Saturday, February 16, 2019

జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3


జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3





సాహితీమిత్రులారా!


నమ్మకాలు – విశేషాలునమ్మకాలకి ఉండే ప్రధానమైన లక్షణం ఏమిటంటే అవి నిజమో కాదో తేల్చే అవకాశం చాలా తక్కువగా ఉండడం. God Delusion పుస్తకంలో క్రైస్తవ మతం యొక్క నమ్మకాలని రిచర్డ్ డాకిన్స్ ఇలా క్లుప్తీకరిస్తాడు –

పూర్వకాలంలో ఒకాయన తండ్రి అవసరం లేకుండానే ఒక కన్యకి పుట్టాడు.
తండ్రిలేని అతడు, శరీరం కుళ్ళిపోవడానికి అవసరమైనకన్నా ఎక్కువ కాలం క్రితమే చనిపోయిన లాజరస్ అనే ఒక స్నేహితుడిని పిలిస్తే, లాజరస్ బ్రతికి వచ్చాడు.
ఆ తండ్రిలేని వ్యక్తే తరువాత చంపబడి, సమాధి చెయ్యబడి, మూడు రోజులు గడిచాకా బ్రతికి వచ్చాడు.
నలభై రోజులు గడిచాకా ఆ తండ్రిలేని వ్యక్తి ఒక కొండ పైకి ఎక్కి శరీరంతో సహా ఆకాశంలోకి మాయమైపోయాడు.
నీ మనసులో కొన్ని ఆలోచనల్ని నువ్వు గొణుక్కుంటే, ఆ తండ్రిలేని వ్యక్తీ, అతని తండ్రీ (ఇద్దరూ మళ్ళా ఒకటే) విని, వాటి గురించి ఏదో ఒకటి చేస్తారు. అతడు ఏకకాలంలో ఈ ప్రపంచంలో ఉన్న అందరి ఆలోచనల్నీ వినగలడు.
నువ్వేమైనా చెడు చేసినా, మంచి చేసినా ఆ తండ్రిలేని వ్యక్తి అంతా చూస్తాడు. తదనుగుణంగా నిన్ను శిక్షించడంగానీ, బహుమానించడంగానీ చేస్తాడు – అది నువ్వు చనిపోయిన తరవాత కూడా కావచ్చు.
తండ్రిలేని వ్యక్తి యొక్క కన్య అయిన తల్లి చనిపోలేదు, బొందితో స్వర్గానికి పోయింది.
ఈ విధమైన నమ్మకాలకు రుజువులు ఉండక్కరలేదు. ఇవి తప్పు అని కూడా రుజువు చెయ్యడం చాలా కష్టం. ఇటువంటివి జరగడం దాదాపు అసాధ్యమనీ, రుజువులు లేకుండా నమ్మకాలు కలిగి ఉండడం ప్రమాదకరమనీ చెప్పడానికి గ్రంథాలు రాయాల్సి ఉంటుంది. పెద్దయెత్తున భౌతికవాద, హేతువాద సిద్ధాంతాలు వివరించాల్సి ఉంటుంది. అయినా ఈ నమ్మకాల్ని కలిగిఉండేవాళ్ళు వాటిల్ని వదులుకోడానికి ఇష్టపడరు.

జ్యోతిషంలో ఉండే నమ్మకాలు కూడా ఇంచుమించు ఈ కోవలోకే వస్తాయి. జ్యోతిషం ఏం నమ్ముతుందంటే –

ఆకాశంలో తిరిగే గ్రహాలు మానవ జీవితంలోని వివిధ భాగాల్ని, సన్నివేశాల్నీ సూచిస్తాయి.
ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉండే నక్షత్ర మండలాలు కూడా గ్రహాల్లాగే మానవ సమాజం మీద, జీవితం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
గ్రహగతుల్ని బట్టి నీకు పెళ్ళవుతుందో లేదో, ఎలాంటి అమ్మాయిని చేసుకుంటావో, ఎలాంటి ఉద్యోగం చేస్తావో మొదలైన విషయాలు చెప్పవచ్చు.
కొన్ని రకాల రత్నాల్ని ధరించడం ద్వారాను, కొన్ని మంత్రాలు జపించడం వల్లా, గ్రహాలు సూచించే భవిష్యత్తులోని దుష్ఫలితాలనుంచి తప్పించుకోవచ్చు.
అయితే జ్యోతిషం ప్రత్యేకత ఏమిటంటే – గ్రహాల, నక్షత్రాల ప్రభావం మానవ జీవితం మీద నిజంగానే ఉంటుందని నమ్మినా, దాని ద్వారా గతమూ, భవిష్యత్తూ తెలుస్తుంది అని ఎవరన్నా అంటే, ‘ఏదీ, నా గతమో, భవిష్యత్తో చెప్పు చూద్దాం’ అని వెంటనే అడగవచ్చు. అంటే అది తప్పో ఒప్పో తేల్చుకోవడం చాలా తేలిక. నిజంగా జ్యోతిషాన్ని నమ్మిన వాళ్ళకి కూడా కొంతకాలానికి దానిమీద భ్రమలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు కేవలం నమ్మకానికి అతుక్కుపోకుండా అది నిజంగా పని చేస్తుందో లేదో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి ఉండాలి. కానీ చాలా మందికి నమ్మడమో, లేకపోతే తప్పు అనడమో తప్ప కొంచం ఓపికగా పరీక్షించి చూసే అవకాశం ఉండదు. అందుకనే జ్యోతిషం లాంటి వెరిఫై చెయ్యగలిగిన సిద్ధాంతాలు కూడా ఇంతకాలం ఎటూ తేలకుండా నిలబడిపోవడం జరిగింది.

అయితే జ్యోతిషంలో కూడా వెరిఫై చెయ్యలేని భాగం చాలానే ఉంటుంది. ఉదాహరణకి పాశ్చాత్య జ్యోతిషంలో జాతకాల సహాయంతో మనోవిశ్లేషణ చేసి మానసిక సమస్యలకి పరిష్కారాలు సూచించడం జరుగుతుంటుంది. అందులో జ్యోతిష సంకేతాలు నామమాత్రంగా, జ్యోతిష్కుడూ, జాతకుడూ మాట్లాడుకోడానికి ఒక భూమిక (common ground) గా పనికివస్తాయి తప్ప అవి నిజం కావలసిన అవసరమే లేదు. జాఫ్రీ డీన్ చేసిన ప్రయోగం కూడా ఈ విషయాన్నే ధ్రువపరుస్తుంది. అలాగే భారతీయ జ్యోతిషంలో ‘నీకు ప్రస్తుతం దశ బాగాలేదు, ఈ రత్నం ధరిస్తే కష్టాలు తగ్గుతాయి’ అన్నారనుకోండి. రత్నం ధరించిన తరవాత పెద్ద తేడా ఏమీ లేకపోయినా అది ధరించడంవల్ల నిజంగా రావలసిన పెద్ద కష్టాలేవో తప్పిపోయాయి అని జ్యోతిష్కుడు అనవచ్చు. లేదా రత్నం ధరించకపోతే, ఏ చిన్న కష్టం వచ్చినా రత్నం ధరిస్తే అది తప్పిపోయి ఉండేది అనవచ్చు. కాబట్టి రత్నాలు ధరించడం వల్ల కష్టాలు తప్పుతాయి అన్నమాటని నిరూపించడం కష్టం.

తప్పని నిరూపించగలిగేవే పనికొచ్చే సిద్ధాంతాలు
కార్ల్ పాపర్ The Logic of Scientific Discovery గ్రంథంలో ‘తప్పని నిరూపించగలగడం’ (falsifiability) గురించి వివరిస్తాడు. ఫాల్సిఫయబిలిటీ అంటే ఏ సిద్ధాంత ప్రతిపాదన (conjecture) అయినా సరే కొన్ని రుజువులద్వారా తప్పు అని నిరూపించబడడానికి అనువుగా ఉండాలి. ఈ లక్షణాన్ని బట్టి అది శాస్త్రీయమో (scientific) కాదో చెప్పడం చాలామటుకు సాధ్యమౌతుంది. తప్పు అని నిరూపించడమే అసాధ్యమైతే అది సైన్సు కాజాలదు. ప్రయోగాలు, పరిశీలనల ద్వారా తప్పు అని నిరూపించబడిన ప్రతిపాదనల్ని తిరస్కరించడం, పరిశీలనకి నిలబడిన సిద్ధాంతాలని స్వీకరించడం జరుగుతుంది. అయితే నిరూపణకి నిలబడినంత మాత్రాన ఆ సిద్ధాంతం ‘నిజం’ అయిపోదు. మరొక నిరూపణ ద్వారా అది తప్పు అని రుజువుచెయ్యబడేంతవరకూ మాత్రమే ఆ సిద్ధాంతం పరిశీలించబడుతున్న విషయాలకి ఒక అంగీకరించబడిన వివరణగా నిలుస్తుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు సిద్ధాంతాలని కొత్త పరిశీలనలకి గురి చెయ్యడం ద్వారా సైన్సు పురోగమిస్తుంది.

అయితే కార్ల్ పాపర్ చెప్పినది మొత్తం సైంటిఫిక్ ఫిలాసఫీలో ఒక అంశం మాత్రమే. సైంటిఫిక్ ఫిలాసఫీ పరిధి చాలా విస్తృతమైనది. క్వాంటం ఫిజిక్సు, స్ట్రింగ్ థియరీ వంటి నవ్య నూతన సిద్ధాంతాలలో ఈ ‘ఫాల్సిఫయబిలిటీ’కి లొంగని చిక్కులు ఉంటాయి. అయినప్పటికీ పాపర్ చెప్పిన విషయాన్ని చాలామటుకు దైనందిన జీవితంలో ఎదురయ్యే నమ్మకాల నిజానిజాలను గురించి సందేహించడానికి ఒక ప్రాతిపదికగా స్వీకరించవచ్చు.

ఏ సిద్ధాంతమైనా అసలు శాస్త్రీయ పరిశీలనకి గురిచెయ్యడానికి అనువుగా లేకపోతే దాన్ని తప్పకుండా సందేహించాల్సి ఉంటుంది. ఐన్ స్టీన్ చెప్పిన రెలెటివిటీ సిద్ధాంతాన్ని పరిశీలనలద్వారా తప్పో ఒప్పో నిరూపించవచ్చు. పరిశీలనల్లో అది నిజమే అని నిరూపితమైంది. అది నిజమని నిరూపించబడడం వేరు సంగతి, అసలు ఆ సిద్ధాంతం తప్పని నిరూపించడానికి అవకాశం ఉంది, కాబట్టే అది శాస్త్రీయమైనది అని పాపర్ అంటాడు.

1998 మే నెలలో భారతదేశం అణుపరిక్షలు జరిపినప్పుడు ఇండియా-టుడే ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక విలేకరులు పోఖ్రాన్ పరిసర ప్రాంతాల్లో గల ప్రజలని వాళ్ళ అనుభవాలగురించి ప్రశ్నించారు. అలా ప్రశ్నించినవాళ్ళలో ఒక సాధువు ఉన్నాడు. ‘భూ కంపం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా’ అని ఆ సాధువుని విలేకరి అడిగాడు. అప్పుడా సాధువు భూకంపాలు ఎందుకు వస్తాయో ఇలా వివరించాడుట – ‘భూమి మొత్తాన్ని ఒక గోవు తన కొమ్ము పైన మోస్తూ ఉంటుంది. ఒక్కోసారి తనకు బరువు అనిపించినప్పుడు భూమిని ఒక కొమ్ము మీదనుంచి మరొక కొమ్ము మీదకి మార్చుకుంటూ ఉంటుంది. ఆ కదలిక మనకి భూకంపంలాగా అనిపిస్తుంది’.

మానవుడు అంతరిక్షంలోకి ప్రయాణం చేసి ఉండడం వల్లా, ఉపగ్రహాల సహాయంతో భూమిని ఫొటోలు తీసి ఉండడం వల్లా ఇలాంటి సిద్ధాంతాలు మనకి చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాయి. అంతరిక్షంలోంచి తీసిన ఫొటోల్లో భూమిని మోస్తున్న గోవు ఏమీ కనపడలేదు కాబట్టి ఆ సిద్ధాంతం తప్పు అని నిరూపించబడినట్టే. కానీ సైన్సు ఇంతగా అభివృద్ధి చెందని పాతరోజుల్లో ఈ సిద్ధాంతం వెరిఫై చెయ్యలేని ‘నమ్మకం’ మాత్రమే. అప్పట్లో దానిని తప్పు అనడం కష్టం.

బెర్ట్రండ్ రస్సెల్ దేముడున్నాడా అని చర్చిస్తూ మరొక ఉదాహరణ ఇస్తాడు. భూమికీ, కుజ గ్రహానికీ మధ్యలో ఒక చిన్న టీ కప్పు ఉందనుకోండి. అది కూడా సూర్యుడిచుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నదనుకోండి. అయినా అది ఎంత చిన్నదంటే ప్రస్తుతం మనకున్న అత్యంత శక్తివంతమైన టెలిస్కోపులు కూడా దాన్ని కనిపెట్టలేవనుకోండి. అటువంటి టీకప్పు ఉన్నది అని కనిపెట్టడం అసాధ్యం కాబట్టి, అది ఉంది అని నేను గట్టిగా చెప్పినంతమాత్రాన అది నిజమైపోతుందా? అంటాడు.

ఈ ఉదాహరణలతో పోల్చి చూస్తే ‘జ్యోతిషం ద్వారా భవిష్యత్తు తెలుస్తుంది’ అన్న విషయాన్ని తప్పని నిరూపించడం ఏమంత కష్టం కాదు. కాబట్టి జ్యోతిషం ఫాల్సిఫయబిలిటీ పరిధిలోకే వస్తుంది అనుకోవచ్చు. అందుచేత అది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం, సైన్సు కానక్కరలేదు అని వదిలెయ్యవలసిన అవసరం లేదు.
జ్యోతిషం నిజంగా పని చేస్తుందని తేలితే సైన్సు అయిపోతుందా?
జ్యోతిషం పైన ఇంతవరకు జరిగిన పరిశోధనలు అన్నీ స్టాటిస్టిక్సు మీద ఆధారపడినవి. జ్యోతిష్కులకి జాతకాలు ఇచ్చి వాళ్ళు ఒక విషయాన్ని సరిగ్గా అంచనా వెయ్యగలిగారో లేదో చూడడం, లేదా అనేకమంది జాతకాలని వాళ్ళ జీవితవిశేషాలతో పోల్చి అవి జ్యోతిష ఫలితాలకి అనుగుణంగా ఉన్నాయో లేదో చూడడం లాంటివి ఈ పరిశోధనల్లో ఉంటాయి. ఈ పరిశోధనల్లో కొన్నిటి గురించి చర్చించుకునే ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. నిజంగానే గణాంకాల ప్రకారం జాతకాలకీ జీవిత సన్నివేశాలకీ పొంతన ఉన్నది అని నిరూపించబడింది అనుకోండి. అప్పుడు జ్యోతిషం నిజమైపోయినట్టేనా? సైన్సు అయిపోయినట్టేనా? సైన్సు ఎలా పురోగమిస్తుందో తెలుసుకుంటే దీనికి సమాధానం కొంతవరకు దొరుకుతుంది. (ఈ చర్చ The mind in the cave, p48-49 ఆధారంగా చేయబడ్డది. )

ఏదైనా ఒక క్రొత్త విషయం పరిశీలనల్లో బయటపడినప్పుడు దానికి సంబంధించిన వివరణల్ని (explanation of a phenomenon) నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అటువంటి వివరణ అప్పటికే నిరూపింపబడి, అంగీకరించబడిన పరిశీలనలకీ, సిద్ధాంతాలకీ అనుగుణంగా ఉండాలి. ఉదాహరణకి ఏదైనా ఒక గ్రహ కక్ష్యలో చిన్న తేడా ఉన్నదనుకోండి. అది ఎలా వచ్చిందో వివరించడానికి ఆల్ఫా సెంటారి దగ్గర నివసిస్తున్న గ్రహాంతరవాసులు పంపిస్తున్న లేజర్ కిరణాలు కారణం అన్నారనుకోండి. మిగతా గ్రహాల కక్ష్యలన్నిటికీ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్నీ, ఈ ఒక్క గ్రహానికీ ఈ లేజర్ కిరణాల సిద్ధాంతాన్నీ ఉపయోగిస్తాను అంటే అది అంగీకారం కాదు. అదేవిధంగా అటువంటి వివరణ ఏదైనా సరే అంతర్గతంగా ఏకరీతిగా (internally consistent) ఉండాలి. అందులోని భాగాలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉండకూడదు. అలాగే వివరణలు ఏదో ఒక పరిమితమైన విషయాన్ని మాత్రమే వివరించగలిగేట్టుగా కాకుండా అనేక అంశాలకి అన్వయించగలిగేట్టు ఉండాలి. ఉదాహరణకి గురుత్వాకర్షణ కేవలం జడ పదార్థాలకి మాత్రమే పని చేస్తుంది, కదలగలిగే (లేక ఎగరగలిగే) వాటికి పని చెయ్యదు అని నిరూపించబడి ఉంటే బహుశా శాస్త్రజ్ఞులు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఒప్పుకుని ఉండేవారు కాదు.

అంతేకాకుండా ఒక వివరణ ఫలితంగా వెరిఫై చెయ్యగలిగే కొత్త విశేషాలు బయట పడేట్టు ఉండాలి. అలాగే ఒక వివరణ మరిన్ని కొత్త ప్రశ్నలకీ, పరిశోధనలకీ దారితీసి శాస్త్ర జ్ఞానాన్ని విస్తృతపరచే విధంగా ఉండాలి. జ్యోతిషం నిజమని నిరూపించబడింది అంటే ఒక కొత్త విషయం కనిపెట్టబడిందని అర్ధం. అయితే అది ఎలా పనిచేస్తోంది అన్న దానికి జ్యోతిష్కులదగ్గర ఏ విధమైన వివరణా ఉండదు. అధిక శాతం జ్యోతిష్కులు ‘As above, so below’ అన్న నానుడిని ఉటంకించి, మనిషి సమస్త విశ్వానికీ ఒక సూక్ష్మ ప్రతిబింబం లాంటి వాడు, కాబట్టి విశ్వాంతరాళంలో జరిగేవన్నీ మనిషిలో (మనిషి జీవితంలో) ప్రతిబింబిస్తూ ఉంటాయి అని ఉపన్యాసాలిస్తూ ఉంటారు. అదేమీ శాస్త్రీయమైన సిద్ధాంతం కాదు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే కొంత సైన్సు తెలిసినవాళ్ళూ, జ్యోతిషం పైన పరిశోధన చేసినవాళ్ళూ భూఅయస్కాంత క్షేత్ర ప్రభావం (Geomagnetism) మనిషి మెదడుపై ఉండవచ్చుననీ, జ్యోతిషం శాస్త్రీయమని నిరూపించబడడానికి ఆ దిశగా పరిశోధనలు జరగాలనీ ప్రతిపాదించారు. దాని గురించి తరువాత వివరిస్తాను. ప్రస్తుతానికి అది కూడా శాస్త్రీయమైన సిద్ధాంతమేమీ కాదు, కేవలం ఊహాగానం మాత్రమే.

జ్యోతిషం మీద పరిశోధన చేసిన మిషెల్ గోక్‌లా (Michel Gauquelin) అభిప్రాయం ప్రకారం (The Truth About Astrology, p 14-15) -గణాంకాల (స్టాటిస్టిక్సు) ద్వారా కనుగొనే సూత్రమేదైనా సరే ప్రకృతి సహజమైన నియమమే అనుకోవచ్చు. గ్రిగర్ మెండల్(Gregor Mendel) బఠాణీ మొక్కలని అంటుకట్టించే ప్రయోగాలు చేసి స్టాటిస్టిక్సు సహాయంతో ఆనువంశికతా నియమాన్ని కనుగొన్నాడు. కానీ మెండల్ కనుగొన్న విషయాన్ని ఒక 50 సంవత్సరాలపాటు ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే మెండల్ ఒక మతగురువు, ఔత్సాహికుడూ మాత్రమే, శాస్త్రజ్ఞుడు కాదు. పైగా అతడు కనుగొన్నది అప్పటి కాలంలో అంగీకరించబడిన సిద్ధాంతాలకి విరుద్ధంగా ఉంది. అతడు తన ఆనువంశికతా నియమాల్ని కనుగొన్న ఒక వంద సంవత్సరాలకిగానీ డీ.ఎన్.ఏ ని కనుగొనడం, ఆ నియమాల్ని వివరించడానికి ఒక ఖచ్చితమైన భౌతిక ప్రాతిపదిక దొరకడం జరగలేదు. కాబట్టి మొదట జ్యోతిషం పని చేస్తుంది అని గణాంకాల ద్వారా నిరూపిస్తే సైంటిస్టులు జ్యోతిషాన్ని హాస్యాస్పదమైన విషయంగా కొట్టిపారెయ్యకుండా ముఖ్యమైన విషయంగా (సీరియస్ గా) తీసుకుని, పరిశోధనలు చెయ్యడానికి అవకాశం కలుగుతుంది అని మరికొందరు జ్యోతిష్కుల అభిప్రాయం. (ఇక్కడ స్టాటిస్టిక్సు గురించిన ఒక జోకు చెప్పకుండా ఉండలేను. స్టాటిస్టిక్సు తెలిసినవాళ్ళు క్షమించాలి. ఈ ప్రపంచంలో మూడు రకాల అబద్ధాలు ఉన్నాయట. మామూలు అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, స్టాటిస్టిక్సు.)

అయితే ఇంతవరకూ జ్యోతిషం మీద జరిగిన పరిశోధనలన్నీ అసలు జ్యోతిషం పని చేస్తుంది అన్న విషయాన్ని పూర్తిగా సమర్ధించడమే (నిర్ధారించడమే) చెయ్యలేదు. ఎక్కువశాతం పరిశోధనలు జ్యోతిషం అబద్ధమని నిరూపించినా, కొన్ని పరిశోధనలు నిజమని కూడా నిరూపించాయి. (నిజమని నిరూపించినవి చాలా సందేహాస్పదమైనవి అని సైంటిస్టుల/ హేతువాదుల అభిప్రాయం.) ఒకవేళ ఎవరైనా స్టాటిస్టిక్సు సహాయంతో నిజంగా, సందేహాతీతంగా జ్యోతిషం పనిచేస్తుందని నిరూపించినా, అది వెంటనే ఉన్నపళంగా, యథాతథంగా సైన్సు అయిపోదు. అటువంటి నిరూపణ అనేకమైన ప్రశ్నలకీ, ప్రతిపాదనలకీ, పరిశోధనలకీ దారి తీస్తుంది మాత్రమే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జ్యోతిషం పైన జరిగిన కొన్ని పరిశోధనల వివరాల్ని చూద్దాము.

జ్యోతిషం పైన జరిగిన కొన్ని పరిశీలనలూ, పరిశోధనలూ
ఈ క్రింది పరిశోధనలు జ్యోతిషం పని చెయ్యదు అని నిరూపించాయి.

1967 లో మిషెల్ గోక్‌లా (The Cosmic Clocks, p 84) చేసిన పరిశోధనలో – జీవితంలో విజయాన్ని సాధించినవాళ్ళ జాతకాల్లో శని ఉండే ఇంటినీ, అలాగే హత్యలు చేసినవాళ్ళ జాతకాల్లో కుజుడు ఉండే ఇంటినీ పరిశీలించడం జరిగింది. ఈ రెండింటికీ శనీ, కుజుడూ ఏ ఇంట్లో ఉన్నారో అన్నదానితో సంబంధమే లేదని తేలింది.
1969 నుంచి 1973 మధ్యలో న్యూయార్కులో ఆత్మహత్య చేసుకున్న 311 మంది వ్యక్తుల జనన వివరాలు సేకరించారు (Journal of Geocosmic Research, v.2, 23-47, 1978). అందులోని ప్రతీ వ్యక్తికీ జోడుగా, అదే ప్రాంతంలో అదే సంవత్సరంలో పుట్టిన మరొక మామూలు వ్యక్తి వివరాల్ని రాండమ్ గా సేకరించారు. ఈ మొత్తం వివరాల్ని ఆత్మ హత్య చేసుకున్న సంవత్సరాల ప్రకారం మూడు భాగాలు చేసారు. ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ని ఉపయోగించి ఆత్మహత్య చేసుకున్నవాళ్ళ జాతకాలనీ, చేసుకోనివాళ్ళ జాతకాలనీ పోల్చి చూశారు. ఆ పోల్చడంలో కూడా కొన్ని వేల జ్యోతిషాంశాలని తీసుకుని, అన్నింటినీ పోల్చారు. అందులో ఒక్క అంశం కూడా స్థిరంగా ఆత్మహత్యని సూచించలేదు.
1974 లో ప్రకటించిన మరొక పరిశోధనలో (Leonardo 7, 235 ) వృత్తికీ, ఆరోగ్య సమస్యలకీ, ఎత్తుకీ, ఆయుర్దాయానికీ – పుట్టినసమయంలో బుధ, శుక్ర, కుజ, గురు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అన్నదానికీ సంబంధమే లేదు అని తేలింది.
1979 లో జర్నల్ ఆఫ్ సైకాలజీ, జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకాలజీల్లో రెండు పరిశోధనలు ప్రకటించబడ్డాయి. వాటిప్రకారం ఒక వ్యక్తి అంతర్ముఖుడా, బహిర్ముఖుడా (Extroversion, Introversion) అన్న విషయానికీ, జ్యోతిషాంశాలకీ సంబంధం ఉన్నది అని తేలింది. అయితే అదే సంవత్సరం అవే పరిశోధనల్ని మళ్ళీ చేసి (replication) జర్నల్ ఆఫ్ సైకాలజిలో ప్రకటించిన ఫలితాల ప్రకారం ఆ విషయం రుజువు కాలేదు. అంతే కాకుండా మొదట వచ్చిన ఫలితానికి కారణం ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తులకి ఏ రాశులకి ఏ ఫలితాలు రావాలో ముందే తెలిసి ఉండడమే కారణం అని అదే సంవత్సరం మరొక జర్నల్ (Zeitschrift fur Sozilpsychologie, 10, 54 ) లో ప్రకటించబడింది. తరువాతి సంవత్సరాల్లో జరిగిన వేర్వేరు పరిశోధనల్లో కూడా ఈ అంతర్ముఖ, బహిర్ముఖత్వాలకీ జ్యోతిషాంశాలకీ ఏమీ సంబంధం లేదని రుజువైంది.
1979 లో (The Truth About Astrology, p140) మిషెల్ గోక్‌లా ఒక పత్రికలో ఉచితంగా జాతకం చెప్తామని ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనకి సమాధానమిచ్చిన 150 మందికి జాతక ఫలితాలు రాసి పంపించి, అవి ఎంతవరకు సరిపోతున్నాయో వాళ్ళనీ, వాళ్ళ బంధు మిత్రుల్నీ చెప్పమన్నాడు. ఒక డజనుమంది అతనికి సమాధానమిచ్చారు. అందులో 90 శాతం మందీ, వాళ్ళ బంధు మిత్రుల్లో 80 శాతం మందీ ఆ జాతక ఫలితాలు సరిపోతున్నాయని అన్నారు. అయితే మొత్తం అందరికీ అతడు ఒకే జాతక ఫలితాలు పంపించాడు. ఆ జాతకం కనీసం ఒక యాభై హత్యలు చేసి పేరు గడించిన ఒక హంతకుడిది.
1985 లో హారీ ఎడ్వర్డ్స్ అనే ఆయన 1984 వ సంవత్సరానికి చెందిన Old Moore’s Almanack అన్న పత్రికను తీసుకుని అందులోని ప్రిడిక్షన్సుని పరిశీలించాడు. అవి చాలా ప్రసిద్ధులైన జ్యోతిష్కులు రాసినవి. అతను పరిశీలించిన 200 ప్రిడిక్షన్సులో 5 శాతం కన్నా తక్కువ నిజమయ్యాయి. అవి కూడా యాదృచ్ఛికంగానో, ముందే తెలిసిన విషయాలవల్లనో నిజమవడానికే అవకాశాలు ఎక్కువ.
1985 లో నేచర్ పత్రికలో షాన్ కార్ల్సన్ అనే ఆయన 28 మంది నిపుణులైన జ్యోతిష్కులతో కలిసి చేసిన రెండు ప్రయోగాల్ని ప్రకటించాడు. అందులో ఒక ప్రయోగంలో 83 మందికి మూడు జాతకాలు, వాటి వివరణలు ఇచ్చి, ఆ వివరణల్నిబట్టి అందులో తమ జాతకమేదో గుర్తించమన్నాడు. కేవలం 28 మంది మాత్రమే తమ జాతకచక్రాల్ని గుర్తించగలిగారు. ఇది యాదృచ్ఛికంగా కలిగే ఫలితాల శాతాన్ని (random chance) మించలేదు. అలాగే జ్యోతిష్కులకి 116 మంది వ్యక్తుల వ్యక్తిత్వ విశ్లేషణా పత్రాలూ (Personality Index Survey), వాటికి జత చేసి మూడు జాతకాలూ ఇచ్చారు. వ్యక్తిత్వ విశ్లేషణనిబట్టి సరైన జాతకమేదో ఎన్నుకోమన్నారు. 116లో కేవలం 40 పత్రాలకి మాత్రమే సరైన జాతకాన్ని గుర్తించడం జరిగింది. ఇది కూడా random chance ద్వారా వచ్చే ఫలితాల శాతాన్ని మించలేదు.
1988లో (Prometheus p 215) జాన్ మెకాల్ అనబడే జ్యోతిష్కుడు తను కోరిన నియమాల ప్రకారం ఎన్నుకున్న 28 మందిలో ఒక్కొక్కరికీ మూడేసి జాతకాలు పరిశీలించి అందులో 7 మందికి మాత్రమే సరైన జాతకాన్ని ఎన్నుకోగలిగాడు. అదీ రాండమ్ చాన్సు శాతాన్ని మించలేదు.
1990, Journal of Scientific Exploration (vol. 4, p.75-83) లో ప్రకటించిన ఒక ప్రయోగంలో ఆరుగురు నిపుణులైన జ్యోతిష్కులు 23 జాతక చక్రాలని తీసుకుని ఆ జాతకచక్రాలు ఎవరివో ఆ 23 మంది వ్యక్తుల గత చరిత్ర, ఫొటోలు, వ్యక్తిత్వ విశ్లేషణలు వగైరా పరిశీలించి ఏ జాతకం ఎవరిదో జత చెయ్యడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు యాదృచ్ఛికంగా వచ్చే ఫలితాలకన్నా మెరుగైన ఫలితాలు సాధించలేకపోయారు. అంతేకాదు, జ్యోతిషం తెలియని మామూలు వ్యక్తులు అదే విధంగా జత చెయ్యగా వచ్చిన ఫలితాల కన్నా కూడా మెరుగైన ఫలితాలు తెప్పించలేకపోయారు. అంతేకాకుండా ఒక జ్యోతిష్కుడు జత చేసిన దానికీ మరొక జ్యోతిష్కుడు జత చేసిన దానికీ సంబంధమే లేదు.
2003, August, Journal of Consciousness Studies (vol. 10, no. 6-7) లో జాఫ్రీ డీన్ ప్రకటించిన పరిశోధన. ఇందులో కొద్దినిమిషాల తేడాలో జన్మించిన రెండువేలమంది వ్యక్తులకి సంబంధించిన సుమారు వంద అంశాలను కొన్ని దశాబ్దాల పాటు పరిశీలించడం జరిగింది. (ఒకే సమయంలో జన్మించినవారు కాబట్టి వాళ్ళందరికీ రాశుల్లోని గ్రహస్థితులు ఒకే విధంగా ఉంటాయి. అయితే వేర్వేరు చోట్ల పుట్టినవాళ్ళకి భావాలు మారిపోతాయి). పరిశీలించిన అంశాల్లో ఐక్యూ, కళల్లోనూ ఆటల్లోనూ అభినివేశం, ఆందోళన పడే స్వభావం, నలుగురిలోనూ తేలిగ్గా కలిసిపోగలగడం, వృత్తి మొదలైనవి అనేకం ఉన్నాయి. ఏ విషయంలోనూ వాళ్ళెవరికీ ఒకరితో ఒకరికి పోలికే లేదు.
జేమ్సు రాండీ జ్యోతిషం నిజమని నిరూపిస్తే ఒక లక్ష డాలర్ల బహుమతి ఇస్తానని 1989 లో ప్రకటించాడు. ఒక జ్యోతిష్కుడా ఛాలెంజికి ఒప్పుకొని పన్నెండుమంది జాతకాలు పరిశీలించాడు. ఆ పన్నెండుమందితో తరువాత ఇంటర్వ్యూలు చేసి ఎవరి జాతకం ఎవరిదో తేల్చడానికి ప్రయత్నించాడు. ఒక్క జాతకం కూడా సరిగ్గా పోల్చలేకపోయాడు. ప్రస్తుతం జేమ్సు రాండీ తన బహుమతి మొత్తాన్ని ఒక మిలియన్ డాలర్లు చేశాడు. ఇంకా ఎవరూ దాన్ని గెల్చుకోలేదు.
సూర్యుడున్న రాశిని బట్టి చెప్పే ఫలితాలపైన (సర్వ వ్యాప్తంగా కనిపించే ‘రాశి ఫలాలు’) ఇటువంటి ప్రయోగాలు అనేకం జరిగాయి. ఎందులోనూ ఆ ఫలితాలు నిజమని నిరూపించబడలేదు. అయితే చాలామంది జ్యోతిష్కులు కేవలం సూర్యుడున్న రాశి మీదో, చంద్రుడున్న నక్షత్రం మీదో ఆధారపడి చెప్పే ఈ దిన, వార, మాస ఫలాలని నిజమైన జ్యోతిషంగా పరిగణించరు. కాబట్టి ఈ పరిశోధనల వివరాలు ఉటంకించడంలేదు.
అయితే ఇంతవరకు జరిగిన పరిశోధనలన్నిటిలోనూ మిషెల్ గోక్‌లా చేసిన పరిశోధనలు ప్రత్యేకమైనవి. జ్యోతిషంతో, ముఖ్యంగా పాశ్చాత్య జ్యోతిషంతో పరిచయమున్నవాళ్ళు గోక్‌లా పేరు వినకుండా ఉండరు. అతని పరిశోధనలు చాలామంది జ్యోతిష్కులకి ఒక ఆశాదీపంలాగా అనిపిస్తాయి. కాబట్టి అతని పరిశోధనల గురించి కొంచం వివరంగా తెలుసుకుందాం.
మిషెల్ గోక్‌లా (Michel Gauquelin) పరిశోధనలు
గ్రహాల దైనందిన చలనం:(Diurnal Motion) మిషెల్ గోక్‌లా చేసిన పరిశోధనల్ని అర్ధం చేసుకోవాలంటే, మొదట గ్రహాల దైనందిన చలనం (Diurnal Motion) అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ వ్యాసం మొదటి భాగంలో భావాల గురించి వివరించడం జరిగింది. అందులో పరిచయం చేసిన భావనే ఇది. భూమి నుండి పరిశీలించినప్పుడు భూ భ్రమణాన్ని అనుసరించి తూర్పు నుండి పడమరకి గ్రహాలూ, నక్షత్రాలూ ఉదయించి అస్తమిస్తూ ఉంటాయి. ఒక ప్రదేశంలో ఒక సూర్యోదయం నుంచీ మరొక సూర్యోదయం వరకూ పట్టే కాలం ఆ ప్రదేశానికి ‘సౌర దినం’ అనుకుందాము. ఇది మనం మామూలుగా లెక్కపెట్టుకునే ఇరవై నాలుగు గంటల రోజు కాదు. ప్రదేశాన్ని బట్టి, ఋతువుని బట్టి ఈ రోజు పరిమాణం మారుతుంది. అదే విధంగా ఒక ప్రదేశంలో మిగతా గ్రహాలూ, నక్షత్రాలూ కూడా వేర్వేరు కాలాల్లో ఉదయించి అస్తమిస్తూ ఉన్నట్టుగా కనిపించే చలనాన్నే ఆయా గ్రహాల, నక్షత్రాల దైనందిన చలనం అంటారు.

ఈ దైనందిన చలనం అన్న భావన ఖగోళ శాస్త్రానికి చెందినది. దీనిలో చాలా విశేషాలే ఉంటాయి, కానీ మనకి ప్రస్తుతానికి పూర్తి వివరాలు అవసరం లేదు. గోక్‌లా ఏమి చేశాడంటే ప్రతీ గ్రహమూ తన దైనందిన చలనం ప్రకారం ఆకాశంలో ఉదయించి, నడినెత్తికి చేరి, అస్తమించి, మళ్ళా ఉదయించే గమన మార్గాన్ని కొన్ని సెక్టర్లుగా విభజించాడు. జాతకంలోని భావాలు కూడా ఇటువంటి విభాగాలే కానీ, భావాలూ, గోక్‌లా సెక్టర్లూ ఒకటి కాదు. ఈ సెక్టర్లు 12, 18, 36 ఇలా ఎన్ని విభాగాలు గానైనా ఉండవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. కుజుడి దైనందిన చలనాన్ని పన్నెండు సెక్టర్లుగా విభజించిన ఈ క్రింది రేఖా చిత్రాన్ని చూడండి. ఇది అక్టోబర్ 3, 1952 వ తేదీన పారిస్ నగరానికి లెక్క వేయబడింది.



మార్స్ ఎఫెక్టు: జ్యోతిషం మీద పరిశోధన చెయ్యలనే ఆసక్తితో ఫ్రెంచి వాడైన మిషెల్ గోక్‌లా (1928 – 1991) 1950 ప్రాంతాలలో అనేక ప్రసిద్ధులైన వ్యక్తుల జన్మ తేదీలు, జన్మ సమయాలు సేకరించాడు. ప్రసిద్ధులైన 576 ఫ్రెంచి డాక్టర్ల జన్మ సమయాలకి గ్రహ స్థితుల్ని గుణించి ఏ సెక్టర్లలో ఏ గ్రహాలు ఉన్నాయో స్టాటిస్టిక్సు ప్రకారం పరిశీలించాడు. ఆశ్చర్యకరంగా అతను గమనించిందేమిటంటే, డాక్టర్లలో ఎక్కువశాతం మందికి కుజుడు, శని 1, 4 సెక్టర్లలో ఉన్నారని. అలాగే అవే సెక్టర్లలో గురుడు ఉండడం తక్కువగా ఉందని. ఈ విధమైన గ్రహ స్థితి రాండమ్ చాన్సు ద్వారా రావలసిన ఫలితాల కన్నా భిన్నంగా ఉండడంతో, అతను అదే సంవత్సరాల్లో పుట్టిన డాక్టర్లు కాని సామాన్యుల జన్మ వివరాలు కూడా సేకరించి వాళ్ళ గ్రహ స్థితులు పరిశీలించి వాళ్ళ విషయంలో ఆ విధంగా జరగడం లేదని నిర్ధారించుకున్నాడు. డాక్టర్ల విషయంలో తన ఫలితాల్ని నిర్ధారించుకోడానికి మళ్ళా 508 మంది ప్రసిద్ధులైన డాక్టర్ల వివరాలు సేకరించి గ్రహ స్థితులు పరిశీలిస్తే మళ్ళీ అదే విధమైన ఫలితాలు వచ్చాయి.

దానితో అతను ఆరు వేలమంది వివిధ రంగాలకి చెందిన ప్రసిద్ధులైన వ్యక్తుల జన్మ వివరాలు సేకరించి అదే విధమైన పరిశీలన చేశాడు. ప్రసిద్ధులైన ఆటగాళ్ళూ, సైనికాధికారులూ కుజుడు 1, 4 సెక్టర్లలో ఉండగా జన్మిస్తున్నారనీ, గురుడు అవే సెక్టర్లలోఉండగా నటులూ, రాజకీయ నాయకులూ జన్మిస్తున్నారనీ, శని అవే సెక్టర్లలో ఉండగా సైంటిస్టులు జన్మిస్తున్నారనీ గమనించాడు. కానీ చిత్రకారులూ, సంగీతకారులూ మాత్రం శని 1, 4 సెక్టర్లలో ఉండగా జన్మించడం తక్కువని కూడా గమనించి, తన పరిశోధనా ఫలితాల్ని 1955 లో ప్రకటించాడు.

ఆటగాళ్ళ జన్మ సమయంలో కుజుడు ఉన్న సెక్టర్ల తీరుని ఈ క్రింది రేఖాచిత్రంలో చూడవచ్చు.

ఈ రేఖాచిత్రం కుజ గ్రహ ప్రభావానికి (మార్స్ ఎఫెక్టు) సూచికగా ప్రసిద్ధికెక్కింది. ఇది ఆటగాళ్ళ జన్మ సమయాల్లో మిగతా సెక్టర్ల కన్న ఒకటి, నాలుగు సెక్టర్లలో కుజగ్రహం ఎక్కువగా కనిపిస్తుందని సూచిస్తోంది. సెక్టరు ఒకటి అంటే ఒక గ్రహం ఉదయించిన తరువాత సుమారుగా రెండు గంటల కాలం. సెక్టరు నాలుగు అంటే ఒక గ్రహం నడినెత్తికి చేరిన తరువాత సుమారు రెండు గంటల కాలం. తరువాతి సంవత్సరాల్లో అతను ఫ్రాన్సులోనే కాకుండా అమెరికా, ఇంకా ఇతర యూరోపియన్ దేశాల్లోనుండి కూడా అనేక వేలమంది జన్మ వివరాలు సేకరించాడు. వాటి సహాయంతో గ్రహస్థితులు లెక్కవేసి ఫలితాల్ని విశ్లేషిస్తే అవి కూడా అంతకు ముందు వచ్చిన ఫలితాల్నే నిర్ధారించాయి.
సహజంగానే ఈ ఫలితాలు హేతువాదులూ, సైంటిస్టుల ఆసక్తిని రేకెత్తించాయి. ఆ ఫలితాల మీద అనేక పరిశీలనలూ, విశ్లేషణలూ, వేర్వేరు చోట్ల ఇవే పరిశోధనలు మళ్ళీ చేయడమూ (replication) కూడా జరిగింది. పెద్దయెత్తున వివాదాలూ చర్చలూ నడిచాయి. ఇవి ఇంకా పూర్తిగా సమసిపోలేదు. వాటి వివరాలు కొన్ని తెలుసుకునే ముందు గోక్‌లా పరిశోధనల విశేషాలు మరి కొన్ని తెలుసుకుందాం.

జ్యోతిషమూ – ఆనువంశికత
కొంతమంది జ్యోతిష్కుల విశ్వాసం ప్రకారం తల్లితండ్రుల జాతకాల్లోని గ్రహ స్థితులకీ, పిల్లల జాతకాల్లోని గ్రహ స్థితులకీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకి ఒక జ్యోతిష సూత్రం ప్రకారం తల్లి లేదా తండ్రి యొక్క జాతకంలో లగ్న, సూర్య, చంద్రులు ఏ రాశుల్లో ఉన్నారో, అవే రాశుల్లో పిల్లల లగ్న, సూర్య, చంద్రుల్లో ఒకరు ఉంటారు. ఇటువంటి విశ్వాసాలని ఆధారంగా చేసుకుని, గ్రహ స్థితులకీ ఆనువంశికతకీ (heredity) ఏమైనా సంబంధం ఉందేమో పరిశీలించడానికి గోక్‌లా పూనుకున్నాడు. తల్లితండ్రులూ, వాళ్ళ పిల్లలవీ కలిపి మొత్తం 30,000 మంది యొక్క జననకాల వివరాలు సేకరించాడు. వాళ్ళ గ్రహస్థితుల్ని పోల్చి, గణాంకాల ప్రకారం అతడు నిరూపించిందేమిటంటే, తల్లిదండ్రుల జన్మ సమయంలో 1 లేక 4 వ సెక్టర్లో ఏ గ్రహం ఉన్నదో, పిల్లల జన్మ సమయంలో కూడా అదే గ్రహం 1,4 సెక్టర్లలో ఏదో ఒకదానిలో ఉంటుందని. (ఇది రాండమ్ చాన్సు కన్నా ఎక్కువ శాతం మాత్రమే సుమా. నూటికి నూరు శాతం సందర్భాల్లో కాదు). ఈ ఫలితాలని మళ్ళా నిర్ధారించుకోవడం కోసం అతను మరొక ముప్ఫై వేల జనన కాల వివరాలు సేకరించి వాటితో కూడా మళ్ళీ అవే ఫలితాలని పొందాడు.

వ్యక్తిత్వ లక్షణాలు: గోక్‌లా అనేక మంది ప్రసిద్ధులైన వ్యక్తుల జీవిత చిత్రణల్ని పరిశీలించి అయా వ్యాసాలు లేక గ్రంథాలలో ఆ వ్యక్తుల లక్షణాలని వర్ణించడానికి వాడిన పదాల్ని సేకరించాడు (ధైర్యవంతుడు, ఆత్మవిశ్వాసం కలవాడు, ఆలోచనాపరుడు మొదలైన పదాలు). అటువంటి యాభైవేల పదాలు తీసుకుని వ్యక్తులనీ, వాళ్ళ లక్షణాలని వర్ణించడానికి వాడిన పదాలనీ పట్టికల్లో వర్గీకరించాడు. తరవాత ఆయా వ్యక్తుల జన్మ సమయాలు సేకరించి, వాళ్ళు పుట్టినప్పుడు గ్రహాలు ఏ సెక్టర్లలో ఉన్నాయో కూడా పట్టికల్లో నమోదు చేశాడు. ఆ పట్టికలన్నీ విశ్లేషించి, జ్యోతిష సాంప్రదాయం ప్రకారం ఏ లక్షణాలు ఏ గ్రహాలకి ఆపాదిస్తారో, అవే గ్రహాలు ఆ లక్షణాలు గలవాళ్ళ జన్మసమయంలో సెక్టరు 1, 4 ల్లో ఎక్కువగా కనిపిస్తాయి అని నిరూపించాడు. ఇదే పరిశోధనని మరొకసారి అమెరికాకి చెందిన వ్యక్తుల సమాచారంతో కూడా చేసి, అవే ఫలితాల్ని సాధించాడు.

భూ అయస్కాంత క్షేత్ర ప్రభావం: గ్రహాల ప్రభావం ఆనువంశికంగా పని చేస్తుందని తన ప్రయోగాలు నిరూపించడంతో గోక్‌లా ఒక ప్రశ్న వేసుకున్నాడు. తన పరిశోధనల ప్రకారం నిరూపణ అవుతున్న విషయం ఏమిటంటే జన్మించబోతున్న శిశువు ఒక గ్రహ ప్రభావానికో, ప్రేరణకో గురి అవుతున్నది. అటువంటి ప్రభావానికి గురి అయ్యే తత్త్వం జీన్సు ద్వారా ఆనువంశికంగా వస్తుందేమో ప్రస్తుతానికి తెలియదు కానీ, అసలు పిండ దశలో ఉన్న శిశువు గ్రహాల ప్రభావానికి గురి అవ్వడం ఎలా సాధ్యమౌతోంది? అటువంటి ప్రభావం ఉంటే అది ఖచ్చితంగా భౌతికమైన శక్తి ఏదో అయి ఉండాలి అని అతడు భావించాడు. గ్రహాల గురుత్వాకర్షణ గానీ, విద్యుదయస్కాంత క్షేత్రాలు గానీ భూమి మీది మానవుల్ని ప్రభావితం చెయ్యడం అసాధ్యం. అయితే భూఅయస్కాంత క్షేత్రం (Geomagnetism) చాలా బలహీనమైనదే అయినప్పటికీ (0.3 నుంచి 0.4 గాస్, అంటే బజారులో ఆట బొమ్మల్లో దొరికే చిన్న అయస్కాంతాల కన్నా బలమైనదేమీ కాదు), మనుషులూ జంతువులూ అంత బలహీనమైన అయస్కాంత క్షేత్రాలకి కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నదని కొందరు సైంటిస్టులు ప్రతిపాదించారు. కాబట్టి పుట్టబోయే శిశువులమీద భూఅయస్కాంత క్షేత్ర ప్రభావం ఉందేమో పరిశీలించడానికి అతను పూనుకున్నాడు.

భూ అయస్కాంతక్షేత్రంలో కలిగే మార్పుల్ని ప్రతీ రోజూ నమోదు చేస్తారు. ఆ మార్పుల్ని 0.0 నుంచి 2.0వరకూ ఉండే ఒక స్కేలుతో సూచిస్తారు (International Magnetic Character, Ci). ఒకరోజు ఈ ‘సై’ విలువ 0.0 ఉంటే ఆ రోజు భూ అయస్కాంత క్షేత్రం చాలా ప్రశాంతంగా ఉందని అర్ధం. అలాగే అది 2.0 ఉంటే, భూ అయస్కాంత క్షేత్రంలో తుఫానులు చెలరేగుతున్నాయని అర్ధం. భూ అయస్కాంత క్షేత్రంలో అటువంటి మార్పులకి కారణం సూర్యుడిలో మచ్చలు ఏర్పడడం, సౌర జ్వాలలు (Solar Flares) చెలరేగడం మొదలైనవి. సూర్యుడిమీద ఇటువంటివి ఏర్పడిన కొన్ని గంటల్లోనే అవి భూమి మీద ప్రభావాన్ని చూపించడంవల్ల భూఅయస్కాంత క్షేత్ర తీవ్రతలో మార్పులు వస్తాయి.
గోక్‌లా ఏమి చేశాడంటే, తాను అంతకు ముందు ఆనువంశికతని నిరూపించడానికి ఉపయోగించిన పిల్లల జన్మకాల వివరాలకి వాళ్ళు పుట్టిన రోజున రికార్డు చెయ్యబడిన ‘సై’ విలువని జోడించాడు. సై విలువ ఎక్కువగా ఉన్నప్పుడు (1.౦ – 2.0) పుట్టినవాళ్ళకీ, తక్కువగా ఉన్నప్పుడు (0.0 – 0.9) పుట్టినవాళ్ళకీ గ్రహ స్థితుల ‘ఆనువంశికత’లో తేడాలేమైనా ఉన్నాయేమో పరిశీలించాడు. సై విలువ ఎక్కువగా ఉంటే, గ్రహ స్థితుల ‘ఆనువంశికత’ బలంగా కనపడింది. తక్కువగా ఉంటే బలహీనంగా కనపడింది. అయితే ఈ గ్రహాల్లో కూడా కేవలం కుజ, గురు, శనులకీ, వాటికన్నా బలంగా శుక్రుడికీ మాత్రమే ఈ విషయం ధ్రువపడింది. చంద్రుడి విషయంలో ధ్రువపడలేదు. అయినప్పటికీ, మొత్తానికి గ్రహాల ప్రభావం భూ అయస్కాంత క్షేత్రం ద్వారా సాధ్యపడుతున్నది అన్న ప్రతిపాదనని మిషెల్ గోక్‌లా ఈ పరిశోధన ద్వారా పైకి తీసుకువచ్చాడు. ఈ ప్రతిపాదన పట్ల ఇప్పటికీ పాశ్చాత్య జ్యోతిష్కుల్లో చాలా నమ్మకం ఉన్నది.

అయితే సిజేరియన్ ద్వారా జన్మించే శిశువుల్లో ఈ గ్రహ స్థితుల ఆనువంశికత కనిపించడం లేదనీ, విరివిగా జరుగుతున్న సిజేరియన్ జననాల వల్ల ఈ ‘నవీన జ్యోతిషం’ ద్వారా కనిపెట్టబడిన ఒక ప్రకృతి సహజమైన నియమంలో మానవులు జోక్యం చేసుకుని ఆ నియమాన్ని జరగనివ్వడం లేదనీ అతను ఆవేదన చెందాడు.

గోక్‌లా పరిశోధనలూ -సాంప్రదాయ జ్యోతిషం: మిషెల్ గోక్‌లా మొదట్లో సాంప్రదాయ జ్యోతిషాన్ని విశ్వసించి, దాని ప్రేరణతోనే తన పరిశోధనలని మొదలుపెట్టినా, తన పరిశోధనల్లో పురోగతి సాధించేకొద్దీ సాంప్రదాయ జ్యోతిషం పై విశ్వాసాన్ని కోల్పోయాడు. తన పరిశోధనల ఫలితంగా ఒకానొక శాస్త్రీయమైన నవీన జ్యోతిషం ఆవిష్కరించబడుతోందని విశ్వసించాడు. గోక్‌లా పరిశోధనా ఫలితాలు సాంప్రదాయ జ్యోతిషానికి చాలామటుకు విరుద్ధంగా కనిపిస్తాయి.

గోక్‌లా సెక్టర్లు 1,4 ల్లో ఉండే గ్రహాలు ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయని అతడి పరిశోధనలు సూచిస్తున్నాయి గానీ, సాంప్రదాయ జ్యోతిషం ప్రకారం ఈ సెక్టర్లు సుమారుగా 12, 9 భావాల్ని సూచిస్తాయి. అయితే ఈ భావాల కారకత్వాలు గోక్‌లా సెక్టర్లు సూచించే అంశాలకి చాలా విరుద్ధమైనవి. (సాంప్రదాయ జ్యోతిషంలో 1, 10 భావాల కారకత్వాలు ఈ సెక్టర్ల ఫలితాలతో సరిపోతాయి. అయితే అవి గోక్‌లా సెక్టర్లలో సుమారుగా 12, 3 ల స్థానంలో ఉంటాయి.)

గోక్‌లా పరిశోధనలు కేవలం ప్రసిద్ధులైన వ్యక్తుల విషయంలోనే ఫలితాలని ఇచ్చాయి. సామాన్యుల విషయంలో ఇటువంటి గ్రహ ప్రభావాలేమీ నిరూపితం కాలేదు.
గోక్‌లా పరిశోధనలు బుధుడు, సూర్యుడు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోల ప్రభావం ఏమీ లేదని నిరూపించాయి. (సాంప్రదాయ జ్యోతిషంలో బుధుడు, సూర్యుడు చాలా ప్రధానమైనవి.) అయితే సూర్యుడు భూఅయస్కాంత క్షేత్రంలోమార్పులకి కారకుడు కాబట్టి సూర్యుడి ప్రభావం పరోక్షంగా ఉన్నట్టే అని గోక్‌లా భావన. తాను సేకరించిన వ్యక్తిత్వ లక్షణాల సమాచారాన్ని ఉపయోగించి రాశుల ప్రభావం ఏమైనా కనపడుతుందేమోనని అతను శోధించాడు. కానీ వ్యక్తుల లక్షణాల్లో రాశుల ప్రభావం ఏమీ కనపడలేదు. అయినప్పటికీ గ్రహాల ప్రభావం మానవుల జీవితాలపై ఉన్నది అనే అత్యంత ప్రాథమికమైన జ్యోతిష ‘భావన’ ఈ పరిశోధనల వల్ల సత్యమని నిరూపించబడింది అని చాలామంది జ్యోతిష్కులు భావిస్తారు.

గోక్‌లా పరిశోధనలు – వివాదాలూ, సందేహాలూ: సహజంగానే గోక్‌లా పరిశోధనల ఫలితాలు ప్రకటించబడగానే హేతువాదులూ, సైంటిస్టులూ కత్తులు దూశారు. దశాబ్దాలపాటు పరిశోధనలూ, చర్చలూ, వివాదాలూ కొనసాగాయి. అతను తన పరిశోధనల ఫలితాల్ని మొదట 1955 లో ప్రకటించిన తరువాత బెల్జియంలోని శాస్త్రీయ పరిశోధకులకి తన పరిశోధనల వివరాల్ని సమర్పించి పరిశీలించమని కోరాడు. 1962 లో అతని పరిశోధనల్లో లోటుపాట్లు లేవని నిర్ధారణకి వచ్చిన తరువాత, వాళ్ళు 500 మంది బెల్జియన్ ఆటగాళ్ళ వివరాలు సేకరించి ‘మార్స్ ఎఫెక్టు’ ని పరిశోధించడానికి పూనుకున్నారు. అయితే ఆ పరిశోధనలో కూడా ‘మార్స్ ఎఫెక్టు’ బయట పడడంతో చాలా గందరగోళం (రాజకీయం) నడిచింది. మొత్తానికి 1977 దాకా ఆ పరిశోధన వివరాల్ని బహిర్గతం చేయడం జరగలేదు.

1979 లో అమెరికన్ ఆటగాళ్ళ సమాచారాన్ని ఉపయోగించిన మరొక పరిశోధన The Skeptical Inquirer జర్నల్ లో ప్రకటించబడ్డది. అది మార్స్ ఎఫెక్టుని నిర్ధారించలేదు. అయితే ఆ పరిశోధన చాలా వివాదస్పదమైంది. తీవ్రమైన వాదోపవాదాలు నడిచాయి. ఆ పరిశోధనల్ని గోక్‌లా సవాలు చెయ్యడం జరిగింది. ఆ పరిశోధన మార్స్ ఎఫెక్టుని నిర్ధారిస్తున్నది అని కూడా కొంతమంది నిరూపించడానికి ప్రయత్నించారు. 1982 లో గోక్‌లా ని కూడా భాగస్తుడిగా చేసి మళ్ళీ కొత్తగా ఇంకొక పరిశోధన మొదలైంది. అయితే అది పూర్తి కాకుండానే నిలిచిపోయింది.

1986 లో ఇద్దరు జర్మన్ పరిశోధకులు (Arno Müller, Suitbert Ertel) జర్మన్ డాక్టర్ల వివరాలను పరిశోధించి మార్స్ ఎఫెక్టు నిజమేనని తేల్చారు. అంతేకాదు, గోక్‌లా పరిశోధన శాస్త్రీయమే అని కూడా ప్రకటించారు. 1989 లో ముల్లర్ మరొక పరిశోధన చేసి, రచయితల విషయంలో చంద్రుని ప్రభావం ఉన్నది అన్న గోక్‌లా పరిశోధనా ఫలితాన్ని నిర్ధారించలేకపోయాడు. కానీ, పత్రికా రచయితల విషయంలో గురు, శనుల ప్రభావాన్ని ధ్రువ పరిచాడు.

ఇప్పటికి కూడా ఈ పరిశోధనల గురించి భిన్నాభిప్రాయాలు చర్చలూ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అయితే హేతువాదుల, సైంటిస్టులలో ఉన్న ప్రధానమైన అభిప్రాయం ఏమిటంటే మిషెల్ గోక్‌లా పరిశోధనల్లో సమాచార సేకరణలోనూ, ఎంపికలోనూ జ్యోతిషం నిజమని నిరూపించడంకోసం ఉద్దేశ్యపూర్వకంగా పక్షపాతం వహించడం (sampling bias) జరిగిందని. ఇంగ్లండులో ఒక యూనివర్సిటీలో జరుగుతున్న జ్యోతిష పరిశోధనలకి పర్యవేక్షకుడిగా ఉన్న ఒక పెద్దాయనని నేను కలుసుకుని వ్యక్తిగతంగా చాలాసార్లు జ్యోతిషం గురించి చర్చించడం జరిగింది. ఆయన జాఫ్రీ డీన్ కి స్నేహితుడు కూడా. మిషెల్ గోక్‌లా భార్యని (ఆవిడ కూడా పరిశోధనల్లో భాగస్తురాలు) తాము కలిసి మాట్లాడడం జరిగిందనీ, ఆవిడని ప్రశ్నించగా సమాచారం ఎంపికలో తేడా జరిగిందని తమ సమక్షంలో ఆవిడ ఒప్పుకుందనీ ఆయన నాకు చెప్పాడు. అందుకే గోక్‌లా చేసిన పరిశోధనల తాలూకు సమాచారాన్ని (డేటా) ఇంకా పరిశీలిస్తూ పోవడం దండుగ అని ఆయన అభిప్రాయపడుతూ ఉంటాడు.

అయితే స్వతంత్రంగా వేరే పరిశోధకులు చేసిన పరిశోధనల్లో కూడా ఇవే ఫలితాలు వచ్చాయి కదా. ఏది ఏమైనా గోక్‌లా నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదని కూడా చాలామంది అభిప్రాయం.మిషెల్ గోక్‌లా ఫలితాల్ని (ముఖ్యంగా మార్స్ ఎఫెక్టుని) నిజమనే భావించినా, స్టాటిస్టిక్సు ప్రకారం పరిశీలిస్తే అది చాలా బలహీనమైన ప్రభావాన్నే సూచిస్తుందనీ (0.04 correlation), గణాంకాల ప్రకారం చేసే ప్రయోగాల్లో అనేక ఇతర కారణాల మూలంగా అటువంటి ఫలితాలు రావడం సహజమేననీ జాఫ్రీ డీన్ అంటాడు. అంతే కాదు, అసలు మిషెల్ గోక్‌లా ప్రయోగాలకీ జ్యోతిషానికీ ఏమీ సంబంధం లేదనీ, మార్స్ ఎఫెక్టుని జ్యోతిష్కులు జ్యోతిషం శాస్త్రీయమే అని నిరూపితమైందని వాడుకోడానికి కుదరదనీ కూడా హేతువాదులు అంటారు.

ఏది ఏమైనా మిషెల్ గోక్‌లా ఇరవయ్యవ శతాబ్దపు జ్యోతిష చరిత్రలో చాలా బలమైన ముద్ర వేశాడనీ, జ్యోతిష్కుల్లో శాస్త్రీయమైన పరిశోధన పట్ల ఆశనీ, ఆసక్తినీ రేకెత్తించడంలో సఫలమయ్యాడనీ అనడంలో సందేహం లేదు.
---------------------------------------------------------
రచన: నాగ మురళీకృష్ణ వాడవల్లి, 
ఈమాట సౌజన్యంతో

No comments: