Friday, January 4, 2019

మూడు వందల రామాయణాలు


మూడు వందల రామాయణాలు
సాహితీమిత్రులారా!

ఎన్ని రామాయణాలున్నాయి? మూడు వందలా? మూడు వేలా? కొన్ని రామాయణాల్లో చివర “ఇంతవరకూ ఎన్ని రామాయణాలొచ్చాయి?” అన్న ప్రశ్న అడిగేవారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే కథలు కూడా అందులో ఉండేవి. అలాంటి కథలలో ఒక కథ వినండి.

ఒకరోజు రాముడు సింహాసనం అధిష్టించి ఉండగా, పొరపాటున అతడి ఉంగరం జారి కింద పడిపోయింది. ఈ ఉంగరం భూమిమీద పడడంతోనే, అది ఒక సన్నటి చిల్లు చేసి భూమి లోపలికి తొలుచుకుంటూ చొచ్చుకునిపోయి కనుమరుగైపోయింది. అది చూసి రాముడు తన నమ్మిన బంటు అయిన హనుమంతుడుతో “హనుమా, నా ఉంగరం పడిపోయింది. వెతికి తీసుకురా,” అని పురమాయించాడు.

హనుమంతుడు ఎంత చిన్న చిల్లులోకైనా ప్రవేశించగలడు. అవసరమయితే నలుసంత చిన్నగా మారగలడు. లేదా, మేరు పర్వతమంత పెద్దగా ఎదగగలడు. రాముని ఆజ్ఞ విని, హనుమంతుడు వెంటనే నలుసంత చిన్నగా మారిపోయి ఆ చిన్న రంధ్రంలో నుంచి తనూ దూసుకుపోయాడు. పోయిపోయి తిన్నగా పాతాళలోకంలో పడ్డాడు. ఈ చిన్ని కోతిని చూసి ఆశ్చర్యపోయిన అక్కడి యువతులు, అతడ్ని వారి పాతాళరాజుకు పళ్ళెంలో ఆహారంగా సమర్పించారు.

ఇది ఇలా ఉండగా, అక్కడ భూలోకంలో సింహాసనం మీద కూర్చున్న రాముని వద్దకు వశిష్ఠుడు, బ్రహ్మదేవుడు వచ్చారు. వచ్చి “రామా, మేము కొన్ని విషయాలు నీతో రహస్యంగా మాట్లాడాలి. ఈ సంభాషణ ఎవ్వరూ వినకూడదు, భంగం కలిగించకూడదు. ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిని శిరచ్ఛేదన చేయాల్సి ఉంటుంది. సమ్మతమేనా?” అని అడిగారు.

“సమ్మతమే” అన్నాడు రాముడు. ద్వారం కాపలా కాయడానికి హనుమంతుడు లేడాయె. అందుకని, రాముడు లక్ష్మణుని పిలిపించి, అతడిని గుమ్మం వద్ద కాపలాకు నిలబెట్టి ఎవరినీ లోనికి రానివ్వవద్దని ఆజ్ఞాపించాడు.

లక్ష్మణుడు ద్వారానికి కాపలా కాస్తుండగా, విశ్వామిత్ర మహర్షి వచ్చి “నేను వెంటనే రాముణ్ణి చూడాలి. ఇది చాలా ముఖ్యం. రాముడెక్కడ?” అని గద్దించాడు.

“రాముడు రహస్య సమావేశంలో ఉన్నాడు. ఇప్పుడు లోనికి పోవడానికి వీల్లేదు.” జవాబు చెప్పాడు లక్ష్మణుడు.

“రాముడు నాతో చెప్పలేని రహస్యాలేముంటాయి. నేను ఇప్పుడే వెళ్ళి తీరాలి.” అన్నాడు విశ్వామిత్రుడు.

“నేను అన్నగారిని అడిగి, ఆయన అనుజ్ఞ తీసికోనిదే ఎవ్వరినీ లోపలకి వెళ్ళనీయలేను,” అన్నాడు లక్ష్మణుడు.

“అయితే తక్షణం లోపలికి పోయి నేను వచ్చానని రాముడికి చెప్పు,” అని విశ్వామిత్రుడు మళ్ళీ గద్దించాడు.

“రాముల వారు బయటికి వచ్చేవరకూ నేనే కాదు, ఎవ్వరూ లోపలికి పోరాదని నాకు మరీ మరీ చెప్పారు. అందుచేత మీరు కాసేపు ఓపిక పట్టి వేచి ఉండండి” అని లక్ష్మణుడు అనగానే, విశ్వామిత్రుడు తోకతొక్కిన తాచులా బుసకొడుతూ “నువ్వు వెంటనే రాముడికి నేను వచ్చినట్టు చెప్పకపోతే, నేను మీ రాజ్యాన్ని బూడిద పాలు చేస్తా!” అంటూ బెదిరించాడు.

“లోనికి వెళ్తే నేను చస్తాను. వెళ్ళకపోతే రాజ్యమే బూడిదౌతుంది. నాకన్న రాజ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి నేను చావడమే మేలు.” అని ఒక్క క్షణం ఆలోచించి లక్ష్మణుడు లోనికి వెళ్ళాడు.

“ఏమిటి విషయం” అడిగాడు రాముడు.

“విశ్వామిత్రులవారొచ్చారు”

“అయితే, లోనికి పంపించు”

విశ్వామిత్రుడు లోనికి ప్రవేశించాడు. వశిష్ఠుడు, బ్రహ్మదేవులతో జరుపుతున్న రహస్య సమావేశం అప్పటికే అయిపోయింది. వాళ్ళు శ్రీరాముడితో చెప్పిన మాటల సారాశం ఇది: “రామా! నీవు ఈ భూలోకంలో చెయ్యవలసిన పని అంతా పూర్తి అయ్యింది. నీవు ఇక ఈ మానవావతారం చాలించి మళ్ళీ దేవతల్లో చేరవలసిన సమయం వచ్చింది. ఈ విషయం చెప్పడానికే మేము సురలోకం నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక మేము సెలవు తీసుకుంటాము.”

వాళ్ళిద్దరూ వెళ్ళగానే లక్ష్మణుడు, “అన్నా! రామా! నువ్వు ఇప్పుడు నా శిరస్సు ఖండించాలి,” అని అన్నాడు.

అందుకు శ్రీరాముడు,”లక్ష్మణా! నీ అపరాధం ఏమీ లేకుండా నీ శిరస్సు ఖండించడం దేనికి? బ్రహ్మ,వశిష్ఠులవారూ, వచ్చిన పని ఎప్పుడో పూర్తి అయ్యింది,” అని అన్నాడు.

లక్ష్మణుడు “శ్రీరామా! నీవు ఆడిన మాట తప్పని వాడవని అందరికీ తెలుసు. నేను నీ తమ్ముడిని గనుక నీవు నన్ను వధించడానికి వెనుదీయడం ధర్మం కాదు. శ్రీరాముడు మాట తప్పినాడన్న మాట, ఆ కళంకం, నా మూలంగా నీకు రాకూడదు. నీవు నీ భార్యనే తిరిగి అడవులకు పంపినది మాట నిలబెట్టుకోవడం కోసమే కదా? నువ్వు ఇప్పుడు నన్ను శిక్షించక వదిలితే, నన్ను నేనే శిక్షించుకోవాలి. అనుజ్ఞ ఇవ్వు అన్నా! సెలవు” అని చెప్పి తను సరయూ నదికి వెళ్ళి మునిగి మరి తిరిగి కనిపించకుండా అంతర్థానం అయ్యాడు. లక్ష్మణుడు, ఆదిశేషుని అవతారం. తన దేహం చాలించవలసిన సమయం వచ్చిందని తనకి తెలుసు!

లక్ష్మణుడు అట్లా దేహత్యాగం చేసిన తరువాత, శ్రీరాములవారు లవకుశులకు పట్టాభిషేకం చెయ్యడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యమని విభీషణుడికి, సుగ్రీవుడికి, మిగిలిన ముఖ్య అనుచరులందరికీ చెప్పి, తను కూడా సరయూ నదికి పోయి తన మానవావతారాన్ని చాలించాడు.

ఇదిలా జరుగుతుండగా, హనుమంతుడు ఇంకా పళ్ళెంలో “రామ, రామ” అని జపం చేస్తూ ఉన్నాడు. పాతాళరాజు “ఎవరు నువ్వు?” అని అడిగాడు.

“నా పేరు హనుమంతుడు. రాముని బంటును. నా రాముని ఉంగరం చిల్లులో పడిపోయింది. దాన్ని వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను.”

పాతాళరాజు చుట్టూ చూసి ఒక పేద్ద పళ్ళెం తీసుకువచ్చాడు. ఆ పళ్ళెం నిండా వేలకొలది ఉంగరాలున్నాయి. “మీ రాముడి ఉంగరం వెతికి తీసుకొని నువ్వు పైకి పోవచ్చు” అన్నాడు!

ఆ బంగారు పళ్ళెం నిండా ఉన్న వేల ఉంగరాలను చూసి, హనుమంతుడు బేజారెత్తి పోయాడు. అన్నీ చూడటానికి ఒకే మాదిరిగా ఉన్నాయి. “వీటిలో నా రాముడి ఉంగరం ఏదో నాకు తెలియటల్లేదు,” అంటూ బుర్ర గోక్కున్నాడు.

పాతాళరాజు నవ్వుతూ “చూడు! ఈ పళ్ళెంలో ఎన్ని ఉంగరాలున్నాయో, అంతమంది రాముళ్ళు ఉన్నారు. నువ్వు భూలోకానికి వెళ్ళేటప్పటికీ, నీ రాముడు తన అవతారం చాలించేసి ఉంటాడు. ఒక్కొక్క రాముడూ తన మానవావతారం చాలించడానికి ముందుగా ఆ రాముడి ఉంగరం నా పాతాళ లోకానికి వస్తుంది. ఆ ఉంగరాలన్నీ జాగ్రత్తగా దాచి ఉంచడం నా పని. ఇక నువ్వు భూలోకానికి పోవచ్చు,” అని ముగించాడు.

అలా ఒక్కొక్క రామునికి ఒక్కొక్క రామాయణముందని చెప్పడానికి ఈ కథ చెబుతుంటారు. భారత ఉపఖండంలోనూ, ఆగ్నేయాసియాలోనూ ఎన్ని రకాల రామాయణాలున్నాయో, అవి కొన్ని శతాబ్దాలుగా ఆయా సమాజాలపై ఏ రకమైన ప్రభావాలను చూపాయో పరిశీలిస్తే మనకు ఆశ్చర్యం కలిగక మానదు. ప్రాచీన కాలంలోనే, రామాయణం ఎన్ని భాషల్లో వెలువడిందో ఆ భాషలపేర్లు వరుసగా రాస్తే చాంతాడంత పొడుగౌతుంది: కొన్ని శతాబ్దాల కాలంలో, అస్సామీ, బాలినీస్, బెంగాలి, కంబోడియన్, చైనీస్, గుజరాతి, జావనీస్, కన్నడ, కాశ్మీరి, ఖోటనీస్, లావోషన్, మలేషియన్, మరాఠీ, ఒరియా, ప్రాకృతం, సంస్కృతం, సంతాలి, సింహళం, తమిళం, తెలుగు, థాయి, టిబెటన్ మొదలైన భాషల్లో పలు రకాల అనువాదాలు వచ్చాయి. ఉదాహరణకు సంస్కృతంలోనే, ఇతిహాస, కావ్య, పురాణ కాలాదులన్నింటిని కలిపి 25 కంటే ఎక్కువ రామాయణాలు కనిపిస్తాయి. ఇవి కాక నాటకాలు, శాస్త్రీయ, జానపద నృత్యరూపకాలన్నింటిని కలుపుకుంటే రామాయణాల సంఖ్య మరింతగా పెరుగుతుంది. వీటికి, శిల్ప ప్రదర్శనలు, మూకాభినయాలు, తోలుబొమ్మలాటలు వంటి రామాయణ రూపాలన్నింటిని కలుపుకుంటే రామాయణాల సంఖ్య వేనవేలుగా పెరుగుతుంది. కుమారవ్యాస అనే కన్నడ కవి తను రామాయణం కాకుండా మహాభారతం రాయడానికి ఎందుకు పూనుకున్నాడో చెబుతూ ఇలా అంటాడు: తిణికిదను ఫణిరాయ రామాయణద కవిగళ భారదలి (రామాయణం రాసిన కవుల భారంతో భూభారాన్ని మోస్తున్న ఫణిరాజు క్రుంగిపోయాడట).

కావ్య రూపంలోని వివిధ రామాయణాల్ని అధ్యయనం చేసిన కమీల్ బల్క (Camille Bulcke) మూడు వందల దాకా రామాయణాలను(1950) లెక్కించాడు. ఈ వ్యాసంలో వివిధ భాషల్లో, వివిధ సంస్కృతులలో, వివిధ సంప్రదాయాలలో రామాయణం ఎలా చెప్పుకున్నారు? వాటిమధ్య భేదాలేమిటి? సామ్యాలేమిటి? ఏది యథాతథంగా అనువాదం చేశారు? దేన్ని అనుసృజన చేశారు? ఎలాంటి విషయాలు మార్పులు పొందాయి? వంటి విషయాలను స్థూలంగా పరిశీలిద్దాం.
వాల్మీకి రామాయణం, కంబ రామాయణం: ఇద్దరు అహల్యలు
లెక్కగట్టిన మూడువందల రామాయణ కథనాల్లో ప్రతిదానికి మరో కథనానికి ఏవో కొన్ని తేడాలు కనిపిస్తాయి. ఇక్కడ నేను వైవిధ్యాలనో, పాఠాంతరాలనో అనకుండా కథనాలు అనడానికి కారణం ఉంది. వైవిధ్యం అన్నా, పాఠాంతరమన్నా ఒక మూలకథ ఉంది అన్న భావన కలుగుతుంది. అందులో ఆ మూలకథ అత్యంత ప్రాచీనమైన వాల్మీకి కథ అన్న సూచన కూడా వినిపిస్తుంది. అయితే, వివిధ అనువాదాలకు వాల్మీకి కథే మూలకథ కాదు అన్న విషయం మనం ఈ వ్యాసంలో ముందు, ముందు గమనిస్తాం. ఈ విషయంలో ముందుగా రాముని కథకు పలువురి కథనాలకు మధ్య తేడా గుర్తుపెట్టుకోవాలి. కంబ రాసినదైనా, తులసీదాసు, కృత్తివాసులు రాసినవైనా, తరువాతి కాలంలో రామాయణాలుగా పేరు వచ్చిన వీటికి తొలుత వేర్వేరు శీర్షికలున్నాయి: ఇరామావతారమ్, రామచరితమానస్, రామకిఎన్ మొదలైన శీర్షికలు వేరైనట్లే, వారు చెప్పిన కథకు వాల్మీకి చెప్పిన రామాయణానికి ఉన్న సంబంధంలో కూడా ఎన్నో వైరుధ్యాలున్నాయి. ఈ రకంగా కథకు, ఒక కవి ఆ కథను చెబుతూ రాసిన కావ్యానికి వ్యత్యాసాన్ని పాటించే సంప్రదాయం ఫ్రెంచి సాహిత్యంలో sujet, récitల (స్థూలంగా Subject, Narrative) మధ్య పాటించే వ్యత్యాసం లాంటిది. మరోరకంగా చెప్పాలంటే, ఒకే వాక్యాన్ని వేర్వేరు వక్తలు వారి, వారి ఉపన్యాస ధోరణిలో చేసిన ఉచ్చరింపులలో ఉండే వ్యత్యాసం లాంటిది: చెప్పే కథ, నిర్మాణం, కథా సంఘటనలు ఒకటే అయినా వారి గొంతుక లోనూ, పలికే పద్ధతి లోను ఉన్న తేడాల వల్ల, కలిగే అనుభూతిలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది కదా!

ఉదాహరణకు ఈ కింది రెండు కథనాలను పరిశీలించండి. మొదటిది సంస్కృతంలో వాల్మీకి రాసిన రామాయణం లోని బాలకాండ నుండి తీసుకుంటే, రెండవది తమిళంలో కంబ రాసిన ఇరామావతారమ్ లోనిది. రెండూ అహల్యా వృత్తాంతాన్నే చెబుతున్నాయి.

తాం దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభాం |
సాధు సాధు ఇతి శంసంతో మిథిలాం సమపూజయన్ |౧-౪౮-౧౧|

జనకుని పురమైన మిథిలా నగరాన్ని చూడగానే “అద్భుతం, అద్భుతం” అని విశ్వామిత్రునితో పాటు ఉన్న మునులు ప్రశంసించారు.

మిథిల ఉపవనే తత్ర ఆశ్రమం దృశ్య రాఘవః |
పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ ముని పుంగవం |౧-౪౮-౧౨|

రాఘవుడు ఆ సమీపములో ఒక ఆశ్రమాన్ని చూశాడు. ఆ రమ్యమైన ఆశ్రమం పురాతనమై, నిర్జనమై ఉండడం చూసి మునిపుంగవుని ఇలా అడిగాడు:

ఇదం ఆశ్రమ సంకాశం కిం ను ఇదం ముని వర్జితం |
శ్రోతుం ఇచ్ఛామి భగవన్ కస్య అయం పూర్వ ఆశ్రమః |౧-౪౮-౧౩|

“ఆశ్రమంలా కనిపిస్తున్న ఈ స్థలాన్ని మునులు ఎందుకు వర్జించారు? ఇంతకు పూర్వం ఇది ఎవరి ఆశ్రమమో వినగోరుతున్నాను”

తత్ శ్రుతా రాఘవేణ ఉక్తం వాక్యం వాక్య విశారదః |
ప్రతి ఉవాచ మహాతేజా విశ్వమిత్రో మహామునిః |౧-౪౮-౧౪|

వాక్య విశారదుడైన రాఘవుడు అలా అడగగా విని, మహాతేజస్సు గల మహాముని విశ్వామిత్రుడు ఇలా సమాధానమిచ్చాడు.

హంత తే కథయిష్యామి శృణు తత్త్వేన రాఘవ |
యస్య ఏతత్ ఆశ్రమ పదం శప్తం కోపాన్ మహాత్మనా |౧-౪౮-౧౫|

“ఈ ఆశ్రమం ఎవరిదో, ఏ మహాత్ముడు కోపంతో శాపమిచ్చాడో ఆ కథను సంతోషంగా చెబుతాను రాఘవా!”

గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వం ఆసీత్ మహాత్మనః |
ఆశ్రమో దివ్య సంకాశః సురైః అపి సుపూజితః |౧-౪౮-౧౬|

ఓ నరశ్రేష్ఠా, పూర్వం దివ్య సంకాశంతో, దేవతలచే పూజింపబడిన ఈ ఆశ్రమం గౌతముడనే మహాత్మునిది.

స చ అత్ర తప ఆతిష్ఠత్ అహల్యా సహితః పురా |
వర్ష పూగాని అనేకాని రాజపుత్ర మహాయశః |౧-౪౮-౧౭|

ఓ మహాయశముగల రాజపుత్రా, తన భార్య అహల్యా సహితుడై పూర్వం గౌతముడు అనేక వర్షాలు ఇక్కడ తపస్సు చేశాడు.

తస్య అంతరం విదిత్వా తు సహస్రాక్షః శచీ పతిః |
ముని వేష ధరో భూత్వా అహల్యాం ఇదం అబ్రవీత్ |౧-౪౮-౧౮|

గౌతముడు ఆశ్రమంలో లేని వేళ తెలుసుకొని, సహస్రాక్షుడైన శచీపతి మునివేషం ధరించి అహల్య చెంతకు చేరి ఇలా అన్నాడు.

ఋతు కాలం ప్రతీక్షంతే న అర్థినః సుసమాహితే |
సంగమం తు అహం ఇచ్ఛామి త్వయా సహ సుమధ్యమే |౧-౪౮-౧౯|

చక్కని అంగాలు గలదానా, అర్థించేవారు ఋతుకాలం కోసం ఎదురుచూడరు. నీతో సంగమాన్ని కోరుతున్నాను, ఓ చక్కని నడుము గలదానా!

ముని వేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన |
మతిం చకార దుర్మేధా దేవ రాజ కుతూహలాత్ |౧-౪౮-౨౦|

రఘునందనా, ముని వేషంలో ఉన్నవాడు సహస్రాక్షుడని తెలిసినా దుర్మేధస్సుతో దేవరాజు కుతూహలాన్ని తీర్చాలని నిర్ణయించుకుంది.

అథ అబ్రవీత్ సురశ్రేష్ఠం కృతార్థేన అంతరాత్మనా |
కృతార్థా అస్మి సురశ్రేష్ఠ గచ్ఛ శీఘ్రం ఇతః ప్రభో |౧-౪౮-౨౧|
ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్ష గౌతమాత్ |

అప్పుడు సురశ్రేష్ఠుని కోర్కె దీర్చి ఇలా అన్నది: “కృతార్థురాలను అయ్యాను, ఓ సురశ్రేష్ఠా, ఇప్పుడు శీఘ్రంగా వెళ్ళు. ఓ దేవేశా, నిన్ను, నన్ను గౌతముని నుండి రక్షించుకోవడానికి.”

ఇంద్రః తు ప్రహసన్ వాక్యం అహల్యాం ఇదం అబ్రవీత్ |౧-౪౮-౨౨|
సుశ్రోణి పరితుష్టో అస్మి గమిష్యామి యథా ఆగతం |

ఇంద్రుడు నవ్వుతూ అహల్యతో ఇలా అన్నాడు: “ఓ సుశ్రోణి, నేనూ పరితుష్టుడనయ్యాను. ఎలా వచ్చానో, అలా వెళ్తాను.”

ఏవం సంగమ్య తు తయా నిశ్చక్రామ ఉటజాత్ తతః |౧-౪౮-౨౩|
స సంభ్రమాత్ త్వరన్ రామ శంకితో గౌతమం ప్రతి |

ఓ రామా, అలా సంగమించి ఇంద్రుడు గౌతముడు వస్తాడేమోనన్న శంకతో త్వరగా నిష్క్రమించుచుండగా …

గౌతమం స దదర్శ అథ ప్రవిశంతం మహామునిం |౧-౪౮-౨౪|
దేవ దానవ దుర్ధర్షం తపో బల సమన్వితం |
తీర్థ ఉదక పరిక్లిన్నం దీప్యమానం ఇవ అనలం |౧-౪౮-౨౫|
గృహీత సమిధం తత్ర స కుశం ముని పుంగవం |

దేవదానవులకు దుర్దర్షుడు, తపోబలసమన్వితుడు, నదీస్నానం చేసి తడిగా ఉన్నా యజ్ఞాగ్నివలే వెలిగిపోతున్నవాడు అయిన గౌతముడిని చూశాడు, సమిధలు, దర్భకర్రలు ఆ మునిపుంగవుని చేతిలో ఉండగా…

దృష్ట్వా సుర పతిః త్రస్తో విషణ్ణ వదనో అభవత్ |౧-౪౮-౨౬|
అథ దృష్ట్వా సహస్రాక్షం ముని వేష ధరం మునిః |
దుర్వృత్తం వృత్త సంపన్నో రోషాత్ వచనం అబ్రవీత్ |౧-౪౮-౨౭|

చూడగానే సురపతి భయంతో విషణ్ణ వదనుడయ్యాడు. అప్పుడు మునివేషంలో దుర్వృత్తిలో ఉన్న సహస్రాక్షుణ్ణి చూసి వృత్త సంపన్నుడైన ఆ ముని రోషవచనాలు పలికాడు:

మమ రూపం సమాస్థాయ కృతవాన్ అసి దుర్మతే |
అకర్తవ్యం ఇదం యస్మాత్ విఫలః త్వం భవిష్యతి |౧-౪౮-౨౮|

“ఓ దుర్మతి, నా రూపం స్వీకరించి చెయ్యకూడని కార్యాన్ని నిర్వహించావు. ఇక నీవు వృషణాలు లేని వాడవగుగాక!”

గౌతమేన ఏవం ఉక్తస్య స రోషేణ మహాత్మనా |
పేతతుః వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్ |౧-౪౮-౨౯|

మహాత్ముడైన గౌతముడు రోషంతో ఆ విధంగా పలకగానే ఇంద్రుని వృషణాలు ఆ క్షణమే భూమిమీద రాలిపడ్డాయి.

తథా శప్త్వా చ వై శక్రం భార్యాం అపి చ శప్తవాన్ |
ఇహ వర్ష సహస్రాణి బహూని నివషిస్యసి |౧-౪౮-౩౦|
వాయు భక్షా నిరాహారా తప్యంతీ భస్మ శాయినీ |
అదృశ్యా సర్వ భూతానాం ఆశ్రమే అస్మిన్ వషిస్యసి |౧-౪౮-౩౧|

ఇంద్రుని అలా శపించి, పిదప, తన భార్యను కూడా “నీవు వేల సంవత్సరాలు వాయువు భక్షణ చేస్తూ, నిరాహారివై, ధూళి, భస్మాలపై శయనిస్తూ, సర్వభూతాలకు అదృశ్యంగా ఈ ఆశ్రమంలో పడి ఉండుగాక” అని శపించాడు.

యదా తు ఏతత్ వనం ఘోరం రామో దశరథ ఆత్మజః |
ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యసి |౧-౪౮-౩౨|

ఎప్పుడైతే ఈ ఘోర వనానికి దుర్ధర్షుడైన దశరథాత్మజుడు, రాముడు వస్తాడో అప్పుడు పవిత్రురాలవౌతావు.

తస్య ఆతిథ్యేన దుర్వృత్తే లోభ మోహ వివర్జితా |
మత్ సకాశే ముదా యుక్తా స్వం వపుః ధారయిష్యసి |౧-౪౮-౩౩|

“ఓ దుర్వృత్తి గావించినదానా, అతనికి ఇచ్చే ఆతిథ్యంతో నీ లోభ మోహాలు తొలగిపోయి నీవు స్వయం రూపం ధరించి నావద్దకు చేరుకుంటావు.”

ఏవం ఉక్త్వా మహాతేజా గౌతమో దుష్ట చారిణీం |
ఇమం ఆశ్రమం ఉత్సృజ్య సిద్ధ చారణ సేవితే |
హిమవత్ శిఖరే రమ్యే తపః తేపే మహాతపాః |౧-౪౮-౩౪|

దుష్టచారిణిని అయిన అహల్యతో అలా అని మహాతేజుడైన గౌతముడు ఈ ఆశ్రమాన్ని వదిలివేసి సిద్ధ చారణులు సేవించుచుండగా రమ్యమైన హిమవత్ శిఖరాల వద్ద తపస్సు కొనసాగించాడు.

ఇక కంబరామాయణంలో అహల్యాపటలము ఇలా సాగుతుంది. (కంబరామాయణంలో అహల్యా వృత్తాంతానికి తెలుగుసేత పూతలపట్టు శ్రీరాములురెడ్డి చేసిన తెలుగు అనువాదం నుండి తీసుకున్నాను – సు.కొ.)

హర్షమొందుచు విదేహారామములఁ జూచి, వెలలి ప్రాకార సంవేష్టితమగు
మిథిలా నగరికొక్క మేటి యలంకార మైపొడవైన ధ్వజాలి వెలయు
బయటి ప్రహరికి వెల్పల వచ్చి నిల్వగా ర్హస్థ్యోచితము పతివ్రత గుణంబు
పదరి పాడోనరించి భర్తృ శాపంబున రాయియై పడియున్న రామ యపుడు

రామపదధూలి సోక పూర్వంబు మనసు
నలము నజ్ఞాన మత్తత దొలఁగ నెఱుక
తేఱ రూపాంతరం బొంది దేవునెదుటఁ
బొలుచు జని పోల్కిఁ దొలిరూపు దొలఁక నిలిచె

క్రిందికి గంగఁ దెచ్చిన భగీరథు వంశమునం జనించు నో
సుందర! తృప్తిమై మెఱుపు చొప్పునఁ గ్రేవ నొదింగి నిల్చు నీ
చెందొవకంటి యిష్టపడి చెడ్డ యొనర్చిన పాకవైరికిన్
గ్రందుగ వేయి కన్నులిడు ఘౌతమ పత్ని యహల్య నాఁ జనున్

కెంజడ లుల్లసిల్లు ముని కేసరి యట్టులు పల్క విన్న శ్రీ
కంజనివాసినీపతి వికస్వర పద్మదళాక్షుడిట్లనున్
నెంజలి యిట్టులౌట తన నెక్కొను పూర్వ కృతాపరాధమా?
యంజక యప్పుడొప్పిన స్వయంకృతమా? యెఱుఁగంగఁ బల్కవే?

అనవిని భూరి విజ్ఞుడగు నమ్ముని యిట్లను సద్గుణాలయ
విను మును వజ్రియూర్ధ్వగత వీర్యుడు గౌతముఁడింట లేని వే
ళను హరిణాక్షి చంద్రముఖి లాలిత లక్షణ లక్షితాంగి యౌ
వనిత యహల్యతోఁ గలయ వాంఛ వహించె మనంబు లోపలన్

తొలఁగ కహల్య చూపులను తూపులు మార నిశాత సాయకం
బులు మది గాఁడ విజ్ఞతయు బోవ మదిం గల యూరటంబుచే
నలయుచునున్న యింద్రుఁడొక యప్పుడు సాహసవృత్తి నాగృహ
స్థులకు వియోగముంగొలిపి చొచ్చెను గౌతమవేషియై యటన్

ఇరువురు చేరి కామమను నింపగు నాసవమానుచుండు నా
తరి నితఁ డింద్రుఁడంచెఱిగి ధర్మమధర్మము మానసంబునం
తరయక సమ్మతించి చెలి యంగజ సౌఖ్యములందు దేలె న
త్తరుణమునన్ మునీశ్వరుఁడు తత్తఱ వచ్చె గృహంబు చేరఁగన్

విలుపని లే కమోఘముగఁ బెంపఱఁ దిట్ట వరంబులిచ్చి వే
ల్పుల యెకినీనిఁ జేయఁగల ప్రోడఁడు గౌతమమౌని డాయ రాఁ
దలఁగక లోక మొల్లెడ సదా చెడకుండెడు నిందఁగొన్న య
వ్వెలఁది వడంకి నిల్చె బల భేది చనందోడఁగెన్ బిడాలమై.

అనుపమ నీలిశాలియగు నమ్ముని కన్నుల నిప్పులుర్లఁగాఁ
గని కథ యంతయుం దెలిసి కార్ముకవీర! భవత్కరచ్యుతో
గ్ర నిశిత కాండముం జెనయు ఖండిత వాక్కులతో శపించె వ
జ్రిని పది నూర్ల యోనుల శరీరము నొందుము యంచు నత్తఱిన్

క్షణములో శాపఫలమొంది జంభభేది
యెల్లిదంబగు లజ్జతో నేగుపిదపఁ
జెలువఁ గని వెలవెలఁది చేష్టలను పొంది
నట్టి నీవును శిలవగుమని శపించె

మౌనికాళ్ళం బడి మడఁతి యో మునినాథ మన్నిపు మీ తప్పు నన్ను గావు
పిన్నల తప్పులఁ బెద్దలు సైఁచుట తగునని నీతివేత్తలు వచింత్రు
రని వేఁడ జ్వాలల నార్చు రుద్రుని పోలెఁ గ్రుద్ధుడై కను మునీంద్రుడు నంత
సతియెడ దయతో బ్రసన్నుఁడై వనమాలి రాముని శ్రీపాద రజము సోఁక

నీ యథారూపమెందుదో నెలఁతయనియె
నింద్రుఁకొని నిలింపులు ముని యెడకు వచ్చి
వేఁడ నతని యోనుల మాన్చి వేయి కనుల
నిచ్చి పంపె నహల్య రాయిగను పడియె.

ఈ రెండు కథనాల మధ్య తేడాలు కొన్ని: వాల్మీకి కథలో ఇంద్రుని విషయం అహల్యకు ముందుగానే తెలుసు. కంబరామాయణంలో వచ్చింది భర్త కాదని అహల్య మధ్యలో గ్రహించినా, ఆ నిషిద్ధ సుఖాన్ని వదలలేకపోతుంది. అదికాక కంబరామాయణంలో అహల్య భర్త పూర్తిగా జపతపాదులలో మునిగినట్లు మనకు ముందుగా సూచించడం కూడా కథకు సంక్లిష్టతను జోడిస్తుంది. తమిళకథలో ఇంద్రుడు పిల్లి రూపంలో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. జానపదంలో లోకప్రియమైన ప్రసక్తి ఇది. కథా సరిత్సాగరంలో కూడా ఉంది. గౌతముడు ఇంద్రునికి ఒళ్ళంతా సహస్రయోనులు కలగాలని శాపమిచ్చి, తరువాత దాన్ని సహస్రనయనాలుగా మారుస్తాడు; అహల్యను సుఖస్పందనలేని రాయిలా మారుస్తాడు. వాల్మీకి కథలో కనిపించని ఈ వివరాలు, దక్షిణ భారతంలో జానపదుల కథల్లో, తమిళ శాసనాల్లోనూ, ఇతర దక్షిణ భారత భాషల రామాయణాల్లోనూ కనిపిస్తాయి. అంటే, వాల్మికి కథను ఉపయోగించుకోవడమే కాక, కంబకవి తన నివసిస్తున్న ప్రాంతంలోని జానపద సంప్రదాయాలను తనలో కథలో గుప్పించాడన్నమాట. ఈ కథలు ఇతర రామాయణాల్లో కనిపించడానికి కూడా కంబ రామాయణమే ఆధారం కావచ్చు.

కథాశిల్పం విషయంలో కూడా కంబ రామాయణంలో నాటకీయత ఎక్కువ. కంబరామాయణంలో ముందుగా రాముని పాదధూళి తాకి నల్లరాయి అహల్యగా మారుతుంది. ఆ తరువాతే ఆమె కథ మనకు తెలుస్తుంది. నల్లరాయి, ఎత్తైన ప్రదేశంపై రాముని రాకకు ఎదురుచూస్తూ ఉండటమే అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక. అహల్య శాపవిమోచనం, జడమైన రాయి రక్తమాంసాలున్న మనిషిగా మారడం, పరమాత్మ స్వరూపానికి భక్తిభావం చూపే ఆత్మ ప్రతిస్పందనలా అనిపిస్తుంది. అంతేకాక, కంబరామాయణంలో అహల్య వృత్తాంతానికి అంతకు ముందే చెప్పిన తాటకి వృత్తాంతానికి కూడా సంబంధం చూపుతుంది. తాటక కథలో రాముడు పాపభంజనుడు. శత్రువులకు జడత్వాన్ని, మృతిని కూర్చేవాడు. అహల్య కథలో జడత్వానికి ప్రాణం పోసేవాడు; వరాల ధార కురిపించే ఘన నీల మేఘం. కంబని కథలో రాముడు అచ్చమైన తమిళ కథానాయకుడు. అరిభంజనుడు, భక్తప్రియరంజనుడు. అహల్య శాపవిమోచనం, లోకంలోని సకల జనులకు వారి పాపాలనుండి విముక్తి కలిగించడమే రాముని అవతార లక్షణంగా చూపిస్తుంది.

వాల్మీకి రామాయణంలోని రాముడు సంపూర్ణ మానవుడు. మానవరూపంలో కష్టసుఖాలనుభవిస్తూ, ఎలా ధర్మబద్ధమైన జీవితం గడపాలో రాముడి ద్వారా లోకానికి చెప్పబడింది. బాలకాండలోనూ, రావణుని సంహరించే సమయంలో రాముడిని పరమాత్మ స్వరూపంగా, అవతారపురుషుడిగా వర్ణించే సంఘటనలు, తరువాత జత చేసిన ప్రక్షిప్తాలని పండితుల వాదన. కంబరామాయణంలో మాత్రం రాముడు కథలో ఆసాంతం భగవత్ స్వరూపమే. కాబట్టి అహల్య కథ వంటి సంఘటనలలో భక్తి, ఆరాధనా ప్రకటనలు గాఢంగా కనిపిస్తాయి. కంబరామాయణం పన్నెండవ శతాబ్దంలో భక్తి ఉద్యమ ప్రభావంలో రాసినది. కంబ కథనంలో రాముడు చెడుని తొలగించి, మంచిని సంరక్షించే క్రమంలో అహల్యతో మొదలుకొని, రావణుడి వధించే వరకూ తన ధర్మాన్ని నిర్వర్తించినవాడు. వైష్ణవ భక్తి సంప్రదాయపు నమ్మాళ్వార్ ప్రతీకలు ఇందులో కనపడుతాయి. నమ్మాళ్వార్ రాసిన ఈ పాశురాన్ని చూడండి:

కఱ్పార్ ఇరామ పిరానై అల్లాల్ మట్ఱుం కఱ్పరో?
పుఱ్పా ముదలా పుల్లెఱుంబాది ఒన్ఱ్ ఇండ్రియే
నఱ్పాల్ అయోద్దియిల్ వాళుం చరాచరం ముట్రవుం
నఱ్పాలుక్కు ఉయ్‌త్తనన్ నాన్ముగనార్ పెట్ఱ నాట్టుళే. నమ్మాళ్వార్ 7.5.1

ఎఱిగి రామ ప్రభువును వేరొకరినెఱుగనేల?
గడ్డి మొదలు పాకే చీమవరకు ఎవరినొల్లక
శుభ అయోధ్యలో వసించు చరాచరమెల్లరికి
శుభమును కూర్చె బ్రహ్మసృష్టికిలలోన్

నమ్మాళ్వారు చూపిన ఇటువంటి భక్తిభావనలే కంబ రామాయణపు కావ్యమంతటా మనకు ప్రత్యక్షమవుతాయి.

పైన చూపిన విధంగా అహల్య కథ ఒకటే అయినా, భిన్నమైన కథనాలతో, రంగులతో ఎలా వేర్వేరుగా అల్లబడిందో, అలాగే వివిధ రామాయణాల్లో తరువాతి కవులు పూర్వకవుల కథకు తమవైన మెరుగులు దిద్దడం ద్వారా తమ సృజనాత్మకతను చాటుకోవడం కనిపిస్తుంది. ఒక రకంగా తరువాతి రామాయణాల కథనాలు, పూర్వ రామాయణ కథనాలకు అధి-చిత్రీకరణలు. ఉదాహరణకు, 16వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మ రామాయణం వంటి కథల్లో రాముడు వనవాసం వెళ్ళేటప్పుడు సీత తనతో రాకూడదంటాడు. సీత రామునితో వాదిస్తుంది. ముందుగా మామూలు జవాబులే చెబుతుంది: ధర్మపత్నిగా అతని కష్టసుఖాలలో పాలు పంచుకోవాలి. అతడు వనవాసం చేస్తే తాను కూడా వనవాసిగా మారాలని చెబుతుంది. రాముడు కూడదంటాదు. సీత అప్పుడు రోషంతో, “ఇంతవరకూ లెక్కలేనన్ని రామాయణాలు వచ్చాయి. ఏ ఒక్క రామాయణంలోనైనా రామునితో అడవికి వెళ్ళని సీతను ఎక్కడైనా చూశామా?” అని ప్రశ్నిస్తుంది. దాంతో రాముడు ఒప్పుకుంటాడు; సీత రామునితో అడవికి వెళ్తుంది. ఇటువంటి కథనం వేరే రామాయణాల్లో కూడా కనిపిస్తుంది.

కంబ రామాయణం కూడా తరువాత వచ్చిన రామాయణాలపై తన ప్రభావాన్ని చూపించింది. తెలుగుదేశంలో వచ్చిన తెలుగు రామాయణాలలో, మలయాళ దేశపు దేవాలయాల్లో వేసే రామాయణ రూపకాల్లోను ఈ ప్రభావం మనం చూడవచ్చు. ఆగ్నేయాసియాలో వచ్చిన రామాయణాలపై కూడా కంబ రామాయణ ప్రభావం కనిపిస్తుంది. కంబరామాయణమే థాయి భాషలో వచ్చిన రామకిఎన్ ఆధారమని పరిశోధకులు నిరూపించారు. ఉదాహరణకు, థాయి భాషలో పాత్రల పేర్లకు సంస్కృతపు పేర్లు కాక తమిళ రామాయణంలో వాడిన కొన్ని పేర్లు వాడడం: థాయి రామాయణంలో ఋష్యశృంగుడి పేరు కలైక్కోటు. తులసీదాసు రాసిన రామచరితమానస్ లోనూ, మలేషియన్ భాషలోని ‘హికయత్ సేరి రామ్’ అన్న కథలోనూ కంబరామాయణ ప్రభావాలు కనిపిస్తాయి (సింగరవేలు, 1968).

భిన్న మార్గాల ద్వారా రామాయణం ఉత్తరం దిశగా పంజాబ్, కాశ్మీర్‌ల గుండా చైనా, టిబెట్ మరియు తూర్పు తుర్కిస్థాన్‌కీ, సముద్రం మార్గం ద్వారా దక్షిణ దిశలో గుజరాత్, దక్షిణ భారతం గుండా జావా, సుమత్రా మరియు మలయాదేశాలకి, భూమార్గం ద్వారా తూర్పు దిశలో బెంగాల్ గుండా బర్మా, థాయిలెండ్ మరియు లావోస్‌కి వెళ్లాయి (దేశాయి 1970, 5).
జైన కథనాలు
జైన కథనాల ప్రపంచంలోకి ప్రవేశిస్తే, రామకథలలో తరచుగా కనిపించే హిందూ విలువలు కనిపించవు. నిజానికి, జైన రామాయణాల్లో హిందువులు పనిగట్టుకొని రావణుని పాత్రకు అన్యాయం చేసారన్న భావనలు కనిపిస్తాయి. ఒక జైన రామాయణం ఈ ప్రశ్నలతో మొదలౌతుంది: “కోతులమూక రావణుని రాక్షస వీరులను హతమార్చడమేమిటి? పుణ్యాత్ముడు, జైన యోగి, యోగ్యుడు అయిన రావణుడు మాంసం తిని, రక్తం తాగడమేమిటి? కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోవడమేమిటి? అతడు సలసలకాగే నూనె చెవిలో పోసినా, ఏనుగులు చేత తొక్కించినా, యుద్ధభేరీలు మ్రోగించి, శంఖనినాదాలు చేసినా నిద్ర లేవకపోవడమేమిటి? రావణుడు సురరాజు ఇంద్రుణ్ణి బందీగా చేసి లంకకు ఈడ్చుకు వెళ్ళడమేమిటి? ఇవన్నీ కట్టుకథల్లా అనిపిస్తున్నాయి. హేతువుకు విరుద్ధంగా, అసత్య ప్రచారంగా గోచరిస్తున్నాయి.” అంటూ శ్రేణికుడనే రాజు ఈ కథలో అబద్ధాలను వేరు చేసి అసలు కథను తెలియజేయ వలసిందిగా గౌతమమునిని కోరుతాడు. గౌతమముని “నీకు జైనశ్రేష్ఠులు చెప్పిన కథ చెబుతాను. రావణుడు రాక్షసుడు కాదు. నరమాంసం తినేవాడు కాదు. కుకవులు కొంతమంది చేసిన తప్పుడు ప్రచారం ఇది.” అంటూ తన కథనాన్ని మొదలుపెడతాడు. పౌమ చరియ (సం. పద్మ చరిత) అనే ఈ జైన రామాయణం రాసిన విమలసూరికి వాల్మీకి రామాయణం బాగా తెలుసు. అందులోని తప్పులు దిద్ది అసలు కథను అందజేసే ఈ కావ్యాన్ని ప్రతిపురాణమని పేర్కొంటాడు. ప్రతి- అన్న ఉపసర్గ (prefix) చాలా జైనకావ్యాలకు వాడుకున్న ప్రత్యయమని ఇక్కడ గమనించాలి.

విమలసూరి (క్రీ.శ. 1) రామాయణం రాముని వంశవర్ణనతో మొదలుకాకుండా రావణుని గుణకీర్తనతో మొదలౌతుంది. రావణుడు జైన సంప్రదాయానికి చెందిన 63 శలాకపురుషులలో ఒకడు. అతడు ఉత్తమ వంశానికి చెందిన వాడు. బాగా చదువుకున్నవాడు. మహా తపస్సు ద్వారా మంత్రశక్తులను శస్త్రాస్త్రాలను సాధించుకున్నవాడు. జైనగురువుల పట్ల భక్తిభావం కలవాడు. ఒక జైన గురువు ఆజ్ఞ మేరకు ఇష్టపూర్వకంగా తనను ఆమోదించని ఏ స్త్రీని తాకనని ప్రమాణం చేసినవాడు. ఒకసారి యుద్ధంలో రాజును ఓడించినప్పుడు, ఆ రాణి రావణుని మోహించినా కాదని వారించి, ఆ రాణిని తన భర్త దగ్గరికి పొమ్మంటాడు. అయితే, తన మృత్యువు ఒక స్త్రీ ద్వారా కలుగుతుందని విని హతాశుడౌతాడు. అటువంటి రావణుడే సీత అందానికి సమ్మోహితుడై, ఆమెను అపహరించి ఆమె ప్రేమను గెలవడానికి ప్రయత్నిస్తాడు. ఈ కథనాల్లో, రావణుని వంటి మహాపురుషుడు ఎలా స్త్రీవ్యామోహాన్ని గెలవలేక పతనమౌతాడో చెప్పడం జరుగుతుంది. నిజానికి, ఆధునిక దృక్కోణంతో చూస్తే రావణుడిది విషాద గాధే. జైనులు చెప్పిన కథలు వింటే మనకు రావణుని పట్ల ఆరాధనాభావం, జాలి కలగక మానదు.

మరికొన్ని జైన రామాయణాల్లో, సీత నిజానికి రావణుని కూతురు. ఆ విషయం రావణునికి తెలియదు. కూతురిపై వ్యామోహం కలిగినందువల్లే అతను పతనం చెందడం అన్న అంశం గురించి వచ్చే విభాగంలో చర్చిద్దాం.

మరో జైనకథ ప్రకారం వాసుదేవ, ప్రతివాసుదేవ అన్న నాయక, ప్రతినాయకులు ప్రతి యుగంలో జన్మించి శత్రువులై ఒకరితో ఒకరు పోట్లాడుతుంటారు. లక్ష్మణుడు, రావణులది ఈ జంటల ఎనిమిదో అవతారం. ప్రతియుగంలో ఎన్నో కష్టసుఖాలనుభవించిన తరువాత ఒకరినొకరు ఎదురుపడి యుద్ధం సాగిస్తారు. ప్రతీసారీ వాసుదేవుడు ప్రతివాసుదేవునిపై విజయం సాధిస్తాడు. ఈ కథలో రావణుడు చివరకు లక్ష్మణుడే వాసుదేవుడని గ్రహిస్తాడు. సంధి ప్రయత్నాలు విఫలమైన పిదప జరిగిన మహాయుద్ధంలో ఓడిపోతూ, తుది ప్రయత్నంగా తన అత్యంత శక్తివంతమైన చక్రాన్ని వదులుతాడు. అయితే, ఆ చక్రం లక్ష్మణుని రూపంలో ఉన్న వాసుదేవుని సంహరించక అతడి చేతిలో ఒదిగిపోతుంది. అతడు తిరిగి ఆ చక్రాన్ని వదలడంతో అది రావణుని తల ఖండించడంతో తన ప్రియమైన చక్రం వల్లే తను మరణిస్తాడు.

ఈ కథలో హిందూ రామాయణాల్లో లాగా రాముడు రావణుని సంహరించడు. రాముడు సిద్ధి పొందిన మహా జైన యోగి, విరాగి. జీవహింస చేయడు. ఈ కథలో చివరకు, రాముడు కైవల్యాన్ని అందుకుంటే లక్ష్మణుడు జీవహింస చేసినందుకు నరకానికి వెళ్తాడు.

ఇది కాక, పౌమ చరియలో జైనుల పుణ్యక్షేత్రాల గురించి, జైన గురువుల గురించి, జైన సంబంధమైన గాధల గురించి పిట్టకథలు, ఉపాఖ్యానాలు కనిపిస్తాయి. అయితే, జైనులు హేతువాదులుగా తమను చిత్రీకరించుకుంటారు కాబట్టి, మహిమలు, యజ్ఞయాగాదులు, రక్తతర్పణాలు మొదలైన అంశాలను ఎక్కడా ప్రస్తావించరు. రావణుని పదితలల గురించి కూడా ఓ చిత్రమైన కథ ఉంది. రావణుడు పుట్టినప్పుడు అతని తల్లి అతనికి తొమ్మిది రత్నాల మాల వేస్తుంది. ఆ తొమ్మిది రత్నాలలో అతని ముఖ ప్రతిబింబాలు తొమ్మిది కనిపించడంతో అతడు దశముఖుడయ్యాడు. ఇందులో వానరులు కూడా నిజానికి కోతులు కారు. వారు విద్యాధరులనే జాతి వారు. రావణునికి తాతల ద్వారా బంధువులు కూడాను. వారి పతాకంపై కోతి బొమ్మ ఉంటుంది కాబట్టి వారిని వానరులని అన్నారని వివరణ ఉంటుంది.

మౌఖిక కథనాలు
జానపదుల్లో ప్రచారంలో ఉన్న కథలు అంతా ఒకచోట కాకుండా ముక్కలు, ముక్కలుగా వినిపిస్తాయి. ఉదాహరణకు కన్నడ భాషలో ప్రచారంలో ఉన్న స్త్రీల పాటలలో సీత పుట్టుక, పెళ్ళి, అగ్నిపరీక్ష, ఆవిడ వనవాసం, లవకుశుల పుట్టుక, వారి తండ్రి రామునితో యుద్ధం మొదలైనవి విడివిడి పాటలుగా వినిపిస్తాయి. అయితే, తంబూరి దాసయ్యలు పాడే రామాయణగాథలో మొత్తం రామాయణ కథ కనిపిస్తుంది. ఈ కింది చర్చకు అవసరమైన ఆధారాలు గ్రహించడంలో రామే గౌడ, రాజశేఖర, బసవయ్యలు చేసిన పరిశోధనలకు నేను ఋణపడి ఉన్నాను.

అంటరాని కులానికి చెందిన వారు పాడే ఈ రామాయణగాథ రావణుని (వీరు రవుళ అంటారు) గురించి, అతని రాణి మండోదరి గురించిన ప్రస్తావనతో ప్రారంభమౌతుంది. వీరికి సంతానం లేక బాధ పడుతూ ఉంటారు. సంతానం కోసం రవుళుడు అడవికి వెళ్ళి తపస్సు చేస్తూ, రక్తాలు కారేంతవరకూ నేలమీద పొర్లుతూ తనను తాను ఎన్నో రకాలుగా బాధలకు గురి చేసుకుంటాడు. అప్పుడు శివుడు జోగి రూపంలో ప్రత్యక్షమౌతాడు. అతడు రవళునికి ఒక మామిడి పండు ఇచ్చి దాన్ని భార్యతో ఎలా పంచుకుంటావని అడుగుతాడు. మామిడి గుజ్జు భార్యకిచ్చి నేను టెంక తింటాను అన్నాడు రవళుడు. అనుమానంతో జోగి అంటాడు “నువ్వు నాకు చెప్పేదొకటి. నీ మనసులో ఉన్నదొకటి. నువ్వు నాకు అబద్ధం చెబితే దాని ఫలం నువ్వే తినవలసి వస్తుంది” అంటాడు. రవళుని కలలో ఒక ప్రపంచం, యథార్థంగా మరో ప్రపంచం అంటాడు కవి ఇక్కడ. మామిడిపండుతో పాటు, పూజాసామాగ్రితో వచ్చిన రవళుని చూసి మండోదరి సంతోషపడుతుంది. శివునికి పూజలు, ప్రార్థనల తరువాత మామిడిపండు తినే సమయంలో రవళునికి దుర్బుద్ధి పుట్టి గుజ్జు మొత్తం తనే తినేసి పిక్క భార్యకిస్తాడు. ఆవిడ తిని పారేసిన తరువాత అది పెరట్లో పెద్ద మామిడిచెట్టయి పెరుగుతుంది. ఇంతలో భార్యకు బదులుగా రవళుడే గర్భం ధరిస్తాడు. ఆ గర్భం ఒక్కరోజులోనే నెలరోజలంత పెద్దదౌతుంది:

“ఒక్క రోజులో ఒక్క నెలాయే, శివుడా,
రెండవనాడే రెండు నెలలాయే
వేవిళ్ళే మొదలాయె, శివుడా!
వేరే మగవాళ్ళకు
నా మోమెట్లా జూపించేది శివుడా!
మూడోనాడు మూడో నెలాయె
నా మోమెట్లా జూపించేది శివుడా!
నాల్గోనాడు నాల్గో నెలాయె
నేనెట్లా భరించేది శివుడా!
అయిదోనాడు అయిదునెలలాయె
ఓ దేవుడా, ఎందుకీ కష్టం శివుడా!
తాళలేనురో, తాళలేనురో శివుడా,
నేనెట్లా బతికేది శివుడా!
ఆరోనాడు ఆరోనెలాయె, తల్లీ
ఏడోనాడు ఏడునెలలాయె
మరునాడేవచ్చె ఎనిమిది శివుడా!
రవళునికిప్పుడు తొమ్మిది నెలలు
నిండు గర్భము నిండుగ పెరిగి
పండంటి పాప పుట్టెను
ముక్కునుండి ఊడి పడ్డది
తుమ్మితే పుట్టిన సీతమ్మ”

కన్నడభాషలో ‘సీతా’ అంటే ‘తుమ్మినాడు’ అని అర్థం. తుమ్ము నుండి పుట్టింది కాబట్టి ఆ పాపకు సీతా అని పేరు పెట్టాడట. ఇది కన్నడ భాషలో జానపదులు సీతా శబ్దానికి ఇచ్చిన జానపదవ్యుత్పత్తి (folk-etymology). (సంస్కృతంలో కూడా ఇటువంటి కథలే కనిపిస్తాయి: సీత అంటే సంస్కృతంలో నాగటి చాలు అని ఒక అర్థం. భూమిని దున్నుతుండగా నాగటిచాలులో దొరికింది కాబట్టి సీత అని పేరు పెట్టారని సంస్కృత భాషలో కనిపించే లోకనిరుక్తి). రవళుడు జ్యోతిష్యుల వద్దకు వెళ్ళి జోగికిచ్చిన మాట తప్పిన విషయాన్ని వారికి వెల్లడిస్తాడు. వారు ఉపద్రవం ముంచిపోక ముందే ఆమెను ఎక్కడైనా వదిలివేయమని సలహా ఇస్తారు. రవళుడు ఆ పాపాయిని వస్త్రాభరణాలతో అలంకరించి ఒక పెట్టెలో ఉంచి జనకుని భూమిలో వదిలివేస్తాడు.

ఈ రకంగా సీత జన్మ వృత్తాంతం చెప్పిన తరువాతే, ఈ కవి రామలక్ష్మణుల పుట్టుక, బాల్యం గురించి క్లుప్తంగా వివరిస్తాడు. ఆ తరువాత సీతా స్వయంవరం, అక్కడ రవళుడు శివధనుస్సు ఎత్తబోయి భంగపాటు పడడం, రాముడు వచ్చి అవలీలగా ధనుస్సు విరిచి సీతను పెళ్ళాడటం వివరంగా ఉంటుంది. ఆ పిదప రవళుడు సీతను ఎత్తుకుపోవడం, రాముడు కోతిమూకతో దండెత్తి రావడం మళ్ళీ క్లుప్తంగా ఉంటుంది. ఆపై కవి మళ్ళీ సీత కష్టాలను విపులంగా వర్ణించడం కనిపిస్తుంది. సీతపై అపవాదు, ఆమెను అడవిలో వదలిరావడం, ఆమె కవలలకు జన్మనివ్వడం, వారు వీరులుగా పెరిగి పెద్దవారవ్వడం, రాముని యాగాశ్వాన్ని కట్టివేసి తండ్రితోనే తలపడటం, చివరకు తల్లిదండ్రులను ఒకటి చెయ్యడం అంతా వివరంగా వర్ణిస్తాడు కవి.

ఈ జానపదగాథలో కథనంలో మార్పులే కాక, ప్రాధాన్యత విషయంలో కూడా తేడాలు గమనించవచ్చు: ఇక్కడ కథ ఎప్పుడు సీత చుట్టూ అల్లుకొని ఉంటుంది. కథకునికి సీతదే ప్రధాన పాత్ర; ఆమె పుట్టుక, ఆమె జనకుని దొరకడం, పెళ్ళి, అపహరణం, తిరిగి అయోధ్యకు మరలి రావడం ఇవన్నీ ఒక్కో విభాగంలో విపులంగా వరించబడి ఉంటాయి. రామ, లక్ష్మణుల పుట్టుక, వనవాసం, యుద్ధం కలిపితే ఎంత పెద్ద విభాగమౌతుందో, సీతను అడవిలో వదిలివేయడం, ఆమె గర్భవతిగా అడవిలో గడపడం, భర్తను తిరిగి కలవడం గురించి వర్ణించే ఒక్కో విభాగం అంత పెద్దదిగా ఉంటుంది. అంతేకాక, రవళునికి సీత విపరీత గర్భం ద్వారా జననమందడం కొన్ని కొత్త కోణాల్ని సూచిస్తుంది: గర్భం గురించి పురుషులలో ఉండే మానసికపరమైన ఈర్ష్య, తండ్రులు కూతుళ్ళపై మోహాన్ని పెంచుకోవడం, ఆ రకమైన తండ్రి మరణానికి కూతురే కారణం కావడం వంటి జటిలమైన మానసిక స్వభావాలు ఇందులో కనిపిస్తాయి. రావణాసురుని కూతురుగా సీతను వర్ణించడం ఇతర రామాయణాలలో కూడా కనిపిస్తుంది: వసుదేవహిండి అన్న జైనరామాయణంలోనూ, తెలుగు, కన్నడ జానపదుల గేయాల్లోనే కాక, ఈ రకమైన కథ ఆగ్నేయాసియాలోని కొన్ని రామాయణాలలో కూడా కనిపిస్తుంది. ఇంతేకాక, కొన్ని రామాయణాలలో కామాంధుడైన రావణుడు, ఒక పుణ్యవతి అయిన స్త్రీని బలాత్కరించగా ఆ స్త్రీ అతని కూతురుగా పుట్టి అతని వినాశనానికి కారకురాలౌతానని ప్రతిన బూని మరణిస్తుంది. ఈ విధంగా వాల్మీకి కథలో కనిపించని కథలు, కథనాలు, స్వభావాలు, లక్షణాలు ఎన్నో మౌఖిక సంప్రదాయంలో కనిపిస్తాయి.
ఆగ్నేయాసియా ఉదాహరణ
భారతదేశం దాటి బయటకు వస్తే మనకు ఎన్నో రకాలైన రామాయణ కథనాలు టిబెట్, బర్మా, లావోస్, కంబోడియా, మలేషియా, జావా, ఇండోనేషియా వంటి దేశాలలో కనిపిస్తాయి. ఈ విభాగంలో ఒక్క థాయి వారి రామకీర్తి అన్న ఉదాహరణ మాత్రం పరిశీలిద్దాం. భారతదేశం నుండి సంక్రమించిన వాటిలో థాయి దేశపు సంస్కృతి, సంప్రదాయాలకనుగుణంగా మార్పులు పొంది వారి నిత్యజీవన సంవిధానంలో ఒక భాగంగా రామాయణం ఒదిగిపోయినంతగా మరేది ఒదిగిపోలేదని థాయి రామాయణాలపై పరిశోధన చేసిన సంతోష్ దేశాయి అభిప్రాయం. వారి బుద్ధ దేవాలయాల గోడలపై గీసిన చిత్రాలలో, గ్రామాల్లో, నగరాల్లో వేసే నాటకాలలో, నృత్యరూపకాలలోనూ కనిపించే రామకథ ఆ సమాజంపై రామాయణ ప్రభావం మనకు తేటతెల్లం చేస్తుంది. ‘రామ’ అన్న పేరు గల రాజులు వరుసగా రామాయణాన్ని థాయి భాషలో రచించడం అబ్బురపరిచే విషయం. రామ – I అనే రాజు అయిదు వేల పద్యాలలో రామాయణం రాస్తే, రామ – II అనే రాజు రామాయణాన్ని నృత్తరూపకంగా మలచాడు. రామ – VI అనే రాజు మొదటి రామాయణంలో లేని ఇంకొన్ని విభాగాలు వాల్మీకి రామాయణం నుండి అనువదించాడు. థాయిలాండు లోని లోపుబురి (లవపురి), ఖిడ్కిన్ (కిష్కింధ), అయుధియ (అయోధ్య) మొ॥ నగరాల పేర్లు రామాయణ గాథ ఆ సమాజంపై చూపిన ప్రభావానికి అద్దం పడతాయి.

థాయి భాషలో రాసిన రామకీర్తి లేదా రామకిఎన్ ముందుగా మనుష్యులు, రాక్షసులు, వానర జాతుల పుట్టుకకు సంబంధించిన కథతో ప్రారంభమౌతుంది. తరువాతి విభాగంలో రామలక్ష్మణులు రాక్షసులతో మొదటిసారి పోట్లాడిన ఉదంతం, సీతా రాముల కళ్యాణం, వనవాసం, సీతాపహరణం, రాముడు వానర రాజును కలవడం; ఆపై యుద్ధానికి సంసిద్ధులవ్వటం, హనుమంతుని లంకాప్రయాణం, సేతుబంధనం, లంకపై దాడి, రావణుని మరణం, సీతారాముల కలయిక. మూడో విభాగంలో, లంకా నగరంలో తిరుగుబాటు, రాముడు తన తమ్ముళ్ళను పంపడంతో పాటు సీతను అడవిలో వదిలిరావడం, ఆమె కవలలకు జన్మ నివ్వడం, వారు తండ్రి రామునితో యుద్ధం తలపడం, సీత భూమిలోకి క్రుంగిపోవడం, దేవతలంతా వచ్చి సీతారాములను తిరిగి కలపడం ఉంటాయి.

వాల్మీకి కథకు రామకీర్తి కథకు ఎన్ని పోలికలు కనిపిస్తాయో, అన్ని విభేదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, సీతను అడవికి పంపడం గురించి ఒక కొత్త సంఘటన కనిపిస్తుంది: శూర్పణఖ కూతురు తన తల్లిని అవమానపరచి, తన మామ చావుకు కారణభూతమైన సీతపై ప్రతీకారం తీర్చుకోవడానికి అయోధ్య వస్తుంది. సీత అంతఃపురంలో దాసిగా ప్రవేశించి, సీతచేత రావణుని చిత్రపటం గీయిస్తుంది. ఆ పటం చూసిన రాముడు అనుమానంతో సీతను చంపివేయమని ఆజ్ఞాపిస్తాడు. కానీ, లక్ష్మణుడు జాలితో సీతను అడవిలో వదిలివేసి ఒక లేడి గుండెను రామునికి సాక్ష్యంగా చూపిస్తాడు. ఈ రకమైన కథలు కొన్ని దక్షిణభారత జానపద రామాయణాల్లో, జైన, వంగ, కాశ్మీరి రామాయణాల్లోనూ కనిపిస్తాయి.

అలాగే, సీతారాముల కలయిక కూడా వాల్మీకి రామాయణం కంటే భిన్నంగా ఉంటుంది. సీత ఇంకా బతికే ఉందని తెలిసి రాముడు, తను చచ్చిపోయినట్టుగా వార్త పంపి సీతను అయోధ్యకు రప్పిస్తాడు. తనను కుయుక్తితో అయోధ్య రప్పించారని తెలిసి సీత పట్టరాని కోపంతో తన తల్లి భూదేవిని ప్రార్థించి భూమిలోకి వెళ్ళిపోతుంది. రాముడు సీతను తీసుకు రమ్మని హనుమంతుడిని పంపినా సీత ససేమిరా అంటుంది. చివరకు, మహాశివుని చొరవ వల్ల వారిద్దరి కలయిక మళ్ళీ సాధ్యమౌతుంది.

థాయి రామాయణంలో సీత పుట్టుకకు సంబంధించిన కథనం వాల్మీకి కథనం కంటే భిన్నంగా ఉంటుంది. దశరథుడు పుత్రకామేష్టి జరిపినప్పుడు పాయసం కాకుండా లడ్డు వంటి ప్రసాదం లభిస్తుంది. అందులో కొంత భాగాన్ని ఒక కాకి నోట కరుచుకొని రావణుని భార్యకు చేరవేస్తుంది. అది తిన్న మండోదరి సీతకు జన్మనిస్తుంది. తన కూతురే తన మృత్యువుకు కారణమౌతుందని తెలిసి రావణుడు ఆ బిడ్డను సముద్రంలో పడవేస్తాడు. సముద్రుడు సీతను రక్షించి జనకునికి అందజేస్తాడు. ఇదే రకమైన కథ జైన, దక్షిణభారత జానపద రామాయణాల్లోనూ కనిపిస్తుంది.

ఇంతేకాక, థాయి రామాయణంలో రాముడిని విష్ణువు అవతారంగా భావించినా, వారి దృష్టిలో విష్ణువు కన్నా శివుడే శక్తిమంతుడు. రామకీర్తిలో చాలావరకు రాముణ్ణి మానవ వీరునిగానే చిత్రీకరిస్తారు. రాముడు పరిపూర్ణ మానవునిగానో, ధర్మానికి, సత్యానికి ప్రతీకగానో వీరు పరిగణించరు. రామాయణకథలో సీతాపహరణానికి సంబంధించిన సంఘటన, యుద్ధకాండ లోని సంగ్రామ వివరాలు థాయి దేశస్థులను ఎక్కువగా ఆకట్టుకొనే ఘట్టాలు. భారతీయులను ఎక్కువగా ఆకట్టుకొనే సీతా రాముల వియోగ దుఃఖం, పునర్మిళినాలను వీరు అంతగా పట్టించుకోరు. యుద్ధకాండలో కనిపించే ఉత్సాహం, ఉద్రేకం థాయి రామాయణంలో ఎంతో విపులంగా వర్ణిస్తారు. ఇంతకు ముందు మనం చూసినట్టుగా కన్నడ జానపదులలో ఇది చాలా చిన్న భాగం. దేశాయి అభిప్రాయం ప్రకారం, థాయి దేశ చరిత్ర పరిశీలిస్తే వారు ఆ రోజుల్లో నిరంతరం ఇరుగుపొరుగు రాజ్యాలతో యుద్ధాలు చేయవల్సి వచ్చేది. అందుకనే భార్యా భర్తల అనురాగాలు, కలహాల కన్నా, ధర్మ నిరతికన్నా, యుద్ధ వర్ణనలే వారి దృష్టిని ఎక్కువగా ఆకర్షించాయి. థాయి ప్రేక్షకులలో రామునికన్నా హనుమంతుడంటే ఎక్కువ అభిమానం. భారత రామాయణాలవలే థాయి రామాయణంలో హనుమంతుడు రామభక్తుడు, స్త్రీ సాంగత్యం తెలియని ఆజన్మబ్రహ్మచారి కాదు. థాయి హనుమంతుడు స్త్రీ వల్లభుడు. ఇతడు లంకలో పరస్త్రీల గదుల్లోకి తొంగిచూడడానికి వాల్మీకి హనుమంతుడిలా, కంబ హనుమంతుడిలా ఏ మాత్రం సంశయించడు.

రావణుని స్వభావం కూడా భిన్నమైనదే. రామకీర్తి రావణుని శక్తిని, జ్ఞానాన్ని పొగుడుతుంది. సీతాపహరణం రావణుని ప్రేమారాధనలకు ప్రతీకగా భావిస్తుంది. తను ఆరాధించిన స్త్రీ కోసం, తన రాజ్యాన్ని, కుటుంబాన్ని చివరకు తన ప్రాణాన్నే పణంగా పెట్టిన రావణునిపై జాలి చూపిస్తుంది. అతడు చనిపోతూ పలికిన వాక్యాలు తరువాతి కాలంలో ఎన్నో ప్రేమగీతాలకు స్ఫూర్తిదాయకమయ్యాయి. వాల్మీకి పాత్రలకు భిన్నంగా (కంబ- పాత్రలకు భిన్నంగా అనాలేమో ఇక్కడ) థాయి రామాయణంలో పాత్రలు మామూలు మనుష్యులవలే మంచి చెడుల కలయిక. థాయి రామాయణంలో రావణుని మృతి వాల్మీకి రామాయణంలా ఆనందంతో పండగచేసుకునే సందర్భం కాదు.

భిన్నత్వంలో కనిపించే క్రమం
పైన చర్చించిన విధంగా, వాల్మీకి సంస్కృతంలో చెప్పిన కథే కాకుండా మనకు ఎన్నో రామకథలు పలు రకాలైన భేదాలతో లభ్యమౌతున్నాయి. మనం ఇంతకు ముందు చర్చించని మరికొన్ని తేడాల గురించి మాట్లాడుకుందాం. మనకు లభ్యమౌతున్న రామాయణాల్లో రెండు రకాల ముగింపులు కనిపిస్తున్నాయి. ఒకటేమో రావణునిపై విజయం సాధించి, రాముడు, సీత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాభిషిక్తులవ్వడంతో కథ ముగిసిపోతుంది. కానీ, వాల్మీకి, కంబ రామాయణాలలో సహా మరికొన్ని రామాయణాల్లో కథ ఇంకా కొనసాగుతుంది. ఆ కథలో రాముడు రావణుని చెరలో గడిపిన సీతను రాణిగా ఏలుకున్నాడన్న అపవాదు భరించలేక సీతను అడవిలో విడిచిరమ్మని ఆజ్ఞాపిస్తాడు. అడవిలో సీత లవకుశులనే కవలలకు జన్మనివ్వడం, వారు వాల్మీకి ఆశ్రమంలోనే పెరుగుతూ రామాయణంతో పాటూ యుద్ధ విద్యలు నేర్చుకొని చివరకు రాముని వద్దనే రామాయణం పాడటం, రాముని యజ్ఞాశ్వాన్ని బంధించి రామసేనపై విజయం సాధించడం మొదలైన కథనాలతో సాగే ఉత్తర కాండ ఈ రామాయణాల్లో కనిపిస్తుంది. ఈ ఉత్తరరామాయణం వాల్మీకి రామాయణంలో తరువాత జతచేసిన ప్రక్షిప్తమని అంటారు.

ఈ రెండు రకాల ముగింపులు రామాయణ కథకు రెండు విభిన్నమైన అనుభూతుల్ని కలగజేస్తాయి. మొదటి కథ సుఖాంతం. చెడుపై మంచి, అధర్మంపై ధర్మమార్గం సాధించిన గెలుపు. వనవాసంలో అనుభవించిన కష్టాల తరువాత సీతారాములు సంతోషంగా అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాభిషిక్తులవ్వడం. రెండో ముగింపులో సీతారాముల ఆనందం, కలయిక క్షణికం మాత్రమే. ఈ రకమైన కొనసాగింపువల్ల సీతారాముల విప్రలంభ వియోగమే కథలో ప్రధాన అనుభూతిగా మిగిలిపోతుంది. కొన్నికథల్లో ఈ కొనసాగింపు చివరకు విషాదాంతంగా భూజాత అయిన సీత మళ్ళీ భూమిలో కలసిపోవడంతో ముగుస్తుంది. నాగటిచాలుకు పర్యాయపదంగా జనకునికి భూమిలో దొరికిన సీత, మళ్ళీ భూమిలో కలసిపోవడంలో భూమినుండి పుట్టిన వృక్షం మళ్ళీ భూమిలో కలసిపోయే అంశంతో ఒకవిధమైన సారూప్యత సాధిస్తుంది. సీత బీజం లాంటిదైతే, రాముడు ఘన నీల మేఘం. మృత్యువుకు సూచకమైన దక్షిణదిశకు ప్రతీక రావణుడు. ఈ రకమైన పోలిక మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా, సూచనాప్రాయంగా ఎన్నో రామాయణాలలో వినిపిస్తుంది. అంతేకాక, వర్షాన్ని సంతానోత్పత్తికి ప్రతీకగా వాడుకునే వర్ణనలు అడుగడుగునా కనిపిస్తాయి. భగీరథుడు గంగను భూమిమీదకు రప్పించడం ద్వారా చనిపోయిన పితరులను తిరిగి బతికించుకునే గంగావతరణఘట్టం నుండి స్త్రీసాంగత్యం తెలియని ఋష్యశృంగుని వద్దకు అందమైన అమ్మాయిల బులిపాటంతో లోమపాదుని రాజ్యంలో వర్షాలు కురిపించడం, అతడే దశరథుని పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహించడం వంటి ప్రతీకలు రామాయణ కథలలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇటువంటి కోణంతో ఆలోచిస్తే, ప్రకృతిలోని ఇతర జంతుజాలం, పక్షిగణాలు కూడా రామునికి సహాయం చెయ్యడంలోనూ నిరంతర జీవపరిణామచక్రానికి ప్రకృతి పురుషుల పరస్పర సమాశ్రిత్వం కనబడుతుంది. వాల్మీకి రామాయణంలో పక్షులు కోతులు రామునికి సహాయం చెయ్యడం కవిత్వసాధనాలైతే, జైన రామాయణంలో అవి అక్కరలేని అనావశ్యకాలు. ఇలా వేర్వేరు కథనాల్లో విభిన్నమైన పార్శ్వాలను ఉద్దీపించడంతో, అవి కలిగించే అనుభూతులు కూడా విభిన్నంగానే ఉంటాయి.

వివిధ రామాయణాల ప్రారంభాల గురించి కూడా ఈ విధమైన చర్చ చెయ్యవచ్చు. వాల్మీకి రామాయణం వాల్మీకి గురించి చెప్పే కథతో ప్రారంభమౌతుంది. బోయవాడుగా పక్షుల జంటలో ఒక పక్షిని నేల కూల్చడం వాల్మీకి కథకు ప్రారంభం. చచ్చిన మగపక్షి చుట్టు తిరుగుతూ ఆడపక్షి విలపించడం ఆ కిరాతకునిలో శోకం కలిగించి, అది శ్లోకంగా మారుతుంది. బోయవాడు అంతరించి కవిగా అవతరిస్తాడు. రామకథను అదే ఛందస్సులో రాయాలని తలపిస్తాడు. ఈ కథను తరువాతి రససిద్ధాంతాల్లోనూ వాడుకుంటారు. సహజంగా ఉద్భవించే ప్రగాఢ భావస్పందన రసరూపంలో పెల్లుబుకుతుందని చెప్పడానికి ఈ సంఘటనను ఉదహరిస్తుంటారు.

అంతేకాక, ప్రారంభంలోనే వర్ణించిన వియోగదుఃఖం రామాయణకథలో మనకు అడుగడుగునా ఎదురు పడుతుందన్న సూచన కూడా మనం గమనించవచ్చు. దశరథుడు ఏనుగు అనుకొని శ్రవణకుమారుని హతమార్చి ఆ గుడ్డి తల్లిదండ్రులకు పుత్రవియోగాన్ని ప్రసాదించడం, రాముని వనవాసయాత్రలో దశరథుడు తానే పుత్రవియోగాన్ని అనుభవించడం, రాముడు బంగారు లేడిని సంహరించినప్పుడు అది సీత అపహరణకు, సీతారాముల వియోగానికి దారితీయడం – ఇలా క్రౌంచపక్షి వియోగంతో మొదలైన రామాయణంలో తండ్రి కొడుకుల వియోగం, అన్నదమ్ముల వియోగం, భార్యాభర్తల వియోగం వంటి ఎన్నో వియోగదుఃఖాలు కనిపిస్తాయి మనకు.

ఈ విధంగా కావ్యారంభంలోని తొలిపలుకుల ద్వారా ఆ కథనంలో ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల పరిచయం మనకు కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కోణంలో కంబరామాయణాన్ని పరిశీలిస్తే, మనకు పూర్తిగా విభిన్నమైన పార్శ్వం కనిపిస్తుంది. కంబరామాయణం నదీపటలము అన్న శీర్షికతో సరయూనది వర్ణనతో ప్రారంభమౌతుంది. కంబ రామాయణారంభంలో చేసిన ఈ సరయూనది వర్ణన వాల్మీకి రామాయణంలో కనిపించదు. ఈ వర్ణనలో సముద్రంనుండి సేకరించిన జలాలు మేఘంగా మారి వర్షంగా కురిసి సరయూ నదిగా అయోధ్యలో అవతరించడాన్ని వివరిస్తాడు కవి. ఇందులో రాముని పూర్వీకుల వృత్తంతం, వర్షాన్ని సంతానోత్పత్తికి ప్రతీకగా వాడడం, ముఖ్యంగా కంబ రామాయణంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశమైన రామభక్తి మొదలైన విషయాలన్నీ ఈ ప్రారంభ వాక్యాల ద్వారా మనకు పరిచయం చేస్తాడు.

ఇక్కడ కవి నది జలాలను వర్ణిస్తూ చేసే వేర్వేరు ఉపమానాల ద్వారా సూచనల ద్వారా తాను రామాయాణంలో ప్రస్తావించబోయే అంశాలను పరిచయం చెయ్యడం గమనించవచ్చు. ఇందులో ముఖ్యాంశం జనజీవనానికి, ఫలోత్పత్తికి (సంతానోత్పత్తికి) ఉపయోగపడే నదీజలాల వర్ణనే అయినా రామాయణగాథలో కనిపించే అంశాలన్ని స్పృశిస్తాడు. నిజానికి ఈ రకమైన వర్ణన తమిళ సాహిత్య సంప్రదాయంలో ఒక భాగమని చెప్పుకోవచ్చు. తమిళ ప్రాచీన వాఙ్మయమైన కుఱళ్ ప్రారంభంలో దైవస్తుతి తరువాత వర్షాలను కీర్తిస్తూ సాగడం గమనించదగ్గ విశేషం.

పలు రామాయణాల్లో కనిపించే మరో ముఖ్యమైన తేడా పాత్రల ప్రాధాన్యత. వాల్మీకి రామాయణంలో రాముడు ప్రధాన పాత్ర కాబట్టి ప్రారంభ ఘట్టాలన్నీ రాముని పూర్వీకుల గురించి రాముని బాల్యం గురించి వివరిస్తాయి. అదే, విమలసూరి రాసిన జైన రామాయణంలోనూ, థాయి రామాయణంలోనూ రావణుడి పాత్రకే అధిక ప్రాధాన్యత కనిపిస్తుంది. అందుకే వాటిలో రావణుని వంశచరిత్ర, అతడి సాహసకృత్యాల వర్ణనతో ఆ రామాయణాలు ప్రారంభమౌతాయి. కన్నడ జానపదగేయాలలో ప్రధాన పాత్ర సీతది. ఆమె పుట్టుక, పెళ్ళి, కష్టాలపై ఉన్న దృష్టి మిగిలిన పాత్రలపై కనిపించదు. తరువాత వచ్చిన అద్భుతరామాయణము, తమిళంలో వచ్చిన శతకంఠరావణుని కథ మొదలైన వాటిలో సీతకు వీరత్వం కూడా ఆపాదిస్తారు: పదితలల రావణుని రాముడు హతమారిస్తే, అతడు వంద కంఠాలతో శతకంఠరావణుడిగా ప్రత్యక్షమౌతాడు. ఏం చెయ్యలో పాలుపోని రాముని ఆదుకోవడానికి సీత విల్లంబులు ధరించి శతకంఠరావణుని వధిస్తుంది. సంతాలి జాతి వారి మౌఖిక సాహిత్యంలో సీత పతివ్రత కాదు; ఆమెకు రావణునిపై, లక్ష్మణునిపై కూడా మోహభావాలు ఉంటాయి – వాల్మీకి, కంబ రామాయణాలు భక్తితో చదివిన హిందువులెవ్వరు ఇది సహించలేరు. ఆగ్నేయాసియా రామాయణాలలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు హనుమంతుడు స్త్రీవల్లభుడు. ఎన్నో ప్రేమకథలకు నాయకుడు. కంబ రామాయణంలోనూ, తులసీ రామాయణంలోనూ రాముడు సాక్షాత్ దైవస్వరూపమే. జైన రామాయణాల్లో సిద్ధి పొందిన జైన యోగిగా రాముడు రావణుని వధలో కూడా పాలు పంచుకోడు. ఈ రకంగా ప్రతి పాత్రను ఒక్కొక్క రామాయణం ఒక్కొక్క విధంగా చిత్రీకరిస్తుంది. ఒక రామాయణంలో ఒక చిత్రీకరణ చదివిన వారికి మరో రామాయణంలోని చిత్రీకరణ ఏహ్యభావాన్ని కలిగించవచ్చు.

ఇవే కాక, సీతను మళ్ళీ అడవికి పంపించడానికి కారణాలలో తేడాలు, సీత రెండో పుత్రుని జననం, సీతా రాములు చివరిసారి కలిసిన సంఘటన మొదలైన విషయాలను కూడా ఒక్కో రామాయణంలో ఒక్కో రకంగా చిత్రీకరించారు. ఈ కథలన్నీ ఒకటికంటే ఎక్కువ రామాయణాలలో కనిపిస్తాయి; పలుచోట్ల వెలసిన రామాయణాల్లో కనిపిస్తాయి.

రాముడు, అతని తమ్ముడు, అతని భార్య సీత, ఆమెను అపహరించిన రావణుడు వంటి ప్రధాన పాత్రలే కాక రామాయణకథలో అన్ని కథనాల్లో కనిపించే ప్రధాన ఘట్టాలు ఉన్నాయా? లేక ఈ కథలన్నింటిలో కనిపించే సామ్యం పాత్రల మధ్య ఉన్న చుట్టరికమేనా? ఒక రకంగా చూస్తే, ఇవన్నీ రామాయణకథలే అనడం అరిస్టాటిల్ చెప్పిన వడ్రంగి పాతరంపం లాంటిదవుతుంది. అరిస్టాటిల్ ఓ వడ్రంగిని ఈ రంపం ఎంతకాలం నుండి వాడుతున్నావు అని అడిగాడట. ఆ వడ్రంగి ఇది నేను ముప్ఫయ్ ఏండ్లనుండి వాడుతున్నాను. అయితే, దీని పిడిని కొన్ని సార్లు మార్చాను. దీని అలుగు కొన్ని సార్లు మార్చాను. దీని రెక్క కొన్ని సార్లు మార్చాను అని అన్నాడట. అదే విధంగా కొన్ని పేర్లు, చుట్టరికాలు స్థూలంగా కొన్ని సంఘటనల్లో సామ్యం కనిపించినా సూక్ష్మంగా పరిశీలిస్తే ఏ ఒక్క రామాయణం మరి వేరే రామాయణంలా ఉండదు. ఒకేపేరు పెట్టుకున్న వ్యక్తులెందరో ఉన్నా, వారందరిలో ఏ రకంగా ఒకే లక్షణాలు కనిపించవో అలాగే, ఈ కథనాలన్నింటికి రామాయణమని పేరు ఉన్నా వాటి లక్షణ స్వభావాలు వేరువేరని చెప్పవచ్చు.

ఈ రకమైన తీర్మానం విపరీతమని మీలో కొందరు భావించవచ్చు. అయితే, ఈ రామాయణాల్లో సామ్యధర్మం లేకపోలేదు. హిందు, జైన, బుద్ధ సంప్రదాయాలకు అనుగుణంగా, ఆయా స్థల కాలాదులకు, దేశకాల సంస్కృతులకు అనుగుణంగా, ఆయా భాషాసాహిత్య సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి రామాయణాన్ని పరిశీలిస్తే మనకు ఈ రామాయణాల్లో ఎన్నో సామ్యధర్మాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, కృత్తివాస రాసిన బెంగాలీ రామాయణంలో సీతాకళ్యాణం అచ్చు బెంగాలీ వివాహ పద్ధతుల ప్రకారం జరిపిస్తే, కంబ రామాయణంలో తమిళ వివాహాచారాలు కనిపిస్తాయి.

ఒక రకంగా చూస్తే, ఒక రామాయణానికి మరో రామాయణానికి సామ్యాలు, భేదాలు వెతకడం కంటే అవన్ని మనకు కనిపించని ఒక ఉమ్మడి సూత్రానికి కట్టుబడి ఉన్నాయని అనుకోవాలి. ప్రతి కవి, రామాయణ సారమనే సాగరంలో మునిగి తనదైన కథనంతో బయటకు వస్తాడు. దానికి ఒక విలక్షణమైన రంగు, రుచి, వాసన ఉంటాయి. గొప్ప కావ్యాలు చిన్న కావ్యాలలో ఉండే విశేషాలను కలుపుకుంటాయి. అలాగే, చిన్న ప్రయత్నాలు గొప్ప కావ్యాల కృషి నుండి తమకు వీలైనంత రాబట్టుకుంటాయి. ఒక జానపద కథనం ప్రకారం, రామ రావణ యుద్ధం తరువాత హనుమంతుడు ఒక పర్వతంపై కూర్చుండి రామాయణ కథనంతా రాశాడట. అది ఇప్పుడు మనకు తెలిసిన రామాయణాలన్నిటికన్నా ఎన్నో రెట్లు పెద్దది. కథ సమగ్రంగా రాసి ఆ తాళపత్రపు రేకులను గాలిలో వదిలివేశాడట. వాల్మీకి, తనకు దొరికిన ఆకుల ఆధారంగా తన రామాయణాన్ని కూర్చాడట. అంటే, ఏ రామాయణకథనం వారి సొంతం కాదు. అలాగని ఏ ఒక్కటీ పునఃకథనం కాదు. ఈ కథకు, కథనాలకు అంతం లేదు. ఎవరో చెప్పినట్టు భారతదేశంలో రామాయణాన్ని, భారతాన్ని మొదటిసారి చదవడం అనేది ఉండదు. ఈ కథలు ఎవరు, ఎప్పుడు చెప్పినా అవి అంతకు ముందు విన్నవే!
----------------------------------------------------------
రచన: సురేశ్ కొలిచాల 
మూలం: ఎ. కె. రామానుజన్,
ఈమాట సౌజన్యంతో

No comments: