో శని ప్రభావం వల్ల జాతకులకి సుఖాలు కలుగుతున్నాయి అని అనేకసార్లు ఋజువైతే అతను గందరగోళానికి గురై, జ్యోతిషం పైన విశ్వాసాన్ని కోల్పోతాడు. అయితే అత్యధిక సందర్భాల్లో అలా జరగడం లేదని గమనించాలి.

జ్యోతిష సంకేతాలకి మినహాయింపులు: కానీ ఇక్కడ మరొక సూక్ష్మాంశం ఉంది. జ్యోతిషం అనుభవాన్ని బట్టి తనను తాను సవరించుకొనే స్వభావం కలిగినది. అంటే ఒక జ్యోతిష్కుడి అనుభవం ప్రకారం లగ్నంలో శని ఉన్న ఒక జాతకుడు మహా సుఖాలు అనుభవిస్తున్నాడు అనుకోండి. అది తాను అవగాహన చేసుకున్న సంకేతాలకి విరుద్ధం. (శని కష్టాలని సూచిస్తాడు. లగ్నం ఆరోగ్యాన్నీ, శరీరాన్నీ సూచిస్తుంది). తన అనుభవంలో ఎదురైన ఈ వైరుధ్యాన్ని సవరించడానికి ఆ జ్యోతిష్కుడు ఏం చేస్తాడంటే, ఫలానా కారణం వల్ల ఈ జాతకానికి శని యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి ఈ జాతకుడికి శని సుఖాలే ఇస్తాడు అని శని యొక్క సంకేతానికి ఒక మినహాయింపు ఇస్తాడు.

భారతీయ జ్యోతిష శాస్త్రాన్ని కొద్దిగానైనా చదివినవారికి ఇటువంటి మినహాయింపులు, ఎదురు మినహాయింపులు వందలూ, వేలూ కనపడుతూ ఉంటాయి. చివరికి ఆ గ్రహాల సంయోగాలూ, వాటి ఫలితాలూ ఎంత గందరగోళంగా తయారవుతాయంటే, ఉపాసనా, దైవానుగ్రహమూ (లేదా క్వాంటం ఫిజిక్సు) లేకుండా ఫలితాలు చెప్పడం సాధ్యపడదు అనేటంత. అయినా సరే జ్యోతిష సంకేతాల ఆకర్షణా, అనేక గ్రహ సంయోగాలను తెలుసుకుంటూ ఉండడం వలన శాస్త్రంలో పురోగమిస్తున్నాననే తృప్తీ, ఫలితాలన్నీ సరైనవే అని ఎప్పటికప్పుడు ఆకాశానికెత్తే విశ్వాసులూ జ్యోతిష్కుడు శాస్త్రాన్ని దృఢంగా విశ్వసించేలా చేస్తాయి. జ్యోతిషం అనంత సాగరమనీ (combinatorial explosion), అందులో తనకు తెలిసినది చాలా కొంచం మాత్రమే అనీ చాలా గొప్ప జ్యోతిష్కులే తమ వినయాన్ని చాటుకుంటూ ఉంటారు.

ఇన్ని మినహాయింపులూ, అనేక వందల గ్రహ సంయోగాల గందరగోళాలు ఉన్నప్పటికీ జ్యోతిష సంకేతాల ప్రాథమిక అవగాహనలు (శని = కష్టాలు, శుక్రుడు = సుఖాలు మొదలైనవి) వేల సంవత్సరాలుగా యథాతథంగా నిలిచి ఉండడం ఆశ్చర్యకరం.

జ్యోతిష సంకేతాలు సంగ్రహ (abstract) రూపంలోనే ఫలితాలు సూచించగలవు: జ్యోతిష్కులకి తరచుగా వినిపించే ప్రశ్న. ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు కవలలకి ఒకే జాతకాలు ఉంటాయి కదా. వాళ్ళ జీవితాలు మరి ఒకే విధంగా ఉండవు, ఎందుకని? చాలామంది జ్యోతిష్కులు దీనికి చెప్పే సమాధానం ఏమిటంటే కవలలు పుట్టినప్పుడు వాళ్ళ జన్మ సమయాల్లో ఒక్క నిమిషం తేడా వచ్చినా సరే, జాతకాలు మారిపోతాయి అని. జాతకంలో అనేక సూక్ష్మ విభాగాలు ఉంటాయనీ, అవి కొన్ని సెకన్ల వ్యవధానంలోనే మారిపోతూ ఉంటాయి అనీ, కాబట్టి జన్మ సమయం ఎంత దగ్గరగా ఉన్నా సరే, వాళ్ళ జీవితాలకి పోలిక ఉండదనీ కూడా కొంతమంది అంటుంటారు.

కవలల సంగతి పక్కన పెట్టినా, ఒకే జాతకాంశం అందరికీ ఒకేలా పని చేస్తుందా? ఉదాహరణకి ఒక రెండు జాతకాల్లో కుటుంబ స్థానాన్ని శుక్రుడు పరిపాలిస్తున్నాడు అనుకోండి. అంటే ‘కుటుంబ సౌఖ్యం ఎక్కువ’ అని జ్యోతిష్కులు అంటారు. అంతకన్నా సూక్ష్మంగా ఫలితాలు ఏమైనా చెప్పగలవా అని అడిగితే చెప్పగలిగేవాళ్ళు ఎవరూ ఉండరు. కుటుంబ సౌఖ్యం అంటే ఏమిటి? ఇంట్లో మంచి భోజనం ఉంటుందనా? ఇల్లు బాగుంటుందనా? తల్లి దండ్రులు, భార్యా బిడ్డలూ ఎక్కువ ప్రేమిస్తారనా? మరి వాళ్ళ ఇంట్లో ఎవరికీ ఎప్పుడూ అనారోగ్యాలు రావా? ఇంట్లో కాలో చెయ్యో కదలని ముసలివాళ్ళు ఎవరూ ఉండరా? ఇలా సూక్ష్మ వివరాల కోసం అడిగితే జ్యోతిష్కులు చెప్పగలిగేది శూన్యం.

అలాగే ఎవరికైనా సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం అని జోస్యం చెప్పారనుకోండి. ఎందులో? జావాలోనా? సైబేస్ లోనా? వెబ్ డిజైనింగా? డేటా వేర్ హౌసింగా? సపోర్టా? డొమైన్ ఏమిటి? ఏ కంపెనీ? టీసీయెస్సా? ఇన్ఫోసిస్సా? ఒరాకిల్లా? ఎక్కడ ఉద్యోగం వస్తుంది? బెంగళూరా? హైదరాబాదా? పూనానా? ఇలాంటి ప్రశ్నలకి ప్రపంచంలో ఏ జ్యోతిష్కుడూ సమాధానం చెప్పలేడు. కాబట్టి జాతకాన్ని ఖచ్చితమైన సెకను ప్రకారం గుణించినా, అతి సూక్ష్మ విభాగాలు చేసి చూసినా, ఫలితాలు మాత్రం చెప్పగలిగేది ఒకానొక సంగ్రహ (abstract) రూపంలోనే తప్ప వివరంగా చెప్పడం సాధ్యపడదు. బెంగళూరుకీ, ఇన్ఫోసిస్ కీ, సైబేస్ కీ జ్యోతిష సంకేతాలు ఉండవు.

కాబట్టి కవలలకైనా, మామూలు జాతకాలకైనా సంగ్రహంగా ఫలానా అప్పుడు బాగుండచ్చు, ఉద్యోగం రావచ్చు, కుటుంబంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు ఇలా ఏదో తడుముకుంటూ ఫలితాలు చెప్పడమే తప్ప వివరంగా ఫలితాలు చెప్పడం సాధ్యపడదు. జ్యోతిషమంటేనే కొన్ని abstract సంకేతాలని బట్టి ఊహాగానాలు చెయ్యడం. అందరికీ ఒకే ఫలితం చెప్పినా వాళ్ళ వాళ్ళ అనుభవం వేరుగా ఉంటుంది. ఎవరి ‘కుటుంబ సౌఖ్యాలూ’, ‘సాఫ్ట్ వేర్ ఉద్యోగాలూ’ వాళ్ళవి. ఇది జ్యోతిషానికున్న అతి పెద్ద హద్దు (limitation). ఇది జ్యోతిష్కులూ, జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళూ కూడా అవగాహన చేసుకోవాలి.

జ్యోతిష సంకేతాల్ని మనస్తత్వశాస్త్ర పరంగా శాస్త్రీయంగా పరిశీలించాలి: జ్యోతిష సంకేతాలు ఒక సార్వజనీనమైన మానసిక భాష లాంటివి. అవి దేశ, కాలాలకి అతీతమైన ఒక మానవ స్వభావంలోని భాగాల్ని సూచిస్తాయి. ఒకే మానసిక స్థితి దేశాన్నీ, సమాజాన్నీ బట్టి అక్కడి ఆచారాల ప్రకారం వ్యక్తం కావడం జరుగుతుంది. ఉదాహరణకి యుక్త వయసులో డేటింగ్ చెయ్యడం పాశ్చాత్య దేశాల్లో సహజం. భారత దేశంలోని అధిక ప్రాంతాల్లో ఇంకా ఈ ఆచారం లేదు. ఒక పాశ్చాత్య యువకుడి జాతకం, ఒక భారతీయ యువకుడి జాతకం పరిశీలిస్తున్నాము అనుకోండి. ఇద్దరికీ ప్రేమలో పడే ఒక యోగం ఉంది అనుకోండి. పాశ్చాత్య యువకుడు ఒక అమ్మాయితో డేటింగ్ చెయ్యడానికి అవకాశం ఎక్కువ. సాంప్రదాయ కుటుంబంలోని భారతీయ యువకుడు మౌనంగా మనసులోనే ప్రేమించడానికి అవకాశం ఎక్కువ. ఇద్దరికీ ఒకే యోగమైనా వేర్వేరుగా పని చేస్తుంది.

అలాగే పాశ్చాత్య జంటల్లో విడిపోవడాలు ఎక్కువ. భారతీయులకి తక్కువ. మరి వాళ్ళ జాతకాల్లో విడాకుల యోగాలు ఎక్కువగానూ, భారతీయ జాతకాల్లో విడాకులు తక్కువగానూ కనిపిస్తాయా? అలాగే వాళ్ళకి సవతి తండ్రులు ఉండే అవకాశాలు ఎక్కువ. భారతీయుల్లో సవతి తల్లులు మాత్రమే ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ తేడా మరి జాతకాల్లో కనిపిస్తుందా? నా అనుభవం ప్రకారం కనిపించదు. పాశ్చాత్యులూ, భారతీయులూ కూడా ఒకే భూమి మీద నివసిస్తున్నారు కాబట్టి, అందరికీ గ్రహాలూ, రాశులూ ఒకటే కాబట్టి, జ్యోతిషం ఒకవేళ నిజమే అయితే, ఒకే గ్రహ సంకేతాలకి వేర్వేరు సంస్కృతుల వాళ్ళు వేర్వేరు విధాలుగా ప్రతిస్పందిస్తున్నారు అనుకోవాలి. జ్యోతిష సంకేతాల్ని మనస్తత్వ శాస్త్ర పరంగా అధ్యయనం చేస్తే ఒక్కొక్క జ్యోతిష సంకేతమూ ఒక్కొక్క మానసికావసరం (psychological need) గా దర్శింపబడవచ్చును అనీ, ఆ దిశగా ఒక పరిశీలన చెయ్యడంలో తప్పేమీ ఉండబోదనీ నా భావన. ఈ రకమైన ప్రయత్నాలు పాశ్చాత్య జ్యోతిష్కుల్లో ఎక్కువ. అయినా సమాజంలో జ్యోతిషానికి ఉన్న ఒక ‘సిగ్గు పడాల్సిన స్థితి’ (taboo status) వల్ల ప్రతిభావంతులైన శాస్త్రజ్ఞులెవరూ జ్యోతిషం జోలికి సాధారణంగా పోరు.

జ్యోతిషాభిమానులకి కొన్ని సూచనలు
ఇంతవరకు చేసిన శాస్త్రీయమైన పరిశోధనల్లో జ్యోతిషం నిజంగా పనిచేస్తుందని నిరూపితం కాలేదని నేను అనేక ఉదాహరణలిచ్చాను. ఎంత శాస్త్రీయంగా చేసినప్పటికీ ఆ పరిశోధనలు జ్యోతిష్కులకి చాలా అసంతృప్తిని కలిగిస్తాయి. జ్యోతిష్కులు జాతకాలు చెప్పేటప్పుడు అనేక అంశాలని పరిశీలిస్తారు. శాస్త్రీయ పరిశోధనల్లో అన్ని జ్యోతిషాంశాలనీ ఒకేసారి పరిశీలించడానికి వీలు ఉండదు. ఉదాహరణలు:1974 లో ప్రకటించిన మరొక పరిశోధనలో (Leonardo 7, 235 ) వృత్తికీ, ఆరోగ్య సమస్యలకీ, ఎత్తుకీ, ఆయుర్దాయానికీ – పుట్టినసమయంలో బుధ, శుక్ర, కుజ, గురు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అన్నదానికీ సంబంధమే లేదు అని తేలింది. అలాగే, 1967 లో మిషెల్ గోక్‌లా (The Cosmic Clocks, p 84) చేసిన పరిశోధనలో – జీవితంలో విజయాన్ని సాధించినవాళ్ళ జాతకాల్లో శని ఉండే ఇంటినీ, అలాగే హత్యలు చేసినవాళ్ళ జాతకాల్లో కుజుడు ఉండే ఇంటినీ పరిశీలించడం జరిగింది. ఈ రెండింటికీ శనీ, కుజుడూ ఏ ఇంట్లో ఉన్నారో అన్నదానితో సంబంధమే లేదని తేలింది.

జ్యోతిష్కులెవరూ కేవలం బుధ, శుక్ర, కుజ, గురు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి వృత్తినిగానీ, ఆరోగ్య సమస్యలని కానీ, ఆయుర్దాయాన్నిగానీ నిర్ణయించరు. అలాగే శనీ, కుజుడూ ఏ భావాల్లో ఉన్నారో అన్న ఒక్క అంశాన్ని మాత్రమే చూసి, వాళ్ళు హంతకులో కాదో నిర్ణయించరు. కాబట్టి ఇటువంటి పరిశోధనల్ని జ్యోతిష్కులు ఒప్పుకోలేరు. ఎంతో నిజాయితీపరులైన జ్యోతిష్కులు కూడా జ్యోతిషం పని చేస్తుందని నమ్మడానికి ప్రధానమైన కారణాలు రెండు. 1. జ్యోతిష సంకేతాలు గహనమైనవి. అవి ఒక ప్రత్యేకమైన ప్రాపంచిక దృక్పథాన్ని కలుగజేస్తాయి. వాటిని తప్పో, ఒప్పో తేల్చుకోవడం అంత సులభమేమీ కాదు. 2. జ్యోతిషం చాలా సందర్భాలలో పని చెయ్యదని తెలిసినప్పటికీ, కొన్ని కొన్ని సందర్భాలలో జాతకాలు ఆశ్చర్యకరంగా నిజమవ్వడం గమనించవచ్చు. వ్యక్తిగతానుభవం చాలా బలమైన ముద్రని వేస్తుంది కాబట్టి, ఎవరికి వారు వ్యక్తిగతంగా, జ్యోతిషం నిజమో కాదో పరీక్షించడానికి గట్టిగా ప్రయత్నిస్తే తప్ప జ్యోతిషం తప్పని పూర్తిగా అంగీకరించడం సాధ్యం కాదు.

జ్యోతిషం పనిచేస్తుందో, పని చెయ్యదో తేల్చుకోవడం మరీ కష్టమేమీ కాదు. అయితే దానికి తాను కేవలం జాతకం చూసి, జాతకుడితో మాట్లాడకుండా, ఏ విధమైన సమాచారమూ స్వీకరించకుండా సరైన ఫలితాలు చెప్పగలను అన్న నమ్మకం ఉన్న జ్యోతిష్కులు కావాలి. జ్యోతిషం పని చేస్తుంది అని ఋజువు చెయ్యడం అవసరమే అని వాళ్ళు భావించాలి. (కనీసం తమ నమ్మకాలు తప్పో, ఒప్పో తేల్చుకోవాలి అని భావించేవాళ్ళైనా సరే కావాలి – అయితే అంత నిజాయితీ కలవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారో నాకు అనుమానమే.) అంతే కాదు, వాళ్ళు తమ ప్రతిభని పరీక్షకి పెట్టడానికి ఒప్పుకోవాలి. అయితే అసలు సమస్య ఇక్కడే ఉంది. కొంచం పేరు, ప్రతిష్ఠలు సంపాదించిన జ్యోతిష్కులు కూడా అసలు పరీక్షించడం అన్న భావననే ఒప్పుకోరు. ఎందుకంటే అందులో వాళ్ళ పేరు, ప్రతిష్ఠలు బలి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. అందుకే నేను కొన్ని సూచనలు చెయ్యదలచుకున్నాను.

జ్యోతిష్కులకి తమ ప్రతిభని తామే పరీక్షించుకునే అవకాశాలు కల్పించడం: పైన చెప్పిన లక్షణాలు గల జ్యోతిష్కుల కోసం ఒక వెబ్ సైట్ తయారు చెయ్యాలి. ఆ వెబ్ సైటుని పూర్తిగా నిష్పాక్షికంగా ఉండగల పరిశోధకులు నిర్వహించాలి. అందులో ఎవరైనా సరే తమ జన్మ వివరాలూ, జీవిత విశేషాలూ ఇవ్వవచ్చు. ఆ ఇచ్చిన సమాచారాన్ని వెరిఫై చేసి సరైనదో కాదో నిర్ణయించాలి. (లేదా సైటు నిర్వాహకులే శాస్త్రీయ పద్ధతుల్లో అటువంటి సమాచారాన్ని సేకరించాలి.) ఆ సైటులోకి జ్యోతిష్కులు తమ అసలు పేర్లు చెప్పకుండా ప్రవేశించవచ్చు. అక్కడ ఉన్న జన్మ వివరాల్ని బట్టి జ్యోతిష్కులు ఫలితాలు చెప్పాలి. తరువాత పరిశోధకులు ఆ ఫలితాల్లో ఎన్ని నిజమయ్యాయో పరిశీలించి ప్రకటించవచ్చు, లేదా ఆ జ్యోతిష్కులకి మాత్రమే తెలియజేయవచ్చు. ఇందులో వ్యక్తిగతంగా జ్యోతిష్కులకి జరిగే నష్టం ఏమీ ఉండదు, కాబట్టి వాళ్ళు తమ ప్రతిభని తామే పరీక్షించుకోడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అంతా జ్యోతిషానికి ఒక సవాలు అనీ, జ్యోతిష్కులు తప్పులు చెప్తే జ్యోతిషానికి ఆపద ముంచుకొస్తుందనీ వెబ్ సైటు నిర్వాహకులు భావించకూడదు, ప్రకటించకూడదు. (లేకపోతే జ్యోతిష్కులెవరూ ఆ సైటు జోలికే రారు).

ఆ వెబ్ సైట్ యొక్క ఉద్దేశ్యం ఏమై ఉండాలి అంటే, జ్యోతిష్కులు తాము సంపాదించుకున్న జ్ఞానాన్ని పరీక్షించుకోడానికి అవసరమైన ఒక వేదికను కల్పించడం. అంతే. దీనివల్ల కలిగే ప్రయోజనమేమిటంటే, జ్యోతిషం నిజంగా పని చేస్తుందో లేదో చూడాలనుకునే కుతూహలం గల జ్యోతిష్కులూ, జ్యోతిష విద్యార్థులూ, తమ నమ్మకాల్ని తామే వెరిఫై చేసుకోగలగడం. తాము తప్పులు చేసేకొద్దీ వాళ్ళలో శాస్త్రం మీద భ్రమలు తొలగే అవకాశం ఉంటుంది. లేదా, నిజంగా వాళ్ళు సరైన ఫలితాలు చెప్పగలిగితే, వాళ్ళు ఏ జ్యోతిష సూత్రాలు ఉపయోగించి ఫలితాలు చెప్పారో వాటిని ఇంకా గట్టిగా ఇతరులు పరిశోధించడానికి అవకాశం కలుగుతుంది. అటువంటి పరిశోధనలకి సహకరించగల ధైర్యం జ్యోతిష్కులకీ కలుగుతుంది. జ్యోతిషం నేర్చుకునేవాళ్ళ అసలు సమస్య ఏమిటంటే, తాము నేర్చుకునే సూత్రాలు వేటినీ పరీక్షకి గురి చెయ్యకుండా, కేవలం పుస్తకాలు చదివో, గురువుల అనుభవాలు వినో, జాతకాలు చెప్పడానికి సంసిద్ధమైపోవడం. ఇటువంటి ప్రయత్నాల ద్వారా కొంతమటుకు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోడానికి వాళ్ళకి సాధ్యపడుతుంది.

అయితే ఇటువంటి ప్రయత్నం సఫలమవ్వాలంటే జ్యోతిష్కుల్లో కనీసం కొంతమందికైనా జ్యోతిషం ఎంతమటుకు పనిచేస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండాలి. అది లేకుండా కేవలం నమ్మకాలకి అతుక్కుపోతే, ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదు.

వెరిఫై చెయ్యడానికి అవకాశం ఉన్న జ్యోతిష సూత్రాలని కంప్యూటర్ ద్వారా వెరిఫై చెయ్యడం: చాలా మంది జ్యోతిష్కులు కొన్ని ఖచ్చితమైన, సరళమైన జ్యోతిష సూత్రాలు ఉన్నాయనీ, వాటి ద్వారా చాలా సందర్భాల్లో సరైన ఫలితాలు వస్తాయనీ అంటూ ఉంటారు. అటువంటి సూత్రాలని జ్యోతిష్కులందరూ ఒక ఫోరంగా ఏర్పడి ప్రకటించడం గానీ, సేకరించడం గానీ చేయాలి. ఇటువంటి సూత్రాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే, శని లేదా రాహువు 8వ ఇంట్లో ఉంటే దీర్ఘాయుర్దాయం (75 కంటే ఎక్కువ). శని రెండో యింట్లో ఉంటే వివాహభంగం (విడాకులు లేదా separation). అష్టమంలో కేతువు వైధవ్యం. కేంద్రాల్లో గ్రహాలు పెద్దగా లేకపోతే అల్పాయుర్దాయం.

ఇటువంటి సూత్రాలని కంప్యూటర్ ప్రోగ్రాములని ఉపయోగించి వెరిఫై చెయ్యడం చాలా తేలిక. ఇటువంటి సూత్రాలకి మినహాయింపులు ఉంటే వాటిని కూడా ప్రోగ్రామ్ చెయ్యవచ్చు.
లేదా జ్యోతిష్కులు కనీసం ఒక్క అంశం మీద దృష్టిని కేంద్రీకరించి (వివాహం ఎప్పుడు జరుగుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతుంది మొదలైనవి), ఆ అంశాన్ని తాము ఎలా నిర్ణయిస్తారో, ఎన్ని జ్యోతిషాంశాలని పరిశీలిస్తారో వివరంగా సమాచారం తయారు చెయ్యాలి. (అందులో ఎన్ని వందల, వేల అంశాలు, స్టెప్పులూ ఉన్నా పరవాలేదు.) దాన్ని బట్టి ఒక కంప్యూటర్ ప్రోగ్రాము తయారు చేయాలి. ఆ ప్రోగ్రాముకి జాతకుల వివరాలు ఇస్తే, నూటికి యాభై శాతానికి మించిన సందర్భాలలో అది సరైన ఫలితాలు చెప్పగలిగితే జ్యోతిషం పని చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించినట్టే.

ప్రయత్నిస్తే పోయేదేముంది, మన అజ్ఞానం తప్ప!
సైంటిస్టుల దృష్టిలో జ్యోతిష్కులు తప్పుదోవ పట్టినవాళ్ళు. జ్యోతిషం సూడో సైన్సు. శాస్త్రవిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా జ్యోతిషం వంటి అశాస్త్రీయ విషయాలపై నమ్మకాలు కలిగి ఉండడం హేతువాదుల దృష్టిలో హాస్యాస్పదమైన విషయం. జ్యోతిష్కుల దృష్టిలో మాత్రం జ్యోతిషం తమ స్వానుభవం ప్రకారం వెరిఫై చెయ్యబడిన శాస్త్రం. తమ వ్యక్తిగతానుభవంలో జ్యోతిషం నిజమని నిరూపించబడినప్పటికీ, ఆ వ్యక్తిగతానుభవాన్ని సార్వత్రికం చెయ్యలేకపోతే, ఆ అనుభవానికి ఉన్న విలువ ఏమిటి? సైన్సుకి జ్యోతిషం పట్ల మొహమాటమేమీ ఉండదు. అది నిజంగా పని చేస్తుందని తేలితే దానివల్ల సైన్సుకి కలిగే లాభమే ఎక్కువ. అయితే అది పని చేస్తుందనడానికి సైన్సుకి ఇంతవరకూ ఏ ఆధారాలూ లభించలేదు.

జ్యోతిష్కులు భ్రమల్లోనూ, అజ్ఞానంలోనూ బ్రతుకుతున్నారని సైన్సు అంటుంది. కాదని జ్యోతిష్కులు నిజంగా భావిస్తే నిరూపించవలసిన బాధ్యత వారి మీదే ఉంటుంది. ఏది ఏమైనా మన నమ్మకాలని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే తప్పేముంది? తప్పో, ఒప్పో పరిశీలిస్తే పోయేదేముంది?

మహా అయితే మన అజ్ఞానం తప్ప!!
---------------------------------------------------------
రచన: నాగ మురళీకృష్ణ వాడవల్లి, 
ఈమాట సౌజన్యంతో

No comments: